Sunday, January 1, 2012

కొత్త ఆశలతో సరికొత్తగా...



కాలం పుటల్లోకి మరో ఏడాది ఒదిగిపోయింది. నడిచివచ్చిన దారిని ఒక్కసారి చూసుకుంటే గర్వించదగ్గ సందర్భాలే కాదు... భగ్నమైన ఆకాంక్షలు, ఛిద్రమైన ఆశలు, ఉద్విగ్నభరిత క్షణాలు, అసహాయుల ఆక్రందనలు ఉంటాయి. అసమర్థుల ప్రలాపాలు, ఆషాఢభూతుల అవకాశవాద చేష్టలు,పెత్తందార్ల బలప్రదర్శనలు దృగ్గోచరమవుతాయి. కాలం అద్దంలాంటిది. అందులో కనబడే సుందర దృశ్యమైనా, భీతిగొలిపే చిత్రమైనా, స్వర్ణయుగమైనా అది మన ప్రతిబింబమే. మనల్ని మనం తరచి చూసుకుంటేనే, చూసి సరిచేసుకుంటేనే బంగారు భవిష్యత్తుకి భరోసా ఉంటుంది. ‘నువ్వు ఆ దోవన వెళ్లదల్చుకుంటే తప్ప వెనక్కి తిరిగి చూడకు’ అని ఆస్కార్ వైల్డ్ అంటాడు గానీ, మరీ అంత నిరాశ అవసరం లేదు. కాలం అంటే తారీఖులు, వారాలు మాత్రమే కాదు. నిత్య చైతన్యంతో, నిరంతర సృజనతో తొణికిసలాడే జన సమూహాలు కూడా. కాలాన్ని జనంతో ముడివేసి చూసుకుంటేనే అర్థం, పరమార్థం.

అమెరికా చలవతో దశాబ్దాలుగా నియంతృత్వాన్ని చెలాయిస్తున్న అరబ్ నిరంకుశ అధినేతలు.. ఈయేటి జన విప్లవ జంఝామారుతంలో దూదిపింజెల్లా తేలి పోయారు. 2010 డిసెంబర్ 18న టునీసియాలో పాలకుల అవినీతిపైనా, అధిక ధరలపైనా మొదలైన నిరసనలు సోషల్ నెట్‌వర్క్ పుణ్యమా అని అరబ్ దేశాలను కార్చిచ్చులా చుట్టుముట్టాయి. వేలమందిని హతమార్చి, మరిన్నివేలమందిని చీకటికొట్టాల్లో బంధించిన ఆ దేశ అధ్యక్షుడు బెన్ అలీ జనవరి 14న ప్రజా తిరుగుబాటుతో సౌదీ అరేబియాకు పారిపోయాడు. 30 ఏళ్లుగా కరకు గూఢచార సంస్థల కనుసన్నల్లో ఈజిప్టును పీల్చిపిప్పిచేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ సైతం జనాగ్రహానికి తలవంచకతప్పనిది ఈ ఏడాదే. ఇప్పటికీ ఆశ చావని అమెరికా అక్కడ సైనిక పాలకులతో ముబారక్ మార్కు అణచివేతను అమలు చేయిస్తున్నది. దాన్ని సైతం ఆ దేశ ప్రజలు వీధుల్లో ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంకా యెమెన్, సూడాన్‌లు ఆ బాటలోనే ఉన్నాయి.

