Monday, October 31, 2011

********************************************************************************

మనసుకు ఓ ‘తోడు’
ఎంపు-55
యవ్వనంలో జరిగే పెళ్లికి ఎలాంటి ప్రశ్నలూ ఉండవు. అది సహజం. సంప్రదాయం. కానీ ఒక వయసు దాటిన తరువాత జరిగే పెళ్లిళ్ల వెనుక దాంపత్య సుఖానికి అతీతమైన అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి పెళ్లిళ్లలో శారీరక వాంఛల ఆలోచనలు ఇద్దరికీ దాదాపు ఉండవు. అయినా, కాలం ఎంతో మారిపోయింది అనుకుంటున్నా అలాంటి పెళ్లిళ్లు ఇప్పటికీ చెవులు కొరుక్కునే విషయాలు గానే ఉండిపోతున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం జరగడం లేదు.

ఆరోగ్యకరమయిన రచనలు చేసేవాడిగా రా.వి.శాస్త్రి అభినందనలందుకున్న కేవీఎస్ వర్మ రాసిన కథ ‘తోడు’ కూడా ఒక పెళ్లి గురించినదే. ఈ కథలో భద్రయ్య పెళ్లి చేసు కోవడం జీవితంలో ఒక తోడు కోసమే. మరో కాంక్ష ఏదీ లేదు. భద్రయ్య చేసుకున్న సత్యవతికీ నలభయ్ సంవత్స రాలు దాటాయి. జుట్టు కొంచెం నెరిసింది. పేదరికం ఆమె కు పెళ్లి రాత లేకుండా చేస్తుందేమోననుకుంటున్న సమ యంలో భద్రయ్య తాళికట్టి నీడ కల్పించాడు. భద్రయ్యకు తోడు, సత్యవతికి నీడ- ఇవీ ఈ పెళ్లికి కారణాలు.

ఒంటరితనం, అదీ అరవై దాటాక, ఎంత దుర్భరమో అనుభవించిన వారికే తెలుస్తుంది అంటాడు భద్రయ్య. తోడు కథలో ఇదే కీలకాంశం. మనిషి ఆయుష్షు అంచనాకు అందనిది. కానీ జీవన ప్రమాణాల దృష్ట్యా ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటి బతికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అరవై పైబడి, ఎనభయ్ సంవత్సరాలు వచ్చే దాకా బతికే అవకాశం కనిపిస్తూ ఉంటే, ఆ మిగిలిన ఇరవై సంవత్సరాలు ఒక మనిషిని ఒంటరిగా ఉండిపొమ్మనడం ఘోరమైన శిక్షే.

జీవిత సంధ్యా సమయం వైపు నడుస్తున్న తండ్రుల తరానికి భద్రయ్య ప్రతినిధి. కొడుకూ కోడలూ లేదా కూతురూ అల్లుడు స్థితిమం తులుగానే ఉండొచ్చు-ఎక్కడో అమెరికా లోనో, లేదంటే ఇంగ్లండ్‌లోనో! ఇక్కడే ఉన్న తల్లిదండ్రులకు కూడా ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు. కానీ ఒంటరి తనం మాటో! అప్పుడప్పుడూ విదేశాల్లో ఉన్న కొడుకూ కోడలు దగ్గరకు వెళ్లినా ‘చెప్పుకోలేని’ కొన్ని బాధలతో మళ్లీ తిరిగి రావడమే అవుతోంది. అన్నీ ఉన్నా ఆత్మీయంగా పలకరించేవాళ్లు లేకుంటే జీవితంలో అదో శూన్యమే. ఈ సమస్య నుంచి విముక్తం కావడానికి ఏ కొందరో చేస్తున్న యత్నం - మళ్లీ పెళ్లి- మానవ సంబంధాలలో కొత్తకోణమే. వర్మగారి కథ పురుషుల జీవితానికే పరిమితం.

భద్రయ్య మళ్లీ పెళ్లి చేసుకుంటే అతని కొడుకు సుందర్రావు చూసిన కోణం-ఇక ‘ఆస్తిలో చిల్లిగవ్వ దక్కదు’ అనేదే. అంతేకానీ, తండ్రి అలాంటి నిర్ణయం తీసుకోవ డానికి కారణం ఏమిటి అన్న ఆలోచన మాత్రం అతడికి రాదు. అప్పుడు తన భార్య సుశీల మీద కూడా అతడికి ఆగ్రహం కలుగుతుంది. తండ్రి మళ్లీ పెళ్లి, ఆస్తిలో చిల్లిగవ్వ దక్కకుండా పోయే ఆ పరిణా మాలకి కారణం ఆమేనని అతడు భావి స్తాడు. సుందర్రావే కాదు, దారిలో కనిపిం చిన ఒక బంధువు కూడా భద్రయ్య నిర్ణ యాన్ని హర్షించలేకపోతాడు, ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే వెళ్లి, నలు గురు పెద్దల్ని కూడగట్టి వాళ్ల చేత చీవాట్లు పెట్టించు. ఆస్తంతా దానికి రాసెయ్యక ముందే జాగ్రత్తపడు’ అని ఉచిత సలహా పడేస్తాడు.

మానవ సంబంధాలకు ఆర్థికభాష్యం అన్ని కాలాల లోనూ కనిపించినా దాని విశ్వరూపం, అది వేస్తున్న వెర్రి తలలు ‘తోడు’ కథలో క్లుప్తంగానే అయినా మనసుకు హత్తు కునేటట్టు చిత్రించాడు రచయిత. అందరికీ ఆమోదయోగ్య మైన రీతిలో భద్రయ్య తన అయిదెకరాల ఆస్తిని పంచి చూపించాడు. ఇక్కడ భద్రయ్య చెప్పిన వాదన ఒక్కటే.

బాధ్యతలు ఎరిగిన వారికే అధికారాలూ ఉంటాయి. తండ్రిగా తన బాధ్యత తాను నిర్వర్తిం చాడు. కానీ కొడుకు! తన బాధ్యతలని విస్మరించడమే కాదు, తప్పుదారిలో ఉన్న కోడలిని తన దారికి తీసుకురాక పోవడమే కాదు, ఆమె దారిలోకి తనే అడుగులు వేశాడు. అయితే ఇక్కడ భద్రయ్య కోడలిని తప్పుపట్టడు. ఆమె పరాయి పిల్ల. నిజానికి భద్రయ్యది బలమైన వ్యక్తిత్వం. లోకం కోసం బతకాలని అనుకోడు. అలాఅని తను తప్పు చేయడు. ఎవరి కోసమో తన అభిప్రాయాలను మార్చు కోడు. ఆ క్రమంలోనే అతడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. తన అయిదెకరాలలో మూడు ఎకరాలు సుందర్రావు పేరన, రెం డెకరాలు సత్యవతి పేరున రాశాడు. తన తదనంతరం సత్య వతిని చూసుకోవడానికి సుందర్రావు, సుశీల ఇష్టపడకపోతే ఆమె ఎవరినైనా పెంచుకోవచ్చుననీ, తోడు కూడా తెచ్చు కోవచ్చునని విల్లు రాసి తన ఔన్నత్యాన్ని కూడా చాటుకున్నాడు భద్రయ్య.

ముసలి అత్తమామలు వద్దు, వారి ఆస్తులు మాత్రం కావాలి అనుకునే తత్వం కొందరిలో కనిపిస్తున్న నైజమే. దీనికి పరిష్కారంగా ఒకరిని తోడు తెచ్చుకుంటే మధ్య తరగతి పరిధిలో వినిపించే దుర్మార్గపు వ్యాఖ్యానాలు అందరికీ తెలిసినవే. అమెరికా వంటి స్వేచ్ఛాయుత సమాజంలోనో, పెద్ద పెద్ద నగరాలలోనో ఉన్నా ఇలాంటి పెళ్లికి కారణాలను ఊహించలేనంతగా మనుషులు జడులు గా మిగిలి ఉండడమే ఈ కథలో గొప్ప లక్షణం. (వర్మ రాసిన ‘మరొకడు’/‘నేను నేనే’ కథా సంకలనాలు మార్కెట్‌లో దొరుకుతాయి).
- ఆర్. జగదీశ్వరరావు
*******************************************************************************

అదుపుతప్పిన దున్న!
హాట్ కేక్!
ఆదరాబాదరా వచ్చాడాయన. ఆగమాగంగా వచ్చాడాయన. హైరానా పడుతూ వచ్చాడాయన. ఆయాసపడుతూ వచ్చాడాయన. తన భారీ బాడీని తనే మోసుకురావాలి కనుక మోసుకుంటూ వచ్చాడాయన. కాళ్లీడ్చుకుంటూ వచ్చాడాయన.

చేంబర్ తలుపు పట్టుకు నిలబడ్డవాడ్ని అడిగాడు ‘సార్’ వున్నాడా అని. ‘ఉన్నాడు’ అన్నాడు జమాన్ (అలియాస్ బిళ్ల బంట్రోతు) అంటూ ఎందుకో నవ్వాడు. నా ఆకారమూ ఆయాసమూ చూసి నవ్వుతున్నాడు వీడు అనుకున్నాడు వచ్చినాయన. ‘సార్ ఏ మూడ్‌లో వున్నాడు’ అనడిగాడు ఖంగారు పడుతూ. ‘మూడో రౌండ్’లో వున్నారు అన్నాడు జమాన్. ఆ వెధవ నవ్వు అందుకన్నమాట. ఇప్పుడు ‘ఇన్న’యితే బూతులు తిట్టి అవుటంటాడేమో ననుకున్నాయన ‘ఏం చేస్తాం తప్పదు’ సిట్యుయేషన్‌లాంటిది మరి అనుకున్నాడు. మెళ్లో వున్న గోల్డెన్ చెయినొకటి జమాన్ చేతిలో పెట్టి లోపలికి జొరబడ్డాడు.

ఏంటిది వేళాపాళా లేకుండా వేళ కాని వేళ వచ్చావేమిటీ వేళ రావడానికిదొక వేళా? అన్నాడు సార్ కోపంగా మైకంగా.

సారీ సార్ రాకతప్పింది కాదు తప్పదు కనక తప్పకుండా రావాల్సివచ్చింది. తప్పని తెలిసీ తప్పనిసరి పరిస్థితి కనక రాకతప్పలేదు అన్నాడు వచ్చినాయన.

ఏం జరిగింది ఏదో జరిగింది. ఏదో జరగకూడనిది జరిగివుంటే తప్ప నువ్వింత జరూరుగా వచ్చివుండేవాడివి కాదు. చెప్పు చెప్పు ఎవడైనా నా పదవికి ఎసరు పెట్టాడా. అదేమిటో గాని మెడ మీద తలవున్న ప్రతి నా కొడుక్కీ నా పదవిమీదే మోజు... తొందరగా చెప్పు. సోమరసం ఆఖరు డ్రాప్సు కూడా అయిపోయేయి అన్నాడు సార్ ఎదురుగ్గా వున్న లోటా లోపలికి చూస్తూ.
మీకై మీరు నిజం రాజీనామా చేస్తే, స్పీకరది నిజంగా అంగీకరిస్తే తప్ప, నిజంగా మీ పదవికి వచ్చిన ముప్పేం లేదు నిజంగా అన్నాడొచ్చినవాడు.

హమ్మయ్య! నా పదవి సేఫ్‌గా వుంటేచాలు. ముల్లోకాలు ఎటుకొట్టుకుపోతే నాకేం కానీ చెప్పు.
ఏం చెప్పమంటారు సార్ నీళ్లు నమిలాడు వచ్చినాయన.

ఊరికే నసపెట్టక సంగతేంటో చెప్పు అని విసుకున్నాడు సారు తన ప్రాబ్లమ్ కాదని బేఫికర్‌గా.
భూలోకం వెళ్లానా అక్కడ మా వాళ్లు డ్యూటీ సరిగ్గా చేస్తున్నదీ లేనిదీ చూద్దామనుకున్నా నా కొండొకచోట నా వెహికిల్‌ని పార్కు చేశానా అలా వెళ్లి యిలా వచ్చే సరికి అది మాయమయ్యేనా అన్నాడు వచ్చినాయన.

ఏమిటీ అని బిగ్గరగా తన అరుపుకి తానే జడుసుకునేట్టు అడిగాడు సార్.
అవును సార్. నా దున్నపోతునెవ్వరో ఎత్తుకుపోయారు సార్.
వార్నీ కొంపముంచావు గదయ్యా. నీకు అలాట్ చేసిన సర్కారీ వెహికిల్‌ని పోగొట్టావా? ఎన్నేళ్లయినా ఈ దున్నేనా అని నువ్వే ఎక్కడయినా దాచావా? అన్నాడు సారు.

మహాప్రభో అంతమాటనకండి. అలనాటి నుంచీ ఈ నేటి దాకా అలవాటయిన దున్న. దాన్ని డ్రైవ్ చెయ్యడం తప్ప మరో వాహనం నడపడం తెలీనివాడ్ని. నాకేదీ గతి దేవపతీ! నేనేం చెయ్యాలో సెలవియ్యండి అన్నాడు దున్నపోతును పోగొట్టుకువచ్చిన యముడు.
అసలే కంత్రీ నాయాళ్లుండే భూలోకానికి పట్టపగలే రైళ్లూ విమానాలూ ఎత్తుకెళ్లే చోర కళానిలయానికి ఎందుకువెళ్లావు. అసలు దాన్ని ఎక్కడ పార్కు చేశావో అక్కడ సరిగ్గా చూశావా. ‘నో పార్కింగ్’ స్థలంలో పెడితే ఏ ట్రాఫికోడన్నా స్టేషన్‌కి లాక్కెళ్లాడేమో ఎంక్వయిరీ చేశావా? అన్నాడు దేవుళ్ల లోకం మొదలయిన్నాట్నించీ పదవిని పట్టుకు పాకులాడుతున్న దేవలోకపు సంచాలకుడు.

అన్ని చోట్లా వెదికాను అన్ని స్టేషన్లూ తిరిగాను. కంప్లయింట్లు చెయ్యడానికి, నా అభిమాన దున్నను వెదికి పెట్టడానికి ఒంటె మీద బంగారమంతా భూమ్మీద లంచంగా యిచ్చుకొని వచ్చాను అన్నాడు దున్నపోతు రైడర్.

అప్పుడు చూశాడు పెద్దసార్. కిరీటంతో సహా పోతు వోనర్ ఒంటి మీద ఒక్క బంగారు నగా లేదు. అర్తు మీద కరప్షన్ మరీ యింత పేట్రేగిపోయిందా అనుకున్నాడు.

కరప్షన్ అంటువ్యాధిలా అమరలోకానికి కూడా పాక్కుంటూ వచ్చింది. అందుకే లాస్ట్ బట్ ఒన్‌గా మిగిలిన పులిగోరు చైన్, చేంబర్ జమాన్‌కి సమర్పించుకొచ్చానని అందామనుకున్నాడు కాని అది ఆయన అడ్మినిస్ట్రేషన్‌కి మచ్చ తెచ్చేమాట కనుక గెటవుట్ అంటాడని తమాయించుకుని మౌనంగా వున్నాడు.

లాభం లేదయ్యా! సర్వీసు రివాల్వర్, గవర్నమెంట్ వెహికిలూ నిర్లక్ష్యంగా పోగొడితే సస్పెన్షనే మరో దారే లేదు అన్నాడింద్రుడు. బేర్ మన్నాడు గాడ్ ఆఫ్ డెత్.

