Monday, September 26, 2011








ఉద్రిక్త ఉద్యమం
అట్టుడికిన హైదరాబాద్
రోజంతా దండయాత్రలు
9 నుంచి మళ్లీ రైల్‌రోకో

భౌతిక దాడులు.. రవాణా అదనపు కమిషనర్‌ను కొట్టిన టీఆర్ఎస్‌వీ నేత, ఇతరులు
పిల్ వేసిన న్యాయవాదిపై హైకోర్టులో దాడి.. ఎమ్మార్ కార్యాలయంలో విధ్వంసం
కరెంటు కోతకు నిరసనగా విద్యుత్ సౌధ ముందు నడిరోడ్డుపై నేతల ధర్నా
సచివాలయంలో సీఎం బ్లాక్ ముందు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల బైఠాయింపు

అధికారులపై ఒత్తిళ్లను సహించం
బలవంతపు 'ఆదేశాలు' చెల్లవు
దాడి చేసిన వారిపై కేసులు.. సీఎం ఆదేశం
రక్షణ కల్పించాలని ఏపీఎన్జీవో వినతి
సర్కారుపై సొంత పార్టీ నేతలు గరంగరం
ధర్నాల్లో మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
ముఖ్యమంత్రి లక్ష్యంగా మాటల తూటాలు
ఆయనకు అంత అహంకారమా: కోమటిరెడ్డి
ఉద్యోగులపై చెయ్యేస్తే సీటు గల్లంతే: యాష్కీ
సానుకూలత రాకుంటే వేరుకుంపటి: దామోదర్
ఆజాద్‌కు సీఎం ఫోన్.. పరిష్కారానికి వినతి
అంతా మేడమ్ చేతిలోనే అన్న ఇన్‌చార్జి
నేడు తెలంగాణ ఆలయాల్లో ఆర్జిత సేవలు బంద్
కాంగ్రెసోళ్లను బతకనీయొద్దు అధికారులపై కాదు.. సిగ్గూ శరం లేని నాయకులపై దాడి చేయండి: కేసీఆర్
మరింత ఉధృతం
సెప్టెంబర్ 27: తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు.
సెప్టెంబర్ 28: హైదరాబాద్‌లో వందకుపైగా కేంద్రాల్లో రాస్తారోకోలు.
సెప్టెంబర్ 29: విద్యుత్ కోతలపై ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి.
సెప్టెంబర్ 30: హైదరాబాద్ బంద్.
అక్టోబర్ 1: కాగడాల ప్రదర్శన.
అక్టోబర్ 2: టోల్ గేట్ల వద్ద ఫీజు చెల్లించకుండా ప్రయాణం.
అక్టోబర్ 3: చెరువుల వద్ద తెలంగాణ నినాదాలతో బతుకమ్మ పండుగ. అక్టోబర్ 6: 'దశకంఠ కాంగ్రెస్' దిష్టిబొమ్మల దహనాలు.


ఉద్యమం ఉద్వేగంగా సాగుతోంది. మెల్లమెల్లగా ఉద్రిక్తంగానూ మారుతోంది. ఒకే రోజు ఐదు సంఘటనలు రాజధాని నగరాన్ని 'గరంగరం'గా మార్చాయి. మరోవైపు రాజకీయమూ వేడెక్కింది. తెలంగాణ ఉద్యమకారులకు ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి టార్గెట్‌గా మారారు. సకల సమ్మె త్వరలో సడలిపోయే అవకాశం ఉందని అధిష్ఠానానికి నివేదించిన కిరణ్‌పై సొంత పార్టీ నేతలే విమర్శల బాణాలు గుప్పిస్తున్నారు. దీంతో తాను ఏ నివేదికా పంపలేదని వివరణ ఇచ్చుకున్న కిరణ్.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌తో ఫోన్‌లో మాట్లాడి తెలంగాణ సమస్యను సత్వరం పరిష్కరించాలని విన్నవించుకున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 26 : పదమూడు రోజులుగా ఉధృతంగా, ఉద్వేగంగా సాగిన సమ్మె... సోమవారం తొలిసారిగా 'ఉద్రిక్తం'గానూ జరిగింది. రవాణా శాఖలో అదనపు కమిషనర్ శ్రీనివాస్‌పై నేతల సమక్షంలోనే ఉద్యమకారులు చేయి చేసుకున్నారు. సకల సమ్మెపై వ్యాజ్యం వేసిన న్యాయవాది క్రిష్ణయ్యపై హైకోర్టు ఆవరణలో తెలంగాణ లాయర్లు దాడి చేశారు. ఎమ్మార్ కార్యాలయంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. తెలంగాణలో విద్యుత్ కోతలపై విద్యుత్ సౌధ ముందు నడి రోడ్డుపై నేతలు ధర్నా చేశారు.

సచివాలయంలోనూ సీఎం కార్యాలయం ముందు బైఠాయించారు. ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఈ ఘటనలతో నగరం దద్దరిల్లింది. మరోవైపు... సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ ఉద్యోగులపై సర్కారు తీసుకుంటున్న చర్యలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. నోటీసులు జారీ చేసిన ఉన్నతాధికారులకు సోమవారం ఉద్యమ సెగ తగిలింది. అటు రవాణా శాఖలో, ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని కాంట్రాక్ట్ సిబ్బందికి జారీ చేసిన నోటీసులను నేతలు దగ్గరుండి ఉపసంహరింపజేశారు.

