పల్లె సీమల్లో అలముకున్న చీకట్లు.. పట్నాల్లో కానరాని హుషారు
వర్షాభావం, కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు.. రైతు దిగాలు
పండుగ పూట పప్పన్నం లేకున్నా.. పస్తులు ఉండకుంటే చాలన్న దుస్థితి
సగటు జీవిని భయపెడుతున్న నిత్యావసర వస్తువుల ధరలు
మండుతున్న వంట నూనెలు..
చెట్టెక్కిన చింతపండు, పప్పుబెల్లాలు
పిల్లలకు కొత్త బట్టలు కరువు..
ఇళ్లలో పిండి వంటలు బరువు
బ్లాక్‌లోనూ వంట గ్యాస్ దొరకదు
బంధువుల ప్రయాణాలూ భారం.. ఇళ్లలో సందడే లేని వైనం
వాన చినుకు చాలలేదు.. కరెంటు అసలే రాదు.. మోటారు నడవదు.. పైరుకు నీరు పారదు.. పొలం ఎండిపోతోంది.. పెట్టుబడి మట్టిలో కలిసిపోతోంది.. కొండచిలువలా అప్పు కళ్లెదుట కనిపిస్తోంది.. రైతు గుండె అవిసిపోతోంది! ఎండుతున్న పొలంలో కూలీకి పని లేదు.. పని లేకపోతే కూలీ లేదు! కరెంటు కోతలతో మిల్లులు మూతపడ్డాయి.. పరిశ్రమలు నిలిచిపోయాయి.. కార్మికులకు దినసరి వేతనాలూ కరువయ్యాయి! పెద్ద రైతూ.. చిన్న రైతూ.. రైతు కూలీ.. కార్మికులు... ఎవరి చేతిలోనూ పైసా లేదు! అందరిలోనూ కొండంత దిగులు గూడుకట్టుకుంది! అందరి ఇంటా పూట గడవటమే కనాకష్టంగా మారింది!
ఇక దసరా పండుగ ఎలా ఉంది అంటే.. వారి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి!!
దసరా అంటే పది రోజుల పండుగ. ఎక్కడెక్కడి కుటుంబ సభ్యులంతా కలిసే పండుగ.. ఇల్లంతా బంధువులు సందడి చేసే పండుగ.. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు తొడిగే పండుగ.. ఇంటినిండా పిండి వంటల పండుగ.. కోళ్లు, వేటలు కోసుకుని వండుకునే పండుగ! కానీ.. ఈ ఏడాది వర్షాభావం, కరెంటు కోతలతో ముంచుకొచ్చిన కరువు, ఏటికేడాది పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడిని దసరా పండుగకు దూరం చేశాయి! ఈసారి బంధువులకు పిలుపు లేదు.. ఊళ్లకు ప్రయాణాలు లేవు.. పిల్లలకు కొత్త బట్టలు లేవు! పప్పు బెల్లాల రేట్లు చుక్కల్లో ఉన్నాయి.. పరమాన్నం, పప్పన్నం దేవుడెరుగు.. పండగపూట భార్యాబిడ్డలను పస్తు పెట్టకుండా ఉండాలన్నా.. పది రూపాయలు అప్పుపుట్టే దారీ లేదు! ఇదీ ఈ దసరా పండుగకి మన రాష్ట్రంలో ముఖ్యంగా పల్లెసీమల్లో కనిపిస్తున్న దుస్థితి!!!
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: కోరలు చాస్తున్న కరువుతో పాటు నింగినంటుతున్న ధరల కారణంగా.. రాష్ట్రంలో ఈసారి దసరా పండుగ కళ తప్పింది. పనులు లేక, కూలీలు, జీతాలు లేక సగటు జీవి ఉసూరుమంటున్నాడు. గత ఏడాది పంట చేతికందక, అందిన పంటకు గిట్టుబాటు ధర దక్కక ఇప్పటికే రైతు బక్కచిక్కి ఉన్నాడు. ఇప్పుడు చేలో ఎండుతున్న పైరును చూడలేక... ఇంట్లో పండుగ చేసుకోలేక... ఇంటా బయటా ఎక్కడా ఉండలేని దైన్యం అన్నదాతది. పెరిగిన ఎరువుల ధరలతో ఇప్పటికే పెట్టుబడులు అధికమయ్యాయి. అప్పులు రెట్టింపయ్యాయి. ప్రకృతికి తోడు ప్రభుత్వమూ పగపట్టినట్లుంది. వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతల కారణంగా ఎండిపోతున్న పంట చేతికి వస్తుందన్న ఆశ ఆవిరైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాగవుతున్న వరి, పత్తి తదితర పంటలు 50 శాతానికి పైగా విస్తీర్ణంలో ఎండిపోయే దశకు చేరుకున్నాయి. రైతన్న కంట కన్నీరు పారుతోంది. ఈ పరిస్థితుల్లో పండు గేంది? అని నిర్వేదంగా వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రభావం అన్ని వర్గాలపైనా చూపుతోంది.
