కరెంటు లేదు. నీళ్లు రావు. పంటల్లేవు. కళ్లముందే చేలు ఎండిపోతున్నాయి. రైతుల గుండెలు మండిపోతున్నాయి. ఆకలికి అలమటించిపోతున్నారు. కొండల్తో పోటీ పడుతున్నట్లుగా, పాలకుల పాపాల్లా అప్పులూ, అప్పుల మీద వడ్డీలూ పెరిగిపోతున్నాయి. ఆశల్లేవు. కన్నీళ్లున్నాయి. ఆ కన్నీళ్లకి ఎవరి గుండెలూ కరగవు. పంటలు పండవు. దేవుడు కరుణించడు. ప్రాజెక్టుల్లోంచి నీళ్లు ప్రవహించవు. అందుకని రేపు లేదు. రేపటి మీద నమ్మకం లేదు.
నిన్నూ నన్నూగన్న అమ్మలగన్న అమ్మ భూదేవిని తాకట్టు నుంచి విడిపిం చలేని బతుకెందుకు? భూమికి భారమైన జీవితమెందుకు? ఏ ఘోరం చూడ్డానికి? ఇంకా ఏ అఘాయిత్యం చెయ్యడానికి? అని తమని తామే ప్రశ్నించుకొని తమ ప్రశ్నలకి తమకి సమాధానం దొరక్క దెయ్యాలై వెంటపడ్డ ఆ సమస్యల నుంచి తప్పుకోవడానికి, ఏ ఉరితాడునో, ఏ నుయ్యో గొయ్యినో, ఏ పురుగుల మందునో ఆశ్రయించి ప్రశ్నగా మిగిలిపోతున్నారు.
ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి? అంటే ఇట్స్ మోస్ట్ అన్‌ఫార్చునేట్ అంటారు.
ఇందుకు పరిష్కారం అవినీతి నిర్మూలనా? లోక్‌పాలా? జన్‌లోక్‌పాలా? స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనమా? తేలాలి. తేలాలి. టూజీ స్కాం తేలాలి. సీబీఐ దర్యాప్తులు పూర్తి కావాలి. కోర్టుల్లో కేసులు పరిష్కారం కావాలి. అప్పటిక్కానీ ఈ సమస్య తేలదు. ఆకలి చావులు పోవు. ఆత్మహత్యలు ఆగవు.
ఇంకా ఆ మాటకొస్తే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా చేస్తున్న నక్సైలైట్లని అడవుల్లోంచి బయటకీడ్చాలి. ఇందుకు కారణం మీరే మీరేనని నిలదియ్యాలి. సమాధానం చెప్పకపోతే నిలబెట్టి నిలువునా కాల్చెయ్యాలి. పచ్చటి అడవుల్ని పనికి రాకుండా చేస్తున్నందుకు నరికెయ్యాలి.
మండిపోతున్న సూర్యుడూ, తేలిపోతున్న మబ్బులూ, మబ్బుల్ని తేలగొడుతున్న గాలీ, ఆకలికి ఎండిపోయిన ఆ కన్నతల్లి రొమ్ములూ... ఇందుకు సమాధానం చెప్పాలి. తడారిపోయిన ఆ చచ్చిన వాడి కళ్లల్లో సమాధానం వెదకాలి.
ఆ చావుని చూసి గుండెలు బాదుకొనే వాళ్లు సమాధానం చెప్పాలి.
అసలు ఎవడి చావుకి వాడే జవాబుదారు కావాలి. వెదకండి? డెత్ నోట్ ఏమైనా రాశాడేమో! వీలునామా ఏమైనా వదిలాడేమో! వెదకండి. పోస్టు మార్టం చేసి చూడండి. గుండెల్ని తడమండి. కడుపులో ఏమైనా దాచాడేమో వెదకండి?
అయినా వాడి చావు వాడు చావడమేంటి... ఎంత అన్‌నేచరల్!
అన్నల్ని చూసి వాడదేనా నేర్చుకొంది? ఏ అడవులు పట్టుకొనో పోవచ్చు కదా? ఏ కొండలెక్కో చావొచ్చుకదా? అలా చేస్తే నన్ను ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు? నీ శవం నన్ను నిలేసేది కాదు. నా వేటకి నువు చిక్కకుండా పోయేవాడివి కాదు. నీ చావుకి ఎవరూ నెపం నా మీద వేసే వారు కాదు.
నా చావుకి నువు కారణం కాకూడదనే నిన్ను లేకుండా చేశాననే వాణ్ణి అప్పుడు నేను.
ప్రశ్నగా మారి పీడిస్తున్న నీకు నేను సమాధానం చెప్పలేననుకోకు. ఆ గుళ్లో దేవుడి ముందు దీపం వెలిగించి నేను చెప్పేదే సత్యం అని గంట కొట్టి మరీ చెబుతాడు పూజారి పంచభూతాల సాక్షిగా. పంచభూతాల్లో ఒకటైన భూమి, అదే ఆ భూదేవి నీదీ నాదీ ఎలాగవుతుంది? దాన్ని నమ్ముకోవడం, దాన్నాధారం చేసుకోవడం బుద్ధి తక్కువ. ఆ చేదు నిజం చెప్పడానికే, కళ్లు తెరిపించడానికే భూమాత నిన్ను కాదంది. అందుకే ఈ భూమ్మీద నీకు నూకలు చెల్లిపోయాయి. నీ దారిన నువ్వు వెళ్లి పోయావని చెబుతాడు. కనుక వెర్రివాడా! పేదవాడా! పంచభూతాల కలయికతో రూపుధరించిన నువ్వు వాటి నుంచి వేరుపడి తిరిగి పంచభూతాల్లో ఐక్యమైపోయావు. కనుక నీ చావు నీదే. కేవలం నీదే. అది నీ స్వార్జితం.
నా భాధల్లా ఆత్మహత్యా నేరానికి పాల్పడి కూడా చట్టానికి చిక్కకుండా పోయావేనని. ఏ నాటికైనా ఇందుకు నువ్వే సంజాయిషీ ఇచ్చుకోవాలి.
కానీ వాడెవడో అన్నట్టుగా కానూన్ కీ హాత్ బహుత్ లంబీ హోతేహై.
చట్టం బిగి కౌగిట్లో ఉన్న దేశంలో చచ్చి ఎక్కడికి వెడతావు?
ఎక్కడికి వెళ్లినా భూమి దగ్గర బాకీ తీసుకొన్న వాణ్ణి భూమి వదలనట్లుగా, భూమిలోంచి చట్టం చెయ్యి చాచి ‘నా బాకీ’ అంటుంది. నీకు నిష్కృతి లేదు.
చచ్చెక్కడికీ పోలేదు నువ్వు. చట్టాన్ని ఉల్లంఘించిన వాడా నీకు శిక్ష తప్పదు.
-కొండమీది బెండయ్య
No comments:
Post a Comment