Saturday, October 8, 2011




దీపావళికి కొలిక్కి!
విభజనా? సమైక్యమా?.. తుది అవగాహన దిశగా కాంగెక్రస్

జోరందుకున్న సంప్రదింపులు..
రోజంతా మినీ కోర్ కమిటీ బిజీ బిజీ
సీఎం సహా 9 మందితో చర్చలు..
ప్రత్యేక పరిస్థితులపై ప్రశ్నల పరంపర
సోమవారంతో చర్చలు పూర్తి..
ఆపై సోనియాకు ప్రణబ్ నివేదిక
మేడమ్ చేతిలోనే తుది నిర్ణయం..
రాష్ట్రపతి పాలన ఉండదు

దీపావళికి అటో ఇటో తేలిపోతుందా? రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తుందా? ఏళ్ల తరబడి నాన్చుతున్న ఈ సమస్య పరిష్కారంపై తుది అవగాహనకు వస్తుందా? ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ 'ఔను' అనే సమాధానమే లభిస్తోంది.

తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. వరుస చర్చలు జరుపుతోంది. శనివారం ఒక్కరోజే... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తోపాటు రాష్ట్రానికి చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అభిప్రాయాలను 'పరిష్కర్త' ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మినీ కోర్ కమిటీ సేకరించింది. గవర్నర్ నరసింహన్ ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో చర్చించారు.


న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఢిల్లీలో ఏదో జరుగుతోంది! సకల జనుల సమ్మె సెగ హస్తినను తాకింది. తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశగా అధిష్ఠానం ప్రారంభించిన కసరత్తు వేగం పుంజుకుంది. కేంద్ర మంత్రి, సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని 'మినీ కోర్ కమిటీ' సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరం చేసింది. ప్రణబ్‌తోపాటు హోంమంత్రి చిదంబరం, రక్షణమంత్రి ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ శనివారం మొత్తం చర్చల ప్రక్రియను కొనసాగించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్‌లతోపాటు రాష్ట్రానికి చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, పళ్లంరాజులతో విడివిడిగా చర్చించారు. ఈ ప్రక్రియ సాంతం 'కొంత భిన్నం'గా సాగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కాంగ్రెస్ పెద్దలు తమ అంతరంగాన్ని బయటపెట్టకుండా, 'ఏం చేద్దాం! మీ అభిప్రాయం ఏమిటి!' అంటూ నేతలకు ప్రశ్నలు సంధించారు.

రాష్ట్రాన్ని విభజించాలా, వద్దా? విభజిస్తే సీమాంధ్రలో తలెత్తే పర్యవసానాలేమిటి? చేయకపోతే తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ హోదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఐదు దశాబ్దాలుగా సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్‌తో ఏర్పడ్డ అనుబంధాన్ని ఎలా పరిగణించాలి? రాష్ట్రంలో ఉభయ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలం ఎలా ఉంది? విభజనపై నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? వంటి ప్రశ్నలను సంధించారు.

ఆయా ప్రశ్నలకు ఎవరు ఏ సమాధానం చెబుతున్నారో కోర్ కమిటీ సభ్యులు శ్రద్ధగా విన్నారు. అప్పటికప్పుడు నోట్ చేసుకున్నారు. స్థూలంగా చూస్తే... తెలంగాణ ఇవ్వక తప్పదని జైపాల్ రెడ్డి, రాజనరసింహ, డీఎస్ స్పష్టం చేసినట్లు తెలిసింది. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు శిరోధార్యమని సీమాంధ్రకు చెందిన కిషోర్ చంద్రదేవ్, పళ్లం రాజు, పురందేశ్వరి, పనబాక లక్ష్మి చెప్పినట్లు సమాచారం. ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోవాలని అందరూ కోరినట్లు తెలుస్తోంది. ఇక... సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావు, మరో ముఖ్య నేత చిరంజీవికి కూడా ఢిల్లీ నుంచి పిలుపు అందింది.

వీరు ఆదివారం ప్రణబ్‌తో, ఇతర కోర్‌కమిటీ సభ్యులతో సమావేశమవుతారని తెలుస్తోంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా సోమవారం కోర్‌కమిటీతో చర్చిస్తారని సమాచారం. మరోవైపు... సోమవారం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతారు. శనివారం 9 మంది ముఖ్య నేతలతో చర్చించిన ప్రణబ్... ఈ చర్చలు సోమవారం ముగుస్తాయని విలేకరులకు తెలిపారు. నిర్ణయం ఎప్పుడు తీసుకుంటామె చెప్పలేనని అన్నారు. ఈ చర్చలు మగిసిన అనంతరం ప్రణబ్ తన నివేదికను సోనియాగాంధీకి సమర్పిస్తారని తెలుస్తోంది. సంప్రదింపులు, చర్చల ఆధారంగా దీపావళి నాటికి కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై తుది అవగాహనకు వస్తుందని సమాచారం.

