Thursday, October 13, 2011


జీవితాంతం జైలే!
మినిమం పదేళ్ల శిక్ష.. రైల్వే చట్టం కింద కేసులు
పట్టాలపై కూర్చున్నా నేరమే.. ప్రేరేపించిన వాళ్లకూ శిక్ష

పట్టాలపై కూర్చున్నా నేరమే.. ప్రేరేపించిన వాళ్లకూ శిక్ష
కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది
విద్యార్థులూ.. భవిష్యత్తు నాశంనం చేసుకోవద్దు
ఉద్యోగులూ.. కొలువు పోయే పరిస్థితి వద్దు
రైల్‌రోకోపై సర్కారు సీరియస్... డీజీపీ దినేశ్ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 13 : రైల్‌రోకోపై డీజీపీ దినేశ్ రెడ్డి మరోమారు గట్టిగా హెచ్చరిక స్వరం వినిపించారు. రైల్‌రోకో పేరుతో పట్టాలపై వంటావార్పు, ఎడ్లబండ్లు అడ్డుపెట్టడం, ఫిష్ ప్లేట్లు తొలగించడం వంటివి చేస్తే రైల్వే చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రైళ్లను అడ్డుకోవడమే కాదు... రైలు పట్టాలపై కూర్చున్నా తీవ్ర నేరమేనని తెలిపారు. తెలంగాణ జేఏసీ శనివారం నుంచి మూడు రోజుల రైల్‌రోకోకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో గురువారం డీజీపీ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

"రైల్వే వ్యవస్థ అత్యంత కీలకమెనది. రైల్‌రోకోపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేబోర్డు సీరియస్‌గా ఉన్నాయి. ఈసారి రైల్వే చట్టం, 1989 కింద కేసులు పెడతాం. దీని ప్రకారం పదేళ్ల నుంచి యావజ్జీవం వరకు శిక్షలు పడే అవకాశముంది'' అని డీజీపీ తెలిపారు. రైళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు హితవు పలికారు. విద్యార్థుల క్షేమం కోరే ఉద్యమ నాయకులు వారికి మంచి సూచనలు చేయాలని, రెచ్చగొట్టవద్దని కోరారు. రైల్వే చట్టాల కింద కేసులు నమోదైతే, ఉద్యోగాలు కోల్పోతారని... ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. రైల్‌రోకోలో పాల్గొంటే అందరూ కోర్టుల చుట్టూ తిరగాల్సి

ఉంటుందన్నారు. "తప్పు చేసిన వాళ్లే కాదు! చేయించిన వారు, చేసేలా ప్రేరేపించిన వారు కూడా శిక్షార్హులే. కొంత మంది ఉద్యమ నేతలు... కోటి మందిమి పట్టాల మీదికి పోతాం.. మమ్మల్నేమీ చేయలేరు అని ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఆధారాలు చాలు'' అని డీజీపీ తెలిపారు. రైల్వే చట్టాల కింద కేసులు పెడితే పడే శిక్షల గురించి వివరించారు. "ఎవరినో భయపెట్టడానికి ఇదంతా చెప్పడంలేదు. కేవలం చైతన్యపరచడానికే చెబుతున్నాను. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటం మా బాధ్యత'' అని చెప్పారు.

పట్టాలపై నిఘా వేశాం...
ప్రత్యేక రైలులో జమ్మూ కాశ్మీర్ నుంచి 18 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలు హైదరాబాద్‌కు వస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఐటీటీపీ, ఏపీఎస్‌పీ, సీఆర్‌పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. "తెలంగాణలోని 1600 కిలోమీటర్ల రైల్వేట్రాక్‌ను నిఘా కెమెరాలతో గమనిస్తున్నాం. ఎవరు పరిధి దాటినా జీవితాంతం కోర్టులు, జైళ్లకే పరిమితమవుతారు. ఇప్పటికే 294 మందిపై రైల్యేయాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. ఈ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నా, రైల్వేబోర్డు అంగీకరించలేదు.

