Sunday, October 16, 2011


విరమణ దిశగా సమ్మె?
సడలుతున్న సకలం
రేపటి నుంచి మోగనున్న బడి గంటలు!

తెరుచుకోనున్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు
జీతం లేకుండా పాఠం చెబుతామన్న టీచర్లు
కీలక ప్రకటన దిశగా ప్రైవేటు పాఠశాలలు
యాజమాన్యంతో సింగరేణి సంఘాల చర్చలు నేడు (సోమవారం)
ఉద్యోగ జేఏసీ తర్జనభర్జన.. కేసీఆర్‌తో మంతనాలు
సకల సమ్మె 'కొనసాగింపు'పై పునరాలోచన
గౌరవప్రద ముగింపుపై జేఏసీ స్టీరింగ్ కమిటీ చర్చ

సాఫీగా రోడ్డెక్కిన బస్సులు
నేడు రైల్‌రోకో లేదు
ఒక రోజు ముందే ముగింపు
రెండో రోజు కనిపించని తీవ్రత
నేడు తెలంగాణ బంద్
మద్దతుగా ఆటోల బంద్
హైదరాబాద్, అక్టోబరు 16 : ఉద్యమమై... మహోధృతమై... మొత్తం తెలంగాణను ఉరకలెత్తించిన సకల జనుల సమ్మె... మెల్ల మెల్లగా సడలుతోందా? ఉద్యోగులతో మొదలై అన్ని వర్గాల వారిని కదిలించిన ఈ ఆందోళన 'విరమణ' దిశగా వెళుతోందా? ప్రకటించిన కార్యక్రమాలను సైతం పూర్తి చేయలేక ఉద్యమ నాయకత్వం సతమతమవుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు తావిస్తున్నాయి.

గతనెల 13 నుంచి జరుగుతున్న సకల జనుల సమ్మెలో ఉద్యోగ, కార్మిక సంఘాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కార్యాలయాలు, బడులు, గనులు, బస్సులు ఎక్కడికక్కడ బంద్ కావడంతో సమ్మె సెగ సర్వ జనులను తాకింది. మరీ ముఖ్యంగా... ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమ్మె ప్రభావం మొత్తం రాష్ట్రంపై కనిపించింది. ఆ తర్వాత... బడుల బంద్ సమ్మెకు ఊపు తెచ్చింది. అయితే, శనివారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకున్నారు. ప్రజలు, కార్మికుల ఇబ్బందుల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇక... ఉపాధ్యాయుల సమ్మె కూడా దాదాపుగా ముగిసినట్లే. హాజరు పట్టీలో సంతకం చేయబోమని, జీతం తీసుకోకుండానే పాఠాలు చెబుతామని తెలంగాణ టీచర్ల జేఏసీ ప్రకటించింది. ఎప్పటి నుంచి విధులకు వెళ్లేదీ సోమవారం ప్రకటిస్తామని తెలిపింది. ప్రభుత్వం మాత్రం తెలంగాణలో మంగళవారం నుంచి బడిగంటలు మోగుతాయని తెలిపింది. ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం ఇప్పటికే 'బెత్తం' ఝళిపించింది. సోమవారం నుంచి బడులు తెరవకుంటే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.

ఇక... సమ్మె నుంచి తప్పుకోవాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చాయి. సోమవారం దీనిపై చర్చించి తుది ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. సకల జనుల సమ్మెలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉద్యోగ సంఘాల జేఏసీలోనూ 'ఏం చేద్దాం?' అనే తర్జన భర్జన మొదలైంది. ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు సమ్మె విరమించడం, సింగరేణి కార్మికులూ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తుండటంతో, నాలుగో తరగతి ఉద్యోగులు మెల్ల మెల్లగా విధుల్లో చేరుతుండటంతో... సమ్మెను కొనసాగించడంపై ఉద్యోగులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది.

ఆదివారం రాత్రి ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్, కోదండరాంతో రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. 'తెలంగాణ భవన్'లో పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలోనూ నేతలు దీనిపైనే చర్చించినట్లు తెలిసింది. సకల జనుల సమ్మెకు గౌరవప్రదమైన ముగింపు పలికి... ఉద్యమ రూపు మార్చాలనే దిశగా చర్చలు సాగినట్లు సమాచారం. ఈ పరిస్థితి రావడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులే కారణమంటూ ధ్వజమెత్తాలని నిర్ణయించినట్లు తెలిసింది.