రాష్ట్రపతి పాలన లేనట్లే!: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమే లేదని తెలుస్తోంది. అసలు రాష్ట్రపతి పాలన అవసరమేమిటని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్, పార్టీ ఇన్‌చార్జి ఆజాద్ ప్రశ్నించడం గమనార్హం. అయితే... కాంగ్రెస్ తన వైఖరి ప్రకటించిన తర్వాత ఏదో ఒక ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పితే, అప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన గురించి ఆలోచించవచ్చని సమాచారం. ఙ

మేడమ్ చేతిలోనే...!!
మినీ కోర్ కమిటీ బాధ్యత 'అభిప్రాయ సేకరణ'కే పరిమితమని, తుది నిర్ణయం మేడమ్ సోనియా చేతిలోనే ఉన్నట్లుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. కోర్ కమిటీతో తమ సమావేశం 'ఇంటర్వ్యూ' తరహాలో సాగిందని తెలిపారు. "గతవారం జరిగిన కోర్ కమిటీలో నిర్దేశించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం వారొక ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకుని జవాబులు సేకరించారు. నిజానికి ఐదుగురు కోర్ కమిటీ సభ్యుల మధ్య కూడా తెలంగాణపై భిన్నాభిప్రాయాలున్నాయి.

తమకంటూ ఒక అభిప్రాయం లేకుండానే మమ్మల్ని ప్రశ్నించినట్లు కనిపిస్తోంది. ఒక దిశానిర్దేశం లేకుండా వారు ప్రశ్నించడం వల్ల... వెళ్లిన వారికి కూడా ఏం జరుగుతోందో తెలియని అయోమయం నెలకొంది. పరిస్థితి... గుడ్డివాళ్లు ఏనుగు రూపాన్ని వర్ణించినట్లుగా తయారైంది'' అని ఓ నేత వాపోయారు. ప్రశ్నలు ఐఐటీ ఎంట్రన్స్‌లాగా ఉంటాయని వెళితే, ఎలిమెంటరీ స్థాయికే పరిమితమైనట్లున్నాయని మరో నేత అన్నారు. "మా జవాబులు విని వారు టిక్కులు పెట్టుకుంటుంటే... ఏం చేస్తారోనని భయమేసింది.

అందరి అభిప్రాయాలు తీసుకుని తనకు నివేదించాలని సోనియా కోరినట్లు అర్థమవుతోంది'' అని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు. తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కోర్ కమిటీతో భేటీ తర్వాత మీకెలా అనిపించింది? అని ఎవరిని ప్రశ్నించినా... 'ఏమీ అర్థం కావడంలేదు' అని ప్రతినేతా చెప్పడం గమనార్హం. త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని మాత్రం అందరూ అంటున్నారు. కాని ఆ నిర్ణయం ఏమిటి? అంటే మాత్రం ఎవరూ చెప్పడం లేదు.
**********************************************************************************

