Tuesday, December 6, 2011

విధేయతలు, విలువలు
- సంపాదకీయం

అవిశ్వాస తీర్మానం అనగానే అది తప్పనిసరిగా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అగ్నిపరీక్ష కానక్కరలేదు. అవిశ్వాస తీర్మానాలు అత్యధికం వీగిపోవడమే జరుగుతుంది. సోమవారం నాడు ఓటింగ్ జరిగిన అవిశ్వాస తీర్మానంతో కలుపుకుని ఇప్పటివరకు మన రాష్ట్రంలో పదిసార్లు తీర్మానం ప్రవేశపెట్టారు కానీ, ఏ సందర్భంలోనూ ప్రభుత్వానికి ప్రతికూలంగా ఫలితం ఎన్నడూ రాలేదు. ప్రభుత్వానికి మూడింట రెండువంతుల ఘన మెజారిటీ ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాయి. ప్రభుత్వ పాలనపై సమీక్షకు, ప్రజాసమస్యల ప్రస్తావనకు, అధికారపార్టీని విమర్శించడానికి అవిశ్వాస తీర్మానం ఒక సందర్భం. ప్రతిపక్షాలు సాధారణంగా ఆ ప్రయోజనం కోసమే తీర్మానాన్ని వినియోగించుకుంటాయి.

రైతాంగానికి సంబంధించిన సమస్యలు, ఇతర ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారపార్టీ విఫలమైందని చెబుతూ తెలుగుదేశంపార్టీ ప్రవేశపెట్టిన తాజా అవిశ్వాస తీర్మానానికి మాత్రం రాజకీయంగా అమితమైన ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ వైఫల్యాలను దుమ్మెత్తిపోసి, ప్రతిపక్షాల ప్రతిష్ఠను పెంచుకోవడానికి ప్రవేశపెట్టిన తీర్మానం కాదది. ప్రభుత్వం పడిపోయే అవకాశం నిజంగానే ఉన్నదని నమ్మి చేసిన పనీ కాదది.

తాను నిజంగా రాజీలేని ప్రతిపక్షాన్నేనని నిరూపించుకోవడానికి, తననూ అధికారపార్టీని కలిపి విమర్శిస్తున్న మరో పార్టీకి వాస్తవంగా సభలో ఎంత మద్దతు ఉన్నదో తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిందనిపిస్తోంది. తీర్మానం ఫలితం ప్రభుత్వానికి అనుకూలంగానే వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి అందరూ ఊహించినంత బలగమే తప్ప, అధికార కాంగ్రెస్‌లో రహస్యంగా దాగిన బలమేమీ లేదని నిరూపణ అయింది. అంతే కాదు, విలీనదశలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ, ఎంఐఎం సభ్యుల అండ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని గట్టెక్కేది కాదని కూడా వెల్లడయింది.

అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం విజయమ్మతో సహా పందొమ్మిదిమందే అని నిర్ధారణ అయినంత మాత్రాన, జగన్‌తో అధికారపార్టీకి, ప్రధాన ప్రతిపక్షానికి చీకాకులు తగ్గుతాయని భావించలేము. అధికారపార్టీ పెద్దల నుంచి తీవ్ర ప్రయత్నాల తరువాత కూడా జగన్‌వెంట ఆ మాత్రం సభ్యులు కొనసాగడం విశేషమే. విలువలు, విశ్వసనీయత వంటి పెద్ద పెద్ద మాటలతో, తమకు అనుకూలంగా ఓటువేసిన కాంగ్రెస్ సభ్యులను జగన్ అభినందించే ప్రయత్నం చేశారు కానీ, వారిది గట్టి విధేయత మాత్రమే.

నిరాశలో మునగకుండా జగన్‌ను వారి విధేయత రక్షించింది. విప్‌ను ధిక్కరించి తమకు ఓటువేసిన వారిని అనర్హులుగా ప్రకటించాలని జగన్ మంగళవారం నాడు మీడియా ద్వారా సవాల్ చేశారు. ఒక్కొక్కరిని కాకుండా, అందరినీ ఒకేసారి అనర్హులను చేసి, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కాంగ్రెస్‌కు సూచించారు. కాంగ్రెస్ పూర్తిగా బలపడలేదని, ఉప ఎన్నికల ద్వారా రాజకీయ రంగస్థలంపై సంచలనం సృష్టించవచ్చునని జగన్ భావిస్తూ ఉండవచ్చు.