ఏం చెయ్యాలో సోమరసం సిప్ చేస్తూ ఆలోచిద్దాం అంటూ జమాన్ని పిలిచాడు లార్డ్ ఆఫ్ గాడ్స్.
ముక్కుతాడు లేని కారణాన అదుపు తప్పి వేలం వెర్రిగా విచ్చలవిడిగా కచ్చగా కల్లగా కపటంగా ఆవారాగా బినామీగా గుడీ బడీ ఆఫీసూ ఠాణా ఆసుపత్రీ అసెంబ్లీ ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తున్నది దున్నపోతు. అదే యిప్పుడు రాష్ట్రం అదే కేంద్రం అదే ప్రభుత్వం. ఛీత్కారాలు చివాట్లు దులపరింపులు వడగళ్ల వానలా పట్టించుకోకుండా వుంటానికి తమ సౌఖ్యం తమ స్వార్థం చూసుకునే వారు దొంగిలించుకొచ్చి దొడ్లో కట్టేసుకున్న యముడి దున్నో దాని క్లోనింగ్ పోతులో కాని అవి జాతినీ నీతినీ తమ గిట్టల కింద తొక్కి కొమ్ములతో కుమ్ముతుంటే సామాన్యుడి సంక్షేమం చెవుల్లో - యముని మహిషపు లోహగంటలు ఖణేల్మంటున్నయ్.

-చింతపట్ల సుదర్శన్


*************************************************************************
జనాభా 700 కోట్లు!
విశేష ఆర్ధికాభివృద్ధి ఫలాలను చూరగొనడానికి సాధనాలైన వనరులు, అవకాశాలకు దేశంలోని దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు, మైనారిటీలు, స్ర్తీలు బహు దూరంగా ఉన్నారని ఇండియా స్థితి గతులపై ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించిన కఠోర సత్యం గమనించదగినది. 1983 నుండి 2000 వరకు దేశంలో నిరుద్యోగం 7.20 శాతంగా ఉండగా, 2009-10 నాటికి 9.4 శాతానికి చేరడం గమనార్హం. ఆర్ధికాభివృద్ధి రేటు పెరుగుతున్న కొద్దీ కుబేరులు మరింతగా ధనవంతులవుతున్నారు. ప్రజలు మరింతగా ఉపాధి, ఉద్యోగాలు కొరవడి కుంగి కునారిల్లుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే గాని మన యువతను మన దేశానికి బంగారు భవితగా నిరూపించడ సాధ్యం కాదు.

ప్రజల సంక్షేమంలోనే ప్రపంచాభ్యుదయాన్ని వీక్షించగల వారికి జనాభా పెరుగుదల ఆందోళనకర అంశం కానేరదు. మహాకవి గురజాడ అన్నట్టు దేశమంటే మనుషులోయ్‌ అంటూ జనార్ణవాన్ని చూసి మురిసిపోవచ్చు. సహజ వనరులు, సాంకేతిక నైపుణ్యాలతో సాధించే ఆర్ధిక ప్రగతి అందరికీ సమానంగా చెందే సామాజిక న్యాయంతో కూడిన సమ న్యాయ వ్యవస్థ నెలకొంటే జన విస్ఫోటనంతో భూభారం పెరిగి పో తున్నదని గగ్గోలు పెట్టవలసిన పనే ఉండదు. ఒక్కరి కోసం అందరు, అందరికోసం ప్రతి ఒక్కరు అనే స్పృహతో నడిచే ప్రపంచంలో నూత్న శిశూదయం వరమే కాని శరాఘాతం కానేరదు. కాని దరదృష్ట వశాత్తూ సమష్టిని హరించి వ్యష్టిని పెంచి అతి కొద్ది మంది స్వలాభాపేక్ష కోసం అందరి సౌభాగ్యాన్ని బలి తీసుకునే కార్పొరేట్‌ గుత్తాధిపత్యాలు బలిసి బలాదూర్‌గా సాగిపోతున్న నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజాకోటి దుర్భర దారిద్య్ర కూపంలో కూరుకు పోతున్నది. ప్రధానంగా ఈ దారుణ నేపథ్యమే కుటుంబ సంక్షేమం పేరిట జనాభా పెరుగుదల నియంత్రణ ఆవశ్యకతను పెంచింది. 

ప్రపంచంలో కెల్ల అత్యధిక జనాభా గలిగిన తొలి రెండు దేశాలు చైనా, భారత్‌లు. గత నాలుగైదు దశాబ్దాలుగా ఈ రెండు మహా జన సాగరాలూ కుటుంబ సంక్షేమ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి జనాభా పెరుగుదల రేటును గణనీయంగా అదుపు చేయగలిగాయి. పరిమిత జనాభా సమాజ స్థాయిలోనే కాదు, కుటుంబ స్థాయిలోనూ భారాన్ని తగ్గించి తక్కువ మంది పిల్లలను ఎక్కువ శ్రద్ధతో పెంచి పెద్ద చేసి ప్రయోజకులను గావించడానికి దోహదం చేస్తుందని నిరూపించాయి. పుట్టే వారిని పుట్టనివ్వాలనే సంప్రదాయ భావజాలం గూడు కట్టుకున్న కుటుంబాలలోనూ పరిమిత కుటుంబం యోచనకు ప్రాధాన్యం లభిస్తున్నది. పరిమిత కుటుంబ సూత్రం, చిన్న కుటుంబం- చింతలు లేని కుటుంబం దృక్పథం బహుళాదరణ పొంది జనాభా పెరుగుదల స్పీడును తగ్గిచడంలో సఫలీకృతమవుతున్నప్పటికీ ప్రపంచ జన సంఖ్య అక్టోబర్‌ 31 తొలి ఘడియల సమయానికి ఏడు వందల కోట్లకు చేరుకుంటున్నదని ఐక్యరాజ్య సమితి జన ‘గణ గణ’ను మోగించింది. 

ఈ సందర్భంగా మన జనాభా, మన వనరులు, మన ప్రగతి గురించి పునరావలోకనం చేసుకోవడం మన కర్తవ్యం. ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకున్న సందర్భాన్ని సానుకూలంగా తీసుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ఆహారాది సవాళ్ళకు దీటుగా ప్రపంచం సమాయత్తం కావలసి ఉన్న సంగతిని మననం చేసుకోవలసి ఉన్నది. 2011 జనగణనను బట్టి భారత్‌ జనాభా 121 కోట్లు. ప్రపంచ జనాభాలో ఆరో వంతు కంటె అధికం. ప్రస్తుత 1.41 శాతం పెరుగుదల రేటులో భారత్‌ జన సంఖ్యలో 2025 నాటికి చైనాను మించి పోయి ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశం కానున్నదని పాపులేషన్‌ జ్యోతిష్యులు ఢంకా బజాయిస్తున్నారు. 2050 నాటికి భారత్‌ జనాభా 160 కోట్లు కానున్నదని కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఆందోళనకరం కాగా భారత దేశ జనాభా విషయంలో ఆహ్లాదకర కోణం కూడా లేకపోలేదు. అది మన అసంఖ్యాక యువతకు సంబంధించినది. 

మన దేశ జనాభాలో సగానికి అధికంగా 25 ఏళ్ళ లోపు వయస్సు యువత ఉండడం, 35 ఏళ్ళ వయస్సు గలవారు 65 శాతం ఉండడం మనకు కలిసి వచ్చే అంశాలు. అయితే ఇంతటి భారీ సంఖ్యలోని యువశక్తికి తగిన పనిని నైపుణ్యాలను కల్పించడం మన ప్రభుత్వాలు, విధాన కర్తల ముందున్న ప్రధానమైన సవాలు. 2030 నాటికి భారతీయుల సగటు వయసు 29 సంవత్సరాలు కానుండగా, చైనీయుల సగటు వయసు 37, జపానీయులది 48 కానుండడం గమనార్హం. అంటే మన సగటు జనాభా నవ యవ్వనంతో తొణికిస లాడనున్న దన్న మాట. జాతి ప్రగతికి, వ్యక్తి వికాసానికి అత్యంత దోహదకారి కాగల అంశం ఇది. మానవ వనరును సానబట్టి జాతి పురోగతికి సద్వినియోగం చేసుకోవాలన్న దృఢ సంకల్పం ఉండాలే గాని ఇంతకు మించిన సానుకూలాంశం మరొకటి ఉండదు. 

ఇప్పటికే యువతను అక్షరాస్యులను, నిపుణ వంతులను చేసి గౌరవ ప్రదమైన జీవనం సాధించగల ఉపాధులు కల్పించడంలో మన పాలకులు దారుణంగా విఫల మవుతున్నారు. పర్యవసానంగా వారు వామపక్ష తీవ్రవాదం వైపు, మతతత్వ ఉగ్రవాదం వైపు సైతం ఆకర్షితులై జాతి ఆంతరంగిక భద్రతకు పెను సవాలుగా మారుతున్నారు. ప్రసుత్తం దేశ జనాభాలో ఏదో విధమైన ఉపాధి ఉద్యోగ అవకాశాలున్నవారు 39 శాతం. 2015 నాటికి అంటే మరో నాలుగేళ్ళకు అప్పటి జనాభాను బట్టి ఇదే స్థాయి ఉపాధి అవకాశాలను కాపాడాలంటే మరి 5 కోట్ల 50 లక్షల ఉద్యోగాలు, ఉపాధులు కల్పించవలసి ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న నిరుద్యోగ శాతాన్ని గణనీయంగా తగ్గిస్తే గాని యువతలో అశాంతిని, అలజడిని తొలగించడం వారి శక్తి యుక్తులను జాతి ప్రగతికి ఉపయోగించడం సాధ్యం కాదు. 

ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలైన సందర్భంగా మనం సాధించామని జబ్బలు చరుచుకొని చెప్పుకుంటున్న ఆర్ధికాభివృద్ధి దేశంలో నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తొలగించడంలో దారుణంగా విఫలమైందని వాస్తవ గణాంకాలు చాటుతున్నాయి. భారత్‌లో రెండు దశాబ్దాలుగా అమలవుతున్న నూతన ఆర్ధిక సంస్కరణలు, ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌లు దేశ ఆర్ధికాభివృద్ధి రేటును గణనీయంగా పెంచిన మాట వాస్తవమే గాని, అదే సమయంలో ప్రజల ఆదాయాలలో, మానవాభివృద్ధి స్థాయిలలో వ్యత్యాసాలు గణనీయంగా పెరిగాయని ఆర్ధిక సంస్కర్తల పవిత్ర దేవాలయం వంటి ప్రపంచ బ్యాంకే కుండ బద్దలుకొట్టింది.

విశేష ఆర్ధికాభివృద్ధి ఫలాలను చూరగొనడానికి సాధనాలైన వనరులు, అవకాశాలకు దేశంలోని దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు, మైనారిటీలు, స్ర్తీలు బహు దూరంగా ఉన్నారని ఇండియా స్థితి గతులపై ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించిన కఠోర సత్యం గమనించదగినది. 1983 నుండి 2000 వరకు దేశంలో నిరుద్యోగం 7.20 శాతంగా ఉండగా, 2009-10 నాటికి 9.4 శాతానికి చేరడం గమనార్హం. ఆర్ధికాభివృద్ధి రేటు పెరుగుతున్న కొద్దీ కుబేరులు మరింతగా ధనవంతులవుతున్నారు. ప్రజలు మరింతగా ఉపాధి, ఉద్యోగాలు కొరవడి కుంగి కునారిల్లుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే గాని మన యువతను మన దేశానికి బంగారు భవితగా నిరూపించడం సాధ్యం కాదు.

Sunday, October 30, 2011


కార్తీక మాసంలో పూజలు, వ్రతాలూ ఎందుకు చేయాలి?


కార్తీక మాసం అంటే భగవాన్ శివుడికి ప్రీతిపాత్రమైనదని, ఈ మాసంలో పూజలు వ్రతాలు చేసి, ఉపవాసాలు ఉన్న వారికి పుణ్యం దక్కుతుందని, ఇంకా అనేక రకాలుగా ఈ మాసం విశిష్టమైనదని చెపుతారు.  ఇవన్నీ నిజమే.  

కానీ పూజలూ, వ్రతాలూ కేవలం ఇంట్లోని  స్త్రీలు మాత్రమే చేస్తారు, పురుషులు ఇటువంటి సంప్రదాయాలను నమ్మినా ఆచరించేవారు చాల తక్కువ. మరి ఇలా పూజలు, వ్రతాలూ చేయని వారికి పుణ్యం రాదా? అనే అనుమానం రావచ్చు.

పుణ్యం రావడం, రాకపోవడం తరువాతి సంగతి. అసలు ఎందుకు ఆచరించాలి? అనేది తెలిస్తే మనం దేవుడిని పూజించడం కన్నా ముందు మన పెద్దలను పూజిస్తాం.
  • సంవత్సరంలో ముఖ్యంగా మూడు మాసాలు ఇటువంటివి వస్తాయి. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం. ఈ మూడు మాసాలలో పూజలు, వ్రతాలూ ఆచరిస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెపుతారు. వర్షాకాలం ఆరంభం నుండి శీతాకాలం చివరి వరకు ఉన్న కాలంలోనే ఈ మూడు మాసాలు రావడం కాకతాళీయం కాదు. ఎండలు పోయి వర్షాలు ప్రారంభమైనప్పుడు అన్ని ప్రదేశాలు తడి తడిగా (అంటే తేమతో) ఉంటాయి. తేమ ఉన్న చోట రోగ కారక క్రిములు చేరతాయి. వీటి వలన సమాజంలో అనేక రోగాలు బయలుదేరతాయి. ఈ రోగాల నుండి సమాజాన్ని రక్షించాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. అంటే ఎప్పుడు పరిశుభ్రంగా ఉండటం, ఉతికిన దుస్తులను ధరించడం, పసుపు రాసుకోవడం, ధూపం వేయడం మొదలైన రోగ నిరోధక పద్ధతులను పాటించాలి. పూజ చేయవలసిన రోజున తెల్లవారుఝామునే నిద్ర లేచి, ఇల్లు శుభ్రం చేసి, తల స్నానం చేసి, కొత్త బట్టలు కానీ, ఉతికిన బట్టలు గానీ ధరించి, పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు మహిళలు ముఖానికి, పాదాలకు పసుపు, గంధం రాసుకుని, ధూపం వేస్తారు. వీటన్నిటి వల్ల క్రిములు పోయి, ఇల్లు శుభ్రపడి ఇంటి నిండా క్రిములను పోగొట్టే ధూపం ఆవరిస్తుంది. పసుపు వలన శరీరానికి కూడా రోగ నిరోధక శక్తి వస్తుంది. 
  •  పూజలు, వ్రతాలూ చేసే రోజుల్లో మాంసాహారం (మాంసం, గుడ్లు, చేపలు మొదలైనవి) తినకూడదని కూడా చెపుతారు. ఎందుకంటే మాంసం జీర్ణం కావాలంటే వాతావరణం సహజంగా వేడిగా ఉండాలి. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటంది కాబట్టి త్వరగా జీర్ణం కాదు. జీర్ణం కాకపోతే లోపలే కుళ్లిపోయి వివిధ రకాల రోగాలు బయలుదేరతాయి. ఈ రోగాల నుండి మనలను రక్షించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మాసంలో మాంసం తినకుండా ఉంటే పుణ్యం వస్తుందని చెప్పి మన పెద్దలు ఈ సంప్రదాయం పెట్టారు. అంతేకాక ఈ పధ్ధతి వలన జంతుజాలం కూడా రక్షించబడుతుంది. 
  • నదులు ఈ కాలంలో చక్కగా ప్రవహిస్తాయి. ఈ ప్రవాహంలో అనేక మూలికలను, ఔషధాలను తనలో కలుపుకుంటూ వస్తాయి. అలాంటి ప్రవాహంలో ఒక్కసారి మునిగితే ఔషధ ప్రభావం వలన మన శరీరం కూడా రోగ నిరోధకంగా మారే అవకాశం ఉంది. 
  • అలాగే మనలాంటి అనేక మంది స్నానానికి రావడం వలన సమస్త సమాజ రూపం మన ముందు కదలాడుతుంది. దానివల్ల మనమూ ఈ సమాజంలో ఒక భాగం అనే భావన అంకురించి, మన మనసులో ఎదుటివారి పట్ల మంచి, మర్యాదలు అలవడతాయి. ఈ గుణాలు బలపడితే అవినీతి చేయాలనే ఆలోచన, పక్క వారికి హాని చేయలనే చెడు ఆలోచనలు మనలో కలగవు.
  • అలాగే కార్తీక మాసం శివునికి ప్రీతిపాత్రమైనది. శివుని కోసం ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఉపవాసం చేయడం వలన కడుపులో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆహారం కూడా పూర్తిగా జీర్ణం కాబడి కడుపు పరిశుభ్రంగా తయారవుతుంది. అలాగే తేమ ఆరిపోయి చక్కగా ఆరోగ్యంగా తయారవుతుంది. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి చైతన్యవంతమవుతుంది. దీనివలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
  • భగవాన్ శివునికి ఎల్లప్పుడూ విశ్వాస పాత్రమైనది నంది. నందీశ్వరుడు అంటే మన భూలోకంలో గోవు. కాబట్టి గోవుని పూజించి సాక్షాత్తూ నందిని పుజించామని సంతృప్తి చెందుతారు మన మహిళలు. గోపూజ వలన గోవులు రక్షించబడతాయి. అందువలన పంటలు సమృద్ధిగా ఉండి సమాజం సుఖసంతోషాలతో వెల్లివిరుస్తుంది.
ఇవన్ని ఏదో పండుగ నాడు తప్పితే మిగతా రోజుల్లో సాధారణంగా పాటించరు. అందుకని  ఇవి ప్రతి ఇంట్లోను పాటించడం కోసం మన పెద్దలు పూజ, వ్రతం అని పేరు పెట్టి మనతో చేయిస్తున్నారు. ఏదో ఒక లాభం వస్తుందని చెపితే కానీ మనం ఏదీ ఆచరించము. అందుకని పుణ్యం వస్తుందని ఆశ పెట్టి మనతో ఇవన్ని చేయిస్తూ మనలను రక్షిస్తున్నారు.

