Tuesday, October 18, 2011


పత్తి రైతు చిత్తు

  • కరువుతో తగ్గిన దిగుబడులు
  • ఎకరాకు 3 క్వింటాళ్ల తగ్గుదల
  • మద్దతు ధర పెంచని ప్రభుత్వం
  • తూకాల్లోనూ దోపిడీ
కరువు, కరెంటు కోతతో పత్తి రైతు బతుకు చిత్తవుతోంది. వర్షాలేక, కరెంట్‌ కోతతో పైర్లు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఈ ఏడాది డీజిల్‌, ఎరువుల ధరలు పెంచితే కంపెనీలు విత్తనాల ధరల్ని పెంచేశాయి. దీంతో సాగు ఖర్చులు పెరిగిపోయాయి. ఇంతవరకూ ప్రభుత్వం సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. క్వింటాలు ధర గతేడాది కంటే సగం పడిపోయింది. గతేడాది పత్తి క్వింటాలు అత్యధిక ధర రూ.6 వేలు పలికింది. అదీ పంట చివరిలో దక్కిన ధర. ఈసారి మాత్రం రూ.2200 కోత పడింది. చేతికొచ్చిన కొద్దిపాటి పత్తికైనా మంచి ధర వస్తే కష్టాలు తీరకపోయినా కొంత ఉపశమనం కల్గుతుందని రైతులు ఆశపడ్డారు. సర్కార్‌ మద్దతు ధర రూ.3300 ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇదే అదనుగా దళారులు రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. క్వింటాలు పత్తి రూ.3600 నుండి 3800 వరకే కొనుగోలు చేస్తున్నారు. గత వారంలో మాత్రం రూ.4500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు దళారులు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గించేశారు. మార్కెట్‌లో పత్తికి ధర పడిపోయిందని ప్రచారం చేస్తూ రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 3,25,135 ఎకరాలు. ఈ ఏడాది 3,75,000 ఎకరాల్లో సాగైంది. గతేడాది 4,12,780 ఎకరాల్లో సాగైంది. అంటే ఈసారి 37,780 ఎకరాల్లో సాగు తగ్గింది. జూన్‌ మాసంలో వర్షాలు కురవలేదు. జులై రెండో వారంలో వర్షాలు కురిశాయి. అప్పట్లోనే బిటి పత్తి విత్తనాల ధరల్ని కంపెనీలు పెంచేశాయి. విత్తనాలు దొరక్క రైతులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంతలో మళ్లీ వర్షాలు వెనుకపట్టు పట్టాయి. దీంతో పత్తి సాగు ఈ ఖరీఫ్‌లో తగ్గుముఖం పట్టింది. జిల్లాలో ఆగస్టు 25వ తేదీ నుండి అక్టోబర్‌ 18 వరకూ ఒక్క రోజు మినహాయించి వర్షాలు కురవ లేదు. సెప్టెంబర్‌లో పత్తి ఊడలేస్తుంది. ఊడ నిలిస్తేనే పత్తి పూత, కాత ఉంటుంది. ఆ సమయంలో నీటి ఎద్దడి ఏర్పడడంతో ఊడ రాలిపోయింది పోగా, మిగిలినది చేతికొచ్చే దశలో దళారులు దోపిడీ చేస్తున్నారు. నీటి లభ్యత బాగుంటే సాగునీటి వనరుల కింద సాగైన చేలల్లో నల్ల భూముల్లోనైతే ఒక్కో చెట్టుకు 100-120 కాయల వరకూ కాస్తాయి. ఎర్రభూముల్లో 80 కాయల వరకూ ఉంటాయని రైతులు చెబుతున్నారు.
కరువు వల్ల జిల్లాలో ఎకరాకు 5 క్వింటాళ్ల పత్తి మాత్రమే వస్తుంది. పైపుల ద్వారా నీటిని కడుతున్న రైతులకు 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుంది. అయితే మోటార్లు, పైపులు, కూలీల ఖర్చులు పోతే ఆ రైతులకు 5 క్వింటాళ్లు కూడా మిగడంలేదు. చెట్టుకు 25 నుంచి 40 లోపే కాయలున్నాయి. ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు మొదటి దఫా పత్తినే ఏరుతున్నారు. ఈ అంచనా మేరకు ఎకరాకు మొత్తం 5 క్వింటాళ్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు.
