Saturday, October 1, 2011







హైదరా'జాదూ'
భాగ్యనగరికి గులాంనబీ మూడు ముళ్లు
ఏదిఏమైనా కేంద్రపాలిత ప్రాంతమే!

ఆంధ్రప్రదేశ్ సమస్యకు విభజనే పరిష్కారం
అణచివేతతో తాత్కాలిక ప్రశాంతతే
రాజధానితో సీమాంద్రుల బంధాన్ని తెలంచలేం!
నివేదికలో కీలకాంశాలు
సత్వర నిర్ణయాలకు సోనియా ఆదేశం
మినీ కోర్ కమిటీ భేటీ
దసరా తర్వాత అఖిల పక్షం
న్యూఢిల్లీ, అక్టోబర్ 1 : తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానంలో మథనం కొనసాగుతోంది. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాలనే యోచనతో ముందుకు కదులుతోంది. తెలంగాణ సమస్యపై అంతిమ నిర్ణయం తీసుకునేముందు... జాతీయ, ప్రాంతీయ స్థాయి పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయ దశమి తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని 'మినీ కోర్ కమిటీ' తీర్మానించింది.

శుక్రవారం కోర్ కమిటీ భేటీలో జరిగిన చర్చల ఆధారంగా, నిర్దిష్టంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యతను సోనియా గాంధీ సీనియర్ నేత ప్రణబ్‌కు అప్పగించారు. సమస్య ప్రాధాన్యం దృష్ట్యా నిర్దిష్ట నిర్ణయాలను తీసుకుని సత్వరం తనకు నివేదించాలంటూ సోనియా ఆదేశించారు. దీంతో... నవరాత్రి పూజల కోసం పశ్చిమ బెంగాల్ వెళ్లాలనుకున్న ప్రణబ్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆజాద్ కూడా తన హైదరాబాద్ పర్యటనను ఆదివారానికి మార్చుకున్నారు. ప్రణబ్ అధ్యక్షతన ఆంటోనీ, ఆజాద్, సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ చర్చలు జరిపారు.

ఆ తర్వాత ప్రణబ్ తాము తీసుకున్న నిర్ణయాలను ఒక నోట్ ద్వారా సోనియాకు నివేదించినట్లు తెలిసింది. కాంగ్రెస్ తన నిర్ణయాలను ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అఖిలపక్ష సమావేశంతోపాటు కేంద్ర ప్రతినిధులను హైదరాబాద్‌కు పంపి రాజధానికి సంబంధించిన అంశాల గురించి అధ్యయనం చేయించాలని కూడా కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా దసరా తర్వాత తెలంగాణపై ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో కదలికలు ఊపందుకుంటాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

హైదరాబాద్ చుట్టూ ఆజాద్...
రాష్ట్రానికి చెందిన మూడు పార్టీల నేతలతో చర్చించి అధిష్ఠానానికి సమర్పించిన నివేదికలో గులాంనబీ ఆజాద్ మూడు పరిష్కార మార్గాలు సూచించినట్లు తెలిసింది. ఈ మూడు హైదరాబాద్ కేంద్రంగానే తిరగడం ఒక విశేషమైతే... హైదరాబాద్‌ను పూర్తిగా తెలంగాణలో అంతర్భాగంగా పేర్కొనకపోవడం మరో విశేషం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు కలిసి మెలిసి ఉండడం సాధ్యపడదని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే రాష్ట్ర విభజన తప్పదని ఆజాద్ తన నివేదికలో స్పష్టం చేశారు.

ఇరు ప్రాంతాల వారికి తమ తమ ప్రాంతాల్లో పరిపాలనకు సంబంధించిన నిర్ణయాధికారాలు అప్పజెబితే వారు విడిపోయినా కలిసి ఉంటారని, రెండు రాష్ట్రాలుగా ఉన్నా ప్రజా జీవనం గతంలోలాగే ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. "తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజాందోళనలను అణిచివేయడం ద్వారా పరిష్కరించవచ్చనే అభిప్రాయం సరికాదు. తాత్కాలికంగా ప్రశాంతత ఏర్పడినా, సమస్య మళ్లీ రగులుతుంది. విభజన తర్వాత సీమాంధ్ర ప్రత్యేకంగా ఒక బలమైన, సుసంపన్నమైన రాష్ట్రంగా అభివృద్ది చెందగలదు.