చెప్పుకోవాలంటే ఇటువంటి విశేషాలు మన పండుగలలో చాలా ఉన్నాయి. ఇవి మచ్చుకు  కొన్ని. కాబట్టి అందరం ఈ కార్తీక మాసాన్ని తప్పక ఆచరించుదాం. 
‘దరిద్రగొట్టు’ ప్రభుత్వం ఇది!

విశ్లేషణ
వి.హనుమంతరావు
సీనియర్ పాత్రికేయులు


పేదలంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు అతిరథులు, మహారథులు, మేధావులు, ఆర్థికశాస్త్రవేత్తలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 62 ఏళ్ల తర్వాత కూడా జవాబు చెప్పలేకపోతున్నారు. స్థూల దృష్టితో చూసినా పేదలు ఎవరో ఇట్టే తెలుసు కోవచ్చు, కానీ మన సోకాల్డ్ మేధావులకు సూక్ష్మదృష్టి లేకపోగా, స్థూల దృష్టి కూడా కొరవడటం విచారకరం. పట్టణాల్లో మురికివాడలకు వెళ్లండి. గ్రామాలకు పోతే మనకు మనుషులు కాదు బొమికెల గూళ్లు, ఒంటిమీద బట్ట లేకుండా వీధుల్లో ఆడుకొనే పిల్లలు, కేవలం రెండే రెండు చీరలతో కాలం వెళ్లబుచ్చే స్త్రీలు కొల్లలుగా కనిపిస్తారు. కానీ ప్రభుత్వం దృష్టిలో వారంతా పేదవాళ్లు కాకపోవచ్చు. అందుచేత వాళ్లెవరో లెక్కలు తీయమని ఛప్పన్నారు కమిటీలు వేశారు.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అధ్యక్షునిగా, కె.టి.షా కార్యదర్శిగా ఒక కమిటీని వేయ టంతో ప్రారంభమై స్వాతంత్య్రానంతరం, ప్రధాని నెహ్రూ నియ మించిన నిపుణుల కమిటీ, దండేకర్ అండ్ రథ్, పి.వి. సుఖాత్మే, నేషనల్ సాంపిల్ సర్వే సంస్థ, ప్రణాళికా సంఘం, డి.టి.లక్డావాలా కమిటీ, అర్జున్‌సేన్ గుప్త కమిటీ, టెండూల్కర్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్... ఇవికాక ఇంకా అనేక పరిశోధనా సంస్థలు, ఎన్జీవోలు పేదరికం అనే కొండను తవ్వుతూనే ఉన్నాయి. వీళ్లంతా కలిసి చేసిన ఘనకార్యమేమంటే సమస్యను మరింత క్లిష్టతరం చేస్తూ వచ్చారు. ఈలోగా పేదరికం పెరిగిపోతూనే ఉంది. కుబేరులైనవారు మరింతగా కుబేరులై పోతున్నారు.

వాళ్లంతా కలిసి పేదరికపు రేఖ అనే గీతను సృష్టించారు. అది ఆకుకందదు. పోకకు పొందదనే విధంగా తయారై పేదరికం సమస్యను పక్కనపెట్టి రేఖను ఎక్కడ గీయాలనే రంధిలో పడ్డారు. 1971లో ఎం.దండేకర్, రథ్ అనే ఇద్దరు ఆర్థికశాస్త్రవేత్తలతో ఏర్పరచిన కమిటీ రెండుపూటలా తిండి తినలేని వాడే పేదవాడని నిర్వచించింది. దురదృష్టమేమంటే మానవుడన్న తర్వాత కేవలం తిండి గింజలతోనే బతకలేడని, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఆరోగ్యం, చదువు, రెండు పూటలా తినడానికి కావాల్సిన తిండి గింజలను కొనుక్కోవడానికి ఉపాధి వంటి మౌలిక అంశాల గురించి వారు ఆలోచించక పోవడం. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ప్రభుత్వ ఆలోచనలు, ఆర్థిక శాస్త్ర వేత్తల సూత్రీకరణలు ఈ పరిధిని దాటలేదు. అది దాటనంత కాలం పేదరి కంతో దేశం రాజీపడక తప్పదు.

ఇలాంటి కప్పదాటు ఫార్ములాలతో పేదరికం పోదు. డా. మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గృహవసతి కల్పించడానికి ఇలాంటి ఫార్ములానే ఎంచుకున్నారు. పేదవారి గృహవసతి కల్పన కోసం ప్రతి కుటుంబానికి రూ.400 ఇచ్చి, దగ్గర్లో ఉన్న అడవుల్లోంచి తాటాకులు, వెదుళ్లు తెచ్చుకొని ఇల్లు నిర్మించుకోమన్నారు. పోనీ ఆ పాక నిర్మించుకోవడానికి స్థలం చూపించలేదు. రికార్డుల్లో మాత్రం ఇన్ని లక్షల మందికి గృహ వసతి కల్పించామని ప్రచారం చేసుకొంది ప్రభుత్వం. అలాగే గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రామాలకు గ్రామాలనే నేలమట్టం చేసి నిర్వాసితులను ఫలానా చోట ఇల్లు కడతాం, అక్కడికి వెళ్లమ న్నారు. మౌలిక సదుపాయాల కల్పన గాలికి వదిలేశారు. పేదరికం తగ్గిపోయిం దని చెప్పే లెక్కలన్నీ ఇలాంటివే.

రెండు పూటలా తిండి అంటే ఏమిటి? ఎంత? అనే ప్రశ్న దండేకర్-రథ్ కమిటీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థను అడిగితే మనిషి బతకడానికి కనీసం 2,250 కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని చెప్పింది. ఆ ఆహారంలో ఎటువంటి పోషక పదార్థాలుండాలి, వాటిని సమకూర్చుకోవాలంటే ఎంత డబ్బు అవసరమవుతుందో లెక్కలువేసి, మార్కెట్లో వాటి ధరలు సేకరించి, ఇదిగో ఇంత ఆదాయం ఉండాలని అన్నారు. దీనికి దారిద్య్రరేఖ అనే పేరు పెట్టి, ఈ మేర కూడా ఆహారం తినలేని వారు పేదలు అని నిర్ధారించారు. ధరలు పెరిగిన మేరకు పేదరిక రేఖను కూడా పెంచుతూ వచ్చారు.

ఈ సూత్రాల ఆధారంగా, ఈ ఆదాయం ఆధారంగా ప్రతీ గ్రామంలో, పట్టణంలో పేద కుటుంబాలను గుర్తించి వారికి కార్డులివ్వాలి, చౌక ధరల దుకాణాల ద్వారా వారికి నియమిత ఆహార ధాన్యాలను సరఫరా చేయాలి ఈ దుకాణాలు ఎంత సవ్యంగా నడుస్తున్నాయో, ఈ కార్డుల పంపకం ఎంత అపసవ్యంగా నడుస్తున్నదో, స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయంతో ఎలా భ్రష్టుపట్టిందో తెలిసిందే. ఒకే ఒక ఉదాహరణ. జాతీయ సలహా సమితి (దీనికి సోనియా గాంధీ అధ్యక్షురాలు) సభ్యుడు ఎన్.సి.సక్సేనా పంపిణీ విధానం లోపభూయిష్టంగా ఉందని చెబుతూ స్వయంగా ప్రణాళికా సంఘమే పేదరిక రేఖ కింద ఉన్న వారిని తొలగించటం లేదా చేర్చటంలో 60 శాతం దాకా తప్పొప్పులున్నాయన్న విషయాన్ని అంగీకరించిందని గుర్తు చేశారు. ఫరీదాబాద్‌లో ఒక స్త్రీ వద్ద 925 రేషన్ కార్డులున్న వైనాన్ని ప్రణాళికా సంఘం నిర్ధారణ చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ భారతీయులు మరీ ఎక్కువగా తింటున్నారని, అందువల్లే ధరలు పెరిగాయనే దారుణమైన ప్రకటన చేయటం, ఆ ప్రకటనను రాజకీయ పార్టీలు ఖండించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘ప్రభుత్వ పథకాల వల్ల పేదల ఆదాయం పెరిగిపోయిన ఫలితంగానే ధరలు ఆకాశమార్గం పట్టాయి’’ అనే ప్రకటన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ కార్యాలయం చేయడం విశేషం. భారత ప్రధానికి అమెరికా పాలకులకు ఎంత సామీప్యత! ఆలోచనల్లో ఎంత ఏకత్వం! నగరాలు, పట్టణాల్లో రోజుకు కేవలం రూ.32, పల్లెల్లో రూ.25 వెచ్చించేవారు పేదలు కాదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ ఆహ్లువాలియా ఇటీవల ఒక కొత్త సత్యం కనిపెట్టి దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం యూపీఏ ప్రభుత్వ భావ దారిద్య్రానికి అద్దం పట్టింది.

2011లో పేదరికపు రేఖను 2001లో జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించడమేమిటని సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయటం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. మరో విషయం. సామాజిక సంక్షేమ పథకాల కోసం చేసే ఖర్చును తగ్గించాలని, పేదలకిచ్చే సబ్సిడీల్లో కోత విధించాలని పారిశ్రామిక వేత్తల సంఘాలు, కార్పొరేట్లు పాలకుల చెవినిల్లు కట్టుకొని ఒత్తిడి తీసుకొనివస్తున్నారు. అసలు చేసిన కేటాయింపులే పూర్తిగా ఖర్చు చేయటంలేదు. చేసే ఖర్చు ఫలితాలు పేదలకు అందటంలేదని మంత్రులే అంగీకరిస్తున్నారు. అలాం టప్పుడు ఆ ఖర్చు తగ్గిస్తేనేగాని అభివృద్ధి సాధ్యం కాదని సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య పోటీ పెడుతున్నారు. ప్రభుత్వం మనుగడే వారి మీద ఆధారపడిన నేపథ్యంలో పేదలకు కన్నీరు, సంపన్నులకు పన్నీరుగా ప్రస్తుత పరిస్థితి తయారైంది.

ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్ ప్రకారం 2,400-2,100 కేలరీల కొలబద్ద ప్రకారం దేశ జనాభాలోని 84 కోట్ల మంది ప్రజలు అంతకన్నా తక్కువే తింటున్నారు. ఇంతమంది పేదరికానికి కారణమైన ఆర్థిక విధానాలను సవరించకుండా, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయకుండా, అవినీతిని అరికట్టకుండా, నిరుద్యోగాన్ని తగ్గించకుండా పేదరికం తగ్గే ప్రశ్నేలేదు. పేదరికమనేది ఆర్థిక, శారీరక, మానసిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయపరమైనదని మన రాష్ట్ర ఆర్థిక శ్రాస్తజ్ఞులు ప్రొఫెసర్ ఎం.ఎల్.కాంతారావు అంటున్నారు.

ఐక్యరాజ్య సమితి ప్రమాణాల ప్రకారం ఎస్సీల్లో 81 శాతం, ఎస్టీల్లో 6 శాతం, బీసీల్లో 58 శాతం, ఇతరులలో 33 శాతం జనం పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ గణాంకాలను ప్రభుత్వం కూడా బొత్తిగా కాదనటం లేదు. అయితే దెబ్బ ఒకచోట తగిలితే, మందు మరోచోట రాస్తే నొప్పి తగ్గదు. అలాగే గణాంకాలతో రకరకాల కసరత్తులు చేసి, అవసరమైతే పేదలకు డబ్బిచ్చి చేతులు దులిపేసు కుందామని ప్రభుత్వం తలపోస్తున్నది. దానికైనా పేదల గుర్తింపు అంటూ జరగాలికదా! ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలకు పుట్టిన బిడ్డ పేదరికం. పేదరికం పోవాలంటే ప్రజలకు ఉపాధి కల్పించాలి. వారి చేతుల్లో డబ్బుంటే, వస్తువులకు, ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. దేశ ఆర్థిక పరిస్థితి అప్పుడు దానికదే మెరుగవుతుంది.

ఆర్థిక సంక్షోభం అనే సుడిగుండంలో మన దేశం, దేశ పాలకులు చిక్కు కొని ఉన్నారు. భారతదేశమే కాదు, అమెరికా, యూరోపియన్ దేశాలతో సహా ప్రపంచ దేశాలన్నీ అదే పరిస్థితిలో ఉన్నాయి. 2008 నాటి సంక్షోభం మన దేశాన్ని అలలా తాకింది గాని తన్నలేదని సంతోషిస్తుంటే ప్రస్తుత ఆర్థిక మాం ద్యం దేశాలన్నిటితోసహా మన దేశాన్నీ కుంగదీస్తున్నది. మన దేశానికి పరిమి తమై చూసుకుంటే మన ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయ రంగం ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రైతాంగం రాష్ట్రంలో తాజాగా క్రాప్ హాలిడే ప్రకటించారు గాని, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పటి నుంచి వ్యవసాయం నిరాదరణకు గురవుతూ వస్తున్నది.