అందరిదీ ఒకే మాట... ‘పంటలు పండి రైతు చేతికి అందితే అందరూ సంతోషంగా ఉండేవారు. అదిలేనప్పుడు సంతోషం ఎలా ఉంటుంది?’ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పండుగ కొనుగోళ్లు సగానికిపైగా పడిపోయాయి. ముఖ్యంగా వస్త్ర దుకాణాలు వెలవెలబోతున్నాయి. వస్త్రాలపై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) పెంచటంతో వాటి ధరలు విపరీతంగా పెరగటం కూడా పండుగ బిజినెస్ పడిపోవటానికి ఒక కారణమని వ్యాపారులే చెప్తున్నారు. కొత్త బట్టలు కుట్టించుకునే వారు తగ్గిపోవటంతో టైలర్లు కూడా దిగులుపడుతున్నారు. అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్న చిరుద్యోగులకు పండుగ భారంగా పరిణమించింది. వంట గ్యాస్ ధర పెరగటంతో పాటు పండుగ కొరతతో చాలా చోట్ల బ్లాక్‌లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపును సాకుగా చూపుతూ ఇప్పటికే బస్సుల్లో టికెట్ల ధరలు పెరిగాయి.
తెలంగాణలో సకల జనుల సమ్మె నేపథ్యంలో వేతన జీవులు జేబులు వెతుక్కుంటున్నారు. అయినా ఉద్యమం కోసం త్యాగం చేయటానికి సిద్ధమేనంటున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ప్రయాణికులు అదనపు భారం మోయాల్సి వస్తోంది. పండుగపూట ప్రయివేటు ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారు. హైదరాబాద్ వెళ్లాలంటే ఒక్కొక్కరికి సాధారణ చార్జీ కన్నా రూ. 150 నుంచి రూ. 600 వరకూ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. పండుగ అంటే ఒక వ్యక్తి చేసే ప్రయాణం కాదు. ఒక కుటుంబం కదలివచ్చేది. పండుగ ఖర్చుల కోసం దాచుకున్న పదీ పరకా డబ్బు పెరిగిన చార్జీలకే ఆవిరైపోతోంది. ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఇక వంట నూనెలు, పప్పు దినుసుల వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా వ్యాట్ పోటు కారణంగా విపరీతంగా పెరిగిపోవటంతో.. పండుగ పిండి వంటలపై కూడా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కందిపప్పే కాదు చివరకు చింతపండు ధర కూడా చివుక్కుమనిపిస్తోంది. పండుగకు పప్పన్నం కూడా కష్టమవుతోంది.
పిల్లల నోరు తీపి చేసే ఆశా లేదు!
పెరిగిన పప్పు, బెల్లాల ధరలతో దసరా పండుగ రోజున పరమాన్నం వండుకుంటామా అనేది అనుమానమే. బెల్లం కొనాలంటే కిలో రూ. 45 పలుకుతోంది. పండుగ రోజు పిల్లల నోరు తీపి చేద్దామనుకున్నా.. పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాము. పేద కుటుంబాలకు పనిలేకుండా పోయింది. రైతు బాగుంటే కూలీల పరిస్థితి బాగుంటుంది. పది రూపాయలు అప్పయినా దొరుకుతుంది. అప్పు చేసైనా పండుగ చేసుకుందామంటే అప్పు ఇచ్చే వారు లేరు.
- మున్నం వెంకటేశ్వరమ్మ, రెడ్డిపాలెం, మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
జీతం రాలేదు.. అయినా బాధలేదు!
గతంతో పోలిస్తే ఈసారి పండుగలకు భిన్నమైన వాతావరణం ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సకల జనుల సమ్మెలో పాల్గొనటం వల్ల జీతాలు అందలేదు. అయినా బాధ లేదు. ప్రజల మనోభావాలను గౌరవించామనే తృప్తి మిగిలింది. బతుకమ్మ, దసరా పండుగలను ఉద్యమ స్ఫూర్తితోనే జరుపుకుంటాం. ప్రతి ఉద్యోగి ఇదే విధమైన ఆలోచనవిధానంతో ఉన్నారు. అందువల్లే సమ్మె ఉధృతంగా సాగుతున్నది.
- ఊడెం వేమారెడ్డి, ఉపాధ్యాయుడు, కోదండరాంపల్లి, గజ్వేల్ మండలం (మెదక్ జిల్లా)
తంగేడు పూలైనా అమ్ముదామని వచ్చా!
