ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య కోటాలకు ఏకీకృత ఫీజు
సంబంధిత ప్రక్రియను ప్రారంభించాలని ప్రవేశ, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ)కి ఆదేశం
ఫీజులపై జారీ చేసిన జీవోలు 76, 77, 85, 86 కొట్టివేత
ఫీజు ఖరారుకు ఒక్కో విద్యా సంస్థలో ఒక్కో కోర్సుకయ్యే తలసరి వ్యయాన్ని ఏఎఫ్‌ఆర్‌సీ పరిగణనలోకి తీసుకోవాలి
తలసరి వ్యయాన్ని లెక్కించే సమయంలో ఆ విద్యాసంస్థ ఖర్చులను లెక్కేయాలి
తర్వాత ఏఎఫ్‌ఆర్‌సీ చెప్పిన మొత్తాన్నే ఫీజుగా పరిగణించాలి
దాన్ని ఆ నిర్దిష్ట విద్యాసంస్థ ఫీజుగా ప్రభుత్వం నోటిఫై చేయాలి
ఎన్నారై కేటగిరీలో అధికంగా వసూలు చేసే ఫీజును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి
2010-11, 2011-12, 2012-13 విద్యాసంవత్సరాల
ఫీజు ప్రతిపాదనలను తాజాగా నోటిఫై చేయాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటాల కింద ఏకీకృత(ఒకే తరహా) ఫీజును ఖరారు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఏకీకృత ఫీజు ఖరారుకు అవసరమైన కసరత్తును ప్రారంభించాలని ప్రవేశ, ఫీజు నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)ని నిర్దేశించింది. ఈ కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటాల కింద ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 76, 85, 86తోపాటు దీనికి సంబంధించి ఏఎఫ్‌ఆర్‌సీ చేసిన సిఫారసుల తాలుకు జీవో 77ను కొట్టివేసింది. ఈ జీవోలు చట్టప్రకారం చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గోడా రఘురాం, జస్టిస్ పి.దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేటగిరీ-ఎ, కేటగిరీ -బి సీట్ల ఫీజు ఖరారుకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యా సంస్థలను కోరుతూ ఫీజు నియంత్రణ కమిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ.. జోసెఫ్ శ్రీ హర్ష మేరీ ఇంద్రజ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కె.వి.కె.రావుతో పాటు పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ధర్మాసనం ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్, తెల్లప్రోలు చరణ్‌లు చేసిన పలు వాదనలతో ఏకీభవించింది. ఒక్కో విద్యా సంస్థకు ఒక్కో కోర్సుకయ్యే తలసరి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఏకీకృత ఫీజును ఖరారు చేయాలని ధర్మాసనం తన 102 పేజీల తీర్పులో ఏఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. తలసరి వ్యయాన్ని లెక్కించే సమయంలో సదరు విద్యా సంస్థలో ఉన్న మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పెట్టిన పెట్టుబడులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాలు, భవిష్యత్ అభివృద్ధి కోసం ఉన్న మిగులు, నిర్వహణ, విస్తరణకయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ విధంగా ఒక్కో విద్యా సంస్థ ఒక్కో కోర్సు తలసరి వ్యయాన్ని లెక్కించిన అనంతరం ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు చేసినదాన్నే.. ‘ఫీజు’గా పరిగణించాలని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్దిష్ట విద్యాసంస్థ ఫీజుగా నోటిఫై చేయాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
ప్రతి విద్యా సంవత్సరంలో మార్చి మొదటివారానికల్లా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పింది. ఏదైనా ఒక వర్గానికి చెందిన విద్యార్థి విద్యకయ్యే ఖర్చును ప్రభుత్వం గ్రాంట్, లోన్, లేదా ఇతర పద్ధతుల ద్వారా భరించాలనుకుంటే, అందుకు ఓ విధానాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తెలిపింది. ఏదైనా ఒక విద్యార్థి ఫీజును మొత్తంగా గానీ, కొంత భాగంగా గానీ రద్దు చేయాలనుకుంటే.. దానిపై ఆ విద్యాసంస్థ ఓ విధానాన్ని రూపొందించుకోవచ్చునని పేర్కొంది. ఎన్నారై కేటగిరీ కింద చేరే విద్యార్థులకు ఏఎఫ్‌ఆర్‌సీ ఎక్కువ ఫీజును నిర్ణయించవచ్చునని , దానిని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని తెలిపింది. ఈ కేటగిరీ(కేటాయించిన సీట్లలో 15 శాతం మించకూడదు) కింద వసూలు చేసే ఫీజును ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఓ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, అయితే ఈ ఆదేశం ప్రభుత్వం లేదా ఫీజుల నియంత్రణ కమిటీ జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
తీర్పులో ముఖ్యాంశాలివీ..
ఒక విద్యార్థి నుంచి వసూలు చేసిన ఫీజుతో మరో విద్యార్థికి ఫీజు రాయితీ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. ఆ విధంగా ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సులు ఉండరాదు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేం. ఫీజు ఖరారు సిఫార్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం, దానిని నోటిఫై చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విద్యా సంస్థ తలసరి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదు. అందువల్లే ఒక విద్యార్థి నుంచి వసూలు చేసిన ఫీజుతో మరో విద్యార్థికి ఫీజు రాయితీ కల్పించడం జరుగుతోంది.
