వి.హనుమంతరావు
సీనియర్ పాత్రికేయులు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై భక్తిరసం ఇటీవల తెప్పలుగా పారుతున్నది. మరోపక్క పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి పాలకులు ధర్మోపన్యాసాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుదినం నేలరాస్తూనే, అన్నా హజారే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తున్నారని నేరారోపణ చేయటం కాంగ్రెస్ పాలకులకే చెల్లు.
పార్లమెంటు పవిత్ర దేవాలయం వంటిది. అది మన రాజ్యాంగ సృష్టి. అలాంటి వ్యవస్థను అపవిత్రం చేయటం శిక్షార్హం. ఆ వ్యవస్థను అన్నా హజారే ప్రశ్నించడం, ఉల్లంఘించడం, రాజ్యాంగాన్నే ధిక్కరించడం అన్నది కాంగ్రెస్ పాలకుల నేరారోపణ. అది చట్టాలు రూపొందించే పార్లమెంటును, దాని విధివిధానాలు, నియమ నిబంధనలను ప్రశ్నించడమేనని వారి వాదన. అవినీతిని నిరోధించడానికి తన బిల్లును పార్లమెంటు ఆమోదించాలని డిమాండ్ చేయటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని గ్రహించిన అన్నా హజారే తన కోర్కెను మూడు అంశాలకు కుదించి బయటపడ్డారు. కానీ అన్నాను తప్పుపట్టిన కాంగ్రెస్ చేసిన నిర్వాకమేమిటి? ఇక్కడ పార్లమెంటు పనిచేయాల్సిన తీరు, నియమనిబంధనల గురించి ప్రస్తావించాల్సి ఉంది.
అటు పార్లమెంటు, ఇటు శాసనసభల్లో సుమారు ఒకే రకమైన నిబంధనలుంటాయి. బడ్జెట్ సమావేశం ముందు దేశాధ్యక్షుని ప్రసం గం, బడ్జెట్, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు, తీర్మానాల మీద, ఈ నాలుగు సందర్భాల్లో సభ్యులు తమ ఓటింగ్ హక్కును వినియోగిస్తారు. ప్రతీ సంద ర్భంలో ఓటింగ్‌కు పెట్టే ముందు స్పీకర్ అనుకూలంగా ఎవరు, వ్యతిరేకంగా ఎవరు అనేది తెలుసుకోవటం జరుగుతుంది. లోక్‌పాల్ వ్యవస్థ మీద జరిగిన చర్చ సందర్భంలో ఈ విధానాన్ని ప్రభుత్వం పాటించిందా అనేది చూడాలి. అనంతరం ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం సభ్యులు నియమ నిబంధనలు పాటించాలని, హజారే మూడు సూత్రాలను సభ సూత్ర ప్రాయంగా అంగీకరించిందని, సభలో జరిగిన చర్చల వివరాలను స్టాండింగ్ కమిటీకి పంపించాలని స్పీకర్‌ను కోరారు.
ఆ రోజు జరిగిన చర్చలను మీడియా ప్రచురించిన ప్రకారం సభ అభిప్రాయాన్ని బల్లలు చరచటం ద్వారా తెలియ జేశారు. స్పీకర్ మాట్లాడుతూ ‘బల్లలు చరచటం వాయిస్ ఓటు ఒకటే’నని అంటూ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది కాబట్టి ఓటింగ్ అవసరం లేదు. ఎవరూ ఓటింగులో పాల్గొనకుండా ఉండలేదు. లేదా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అని ప్రకటించారు.
పార్లమెంటు మాజీ సభ్యుడు, పార్లమెంటరీ వ్యవహారాల్లో తల నెరిసిన ఈరా సెజియన్ పార్లమెంటు వ్యవహారాల్లో అధికారయుతంగా ప్రకటించిన ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’ అనే గ్రంథంలో ఓటింగ్ గురించిన విధివిధానాలను ఉటంకిస్తూ ‘సభ అభిప్రాయం’, ‘ఒక ప్రకటనను తీర్మానంగా భావించడం’, ‘బల్లలు చరిస్తే అది వాయిస్ ఓటుతో సమానం’ అని ప్రకటిం చడం చాలా విచిత్రంగా, అర్థం చేసుకోలేనివిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
పధాని మాట్లాడుతూ హజారే ప్రతిపాదించిన తీర్మానం పార్లమెంటరీ డెమోక్రసీలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. కానీ పార్లమెంటరీ నియమ నిబంధనల ప్రకారం ఓ తీర్మానం ఆమోదానికి పెట్టారా అంటే అదీ లేదు. ఏ పార్లమెంటరీ విధివిధానాల ప్రకారం ‘సభ అభిప్రాయం’ అనే తీర్మానం చేశారో, బల్లలు చరిచి తీర్మానం ఆమోదిం చినట్లు ప్రకటించారో చెప్పమని సెజియన్ ప్రశ్నించారు. కీలక సందర్భాల్లో పార్లమెంటు నిర్వహణ ఇలా ఉండగా, ఆర్థికరంగం తీరుతెన్నులు దినదినం దిగజారుతూ దేశ సార్వ భౌమాధికారానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నాయి.