బహ్రెయిన్, మొరాకో, ఒమన్ ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. వీరే కాదు..పతనం అంచుల్లో ఉన్న రష్యాను పట్టి నిలబెట్టి విజయపథంలోకి ఉరికించిన పుతిన్‌కు సైతం జనాగ్రహ సెగ తగులుతూనే ఉంది. రాజ్యాంగాన్ని ఏమార్చడానికి పదవులు మారుతూ దశాబ్దానికిపైగా అధికారాన్ని పర్మనెంట్ అడ్రస్‌గా చేసుకున్న పుతిన్ అంటే ఏవగింపు కలిగిందీ ఈ ఏడాదే. రాక్షసరాజు హిరణ్యకశిపుడి ఇంట పుట్టిన ప్రహ్లాదుణ్ణి తలపిస్తూ, ‘పెట్టుబడిదారీ గర్భంలోనే దాన్ని అంతంచేసే విప్లవాలు ప్రభవిస్తాయ’న్న మార్క్స్ మాటల్ని నిజం చేస్తూ కార్పొరేట్ సంస్థల స్థావర ప్రాంతం న్యూయార్క్‌లో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం పురుడుపోసుకున్నది ఈ సంవత్సరమే. స్వల్ప వ్యవధిలో అది 80 దేశాలకు విస్తరించి, 750 నగరాల్లో మార్మోగడం నడుస్తున్న చరిత్ర. ఇరాన్‌ను మరో ఇరాక్‌గా మార్చడానికి అమెరికా ఎత్తులు వేస్తున్నది. దేశదేశాల్లో ద్రోన్ స్థావరాలు పెట్టుకుని కోరుకున్నచోట నిప్పులు కురిపిస్తున్నది. ఒక పక్క ఉమ్మడి కరెన్సీ అంటూనే ఉపాధి అవకాశాలను, వనరులను ఉమ్మడిగా అందనివ్వకుండా తలుపులు బిడాయించుకున్న యూరోపియన్ యూనియన్ ఈ ఏడాది కుదేలైంది. బడ్జెట్ కోతలతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న జనం ఒక దేశం తర్వాత మరో దేశంలో రోడ్డుకెక్కుతుంటే మార్కెట్లు పేకమేడల్ని తలపించాయి. 33 కోట్లమంది ఉమ్మడి ఆకాంక్షకు ప్రతీక అయిన యూరో కరుగుతున్నకొద్దీ దక్షిణ దేశాలకు వలసలు పెరిగిపోతున్నాయి.

మన దేశం విషయానికొస్తే ఇది అవినీతి నామ సంవత్సరమనదగ్గ స్థాయిలో స్కాములు బయటపడ్డాయి. ‘కూటమి ధర్మాన్ని’ నుసరించి యూపీఏ కొన్నిటిని అటకెక్కిద్దామనుకున్నా కుదరకపోవడంతో పెద్ద తలకాయలే జైలుపాలు కావలసి వచ్చింది. రోజులు గడిచేకొద్దీ 2జీ స్కాంలో ఇంకొందరు ఇంటిదొంగలు బయట పడే సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్లు ఎవరెవరో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలకు తలుపులు తెరిచి మధ్యతరగతి ఆరాధ్యుడిగా మారిన మన్మోహన్‌నే ఆ వర్గం నిలదీయటం ఈ ఏడాది సంభవించిన మరో వైచిత్రి. ఎన్నాళ్లుగానో ప్రేక్షకపాత్ర వహిస్తున్న మధ్యతరగతి వర్గం తొలిసారి వీధులకెక్కడం ఒక వింత అయితే, వారికి మారుమూల మహారాష్ట్ర పల్లె ప్రాంతానికే పరిమితమైన అన్నా హజారే నాయకత్వం వహించడం ఊహించని పరిణామం.

ఆయన బృందం రూపొందించిన జన్‌లోక్‌పాల్‌కు, ఆయన తలపెట్టిన ఉద్యమానికి పట్టణాలు, నగరాల్లో వేలకు వేలు కదిలివచ్చారు. ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు లక్షోపలక్షల సందేశాలతో వెల్లువెత్తాయి. కానీ, ఆయన దాన్ని నిలుపుకొన్నట్లేనా? అర్ధంతరంగా ముగిసిన ముంబై నిరశన ఆయన స్వయంకృతమా? వీటికి జవాబులు ఇంకా లభించాల్సి ఉంది. సందట్లో సడేమియాగా ప్రధాన పార్టీలన్నీ కలిసి లోక్‌పాల్‌ను నిశిరాతిరి వేళ పార్లమెంటు సాక్షిగా నాలుగు నిలువుల లోతున పాతేశాయి. అటు యూపీఏ, ఇటు ఎన్‌డీఏ లోక్‌పాల్ చుట్టూ నడిపించిన రాజకీయంతో జాతి యావత్తూ తెల్లబోయింది.