నేడు 'సింగరేణి' చర్చలు
సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ... మెల్లమెల్లగా ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి పెరుగుతోంది. ఎన్‌టీపీసీకి రోజూ 10వేలకుపైగా టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. ఆదివారం ఏకంగా 14 వేల టన్నులు పంపారు. బొగ్గు ఉత్పత్తిని గాడిన పెడుతున్న సింగరేణి యాజమాన్యం సమ్మె విరమణ దిశగానూ చర్యలు చేపట్టింది. సోమవారం సంస్థ సీఎండీ నరసింగరావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమ్మె వల్ల సంస్థకు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను వివరించి... ఆందోళన విరమించాల్సిందిగా సీఎండీ కోరే అవకాశం కనిపిస్తోంది.

తగ్గిన 'రోకో' ప్రభావం మూడు రోజులు జరగాల్సిన రైల్‌రోకో రెండు రోజులకే ముగిసింది. సోమవారం రైల్‌రోకో ఉండదని, బంద్ మాత్రమే ఉంటుందని తెలంగాణ జేఏసీ ప్రకటించింది. దీంతో సోమవారం పూర్తిస్థాయిలో రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం రైల్‌రోకో దాదాపు ప్రశాంతంగా ముగిసింది. ముఖ్య నేతలను ముందే అరెస్టు చేయడంతో రైల్ రోకో ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆదివారం సాయంత్రానికి యాభైకి పైగా రైళ్లను నడిపినట్లు అధికారులు తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్లే రెండు ప్యాసింజర్, 9 ఎక్స్‌ప్రెస్‌లు యథాతథంగా నడిచాయి. కానీ... ప్రయాణికుల సంఖ్యమాత్రం చాలా తక్కువగా కనిపించింది. తెలంగాణ వ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో బలగాల మోహరింపు కొనసాగింది. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహా రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైల్ రోకోకు వెళుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్‌లో తెలంగాణవాదులు ఫాస్ట్ ప్యాసింజర్‌ను అడ్డుకున్నారు. నెక్కొండలో రైల్వేట్రాక్ పైకి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎడ్లబండ్లను తీసుకొచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. రాళ్ల వర్షం కురిసింది. రైల్వే యాక్టు కింద శనివారం 70 కేసులు, ఆదివారం 15 కేసులు నమోదు చేసినట్లు రైల్వే అదనపు డీజీ కౌముది తెలిపారు. రైల్వే చట్టాల కింద 944 మందిని అరెస్టు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లా బిక్కనూర్ మండలం తలమండ్ల సమీపంలో ట్రాక్ ధ్వంసం చేసిన వారిని గుర్తించామని తెలిపారు. ఫిష్‌ప్లేట్ల తొలగింపు, ట్రాక్ ధ్వంసానికి సంబంధించి మరో ఐదు కేసులు నమోదయ్యాయన్నారు.

54 కేసులు... 715మంది అరెస్టు
ఆదివారం రైల్‌రోకోకు ప్రయత్నించిన 715మందిని అరెస్టు చేసి, 54 కేసులు నమోదు చేసినట్లు శాంతి భద్రతల అదనపు డీజీ ఎస్ఏ హుడా తెలిపారు. జిల్లాల వారీగా ఇవీ వివరాలు..