మణుగూరులో ఫిష్‌ప్లేట్లు తొలగించిన వ్యక్తిని గుర్తించాం. కఠినంగా శిక్షిస్తాం'' అని తెలిపారు. గాంధేయవాద పద్ధతిలో చేస్తున్న ఉద్యమాలపై ఎలా చర్యలు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించగా... "రైళ్లు ఎక్కొద్దని, పిల్లలను స్కూళ్లకు పంపొద్దని గాంధేయ పద్ధతిలో పిలుపునివ్వచ్చు. ఆ హక్కు ఎవరికైనా ఉంది. కానీ, రైళ్లలో వెళ్లేవారిని అడ్డుకోవద్దు. స్కూళ్లను బలవంతంగా మూయించవద్దు. అలా చేసి మాకు అనవసరంగా పనిపెట్టొద్దు. విద్యా సంస్థలను మూసివేయాలని బెదిరింపు ఫోన్లు చేస్తే కేసులు నమోదు చేస్తాం'' అని డీజీపీ తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని విద్యా సంస్థలు, తల్లి తండ్రులు తమను కోరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా తమ చేతులు కట్టేయలేదన్నారు. రైల్‌రోకోలో టీ-కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొంటామని అంటున్నారు కదా, సీమాంధ్ర నేతలూ ఇలాంటి ప్రకటనలు చేశారు కదా అని ప్రశ్నించగా... "చట్టానికి ఎవరూ అతీతులు కాదు. మాకు కులం, మతం, ప్రాంతం, పార్టీల తేడా లేదు. ఎవరు గీత దాటినా చర్యలు తీసుకుంటాం'' అని డీజీపీ బదులిచ్చారు.

ఉద్యమకారులపై కేసులు పెట్టాల్సిందిగా పోలీసులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు లేవన్నారు. "నినాదాలు, ధర్నాలు, రాస్తారోకోల్లో పోలీసులు ఎప్పుడూ కలుగజేసుకోలేదు. నకిరేకల్‌లో ఆందోళనకారులు పోలీసులపైనే దాడి చేయడంతో లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది'' అని వివరించారు. ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ముందుకు వచ్చిన వారిన అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, ఉద్యమకారులు పరిధులు దాటవద్దని హెచ్చరించారు.

ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ కార్యక్రమా లు జరుపుకోవచ్చని... అయితే, సమ్మెను విరమించిన యూనియన్‌ను, ఆ నాయకులను అడ్డుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. మింట్ కాంపౌండ్‌లోకి వద్దన్నా వెళ్లినందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని, పోలీసులు వదిలిపెట్టినా ఆయన రాత్రిదాకా స్టేషన్‌లో కూర్చున్నారని తెలిపారు. విలేకరులు కూడా తప్పుడు రాతలురాసి సమస్యలు తెచ్చుకోవద్దని సూచించారు. ఇలా రాసిన ఒక ఆంగ్ల పత్రికపై తాము చట్టపరంగా చర్య తీసుకోబోతున్నామన్నారు.

"మీడియా ప్రతినిధులను కొట్టడం పోలీసుల ఉద్దేశం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ సమయంలో మీడియా ప్రతినిధులు దూరంగా ఉండి కవరేజ్ చేసుకుంటే మంచిది'' అని సలహా ఇచ్చారు. విమానాశ్రయం భద్రత, క్రికెట్ మ్యాచ్ నిర్వహణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఈ సమావేశంలో రైల్వే అడిషనల్ డీజీ కౌముది, శాంతి భద్రతల అడిషనల్ డీజీ హుడా, నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



అదిగో పులి... !
హాట్ కేక్!
‘అదిగో పులి’
అరిచారెవరో.
ఎక్కడ.. ఎక్కడ... అన్నారు భయంతో బిక్కచచ్చిన వాళ్లు చచ్చి నీల్గుతామనుకున్న వాళ్లు.
‘ఇదిగో తోక’
అనరిచారెవరో.

ఎక్కడ.. ఎక్కడ... అన్నారు బిక్కచచ్చిన వాళ్లు భయంతో నీల్గుతామనుకున్న వాళ్లు చచ్చి.
అదిగో పులి అని అరిచేవారు అదే పనిగా అరుస్తూనే వున్నారు.
ఇదిగో తోక అని అరిచేవారు అదే పనిగా వున్నారు అరుస్తూనే.

ఇంతకీ పులి ఎవరికైనా కనిపించిందా ఎవరికీ తెలీదు. అసలింతకీ పులి అనబడే పులి నిజంగా వున్నదా తెలీదు ఎవరికీ. పులి వుందంటే వుంది. పులి లేదని ఎవరూ అనడం లేదు కనుక పులి వుంది. ఉంటే ఎక్కడ వుంది? ఊరికి ఆనుకుని వున్న చిట్టడివిలోనా? ఊరికి మరోపక్క గోడై నిలబడ్డ గుట్టల్లోనా?
అదిగో పులి అని అరిచిన వాళ్లకి అది కనిపించిందా చిట్టడవిలో.

అదిగో తోక అని గీపెట్టిన వాళ్లకి కనిపించిందా అది కొండగుట్టల్లో.
పులిని స్వయంగా చూసిన వాళ్లెవరూ ముందుకు వచ్చి కనిపించడం లేదు. పులిని స్వయంగా చూసొచ్చామని చెప్పిన వాళ్లని చూసిన వాళ్లు మాత్రం వున్నారు. పులిని చూసొచ్చామని చెప్పిన వాళ్ల దగ్గర పోగు చేసిన చెదారం పంచేవాళ్లు మాత్రమే వున్నారు.

