Friday, September 2, 2011

హిందుత్వ, మారుతున్న ఐరోపా


హిందుత్వ, మారుతున్న ఐరోపా


Andhra Jyothy (A Telugu Daily)
ఆంద్ర జ్యోతి

హిందుత్వ, మారుతున్న ఐరోపా

యూరోప్ మారిపోతోంది! ఒక తీవ్ర, బాధాకరమైన సామాజిక పరివర్తన అక్కడ చోటుచేసుకొంటోంది. గత నెల 22న నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన భయానక హత్యాకాండ ఈ కఠోర వాస్తవాన్ని ప్రపంచానికి స్పష్టం చేసింది.
యూరోపియన్ సమాజం సాంస్కృతికంగా క్రైస్తవ వ్యవస్థగా ఉండిపోవాలని గట్టి గా కోరుకొంటోన్న ఆండెర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ 77 మంది తరుణ వయస్కులను కాల్చిచంపడం సభ్య సమాజాలను దిగ్భ్రాంతి పరిచింది. ఆందోళనకు, ఆవేదనకు గురిచేసింది. సకల మతాల, దేశాల నాయకులు, ప్రజలు ఆ ఘోర చర్యను ముక్తకంఠంతో ఖండించారు.

ఎందుకిలా జరిగింది? అన్న ప్రశ్న అందరినీ కలచివేసింది. యూరోపియన్లలో అంతర్మథనం మొదలయింది. తమ దేశంలోని పరిస్థితు లు ఏమిటి? ఎలా ఉండాలి? అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. ఓస్లోలో బాంబు దాడులు, ఊచకోతలకు పాల్పడానికి ముందు బ్రీవిక్ ఒక మేనిఫెస్టోను విడుదల చేశాడు. విద్వేషపు ఆలోచనలతో రూపొందిన ప్రణాళిక అది. పెరిగిపోతోన్న ముస్లింల వలసలను నిలువరించడానికి నార్వే వామపక్ష ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టక పోవడాన్ని, ఆ మేనిఫెస్టో ఖండించింది. ఐరోపాలో ముస్లిం జనాభా పెరిగిపోతోంది.

వలసవచ్చిన ముస్లింలు యూరోపియన్ సమాజంలో అంతర్భాగం కావడం లేదు. స్థానిక సంస్కృతితో మమేక మవకుండా తమ సొంత సంస్కృతీ సంప్రదాయాల పరిధిలోనే వారు ఉండిపోతున్నారు. ఇది యూరోపియన్ సమాజాలలో తీవ్ర సమస్యలను సృష్టిస్తోంది. ఎవరూ కాదనలేని సత్యమిది. క్రైస్త వ మత సంప్రదాయాలకు, యూరోపియన్ సాంస్కృతిక విశిష్టతకు హానిచేస్తోన్న ముస్లిం వలసలను అరికట్టాల్సిన అవసరాన్ని చాటి చెప్పడానికి బ్రీవిక్ చాలా దుర్మార్గమైన, ఎవరూ ఎంతమాత్రం సమర్థించలేని మార్గాన్ని అనుసరించాడు. ఇది క్షంతవ్యం కాదు.

చరిత్ర గమనం ఒక ఆవృతాన్ని పూర్తిచేసింది. మధ్యయుగాలలో క్రైస్తవులు, ముస్లింల మధ్య ధర్మయుద్ధాలతో ప్రారంభమై, యూరోపియన్ రాజ్యాల వలస పాలన దౌష్ట్యాలతో కొనసాగి, క్రైస్తవ మత ప్రాబల్యం బలహీనపడి, ఇటీవలి దశాబ్దాలలో యూరోపియన్ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పతనంతో ఆ ఆవృతం ముగిసింది. యూరోప్ 'యూరేబియా'గా రూపాంతరం చెందుతుందనేది అతిశయోక్తి కావచ్చు. అయితే అటువంటి భయాలు ఇంకెంతమాత్రం కేవలం జాత్యహంకారులకు మాత్రమే పరిమితం కావు. చరిత్ర నూతన గమనంతో సర్దుబాటు చేసుకోవడంలో యూరోప్ విఫలమయిందని చెప్పక తప్పదు. ఇదిగో, ఆ వైఫల్యాన్నే బ్రీవిక్ ఘాతుకం సూచించింది.

బహు సంస్కృతీపరత్వం - వలసవచ్చినవారిని సంపూర్ణంగా సంలీనం చేసుకోవడానికై వారు తమ సొంత మత విశ్వాసాలను అనుసరించడానికి, సంస్కృతీ సంప్రదాయాలను ఆచరించడానికి పూర్తి స్వాతంత్య్రాన్ని ఇవ్వడమే ఉత్తమ మార్గమన్న భావన- సత్ఫలితాలనివ్వడం లేదని యూరోపియన్ ప్రజలు గుర్తిస్తున్నారు. ఏంజెలా మెర్కల్ (జర్మనీ ఛాన్సలర్ ), నికోలస్ సర్కోజీ (ఫ్రాన్స్ అధ్యక్షుడు) డేవిడ్ కెమెరాన్ (బ్రిటన్ ప్రధాని) మొదలైన ప్రభుత్వాధినేతలే కాక, పలువురు రాజకీయ నాయకులు, మేధావులు బహు సంస్కృతీపరత్వం విఫలమయిందని అంగీకరించారు. ఒక చేదు నిజాన్ని చెప్పినంత మాత్రాన వారు జాత్యహంకారులవుతారా? ఐరోపా, అమెరికా, ఇతరదేశాలకు వలసవెళ్ళే ముస్లింలు మత స్వాతంత్య్రం, సాంస్కృతిక హక్కులకై డిమాండ్ (ఇది సహేతుకమైనదే) చేయడం కద్దు.