జి - 20 దేశాలను వణికిస్తున్న నిరుద్యోగ భూతం

యువతలో నిరుద్యోగం పెరుగు తుండడం ఇటీవలి కాలంలో ఆందోళన కలిగించే ఒక పరిణామం. ప్రపంచ సంక్షోభ ప్రభావం జి-20 దేశాల్లోని యువతపై తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. సంక్షోభం దెబ్బకు అందరికంటే యువతే ముందుగా ఉద్యోగాలు కోల్పోయింది.అప్పటినుండి కార్మిక మార్కెట్‌లో కొత్తగా ప్రవేశించే వారి సంఖ్య ఎక్కువైంది. ఉద్యోగావకాశాలు అరుదైపోయాయి.
ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ), ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఒఇసిడి) ఇటీవల విడుదల చేసిన పత్రాలు జి 20 దేశాల్లో ఆర్థిక సంక్షోభ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. నాయకులు వక్కాణిస్తున్న విధంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమసిపోలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. అనేక అంకాలుగా ఉండగలదని భావిస్తున్న వ్యవస్థలో మనం రెండవ అంకంలో ప్రవేశిస్తున్నాం. 2010లో వర్థమాన మార్కెట్లు సాధించిన పురోగతిపై మితిమీరి ప్రచారం జరిగినప్పటికీ కార్మిక మార్కెట్‌లో పురోగతి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. జి 20 దేశాల్లో స్వల్పకాల ఉపాధి- కార్మిక మార్కెట్‌ పరిస్థితులు, ముఖ్యమైన సవాళ్లు'' అనే పేరుతో ఐఎల్‌ఒ, ఒఇసిడి ఇటీవల విడుదల చేసిన ఒక పత్రం పేర్కొంది. మాహా మాంద్యం నుండి, ముఖ్యంగా ఉపాధి అవకాశాల విషయంలో పురోగతి బాగా తక్కువగా ఉందని ఆ పత్రం సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా నేడు నెలకొన్న ఆర్థిక సుస్థిరత, భవిష్యత్తులో ఉత్పత్తి పెరుగుదలకు అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న ఈ కొద్ది ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ పత్రం ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబర్‌ నెలాఖరులో పారిస్‌లో జరిగిన జి -20 సమావేశం కోసం ఈ పత్రాన్ని రూపొందించారు. ఈ దేశాల్లో ఇటీవల సాధించిన ఉత్పత్తి, ఉపాధి అవకాశాలను ఈ పత్రం వివరించింది. ప్రాంతీయ, జాతీయ స్థాయిలో స్వల్ప అంతరాలున్నప్పటికీ జి-20 దేశాల్లో ఆర్థికాభివృద్ధి మందకొడిగా ఉందని పత్రం వివరించింది. కార్మికులందరికీ నిర్మాణాత్మక ఉపాధి, మెరుగైన పని అవకాశాలను పెంపొందించే విషయంలో కార్మిక మార్కెట్‌లో జి-20 దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పత్రం వివరించింది. ఇందులో కొన్ని సంక్షోభ సమయంలోనూ, సంక్షోభం నుండి కోలుకునే ప్రారంభ దశలోనూ చోటుచేసుకునేవి ఉన్నాయి. మిగిలినవి మరింత విధానపరమైన పరిశీలన అవసరమైన దీర్ఘకాల వ్యవస్థాగత అంశాలను ప్రతిబింబించేవిగా ఉన్నాయి.
జి-20లోని 17 దేశాల్లో ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులోఉంది. చైనా, భారత్‌, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇతర జి-20 దేశాల మాదిరిగా ఇప్పటికీ ఉపాధి అవకాశాలకు సంబంధించి వార్షిక లేదా త్రైమాసిక ఫలితాలను సేకరించడమో లేక అంచనావేయడమో చేయడం లేదు. సంక్షోభానికి ముందున్న కాలంలో కార్మిక మార్కెట్‌ పనితీరు జి-20 దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిలో ఉంది. 2011 మొదటి త్రైమాసికానికి ముందు మూడు సంవత్సరాల్లో 13 దేశాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఐదు దేశాల్లో మాత్రమే స్వల్పంగా పెరిగాయి. నాలుగు దేశాలు ఉపాధి అవకాశాల్లో గణనీయమైన మెరుగుదల సాధించాయి. ఈ దేశాల్లో నిరుద్యోగం తగ్గింది. అవి టర్కీ, బ్రెజిల్‌, జర్మనీ, ఇండోనేసియా. ఉపాధి అవకాశాల్లో రష్యా స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. అయితే నిరుద్యోగ శాతం కూడా పెరిగింది. ఇతర దేశాల్లో 2008 నుండి ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికా వంటి కొన్ని దేశాల్లో నిరుద్యోగ శాతం యాభై శాతానికి పైగా నమోదైంది.