వేపచెట్టు కింద కాళ్లు చాపుకుని బార్లా బోర్లా పడుకుని ఎర్రటి నాలుకని నోట్లోంచి యివతలకి సాగదీసి కళ్లు రెండూ మూసుకుని పులి ఆవులించిందట అన్నారు కొందరు. మిట్ట మధ్యాహ్నం వేళ ఏట్లో ఈ పక్క నీళ్లు తాగుతుంటే ఆ పక్క నీళ్లు తాగడం కనిపించిందట అన్నారు కొందరు. పులి మనిషిదో మరి దేనిదో బాడీని నోట కరుచుకుని పొదల్లోంచి ఈడ్చుకుపోవడం చూశామని చెప్పిన వాళ్లని గురించి చెప్పిన వాళ్లున్నారు.

పులి సంగతి తెలిసిన్నాటినించీ జనం పులి జూదం ఆట్టం మానేశారు. ఇళ్ల తలుపులు జాగర్తగా వేసుకుంటున్నారు. పులి గాండ్రింపు కోసం చెవులు రిక్కించుకుంటున్నారు. కథలు కథలుగా చిలవలై పలవలై వినిపిస్తున్న పులి కథలు వినడానికి ఎల్లవేళలా రెడీగా ఉంటున్నారు. విన్నవాటిని నలుగురికి నసాళానికంటే మసాళాలు కలిపి వండి వడ్డించటానికి రెడీ అయిపోతున్నారు.

ఏ నోటను విన్నా పులి నామస్మరణమే. ఏ మనిషయినా దీపాల టైముకి కొంపకి చేరకపోతే పులికి మంచ్‌గానో లంచ్‌గానో ఖర్చయిపోయాడని ప్రచారమే.

ప్రచారం ప్రచారానికి పూనుకున్నాక ఏ పేపర్లో చూసినా పులి శీర్షికలే ఏ ‘మూర్ఖపేటిక’లో చూసినా పులి వూహాచిత్రాలే! శిఖర వార్తలే! పులి మీద పుట్రలే!
పులి వుందనుకుంటే ‘ఎస్’ అని లేదనుకుంటే ‘నో’ అని ఎస్సెమ్మెస్‌ల వర్షాలు, పులి వుండే అవకాశాల మీద లేకుండా వుందే ఛాన్సెస్ మీద హార్డ్ కోర్ చర్చలు. అసలు పులి అనగానేమి పులుల రకాలు పులుల రంగులు పులి గోళ్ల పొడవు పులిపంజా పవరు వంటి వాటి స్టోరీ బోర్డులు మెళ్లో పులిగోరు గొలుసున్న వాళ్లతో ఇంటర్వ్యూలు పులివేషాలు పులి డాన్సులు శార్దూల పద్యపఠనాలు వ్యాఘ్రేశ్వర వ్రత విధానాలు పులికి సంబంధించిన సంపూర్ణ సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు... ఎందెందు వెదకి చూచిన అందందే పులి. కంటికి కనిపించని పులి అయినా కంటినిండా పులే మెదడంతా బెబ్బులే!

నాన్నా పులి కథలోని కుర్రాడు పులికి బ్రేక్‌ఫాస్టయ్యేక పులీ కనిపించలేదు కుర్రాడూ అయిపులేడు. కథ మాత్రం ఎక్కడికీ పోలేదు. లేనిది వున్నట్టు వున్నది లేనట్టు చెప్పే ‘ఆంఫట్టు’ మంత్రం అవాకుల కథకూ చెవాకుల కథకూ బాగా వచ్చు.

ఒక్కాలంలో మనుషుల నోళ్లందున నాని నాని రూపురేఖా లావణ్య విలాసములందు పెనుచేటు మార్పులు చేర్చుకునే కమామిషులు, అక్షరాలూ మనుషులూ గాలిలో వేలాడ్తూ గదిలోకి వచ్చే ఇక్కాలంలోనూ కాళ్లు లేని కథలుగా చెవుల్లేని ముంతలుగా చెలామణీ అయ్యేనయ్యేను.
గుండె వేగాన్ని మించడం కోసం కళ్ల చక్రాల్ని గిర్రున తిప్పడం కోసం మెదడుకి కాలుష్యం మేత వెయ్యడం కోసం కాకమ్మ కబుర్ల సాలెగూళ్లు అల్లే వారెందరో గోబెల్స్.
అదిగో పులి అరిచారెవరో
ఇదిగో తోక అనరిచారెవరో
ఇంతకీ పులి ఎవరికైనా కనిపించిందా?

-చింతపట్ల సుదర్శన్

No comments:

Post a Comment