నాన్చితే నష్టమే

ప్రధానికి గవర్నర్ నివేదిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వివాదంపై కేంద్ర ప్రభుత్వం వీలైనంత
త్వరగా నిర్ణయం తీసుకోవటం మంచిదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రధాని
మన్మోహన్ సింగ్, హోంమంత్రి పి చిదంబరానికి అందించిన నివేదికలో స్పష్టం
చేసినట్టు తెలిసింది. తెలంగాణలో పరిస్థితి రోజురోజుకు విషమిస్తోందని, ఈ పరిస్థితులు
ఇలాగే కొనసాగనిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నివేదికలో పేర్కొన్నట్టు
చెబుతున్నారు. సకల జనుల సమ్మె మూలంగా రాష్ట్ర ఖజానాకు కనీసం పదిహేను
వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన నివేదికలో చెప్పినట్టు తెలిసింది.
సింగరేణి కార్మికుల సమ్మె మూలంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొంది.
దీనిమూలంగా ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు
నివేదికలో వివరించారు. సిమెంట్ కార్మాగారాలు మూతపడుతున్నాయి. ఇతర
పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన తమ నివేదికలో పేర్కొన్నారు.
అబ్కారీ సిబ్బంది సమ్మె మూలంగా రాష్ట్ర ఆదాయం బాగా పడిపోయిందని, దీనివల్ల
అభివృద్ధి పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడుతోందని కూడా గవర్నర్ తమ
నివేదికలో స్పష్టం చేశారని అంటున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది
పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొనటం వలన రవాణా వ్యవస్థ పూర్తిగా
స్తంభించిపోయిందని నరసింహన్ వివరించినట్టు తెలిసింది. సకల జనుల సమ్మె
ప్రారంభమై నేటికి ఇరవై ఆరు రోజులు అవుతున్నా ఎక్కడా హింసాత్మక చర్యలు
లేకపోవటం గురించి ఆయన ప్రత్యేకంగా వివరించారని అంటున్నారు. తెలంగాణలో
పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందని ఆయన చెప్పారని అంటున్నారు. నరసింహన్
శనివారం మన్మోహన్ సింగ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక
తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమం ముఖ్యంగా గత ఇరవై ఆరు రోజుల నుంచి
జరుగుతున్న సకల జనుల సమ్మెపై వివరించారు. మన్మోహన్ సింగ్‌తోపాటు రాష్ట్ర
వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్, హోంమంత్రి పి చిదంబం, పెట్రోలియం
మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి, రక్షణ మంత్రి ఏకె ఆంటోని, లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి
ప్రణబ్ ముఖర్జీని విడివిడిగా కలిసి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా
కొనసాగుతున్న సమ్మె తీవ్రతపై తమ వాదన వినిపించారు. నరసింహన్ గత రాత్రి
అంటే శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర వైద్య
ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిసి తెలంగాణాలో నెలకొన్న పరిస్థితిని
వివరించారు. ఆయన శనివారం ఉదయం పది గంటలకు చిదంబరంతో సమావేశమై
తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై నివేదిక అందించారు. తదనంతరం ఆయన 7,
ఆర్‌సిఆర్‌కు వెళ్లి మన్మోహన్‌తో దాదాపు అర్థగంట పాటు తెలంగాణ ఉద్యమాన్ని
వివరించి, నివేదిక అందించారు. తరువాత రక్షణ మంత్రి ఆంటోని, ఆర్థిక మంత్రి ప్రణబ్
ముఖర్జీ, జైపాల్‌రెడ్డిని కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.
రాష్ట్రంలో రాష్టప్రతి పరిపాలన విధిస్తారన్న అభిప్రాయం, అపోహలు మీడియాకు
ఎందుకు కలుగుతున్నాయో అర్థం కావటం లేదని విలేకరులపై చలోక్తి విసిరారు.
ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం నరసింహన్ తనను కలిసిన మీడియాతో
మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నదని గుర్తు చేశారు.
తెలంగాణలో సకల జనుల సమ్మె జరుగుతోంది. శాంతి భద్రతల పరిస్థితి
సంతృప్తికరంగానే ఉన్నది. ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనగల శక్తి, సామర్థ్యాలు రాష్ట్ర
ప్రభుత్వానికి ఉన్నాయని గవర్నర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తనకు ఎలాంటి
సూచనలు చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కాల పరిమితి
విషయమై తనకు ఎలాంటి ఆలోచన లేదని నరసింహన్ చెప్పారు. తాను ఢిల్లీకి
రావటం యాదృచ్ఛికం అని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. సమస్యను
పరిష్కరించటంలో అలస్యం జరుగుతోందన్న అభిప్రాయం తనకు ఉన్నదని ఆయన
తెలిపారు.

**********************************************************************************************

త్వరలో పరిష్కారం
అది అందరికీ ఆమోదయోగ్యం
రాష్ట్రాభివృద్ధికి సహకరించేలా కేంద్ర నిర్ణయం

సమ్మె విరమణపై జేఏసీ నేతలతో చర్చిస్తా!
తెలంగాణపై సీఎం కిరణ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 8 : రాష్ట్రంలోని పరిస్థితులపై త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మినీ కోర్ గ్రూప్‌తో శనివారం సమావేశమైన సీఎం సాయంత్రం ఇక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. "కేంద్ర నాయకత్వం తెలంగాణపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తుంది. ఆ నిర్ణయం ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యంగానూ రాష్ట్ర ప్రభుత్వానికి లాభించేలా, ప్రజల అభివృద్ధికి సహకరించేలా ఉంటుంది'' అన్నారు.