బక్కచిక్కుతున్న రూపాయి, కుప్పకూలుతున్న మార్కెట్లు, గిట్టుబాటు లభిం చక విలవిల్లాడుతున్న రైతు, పడిపోతున్న నిజ వేతనాలు, పదిహేను రోజులకోసారి పైపైకి ఎగబాకే పెట్రో ధరలు, కొండెక్కి కూర్చుంటున్న నిత్యావసరాలు... ఇన్ని సమస్యలమధ్య కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నది. ఎవరికీ చిక్కని దొంగలా ప్రవర్తించే కాలమే... ఎందుకనో కొందరికి ఒడుపుగా అదుపులోకి వస్తుంది. అలాంటి వాళ్లనే అదృష్టవంతులంటారు గాబోలు. ఆ అదృష్టం అందరిదీ కావాలని ఆశిద్దాం. ‘అనురాగ తల్పాల మీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని/ హాయిగా చల్లగా కాస్సేపు పరుండడానికి అనుమతించు తండ్రీ’ అన్న కవి తిలక్ ప్రార్థనతో ఈ నూతన సంవత్సరాగమనవేళ మనమూ గొంతు కలుపుదాం.

__________________________________

మర మనుషులం కాదుగా

సాయంత్రం 6 అవుతోంది... ఆ సభలో కూర్చున్న వారిని చూస్తే, వారిలో ఎక్కువ మంది ఒకే తరహా సామాజిక, మానసిక స్థితిలో ఉన్నట్లు ఎవరైనా సులువుగానే గుర్తిస్తారు. ఒక ప్రాంతంలోని ప్రాచీన కాలపు వృత్తి పరికరాలను సేకరించి, వాటి విశిష్ఠతలను పరిశీలించే ఒక వ్యక్తి ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన సభ అది. ఉన్నత విద్యలూ, ఉన్నతోద్యోగాలు అన్నీ ఉన్న ఒక ప్రత్యేక తరగతికి చెందిన వారే ఆ సభకు ఒక్కొక్కరుగా వచ్చి చేరుకున్నారు. ఎవరికి డబ్బులకేమీ కొదవలేనట్లే అనిపించింది. కాకపోతే .....

ఎవరి ముఖంలోనూ ఆ సజీవత్వం కనిపించడం లేదు. జీవితాన్నేదో పర్వతాన్ని మోసినట్లు మోస్తూ, ఆ కుర్చీల్లో వాలిపోయారు. ఏమైతేనేం ప్రసంగం మొదలయ్యింది. ప్రాచీన వృత్తి పరికరాల విశిష్ఠతల గురించి చెబుతూ ఆ క్రమంలో ఒక నాటి వృత్తి వేళలకూ, ఈ నాటి వృత్తి వేళలకూ మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నారు. అదే సమయంలో మనుషుల్లో ఒకనాడు లేని మానసిక ఒత్తిళ్లు, దిగులు, ఆందోళన ఇప్పుడు ఎందుకు ఉన్నాయో వివరించడం మొదలు పెట్టాడు వక్త.