ఆరు దశాబ్దాల భారత పార్లమెంటు వరసగా 12వ సారి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన ప్రతీసారి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని నమ్మబలుకుతూ వచ్చినా ద్రవ్యోల్బణం తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతూనే వస్తోంది. ధరలు దివి నుంచి భువికి దిగిరావడం లేదు. ఈ దుష్పరిణామం ఆర్థికమంత్రి ప్రణబ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నది. రెండంకెల స్థాయికి ద్రవ్యో ల్బణం చేరుకొనే పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, వరసగా అశుభ వార్తలొస్తున్నాయని ప్రణబ్ వాపోయారు.
మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? ‘రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం కలిసి ద్రవ్యోల్బణ పరిస్థితిని చక్కబెడతాం’, ‘సమస్యనెలా పరిష్కరించాలో, అధిగమించాలో చూస్తాం’, ‘ప్రపంచ మార్కెట్ల న్నింటినీ ఈ సమస్య కమ్ముకొస్తూంది’. ఇదీ ప్రణబ్ స్పందన! ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా ఇదే పాట. ఇందులో కొత్తదనం ఏమిటంటే తన ప్రభుత్వ వైఫ ల్యానికి పరిష్కారం తన చేతుల్లో లేదు, ప్రపంచమంతా ఇలాగే మండిపో తోంది. నేనేమీ చేయలేను అని చేతులెత్తేయడమే. ఒక పార్శ్వం నుంచి చూస్తే కనిపించే దృశ్యం ఇది.
మరో పక్క నుంచి చూస్తే పారిశ్రామికవేత్తలు వడ్డీ భారం పెరిగిపోతున్న దృష్ట్యా పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి జంకుతున్నారు. ప్రభుత్వం మీద తమ ఒత్తిడిని పెంచడానికి ఉత్పత్తిని తగ్గించి ఒక రకమైన సమ్మెకు పూను కొన్నారు. ఉత్పత్తి సూచి తగ్గిన మాట నిజమే. గత సంవత్సరం జూలైలో ఎని మిది శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి సూచి ఈ సంవత్సరం అదే నెలలో 3.3 శాతానికి దబ్బున పడిపోయింది.
పజల కొనుగోలుశక్తి తగ్గటంతో పారిశ్రామి కోత్పత్తులకు గిరాకీ తగ్గింది. ఇది పారిశ్రామికవేత్తల, కార్పొరేట్ సంస్థల రెండో వాదన. వడ్డీలు ఇలా పెరిగితే అభివృద్ధి మందగిస్తుంది జాగ్రత్త అని ప్రభుత్వా నికి వారి హెచ్చరిక. పారిశ్రామికాభివృద్ధికి భూమి కావాలి. తాము రైతుల నుంచి కొనుగోలు చేయాలంటే సాధ్యం కావడం లేదు కనుక ప్రభుత్వమే భూమి సేకరించి కేటాయించాలనేది వారి మూడో వాదన. ప్రభుత్వం భూసేక రణ బిల్లు ప్రకారం భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తే, తాము పరిశ్రమలు పెట్టలేం, అభివృద్ధి ముందగిస్తుంది అనేది వారి మూడో వాదన.
ఈ వాదనలకు ప్రతిగా వినిపిస్తున్న వాదనలూ ఉన్నాయి. పరిశ్రమల వ్యయంలో వడ్డీ చెల్లిం పు అత్యల్పం. కాగా పారిశ్రామికవేత్తల గోలకు అసలు కారణం వారి లాభాల్లో కోత పడుతూండటం. వడ్డీరేట్లు పెరగటం వాస్తవమే. అలాంటప్పుడు వారికి కావాల్సిన నిధులను చాలా తక్కువ వడ్డీకి లభించే విదేశాల నుంచి తెచ్చుకో వచ్చు కదా! అంతేకాదు, తాజాగా చైనా నుంచి కూడా రుణాలు తెచ్చు కోవడానికి భారత ప్రభుత్వం అనుమతిని ప్రకటించింది. ఇంకేం కావాలి!