తెలంగాణ సమస్య ఎప్పటి నుంచో ఉందని గుర్తుచేశారు. ఉద్యమం నేపథ్యంలో దీనిపై కేంద్ర నాయకులు చర్చలు జరుపుతున్నారని, వీలైనంత త్వరగా వారు దీనిని పరిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిని, ప్రజల ఆకాంక్షల్ని పార్టీ పెద్దలకు తాను వివరించానన్నారు. కేంద్ర నాయకులతో తాను మాట్లాడిన విషయాలను మీడియాకు చెప్పలేనని స్పష్టం చేశారు.

సకల జనుల సమ్మెను విరమించాలని ఇప్పటికే పలు మార్లు విజ్ఞప్తి చేశామని, హైదరాబాద్ వెళ్లాక తాను మరొకమారు జేఏసీ నాయకులతో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను సీఎం తోసిపుచ్చారు. "రాష్ట్రపతి పాలన ఎందుకు వస్తుంది? రాష్ట్రపతి పాలన ఎలా వస్తుంది? రాష్ట్రపతి పాలనకు నిబంధనలేంటి? నాకు తెలీదు. మీరు తెలియజేయండి'' అంటూ విలేకరులను సీఎం ఎదురు ప్రశ్నించారు.

త్వరగా తేల్చాలి!
కాగా.. తెలంగాణ విషయంలో త్వరగా తేల్సాల్సిన అవసరం ఉన్నదని కోర్ కమిటీ సభ్యులకు సీఎం కిరణ్ చెప్పినట్లు తెలిసింది. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నదని ఆయన చెప్పారు. ఈ సమస్యను రాజకీయంగా, కేంద్ర స్థాయిలో పరిష్కరించాల్సి ఉన్నదని తాను ప్రజలకు చెబుతూ వస్తున్నానని ఆయన చెప్పారు.

తెలంగాణ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తే ఎదురయ్యే రాజకీయ పర్యవసానాలను కూడా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన అన్నట్లు తెలింది. ఏ నిర్ణయమైనా అధిష్ఠానం అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుందనే విశ్వాసం తనకున్నదని ఆయన తెలిపారు. సుదీర్ఘంగా సమ్మె జరుగుతున్నా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి తలెత్తకుండా చూస్తున్నానని ఆయన చెప్పినట్లు తెలిసింది.

అభివృద్ధి కార్యక్రమాలపట్ల జనం ప్రతిస్పందన సానుకూలంగా ఉన్నదని, ఇన్ని పరిణామాలు జరుగుతున్నా, కాంగ్రెస్ బలం ఏ మాత్రం క్షీణించ లేదని ఆయన వివరించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నదని, ఈ లోపే ఒక నిర్ణయం తీసుకుంటే.. రెండేళ్లలో అన్నీ చక్కబడతాయని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
************************************************************************************************************
కిరణ్‌ భుజస్కంధాల మీద కొండంత భారం సమ్మె ఆపండి !
cm-gov(సూర్య ప్రధాన ప్రతినిధి)రాష్ట్ర ప్రభుత్వాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టిన సకల జనుల సమ్మెకు పరిష్కారమార్గాన్ని అన్వేషించి, సుఖాంతం చేసే వ్యవహారాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భుజస్కంధాలపైనే పెట్టింది. శనివారం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు బొత్స సత్యనారాయణకు పాలన-పార్టీ వ్యవహారా లపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా.. రాష్ట్రం లో శాంతిభద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహ రించాలని, ఆ విషయంలో గవర్నర్‌తో సమన్వయం చేసుకోవా లని కోర్‌కమిటీ పెద్దలు సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. అదే సమయంలో ఇప్పట్లో రాష్టప్రతి పాలన లేనట్లేనంటు న్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం...

అధిష్ఠానం పిలుపు మేర కు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడికి ప్రణబ్‌, ఆజాద్‌ కొన్ని మార్గదర్శకాలు సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వా నికి, పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించిన సకల జనుల సమ్మె జరుగు తున్న తీరుపై చర్చ జరిగింది. ఉద్యోగులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని వారు కిరణ్‌ దృష్టికి తీసుకురాగా.. తన ప్రభుత్వం అనేక సార్లు వారితో చర్చలు జరిపిందని, తనకు వారిపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిథిలో లేని విషయాలపై వారు తమ నుంచి హామీ ఆశిస్తున్నందున తాను ఏమి హామీ ఇవ్వగలనని కిరణ్‌ వారి వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. తాను ఎలాంటి నివేదికలు పంపించ లేదని, ఆ పేరుతో దుష్ర్పచారం చేసి, ప్రజల్లో వ్యతి రేక భావన పెంచేందుకు తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలను ఆయన వారికి వివరించారు.

