Friday, October 28, 2011





ఫైర్
T ఫర్ తెలంగాణ
T ఫర్ టీఆర్ఎస్
T ఫర్ టెండర్
T ఫర్ తిట్లు
టీఆర్ఎస్ టీడీపీ వాగ్యుద్ధం
సవాళ్లు - ప్రతిసవాళ్లతో సై అంటే సై

విమర్శలపై కేసీఆర్ ఘాటు స్పందన
నమస్తేలో నా పెట్టుబడి రూ.4 కోట్లు
అదీ అప్పుగా తెచ్చిందే.. రాజం మిత్రుడే
టెండర్ల గురించి నాకు తెలియదు
నాకున్నది 24 ఎకరాలు, రెండు ఇళ్లు
ఆస్తులపై చర్చకు సిద్ధం
క్షమాపణ చెప్పకుంటే దావా: కేసీఆర్
దీటుగా ప్రతిస్పందించిన టీడీపీ
పోల'వరం' కోసం ఉద్యమం తాకట్టు
సమ్మె నీరుగార్చినందుకు అది నజరానా
రెండు గంటల్లోనే ఢిల్లీలో ఒప్పందం
నమస్తేలో సీమాం«ద్రుల పెట్టుబడులు
పోలవ రంపై చర్చకు రావాలి
టీడీపీ తెలంగాణ ఫోరం హెచ్చరిక
ఛీ.. అంటే ఛీ ఛీ! థూ.. అంటూ థూ థూ థూ! మాటకు మాట... తిట్టుకు తిట్టు! టీడీపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ తెలంగాణ ఫోరం నేతలు రెండు మూడు రోజులుగా చేస్తున్న విమర్శలపై శుక్రవారం కేసీఆర్ స్పందించారు. రకరకాల పదాలు ప్రయోగిస్తూ... తనదైన శైలిలో చెలరేగిపోయారు. సకల జనుల సమ్మె విరమణ అనంతరం తొలిసారిగా విలేకరుల ముందుకు వచ్చారు. టీడీపీ ఆరోపణల నేపథ్యంలో కొంత వివరణాత్మకంగా మాట్లాడారు. పోలవరంపై తాము వేసిన కేసుల ఫైళ్లు అంటూ... కట్టల కొద్దీ ఫైళ్లతో సహా కదిలి వచ్చారు. 'నమస్తే తెలంగాణ' ఎండీ లక్ష్మీరాజం తన మిత్రుడే అని స్పష్టం చేశారు. అయితే... రాజం కాంట్రాక్టులు, ఇతర వ్యాపారాలతో తనకు సంబంధం లేదన్నారు.

'నమస్తే'లో రూ.4 కోట్లు, టీ-చానల్‌లో రూ.55 లక్షలు పెట్టుబడి పెట్టానని, అది కూడా తమ పార్టీ నేత వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాసరావు నుంచి అప్పుగా తీసుకున్నానని చెప్పారు. "మెదక్ జిల్లాలో 24 ఎకరాలు... హైదరాబాద్, కరీంనగర్‌లలో ఇళ్లు. ఇవే నా ఆస్తులు. ఇంతకు మించి ఒక్క రూపాయి ఉన్నా, దేనికైనా సిద్ధం'' అని కేసీఆర్ ప్రకటించారు. 'రెండెకరాల చంద్రబాబు' అని పదే పదే అన్నారు.

'నేను ఏం చేసినా బాజప్తా చేస్తా! బాబుదే బినామీ బతుకు' అని విమర్శించారు. టీడీపీ నేతలు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేసి కోర్టుకు, బజారుకు ఈడుస్తానని హెచ్చరించారు. కేసీఆర్ మీడియా సమావేశం ముగిసీ ముగియగానే... టీడీపీ నేతలూ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ విమర్శలు, తిట్లకు దీటుగా బదులిచ్చారు. తమ ఆరోపణలకు సూటిగా బదులివ్వకుండా... నాలుగు తిట్లు తిట్టి దులుపుకోవడం సిగ్గుమాలినతనమని మండిపడ్డారు.