ఉదాహరణకు సాగుభూమి విస్తీర్ణం 2000-01లో 121.05 లక్షల హెక్టార్ల నుంచి 2008-09లో 122.83 లక్షల హెక్టార్లకు పెరిగినా, ఉత్పత్తి మాత్రం అదే కాలంలో 196.81 లక్షల టన్నుల నుంచి 234.47 లక్షల టన్నులకు, ఉత్పాదకత 1,626 కిలోల నుంచి 1,909 కిలోలకు పెరిగింది. తలసరి లభ్యత కూడా రోజు కు 418.2 గ్రామాల నుంచి 444 గ్రామాలకు పెరిగింది. అయినా రైతాంగానికి పెద్దపీట వేయకపోవటం మాట అటుంచి, ఉన్నదంతా ఊడ్చి పారిశ్రామిక రం గానికి దారాదత్తం చేసి రైతన్నను కళ్లనీళ్ల పర్యంతం చేస్తున్నారు. రైతు అప్పో సప్పో చేసి, కల్తీవిత్తనాలు, కల్తీఎరువులు, ప్రకృతి బీభత్సాలనెదుర్కొంటూ పుష్కలంగా పండిస్తుంటే, పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి.

ఇటీవల గోధుమ ధర బాగానే పెంచారు కాని, బియ్యం ధర ప్రకటించాల్సి ఉం ది. ఆహార ధాన్యాల లభ్యత పెరుగుతోంది. కాని, పేదలకు లభ్యతే కొరుకుడు పడని సమస్యగా ఉండిపోయింది. కనీసం పంపిణీ వ్యవస్థను కూడా సరిదిద్ద లేని చచ్చుపుచ్చు ప్రభుత్వం మనలను పరిపాలిస్తోంది. ఒక రకంగా చూస్తే వాళ్లను అధికారంలోకి పంపించి, మన ఓటరు మహాశయులే తప్పు చేశారేమోన నిపిస్తుంది. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించగలిగితే ఏ సంక్షోభమూ మన దరి దాపులకు కూడా రాదన్నది యూపీఏ సర్కార్ గుర్తిస్తే బాగుంటుంది. ************************************************************

తగ్గిన మొగ్గు
మారుతున్న మేజిక్ ఫిగర్స్
కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆధిక్యం

ముగ్గురు ఎమ్మెల్యేలు గుడ్‌బై
టీఆర్ఎస్ గూటికి జూపల్లి, సోమారపు, రాజయ్య
అంతం కాదిది ఆరంభం.. క్యూలో మరింతమంది
మా పార్టీ కాదు.. కాంగ్రెస్సే టీఆర్ఎస్‌లో విలీనమవుతుంది
కిరణ్‌తో కుమ్మక్కు కాకుంటే చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలి
మేం మద్దతు ఇస్తాం.. లేకపోతే ఆయన తెలంగాణ ద్రోహే
పోలవరం టెండర్ల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా పంజా విసిరారు. అసలే అత్తెసరు మెజారిటీతో అధికారంలో నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌ను ఊహించని దెబ్బ కొట్టారు. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను గులాబీ గూటిలోకి చేర్చుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే టి.రాజయ్య ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారితో పాటు అనుబంధ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి కారెక్కేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్.. అటు ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబులకు సవాళ్లు విసిరితే.. గులాబీ తోటలోకి చేరిన ఎమ్మెల్యేలు తెలంగాణ మంత్రులనే లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణలో పార్టీ తమను అనాథలను చేసిందని, పార్టీ జెండా పట్టుకుని తిరిగే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఆత్మహత్యలకు సోనియానే కారణమని నిందించారు. ప్రజల పక్షమా? పదవుల పక్షమా? అనే విషయాన్ని కాంగ్రెస్ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తేల్చుకోవాలని హితవు పలికారు. రాజీనామాలు చేసి వారంతా ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని, లేకపోతే ప్రజలే వారిని నిలదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణను తెచ్చుకునే చిత్తశుద్ధి ఉంటే మంత్రులు పదవుల్లో ఎలా కొనసాగుతారని నిలదీశారు.


హైదరాబాద్, అక్టోబర్ 30 : మొగ్గు తగ్గుతోంది. ఇప్పటికే అత్తెసరుగా ఉన్న పాలక కాంగ్రెస్ బలం క్రమక్రమంగా తగ్గుతోంది. సీఎం కిరణ్ సర్కార్ డేంజర్ జోన్‌లోకి వెళుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీ సాధించి నెట్టుకొస్తున్న పాలక కాంగ్రెస్‌కు తొలుత వై.ఎస్.జగన్ రూపంలో సవాళ్లు ఎదురవగా.. ఇప్పుడు టీఆర్ఎస్ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం ఒక్క రోజే కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. మరో ఎమ్మెల్యే ఆకస్మికంగా మరణించారు.

ఈ పరిణామం కాంగ్రెస్‌కు గుబులు పుట్టిస్తోంది. అసెంబ్లీలో తమ బలం క్రమంగా 'మేజిక్ ఫిగర్' కంటే తక్కువ స్థాయికి పడిపోతుందేమోనన్న ఆందోళన పాలకపక్షంలో ప్రారంభమైంది. దీంతో.. నష్ట నివారణ చర్యలపై ఇటు సీఎం కిరణ్, అటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దృష్టి సారించారు. నిజానికి.. 2009 ఎన్నికల్లోనే వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీతో బయటపడింది. వైఎస్ మరణానంతరం జగన్ రూపంలో కాంగ్రెస్‌కు సవాళ్లు ఎదురైనా కూడా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీని తనలో విలీనం చేసుకుని కాంగ్రెస్ ఊపిరి పీల్చుకోగలిగింది.

పఆర్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ కొంత కుదుటపడినట్లు కన్పించినా.. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అధికార పార్టీలో మళ్ళీ అలజడి రేపుతున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో.. కిరణ్ సర్కారు భవితపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల బాటలోనే మరి కొందరు కూడా కాంగ్రెస్‌ను వీడే పక్షంలో అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కన్నా దిగజారికిరణ్ సర్కార్ బలం పడిపోయే ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. మంత్రి పదవిని వీడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వంటి మరి కొందరు కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి తమ పార్టీలో చేరతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి కూడా. వీటన్నింటి నడుమ.. డిసెంబర్ 3లోగా ఏర్పాటు చేసే శాసనసభ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి కిరణ్ ప్రభుత్వానికి తప్పదేమోనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే.. రాజకీయంగా తనకు ప్రయోజనం ఉంటుందో లేదో? స్పష్టం కానప్పుడు.. బల నిరూపణ ముగ్గులోకి కిరణ్ సర్కార్‌ను లాగి.. ప్రభుత్వాన్ని పడగొట్టేంత సాహసానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఒడిగడుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈ సందేహమే కిరణ్ సర్కారుకు ఊరట.

జగన్ వర్గం ఎటు వైపు నడిచేను?
శనివారం వరకు శాసనసభలో కాంగ్రెస్ బలం 155గా ఉంది. వీరికి తోడు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతూ వచ్చారు. అంటే ఇండిపెండెంట్లతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి శనివారం వరకు 158 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్న ఆ ముగ్గురు స్వతంత్రులలో రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్‌కు దూరమై.. ఆదివారం టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. మరో శాసనసభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి అకాల మరణం పొందారు. ఇప్పుడు ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మాత్రమే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు.

కాగా.. కాంగ్రె స్‌కే చెందిన జూపల్లి కృష్ణారావు, టి.రాజయ్య కూడా ఆదివారం టీఆర్ఎస్‌లో చేరడంతో స్వతంత్రులతో కలుపుకొని అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 154కు పడిపోయినట్లయింది. అయితే.. పీఆర్పీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు చెందిన ఏడుగురు సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. వీరిని కూడా కలుపుకొంటే మొత్తం 178 ఎమ్మెల్యేల మద్దతు కిరణ్ సర్కార్‌కు ప్రస్తుతం ఉన్నట్లవుతుంది. అయితే.. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్‌లో వైఎస్ పేరును ప్రస్తావించినందుకు గాను 25మంది కాంగ్రెస్ శాసనసభ్యులు జగన్‌కు మద్దతుగా లోగడ రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే.

అదే విధంగా తెలంగాణవాదానికి కట్టుబడి ఇద్దరు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, సత్యవతి కూడా రాజీనామా సమర్పించారు. జగన్ వర్గానికి చెందిన జయసుధ ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. పీఆర్పీకి చెందిన ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కూడా జగన్ వెంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్‌లోని జగన్ వర్గం ఎమ్మెల్యేల పాత్ర ఇక కీలకం కానుంది. ఎలాగంటే.. జగన్ వర్గంగా చెబుతున్న కాంగ్రెస్‌లోని 28 మంది ఎమ్మెల్యేలు సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాసంపై ఓటేసే పక్షంలో పాలక పార్టీ బలం 178 నుంచి 150కి పడిపోతుంది. కాంగ్రెస్‌కే చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య కూడా పార్టీని వీడే పక్షంలో పాలక కూటమి బలం మేజిక్ ఫిగర్ అయిన 148కి చేరుకుంటుంది.

అలాంటి సమయంలో ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు దూరమైనా సర్కారు పుట్టి మునగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అంటే.. కాంగ్రెస్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. జగన్ వర్గం ఎమ్మెల్యేలు కూడా సర్కారు పుట్టి ముంచాలని దృఢంగా నిర్ణయిస్తే కిరణ్ ప్రభుత్వానికి ముప్పు తప్పకపోవచ్చు. అయితే.. జగన్ వర్గంగా పేరొందిన ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయన వెంట నిలుస్తారనేది వేచి చూడాల్సిన అంశం. కాగా.. జగన్ గ్రూపుగా పేరు బడిన కొంతమంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పటికే చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.

సీఎం తీరుపై కాంగ్రెస్ నేతలు ఫైర్
అధికారంలో ఉన్నప్పుడు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు విపక్షాల్లోకి వలస వెళ్లడం విడ్డూరమన్న వాదన కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. శాసనసభలో అధికారానికి, అనధికారానికి నంబర్ గేమ్ ప్రధానమని తెలిసినప్పటికీ అధికార పక్షం నుంచి ఎమ్మెల్యేలు ఎగిరిపోకుండా చూసుకోవడంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ప్రాధాన్యమివ్వడంలేదన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉంది.

పార్టీలోని కీలక నేతల అనైక్యతే ఇందుకు కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ప్రభుత్వ చీఫ్‌విప్ పదవి నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్నప్పటికీ దానిని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపడంలేదన్న విమర్శలు ఉన్నాయి. అదే విధంగా శాసనసభ్యుల్లో నెలకొన్న అసంతృప్తిని తెలుసుకునే ప్రయత్నాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం చేయడం లేదని పార్టీ నేతలు వాపోతున్నారు.

"శాసనసభ్యులను బిజీగా ఉంచడంలో భాగంగా శాసనసభా కమిటీలను వేయడం, అధ్యయనం కోసం వారిని వివిధ ప్రాంతాలకు పంపించడం వంటి చర్యలను సీఎం చేపట్టడం లేదు. ఇటీవలి కాలంలో శాసనసభ్యులతో ఇటు సీఎం గానీ, అటు పీసీసీ అధ్యక్షుడు గానీ సమావేశాలను నిర్వహించిన దాఖలాలే లేవు. పార్టీలోని తెలంగాణ ఎమ్మెల్యేల్లో అంతకంతకు పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నాలు జరగకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం'' అని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు రాజయ్య, సోమారపు సత్యనారాయణ వ్యవహారాన్ని వారం రోజులకిందటే వరంగల్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాజయ్యతో విడిగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. జూపల్లి, సోమారపు సత్యనారాయణలతో కూడా మాట్లాడాలని చెప్పారు.

అయితే ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరగలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే.. మున్ముందు మరిన్ని వలసలు తప్పవని.. కాంగ్రెస్ సర్కారు మైనార్టీలో పడే ప్రమాదం ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగి.. భవిష్యత్తులో అవిశ్వాస తీర్మానం కనుక వస్తే ప్రతిపక్షాల శాసనసభ్యులు ఇప్పటికే స్పీకర్ ముందుంచిన రాజీనామాలు ఆమోదించి తద్వారా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడం మినహా మరో గత్యంతరం సర్కారుకు లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సర్కారును కూల్చేందుకు టీడీపీ సిద్ధమవుతుందా?
కాంగ్రెస్ గూటి నుంచి ఎమ్మెల్యేలు చేజారి పోయినా కూడా.. 'కిరణ్ సర్కార్ బల నిరూపణ' ఎదుర్కోవడం అన్నది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపై ఆధారపడి ఉంటుంది. సర్కారుకు వ్యతిరేకంగా శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే కిరణ్ ప్రభుత్వ భవితకు ముప్పు ఎదురవుతుంది. అయితే.. అసెంబ్లీ శీతాకాలం సమావేశాల్లో రైతు సమస్యలపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

దీనికితోడు రాజకీయంగా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో టీడీపీపై ఒత్తిడి ఉంది. అయినప్పటికీ.. సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ నిజంగా ప్రవేశపెడుతుందా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సీమాంధ్రలో జగన్‌కు, తెలంగాణలో కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి... ప్రభుత్వాన్ని పడగొట్టే టంతటి సాహసం చేస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచే గాకుండా కాంగ్రెస్‌లోనూ వినిపిస్తున్నాయి.

"ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు పడిపోయి.. ఎన్నికలొస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్ బలం పుంజుకుంటుంది. సీమాంధ్రలో జగన్ లబ్ధి పొందుతాడు. కాబట్టి.. మాకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా ప్రభుత్వాన్ని పడగొడితే.. దానివల్ల మా ప్రత్యుర్థులకే లాభం'' అని టీడీపీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే.. టీడీపీకే చెందిన మరికొంత మంది మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూసి విసిగి వేసారిన ప్రజలు తప్పకుండా తమకు తప్పకుండా పట్టంకడతారని కొంత మంది టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడంపై టీడీపీ ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోని ప్రస్తుత పరిస్థితుల్లో.. కిరణ్ సర్కార్‌కు తక్షణ ప్రమాదమేదీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
***********************************************************************************  • అధికారులకు సిఎం ఆదేశం
వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులను దారుణంగా హత్య చేసిన ఉన్మాదులపై వెంటనే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యువకులు ఇలాంటి హత్యలకు పాల్పడడం సరైంది కాదని, వారి భవిష్యత్‌ అంధకారంగా మారుతుందని అన్నారు. మృతి చెందిన స్వాతి, రఫియా అనే విద్యార్థినుల కుటుంబాలకు సిఎం ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు సిఎం కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

********************************************************************************

భారత్‌లో సాంస్కృతిక సంఘర్షణ
ఉత్తరాది, దక్షిణాది మధ్య పెరుగుతున్న దూరం
దక్షిణాదిలో పడిపోతున్న జనాభా పెరుగుదల రేటు

బెంగళూరు, అక్టోబర్ 30: ప్రపంచ జనాభా సోమవారంతో 700 కోట్ల మార్కును చేరబోతోంది. అదే సమయంలో, భారతదేశం విచిత్ర సమస్యలతో సతమతమవుతోంది. కూలీల వలస, ఇతర సామాజిక అంశాల కారణంగా జనాభా విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య దూరం పెరుగుతోంది. ఫలితంగా దేశంలో సాంస్కృతిక సంఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని బెంగళూరులోని ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛేంజ్ (ఐఎస్ఈసీ)లో పాపులేషన్ రిసెర్చి సెంటర్ అధిపతి ప్రొఫెసర్ కేఎస్ జేమ్స్ విశ్లేషించారు.

"ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే, దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా పడిపోతోంది. ఫలితంగా, దక్షిణాదిలో కూలీల కొరత పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వలసలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటున్నారు'' అని తెలిపారు. ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లోనే ఉన్నారని, ప్రపంచ జనాభా గతిని నిర్దేశించే స్థానంలో వారు ఉన్నారని ఆయన వివరించారు. జనాభా పెరుగుదలపై అవగాహన కల్పించేందుకే గతంలో ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకునేవారని, కానీ, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

2011 జన గణనలో దేశంలో జనాభా పెరుగుదలకు సంబందించి ఉత్తరాది, దక్షిణాది మధ్య స్పష్టమైన విభజన ఉందని, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా పడిపోతోందని, అసంఘటితరంగ కూలీల కొరత పెరుగుతోందని వివరించారు. వివిధ రాష్ట్రాల మధ్య జనాభాలో స్పష్టమైన విభజన, నిరుపేద కూలీల వలస దేశంలో మరింత సంఘర్షణకు కారణమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2011 జనగణనలో ఆరేళ్లలోపు వయసు చిన్నారుల పెరుగుదల రేటు తగ్గిన నేపథ్యంలో ఈ శతాబ్దం రెండో అంకానికి వచ్చే సమయానికి భారత జనాభా 160-180 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషించారు.

కొన్ని రాష్ట్రాల్లో వయోజనుల నుంచి వృద్ధుల వయసు ప్రధానంగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో యువత వయసు ప్రధానంగా ఉందని, వీటిని పరిగణనలోకి తీసుకునే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను నిర్ణయించుకోవాల్సి ఉందని వివరించారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరగడం, పెళ్లికి ముందు కలిసి ఉండేవారి సంఖ్య ఎక్కువ కావడం తదితరాలు పాశ్చాత్య దేశాల్లో ఆర్థిక, జనాభా మార్పులకు కారణమని, కానీ, అవే విషయాలు భారత్‌లోకి ఎలా చొచ్చుకొచ్చాయన్న విషయం ఆసక్తికరమని విశ్లేషించారు. సాంస్కృతిక, మతపరమైన కారణాలతో జనాభాలోని ఇతర వర్గాలు ఇటువంటి వైఖరిని అంగీకరించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.

'మేమిద్దరం, మాకిద్దరు' విధానానికి లింగ వివక్ష కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోందని, సమాజంలో మహిళలకు సమానస్థాయి కల్పించే విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయని, భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. కూలీల వలసతో సానుకూలతలు కూడా ఉన్నాయని, ఏ దేశ జనాభా మార్పులకైనా వలసలే ప్రధాన పాత్ర పోషిస్తాయని విశ్లేషించారు. విచిత్రం ఏమిటంటే.. అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి వలసల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆధారపడుతుంటే.. భారతదేశంలో రాష్ట్రాల మధ్యే ఇటువంటి విభజన రావడం విశేషమని వివరించారు.

ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాల్లోలా కాకుండా.. అక్షరాస్యత, ఆర్థికంగా ఎటువంటి ప్రగతి లేకుండానే భారత్‌లో సంతానం విషయంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నిరక్షరాస్య, నిరుపేద మహిళలు ఇద్దరు బిడ్డలకే ఓటు వేస్తున్నారని వివరించారు. ఫలితంగా, తమ పిల్లలకు మంచి విద్య చెప్పించాలన్న కోరిక వారిలో పెరుగుతోందని, కార్మిక శక్తిలోకి మహిళల సంఖ్య పెరుగుతోందని, దీర్ఘకాలంలో ఇది సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషించారు.

కుటుంబ నియంత్రణ ప్రచారంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, నిరుపేద, నిరక్షరాస్య మహిళలు చిన్న కుటుంబమనే విధానానికి ఓటేయడం రాష్ట్ర ప్రభుత్వాల విజయమని అభివర్ణించారు. ఇప్పటికీ జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణపై దృష్టి సారించాలని, గత పదేళ్లలో భారత్‌లో పట్టణ జనాభా గణనీయంగా పెరిగిందని వివరించారు.
*******************************************************************************************************

Saturday, October 29, 2011

కోటా ఏదైనా... ఫీజు ఒక్కటే!
హైకోర్టు ధర్మాసనం తీర్పు
ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య కోటాలకు ఏకీకృత ఫీజు
సంబంధిత ప్రక్రియను ప్రారంభించాలని ప్రవేశ, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ)కి ఆదేశం
ఫీజులపై జారీ చేసిన జీవోలు 76, 77, 85, 86 కొట్టివేత
ఫీజు ఖరారుకు ఒక్కో విద్యా సంస్థలో ఒక్కో కోర్సుకయ్యే తలసరి వ్యయాన్ని ఏఎఫ్‌ఆర్‌సీ పరిగణనలోకి తీసుకోవాలి
తలసరి వ్యయాన్ని లెక్కించే సమయంలో ఆ విద్యాసంస్థ ఖర్చులను లెక్కేయాలి
తర్వాత ఏఎఫ్‌ఆర్‌సీ చెప్పిన మొత్తాన్నే ఫీజుగా పరిగణించాలి
దాన్ని ఆ నిర్దిష్ట విద్యాసంస్థ ఫీజుగా ప్రభుత్వం నోటిఫై చేయాలి
ఎన్నారై కేటగిరీలో అధికంగా వసూలు చేసే ఫీజును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి
2010-11, 2011-12, 2012-13 విద్యాసంవత్సరాల
ఫీజు ప్రతిపాదనలను తాజాగా నోటిఫై చేయాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటాల కింద ఏకీకృత(ఒకే తరహా) ఫీజును ఖరారు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఏకీకృత ఫీజు ఖరారుకు అవసరమైన కసరత్తును ప్రారంభించాలని ప్రవేశ, ఫీజు నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)ని నిర్దేశించింది. ఈ కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటాల కింద ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 76, 85, 86తోపాటు దీనికి సంబంధించి ఏఎఫ్‌ఆర్‌సీ చేసిన సిఫారసుల తాలుకు జీవో 77ను కొట్టివేసింది. ఈ జీవోలు చట్టప్రకారం చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గోడా రఘురాం, జస్టిస్ పి.దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేటగిరీ-ఎ, కేటగిరీ -బి సీట్ల ఫీజు ఖరారుకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యా సంస్థలను కోరుతూ ఫీజు నియంత్రణ కమిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ.. జోసెఫ్ శ్రీ హర్ష మేరీ ఇంద్రజ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కె.వి.కె.రావుతో పాటు పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ధర్మాసనం ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్, తెల్లప్రోలు చరణ్‌లు చేసిన పలు వాదనలతో ఏకీభవించింది. ఒక్కో విద్యా సంస్థకు ఒక్కో కోర్సుకయ్యే తలసరి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఏకీకృత ఫీజును ఖరారు చేయాలని ధర్మాసనం తన 102 పేజీల తీర్పులో ఏఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. తలసరి వ్యయాన్ని లెక్కించే సమయంలో సదరు విద్యా సంస్థలో ఉన్న మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పెట్టిన పెట్టుబడులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాలు, భవిష్యత్ అభివృద్ధి కోసం ఉన్న మిగులు, నిర్వహణ, విస్తరణకయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ విధంగా ఒక్కో విద్యా సంస్థ ఒక్కో కోర్సు తలసరి వ్యయాన్ని లెక్కించిన అనంతరం ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు చేసినదాన్నే.. ‘ఫీజు’గా పరిగణించాలని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్దిష్ట విద్యాసంస్థ ఫీజుగా నోటిఫై చేయాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

ప్రతి విద్యా సంవత్సరంలో మార్చి మొదటివారానికల్లా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పింది. ఏదైనా ఒక వర్గానికి చెందిన విద్యార్థి విద్యకయ్యే ఖర్చును ప్రభుత్వం గ్రాంట్, లోన్, లేదా ఇతర పద్ధతుల ద్వారా భరించాలనుకుంటే, అందుకు ఓ విధానాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తెలిపింది. ఏదైనా ఒక విద్యార్థి ఫీజును మొత్తంగా గానీ, కొంత భాగంగా గానీ రద్దు చేయాలనుకుంటే.. దానిపై ఆ విద్యాసంస్థ ఓ విధానాన్ని రూపొందించుకోవచ్చునని పేర్కొంది. ఎన్నారై కేటగిరీ కింద చేరే విద్యార్థులకు ఏఎఫ్‌ఆర్‌సీ ఎక్కువ ఫీజును నిర్ణయించవచ్చునని , దానిని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని తెలిపింది. ఈ కేటగిరీ(కేటాయించిన సీట్లలో 15 శాతం మించకూడదు) కింద వసూలు చేసే ఫీజును ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఓ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, అయితే ఈ ఆదేశం ప్రభుత్వం లేదా ఫీజుల నియంత్రణ కమిటీ జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

తీర్పులో ముఖ్యాంశాలివీ..

ఒక విద్యార్థి నుంచి వసూలు చేసిన ఫీజుతో మరో విద్యార్థికి ఫీజు రాయితీ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. ఆ విధంగా ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సులు ఉండరాదు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేం. ఫీజు ఖరారు సిఫార్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం, దానిని నోటిఫై చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విద్యా సంస్థ తలసరి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదు. అందువల్లే ఒక విద్యార్థి నుంచి వసూలు చేసిన ఫీజుతో మరో విద్యార్థికి ఫీజు రాయితీ కల్పించడం జరుగుతోంది.

ప్రతి ప్రైవేటు అన్ ఎయిడె డ్ విద్యా సంస్థలో ప్రవేశం పొందే విద్యార్థి నుంచి వసూలు చేసే ఫీజులో.. ఆ విద్యా సంస్థ తలసరి వ్యయం ప్రతిబింబించాలి.
ఎన్నారై కేటగిరీ కింద అధికంగా వసూలు చేసే ఫీజులను ఓ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. దానిని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ప్రయోజనం కోసం ఉపయోగించాలి. ఈ మొత్తాలను ఏ విధంగా ఉపయోగించబోతోంది? ఎవరి కోసం ఉపయోగించబోతోంది తదితరాలను ప్రభుత్వం నోటిఫై చేయాలి.

విద్యార్థులు ఏ కేటగిరీ, బీ కేటగిరీలో ప్రవేశం పొందినప్పటికీ.. ఫీజు ప్రతిపాదనల కోసం నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో అన్ని కేటగిరీ విద్యార్థులకు ఏకీకృత ఫీజు ఉంటుందనే విషయాన్ని అందులో చేర్చాలి. ఎన్నారై కేటగిరీ విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేసే విషయాన్ని కూడా ప్రస్తావించాలి.
ఆదాయ, వ్యయాలు, ఆస్తిఅప్పుల పట్టీలు, జీతభత్యాలు, మౌలిక సదుపాయాల తాలూకు వివరాలను ఏదైనా విద్యా సంస్థ అందచేయకుంటే.. ఆ విద్యాసంస్థ ఎటువంటి ఫీజును వసూలు చేసుకునేందుకు అవకాశం లేదనే విషయాన్ని ఫీజుల నియంత్రణ కమిటీ కూడా తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాలి. నోటిఫై చేసే సమయంలో ప్రభుత్వం ఇదే విషయాన్ని విధిగా రికార్డ్ చేయాలి.

వివిధ కోర్సుల్లో విద్యను అందించే విద్యాసంస్థల్లో ఫీజును ఖరారు చేసేందుకు ఫీజుల నియంత్రణ కమిటీ చేసే సిఫారసులను ప్రభుత్వం నోటిఫై చేయాలి. దీని వల్ల విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజుల నియంత్రణ కమిటీ ఫీజు ప్రతిపాదనలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫీజు ఖరారు నోటిఫికేషన్ జారీ చేసే విద్యా సంవత్సరానికి ముందు ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఈ ప్రక్రియ జరగాలి.

వివిధ ప్రైవేటు అన్ ఎయిడెడ్‌విద్యా సంస్థల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించే ప్రక్రియను, తదానుగుణ బాధ్యతలను ఫీజుల నియంత్రణ కమిటీ ఔట్‌సోర్స్ చేయవచ్చు. తమకు వచ్చే ప్రతిపాదనలను, వాటి వివరాలను ఆ ఔట్‌సోర్స్ ఏజెన్సీ పత్రికా ప్రకటనల ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలి. విద్య సంస్థలు సమర్పించే ప్రతిపాదనల్లో లాభదాయకత ఉందా? తదితర అంశాలకు సంబంధించిన విషయాలను ఆ ఏజెన్సీ రికార్డ్ చేయాలి.

ఔట్‌సోర్స్ ఏజెన్సీలు తయారు చేసే నివేదిక, సిఫార్సు కాపీలను ఫీజుల నియంత్రణ కమిటీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు పంపి, ఫీజు ఖరారు ప్రతిపాదనలను ఆహ్వానించాలి. ఈ సమయంలో ఫీజు ఖరారు కోసం అవసరమయ్యే సమాచారాన్నంతా విద్యా సంస్థలు ఈ కమిటీకి అందచేయాలి.

ప్రభుత్వానికి సమర్పించే సిఫార్సులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏఎఫ్‌ఆర్‌సీ చర్యలు తీసుకోవాలి.
2010-11, 2011-12, 2012-13 విద్యా సంవత్సరాలకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు సమర్పించే ఫీజు ఖరారు ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని అంశాలను పరిశీలించి, ఏదైనా సమాచారం కావాలనుకుంటే సదరు విద్యా సంస్థకు ఫీజుల నియంత్రణ కమిటీ నోటీసు జారీ చేసి మరీ తెప్పించుకోవచ్చు.

పరిశీలన పూర్తయిన తరువాత ఫీజు ఖరారుకు సంబంధించి తయారు చేసే సిఫార్సుల నివేదికలో ఫీజు వారీగా ప్రతి కోర్సుకయ్యే వ్యయాన్ని అందులో ప్రస్తావించాలి.

2010-11, 2011-12, 2012-13 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేయాలి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రక్రియను వీలైనంత వేగంగా ప్రారంభించాలి. నేటి నుంచి మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి.

**********************************************************************************

చేతిలో 'కారు' చిచ్చు
'గులాబీ ఆకర్ష్'తో కాంగ్రెస్ అతలాకుతలం
ఒకే రోజు చెయ్యివ్వనున్న ముగ్గురు ఎమ్మెల్యేలు

పార్టీకి జూపల్లి, రాజయ్య, సోమారపు గుడ్‌బై!
నేడో రేపో 'కారు' ఎక్కడం ఖాయం
వద్దని ఎంపీలు వారించినా ససేమిరా
సోమారపుతో బొత్స మంతనాలు విఫలం
వారి బాటలోనే మరికొందరు శాసనసభ్యులు
హైదరాబాద్, అక్టోబర్ 29 : కాలచక్రం తిరగబడింది. ఒకప్పుడు కాంగ్రెస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' తాకిడికి తల్లడిల్లిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఆకర్ష్ గులాబీతో అదే కాంగ్రెస్‌ను అతలాకుతలం చేస్తోంది. నిన్నమొన్నటి దాకా టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రమే తమవైపు లాక్కుంటూ వచ్చిన గులాబీ దళాధిపతి కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించారు.

ఫలితంగా.. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు 'కారు' ఎక్కబోతున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించారు.