వ్యవసాయరంగం పచ్చగా ఉంటే మొత్తం ఆర్థికవ్యవస్థే పచ్చగా ఉం టుంది. గత రెండు మూడేళ్లుగా వ్యవసాయోత్పత్తి పెరుగుతూనే వస్తోంది. అలాంటప్పుడు పారిశ్రామిక రంగం ఒక్కటే నేల చూపు చూస్తోందంటే దానికి కృత్రిమ కారణమేదో ఉండాలి. అందుకు పారిశ్రామికవేత్తలే కారణమని అనిపి స్తోంది. స్థూల జాతీయాదాయం అభివృద్ధి రేటు ఎనిమిది శాతం దిగువకు పడిపోయింది. ఉత్పత్తుల, సేవల విలువే జీడీపీ అనేది తెలిసిన విషయమే. దేశంలో ధరల పెరుగుదల మూలంగా వీటి విలువ పెరగాలి కదా! జీడీపీ పెర గాలి కదా! కాని అభివృద్ధి రేటు తగ్గుతుందేమిటి?
భారత ప్రభుత్వం ప్రైవేటీకరణ భూతాన్ని పట్టపగ్గాలు లేకుండా విడిచి పెట్టింది. అంటే దేశాన్ని తాము అభివృద్ధి చేయలేమని, తమ వద్ద నిధులు లేవని, అందుచేతే ప్రైవేట్ రంగాన్ని గత్యంతరం లేక ఆహ్వానిస్తున్నామని అంటోంది. సరళీకృత ఆర్థిక విధానం ప్రవేశపెట్టిన నాటి నుంచి, ప్రపంచ బ్యాంకు ఆదేశం మేరకు ఈ విధానాన్ని మొదట ప్రభుత్వం - ప్రైవేట్ రంగాల ఉమ్మడి ఆధ్వర్యంలో దొడ్డిదారిన ప్రవేశపెట్టింది. ప్రైవేటు రంగం పరిధిలోకి విదేశీ బహుళజాతి సంస్థలు, దేశీయ కార్పొరేట్ సంస్థలు వస్తాయి.
ప్రభుత్వ రంగం ప్రజలను, దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొంటే ప్రైవేట్ రంగం లాభా లు, మరిన్ని లాభాలు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఈ రెండు రంగాల లక్ష్యాలు వేర్వేరు, విభిన్న లక్ష్యాలతో ఉమ్మడిగా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఈ రంగాల్లో ఎవరికి ఎక్కువ ఆర్థిక బలం ఉంటే త్రాసు అటువైపు మొగ్గుతుంది. ఇటీవల వెలుగు చూసిన స్కాముల్లో ప్రైవేటు రంగం కోట్లకు పడగలెత్తిందనే విషయం వెలుగుచూసింది. ప్రభుత్వ విధానాలే వారి లాభాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. డబ్బుతో అధికారులను, మంత్రులను కొనుగోలు చేసే శక్తి వారికి సంక్రమించింది.
ఈ అసమాన కలయికతో ప్రైవేటురంగం బలంగా తయారైంది. కాబట్టి వారే అధికారాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా చలాయిస్తున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ ప్రభుత్వరంగంలో ఉంటూ వచ్చాయి కాబట్టి వాటిలోని నిధులు దేశాభివృద్ధికి ఉపయోగపడతాయి. వాటిని ఇప్పుడు మెల్లగా ప్రైవేటీకరిస్తు న్నారంటే, ఆ మేరకు నిధులు ప్రైవేటు రంగం మరింతగా పుంజుకోవడానికే తోడ్పడతాయి. ప్రైవేటీకరణలో ఉద్యోగులను తొలగించి, టెక్నాలజీ సహా యంతో వ్యవస్థను నడిపిస్తారు. ఇది నిరుద్యోగం పెరగడానికే దారితీస్తుంది.
ఈ రెండు రంగాల్లో నిధులు ప్రైవేటురంగానికి మళ్లుతాయి కాబట్టి, ఆ మేరకు ప్రభుత్వానికి నిధులు లభించవు. అసలే నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభు త్వం మరింతగా నిధులు కొరతను ఎదుర్కొని, సామాజిక సంక్షేమ పథకాలకు, సబ్సిడీలకు కోత పెడుతుంది. దీనర్థం ప్రైవేట్ రంగాన్ని అసలుకే లేకుండా చేయాలని కాదు. దేశాభివృద్ధిలో వారి పాత్ర కూడా కీలకమే. అయితే ఏఏ రంగాలు ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలో ప్రభుత్వం ప్రజలతో సంప్రదించి నిర్ణయించాలి. కానీ మన్‌మోహన్, అహ్లూవాలియా, ప్రణబ్, చిదంబరం బృందం అధికారంలో కొనసాగినంత కాలం అది సాధ్యమా?
No comments:
Post a Comment