పోలవరం టెండర్ల ఖరారులో కేసీఆర్ హస్తం నిజమని, దీనిని రుజువు చేయలేకపోతే 32 మంది ఎమ్మెల్యేలం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్‌కు లగడపాటితోనూ సంబంధాలున్నాయని ఆరోపించారు. 'కేసీఆర్ ఒక 420, దుబాయ్ పంపిస్తానంటూ పాస్‌పోర్టులు అమ్ముకోవడంతో ఆయన జీవితం ప్రారంభమైంది' అని ఆరోపించారు. అటు కేసీఆర్, ఇటు టీడీపీ నేతలు 'బూట్ పాలిష్' పదాలను ప్రయోగించుకున్నారు. 'చర్చకు సై' అని సవాళ్లు విసురుకున్నారు. కేసీఆర్ ఆస్తులపై చర్చకు సిద్ధమని ప్రకటించగా... టీడీపీ నేతలు పోలవరంపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.

కేసీఆర్‌పై టీడీపీ నేతలు..
కేసీఆర్ 420..పాస్‌పోర్టులు అమ్ముకున్నాడు
తెలంగాణ ద్రోహి.. రాజకీయ దళారీ
కాంగ్రెస్ నేతల బూట్లు తుడిచారు
తెలంగాణ నీ అబ్బ జాగిరా?
టికెట్ల నుంచి అన్నీ అమ్ముకోవడమే
రాత్రింబవళ్లు తాగి తందనాలు
ఆమరణ దీక్ష పేరిట తిని కూర్చున్నావు
తెలంగాణలోనీ డ్రామా ఖతం
పిట్టల దొరలా అబద్ధాలు
సిగ్గూ శరం లేని నీ గురించి...
సొల్లు వాగుడు... తుపాకీ ఎంకట్రాముడు
ఉద్యమం ముసుగులో లంగ ప్రయత్నాలు

చంద్రబాబు మీద కేసీఆర్..
బాబుది బినామీ బతుకు
లత్కోరు రాజకీయాలు
నమ్మక ద్రోహి, మిత్రద్రోహి
యూజ్ అండ్ త్రో పాలసీ
నకిలీ పాలన, పొద్దున లే స్తే కుట్రలే!
50 మందిని తెస్తాడట ఈ మొనగాడు
నా బొంద, (ఆయనకేం) తెలుసు

టీడీపీ నేతల మీద..
తొట్టిగ్యాంగ్
దేభ్యం మొహాలు, కుక్క మొరుగుళ్లు
కారుకూతలు, వెధవ కూతలు
పిచ్చి ప్రేలాపనలు, సిగ్గుండాలి
చంద్రబాబు తాబేదారులు
చంద్రబాబుకు బూట్ పాలిష్
బుడ్డర్ ఖాన్ దేవేందర్‌గౌడ్
రంగులు మార్చే మోత్కుపల్లి
ఎర్రబెల్లి కూడా ఓ లీడరే!
బజారుకు లాగుతాం
************************************************************************************************************

జనవాక్యం

సంచార జాతులకు విముక్తి ఎప్పుడు?
దాసరి, మేదరి, జోగి, జంగమ, కైకాడి, గంగిరెద్దుల, బుడబుక్కల, కాటికాపల, బాలసంతు, బహురూపి, దొమ్మరి వంటి కులాలెన్నో ఆర్థిక సామాజిక ఫలాలు అందక, దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ, భిక్షాటన చేస్తూ, సమాజంలో తలెత్తుకుని తిరగలేని స్థితిలో ఉన్నారు. కొన్ని తెగల వారు నేరస్త తెగలు అన్న అపవాదును మోస్తున్నారు. కొన్ని కులాల పేర్లు సమాజంలో తిట్టుపదాలుగా వాడుకలో ఉండడం వల్ల ఆత్మన్యూనతతో బతుకులీడుస్తున్నారు.