అయితే... హైదరాబాద్‌పై అక్కడి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాల్సి ఉంది'' అని తెలిపారు. "హైదరాబాద్ గత 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతోంది. ఈ నగరంతో సీమాంధ్రులు తమ బంధాన్ని తెంచుకోవడం అంత సులభం కాదు. అందువల్ల, హైదరాబాద్‌పై ఇరుప్రాంతాలకు సంతృప్తికరమైన ఒక ఫార్ములాను రూపొందించాల్సిన అవసరం ఉంది'' అని ఆజాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు సిఫారసులు చేస్తూ, వాటి పరిణామాలను కూడా విశ్లేషించారు. అవేమిటంటే...

1) తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలి. పాలనా సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. కానీ...హైదరాబాద్‌ను 'ఉమ్మడి రాజధాని'గా తాత్కాలికంగా మాత్రమే అనుమతిస్తామని తెలంగాణ వాదులు అంటున్నారు. కాలక్రమంలో తమకు సొంత రాజధాని కావాలనే డిమాండ్ సీమాం«ద్రుల నుంచే వస్తుంది. అందువల్ల, సీమాంధ్ర వేరే రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

2) రాష్ట్రాన్ని విభజించి... ఇరు రాష్ట్రాలకు వేర్వేరు ప్రత్యేక రాజధానులు ఏర్పాటు చేయాలి. అప్పటిదాకా తాత్కాలికంగా హైదరాబాద్‌ను రాజధానిగా ఉపయోగించుకునేందుకు రెండింటికీ అవకాశమివ్వాలి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించినట్లు భవిష్యత్తులో అవసరమైతే హైదరాబాద్‌కు కూడా ఆ హోదా ఇవ్వొచ్చు.

3) తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ను రాజధానిగా ప్రకటించాలి. సీమాంధ్రకు ప్రత్యేక రాజధానితో రాష్ట్రం ఇచ్చేయాలి. అదే సమయంలో... హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలి.

రాష్ట్రంలో తెలంగాణకంటే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని... కానీ, అక్కడ తెలంగాణలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితులు లేవని ఆజాద్ పేర్కొన్నట్లు తెలిసింది. తెలంగాణపై ఒక ఫార్ములా అనుసరించేటప్పుడు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కూడా సూచించారు. ఆజాద్ చేసిన ప్రతిపాదనల్లో దేనిలోనూ హైదరాబాద్ తెలంగాణకు పూర్తిగా సొంతం కాకపోవడం గమనార్హం! తల తెగినప్పటికీ హైదరాబాద్‌ను వదులుకోం అంటున్న తెలంగాణ నేతలు ఇందుకు అంగీకరిస్తారా?

ఆజాద్ మూడు ముచ్చట్లు
1) తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలి. పాలనా సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్‌ను యూటీ చేయాలి. 2) రాష్ట్రాన్ని విభజించాలి. ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేక రాజధానులను ఏర్పాటు చేయాలి. అప్పటిదాకా తాత్కాలికంగా హైదరాబాద్‌ను రాజధానిగా ఉపయోగించుకునేందుకు రెండింటికీ అవకాశమివ్వాలి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించినట్లు భవిష్యత్తులో అవసరమైతే హైదరాబాద్‌కు కూడా ఆ హోదా ఇవ్వొచ్చు. 3) వేరే రాజధానితో సీమాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి. హైదరాబాద్‌ను పరిపాలనా కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. అదే సమయంలో... హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలి.

విరమించండి ప్లీజ్!
సకల సమ్మెపై నేడు(ఆదివారం) ఆజాద్ అభ్యర్థన? 


ఆదివారం రాష్ట్రానికి వస్తున్న ఆజాద్ సమ్మె విరమణ దిశగా కేంద్రం తరఫున ఒక విన్నపం చేసే అవకాశం ఉంది. "సంప్రదింపులు చివరి అంకంలో ఉన్నాయి. మరికొంత సమయం మాత్రమే పడుతుంది. కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుంటుంది. సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సమ్మె వివరించండి'' అని ఆజాద్ కేంద్రం తరఫున అభ్యర్థించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మన్మోహన్ కూడా ఇదే తరహా అభ్యర్థన చేయవచ్చని కూడా చెబుతున్నారు.