దానికి స్పందించిన వారిద్దరూ సమ్మెకు సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఎదుర్కోవాలని, ఆ విషయంలో వెనక్కి తగ్గవద్దని, వెనక్కి తగ్గినా, మౌనంగా ఉన్నా ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తుందని సీఎంకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముందు శాంతిభ ద్రతలు చక్కదిద్దాలని, ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నారు. ప్రజలకు, ప్రజలు-ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అందులో గవర్నర్‌ దిశానిర్దేశాలు తీసుకోవాలని, పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు.

అదే సమయంలో సమ్మెను విరమించేలా చూడాలని, ఆ బాధ్యత కూడా మీరే తీసుకోవాలని సీఎంకు స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయంత్రం తమను కలిసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సైతం కోర్‌కమిటీ సభ్యులు కీలకమైన మార్గదర్శకాలు సూచించారు. సంప్రదింపులు జరుగుతున్న సమయంలో రెండు ప్రాంతాలకు చెందిన నేతలు ఎలాంటి రెచ్చగొట్ట ప్రకటనలు చేయకుండా సంయమనం వహించే బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించి పార్టీ నాయకత్వం, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నాయకులంతా కట్టుబడి ఉండేలా నాయకులను ఒప్పించే బాధ్యత కూడా మీదేనని విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

kcr-kodandaకాగా.. తాజా పరిణామాలు పరిశీలిస్తే, ఇప్పట్లో రాష్టప్రతిపాలన రావటం అసాధ్యమని స్పష్టమయిపోయింది. గవర్నర్‌ సైతం ప్రజాప్రభుత్వం సమర్థవంత ంగా పనిచేస్తుందని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి కూడా రాష్టప్రతి పాలన పెట్టవలసిన అవసరం ఏమిటని, దానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. కీలక నేత ఆజాద్‌ కూడా రాష్ట్రంలో రాష్టప్రతిపాలన పెట్టవలసిన అవసరం గానీ, అలాంటి పరిస్థితి కూడా లేదని చెప్పడంతో.. ఇప్పటివరకూ రాష్టప్రతి పాలనపై వచ్చిన ఊహాగానాలకు తెరపడినట్టయింది. అయితే.. అంతకుముందు.. మినీకోర్‌ కమిటీలో జరిగిన చర్చలో రాష్టప్రతి పాలన వల్ల పార్టీకి వచ్చే లాభనష్టాలను బేరీజు వేసినట్లు సమాచారం. శాంతిభద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అరాచకశక్తులు, ప్రభుత్వ-ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లచేసే శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎంకు ఆదేశించారు. కేంద్రం కూడా అదనపు బలగాలు పంపిస్తోందని చెప్పారు.




*************************************************************************************************************
ఢిల్లీలో గరం 'టీ'
తెలంగాణపై రోజంతా చర్చోపచర్చలు
ఒకటి, రెండు రోజుల్లో కీలక ప్రకటన!
ప్రణబ్ సారథ్యంలో ఆంటోనీ, చిదంబరం, ఆజాద్ బృందం కసరత్తు
రాష్ట్రానికి చెందిన 9 మంది కాంగ్రెస్ నేతలతో విడివిడిగా భేటీలు
తెలంగాణపై ఏం చేద్దామంటూ అభిప్రాయాలు కోరిన అగ్రనేతలు
అభిప్రాయాలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం, బొత్స, డీఎస్, కేంద్ర
మంత్రులు జైపాల్, కిశోర్‌చంద్రదేవ్, పురందేశ్వరి, పళ్లంరాజు, పనబాక
ప్రధాని, చిదంబరంలతో వేర్వేరుగా భేటీ అయిన గవర్నర్..
రాష్ట్ర పరిస్థితిపై నివేదికలు సమర్పణ
రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటటం పట్ల సీఎంపై ఆగ్రహించిన అధిష్టానం
పరిస్థితిని చక్కదిద్దటానికి మరో అవకాశం ఇస్తున్నట్లు పరోక్ష హెచ్చరిక
‘సమ్మె’ విరమింపచేసేందుకు చర్చలతో ప్రయత్నించాలని,
లేదంటే కఠినంగా వ్యవహరించాలని కిరణ్‌కు సూచనలు
రాష్ట్రపతి పాలన, రెండో ఎస్‌ఆర్‌సీ అవకాశాలపై తర్జనభర్జనలు
రేపు మరికొందరు నేతలతో మాట్లాడాలని ప్రణబ్ బృందం నిర్ణయం
కావూరి, చిరంజీవిలకు ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం పిలుపు