15 దేశాల్లో దీర్ఘకాలిక నిరుద్యోగం (పన్నెండు మాసాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉండటం) పెరిగింది. ఇందుకు మెక్సికో, బ్రెజిల్‌ మినహాయింపుగా ఉన్నాయి. 2010లో అనేక దేశాల్లో నిరుద్యోగం బాగా పెరిగింది. స్వల్పకాల నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. మాంద్యం సమయంలో ఉద్యోగాలు కోల్పో యిన వారిలో అనేకమంది ఆర్థిక సంక్షోభం నుండి కోలుకున్న తరువాత ఉపాధి అవకాశాలు పొందలేకపోయారు. దీర్ఘకాల నిరుద్యోగం కెనడా, స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికాలో బాగా పెరిగింది. అమెరికాలో దీర్ఘకాల నిరుద్యోగం 2011 ప్రారంభంలో మూడు రెట్లు పెరిగి రికార్డు స్థాయికి అంటే 33 శాతానికి చేరుకుంది. ఇది దక్షిణాఫ్రికాలో 68.3 శాతం, ఇటలీలో 50 శాతం, జర్మనీలో 47.3 శాతంగా ఉంది. ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జపాన్‌ దేశాల్లో నలభై శాతానికి పైనే ఉంది.
అంతిమంగా ఈ పరిస్థితి కార్మిక భాగస్వామ్యం తగ్గడానికి దోహదం చేస్తుంది. నిరుద్యోగ మార్కెట్‌ మందగమనంలో నిరుద్యోగంతోపాటు తక్కువ పనిదినాలు కూడా చేరి ఉంటాయని ఐఎల్‌ఒ నోట్‌ పేర్కొంది. జి-20లో వర్ధమాన దేశాలతో సహా అసంఘటిత రంగంలో సంస్థలు ఎక్కువగా గల దేశాలకు ఇది మరింతగా వర్తిస్తుంది. భారత్‌ వంటి దేశాల్లో తగిన స్థాయిలో నిరుద్యోగ ప్రయోజనాలు, బీమా, ఇతర కార్మిక రక్షణ విధానాలు అందుబాటులో ఉండటం లేదు. అందువల్ల నిరుద్యోగంతో బాధపడే బదులు తక్కువ వేతనం, సాదాసీదా ఉద్యోగం అయినప్పటికీ ఏదో ఒక ఉపాధి సంపాదించడం మినహా కార్మికులకు మరో ప్రత్యామ్నాయం లభించడం లేదు. సంక్షోభం ముదిరిన జి-20 దేశాల్లో ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కాంట్రాక్టుల కార్మికుల సంఖ్య గణనీయంగాపెరుగుతోంది.
యువత- ఉపాధి
యువతలో నిరుద్యోగం పెరుగుతుండడం ఇటీవలి కాలంలో ఆందోళన కలిగించే ఒక పరిణామం. ప్రపంచ సంక్షోభ ప్రభావం జి-20 దేశాల్లోని యువతపై తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. సంక్షోభం దెబ్బకు అందరికంటే యువతే ముందుగా ఉద్యోగాలు కోల్పోయింది. అప్పటినుండి కార్మిక మార్కెట్‌లో కొత్తగా ప్రవేశించే వారి సంఖ్య ఎక్కువైంది. ఉద్యోగావకాశాలు అరుదైపోయాయి. జి-20 దేశాలన్నిటిలో వయోజనుల్లో నిరుద్యోగం కంటే యువతలో నిరుద్యోగం రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉంది. సంక్షోభ సమయంలో ఇది మరింతగా పెరిగింది.
కార్మిక వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడం లేదని ఇందువల్ల స్పష్టమవుతోంది. నిర్మాణాత్మక కార్యకలాపాల్లో మహిళా కార్మికులను కూడా అవసరమైనమేరకు ఉపయోగించుకోవడం లేదు. జి-20 దేశాలన్నిటిలో యువకుల కంటే యువతుల నియామకం తక్కువగా ఉంది. సౌదీ అరేబియా, టర్కీ, భారత్‌లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. విధాన నిర్ణేతలు ప్రధానంగా రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. అవి కార్మిక వనరులను మెరుగ్గా ఉపయోగించు కోలేక పోవడం, మెరుగైన ఉద్యోగాలను కల్పించకపోవడం. వివిధ వర్గాల కార్మికుల ఆదాయాల్లో అసమానతల తీవ్రత సంక్షోభం ముందు, సంక్షోభం అనంతరం కూడా కొనసాగుతోంది. అనేక జి-20 దేశాల్లో గత 20 సంవత్సరాల్లో ఈ అసమానతలు మరింతగా పెరిగాయి. తక్కువ వేతనం పొందే కార్మికుల్లో పది శాతం మంది ఆదాయాలతో పోలిస్తే అత్యంత ఎక్కువ వేతనం పొందే కార్మికుల్లో పది శాతం మంది ఆదాయాలు బాగా పెరిగాయి. అనేక దేశాల్లో కార్మికుల వేతనాల మధ్య వ్యత్యాసం తక్కువ వేతనాలు పొందేవారిలో యాభై శాతం మందిలో కంటే అధిక వేతనాలు పొందే యాభై