మౌనమే సమాధానం

మాటకు మాట ప్రతీకారం కాదు - మౌనమే దానికి సమాధానం'






గాంధీ వారసులూ.. గాడ్సేయులూ...

  • నేడు గాంధీజీ 142వ జయంతి
నేడు మహత్మా గాంధి 142వ జయంతి. గాంధీజీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది దేశభక్తి, బ్రిటిష్‌ వలస పాలకులపై పోరాటం, స్వాతంత్య్ర సంగ్రామమూ, మత సామరస్యం, దేశ స్వావలంబన, అత్యున్నత నైతిక ప్రమాణాలు, గ్రామ స్వరాజ్యం, అంటరానితనం మొదలైన విషయాలలో ఆయన సాగించిన రాజీలేని పోరాటాలు.
దేశభక్తుల, స్వాతంత్ర సమరయోధుల ఫొటోలను చూపించినా గుర్తుపట్టలేని దుస్థితిలో నేడు మన సమాజం ఉందని కొన్ని సర్వేలలో తేలిందనేది కఠోర వాస్తవం. స్వప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప విశాల ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు నేడు గుర్తింపును కోల్పోయే స్థితి రావడం నిజంగానే చాలా బాధాకరం.
గాంధీజీ మత సామరస్యాన్ని కాపాడటం కోసం, లౌకికవాదాన్ని రక్షించటం కోసం విశేష కృషి చేశారు. ఆ క్రమంలోనే ప్రేరేపిత హిందూ మతోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. దేశంలో కొన్ని స్వార్థపర శక్తులు రెచ్చగొట్టిన మత విద్వేషాలను చల్లార్చి, మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా గట్టిగా నిలబడ్డారు గాంధిజీ. మతం పేరిట సాగే మారణహోమాన్ని నివారించడానికి గాంధీజీ స్వయంగా అనేక ప్రాంతాలను పర్యటించారు. అనేక దీక్షలు చేపట్టారు. చివరకు 1947 ఆగస్టు 15న, దేశం యావత్తూ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటే, గాంధీ మాత్రం నాటి దేశ విభజన వల్ల చెలరేగుతున్న మత ఘర్షణల పట్ల బాధతో ఆ సంబరాలకు దూరంగా ఉండిపోయారు. మన దేశం స్వాతంత్య్రం సాధించడంలో కీలకమైన, విశేష కృషి చేసిన గాంధీ, ఆ కల సాకారమయినవేళ, మత సామరస్యం లేని స్వాతంత్య్రం వల్ల ఫలితం లేదని, అది దేశాన్ని మరోసారి ప్రమాదంలోకి నెడుతుందని నాడే హెచ్చరించారు. ఆరెస్సెస్‌ లాంటి హిందూ మత ఛాందస శక్తులు అధికారంలోకి వచ్చేందుకు 1947 నుంచి అనేక ప్రాంతాలలో మత ఘర్షణలను రెచ్చగొడుతూనే ఉన్నాయి. ముస్లిం ఛాందసులు కూడా వీటికి ఊతం ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జాతీయ సమగ్రతా మండలికి కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం మన దేశంలో 2009లో 791 మత ఘర్షణలు చోటు చేసుకోగా 119 మంది హత్యకు గురయ్యారు. అలాగే 2010లో 658 మత ఘర్షణలు జరగగా 111 మంది హత్య గావించబడ్డారు. 2005 నుంచి 2010 వరకు యేటా సగటున మన 130 మంది చొప్పున ఈ మత ఘర్షణలకు బలవుతూ వచ్చారు.