సకల జనుల సమ్మె ముగిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో ఈ ముగ్గురు శాసనసభ్యుల నిర్ణయం అధికార కాంగ్రెస్ పార్టీని కష్టాల్లో పడేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికిప్పుడు కొంప మునిగిపోయే ప్రమాదం లేకపోయినా, మున్ముందు వలసలు తీవ్రమైతే పార్టీ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు, స్వతంత్ర సభ్యులు అధికారంలో ఉన్న పార్టీవైపు చూడటం, అందులో చేరే ప్రయత్నాలు చేయడం ఆనవాయితీ. కానీ, 'చేతి'లో మరో రెండున్నరేళ్లు అధికారం ఉండగా పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సిద్ధమవుతున్నారు.

వీరి బాటలోనే నడిచేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మరి కొంద రు నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక మాజీమంత్రితో పాటు అతని అనుంగు ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు కూడా టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ వలసలు ఉధృతంగా ఉంటాయని వారంటున్నారు.

ప్రధానంగా వచ్చే నెల ఆరోతేదీ చాలా కీలకమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ రోజు నాటికి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు పతాకస్థాయికి చేరుకుంటాయని వారు వివరిస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలోకి వస్తారంటూ టీఆర్ఎస్ ముఖ్యనేతలు ప్రకటిస్తున్నారు. ఈ మాటలకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి వలసలు ఉండబోవని సీఎం కిరణ్‌తో పాటు పీసీపీ చీఫ్ బొత్స కూడా భావిస్తూ వచ్చారు.

అయితే.. శనివారం ముగ్గురు ఎమ్మెల్యేల నిర్ణయంతో ఉలికిపాటుకు గురయ్యారు. ఈ సమాచారం తెలియగానే సోమారపు సత్యనారాయణతో పీసీసీ చీఫ్ బొత్స ఫోన్‌లో మాట్లాడారు. పార్టీకి గుడ్‌బై చెప్పే విషయం నేరుగా చెప్పకుండా పార్టీలో తనకు ఎదురవుతున్న కష్టాల గురించి బొత్సతో సోమారపు ఏకరువు పెట్టారు. కాగా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో శనివారం జరిగిన సమావేశంలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాధం, వివేక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్యలకు శాసనసభ్యులు పార్టీని వీడుతున్న విషయం తెలిసింది.

అప్పుడే తొందర పడొద్దంటూ సోమారపును వారించేందుకు వివేక్ ప్రయత్నించినా, సోమారపు అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూపల్లి, సోమారపు, రాజయ్య తమ అనుచరులతో కలసి ఆదివారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తర్వాత నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకుంటారు. కాగా.. ఈ ముగ్గురు శాసనసభ్యులు గులాబీ కండువాను కప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని, కొంతకాలంగా పార్టీకి దూరమవుతారనే సంకేతాలను ఇస్తున్నారని కాంగ్రెస్‌నేతలు పేర్కొంటున్నారు.

అధినేతల వ్యవహార శైలి మారాల్సిందే
కాంగ్రెస్ పార్టీ నుంచి మరిన్ని వలసను నివారించాలంటే రాష్ట్ర అధినేతల వ్యవహారశైలి మారాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధానంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని పోవాలని అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాము అధికార పక్షంలో ఉన్నా, పార్టీలో తగిన గుర్తింపు దక్కట్లేదన్న అసంతృప్తే వలసలకు ప్రధాన కారణమని కొందరు నేతలు చెబుతున్నారు.

నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు కాకపోవడం, నామినేటెడ్ పదవులు భర్తీకి నోచుకోకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పేరుకుపోయిందని కూడా వారు అంటున్నారు. మరికొందరు నేతలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించ డం లేదు. తెలంగాణ వాదం ముందు అధికార, ప్రతిపక్షాలనే పదాలకు తేడాలేకుండా పోయిందని, ప్రత్యేక రాష్ట్ర వాదనను ఎక్కువగా వినిపించేవారి వెం ట వెళ్లడమే శ్రేయస్కరమన్న అభిప్రాయంతో నేతలు ఉన్నారని అంటున్నారు.

మొదటి నుంచీ ధిక్కారస్వరమే
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య మొదట్నుంచి తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. పార్టీలో దూకుడుగా ముందుకు పోతూ తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపిస్తున్న రాజయ్య తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పడానికే నిర్ణయించుకున్నారు. నిజానికి ఆయనతో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి ఆయన వెంట వెళ్తారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. కానీ, ఇంతలో ఉద్యమం బలపడటంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఇటీవల జేఏసీ పిలుపు మేరకు కాజీపేట రైల్వేస్టేషన్‌లో రైలురోకోలో పాల్గొన్నందుకు రాజయ్యపై కేసులు నమోదయ్యాయి. చివరకు ఆయన కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికి టీఆర్ఎస్‌లో చేరడానికి ముందుకు కదిలారు.

దీపావళి రోజే ప్రతిపాదన
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ దీపావళి రోజున తన అనుచరులతో సమావేశమై టీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రతిపాదనను వారి ముందుపెట్టారు. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్ ఉండకపోగా ఇబ్బందులు తలెత్తుతాయని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైతేనే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్‌లో చేరాలనే ఆయన నిర్ణయించుకున్నారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా రామగుండం నుంచి గెలుపొందిన ఆయన వైఎస్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

సకల జనుల సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు ఇటీవల సమ్మె చేసినప్పుడు సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. సమ్మె విషయంలో తనపై సీఎం ఒత్తిడి తెచ్చారని బహిరంగంగా చెప్పారు. అప్పటినుంచే ఆయనకు కాంగ్రెస్ మంత్రులతో సంబంధాలు దాదాపు తెగిపోయాయి. రైల్‌రోకోలో పాల్గొనడంతో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఉద్యమంలో చురుగ్గా ఉండటంతో పాటు సొంతంగా బలమైన కేడర్ కలిగి ఉన్న వ్యక్తి కావడంతో టీఆర్ఎస్ కూడా ఆయనపై ఆసక్తి కనబరిచింది.
*******************************************************************
‘చెల్లింపు’ నేరాలకు చెంపపెట్టు
సంపాదకీయం
సమాజ పురోగమనంలో సామాన్యుడికి సైతం చోటివ్వడానికి... తన ఆకాంక్షలేమిటో, అవసరాలేమిటో... వాటిని తీర్చడానికి ఎలాంటి విధానాలు అవలంబించాలో అతడు తెలియజెప్పడానికీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానం అవకాశం ఇచ్చింది. అయితే, మన దేశంలో క్రమేపీ ఎన్నికలే ప్రజాస్వామ్యమనేంతగా పరిస్థితి మారిపోయింది. మరోపక్క జీవితంలోని అన్ని పార్శ్వాలనూ తాకవలసిన ప్రజాస్వామ్య విలువలు లుప్తమవుతూ వచ్చాయి.

పర్యవసానంగా ప్రజాస్వామ్య మూలస్తంభాలుగా భాసిల్లవలసిన వ్యవస్థలకు చీడపట్టడం మొదలైంది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించి మరింత తేజోవంతం కావలసిన ప్రజాస్వామ్యం ఇలాంటి లోటుపాట్లతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రజాభిప్రాయాన్ని ప్రబలంగా ప్రతిబింబించాల్సిన ఎన్నికలు ధన బలం, నేరగాళ్ల ప్రవేశంతో ప్రహసనప్రాయంగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతోంది. దీన్ని సరైన మార్గంలో నడిపించడానికీ, లోపరహితంగా మార్చడానికీ అసలు ప్రయత్నాలే జరగడం లేదనడం సత్యదూరమే అవుతుంది. అయితే, వీటిని వమ్ము చేయడానికి అక్రమార్కులు సాగిస్తున్న సృజనాత్మక ఆలోచనలకూ కొదవలేదు. పర్యవసానంగానే ‘పెయిడ్ న్యూస్’ (చెల్లింపు వార్తలు) అనే భూతం పుట్టుకొచ్చింది.

గత కొన్నేళ్లుగా ఎన్నికల విధానాన్నే పరిహసిస్తున్న ఈ భూతం పనిపట్టడానికి అటు ఎన్నికల సంఘం, ఇటు ప్రెస్ కౌన్సిల్, జర్నలిస్టు సంఘాలు నడుంకట్టాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ కూడా జరిగింది. మొదట ఏ దోవలో వెళ్లి దీన్ని అరికట్టాలన్నదానిపై మల్లగుల్లాలు పడిన ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను రూపొందించడంతోపాటు, ఎన్నికల సమయంలో ప్రత్యేక నిఘా యంత్రాంగం ఏర్పాటువంటి చర్యలు కూడా తీసుకుంది. కఠిన చర్యలకూ సంకల్పించింది. దీని ఫలితంగానే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ విధానసభ సభ్యురాలు ఉమలేష్ యాదవ్‌పై అనర్హత వేటు పడింది.

డి.పి. యాదవ్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ పరివర్తన్‌దళ్ సభ్యురాలైన ఉమలేష్ రెండు హిందీ దినపత్రికల్లో తన గురించి గొప్పగా ‘రాయించుకుని’ అందుకు చెల్లించిన మొత్తాన్ని ఎన్నికల వ్యయంలో చూపలేదన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయమై ఆమె ప్రత్యర్థి అటు ప్రెస్ కౌన్సిల్‌కూ, ఇటు ఎన్నికల కమిషన్‌కూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిగింది. ప్రెస్ కౌన్సిల్ ఆమెపై ఇచ్చిన నివేదికను ఆమోదించిన ఎన్నికల కమిషన్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10-ఏ కింద ఉమలేష్‌ను దోషిగా నిర్ధారించింది. మూడేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా ఆమెపై నిషేధం వేటు వేసింది. అంటే, ఆమె మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదన్న మాట. జన బలం బొత్తిగా కొరవడి, కేవలం ధన రాజకీయాలు నడిపిస్తున్న శక్తుల వెన్నులో ఈ చర్య వణుకు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంతమందిలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సైతం ఉన్నారు. వీరిలో అశోక్ చవానైతే ఇలాంటి ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని బొంబాయి హైకోర్టుకెక్కి భంగపడ్డారు కూడా.

ఉమలేష్ యాదవ్ కేసులో ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ‘రాయించుకున్న’ వార్తలకు చెల్లించిన మొత్తాన్ని ఎన్నికల వ్యయంలో చూపకపోవడం ఒక్కటే ఆమె చేసిన నేరం కాదని, దానితోపాటు ఆ చర్య ద్వారా ఓటర్లను పక్కదోవపట్టించడం, మోసగించడంలాంటి నేరాలకు సైతం ఆమె పాల్పడ్డారని భావిస్తున్నట్లు సంఘం వ్యాఖ్యానించింది. పెయిడ్ న్యూస్ అనే భూతం ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమైనదో ఈ ఉత్తర్వు ద్వారా ఎన్నికల సంఘం అందరికీ తెలియజెప్పింది.

అయితే, ఇక్కడితోనే సంతృప్తిచెందితే ఎన్నికల్లో ధనబలాన్ని రూపుమాపాలన్న సమున్నత లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాదు. పెయిడ్ న్యూస్ ద్వారా ఆమె ఓటర్లను మోసగించారని, మభ్యపెట్టారని నిర్ణయానికొచ్చినప్పుడు అందుకు అవకాశం ఇచ్చిన మీడియా సైతం ఆ నేరాల్లో పాలుపంచుకున్నట్లే. ఈ వ్యవహారంలో ఆ రెండు పత్రికలూ ‘నైతిక విలువల ఉల్లంఘన’ నేరానికి పాల్పడ్డాయని ప్రెస్ కౌన్సిల్ అభిప్రాయపడటం గమనార్హం. వార్తకూ, వ్యాపార ప్రకటనకూ ఉండే వ్యత్యాసాన్ని చెరిపేసే ఈ వికృత పోకడ పర్యవసానాలు ఏమిటో గ్రహించగలిగిన ఏ మీడియా సంస్థ అయినా కాసుల కోసం ఇలా దిగజారదు.

మన జాతీయోద్యమం ప్రజాజీవన రంగంలోకి తీసుకొచ్చిన విలువలకు ఎడంగా జరగడంవల్లే ఇలాంటి అనర్థాలన్నీ సంభవిస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అందుకనుగుణంగా విధానాలను సవరించుకోని సంస్థల వైఖరి కూడా ఇందుకు దోహదపడుతోందని గుర్తించాలి. ఉదాహరణకు అభ్యర్థుల ఖర్చు పరిమితి విషయంలో ఎన్నికల సంఘం పాటిస్తున్న నిబంధననే తీసుకుంటే లోక్‌సభ అభ్యర్థికి రూ. 25 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థికి రూ. 10 లక్షలు నిర్దేశించారు. ఈ పరిమితికీ, వాస్తవానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో ఎవరినడిగినా చెప్పగలుగుతారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతి సందర్భంలోనూ ఎన్నికల సంఘం నిర్వహించే అఖిలపక్ష సమావేశాల్లో వివిధ రాజకీయ పక్షాలు దీన్ని, మరికొన్ని సమస్యలనూ ప్రస్తావిస్తూనే ఉన్నాయి. మరి ఎన్నికల సంఘం పెద్దలు తక్షణ చర్యకు ఎందుకు ఉపక్రమించరు? మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను మనమే గౌరవించుకోకపోతే, వాటి క్షీణతలో భాగస్వాములమైతే ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ప్రజాస్వామ్య సౌధాన్ని మనమే కూల్చుకున్నట్లవుతుంది. మీడియా అయినా, రాజకీయ పక్షాలైనా, రాజ్యాంగ సంస్థలైనా దీన్ని గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
*************************************************************************************************************

‘మనసుబావి’లో
లోపలే
మగ్గిపోకు, బుగ్గిగాకు
బాధల్ని బైటపెట్టి వ్యధల్ని పంచిపెట్టు
వెలుపలికిరా..
మూతపెట్టిందేది ముక్కిపోక తప్పదు
గాలాడక వెల్తురులేక..
‘మనసుబావి’లోని దిగులు తోడు
తోడుకై ఎదురుచూడు..
పసిడిదాచుకో, పచ్చనోటుదాచుకో
సమస్యలు, వైఫల్యాలు అవమానాలు కాదు...
కర్చిఫ్‌లో
మడ్చేయకు, ముడేయకు
ఇతరుల్తోనో ఇష్టుల్తోనో చెప్పుకో..
పాతుకుపోయిన నిరాశల్ని
పేరుకుపోయిన నిస్పృహల్ని
రహస్యం గానీయకు...
విజయాన్ని చెప్పినట్టే
గౌరవాల్ని చాటినట్టే
కడుపులోని పుట్టెడుదుఃఖాన్ని కూడా
కక్కేసులో...
కడ్గేసుకో...
మాయా మోహ జీవుడా
గుండె చీకటి బొయ్యారమైతే
మాట వెల్గవుతుందా?
దాక్కున్న వాడిముందు
లోపలితలుపుల్ని బద్ధలు చేయనివాడియందు
ఆనందం అవిరే...
ప్రాణసంకటంలోనూ పైకి మందస్మితమా?
ఘర్షణల్ని బైట పెట్టు...
ఆశల ఆకుల గుడిసెలో తలదాచుకున్నా
తేజోమయి శరీరంతో
కళ్ళల్లో కలువలు విరిసి విప్పారిన మొహంతో...
ఉజ్జ్వలకాంతితో...
- కోటం చంద్రశేఖర్‌

Friday, October 28, 2011

ఫైర్
T ఫర్ తెలంగాణ
T ఫర్ టీఆర్ఎస్
T ఫర్ టెండర్
T ఫర్ తిట్లు
టీఆర్ఎస్ టీడీపీ వాగ్యుద్ధం
సవాళ్లు - ప్రతిసవాళ్లతో సై అంటే సై

విమర్శలపై కేసీఆర్ ఘాటు స్పందన
నమస్తేలో నా పెట్టుబడి రూ.4 కోట్లు
అదీ అప్పుగా తెచ్చిందే.. రాజం మిత్రుడే
టెండర్ల గురించి నాకు తెలియదు
నాకున్నది 24 ఎకరాలు, రెండు ఇళ్లు
ఆస్తులపై చర్చకు సిద్ధం
క్షమాపణ చెప్పకుంటే దావా: కేసీఆర్
దీటుగా ప్రతిస్పందించిన టీడీపీ
పోల'వరం' కోసం ఉద్యమం తాకట్టు
సమ్మె నీరుగార్చినందుకు అది నజరానా
రెండు గంటల్లోనే ఢిల్లీలో ఒప్పందం
నమస్తేలో సీమాం«ద్రుల పెట్టుబడులు
పోలవ రంపై చర్చకు రావాలి
టీడీపీ తెలంగాణ ఫోరం హెచ్చరిక
ఛీ.. అంటే ఛీ ఛీ! థూ.. అంటూ థూ థూ థూ! మాటకు మాట... తిట్టుకు తిట్టు! టీడీపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ తెలంగాణ ఫోరం నేతలు రెండు మూడు రోజులుగా చేస్తున్న విమర్శలపై శుక్రవారం కేసీఆర్ స్పందించారు. రకరకాల పదాలు ప్రయోగిస్తూ... తనదైన శైలిలో చెలరేగిపోయారు. సకల జనుల సమ్మె విరమణ అనంతరం తొలిసారిగా విలేకరుల ముందుకు వచ్చారు. టీడీపీ ఆరోపణల నేపథ్యంలో కొంత వివరణాత్మకంగా మాట్లాడారు. పోలవరంపై తాము వేసిన కేసుల ఫైళ్లు అంటూ... కట్టల కొద్దీ ఫైళ్లతో సహా కదిలి వచ్చారు. 'నమస్తే తెలంగాణ' ఎండీ లక్ష్మీరాజం తన మిత్రుడే అని స్పష్టం చేశారు. అయితే... రాజం కాంట్రాక్టులు, ఇతర వ్యాపారాలతో తనకు సంబంధం లేదన్నారు.