గండం గట్టెక్కినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు నల్లేరుమీద నడక కాదు. ప్రజారాజ్యం సాంకేతికంగా ఇంకా విలీనం కాలేదు కాబట్టి, లెక్కప్రకారం కాంగ్రెస్‌ది మైనారిటీ ప్రభుత్వం అంటే పొరపాటు కాదు. సాధారణ మెజారిటీకి 147 సభ్యులు కావలసిన చోట కేవలం 136 మంది మాత్రమే కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఓటింగ్ సమీపిస్తున్నప్పుడు, ప్రజారాజ్యం కాంగ్రెస్‌ను ఇబ్బందిలో పెట్టి, ఏవో హామీలు తీసుకున్న తరువాతనే ఓటు వేయడానికి అంగీకరించిందని అంటున్నారు. ఇక మజ్లిస్ పూర్తిగా వేరే పార్టీ. బయటినుంచి ఈ మద్దతు లేకపోతే, కాంగ్రెస్‌కు చేదు అనుభవమే ఎదురయ్యేది.

తీర్మానం వీగిన తరువాత కూడా తమ పరిస్థితి ఏమంత సౌకర్యంగా లేదని తెలుసుకున్నందునే, అనర్హతా చర్యలపై కాంగ్రెస్ వెనుకాడుతున్నదేమో అనిపిస్తున్నది. విప్‌ను ధిక్కరించి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినవారికి తప్పు తెలుసుకోవడానికి వారం గడువిస్తామని సూచించడం కాంగ్రెస్ ఔదార్యాన్ని కాక, బలహీనతనే సూచిస్తున్నది. కాలం గడిచే కొద్దీ హద్దు మీరిన వారు మనసు మార్చుకుని తిరిగి గూటికి చేరతారని పార్టీ భావించవచ్చు. కానీ, రాజకీయాలలో మనసు మార్చుకోవడం వెనుక అనేక లావాదేవీలు అవసరమవుతాయని తెలియనిది కాదు.

ఆరు నెలల కిందటే అవిశ్వాసతీర్మానం పెట్టి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేదన్న వాదన వినిపిస్తోంది. ఇంతకు ముందు కూడా తీర్మానం పెట్టే ప్రయత్నం జరిగింది కానీ, అది చర్చకు రాలేదు. ప్రతిపక్షపార్టీలైనా, ఎప్పుడంటే అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన చేయకపోవచ్చు. ప్రభుత్వం పడిపోతే పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, ఎన్నికలు వస్తే విజయావకాశాల పరిస్థితి ఏమిటి- వంటి అంశాలను ఆలోచించి, తమ పార్టీ ప్రయోజనం దృష్ట్యా వ్యవహరిస్తాయి.

తెలుగుదేశం పార్టీకి కూడా అటువంటి సొంత అంచనా ఏదో ఉండి ఉండవచ్చు. ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి ప్రతిపక్షమే సహకరిస్తోందని, ఆ రెండూ కుమ్మక్కు అయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించడం రాజకీయ దృష్టితో కూడిన ఎత్తుగడగానే తీసుకోవాలి. జగన్ ఆరోపణలకు తెలుగుదేశం అధినేత అవసరమైన దానికంటె ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. జగన్ పార్టీ పెట్టిన తరువాత కూడా ఆయన అనుయాయులు ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగడం, సమయం వచ్చినప్పుడు ఎందరు బయటపడతారో తెలియని స్థితి ఉండడం కొంత అయోమయానికి ఆస్కారం ఇచ్చింది. ఎవరెవరు అటువైపు ఉన్నారో గ్రహించి, తగిన చర్యలు తీసుకున్న తరువాతనే తీర్మానాన్ని ఎదుర్కొనడానికి అధికారపార్టీ సిద్ధపడింది. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత, తెలంగాణ ఉద్యమం కారణంగా తలెత్తిన పరిస్థితులు- వీటన్నిటి మధ్య రాష్ట్ర పరిపాలన కుంటినడక నడుస్తున్నది. అవిశ్వాస తీర్మానం ఫలితం రాష్ట్ర పరిస్థితిలో స్పష్టతను, మెరుగుదలను తెస్తుందన్న ఆశాభావం ఎంతవరకు వాస్తవరూపం ధరిస్తుందో చూడాలి.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రజాప్రతినిధుల ద్వంద్వ విధేయతలు, ప్రలోభాలు బయటపడ్డాయి. తెలంగాణ సమస్య చర్చలో వ్యక్తమయినప్పటికీ, ముఖ్యమంత్రి సమాధానంలో ప్రాధాన్యం పొందలేదు. జగన్ కోసం శాసనసభ్యత్వాన్ని కూడా వదులుకోవడానికి పదహారు మంది సిద్ధపడినప్పుడు, తెలంగాణ కోసం ఆ ప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యులు ఎందుకు ఏమీ చేయలేకపోయారన్న ప్రశ్న చర్చకు వస్తున్నది. ఇంతకీ మన ప్రజాప్రతినిధుల విధేయతలు దేనికి, ఏ విలువలకి అన్న ప్రశ్న ఎలాగూ మిగిలే ఉన్నది. 
___________________________________________________________________________

No comments:

Post a Comment