న్యూఢిల్లీ/హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ అంశంపై హస్తినలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర నాయకులతో శనివారం రోజంతా చర్చలు, సంప్రదింపుల్లో తల మునకలైంది. రాష్ట్ర గవర్నర్ కూడా ప్రధానమంత్రితో పాటు ప్రభుత్వ పెద్దలను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తూ నివేదికలు అందజేశారు. మొత్తంమీద.. ఒకటి రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఢిల్లీ చర్చలు నడిచాయి. సోమవారం కూడా రాష్ట్రానికి చెందిన మరికొందరు నేతలతో మాట్లాడిన తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె కారణంగా ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుండటంతో.. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్‌లో అనుభవజ్ఞుడుగా పేరొందిన ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీకి అప్పగించటం.. ఆయన శుక్రవారం రంగంలోకి దిగి పార్టీ అధ్యక్షురాలు, ప్రధానమంత్రి, కేబినెట్ సహచరులతో విడివిడిగా సమావేశమై సమాలోచనలు జరపటం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ప్రణబ్ సారథ్యంలోని కాంగ్రెస్ అగ్రనాయకుల బృందం.. శనివారం రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు మొత్తం తొమ్మిది మంది ముఖ్యులను పిలిపించుకుని వారితో వేర్వేరుగా సంప్రదింపులు జరిపింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటే వరకు వెళ్లటంలో సీఎం వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. కిరణ్ పనితీరును తప్పుపడుతూనే.. ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకోబోయే ముందు ఒక అవకాశం ఇచ్చి చూడాలని భావించాం’’ అని ఏఐసీసీ నాయకుడొకరు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు, సంప్రదింపులు జరపటం ద్వారా సకల జనుల సమ్మెను విరమింపజేయటం.. అది సాధ్యంకాని పక్షంలో కఠినంగా వ్యవహరించి అదుపు చేయటమన్న ఎజెండాను ఈ సందర్భంగా అధిష్టానం ముఖ్యమంత్రికి నిర్దేశించింది. ఆ క్రమంలో విఫలమైతే కేంద్రమే కఠిన నిర్ణయాలు చేయకతప్పదని హెచ్చరికతో కూడిన సంకేతాలను కూడా ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు.. రాష్ట్రంలో పరిస్థితులు, పరిణామాలపై గవర్నర్ అందజేసిన నివేదిక, సంప్రదింపుల్లో పలువురు నాయకులు వెల్లడించిన అంశాలనుబట్టి.. రాష్ట్రంలో ప్రభుత్వం అచేతనంగా ఉందన్న అభిప్రాయానికి కేంద్ర నాయకత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చేయి దాటాయని నిర్ధారించుకున్న అధిష్టానం పెద్దలు ఒక దశలో.. రాష్ట్రపతి పాలన విధించటం ద్వారా పరిస్థితులను చక్కదిద్దవచ్చా? అని తర్జనభర్జన పడ్డారు. అలాంటిదేమీ లేదని పార్టీ నేతలు పైకి కొట్టిపారేసినప్పటికీ.. మరో అవకాశం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన కారణంగానే రాష్ట్రపతి పాలన అంశం బయటపడకుండా జాగ్రత్తపడినట్లు చెప్తున్నారు.

పార్టీ పెద్దల పిలుపు మేరకు ఢిల్లీ వచ్చిన ఉప ముఖ్యమంత్రి శనివారం మధ్యాహ్నమే హైదరాబాద్ తిరిగివెళ్లగా.. ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం వెళ్లిపోయారు. గవర్నర్ మాత్రం ఢిల్లీలోనే ఆగిపోయారు. ఆయన సోమవారం రాత్రికి తిరిగి హైదరాబాద్ వెళతారు. ఆయన బయలుదేరటానికి ముందే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నందునే గవర్నర్‌ను సోమవారం కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించనట్లు సమాచారం. అలాగే.. రాజకీయ కోణంలో చూస్తే తెలంగాణ అంశంతో పాటు దేశంలో ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు రెండో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్‌ఆర్‌సీ) ఏర్పాటే కాంగ్రెస్‌కు లాభదాయకమన్న అంశంపైనా ప్రణబ్ బృందం తర్జనభర్జనలు పడినట్లు చెప్తున్నారు.