విముక్త సంచార తెగలకు సామాజిక న్యాయాన్ని అందించాలన్న అభిలాషతో కేంద్ర ప్రభుత్వం 2006లో బాలకృష్ణ రెనకె అధ్యక్షతన ఒక జాతీయ కమిషన్‌ను నియమించింది. రెనకె కమిషన్ మూడు సంవత్సరాల పాటు ఈ జాతుల మీద అధ్యయనం చేసి 2008 జూలై 2న తన నివేదికను ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకు సమర్పించింది. కనీస మానవ హక్కులు కూడా లభించక కునారిల్లుతున్న ఈ జాతులపై కమిషన్ నివేదిక వచ్చి మూడేళ్ళు గడిచినా కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవటం శోచనీయం.

కమిషన్ సిఫారసులు అమలయితే ఈ తెగల వారందరికీ ఎస్సీ, ఎస్టీలతో పరిపాటిగా 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు లభిస్తాయి. ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక కమిషను, ప్రత్యేక ఫైనాన్సు కార్పొరేషన్లు ఏర్పడతాయి. వీరి పిల్లల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు, ఈ జాతుల కోసం ప్రత్యేక ఆవాస యోజన, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు అమలవుతాయి. అందుకోసం విముక్త సంచార జాతులకై పార్లమెంటులో బిల్లు పెట్టాలి. రెనకె కమిషన్ చేసిన సిఫారసులు వెంటనే అమలు చేయాలి.
- మామిడిపల్లి కిషన్, మంచిర్యాల, ఆదిలాబాద్
************************************************************************************************************
పీఠం కోసం పోటీ నిజమేనా?
cmరాజులు, రాచరిక నిరంకుశత్వాలు పోయి ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పాటైనా అధికారానికున్న గ్లామరు, ప్రాధాన్యం అలాగే కొనసాగుతున్నాయి. ప్రజలలో ప్రజాస్వామిక చైతన్యం ఉన్నచోట, అంతగా లేని చోట కూడా అత్యున్నత అధికార పీఠాలు ఎవర్‌ గ్రీన్‌ హీరోల మాదిరిగా వెలిగిపోతూ ఉంటాయి. వాటిని అందుకోవాలన్న ఆరాటమూ రాజకీయ నాయకులలో దండిగా దట్టించి ఉంటుంది. దేశ ప్రధాని అయ్యే అవకాశం కాళ్ళదగ్గరకు వచ్చినా పార్టీ అడ్డుపడి దానిని అందుకొని అనుభవించనీయకుండా చేసిందనే బాధ సిపిఎం అగ్రనేత, కీర్తిశేషులు జ్యోతిబసుకు ఏ మూలనో ఉండేదని అనుకునేవారు. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ సారథ్యంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఆరు మాసాల 10 రోజులు ప్రధాని పీఠాన్ని అలంకరించిన చంద్రశేఖర్‌ అంతటితో తన జన్మ ధన్యమైపోయిందనుకొన్నారు.

యునైటెడ్‌ ఫ్రంట్‌ హయాంలో ఒక్కొక్కరూ ఏడాదికంటె తక్కువ కాలం ప్రధానులుగా ఉన్న దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ కూ డా రాజకీయ పరమ పదాన్ని అందుకొన్నందుకు సంబరపడ్డారు. ప్రణబ్‌ ము ఖర్జీ, శరద్‌ పవార్‌ ఆ పీఠం మీద దృష్టి పెట్టుకున్నవారే. 84 సంవత్సరాల వయసులో ఎల్‌.కె. అద్వానీ కూడా ఇంకా ఆశ చంపుకోలేక మనోరథ యాత్రకు బయలుదేరారు. రాహుల్‌ గాంధీ అయితే తనకు తొందర లేదంటూ ఆ పదవికి దూరంగా ఉంటూనే ప్రజామోదంతో దానిని పొందాలనే ఆరాటంలో యుపి ఎన్నికల విజయమనే మత్స్య యంత్రాన్ని కొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు.

