యవ్వనంలో జరిగే పెళ్లికి ఎలాంటి ప్రశ్నలూ ఉండవు. అది సహజం. సంప్రదాయం. కానీ ఒక వయసు దాటిన తరువాత జరిగే పెళ్లిళ్ల వెనుక దాంపత్య సుఖానికి అతీతమైన అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి పెళ్లిళ్లలో శారీరక వాంఛల ఆలోచనలు ఇద్దరికీ దాదాపు ఉండవు. అయినా, కాలం ఎంతో మారిపోయింది అనుకుంటున్నా అలాంటి పెళ్లిళ్లు ఇప్పటికీ చెవులు కొరుక్కునే విషయాలు గానే ఉండిపోతున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం జరగడం లేదు.
ఆరోగ్యకరమయిన రచనలు చేసేవాడిగా రా.వి.శాస్త్రి అభినందనలందుకున్న కేవీఎస్ వర్మ రాసిన కథ ‘తోడు’ కూడా ఒక పెళ్లి గురించినదే. ఈ కథలో భద్రయ్య పెళ్లి చేసు కోవడం జీవితంలో ఒక తోడు కోసమే. మరో కాంక్ష ఏదీ లేదు. భద్రయ్య చేసుకున్న సత్యవతికీ నలభయ్ సంవత్స రాలు దాటాయి. జుట్టు కొంచెం నెరిసింది. పేదరికం ఆమె కు పెళ్లి రాత లేకుండా చేస్తుందేమోననుకుంటున్న సమ యంలో భద్రయ్య తాళికట్టి నీడ కల్పించాడు. భద్రయ్యకు తోడు, సత్యవతికి నీడ- ఇవీ ఈ పెళ్లికి కారణాలు.
ఒంటరితనం, అదీ అరవై దాటాక, ఎంత దుర్భరమో అనుభవించిన వారికే తెలుస్తుంది అంటాడు భద్రయ్య. తోడు కథలో ఇదే కీలకాంశం. మనిషి ఆయుష్షు అంచనాకు అందనిది. కానీ జీవన ప్రమాణాల దృష్ట్యా ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటి బతికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అరవై పైబడి, ఎనభయ్ సంవత్సరాలు వచ్చే దాకా బతికే అవకాశం కనిపిస్తూ ఉంటే, ఆ మిగిలిన ఇరవై సంవత్సరాలు ఒక మనిషిని ఒంటరిగా ఉండిపొమ్మనడం ఘోరమైన శిక్షే.
జీవిత సంధ్యా సమయం వైపు నడుస్తున్న తండ్రుల తరానికి భద్రయ్య ప్రతినిధి. కొడుకూ కోడలూ లేదా కూతురూ అల్లుడు స్థితిమం తులుగానే ఉండొచ్చు-ఎక్కడో అమెరికా లోనో, లేదంటే ఇంగ్లండ్‌లోనో! ఇక్కడే ఉన్న తల్లిదండ్రులకు కూడా ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు. కానీ ఒంటరి తనం మాటో! అప్పుడప్పుడూ విదేశాల్లో ఉన్న కొడుకూ కోడలు దగ్గరకు వెళ్లినా ‘చెప్పుకోలేని’ కొన్ని బాధలతో మళ్లీ తిరిగి రావడమే అవుతోంది. అన్నీ ఉన్నా ఆత్మీయంగా పలకరించేవాళ్లు లేకుంటే జీవితంలో అదో శూన్యమే. ఈ సమస్య నుంచి విముక్తం కావడానికి ఏ కొందరో చేస్తున్న యత్నం - మళ్లీ పెళ్లి- మానవ సంబంధాలలో కొత్తకోణమే. వర్మగారి కథ పురుషుల జీవితానికే పరిమితం.