దేశ రాజకీయ యవనికపై కన్పించే కొన్ని అనాగరిక, ఛాందస, రాజకీయ శక్తులు, వాటి కుట్రలే దీనికి ప్రధాన కారణం. ఎంతో ఘనమైన మన స్వాతంత్య్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని ఈ మతోన్మాదశక్తులు, తాము అధికారంలోకి రావడం కోసం ప్రజల మధ్య మతం పేరిట వైషమ్యాలను నిరంతరం ఎగదోస్తూనే ఉన్నాయి. 1947 నుండి దశాబ్దాలుగా మన దేశంలో పాలకవర్గాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో పేదరికం, ఆకలి, నిరుద్యోగం పెరిగిపోతున్నాయి. రకరకాల అసమానతల ఫలితంగా సామాజిక అశాంతి, అసంతృప్తి పెరిగాయి. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని మతోన్మాదశక్తులు ప్రక్కదారి పట్టిస్తున్నాయి. దోపిడీ విధానాలతో నలిగిపోతున్న ప్రజలకు, తమ సమస్యలకు కారణం అన్య మతస్తులని ఈ మతోన్మాదులు విష ప్రచారం చేస్తున్నారు. 1950వ దశకం నుండి 1980 దశకం వరకు స్థానిక అంశాలపై మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఈ శక్తులు, 1980 నుండి దేశవ్యాపిత స్వభావం గల అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. దీనికి పరాకాష్ట మనదేశ లౌకిక చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన ఆరెస్సెస్‌, విహెచ్‌పి, బిజెపి మొదలైన హిందూ మతోన్మాద శక్తుల ఆధ్వర్యంలో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసమే. దీనికి కొనసాగింపుగా మనదేశంలో అనేక మత ఘర్షణలు జరిగాయి, నేటికీ జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణ గుజరాత్‌లో గోద్రా అనంతరం సాగిన నరమేధం. ఈవిధంగా హిందూ మతోన్మాదశక్తులు తాము పెరుగుతూ మైనారిటీ ఛాందసన శక్తుల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. దీనికి ఉదాహరణలు మాలెగావ్‌, మక్కా మసీదు, అజ్మీర్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్లే. దేశంలో లౌకిక విలువల పరిరక్షణకు గాంధీజీ సాగించిన కృషిని ఆదర్శంగా తీసుకుని ఈ మతోన్మాదశక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముంది.
బ్రిటీష్‌ వారి దోపిడీ, వలస పాలనకు వ్యతిరేకంగా కూడా గాంధీ తీవ్రంగా పోరాడారు. ఉప్పులాంటి అతి సాధారణ అంశంలో బ్రిటీష్‌ వారి వైఖరికి వ్యతిరేకంగా గాంధీ దండి సత్యాగ్రహం నిర్వహించారు. పత్తి విపరీతంగా లభించే మనదేశంలో రాట్నాన్ని ఒక పెద్ద చిహ్నం (సింబల్‌)గా మార్చుకుని విదేశీ వస్త్ర బహిష్కరణలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా మన గ్రామాలు స్వయం సమృద్ధితో కూడిన గ్రామ స్వరాజ్యాలుగా ఎదగాలని ఆయన కలలుకన్నారు. బ్రిటిష్‌ వారిని తరిమేశాము. ఇప్పుడు ప్రపంచబ్యాంకు ఐఎంఎఫ్‌ డబ్ల్యుటిఓ రూపంలో నయా ఉదారవాద విధానాలు మనదేశ సార్వభౌమత్వంపై దాడి చేస్తున్నాయి. ప్రపంచబ్యాంక్‌ ఆదేశిత ఉదారవాద ఆర్థిక విధానాలు చేపట్టి మన దేశ ఆర్థిక స్వావలంబనను సామ్రాజ్యవాద దేశాలకు తాకట్టు పెడుతున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ, చేతివృత్తులు మొదలైన అనేక రంగాలలో స్వావలంబనకు మన పాలకులే తూట్లు పొడుస్తున్నారు. ఉప్పు, పప్పు లాంటి నిత్యావసర వస్తువుల వ్యాపార రంగంలోకి వాల్‌మార్ట్‌ లాంటి బహుళజాతి