కేంద్రంలో ప్రధాని పదవి ఎటువంటిదో రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవి అటువంటిది. డి.శ్రీనివాస్‌ అంతటి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఏ రాజ్యసభ సభ్యత్వం కోసమో పాటు పడి సంపాదించుకోకుండా ఎమ్మెల్సీ ఎందుకయ్యారని కొంతమంది అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటారు. రాజ్యసభ సభ్యుడైతే అంతకు మించి మరేమీ ఉండదు. మహా అయితే కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వంలో సహాయ మంత్రి కాకుంటే క్యాబినెట్‌ మంత్రి అయ్యే అవకాశం అరుదుగా రావచ్చు, రాకపోవచ్చు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ అయితే క్యాబినెట్‌లో మంచి శాఖకు మంత్రి అయ్యే అవకాశంతో బాటు కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి కూడా కావచ్చు.

సకలజనుల సమ్మెతో అతలాకుతలమైపోయిన రాష్ట్రం అది విరమణ కావడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ది. తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా విధులకు హాజరవుతున్నారు. చాలా కాలం తర్వాత శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగబోతున్నది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించింది. పాలక పక్షం ఇంత వరకు పక్కన పెట్టిన కొన్ని కీలక రాజకీయ నిర్ణయాలను తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. అందులో ప్రధానమైనది మంత్రివర్గ విస్తరణ. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కొందరి రాజీనామాల వల్ల ఏర్పడిన ఖాళీల భర్తీతో బాటు అదనంగా మరికొందరిని క్యాబినెట్‌లోకి తీసుకోవలసి ఉన్నది. కాంగ్రెస్‌లో విలీనమైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు లేక ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిన అగత్యం ఉన్నది.

అందుచేత మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా, ఇవ్వదా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అధిష్ఠానం పచ్చ జెండా ఊపితే ఆయన పీఠం పదిలంగా ఉన్నట్టు, లేకపోతే ఏ డిఎస్‌నో, బొత్సనో, మరొకరినో నాల్గవ ముఖ్యమంత్రిగా రంగంలో దింపే అవకాశమున్నదనే అంచనాలు జోరుగా సాగుతున్నాయి. దీనితో బాటుగా ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి మధ్య పచ్చి గడ్డి కూడా భగ్గుమనే పరిస్థితి నెలకొన్నదనే కథనాలూ బయలుదేరాయి. వీటిని గమనిస్తే పాత తరం సినిమా రాజకీయాలు గుర్తుకు రాక మానవు.

అప్పట్లో వెండితెర హీరోలు ఎన్‌టిఆర్‌, ఎన్‌ఆర్‌ల మధ్య పోటీని పరాకాష్ఠకు తీసుకు వెళ్తూ ప్రచారం సాగేది. వారిద్దరికి మాటలు లేవని, ఒకరంటే ఒకరికి గిట్టదని చెప్పుకునేవారు. వారి అభిమాన సంఘాల మధ్య శీతాకాలపు చన్నీళ్ళు కూడా సల సల కాగే స్థాయి వేడి రగిలేది. అది సినిమా నిర్మాతలకు మంచి వ్యాపారం చేసిపెట్టేది. ఒకరి సినిమాకి మించి ఇంకొకరి సినిమా శతదినోత్సవాలు జరుపుకునేలా అభిమానులు పోటీ పడేవారు. మధ్య మధ్యలో గుండమ్మ కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలు వారిద్దరిని తెరమీద ఒకరి సరసన ఒకరిని చూసే అవకాశం కల్పించేవి. ఆ సినిమాలు కూడా ఘనంగా ఆడేవి. అటువంటి పోటీ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య ఏర్పడినట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

