Tuesday, October 4, 2011


తెరపైకి విలీనం
kccccr(సూర్య ప్రధాన ప్రతినిధి):కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీన చర్చకు మళ్లీ ఊపిరిపోసుకుంది. గతంలో కేశవరావు నివాసంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని ప్రకటించిన కేసీఆర్‌.. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జానారెడ్డి, కేశవరావుతో సుదీర్ఘంగా భేటీ కావడం, వెంటనే వారిద్దరూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌తో విలీనంపై మంతనాలు సాగించడంతో టీఆర్‌ఎస్‌ విలీనంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో మోహరించిన టీ కాంగ్రెస్‌-టీ జాక్‌ నేతల ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీన చర్చలు మాత్రం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తెలంగాణపై హైకమాండ్‌ సానుకూలవ ప్రకటన చేసినప్పటికీ, రాజకీయం గా అది కాంగ్రెస్‌ పార్టీకి ఏమాత్రం లబ్థి కలగకపోగా, టీఆర్‌ఎస్‌కు లాభం చేకూరుతుందని భావించి నట్టయితే.. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయించేం దుకు తాము ప్రయత్నిస్తామంటూ జానా, కేకే అధిష్ఠానానికి హామీ ఇచ్చారన్న వార్తలు మళ్లీ విలీన చర్చలకు తెరలేపాయి.

నిజానికి.. టీఆర్‌ఎస్‌ను తన పార్టీలో విలీనం చేసుకోవాలన్న యోచన కాంగ్రెస్‌లో చాలాకాలం నుంచీ ఉన్నదే. కేసీఆర్‌ కూడా అధిష్ఠానానికి దగ్గరి నేతలతో తరచూ మంతనాలు సాగిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, చివరకు పీసీసీ చీఫ్‌కు సైతం ఢిల్లీ విషయాలు చాలావరకూ తెలియవని, తనకు ఢిల్లీ నుంచి నమ్మకమైన కాంగ్రెస్‌ నేతలు ఎప్పటికప్పుడు తెలంగాణ గురించి సమాచారం ఇస్తున్నారని కేసీఆర్‌ ధైర్యంగా చెబుతూవస్తున్నారు. మీడియా అంతర్గత సంభాషణల్లో సైతం తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందని వెల్లడిస్తున్నారు. గత ఏడాది కేశవరావు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో కూడా కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని, కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే విలీనానికి సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చారు. అప్పటినుంచే విలీన వ్యవహారంపై చర్చ కొనసాగుతోంది.


తాజాగా... కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులయిన కేకే, జానా లతో ఆయన భేటీ కావడం, వారిద్దరూ టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయిస్తామని ప్రధాని, అహ్మద్‌పటేల్‌కు హామీ ఇచ్చా రన్న వార్తలు వెలువడటంతో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీన చర్చ కు మరోసారి తెరలేచినట్టయింది. రాజకీయ జేఏసీ ఏర్పాటయి నప్పుడు కూడా ఈ ముగ్గురే కీలకపాత్ర పోషించడం గమ నార్హం. ఏ ఒక్క ప్రజాసంఘం, ఉద్యమ సంస్థతో సంప్రదించ కుండానే జానా-కేసీఆర్‌ కలసి కోదండరామిరెడ్డిని కన్వీనర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.

అటు కాంగ్రెస్‌ నాయకత్వం కూడా టీఆర్‌ఎస్‌ విలీనం కోస మే ఎదురుచూస్తున్నట్లు టీ కాంగ్రెస్‌ నేతల మాటల్లో స్పష్టమవు తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రాజకీయంగా తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రజలు టీఆర్‌ఎస్‌ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిం దని విశ్వసిస్తారు తప్ప, కాంగ్రెస్‌ ఇచ్చిందని భావించరని అంచ నా వేస్తోంది. రాజకీయ ప్రయోజనం ఉంటే తప్ప తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదన్న ధృడ నిశ్చయంతో ఉంది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోవడం ద్వారా కోస్తాలో పార్టీని బలోపేతం చేసిన మాదిరిగానే.. తెలంగాణలో కూడా బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవడం ద్వారా తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉండాలన్నది కాంగ్రెస్‌ అసలు వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే టీఆర్‌ఎస్‌ విలీన యోచన చేసేవరకూ తెలంగాణను నాన్చాలని భావిస్తున్నట్లు సమాచారం.