'నమస్తే'లో రూ.4 కోట్లు, టీ-చానల్‌లో రూ.55 లక్షలు పెట్టుబడి పెట్టానని, అది కూడా తమ పార్టీ నేత వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాసరావు నుంచి అప్పుగా తీసుకున్నానని చెప్పారు. "మెదక్ జిల్లాలో 24 ఎకరాలు... హైదరాబాద్, కరీంనగర్‌లలో ఇళ్లు. ఇవే నా ఆస్తులు. ఇంతకు మించి ఒక్క రూపాయి ఉన్నా, దేనికైనా సిద్ధం'' అని కేసీఆర్ ప్రకటించారు. 'రెండెకరాల చంద్రబాబు' అని పదే పదే అన్నారు.

'నేను ఏం చేసినా బాజప్తా చేస్తా! బాబుదే బినామీ బతుకు' అని విమర్శించారు. టీడీపీ నేతలు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేసి కోర్టుకు, బజారుకు ఈడుస్తానని హెచ్చరించారు. కేసీఆర్ మీడియా సమావేశం ముగిసీ ముగియగానే... టీడీపీ నేతలూ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ విమర్శలు, తిట్లకు దీటుగా బదులిచ్చారు. తమ ఆరోపణలకు సూటిగా బదులివ్వకుండా... నాలుగు తిట్లు తిట్టి దులుపుకోవడం సిగ్గుమాలినతనమని మండిపడ్డారు.

పోలవరం టెండర్ల ఖరారులో కేసీఆర్ హస్తం నిజమని, దీనిని రుజువు చేయలేకపోతే 32 మంది ఎమ్మెల్యేలం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్‌కు లగడపాటితోనూ సంబంధాలున్నాయని ఆరోపించారు. 'కేసీఆర్ ఒక 420, దుబాయ్ పంపిస్తానంటూ పాస్‌పోర్టులు అమ్ముకోవడంతో ఆయన జీవితం ప్రారంభమైంది' అని ఆరోపించారు. అటు కేసీఆర్, ఇటు టీడీపీ నేతలు 'బూట్ పాలిష్' పదాలను ప్రయోగించుకున్నారు. 'చర్చకు సై' అని సవాళ్లు విసురుకున్నారు. కేసీఆర్ ఆస్తులపై చర్చకు సిద్ధమని ప్రకటించగా... టీడీపీ నేతలు పోలవరంపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.

కేసీఆర్‌పై టీడీపీ నేతలు..
కేసీఆర్ 420..పాస్‌పోర్టులు అమ్ముకున్నాడు
తెలంగాణ ద్రోహి.. రాజకీయ దళారీ
కాంగ్రెస్ నేతల బూట్లు తుడిచారు
తెలంగాణ నీ అబ్బ జాగిరా?
టికెట్ల నుంచి అన్నీ అమ్ముకోవడమే
రాత్రింబవళ్లు తాగి తందనాలు
ఆమరణ దీక్ష పేరిట తిని కూర్చున్నావు
తెలంగాణలోనీ డ్రామా ఖతం
పిట్టల దొరలా అబద్ధాలు
సిగ్గూ శరం లేని నీ గురించి...
సొల్లు వాగుడు... తుపాకీ ఎంకట్రాముడు
ఉద్యమం ముసుగులో లంగ ప్రయత్నాలు

చంద్రబాబు మీద కేసీఆర్..
బాబుది బినామీ బతుకు
లత్కోరు రాజకీయాలు
నమ్మక ద్రోహి, మిత్రద్రోహి
యూజ్ అండ్ త్రో పాలసీ
నకిలీ పాలన, పొద్దున లే స్తే కుట్రలే!
50 మందిని తెస్తాడట ఈ మొనగాడు
నా బొంద, (ఆయనకేం) తెలుసు

టీడీపీ నేతల మీద..
తొట్టిగ్యాంగ్
దేభ్యం మొహాలు, కుక్క మొరుగుళ్లు
కారుకూతలు, వెధవ కూతలు
పిచ్చి ప్రేలాపనలు, సిగ్గుండాలి
చంద్రబాబు తాబేదారులు
చంద్రబాబుకు బూట్ పాలిష్
బుడ్డర్ ఖాన్ దేవేందర్‌గౌడ్
రంగులు మార్చే మోత్కుపల్లి
ఎర్రబెల్లి కూడా ఓ లీడరే!
బజారుకు లాగుతాం
************************************************************************************************************

జనవాక్యం

సంచార జాతులకు విముక్తి ఎప్పుడు?
దాసరి, మేదరి, జోగి, జంగమ, కైకాడి, గంగిరెద్దుల, బుడబుక్కల, కాటికాపల, బాలసంతు, బహురూపి, దొమ్మరి వంటి కులాలెన్నో ఆర్థిక సామాజిక ఫలాలు అందక, దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ, భిక్షాటన చేస్తూ, సమాజంలో తలెత్తుకుని తిరగలేని స్థితిలో ఉన్నారు. కొన్ని తెగల వారు నేరస్త తెగలు అన్న అపవాదును మోస్తున్నారు. కొన్ని కులాల పేర్లు సమాజంలో తిట్టుపదాలుగా వాడుకలో ఉండడం వల్ల ఆత్మన్యూనతతో బతుకులీడుస్తున్నారు.

విముక్త సంచార తెగలకు సామాజిక న్యాయాన్ని అందించాలన్న అభిలాషతో కేంద్ర ప్రభుత్వం 2006లో బాలకృష్ణ రెనకె అధ్యక్షతన ఒక జాతీయ కమిషన్‌ను నియమించింది. రెనకె కమిషన్ మూడు సంవత్సరాల పాటు ఈ జాతుల మీద అధ్యయనం చేసి 2008 జూలై 2న తన నివేదికను ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకు సమర్పించింది. కనీస మానవ హక్కులు కూడా లభించక కునారిల్లుతున్న ఈ జాతులపై కమిషన్ నివేదిక వచ్చి మూడేళ్ళు గడిచినా కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవటం శోచనీయం.

కమిషన్ సిఫారసులు అమలయితే ఈ తెగల వారందరికీ ఎస్సీ, ఎస్టీలతో పరిపాటిగా 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు లభిస్తాయి. ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక కమిషను, ప్రత్యేక ఫైనాన్సు కార్పొరేషన్లు ఏర్పడతాయి. వీరి పిల్లల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు, ఈ జాతుల కోసం ప్రత్యేక ఆవాస యోజన, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు అమలవుతాయి. అందుకోసం విముక్త సంచార జాతులకై పార్లమెంటులో బిల్లు పెట్టాలి. రెనకె కమిషన్ చేసిన సిఫారసులు వెంటనే అమలు చేయాలి.
- మామిడిపల్లి కిషన్, మంచిర్యాల, ఆదిలాబాద్
************************************************************************************************************
పీఠం కోసం పోటీ నిజమేనా?
cmరాజులు, రాచరిక నిరంకుశత్వాలు పోయి ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పాటైనా అధికారానికున్న గ్లామరు, ప్రాధాన్యం అలాగే కొనసాగుతున్నాయి. ప్రజలలో ప్రజాస్వామిక చైతన్యం ఉన్నచోట, అంతగా లేని చోట కూడా అత్యున్నత అధికార పీఠాలు ఎవర్‌ గ్రీన్‌ హీరోల మాదిరిగా వెలిగిపోతూ ఉంటాయి. వాటిని అందుకోవాలన్న ఆరాటమూ రాజకీయ నాయకులలో దండిగా దట్టించి ఉంటుంది. దేశ ప్రధాని అయ్యే అవకాశం కాళ్ళదగ్గరకు వచ్చినా పార్టీ అడ్డుపడి దానిని అందుకొని అనుభవించనీయకుండా చేసిందనే బాధ సిపిఎం అగ్రనేత, కీర్తిశేషులు జ్యోతిబసుకు ఏ మూలనో ఉండేదని అనుకునేవారు. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ సారథ్యంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఆరు మాసాల 10 రోజులు ప్రధాని పీఠాన్ని అలంకరించిన చంద్రశేఖర్‌ అంతటితో తన జన్మ ధన్యమైపోయిందనుకొన్నారు.

యునైటెడ్‌ ఫ్రంట్‌ హయాంలో ఒక్కొక్కరూ ఏడాదికంటె తక్కువ కాలం ప్రధానులుగా ఉన్న దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ కూ డా రాజకీయ పరమ పదాన్ని అందుకొన్నందుకు సంబరపడ్డారు. ప్రణబ్‌ ము ఖర్జీ, శరద్‌ పవార్‌ ఆ పీఠం మీద దృష్టి పెట్టుకున్నవారే. 84 సంవత్సరాల వయసులో ఎల్‌.కె. అద్వానీ కూడా ఇంకా ఆశ చంపుకోలేక మనోరథ యాత్రకు బయలుదేరారు. రాహుల్‌ గాంధీ అయితే తనకు తొందర లేదంటూ ఆ పదవికి దూరంగా ఉంటూనే ప్రజామోదంతో దానిని పొందాలనే ఆరాటంలో యుపి ఎన్నికల విజయమనే మత్స్య యంత్రాన్ని కొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు.

కేంద్రంలో ప్రధాని పదవి ఎటువంటిదో రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవి అటువంటిది. డి.శ్రీనివాస్‌ అంతటి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఏ రాజ్యసభ సభ్యత్వం కోసమో పాటు పడి సంపాదించుకోకుండా ఎమ్మెల్సీ ఎందుకయ్యారని కొంతమంది అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటారు. రాజ్యసభ సభ్యుడైతే అంతకు మించి మరేమీ ఉండదు. మహా అయితే కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వంలో సహాయ మంత్రి కాకుంటే క్యాబినెట్‌ మంత్రి అయ్యే అవకాశం అరుదుగా రావచ్చు, రాకపోవచ్చు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ అయితే క్యాబినెట్‌లో మంచి శాఖకు మంత్రి అయ్యే అవకాశంతో బాటు కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి కూడా కావచ్చు.

సకలజనుల సమ్మెతో అతలాకుతలమైపోయిన రాష్ట్రం అది విరమణ కావడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ది. తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా విధులకు హాజరవుతున్నారు. చాలా కాలం తర్వాత శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగబోతున్నది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించింది. పాలక పక్షం ఇంత వరకు పక్కన పెట్టిన కొన్ని కీలక రాజకీయ నిర్ణయాలను తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. అందులో ప్రధానమైనది మంత్రివర్గ విస్తరణ. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కొందరి రాజీనామాల వల్ల ఏర్పడిన ఖాళీల భర్తీతో బాటు అదనంగా మరికొందరిని క్యాబినెట్‌లోకి తీసుకోవలసి ఉన్నది. కాంగ్రెస్‌లో విలీనమైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు లేక ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిన అగత్యం ఉన్నది.

అందుచేత మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా, ఇవ్వదా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అధిష్ఠానం పచ్చ జెండా ఊపితే ఆయన పీఠం పదిలంగా ఉన్నట్టు, లేకపోతే ఏ డిఎస్‌నో, బొత్సనో, మరొకరినో నాల్గవ ముఖ్యమంత్రిగా రంగంలో దింపే అవకాశమున్నదనే అంచనాలు జోరుగా సాగుతున్నాయి. దీనితో బాటుగా ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి మధ్య పచ్చి గడ్డి కూడా భగ్గుమనే పరిస్థితి నెలకొన్నదనే కథనాలూ బయలుదేరాయి. వీటిని గమనిస్తే పాత తరం సినిమా రాజకీయాలు గుర్తుకు రాక మానవు.

అప్పట్లో వెండితెర హీరోలు ఎన్‌టిఆర్‌, ఎన్‌ఆర్‌ల మధ్య పోటీని పరాకాష్ఠకు తీసుకు వెళ్తూ ప్రచారం సాగేది. వారిద్దరికి మాటలు లేవని, ఒకరంటే ఒకరికి గిట్టదని చెప్పుకునేవారు. వారి అభిమాన సంఘాల మధ్య శీతాకాలపు చన్నీళ్ళు కూడా సల సల కాగే స్థాయి వేడి రగిలేది. అది సినిమా నిర్మాతలకు మంచి వ్యాపారం చేసిపెట్టేది. ఒకరి సినిమాకి మించి ఇంకొకరి సినిమా శతదినోత్సవాలు జరుపుకునేలా అభిమానులు పోటీ పడేవారు. మధ్య మధ్యలో గుండమ్మ కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలు వారిద్దరిని తెరమీద ఒకరి సరసన ఒకరిని చూసే అవకాశం కల్పించేవి. ఆ సినిమాలు కూడా ఘనంగా ఆడేవి. అటువంటి పోటీ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య ఏర్పడినట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

మొన్నీమధ్య వీరిద్దరూ ఢిల్లీ వెళ్ళినప్పుడు అధిష్ఠానం వద్ద ఎవరి గొప్పలు వారు చెప్పుకుని, పరస్పరం నిందించుకునే ఎత్తుగడలు రసవత్తరంగా నడిపించారని వార్తలు వచ్చాయి. తెలంగాణ ఉద్యోగుల చేత సమ్మె విరమింపచేసిన ఘనత తనదంటే తనదని అధిష్ఠానం వద్ద వీరు చెప్పుకున్నట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. వాస్తవానికి సుదీర్ఘ సమ్మెను విరమింపచేయడానికి గట్టి చర్యలు ప్రారంభమైంది ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళివచ్చిన తర్వాతనే. తెలంగాణపై రాజకీయ నిర్ణయం ఇప్పట్లో సాధ్యం కాదన్న దృఢ నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం సమ్మె విరమింపచేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చేతనైనవి చేసి సమ్మెకు తెర దించాలని ముఖ్యమంత్రికి స్పష్టం చేసింది. దానితో అస్పష్టత తొలగిపోయి ముఖ్యమంత్రి కార్యరంగంలోకి దిగారు. సమ్మె వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు కలుగుతున్న నష్టాలను గురించి స్వయంగా తానే మీడియాకు వివరించడం ద్వారా సమ్మెలోని ఉద్యోగులు పునరాలోచలో పడే పరిస్థితి కల్పించారు.

