విశ్లేషణ
వి.హనుమంతరావు
సీనియర్ పాత్రికేయులు
పేదలంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు అతిరథులు, మహారథులు, మేధావులు, ఆర్థికశాస్త్రవేత్తలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 62 ఏళ్ల తర్వాత కూడా జవాబు చెప్పలేకపోతున్నారు. స్థూల దృష్టితో చూసినా పేదలు ఎవరో ఇట్టే తెలుసు కోవచ్చు, కానీ మన సోకాల్డ్ మేధావులకు సూక్ష్మదృష్టి లేకపోగా, స్థూల దృష్టి కూడా కొరవడటం విచారకరం. పట్టణాల్లో మురికివాడలకు వెళ్లండి. గ్రామాలకు పోతే మనకు మనుషులు కాదు బొమికెల గూళ్లు, ఒంటిమీద బట్ట లేకుండా వీధుల్లో ఆడుకొనే పిల్లలు, కేవలం రెండే రెండు చీరలతో కాలం వెళ్లబుచ్చే స్త్రీలు కొల్లలుగా కనిపిస్తారు. కానీ ప్రభుత్వం దృష్టిలో వారంతా పేదవాళ్లు కాకపోవచ్చు. అందుచేత వాళ్లెవరో లెక్కలు తీయమని ఛప్పన్నారు కమిటీలు వేశారు.
దేశానికి స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అధ్యక్షునిగా, కె.టి.షా కార్యదర్శిగా ఒక కమిటీని వేయ టంతో ప్రారంభమై స్వాతంత్య్రానంతరం, ప్రధాని నెహ్రూ నియ మించిన నిపుణుల కమిటీ, దండేకర్ అండ్ రథ్, పి.వి. సుఖాత్మే, నేషనల్ సాంపిల్ సర్వే సంస్థ, ప్రణాళికా సంఘం, డి.టి.లక్డావాలా కమిటీ, అర్జున్‌సేన్ గుప్త కమిటీ, టెండూల్కర్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్... ఇవికాక ఇంకా అనేక పరిశోధనా సంస్థలు, ఎన్జీవోలు పేదరికం అనే కొండను తవ్వుతూనే ఉన్నాయి. వీళ్లంతా కలిసి చేసిన ఘనకార్యమేమంటే సమస్యను మరింత క్లిష్టతరం చేస్తూ వచ్చారు. ఈలోగా పేదరికం పెరిగిపోతూనే ఉంది. కుబేరులైనవారు మరింతగా కుబేరులై పోతున్నారు.
వాళ్లంతా కలిసి పేదరికపు రేఖ అనే గీతను సృష్టించారు. అది ఆకుకందదు. పోకకు పొందదనే విధంగా తయారై పేదరికం సమస్యను పక్కనపెట్టి రేఖను ఎక్కడ గీయాలనే రంధిలో పడ్డారు. 1971లో ఎం.దండేకర్, రథ్ అనే ఇద్దరు ఆర్థికశాస్త్రవేత్తలతో ఏర్పరచిన కమిటీ రెండుపూటలా తిండి తినలేని వాడే పేదవాడని నిర్వచించింది. దురదృష్టమేమంటే మానవుడన్న తర్వాత కేవలం తిండి గింజలతోనే బతకలేడని, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఆరోగ్యం, చదువు, రెండు పూటలా తినడానికి కావాల్సిన తిండి గింజలను కొనుక్కోవడానికి ఉపాధి వంటి మౌలిక అంశాల గురించి వారు ఆలోచించక పోవడం. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ప్రభుత్వ ఆలోచనలు, ఆర్థిక శాస్త్ర వేత్తల సూత్రీకరణలు ఈ పరిధిని దాటలేదు. అది దాటనంత కాలం పేదరి కంతో దేశం రాజీపడక తప్పదు.
ఇలాంటి కప్పదాటు ఫార్ములాలతో పేదరికం పోదు. డా. మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గృహవసతి కల్పించడానికి ఇలాంటి ఫార్ములానే ఎంచుకున్నారు. పేదవారి గృహవసతి కల్పన కోసం ప్రతి కుటుంబానికి రూ.400 ఇచ్చి, దగ్గర్లో ఉన్న అడవుల్లోంచి తాటాకులు, వెదుళ్లు తెచ్చుకొని ఇల్లు నిర్మించుకోమన్నారు. పోనీ ఆ పాక నిర్మించుకోవడానికి స్థలం చూపించలేదు. రికార్డుల్లో మాత్రం ఇన్ని లక్షల మందికి గృహ వసతి కల్పించామని ప్రచారం చేసుకొంది ప్రభుత్వం. అలాగే గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రామాలకు గ్రామాలనే నేలమట్టం చేసి నిర్వాసితులను ఫలానా చోట ఇల్లు కడతాం, అక్కడికి వెళ్లమ న్నారు. మౌలిక సదుపాయాల కల్పన గాలికి వదిలేశారు. పేదరికం తగ్గిపోయిం దని చెప్పే లెక్కలన్నీ ఇలాంటివే.