మొన్నీమధ్య వీరిద్దరూ ఢిల్లీ వెళ్ళినప్పుడు అధిష్ఠానం వద్ద ఎవరి గొప్పలు వారు చెప్పుకుని, పరస్పరం నిందించుకునే ఎత్తుగడలు రసవత్తరంగా నడిపించారని వార్తలు వచ్చాయి. తెలంగాణ ఉద్యోగుల చేత సమ్మె విరమింపచేసిన ఘనత తనదంటే తనదని అధిష్ఠానం వద్ద వీరు చెప్పుకున్నట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. వాస్తవానికి సుదీర్ఘ సమ్మెను విరమింపచేయడానికి గట్టి చర్యలు ప్రారంభమైంది ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళివచ్చిన తర్వాతనే. తెలంగాణపై రాజకీయ నిర్ణయం ఇప్పట్లో సాధ్యం కాదన్న దృఢ నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం సమ్మె విరమింపచేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చేతనైనవి చేసి సమ్మెకు తెర దించాలని ముఖ్యమంత్రికి స్పష్టం చేసింది. దానితో అస్పష్టత తొలగిపోయి ముఖ్యమంత్రి కార్యరంగంలోకి దిగారు. సమ్మె వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు కలుగుతున్న నష్టాలను గురించి స్వయంగా తానే మీడియాకు వివరించడం ద్వారా సమ్మెలోని ఉద్యోగులు పునరాలోచలో పడే పరిస్థితి కల్పించారు.

ఎవరిపైనా రాజకీయ విమర్శలు చేయకుండా వాస్తవ పరిస్థితిని గణాంకాలతో సహా వివరించి విజ్ఞతతో, నిగ్రహంతో వ్యవహరించారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు బొత్స రవాణా మంత్రి హోదాలో ఆర్‌టిసి యూనియన్‌ నాయకత్వాన్ని సమ్మె విరమణకు ఒప్పించడంతో ఉన్నపళంగా పరిస్థితిలో మార్పు మొదలైంది. ఉక్కు పిడికిలిని తలపించిన సమ్మె సడలడం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ, దానం నాగేందర్‌ వంటి మరి కొందరు మంత్రులూ తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసి సమ్మె విరమణకు ఉద్యోగుల నాయకులను మానసికంగా సిద్ధం చేసేందుకు కృషి చేశారు. ఉద్యోగులు సమ్మె విరమించుకోవడానికి ఒక నెపం కావలసి వచ్చింది. ఢిల్లీనుంచి నమ్మదగిన హామీ గాని, గట్టి విజ్ఞప్తి గాని వస్తే సమ్మె విరమించుకుంటారనే సంకేతాలు రావడంతో ఉద్యోగుల నాయకులు కొందరిని ఢిల్లీ తీసుకు వెళ్ళి అధిష్ఠానంచేత వారితో చర్చలు జరిపించాలనే ప్రతిపాదన వచ్చిందని, అందుకు సిఎం ససేమిరా అన్నారని ఊహాగానాలు చోటు చేసుకున్నాయి.

చివరికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి గులాం నబీ అజాద్‌ సమ్మె విరమించవలసిందిగా ఢిల్లీనుంచి విజ్ఞప్తి చేయడం ఉద్యోగ సంఘాలు ఒకటొకటే విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించడం జరిగిపోయాయి. గులాం నబీ అజాద్‌ గతంలో రాష్ట్ర రాజకీయాలతో తనకు గల విశేష పరిచయాన్ని ఉపయోగించి ఈ క్లిష్ట సమయంలో సమర్ధంగా వ్యవహరించారనిపించుకున్నారు. అందుకే డి. శ్రీనివాస్‌కు కౌన్సిల్‌ సభ్యత్వం ఇప్పించడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ ముఖ్యమంత్రి రాజనరసింహ ఇలా ఒక్కొక్కరూ తలా ఒక్క చేయి వేసి ఎవరి పాత్రను వారు నిర్వహించడంతో పరిస్థితి చక్కబడింది. టీ- మంత్రులూ ముఖ్యంగా వారిలో జానారెడ్డి సాహసం ప్రదర్శించి సమ్మె విరమణకు పిలుపునివ్వడం గమనార్హం.

ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోషించిన పాత్ర సహజం గానే పెద్దది, విశేషమైనది. ఇందులో ఆయన, బొత్స పంతాలకు పోయి ఒకరిని మించి ఒకరు పైచేయి ప్ర దర్శించుకోవాలని చూస్తే సమ్మెను ఈ విధంగా తలా ఒక చేయి వేసి విరమింపచేయడం సాధ్యమయ్యేదా? ముఖ్యమంత్రి పదవి మీద తనకు గల ఆసక్తిని బొత్స సత్యనారాయణ ఎప్పుడూ దాచుకోలేదు. చివరికి మొన్న డిఎస్‌ శాసన మండలి సభ్యుడు అవుతున్న తరుణంలో కూడా ముఖ్యమంత్రి పదవి వరించగల అవకాశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ డిఎస్‌ ఒక్కరేనా, మేం లేమా? అని బొత్స ఓపెన్‌గానే అన్నారు. కాకపోతే డి.శ్రీనివాస్‌ ఎమ్మెల్సీ కావడంతో బొత్స పేర్కొన్న రేసులో మరొకరు చేరారు. అంత మాత్రాన ముఖ్యమంత్రిని మార్చబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవమనుకోడానికి ఎంత మాత్రం వీలు లేదు.

అధిష్ఠానం అదిలించి కర్తవ్య బోధ చేయగానే ముఖ్యమంత్రి తన సర్వ శక్తి యుక్తులను ప్రయోగించి సమ్మె విరమింప చేయించిన తీరు, రైల్‌ రోకోపై కఠినంగా వ్యవహరించిన వైనం అగ్రనాయకత్వాన్ని ఆకట్టుకొన్నదనే చెప్పాలి. అందుచేత ఆయన తుది వరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగగల అవకాశాలే మెండు. కాకపోతే వై.ఎస్‌. రాజశేఖర రెడ్ది ఆకస్మిక మరణానంతరం రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ అస్థిర, అనిశ్చిత వాతావరణం నుంచి గుణపాఠం చేర్చుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గం వై.ఎస్‌. ఉండగా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా అంతా ఆయనకు వదిలిపెట్టేసి ఏక వ్యక్తి గుత్తాధిపత్యాన్ని పెంచి చాలా పొరపాటు చేశామనే అభిప్రాయానికి వచ్చింది.

అందుచేత మళ్ళీ ఒకప్పటి మాదిరిగా తన మాటే చెల్లుబాటు చేసుకోవడానికి, అదే సమయంలో ఇక్కడ ఏక నాయకత్వానికి బదులు సమర్ధులైన పలువురు నాయకుల సమష్టి సారథ్యాన్ని కల్పించడానికి సంకల్పించి నట్టు స్పష్టపడుతున్నది. ఆ క్రమంలోనే తమకు విధేయుడు, వ్యూహ కౌశలం గలిగిన డి. శ్రీనివాస్‌కు కౌన్సిల్‌ సభ్యత్వమిచ్చి రంగంలోకి తెచ్చినట్టు బోధపడుతున్నది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య దూరం పెరిగిందనో, డిఎస్‌కు కౌన్సిల్‌ సభ్యత్వమిచ్చింది సిఎంను చేయడానికే అనో వస్తున్న ఊహాగానాలు కావాలని పత్రికల పాఠకులకు, ఛానెళ్ళ వీక్షకులకు వండి వడ్డిస్తున్న మసాలాయేనని భావించాలి.

- సౌభాగ్య. ఎం

************************************************************************************************************


చదువులతో చెలగాటం
సంపాదకీయం
‘నీ కలలు సాకారం కావాలంటే, నువ్వు కలలు కంటూనే ఉండా’లని మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం ఉద్బోధ. కలలు కనడం చేతకాని జాతికి భవిష్యత్తు ఉండదని ఆయన అంటారు. ఈరోజుల్లో మెడిసిన్, ఐఐటీ వంటి కోర్సులు చదవాలని విద్యా ర్థులు కేవలం ‘గాలిలో మేడలు’ కట్టుకుంటూ కూర్చోవడం లేదు. ఆ కలను నిజం చేసుకోడానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా చదువులను తీర్చిదిద్దుకుంటున్నారు. తమ పిల్లలు ఒక డాక్టరో, ఐఐటీ నిపుణుడో, శాస్త్రవేత్తో కావాలనుకునే తల్లిదండ్రులు ఆరో తరగతినుంచే అందుకు సంబంధించిన శిక్షణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అప్పో సొప్పో చేసైనా పిల్లల చదువులపై లక్షల రూపాయలు వెచ్చించడానికి ఈరోజున వెనకాడే తల్లిదండ్రులు చాలా అరుదు. ఉన్నత చదువుల పట్ల ఒక ఆరోగ్యకరమైన స్పృహ ఆర్థిక వ్యత్యాసాలకు అతీతంగా మేలుకుంటోంది.