ప్రతి ప్రైవేటు అన్ ఎయిడె డ్ విద్యా సంస్థలో ప్రవేశం పొందే విద్యార్థి నుంచి వసూలు చేసే ఫీజులో.. ఆ విద్యా సంస్థ తలసరి వ్యయం ప్రతిబింబించాలి.
ఎన్నారై కేటగిరీ కింద అధికంగా వసూలు చేసే ఫీజులను ఓ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. దానిని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ప్రయోజనం కోసం ఉపయోగించాలి. ఈ మొత్తాలను ఏ విధంగా ఉపయోగించబోతోంది? ఎవరి కోసం ఉపయోగించబోతోంది తదితరాలను ప్రభుత్వం నోటిఫై చేయాలి.
విద్యార్థులు ఏ కేటగిరీ, బీ కేటగిరీలో ప్రవేశం పొందినప్పటికీ.. ఫీజు ప్రతిపాదనల కోసం నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో అన్ని కేటగిరీ విద్యార్థులకు ఏకీకృత ఫీజు ఉంటుందనే విషయాన్ని అందులో చేర్చాలి. ఎన్నారై కేటగిరీ విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేసే విషయాన్ని కూడా ప్రస్తావించాలి.
ఆదాయ, వ్యయాలు, ఆస్తిఅప్పుల పట్టీలు, జీతభత్యాలు, మౌలిక సదుపాయాల తాలూకు వివరాలను ఏదైనా విద్యా సంస్థ అందచేయకుంటే.. ఆ విద్యాసంస్థ ఎటువంటి ఫీజును వసూలు చేసుకునేందుకు అవకాశం లేదనే విషయాన్ని ఫీజుల నియంత్రణ కమిటీ కూడా తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాలి. నోటిఫై చేసే సమయంలో ప్రభుత్వం ఇదే విషయాన్ని విధిగా రికార్డ్ చేయాలి.
వివిధ కోర్సుల్లో విద్యను అందించే విద్యాసంస్థల్లో ఫీజును ఖరారు చేసేందుకు ఫీజుల నియంత్రణ కమిటీ చేసే సిఫారసులను ప్రభుత్వం నోటిఫై చేయాలి. దీని వల్ల విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజుల నియంత్రణ కమిటీ ఫీజు ప్రతిపాదనలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫీజు ఖరారు నోటిఫికేషన్ జారీ చేసే విద్యా సంవత్సరానికి ముందు ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఈ ప్రక్రియ జరగాలి.
వివిధ ప్రైవేటు అన్ ఎయిడెడ్‌విద్యా సంస్థల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించే ప్రక్రియను, తదానుగుణ బాధ్యతలను ఫీజుల నియంత్రణ కమిటీ ఔట్‌సోర్స్ చేయవచ్చు. తమకు వచ్చే ప్రతిపాదనలను, వాటి వివరాలను ఆ ఔట్‌సోర్స్ ఏజెన్సీ పత్రికా ప్రకటనల ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలి. విద్య సంస్థలు సమర్పించే ప్రతిపాదనల్లో లాభదాయకత ఉందా? తదితర అంశాలకు సంబంధించిన విషయాలను ఆ ఏజెన్సీ రికార్డ్ చేయాలి.
ఔట్‌సోర్స్ ఏజెన్సీలు తయారు చేసే నివేదిక, సిఫార్సు కాపీలను ఫీజుల నియంత్రణ కమిటీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు పంపి, ఫీజు ఖరారు ప్రతిపాదనలను ఆహ్వానించాలి. ఈ సమయంలో ఫీజు ఖరారు కోసం అవసరమయ్యే సమాచారాన్నంతా విద్యా సంస్థలు ఈ కమిటీకి అందచేయాలి.
ప్రభుత్వానికి సమర్పించే సిఫార్సులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏఎఫ్‌ఆర్‌సీ చర్యలు తీసుకోవాలి.
2010-11, 2011-12, 2012-13 విద్యా సంవత్సరాలకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు సమర్పించే ఫీజు ఖరారు ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని అంశాలను పరిశీలించి, ఏదైనా సమాచారం కావాలనుకుంటే సదరు విద్యా సంస్థకు ఫీజుల నియంత్రణ కమిటీ నోటీసు జారీ చేసి మరీ తెప్పించుకోవచ్చు.
పరిశీలన పూర్తయిన తరువాత ఫీజు ఖరారుకు సంబంధించి తయారు చేసే సిఫార్సుల నివేదికలో ఫీజు వారీగా ప్రతి కోర్సుకయ్యే వ్యయాన్ని అందులో ప్రస్తావించాలి.
2010-11, 2011-12, 2012-13 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేయాలి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రక్రియను వీలైనంత వేగంగా ప్రారంభించాలి. నేటి నుంచి మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి.
No comments:
Post a Comment