దీనిని అర్థం చేసుకున్న జానా, కేకే ఢిల్లీలో ప్రధాని, పటేల్‌ను కలసి.. తెలంగాణ ఇస్తే అది టీఆర్‌ఎస్‌కు రాజకీయ లబ్థి చేకూ రుతుందని భావిస్తే టీఆర్‌ఎస్‌ను విలీనానికి ఒప్పించే బాధ్యత తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగు తోంది. కాంగ్రెస్‌ నాయకులను కొట్టమని గత వారం క్రితమే పిలుపునిచ్చిన కేసీఆర్‌.. ఢిల్లీలో అదే కాంగ్రెస్‌ నేతలతో రహస్య మంతనాలు జరపడం అందరినీ విస్మయపరిచింది.

జానా-కేకే వంటి రాజకీయ అనుభవజ్ఞులు టీఆర్‌ఎస్‌ అధ్య క్షుడు కేసీఆర్‌ నుంచి ఎలాంటి సంకేతాలు, అనుమతి లేకుం డానే తమంతట తాము అధిష్ఠానానికి హామీ ఇవ్వరు. వారు ముగ్గురూ చాలాకాలం నుంచీ తెలంగాణపై మంతనాలు జరుపు తున్నారు. కేసీఆర్‌ తరచూ జానా, కేకే నివాసానికి వెళుతున్నా రు. ఈ కోణంలో చూస్తే విలీనంపై కేసీఆర్‌ అనుమతితోనే అధిష్ఠానానికి సంకేతాలు వెళుతున్నాయని స్పష్టమవుతోంది.

వాస్తవానికి.. టీఆర్‌ఎస్‌ విలీన చర్చ చాలాకాలం నుంచీ జరుగుతోంది. తమకు కాంగ్రెస్‌ నుంచి ఇంతవరకూ ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని కేసీఆర్‌ నుంచి మాజీ ఎంపీ వినోద్‌ వరకూ చెబుతూ వస్తు న్నారు. కాంగ్రెస్‌ను పటిష్ఠం చేయవలసిన బాధ్యత తనపై ఉందని, శ్రీ కృష్ణ కమిటీకి కాంగ్రెస్‌ లేఖ ఇవ్వవలసిన పనిలేదని, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఎప్పుడో ఇచ్చేసిందంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేశవరావు నివాసంలో భేటీ అయిన అనం తరం కేసీఆర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును కేసీఆర్‌ వ్యతిరేకిస్తుంటే, గతంలో దానికి మద్దతు గా సోనియా ప్రధానికి స్వయంగా లేఖ రాసినా ఆమెను విమర్శించకపోవడం కూడా విమర్శలకు గురయింది.

కేశవరావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో.. డిసెంబర్‌ 9న ప్రకటన ఇచ్చింది సోనియాగాంధీయేనని కీర్తిం చిన కేసీఆర్‌, ఆ తర్వాత డిసెంబర్‌ 23న వచ్చిన ప్రకటన కూడా సోనియా చేసిందే కదా అన్న వ్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఆమెను సమర్థించే ప్రయత్నం చేయడం తెలిసిందే. ‘డిసెంబర్‌ 23 నాటి ప్రకటనలో మేం తెలంగాణ ఇవ్వడం లేదని, మేం వెనక్కుపోతున్నామని ఆమె చెప్పిందా’ అంటూ సోనియాతో పాటు, 23న వచ్చిన ప్రకటన తెలంగాణకు వ్యతిరేకం కాదన్నట్లు మాట్లాడి అందరినీ విస్మయపరిచారు. ఇవన్నీ కాంగ్రెస్‌కు మానసికంగా దగ్గరయేందుకు చేస్తున్న ప్రయత్నాలేనన్న విశ్లేషణలు అప్పటి నుంచే మొదలయ్యాయి.

గతంలో కేకే వంటి సీనియర్‌ను సైతం కౌన్‌కిస్కా అంటూ తూలనాడిన కేసీఆర్‌, హటాత్తుగా వ్యూహం మార్చుకుని, జానాతో కలసి భేటీ కావడానికి బలమైన రాజకీయ కారణాలు, నేపథ్యం ఉందని చెబుతున్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ, గద్దర్‌, విమలక్క, దిలీప్‌కుమార్‌ వంటి ఉద్యమ శక్తులు చొచ్చు కుపోతుండటం, ఇన్నాళ్లూ శ్రమించి కీలక స్థాయికి తీసుకు వచ్చిన తెలంగాణ ఉద్యమం విద్యార్థులు, ప్రజల చేతుల్లోకి వెళ్లడంతో.. ఇంకా ఎంతోకాలం ఉద్యమంపై పట్టు కొనసాగించ లేమన్న మానసిక భావనకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం వచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా, డిల్లీలోనే ఉన్న కేసీఆర్‌ తన పార్టీ విలీనవార్తలపై ఇంతవరకూ ఖండించకపోవడం ప్రస్తావనార్హం.

No comments:

Post a Comment