ఇది దేశాభ్యున్నతికి ఎంతో దోహదపడే పరిణామం. కానీ, పాలకుల చర్యలు, నిర్ణయాలు ఆ స్పృహపై నిప్పులు పోస్తున్నాయి. పసి కలలను కసిగా చిదిమేస్తున్నాయి. మన రాష్ట్రంలో గత రెండేళ్లుగా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న తీరు మరింత ఘోరమూ, హేయమూ. ఉపకారవేతనాలకు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికీ భారీ ఎత్తున పెట్టిన కోతా, ఉపకారవేతనాల విడుదలలో అసాధారణ జాప్యం బడుగు విద్యార్థుల గుండెల్లో ఎంతటి బడబాలాన్ని నింపాయో, ఎంతమందిని చదువులకు దూరం చేశాయో తెలియనిదికాదు. పులి మీద పుట్రలా, వైద్యవిద్యా ప్రవేశ పరీక్షకు సంబంధించిన తాజా నిర్ణయం వేలాది మంది విద్యార్థుల ఆశల కొమ్మపై గొడ్డలి పెట్టు అవుతోంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు సహా ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలు నింపుతోంది.

వైద్యం, ఇంజనీరింగ్ వంటి కోర్సులలో ప్రవేశానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఇప్పటివరకు ఎంసెట్ వంటి అర్హతా పరీక్షను నిర్వహిస్తున్నాయి. వైద్యవిద్యా ప్రవేశ పరీక్షలో పారదర్శకత ఉండాలనీ, అందుకు వీలుగా దేశమంతటా ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలనీ ఆమధ్య సుప్రీంకోర్టు భారత వైద్యమండలి (ఎంసీఐ)ని ఆదేశించింది. తదనుగుణంగా ఎంసీఐ జాతీయ అర్హతా -ప్రవేశపరీక్ష (నీట్) పేరుతో ఒక విధానానికి రూపకల్పన చేసింది. సీబీఎస్‌ఈ సిలబస్ వెలుగులో దానికి ఒక పాఠ్యప్రణాళికను కూడా రూపొందించి చాలా రోజుల క్రితమే వెబ్‌సైట్‌లో ఉంచింది. జాతీయ స్థాయిలో ఉమ్మడి పరీక్ష ఉండాలన్న నిర్ణయాన్ని సూత్రరీత్యా ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఇప్పుడున్న విధానంలో వైద్యవిద్యలో ప్రవేశం కోసం విద్యార్థులు చాలామంది పది చోట్ల పది పరీక్షలు రాయవలసివస్తోంది.