రెండు పూటలా తిండి అంటే ఏమిటి? ఎంత? అనే ప్రశ్న దండేకర్-రథ్ కమిటీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థను అడిగితే మనిషి బతకడానికి కనీసం 2,250 కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని చెప్పింది. ఆ ఆహారంలో ఎటువంటి పోషక పదార్థాలుండాలి, వాటిని సమకూర్చుకోవాలంటే ఎంత డబ్బు అవసరమవుతుందో లెక్కలువేసి, మార్కెట్లో వాటి ధరలు సేకరించి, ఇదిగో ఇంత ఆదాయం ఉండాలని అన్నారు. దీనికి దారిద్య్రరేఖ అనే పేరు పెట్టి, ఈ మేర కూడా ఆహారం తినలేని వారు పేదలు అని నిర్ధారించారు. ధరలు పెరిగిన మేరకు పేదరిక రేఖను కూడా పెంచుతూ వచ్చారు.
ఈ సూత్రాల ఆధారంగా, ఈ ఆదాయం ఆధారంగా ప్రతీ గ్రామంలో, పట్టణంలో పేద కుటుంబాలను గుర్తించి వారికి కార్డులివ్వాలి, చౌక ధరల దుకాణాల ద్వారా వారికి నియమిత ఆహార ధాన్యాలను సరఫరా చేయాలి ఈ దుకాణాలు ఎంత సవ్యంగా నడుస్తున్నాయో, ఈ కార్డుల పంపకం ఎంత అపసవ్యంగా నడుస్తున్నదో, స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయంతో ఎలా భ్రష్టుపట్టిందో తెలిసిందే. ఒకే ఒక ఉదాహరణ. జాతీయ సలహా సమితి (దీనికి సోనియా గాంధీ అధ్యక్షురాలు) సభ్యుడు ఎన్.సి.సక్సేనా పంపిణీ విధానం లోపభూయిష్టంగా ఉందని చెబుతూ స్వయంగా ప్రణాళికా సంఘమే పేదరిక రేఖ కింద ఉన్న వారిని తొలగించటం లేదా చేర్చటంలో 60 శాతం దాకా తప్పొప్పులున్నాయన్న విషయాన్ని అంగీకరించిందని గుర్తు చేశారు. ఫరీదాబాద్‌లో ఒక స్త్రీ వద్ద 925 రేషన్ కార్డులున్న వైనాన్ని ప్రణాళికా సంఘం నిర్ధారణ చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ భారతీయులు మరీ ఎక్కువగా తింటున్నారని, అందువల్లే ధరలు పెరిగాయనే దారుణమైన ప్రకటన చేయటం, ఆ ప్రకటనను రాజకీయ పార్టీలు ఖండించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘ప్రభుత్వ పథకాల వల్ల పేదల ఆదాయం పెరిగిపోయిన ఫలితంగానే ధరలు ఆకాశమార్గం పట్టాయి’’ అనే ప్రకటన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ కార్యాలయం చేయడం విశేషం. భారత ప్రధానికి అమెరికా పాలకులకు ఎంత సామీప్యత! ఆలోచనల్లో ఎంత ఏకత్వం! నగరాలు, పట్టణాల్లో రోజుకు కేవలం రూ.32, పల్లెల్లో రూ.25 వెచ్చించేవారు పేదలు కాదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ ఆహ్లువాలియా ఇటీవల ఒక కొత్త సత్యం కనిపెట్టి దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం యూపీఏ ప్రభుత్వ భావ దారిద్య్రానికి అద్దం పట్టింది.
2011లో పేదరికపు రేఖను 2001లో జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించడమేమిటని సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయటం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. మరో విషయం. సామాజిక సంక్షేమ పథకాల కోసం చేసే ఖర్చును తగ్గించాలని, పేదలకిచ్చే సబ్సిడీల్లో కోత విధించాలని పారిశ్రామిక వేత్తల సంఘాలు, కార్పొరేట్లు పాలకుల చెవినిల్లు కట్టుకొని ఒత్తిడి తీసుకొనివస్తున్నారు. అసలు చేసిన కేటాయింపులే పూర్తిగా ఖర్చు చేయటంలేదు. చేసే ఖర్చు ఫలితాలు పేదలకు అందటంలేదని మంత్రులే అంగీకరిస్తున్నారు. అలాం టప్పుడు ఆ ఖర్చు తగ్గిస్తేనేగాని అభివృద్ధి సాధ్యం కాదని సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య పోటీ పెడుతున్నారు. ప్రభుత్వం మనుగడే వారి మీద ఆధారపడిన నేపథ్యంలో పేదలకు కన్నీరు, సంపన్నులకు పన్నీరుగా ప్రస్తుత పరిస్థితి తయారైంది.
ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్ ప్రకారం 2,400-2,100 కేలరీల కొలబద్ద ప్రకారం దేశ జనాభాలోని 84 కోట్ల మంది ప్రజలు అంతకన్నా తక్కువే తింటున్నారు. ఇంతమంది పేదరికానికి కారణమైన ఆర్థిక విధానాలను సవరించకుండా, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయకుండా, అవినీతిని అరికట్టకుండా, నిరుద్యోగాన్ని తగ్గించకుండా పేదరికం తగ్గే ప్రశ్నేలేదు. పేదరికమనేది ఆర్థిక, శారీరక, మానసిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయపరమైనదని మన రాష్ట్ర ఆర్థిక శ్రాస్తజ్ఞులు ప్రొఫెసర్ ఎం.ఎల్.కాంతారావు అంటున్నారు.
ఐక్యరాజ్య సమితి ప్రమాణాల ప్రకారం ఎస్సీల్లో 81 శాతం, ఎస్టీల్లో 6 శాతం, బీసీల్లో 58 శాతం, ఇతరులలో 33 శాతం జనం పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ గణాంకాలను ప్రభుత్వం కూడా బొత్తిగా కాదనటం లేదు. అయితే దెబ్బ ఒకచోట తగిలితే, మందు మరోచోట రాస్తే నొప్పి తగ్గదు. అలాగే గణాంకాలతో రకరకాల కసరత్తులు చేసి, అవసరమైతే పేదలకు డబ్బిచ్చి చేతులు దులిపేసు కుందామని ప్రభుత్వం తలపోస్తున్నది. దానికైనా పేదల గుర్తింపు అంటూ జరగాలికదా! ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలకు పుట్టిన బిడ్డ పేదరికం. పేదరికం పోవాలంటే ప్రజలకు ఉపాధి కల్పించాలి. వారి చేతుల్లో డబ్బుంటే, వస్తువులకు, ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. దేశ ఆర్థిక పరిస్థితి అప్పుడు దానికదే మెరుగవుతుంది.
ఆర్థిక సంక్షోభం అనే సుడిగుండంలో మన దేశం, దేశ పాలకులు చిక్కు కొని ఉన్నారు. భారతదేశమే కాదు, అమెరికా, యూరోపియన్ దేశాలతో సహా ప్రపంచ దేశాలన్నీ అదే పరిస్థితిలో ఉన్నాయి. 2008 నాటి సంక్షోభం మన దేశాన్ని అలలా తాకింది గాని తన్నలేదని సంతోషిస్తుంటే ప్రస్తుత ఆర్థిక మాం ద్యం దేశాలన్నిటితోసహా మన దేశాన్నీ కుంగదీస్తున్నది. మన దేశానికి పరిమి తమై చూసుకుంటే మన ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయ రంగం ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రైతాంగం రాష్ట్రంలో తాజాగా క్రాప్ హాలిడే ప్రకటించారు గాని, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పటి నుంచి వ్యవసాయం నిరాదరణకు గురవుతూ వస్తున్నది.
ఉదాహరణకు సాగుభూమి విస్తీర్ణం 2000-01లో 121.05 లక్షల హెక్టార్ల నుంచి 2008-09లో 122.83 లక్షల హెక్టార్లకు పెరిగినా, ఉత్పత్తి మాత్రం అదే కాలంలో 196.81 లక్షల టన్నుల నుంచి 234.47 లక్షల టన్నులకు, ఉత్పాదకత 1,626 కిలోల నుంచి 1,909 కిలోలకు పెరిగింది. తలసరి లభ్యత కూడా రోజు కు 418.2 గ్రామాల నుంచి 444 గ్రామాలకు పెరిగింది. అయినా రైతాంగానికి పెద్దపీట వేయకపోవటం మాట అటుంచి, ఉన్నదంతా ఊడ్చి పారిశ్రామిక రం గానికి దారాదత్తం చేసి రైతన్నను కళ్లనీళ్ల పర్యంతం చేస్తున్నారు. రైతు అప్పో సప్పో చేసి, కల్తీవిత్తనాలు, కల్తీఎరువులు, ప్రకృతి బీభత్సాలనెదుర్కొంటూ పుష్కలంగా పండిస్తుంటే, పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి.
ఇటీవల గోధుమ ధర బాగానే పెంచారు కాని, బియ్యం ధర ప్రకటించాల్సి ఉం ది. ఆహార ధాన్యాల లభ్యత పెరుగుతోంది. కాని, పేదలకు లభ్యతే కొరుకుడు పడని సమస్యగా ఉండిపోయింది. కనీసం పంపిణీ వ్యవస్థను కూడా సరిదిద్ద లేని చచ్చుపుచ్చు ప్రభుత్వం మనలను పరిపాలిస్తోంది. ఒక రకంగా చూస్తే వాళ్లను అధికారంలోకి పంపించి, మన ఓటరు మహాశయులే తప్పు చేశారేమోన నిపిస్తుంది. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించగలిగితే ఏ సంక్షోభమూ మన దరి దాపులకు కూడా రాదన్నది యూపీఏ సర్కార్ గుర్తిస్తే బాగుంటుంది.