ఎవరిపైనా రాజకీయ విమర్శలు చేయకుండా వాస్తవ పరిస్థితిని గణాంకాలతో సహా వివరించి విజ్ఞతతో, నిగ్రహంతో వ్యవహరించారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు బొత్స రవాణా మంత్రి హోదాలో ఆర్‌టిసి యూనియన్‌ నాయకత్వాన్ని సమ్మె విరమణకు ఒప్పించడంతో ఉన్నపళంగా పరిస్థితిలో మార్పు మొదలైంది. ఉక్కు పిడికిలిని తలపించిన సమ్మె సడలడం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ, దానం నాగేందర్‌ వంటి మరి కొందరు మంత్రులూ తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసి సమ్మె విరమణకు ఉద్యోగుల నాయకులను మానసికంగా సిద్ధం చేసేందుకు కృషి చేశారు. ఉద్యోగులు సమ్మె విరమించుకోవడానికి ఒక నెపం కావలసి వచ్చింది. ఢిల్లీనుంచి నమ్మదగిన హామీ గాని, గట్టి విజ్ఞప్తి గాని వస్తే సమ్మె విరమించుకుంటారనే సంకేతాలు రావడంతో ఉద్యోగుల నాయకులు కొందరిని ఢిల్లీ తీసుకు వెళ్ళి అధిష్ఠానంచేత వారితో చర్చలు జరిపించాలనే ప్రతిపాదన వచ్చిందని, అందుకు సిఎం ససేమిరా అన్నారని ఊహాగానాలు చోటు చేసుకున్నాయి.

చివరికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి గులాం నబీ అజాద్‌ సమ్మె విరమించవలసిందిగా ఢిల్లీనుంచి విజ్ఞప్తి చేయడం ఉద్యోగ సంఘాలు ఒకటొకటే విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించడం జరిగిపోయాయి. గులాం నబీ అజాద్‌ గతంలో రాష్ట్ర రాజకీయాలతో తనకు గల విశేష పరిచయాన్ని ఉపయోగించి ఈ క్లిష్ట సమయంలో సమర్ధంగా వ్యవహరించారనిపించుకున్నారు. అందుకే డి. శ్రీనివాస్‌కు కౌన్సిల్‌ సభ్యత్వం ఇప్పించడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ ముఖ్యమంత్రి రాజనరసింహ ఇలా ఒక్కొక్కరూ తలా ఒక్క చేయి వేసి ఎవరి పాత్రను వారు నిర్వహించడంతో పరిస్థితి చక్కబడింది. టీ- మంత్రులూ ముఖ్యంగా వారిలో జానారెడ్డి సాహసం ప్రదర్శించి సమ్మె విరమణకు పిలుపునివ్వడం గమనార్హం.

ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోషించిన పాత్ర సహజం గానే పెద్దది, విశేషమైనది. ఇందులో ఆయన, బొత్స పంతాలకు పోయి ఒకరిని మించి ఒకరు పైచేయి ప్ర దర్శించుకోవాలని చూస్తే సమ్మెను ఈ విధంగా తలా ఒక చేయి వేసి విరమింపచేయడం సాధ్యమయ్యేదా? ముఖ్యమంత్రి పదవి మీద తనకు గల ఆసక్తిని బొత్స సత్యనారాయణ ఎప్పుడూ దాచుకోలేదు. చివరికి మొన్న డిఎస్‌ శాసన మండలి సభ్యుడు అవుతున్న తరుణంలో కూడా ముఖ్యమంత్రి పదవి వరించగల అవకాశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ డిఎస్‌ ఒక్కరేనా, మేం లేమా? అని బొత్స ఓపెన్‌గానే అన్నారు. కాకపోతే డి.శ్రీనివాస్‌ ఎమ్మెల్సీ కావడంతో బొత్స పేర్కొన్న రేసులో మరొకరు చేరారు. అంత మాత్రాన ముఖ్యమంత్రిని మార్చబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవమనుకోడానికి ఎంత మాత్రం వీలు లేదు.

అధిష్ఠానం అదిలించి కర్తవ్య బోధ చేయగానే ముఖ్యమంత్రి తన సర్వ శక్తి యుక్తులను ప్రయోగించి సమ్మె విరమింప చేయించిన తీరు, రైల్‌ రోకోపై కఠినంగా వ్యవహరించిన వైనం అగ్రనాయకత్వాన్ని ఆకట్టుకొన్నదనే చెప్పాలి. అందుచేత ఆయన తుది వరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగగల అవకాశాలే మెండు. కాకపోతే వై.ఎస్‌. రాజశేఖర రెడ్ది ఆకస్మిక మరణానంతరం రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ అస్థిర, అనిశ్చిత వాతావరణం నుంచి గుణపాఠం చేర్చుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గం వై.ఎస్‌. ఉండగా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా అంతా ఆయనకు వదిలిపెట్టేసి ఏక వ్యక్తి గుత్తాధిపత్యాన్ని పెంచి చాలా పొరపాటు చేశామనే అభిప్రాయానికి వచ్చింది.

అందుచేత మళ్ళీ ఒకప్పటి మాదిరిగా తన మాటే చెల్లుబాటు చేసుకోవడానికి, అదే సమయంలో ఇక్కడ ఏక నాయకత్వానికి బదులు సమర్ధులైన పలువురు నాయకుల సమష్టి సారథ్యాన్ని కల్పించడానికి సంకల్పించి నట్టు స్పష్టపడుతున్నది. ఆ క్రమంలోనే తమకు విధేయుడు, వ్యూహ కౌశలం గలిగిన డి. శ్రీనివాస్‌కు కౌన్సిల్‌ సభ్యత్వమిచ్చి రంగంలోకి తెచ్చినట్టు బోధపడుతున్నది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య దూరం పెరిగిందనో, డిఎస్‌కు కౌన్సిల్‌ సభ్యత్వమిచ్చింది సిఎంను చేయడానికే అనో వస్తున్న ఊహాగానాలు కావాలని పత్రికల పాఠకులకు, ఛానెళ్ళ వీక్షకులకు వండి వడ్డిస్తున్న మసాలాయేనని భావించాలి.

- సౌభాగ్య. ఎం

************************************************************************************************************


చదువులతో చెలగాటం
సంపాదకీయం
‘నీ కలలు సాకారం కావాలంటే, నువ్వు కలలు కంటూనే ఉండా’లని మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం ఉద్బోధ. కలలు కనడం చేతకాని జాతికి భవిష్యత్తు ఉండదని ఆయన అంటారు. ఈరోజుల్లో మెడిసిన్, ఐఐటీ వంటి కోర్సులు చదవాలని విద్యా ర్థులు కేవలం ‘గాలిలో మేడలు’ కట్టుకుంటూ కూర్చోవడం లేదు. ఆ కలను నిజం చేసుకోడానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా చదువులను తీర్చిదిద్దుకుంటున్నారు. తమ పిల్లలు ఒక డాక్టరో, ఐఐటీ నిపుణుడో, శాస్త్రవేత్తో కావాలనుకునే తల్లిదండ్రులు ఆరో తరగతినుంచే అందుకు సంబంధించిన శిక్షణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అప్పో సొప్పో చేసైనా పిల్లల చదువులపై లక్షల రూపాయలు వెచ్చించడానికి ఈరోజున వెనకాడే తల్లిదండ్రులు చాలా అరుదు. ఉన్నత చదువుల పట్ల ఒక ఆరోగ్యకరమైన స్పృహ ఆర్థిక వ్యత్యాసాలకు అతీతంగా మేలుకుంటోంది.

ఇది దేశాభ్యున్నతికి ఎంతో దోహదపడే పరిణామం. కానీ, పాలకుల చర్యలు, నిర్ణయాలు ఆ స్పృహపై నిప్పులు పోస్తున్నాయి. పసి కలలను కసిగా చిదిమేస్తున్నాయి. మన రాష్ట్రంలో గత రెండేళ్లుగా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న తీరు మరింత ఘోరమూ, హేయమూ. ఉపకారవేతనాలకు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికీ భారీ ఎత్తున పెట్టిన కోతా, ఉపకారవేతనాల విడుదలలో అసాధారణ జాప్యం బడుగు విద్యార్థుల గుండెల్లో ఎంతటి బడబాలాన్ని నింపాయో, ఎంతమందిని చదువులకు దూరం చేశాయో తెలియనిదికాదు. పులి మీద పుట్రలా, వైద్యవిద్యా ప్రవేశ పరీక్షకు సంబంధించిన తాజా నిర్ణయం వేలాది మంది విద్యార్థుల ఆశల కొమ్మపై గొడ్డలి పెట్టు అవుతోంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు సహా ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలు నింపుతోంది.

వైద్యం, ఇంజనీరింగ్ వంటి కోర్సులలో ప్రవేశానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఇప్పటివరకు ఎంసెట్ వంటి అర్హతా పరీక్షను నిర్వహిస్తున్నాయి. వైద్యవిద్యా ప్రవేశ పరీక్షలో పారదర్శకత ఉండాలనీ, అందుకు వీలుగా దేశమంతటా ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలనీ ఆమధ్య సుప్రీంకోర్టు భారత వైద్యమండలి (ఎంసీఐ)ని ఆదేశించింది. తదనుగుణంగా ఎంసీఐ జాతీయ అర్హతా -ప్రవేశపరీక్ష (నీట్) పేరుతో ఒక విధానానికి రూపకల్పన చేసింది. సీబీఎస్‌ఈ సిలబస్ వెలుగులో దానికి ఒక పాఠ్యప్రణాళికను కూడా రూపొందించి చాలా రోజుల క్రితమే వెబ్‌సైట్‌లో ఉంచింది. జాతీయ స్థాయిలో ఉమ్మడి పరీక్ష ఉండాలన్న నిర్ణయాన్ని సూత్రరీత్యా ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఇప్పుడున్న విధానంలో వైద్యవిద్యలో ప్రవేశం కోసం విద్యార్థులు చాలామంది పది చోట్ల పది పరీక్షలు రాయవలసివస్తోంది.

పది రకాల ప్రశ్నపత్రాలలో తర్ఫీదు పొందవలసివస్తోంది. వ్యయప్రయాసలకూ లోనవుతున్నారు. కనుక, ఉమ్మడి పరీక్షావిధానం ఆమేరకు వారికి అనుకూలమే. కానీ, వచ్చే సంవత్సరం నుంచే ఉమ్మడి పరీక్ష నిర్వహిం చాలని నిర్ణయించడం, దానికి రాష్ట్రప్రభుత్వం తలూపడమే దారుణం. విద్యార్థుల మనోభావాల పట్ల, భవిష్యత్తుపట్ల బొత్తిగా లక్ష్యం లేదనడానికి ఇదే నిదర్శనం. ఇంటర్ పరీక్షలు నాలుగు మాసాల దూరంలో ఉన్నాయి. వాటితోపాటే, ఎంసెట్‌కూ వేలు, లక్షలు ధారపోసి దాదాపు 70 వేల మంది విద్యార్థులు వైద్య విద్యా ప్రవేశపరీక్షకు సన్నద్ధమవుతున్నారు. వీరిలో 30 వేల మంది తెలుగు మాధ్య మం విద్యార్థులు ఉంటారు. ఉమ్మడి పరీక్షావిధానంలో ఇంతవరకు ఒక స్పష్టత రాలేదనీ, తుది సిలబస్‌ను ప్రకటించలేదనీ అంటున్నారు. అదొక సమస్య కాగా, ఉమ్మడి పరీక్షకు ఆధారం చేసుకున్న సీబీఎస్‌ఈ సిలబస్ ఇంటర్, ఎంసెట్ సిల బస్‌లను మించి 50 శాతం ఎక్కువ ఉంటుంది. పుస్తకాల లభ్యతా సమస్యే. దీనికి తోడు, తెలుగు మాధ్యమం విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ అనువాదం సిద్ధం కాలేదని సమాచారం.

ఈ పరిస్థితిలో, ఈ విద్యాసంవత్సరంనుంచే ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి రాష్ట్రప్రభుత్వం ఎలా ఆమోదించిందన్నదే ఆశ్చర్యకరం. విద్యా ర్థుల ప్రయోజనాలపట్ల ఏమాత్రం స్పృహ, బాధ్యత ఉన్న ఏ ప్రభుత్వమైనా ఇంత నిష్పూచీగా వ్యవహరిస్తుందా? ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందా? విద్యార్థులు, తల్లి దండ్రులు, అధ్యాపకులను సంప్రదించకుండానే, సాధకబాధకాలను అన్ని కోణాల నుంచీ పరిశీలించకుండానే ఇంత కీలక నిర్ణయాన్ని రుద్దే సాహసం చేస్తుందా?

ఇతర రాష్ట్రాల స్పందనను చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోవడం మరింత విస్మయకరం. తమిళనాడు ప్రభుత్వం ఉమ్మడి పరీక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి మినహాయింపు సాధించుకుంది. తమ రాష్ట్రంలో ప్రవేశపరీక్షలను మొత్తంగా రద్దుచేశామన్న కారణంతో ఆ ప్రభుత్వం ఉమ్మడి పరీక్షను వ్యతిరేకించింది. ఉమ్మడి పరీక్షకు ఆమోదం తెలిపినప్పుడు, అందుకు అవసరమైన సన్నాహాలు చేసుకోవడం ప్రభుత్వం మౌలికబాధ్యత. కనీసం సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనువాదాన్ని సిద్ధంచేసి తెలుగు మాధ్యమం విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఆలోచన కూడా మన రాష్ట్రప్రభుత్వంలో అంకురించకపోవడాన్ని ఏమనాలి? పరీక్షావిధానం విషయంలో ఒక స్పష్టత రాకుండా, తుది సిలబస్ సిద్ధం కాకుండా, అయిదు మాసాల వ్యవధిలో ఉమ్మడి పరీక్షకు సిద్ధం కావలసిన పరిస్థితిని విద్యార్థులపై రుద్దడమంటే వారి భవిష్యత్తుతో చెలగాటమాడడమే. వారి కలలను మొగ్గలోనే తుంచివేసే కర్కశత్వమే అందులో ఎవరికైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రణాళికాబద్ధమైన చదువుల యుగంలోకి ప్రవేశిం చారనీ; లక్షలు ధారపోసి అయినాసరే తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలన్న చైతన్యం నేడు అతిసామాన్యులలో సైతం మేలుకున్నదన్న గ్రహింపు ప్రభుత్వంలో ఉంటే ఇంత ఆషామాషీగా వ్యవహరించేది కాదు. ఇప్పటికైనా తప్పు దిద్దుకోవాలి. ఉమ్మడి పరీక్ష గండకత్తెర నుంచి విద్యార్థులను కాపాడాలి. తగిన సన్నాహాలు చేసిన తర్వాతే దానిని తలకెత్తుకోవాలి.