అంతా ప్రణబ్ నేతృత్వంలోనే...

ఆర్థికమంత్రి, కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక నేత ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో పార్టీ, కేబినెట్‌లో ఆయన సహచరులైన పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌లతో కూడిన బృందం.. నార్త్‌బ్లాక్‌లోని ప్రణబ్ కార్యాలయంలో శనివారం రోజంతా సంప్రదింపులు కొనసాగించింది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రధాన నాయకులు తొమ్మిది మందిని పిలిపించి వారితో కీలక అంశాలపై మాట్లాడింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తోపాటు.. కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, ఎం.ఎం.పళ్లంరాజు, డి.పురందేశ్వరిలు ప్రణబ్ బృందం వద్దకు వెళ్లి తమ అభిప్రాయాలను తెలియజేశారు. సీఎం వెంట రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ బినయ్‌కుమార్ కూడా భేటీకి హాజరయ్యారు. ప్రణబ్ బృందానికి సీఎం రెండు కీలక నివేదికలు అందజేసి పరిస్థితులపై చర్చించారని సమాచారం.

నాయకులను ఏం అడిగారంటే...

రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన ప్రణబ్ బృందం.. సమస్య పరిష్కార మార్గాలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ వర్గాల కథనం ప్రకారం.. ప్రణబ్ బృందం ప్రధానంగా మూడు అంశాలపై నేతల అభిప్రాయాలను సేకరించింది. అవేమిటంటే.. 1. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మీకున్న అభ్యంతరాలేమిటి? 2. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంది? 3. సకల జనుల సమ్మె నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మాటేమిటి? ఆయా నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పుడు.. ప్రణబ్ బృందం మరికొన్ని అనుబంధ ప్రశ్నలు అడిగి సమాచారం రాబట్టుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ వంటి వారినయితే ప్రత్యేక రాష్ట్రమిస్తే సీమాంధ్రలో రాజీనామాలు చేసే నేతలు ఎంత మంది ఉన్నారు? అక్కడ పెల్లుబికే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుంది? దాన్ని ఎదుర్కోగలమా లేదా? వంటి ప్రశ్నలు అడిగి వారి అభిప్రాయాలను నమోదుచేసుకున్నారని తెలియవచ్చింది.

రాష్ట్ర విభజనపై అభిప్రాయాన్ని కోరినపుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాల్సిందేనని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు మాత్రం సమస్య తీవ్రమై ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్న దృష్ట్యా ఇక ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారని తెలిసింది. అధిష్టానం ప్రకటించే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, అయితే తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారని అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలు.. ‘‘మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి.. ఇప్పటికే ఆలస్యమైంది..’ అని చెప్పి బంతిని హైకమాండ్ కోర్టులోనే నెట్టేశారు. ఆ కారణంగానే మరికొంత మంది నేతలతో సోమవారం సంప్రదించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

కావూరి, చిరంజీవిలకు పిలుపు

సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కోర్ కమిటీ నేతలతో పాటు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌నూ కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎం శనివారమే హైదరాబాద్ తిరిగిరాగా.. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు ఢిల్లీలోనే ఉండిపోయారు. మరోవైపు.. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎంపీ కావూరి సాంబశివరావు, ఇటీవలే కాంగ్రెస్‌లో విలీనమైన పీఆర్‌పీ నేత చిరంజీవిలను కూడా పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. కావూరి శనివారమే ఢిల్లీకి రాగా చిరంజీవి ఆదివారం చేరుకోనున్నారు.

ప్రధానితో గంటన్నర పాటు గవర్నర్...