పత్తి తూకంలో కూడా దోపిడీ చేస్తున్నారు. క్వింటా పత్తికి రెండు కిలోల తరుగు తీస్తున్నారు. కాంటాల్లో మోసాలు కొనసాగుతున్నాయి. క్వింటాలు పత్తి తూకంలో రూ.25 కిలోలు ఎక్కువగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. పిఏపల్లి మండల కేంద్రంలో పత్తి ధర రూ.3800 ఇస్తున్నారు. నల్గొండ నుండి వెళ్లిన వ్యాపారులు రూ.4 వేలు ఇస్తామని ఆశచూపి కొనుగోలు చేశారు. తీరా తూకంలో క్వింటాలుకు 25 కిలోలు అధికంగా తూకం వేశారు. దీన్ని గమనించిన రైతులు దళారుల్ని పట్టుకుని దాడి చేశారు.
ఎకరాకు 29 వేల నష్టం
ఎకరంలో పత్తి దిగుబడి 8 క్వింటాళ్లు వస్తే రూ.6 వేల ధర చొప్పున రూ.48 వేల ఆదాయం వచ్చేది. కరువుతో మూడు క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. ధర కూడా రూ.2200 వరకూ తగ్గింది. అంటే ఒక్కో రైతు ఎకరాకు దిగుబడులు తగ్గినందుకు రూ.18 వేలు, ధర లేనందుకు రూ.11 వేల చొప్పున నష్టపోతున్నారు. రైతు ఎకరాకు రూ.29 వేల ఆదాయాన్ని కోల్పోతున్నాడు. ఎకర పొలంలో పత్తి సాగు చేయాలంటే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, దున్నకం, కూలీల కోసం రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కౌలు రైతులు అదనంగా ఎకరాలకు రూ.5 నుండి 8 వేల వరకూ కౌలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం పత్తి ఎకరాకు ఐదు క్వింటాళ్లే వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం క్వింటాకు రూ.3800 చొప్పున 5 క్వింటాళ్లకు 19 వేల ఆదాయమే వస్తుంది. అంటే ఎకరాకు 48 వేల ఆదాయం రావాల్సి ఉండగా దిగుబడులు, ధర తగ్గడం వల్ల కేవలం రూ.19 వేలే వస్తుంది. పెట్టుబడులు కూడా వెళ్లడంలేదు. ఇక కుటుంబమంతా ఆరుగాలం సాగు కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. వీరి రెక్కల కష్టానికి ఫలితమే లేకుండా పోతుంది.
సగమొచ్చే నమ్మకం కూడా లేదు : మంగ జగన్‌
వలిగొండ మండలం, సుంకిశాల
పోయినేడాదిలో వచ్చిన పత్తిలో సగం కూడా వస్తదో రాదో. వర్షాల్లేక చేలు గిడసబారి పోయాయి. బోరు వేసి మోటార్‌ పెట్టి నీటిని కడుతున్నం. పైపులు, మోటార్‌కు రూ.30 వేలు అయింది. కరెంట్‌ కోతతో మోటార్‌ నడవలేదు. ట్రాక్టర్‌తో మోటార్‌ నడిపాం. డీజిల్‌కు మళ్లీ అదనంగా ఖర్చు చేశాం. అయినా పత్తి చేతికొచ్చే వరకూ నమ్మకం లేదు. గతేడాది ఎకరంలో 8 క్వింటాళ్లు వచ్చింది. క్వింటాకు రూ.6 వేల ధర ఇచ్చారు. ఈసారి 5 క్వింటాళ్లు వచ్చేది కష్టంగానే ఉంది. డిఎపి బస్తాకు వంద రూపాయలు పెంచారు. విత్తనాలకు ప్యాకెట్‌కు 250 పెంచారు. యూరియా, పురుగు మందులకూ ఖర్చులు పెరిగినయి. పత్తికి మాత్రం రేటు రావడం లేదు.
6 ఎకరాల్లో నాలుగు క్వింటాళ్ల పత్తి వచ్చింది
బర్ల యాదయ్య , వలిగొండ మండలం, నాగారం
ఆరు ఎకరాల భూమి కౌలు తీసుకుని పత్తి వేసా. ఎకరాకు రూ.5 వేల కౌలు కట్టాను. రూ.20 వేల పెట్టుబడి పెట్టాను. ఆరెకరాలకుగాను లక్షా 20 వేల రూపాయలు షావుకారి దగ్గర అప్పు తీసుకున్నాను. కౌలు డబ్బులతో మొత్తం వ్యవసాయానికి లక్షా 50 వేలు ఖర్చు పెట్టిన. మైల పత్తి (మొదటిసారి) ఆరెకరాల్లో తీశాము. మూడు క్వింటాళ్ల 95 కిలోల పత్తి వచ్చింది. ఏరిన పత్తిని మండల కేంద్రానికి తీసుకెళ్లి అమ్మాను. రెండ్రోజుల ముందే ధర తెలుసుకుంటే క్వింటాకు రూ.4200 ఇస్తామన్నారు. దుకాణం కాడికెళ్లిన తర్వాత రూ.3900 ధర ఉందని చెప్పారు. పత్తిని తీసుకెళ్లేందుకు ఆటో కిరాయి రూ.200 అయింది. అసలు ధరలో క్వింటాకు రూ.300 తీసేశారు. రూ.1500 మునిగి పోవాల్సి వచ్చింది. 

No comments:

Post a Comment