"అవసరం ఉన్నవన్నీ కొనుక్కుంటూ పోతే, ఏదో ఒక రోజున అత్యవసరమైన వాటిని అమ్ముకోవలసి వస్తుంది.'' అన్నాడో ఆర్థిక వేత్త. ఆర్థిక మేకాదు, అతిగా వ్యవహరించే జీవితంలోని అన్ని సందర్భాలకూ ఈ సత్యం వర్తిస్తుంది. అవసరాలు పెరిగే కొద్దీ వాటికి అనుగుణంగా మన సంపాదన కూడా పెర గాలి కదా! అంటూ ఉంటారు. కానీ, అవసరాలు వాటికవే పెరిగాయా? మనమే వాటిని పెంచుకున్నామా? అని ప్రశ్నించుకుంటే, కాస్త ఆలస్యంగానే అయినా ఒక సమాధానం వస్తుంది. మన ం అవసరాలు అనుకుంటున్న వాటిలో సగానికి పైగా మనం పెంచుకున్నవే ఉంటాయి. అయినా పెరిగితే ఏమిటి? పెంచుకుంటే ఏమిటి? అవన్నీ మన జీవితానికి ఉపకరించేవే కదా! అనిపించవచ్చు. కానీ, ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్న ఆ అవసరాల కోసం మనం ఏమైపోతున్నాం? రెట్టింపు చాకిరీ చేస్తున్నాం. దీని వల్ల కొన్నిసార్లు విశ్రాంతికీ, చివరికి నిద్రకు కూడా దూరమవుతున్నాం.

వరుసగా కొంత కాలం నిద్రకు దూరమైతే ఆ తరువాత నిద్ర కావాలన్నా రాకుండా పోతుంది. నిద్రలేమి కేవలం శారీరక సమస్యే కాదు. దీర్ఘకాలికంగా ఆ సమస్య కొనసాగితే, అది ఒక మానసిక రుగ్మతకూ దారి తీయవచ్చు. దిగులూ ఆందోళనా, మానసికమైన కుంగుబాటు వంటి సమస్యలతో ఎక్కువ కాలం సతమతవుతున్న వారు అన్నీ ఉండి ఏమీ లేని వారిలా జీవిస్తారు. ఏదో ఒక దశలో తమకేదో అయిపోతోందని గుర్తించి, మానసిక వేత్తల వద్దకూ, ఆధ్యాత్మిక వేత్తల వద్దకూ తిరిగే పరిస్థితిలో పడిపోతున్నారు....'' వక్త మాటలు అక్కడ కూర్చున్న వారి గుండెల్లో సూటిగా గుచ్చుకుంటున్నాయి.

వారి స్థితిని గమనించిన వక్త వాక్పటిమను పెంచారు. " ఎక్కడైనా 8 గంటలు పనిచేసే వారు మనిషి అవుతారు. 16 గంటలు పనిచేసే వారు దెయ్యమవుతారు.'' అన్నారు. సభలో పిన్‌డ్రాప్ సైలెన్స్. ఆ మాట సరిగ్గా తమమీదే ఎక్కుపెట్టిన బాణంలా ఉందేమో, అందరూ తమలోకి తాము చూసుకోవడం మొదలెట్టారు. ఎంత కాదనుకున్నా ఇది ముమ్మాటికీ నిజమే... నిజమే అన్న ప్రతిధ్వని అందరి మనసుల్లో మార్మోగినట్టనిపించింది.

నిజమే కదా! సాంస్కృతిక విషయాలకో, మానసిక ఉల్లాసానికో ఏ మాత్రం సమయం లేని, ఎంత సేపూ వృత్తిపరమైన పనులకే పరిమితమైన వారు సహజంగా ఎలా ఉంటారు? అసహజత్వమేదో ఆవరించి దెయ్యంలాగే ఉంటారు. అవసరాలు అలాగే వున్నాయి కదా! అనే మాటను ఎదుటి వారెవరూ కాదనరు. కానీ, నీకు జరుగుతున్న నష్టమేదో నీకే తెలిసిపోతుంది కదా! అందుకే మనిషి మెలుకువతో ఉండే 16 గంటల్లో 8 గంటలకే వృత్తి పనులకు కేటాయించాలని, మిగతా 8 గంటలు మానసిక ఉన్నతికి, ఉల్లాసానికీ వినియోగించాలన్న సత్యాన్ని ఆ వక్త సింపుల్‌గా, సూటిగా చెప్పారనిపించింది. ఆ వాక్యాలు అక్కడున్న వారికే కాదు... అందరికీ వర్తిస్తాయేమో?!

No comments:

Post a Comment