సంస్థలను ఆహ్వానించడం అత్యంత సిగ్గుచేటైన విషయం. రక్షణ, విదేశాంగ విధానం తదితర రంగాల్లోకి విదేశీ బముళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. ఆనాడు బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని నిర్వహిస్తే ఈనాడు దానికి భిన్నంగా మన పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇది మహత్తర స్వాతంత్ర పోరాట స్ఫూర్తికే విరుద్ధం. గాంధీజీ బోధించిన విలువలను సమాధి చేయడమే. ఈవిధంగా 1948లో గాంధీజీని హిందూ మతోన్మాదులు భౌతికంగా హత్య చేస్తే, గాంధీ వారసులుగా చెప్పుకునే కాంగ్రెస్‌ పాలకులు నూతన విధానాల పేరుతో నేడు ఆయన ఆశయాలకు నిలువునా పాతరేశారు. ఈవిధంగా గాంధిజీ, ఆయన విలువలు రెండు రకాలుగా హత్యగావించబడుతున్నాయి. ఇదొక చారిత్రక విషాదం.
గాంధిజీ జీవితంలో మరో కీలకమైన ప్రమాణం నైతిక విలువల విషయంలో ఆయన అనుసరించిన వైఖరి. గాంధిజీ పాటించిన వ్యక్తిగత నైతిక ప్రమాణాలను ఆయనను రాజకీయంగా విభేదించే సుందరయ్య, ఇఎంఎస్‌ లాంటి కమ్యూనిస్టు యోధులు పాటిస్తే, ఆయన వారసులు మాత్రం ఈ ప్రమాణాలను తుంగలో తొక్కడంలో పోటీలు పడుతున్నారు. అవినీతి, అంటరానితనాన్ని వ్యతిరేకించడం, మద్యపానాన్ని నిరసించడం, అహింస మొదలైన నైతిక విలువలను పాటించడంలో ఆయన శిఖరప్రాయంగా నిలిస్తే, ఆయన వారసులు నేడు వరుస కుంభకోణాలలో మునిగి తేలుతున్నారు. తన వారసులలో ఈ విలువల పతనాన్ని గమనించిన గాంధీజీ 1948లోనే కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా రద్దు చేసి, స్వచ్చంద సంస్థగా మార్చమని కోరారు.
నేటికి గౌరవం, విలువ పొందుతున్న ఆయన కృషిలో మరో ముఖ్యమైన అంశం - సమస్యల సాధనకై ఆయన అనుసరించిన పోరాట రూపం. అదే సత్యాగ్రహం - అహింసాయుత పద్ధతిలో శాంతియుతంగా చేసే నిరాహారదీక్ష. నరేంద్రమోడి లాంటివారు ఈ దీక్షలకు దిగి వాటి పవిత్రతకు కొంత కళంకం తెచ్చినా, ఇప్పటికీ నిరాహారదీక్ష అనేది శక్తివంతమైన ఆయుధంగా ప్రాధాన్యతను కలిగి ఉంది. అలాగే వైరి పక్షాల నడుమ చేపట్టే చర్చలు, అలాగే సహాయ నిరాకరణ, పికెటింగ్‌, ధర్నా, జైల్‌భరో, శాసనోల్లంఘన వంటి విభిన్నమైన ఆయన పోరాట రూపాలు నేటికి ఆదరణ కలిగి వున్నాయి. మన దేశంలోనే గాక ప్రపంచవ్యాపితంగా ఇవి గుర్తింపు పొందాయి. అమెరికాలో 'వర్ణ వివక్ష'కు వ్యతిరేకంగా మార్డిన్‌ లూధర్‌కింగ్‌, దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయ దురహంకారాలకు వ్యతిరేకంగా నెల్సన్‌ మండెలా మొదలైన అంతర్జాతీయ ప్రముఖులు ఈ రూపాలను పాటించారు. సాయుధ పోరాటాన్ని గాంధిజీ సమర్థించకపోయినా, సమస్యల వివిధ దశలు, వివిధ స్వభావాలను బట్టి వివిధ పోరాట రూపాలను అందరూ ఆమోదించేవే. అలాగే శత్రువులకి వ్యతిరేకంగా పోరాడే ప్రజల మధ్య ఐక్యతకు ఆయన చాలా ప్రాధాన్యతనిచ్చేవారు.
(రచయిత జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి)