పోయిన సారి దసరాకు ఇంట్లో అందరం కొత్తబట్టలు కుట్టించుకుని, పప్పలు చేసుకొని సంతోషంగా గడిపాం. కానీ ఒక 15 రోజుల నుంచి పత్తి, కంది చేలు ఎండిపోవటంతో కూలీ పనులు దొరకటం లేదు. ఎప్పుడూ కూలికి పోయే పొలం అతను కూడా పంటచేను ఎండిపోయింది అప్పుకూడా ఇవ్వలేనన్నాడు. కానీ పండగ ఎలాగైనా చేయాలి కదా! ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయి? పిల్లలకు బట్టలు కొనాలి. పండగ కూడా దగ్గరకొస్తుంటే.. చేతిలో డబ్బులు లేవు. ఇక చేసేది లేక చెట్ల వెంట, పుట్ల వెంట తిరిగి ఈ తంగేడు పూలు కోసుకొచ్చా. బతుకమ్మ పండగకు ఈ పూలు పట్నంలో అమ్మి కొన్ని డబ్బులు సంపాదిస్తే పండగకు పిల్లలకు ఏమైనా కొనొచ్చు, ఏమైనా పిండివంటలు చేసి పెట్టొచ్చనే ఇలా వచ్చా. బతకమ్మ పండగ అయిపోతే ఈ పూలు అమ్మటానికి కూడా ఉండదు. అటు కూలీ లేక, ఇటు ఏ వ్యాపారం చేయలేక మా బతుకులు ఏమైతాయో అర్ధం కావట్లేదు.
- సత్యమ్మ, ఎంవెంకటాయపాలెం, ఖమ్మం మండలం (ఖమ్మంజిల్లా)
ఇంట్లో ఖర్చులకు కూడా ఇబ్బంది...
ఇదివరకు పండుగకు వారం ముందే కొత్తబట్టలు కొనుక్కొని, యాటపోతులు తెచ్చి ఇంటిముందు కట్టేసుకునేటోళ్లం. నేను, నా భార్య, ముగ్గురు కొడుకులు అందరం ఎవుసం మీదే ఆధారపడి బతుకుతున్నం. మూడున్నర ఎకరాల్లో వరిపొ లం, ఎకరంనర భూమిలో పత్తి, ఎకరం మిర్చి తోట వేశా. పం టకు వేద్దామంటే ఎరువే లేదు. నీళ్లు పెడదామంటే కరంటు లేదు. ఇప్పటికే రూ. 60 వేలకు ఎక్కువే పెట్టుబడి పెట్టిన. కండ్ల ముందే పెంచుకున్న పంట చచ్చిపోతుంటే గుండె చెరువు అవుతోంది. ఇంట్లో ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నం. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో పండుగేంటి?
- బోడ బాలు, రైతు, బోడ తండా, మహబూబాబాద్ మండలం (వరంగల్ జిల్లా)
పూజ సామగ్రి కూడా కొనలేను...
దసరా వస్తోందంటే పొట్టేళ్లు కొట్టి ఇంటికి బంధువులను పిలిచేవాడ్ని. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు, నాకు, నా భార్యకు కలసి పండుగ బట్టలకు రూ. 10 వేలు ఖర్చు చేసేవాడిని. ఇప్పుడు కొత్తబట్టలు కొనాలంటే రూ. 15 వేలైనా కావాలి. కానీ.. కనీసం ఇంట్లో పూజకు కావాల్సిన సామాగ్రి కూడా కొనలేని పరిస్థితి. నాలుగెకరాల్లో వేరుశనగ వేశా. రూ. 40 వేలు అప్పు చేశాను. దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. అప్పు తీర్చే మార్గమూ లేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. పండుగ సంతోషం మాకు లేదు.
- పూల వెంకట్రమణ, ములకలచెరువు, చిత్తూరు జిల్లా
పశువుల మేతకూ కరువే!
తొమ్మిదెకరాల్లో వేరుశనగ వేశా. రూ. 90 వేలు పెట్టుబడి పెట్టా. 40 రోజులు గా వర్షం లేదు. కాయపట్టే దశలో పంట ఎండిపోయింది. ఇదివరకే రెండు లక్షల అప్పు ఉంది. ఇప్పుడు మొత్తం అప్పు రూ. 2.90 లక్షలయింది. ఈ అప్పు ఎలా తీర్చాలో! పెట్టిన పంట మొత్తం భూమిలో కలిసిపోయింది. కనీసం పశువులకు మేత కూడా దక్కలేదు. ఇక భార్యా పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వటమా?
- ఈశ్వర్‌రెడ్డి, తాటిచెర్ల, అనంతపురం రూరల్ మండలం
No comments:
Post a Comment