మరోవైపు గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రే ఆజాద్‌ను కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఇక శనివారం రోజంతా ప్రభుత్వ పెద్దలతో సమావేశాల్లో బిజీగా గడిపారు. ఉదయం హోంమంత్రి చిదంబరంతో మొదలుపెట్టి వరుసగా ప్రధాని మన్మోహన్‌సింగ్, ఎ.కె.ఆంటోనీ, ప్రణబ్‌ముఖర్జీలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఈ భేటీల్లో ఆయన రాష్ట్ర పరిస్థితులను వారికి వివరించారు. ప్రధాని దగ్గర ఆయన అత్యధికంగా గంటన్నరపాటు కూర్చున్నారు. ప్రధానికి, హోంమంత్రికి గవర్నర్ సవివరమైన నివేదికలు అందజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో గవర్నర్ భేటీపై భిన్న కథనాలు వినవస్తున్నాయి. ఆయన శనివారం సాయంత్రం రాష్ట్రపతితో సమావేశమయ్యారని కొందరు అంటుండగా.. ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినప్పటికీ అక్కడ ఆమె లేకపోవటంతో కేబినెట్ సెక్రటరీతో మాట్లాడి వచ్చారని మరికొన్ని వర్గాలు చెప్తున్నాయి.

సర్వత్రా ఉత్కంఠ: గవర్నర్‌తో సహా రాష్ట్ర ముఖ్యులందరినీ హడావిడిగా ఢిల్లీకి పిలిపించటంతో తెలంగాణ అంశంపై ఎలాంటి నిర్ణయం చేయబోతున్నారన్న అంశం.. రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఉత్కంఠ కలిగించింది. తెలంగాణ, సమైక్యాంధ్రప్రదేశ్ వాదనలపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోనుందన్న అంశంపైనే అందరూ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్రం తెలంగాణను ప్రకటిస్తుందా? మరింత జాప్యం జరుగుతుందా? సకల జనుల సమ్మెను విరమింపచేయటానికి వీలుగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా? రాష్ట్రపతి పాలన విధిస్తారా? తదితర అంశాలపై రాజకీయ పార్టీల నాయకుల మధ్య చర్చ సాగింది.

సీఎం మార్పుపైనా చర్చ!

మరోవైపు.. ఇప్పటి పరిస్థితి యథాతథంగా కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దటంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి విఫలమయ్యారన్న అభిప్రాయానికి వచ్చిన పార్టీ అధిష్టానం.. ఆయన స్థానంలో వేరే వారికి, ముఖ్యంగా తెలంగాణ నేతకు బాధ్యతలు అప్పగించవచ్చని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను పిలిపించటంలోని ఆంతర్యం కూడా ఇదే కావచ్చన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది. మరోపక్క సీమాంధ్ర నేతలు ఢిల్లీ పరిణామాలపై చాలా ధీమాగా కనిపించారు. శనివారం సీఎల్‌పీ కార్యాలయానికి వచ్చిన మంత్రి శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు ఢిల్లీలోని పరిణామాలపై చర్చించారు. శైలజానాథ్ సీఎల్‌పీ నుంచే ఎంపీ కావూరి సాంబశివరావుతో ఫోన్‌లో మాట్లాడారు.

ఆంటోనీకి కోమటిరెడ్డి ఫిర్యాదు

ఇదిలావుంటే.. తన సోదరుడు, రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దుష్ర్పచారం జరుగుతున్నదంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కేంద్ర మంత్రి ఎ.కె.ఆంటోనీకి ఫిర్యాదు చేశారు. ఆంటోనీని ఆయన కార్యాలయంలో రాజగోపాల్ కలిసినట్లు సమాచారం. తన సోదరుడు తెలంగాణ కోసమే రాజీనామా చేశారని, ఇతర కారణాలేం లేవని, అయితే కావాలని పార్టీలో కొందరు తన సోదరుడిపై దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆయన ఆంటోనీ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె తీవ్ర రూపం దాల్చిందని, సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరటమే కాకుండా ప్రత్యేక రాష్ట్ర లక్ష్య సాధనకు తన సోదరుడు పాటుపడుతున్నారే తప్పించి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం లేదని చెప్పినట్లు తెలియవచ్చింది.

రేపటికల్లా సంప్రదింపులు పూర్తి
నిర్ణయమెప్పుడో ఇప్పుడు చెప్పలేను: ప్రణబ్

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. దాన్ని సోమవారానికల్లా పూర్తి చేయగమలని భావిస్తున్నామన్నారు. అయితే నిర్ణయాన్ని మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేనన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో శనివారం తన కార్యాలయంలో రెండు విడతలుగా సంప్రదింపులు జరిపాక విలేకరులతో మాట్లాడిన ఆయన... యూపీఏ భాగస్వామ్య పక్షాలతోనూ చర్చిస్తారా అన్న ప్రశ్నకు బదులివ్వకుండానే వెళ్లిపోయారు.

No comments:

Post a Comment