శాతంలో ఎక్కువగా ఉంది. ప్రొఫెషనల్‌ కార్మికుల జీతాలు గణనీయంగా పెరగ్గా ఇతర కార్మికుల నిజవేతనాలు పడిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుత అస్థిరతకు ముందుగానే కార్మిక మార్కెట్లు డిమాండ్‌ లేక కుప్పకూలిపోయాయి. సంక్షోభ సమయంలో ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. కార్మికుల్లో అత్యధికులకు ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, కర్మాగారాల్లో సానుకూల వాతావరణం మెరుగుపడలేదు. మనం మరో ప్రపంచ సంక్షోభం ముంగిట ఉన్నట్లు కనిపిస్తోంది. లేదా కొనసాగుతున్న మాంద్యంగా దీనిని పేర్కొనవచ్చు కూడా. గ్లోబల్‌ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు మరింత అరుదుగా మారిపోనున్నాయి. ఈ ఉద్యోగాలు కూడా ఎప్పుడు ఊడతాయో తెలియని విధంగా ఉన్నాయి.
నివేదికలో భారత్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పెద్దగా ప్రస్తావించకపోయినప్పటికీ జి-20 దేశాల్లో నెలకొన్న పరిస్థితులే భారత్‌లోనూ నెలకొన్నాయని చెప్పకతప్పదు. 15 ఏళ్లకు పైబడిన యువకుల ఉపాధి శాతం 2004-05లో 56 శాతం, 2007-08లో 54 శాతం ఉండగా 2009-10 నాటికి గణనీయంగా తగ్గి 52 శాతానికి తగ్గిపోయిందని జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థ అందించిన సమాచారం తెలియజేస్తోంది. 2009-10లో నిరుద్యోగ శాతం కూడా భారత్‌లో గణనీయంగా తగ్గిపోయింది. 15-24 సంవత్సరాల మధ్య యువకుల్లో ఎక్కువ మంది విద్యపట్ల మక్కువ ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉత్పాదక, సర్వీసు రంగాల్లో 2008-09లో మాంద్యం తరువాత ఉత్పత్తి పెరుగుదల నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పెరగలేదు. ఉద్యోగాలు తిరిగి పొందిన కార్మికుల నిజ వేతనాలు కూడా గణనీయంగా తగ్గడంతోపాటు కార్మికుల పని గంటలు పెరిగాయి. దేశ వ్యాపితంగా అనేక కేసులను అధ్యయనం చేస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గత దశాబ్దంలో బూమ్‌ కాలంలో ఎగుమతి సంబంధిత కార్యాకలాపాలు పుంజుకోవడంతో వలస వచ్చిన కార్మికుల పరిస్థితులను అధ్యయనం చేస్తే ఈ విషయం బోధపడుతుంది.
హిందూ దినపత్రిక గ్రామీణ వ్యవహారాల సంపాదకుడు పి. సాయీనాథ్‌ ఇటీవల సమర్పించిన నివేదికను పరిశీలిద్దాం. ''2008లో నెలకొన్న సంక్షోభం కారణంగా గుజరాత్‌లో అనేక పవర్‌లూమ్‌ యూనిట్ల (మరమగ్గాల) మూతబడ్డాయి. 2009లో ఒరిస్సాలోని గంజామ్‌ నుండి ఐదు వేల మంది కార్మికులు బర్హంపూర్‌ రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్‌ లేకపోయినప్పటికీ గుజరాత్‌ వెళ్లే రైళ్లు ఎక్కేవారు. వీరిలో ఎక్కువ మంది సూరత్‌, ముంబయి నగరాలకు వలస వెళ్లే కార్మికులే. మనకు అతి తక్కువ ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయనే విషయం సూరత్‌లోని మన యజమానులకు తెలుసు'' అని గంజామ్‌కు చెందిన గణేష్‌ ప్రధాన్‌ పేర్కొన్నాడు. వారాంతపు విశ్రాంతి దినాలుండవు. పని గంటల సమయంలో మధ్యలో విశ్రాంతి సమయం ఉండదు. 12 గంటల సుదీర్ఘ షిఫ్ట్‌ల్లో పనిచేయాల్సి ఉంటుందని కూడా గణేష్‌ తెలియజేశాడు. ''పని పెరిగింది. అయినా వేతనాలు తగ్గాయి. భోజన విరామ సమయం కూడా లేకుండా పోయింది. మేము నిస్సత్తువకు లోనవుతున్నాం. అయినా మాకు రావల్సిన డబ్బులు ముట్టడం లేదు. ఇతర ప్రాంతాల్లో ఇంతకంటే మెరుగైన పరిస్థితులు లేవనే విషయం మాకు తెలుసు'' అని గణేష్‌ తెలిపాడు.
ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ఇందువల్ల స్పష్టమవుతోంది. సామాజిక, రాజకీయ సంక్షోభాలు కూడా మన ముంగిట ఉన్నాయి. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ జి-20 నాయకులు పరిస్థితి తీవ్రతను గుర్తించకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 

No comments:

Post a Comment