భద్రయ్య మళ్లీ పెళ్లి చేసుకుంటే అతని కొడుకు సుందర్రావు చూసిన కోణం-ఇక ‘ఆస్తిలో చిల్లిగవ్వ దక్కదు’ అనేదే. అంతేకానీ, తండ్రి అలాంటి నిర్ణయం తీసుకోవ డానికి కారణం ఏమిటి అన్న ఆలోచన మాత్రం అతడికి రాదు. అప్పుడు తన భార్య సుశీల మీద కూడా అతడికి ఆగ్రహం కలుగుతుంది. తండ్రి మళ్లీ పెళ్లి, ఆస్తిలో చిల్లిగవ్వ దక్కకుండా పోయే ఆ పరిణా మాలకి కారణం ఆమేనని అతడు భావి స్తాడు. సుందర్రావే కాదు, దారిలో కనిపిం చిన ఒక బంధువు కూడా భద్రయ్య నిర్ణ యాన్ని హర్షించలేకపోతాడు, ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే వెళ్లి, నలు గురు పెద్దల్ని కూడగట్టి వాళ్ల చేత చీవాట్లు పెట్టించు. ఆస్తంతా దానికి రాసెయ్యక ముందే జాగ్రత్తపడు’ అని ఉచిత సలహా పడేస్తాడు.
మానవ సంబంధాలకు ఆర్థికభాష్యం అన్ని కాలాల లోనూ కనిపించినా దాని విశ్వరూపం, అది వేస్తున్న వెర్రి తలలు ‘తోడు’ కథలో క్లుప్తంగానే అయినా మనసుకు హత్తు కునేటట్టు చిత్రించాడు రచయిత. అందరికీ ఆమోదయోగ్య మైన రీతిలో భద్రయ్య తన అయిదెకరాల ఆస్తిని పంచి చూపించాడు. ఇక్కడ భద్రయ్య చెప్పిన వాదన ఒక్కటే.
బాధ్యతలు ఎరిగిన వారికే అధికారాలూ ఉంటాయి. తండ్రిగా తన బాధ్యత తాను నిర్వర్తిం చాడు. కానీ కొడుకు! తన బాధ్యతలని విస్మరించడమే కాదు, తప్పుదారిలో ఉన్న కోడలిని తన దారికి తీసుకురాక పోవడమే కాదు, ఆమె దారిలోకి తనే అడుగులు వేశాడు. అయితే ఇక్కడ భద్రయ్య కోడలిని తప్పుపట్టడు. ఆమె పరాయి పిల్ల. నిజానికి భద్రయ్యది బలమైన వ్యక్తిత్వం. లోకం కోసం బతకాలని అనుకోడు. అలాఅని తను తప్పు చేయడు. ఎవరి కోసమో తన అభిప్రాయాలను మార్చు కోడు. ఆ క్రమంలోనే అతడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. తన అయిదెకరాలలో మూడు ఎకరాలు సుందర్రావు పేరన, రెం డెకరాలు సత్యవతి పేరున రాశాడు. తన తదనంతరం సత్య వతిని చూసుకోవడానికి సుందర్రావు, సుశీల ఇష్టపడకపోతే ఆమె ఎవరినైనా పెంచుకోవచ్చుననీ, తోడు కూడా తెచ్చు కోవచ్చునని విల్లు రాసి తన ఔన్నత్యాన్ని కూడా చాటుకున్నాడు భద్రయ్య.
ముసలి అత్తమామలు వద్దు, వారి ఆస్తులు మాత్రం కావాలి అనుకునే తత్వం కొందరిలో కనిపిస్తున్న నైజమే. దీనికి పరిష్కారంగా ఒకరిని తోడు తెచ్చుకుంటే మధ్య తరగతి పరిధిలో వినిపించే దుర్మార్గపు వ్యాఖ్యానాలు అందరికీ తెలిసినవే. అమెరికా వంటి స్వేచ్ఛాయుత సమాజంలోనో, పెద్ద పెద్ద నగరాలలోనో ఉన్నా ఇలాంటి పెళ్లికి కారణాలను ఊహించలేనంతగా మనుషులు జడులు గా మిగిలి ఉండడమే ఈ కథలో గొప్ప లక్షణం. (వర్మ రాసిన ‘మరొకడు’/‘నేను నేనే’ కథా సంకలనాలు మార్కెట్‌లో దొరుకుతాయి).
- ఆర్. జగదీశ్వరరావు
No comments:
Post a Comment