పది రకాల ప్రశ్నపత్రాలలో తర్ఫీదు పొందవలసివస్తోంది. వ్యయప్రయాసలకూ లోనవుతున్నారు. కనుక, ఉమ్మడి పరీక్షావిధానం ఆమేరకు వారికి అనుకూలమే. కానీ, వచ్చే సంవత్సరం నుంచే ఉమ్మడి పరీక్ష నిర్వహిం చాలని నిర్ణయించడం, దానికి రాష్ట్రప్రభుత్వం తలూపడమే దారుణం. విద్యార్థుల మనోభావాల పట్ల, భవిష్యత్తుపట్ల బొత్తిగా లక్ష్యం లేదనడానికి ఇదే నిదర్శనం. ఇంటర్ పరీక్షలు నాలుగు మాసాల దూరంలో ఉన్నాయి. వాటితోపాటే, ఎంసెట్‌కూ వేలు, లక్షలు ధారపోసి దాదాపు 70 వేల మంది విద్యార్థులు వైద్య విద్యా ప్రవేశపరీక్షకు సన్నద్ధమవుతున్నారు. వీరిలో 30 వేల మంది తెలుగు మాధ్య మం విద్యార్థులు ఉంటారు. ఉమ్మడి పరీక్షావిధానంలో ఇంతవరకు ఒక స్పష్టత రాలేదనీ, తుది సిలబస్‌ను ప్రకటించలేదనీ అంటున్నారు. అదొక సమస్య కాగా, ఉమ్మడి పరీక్షకు ఆధారం చేసుకున్న సీబీఎస్‌ఈ సిలబస్ ఇంటర్, ఎంసెట్ సిల బస్‌లను మించి 50 శాతం ఎక్కువ ఉంటుంది. పుస్తకాల లభ్యతా సమస్యే. దీనికి తోడు, తెలుగు మాధ్యమం విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ అనువాదం సిద్ధం కాలేదని సమాచారం.

ఈ పరిస్థితిలో, ఈ విద్యాసంవత్సరంనుంచే ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి రాష్ట్రప్రభుత్వం ఎలా ఆమోదించిందన్నదే ఆశ్చర్యకరం. విద్యా ర్థుల ప్రయోజనాలపట్ల ఏమాత్రం స్పృహ, బాధ్యత ఉన్న ఏ ప్రభుత్వమైనా ఇంత నిష్పూచీగా వ్యవహరిస్తుందా? ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందా? విద్యార్థులు, తల్లి దండ్రులు, అధ్యాపకులను సంప్రదించకుండానే, సాధకబాధకాలను అన్ని కోణాల నుంచీ పరిశీలించకుండానే ఇంత కీలక నిర్ణయాన్ని రుద్దే సాహసం చేస్తుందా?

ఇతర రాష్ట్రాల స్పందనను చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోవడం మరింత విస్మయకరం. తమిళనాడు ప్రభుత్వం ఉమ్మడి పరీక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి మినహాయింపు సాధించుకుంది. తమ రాష్ట్రంలో ప్రవేశపరీక్షలను మొత్తంగా రద్దుచేశామన్న కారణంతో ఆ ప్రభుత్వం ఉమ్మడి పరీక్షను వ్యతిరేకించింది. ఉమ్మడి పరీక్షకు ఆమోదం తెలిపినప్పుడు, అందుకు అవసరమైన సన్నాహాలు చేసుకోవడం ప్రభుత్వం మౌలికబాధ్యత. కనీసం సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనువాదాన్ని సిద్ధంచేసి తెలుగు మాధ్యమం విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఆలోచన కూడా మన రాష్ట్రప్రభుత్వంలో అంకురించకపోవడాన్ని ఏమనాలి? పరీక్షావిధానం విషయంలో ఒక స్పష్టత రాకుండా, తుది సిలబస్ సిద్ధం కాకుండా, అయిదు మాసాల వ్యవధిలో ఉమ్మడి పరీక్షకు సిద్ధం కావలసిన పరిస్థితిని విద్యార్థులపై రుద్దడమంటే వారి భవిష్యత్తుతో చెలగాటమాడడమే. వారి కలలను మొగ్గలోనే తుంచివేసే కర్కశత్వమే అందులో ఎవరికైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రణాళికాబద్ధమైన చదువుల యుగంలోకి ప్రవేశిం చారనీ; లక్షలు ధారపోసి అయినాసరే తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలన్న చైతన్యం నేడు అతిసామాన్యులలో సైతం మేలుకున్నదన్న గ్రహింపు ప్రభుత్వంలో ఉంటే ఇంత ఆషామాషీగా వ్యవహరించేది కాదు. ఇప్పటికైనా తప్పు దిద్దుకోవాలి. ఉమ్మడి పరీక్ష గండకత్తెర నుంచి విద్యార్థులను కాపాడాలి. తగిన సన్నాహాలు చేసిన తర్వాతే దానిని తలకెత్తుకోవాలి.

No comments:

Post a Comment