మరి ముస్లిం దేశాలు తమ సమాజాలలోని ముస్లిమేతరులకు ఆ హక్కులను కల్పించడానికి ఎందుకు ససేమిరా అంటున్నాయి? ముస్లింలకు పరమ పవిత్ర క్షేత్రాలు ఉన్న సౌదీఅరేబియా బహుసంస్కృతీపరత్వాన్ని అంగీకరిస్తుందా? ముస్లిమేతర దేశాల నుంచి వచ్చిన వేలాది శ్రామికులు అరబ్ షేక్‌లకు ఎనలేని సంపదలను సృష్టిస్తున్నారు. అయితే అమెరికా, యూరోపియన్ దేశాలలో వలే సౌదీలో కాని, మరే ముస్లిం దేశంలో అయినా కానీ వలస కార్మికులు తమ సొంత మత విశ్వాసాలను అనుసరించడానికి స్వేచ్ఛ ఎందుకు కొరవడుతోంది? బ్రీవిక్ ఘాతుకం నన్ను నిశ్చేష్టుడ్ని చేసింది. అయితే ఒక హిందువుగా అది నన్ను ఆత్మశోధనకు పురిగొల్పింది.

అతని మేనిఫెస్టోలో హిందుత్వను ఆమోదించే వ్యాఖ్యలు ఉన్నాయి (అయితే అవి హిందుత్వ గురించి బ్రీవిక్ తప్పుడు అవగాహన ఫలితమేనని చెప్పాలి). హిందుత్వను, దాని విపులార్థంలో అర్థంచేసుకొంటే, దానిలో హిందూయేతర మతాలపట్ల ఎలాంటి ద్వేషంలేదని విశదమవుతుంది. తన దార్శనికతను చాటడంలోను, తన కార్యక్రమాలను అమలుపరచడంలోను ఆరెస్సెస్ చాలా తప్పులు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఆ సంస్థలో ఒక కార్యకర్తగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను ఆరెస్సెస్ ఎప్పటికీ బ్రీవిక్ పాపకర్మను క్షమించదు. ఇప్పటికే అది ఆ నార్వే యువకుని కిరాతకాన్ని నిర్ద్వంద్వంగా ఖండించింది. ఇటీవలి సంవత్సరాలలో హిందూ తీవ్రవాదులు పాల్పడిన ఘాతుకాలతో ఆ సంస్థ పేరును ముడిపెట్టడం యూపీఏ ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగింది. తమ రాజకీయ యజమానుల ఆదేశాలకు అనుగుణంగానే దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

కనుకనే అవి, వివిధ ఉగ్రవాద చర్యల వెనుక ప్రమేయముందంటూ ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్త ఇంద్రేష్‌కుమార్‌పై తప్పుడు కేసులు మోపాయి. ఆరెస్సెస్ మద్దతునిస్తోన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్‌తో కలిసి నేను పని చేశాను. హిందూ-ముస్లిం సామరస్యానికి ఇంద్రేష్ చేస్తోన్న ఆ ఉదాత్త కృషిని ఆరెస్సెస్ విభాగాలన్నీ ఆదర్శంగా తీసుకొని ఎందుకు అనుసరించవని నేను తరచు ఆశ్చర్య పడుతుంటాను. ఇంద్రేష్ నిజాయితీ, అమాయక త్వం గురించి చెప్పడం నా నైతిక కర్తవ్యం. కాంగ్రెస్ నాయకులు ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా నిరంతరం చేస్తోన్న దుష్ప్రచారాన్ని నిలిపివేయాలి. అదే సమయంలో హిందూయేతరులేకాక చాలామంది హిం దువులు తన దార్శనికతను ఎందుకు సంశయిస్తున్నారన్న విషయ మై ఆరెస్సెస్ ఆత్మశోధన చేసుకోవాలి.

ఉదాహరణకు ఆరెస్సెస్‌కు సన్నిహితుడైన డాక్టర్ సుబ్రమణియం స్వామి ఇటీవల చేసిన ఒక వాదన చూడండి. తమ పూర్వీకులు హిందువులేనన్న విషయాన్ని అంగీకరించని హిందూయేతరుల ఓటుహక్కును రద్దుచేయాలని డా క్టర్ స్వామి డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్. సమర్థించరానిది. ఆరెస్సెస్, బిజెపి నాయకులు ఈ డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా ఖండించాలి. జాతీయ సమైక్యతను సాధించేందుకు భారతదేశం అనుసరిస్తోన్న మార్గం సహనం, పరస్పర గౌరవం, అహింస, ఇతర సార్వత్రిక మానవ విలువలను పాటించడమేనన్న సత్యాన్ని ఆరెస్సెస్ ధ్రువీకరించాల్సిన సమయ మాసన్నమయింది.
- సుధీంద్ర కులకర్ణి

No comments:

Post a Comment