మరిన్ని చర్చలు

  • అందరినీ కలుపుకొనిపోవాల్సి ఉంటుంది
  • మీడియా సంయమనం పాటించాలి : ఆజాద్‌
  • ఆందోళనపై అవగాహనుంది : ప్రణబ్‌
  • రెండో రోజూ ముఖ్యనేతల ప్రత్యేక భేటీ
ప్రత్యేక తెలంగాణా సమస్య పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో మరిన్ని చర్చలు అవసరమని కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. ఈ సమస్యపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం లేదా సమస్యను పరిష్కరించడం కష్టమైన విషయమని వ్యాఖ్యానించారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో తెలంగాణా అంశంపై వరుసగా రెండో రోజూ కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌ మినహా మిగిలిన కోర్‌ కమిటీ సభ్యులైన ప్రణబ్‌ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, అహ్మద్‌పటేల్‌ శనివారమిక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారుగా గంటసేపు సాగిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆజాద్‌ కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'తెలంగాణా విషయంలో మీడియా తమ ఇష్టానుసారంగా ఊహాగానాలు ప్రసారం చేయడం సరికాదు. నేను నిన్న కొన్ని తెలుగు టీవీ చానళ్ళు చూశాను. ప్రతి చానలూ తమతమ సొంత అభిప్రాయాలను ప్రసారం చేసింది. తెలంగాణా విషయంలో మేము ఏదైనా నిర్ణయం తీసుకొని, ప్రకటించే వరకూ ఇటువంటి కట్టుకథలు ప్రసారం చేయవద్దని కోరుతున్నాను. మరింత అయోమయానికి ఆస్కారం లేకుండా ఉండేందుకు నేను కొన్ని విషయాలు వెల్లడించాలని భావిస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో గత రెండు నెలలుగా నేను చర్చలు జరిపాను.
అందరి అభిప్రాయాలూ తెలుసుకున్నాను. ఇప్పుడు మేము ఇతరుల అభిప్రాయాలూ తెలుసుకోవాల్సి ఉంది. తెలంగాణా సమస్యపై వెంటనే నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. మేము అందరినీ కలుపుకొనిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్ణయం లేదా పరిష్కారం కష్టం. రాష్ట్ర పార్టీ నేతలతో చర్చలు పూర్తయ్యాయి. జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు చర్చలు జరపాల్సి ఉంది. అవసరమైతే కొందరు రాష్ట్ర నేతలతోనూ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇది ఒక్కరోజులో పరిష్కారమయ్యే సమస్య కాదు. ఒక దశ చర్చల ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని ప్రక్రియలు ఇప్పుడు ప్రారంభమౌతాయి. తెలంగాణా కాంగ్రెస్‌ నేతలతోనూ ఈ విషయం నేను స్పష్టంగా చెప్పాను' అని ఆజాద్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులడిగిన ఏ ప్రశ్నలకూ ఆయన సమాధానమివ్వలేదు.
మా పార్టీవారు నిత్యం సంప్రదిస్తున్నారు : ప్రణబ్‌
భేటీ ముగిసిన అనంతరం సీనియర్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ కూడా క్లుప్తంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణా సమస్యపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించగా 'ప్రస్తుతం చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న కోర్‌ కమిటీలో చర్చించాం. నేడు కూడా కొందరు నేతలం చర్చించాం. మరిన్ని చర్చలు అవసరం. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనపైనా, సమస్యపైనా మాకు అవగాహన ఉంది. మా పార్టీ నేతలూ మాతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి మరికొంత సమయం పడుతుంది' అని ప్రణబ్‌ పేర్కొన్నారు.
రెండు అంశాలపై చర్చ !
శనివారం ప్రత్యేకంగా సమావేశమైన కోర్‌ కమిటీ సభ్యులు ప్రధానంగా రెండు అంశాలపై చర్చించినట్లు సమాచారం. సకల జనుల సమ్మె విరమణ కోసం కాంగ్రెస్‌ అధిష్టానం ఏదో ఒక సానుకూల ప్రకటన చేయాలని తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా సానుకూల ప్రకటన వస్తే సమ్మె విరమించడానికి ఢిల్లీలోనే ఉన్న కెసిఆర్‌ శిబిరం కూడా సిద్ధంగా ఉందన్న వాదన విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మె విరమణ కోసం తక్షణం కాకపోయినా కొద్ది రోజుల్లో ఏదైనా ప్రకటన చేయవచ్చా, లేదా అన్న అంశంపై కోర్‌ కమిటీ నేతలు చర్చించినట్లు సమాచారం. ఆదివారం ఆజాద్‌ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణకు ఎటువంటి మార్గదర్శనం చేయాలన్న అంశంపైనా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాలన, శాంతిభద్రతలు, ఎమ్మెల్యేల రాజీనామాలు, తదితర అంశాలపై అనుసరించాల్సిన వైఖరిని ఈ పర్యటన సందర్భంగా రాష్ట్ర నేతలకు ఆజాద్‌ వివరించనున్నారు. 

No comments:

Post a Comment