ఎమ్మార్, హైకోర్టుల్లో మినహా... విద్యుత్ సౌధ, రవాణా శాఖ కార్యాలయం, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసు, సచివాలయంలో బైఠాయింపు ఘటనల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కేటీఆర్ తదితరులతోపాటు... అధికార పక్షానికి చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా పాల్గొన్నారు. అధికారపక్ష నేతలు సీఎంని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు ప్రయోగించారు.

"ఒక మంత్రిగా సచివాలయంలోని సీఎం బ్లాక్ ముందు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరించడం తగదు. ఆయనకు అంత అహంకారం పనికిరాదు'' అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు ఏం జరిగినా సీఎం ఒక్క క్షణం కూడా సీటులో కూర్చోలేరని మధు యాష్కీ హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఏ ఒక్క ఉద్యోగిపై వేటు పడినా సర్కారును నడవనివ్వబోమని ఎంపీ రాజయ్య అన్నా రు. సమ్మె సడలుతోందంటూ తాను ఎలాంటి నివేదికనూ పంపలేదని సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. 'కళ్లముందు సమ్మె ప్రభావం కనిపిస్తుండగా లేదని ఎలా చెబుతాను?' అని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు ఫోన్ చేసి సకల జనుల సమ్మె పరిస్థితి గురించి వివరించారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మరోవైపు... తెలంగాణ నేతలు బృందాల వారీగా ఢిల్లీకి వెళ్తున్నారు. సీనియర్ నేతలు కేకే, మంత్రి జానారెడ్డి సోమవారం ఆజాద్‌తో చర్చించారు. మంగళవారం 22 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. మహిళా మంత్రులు బుధవారం వెళ్తున్నారు. కేంద్రం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోకుంటే కొత్త పార్టీ పెట్టుకుంటామని మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి హెచ్చరించారు.

ఉద్యమ కార్యాచరణ...
తెలంగాణ జేఏసీ మంగళవారం నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. 9, 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు రైల్‌రోకో జరుపుతామని తెలిపింది. అవసరమైతే నిరవధిక రైల్ రోకో నిర్వహిస్తామని టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రకటించారు. "దాడులు చేయాల్సింది ఉద్యోగులపైకాదు. సిగ్గూ శరం, చీమూ నెత్తురు లేని తెలంగాణ రాజకీయ నాయకత్వం మీద దాడి చేయాలి. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను బతకనీయొద్దు. వారిని ఎక్కడా తిరగనివ్వొద్దు'' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఉద్యమంలో భాగస్వాములైన తెలంగాణ అర్చకులు మంగళవారం యాదగిరి గుట్ట, భద్రాచలం, వేములవాడ తదితర దేవస్థానాల్లో ఆర్జిత సేవలను నిలిపివేయనున్నారు. టికెట్లు, గదుల జారీ నిలిపివేస్తామని... భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తామని ఆలయ ఉద్యోగులు ప్రకటించారు. ఇక... తెలంగాణ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లకు భద్రత కల్పించలేమని 'లొకేషన్' మార్చుకోవాలని నిర్మాతలకు పోలీసులు సూచిస్తున్నారు.

ఇక... సకల జనుల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘంతో, సీనియర్ అధికారులతో సీఎం సమీక్షించారు. అధికారులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని ఆదేశించారు. అధికారులను భయపెట్టి జారీ చేయించే ఉత్తర్వులు చెల్లబోవని స్పష్టం చేశారు. ఇక... సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత కల్పించాలంటూ ఏపీఎన్జీవో నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని కలిసి కోరారు.






సమ్మె సాగించుడే
ఉద్యమం.. మరింత ఉధృతం
భవిష్యత్తు కార్యాచరణ వెల్లడించిన జేఏసీ
30న హైదరాబాద్ నగర బంద్

అక్టోబర్ 9,10,11 తేదీల్లో రైల్‌రోకో
సీమాంధ్ర బస్సుల్లో ఎవరైనా వెళ్తే పరిణామాలకు
బాధ్యత మాది కాదు: కోదండరాం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 : సకల జనుల సమ్మెను కొనసాగించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం కోసం 14 రోజులుగా సకలజనులు సమ్మె చేస్తున్నా.. కేంద్రం నుంచి కనీస స్పందన రాకపోవటంతో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించింది. భవిష్యత్తు కార్యాచరణను జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్‌లో తెలంగాణ జేఏసీ ముఖ్యుల సమావేశం జరిగింది.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో మరో 15-20 రోజుల ఉద్యమ కార్యాచరణను ఖరారుచేశారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం వైఖరి 'నవ్విపోదురు గాక నాకేంటి..' అన్నట్లుగా ఉందని కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను కించపర్చేలా నడుపుతున్న సీమాంధ్ర బస్సులను వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ బస్సులను ఎక్కడికక్కడే ఆపుతామని.. ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పారు.

తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా సీమాంధ్ర బస్సులను నడిపినా.. వాటిలో ఎవరైనా ప్రయాణించినా జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమ్మెపై ఘాటుగా చేసిన విమర్శలపై కోదండరాం సూటిగా స్పందించకుండా.. "హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు. వారి యాత్ర సుగమంగా సాగాలి. వారికి మేం కూడా వీడ్కోలు పలుకుతాం. హజ్‌కి వెళ్లాక వారు తెలంగాణ కోసం మొక్కాలి'' అన్నారు. సమ్మెకు ప్రజలు సహకరించాలని, తెలంగాణకు పండుగలు కూడా లేకుండా చేస్తున్న కాంగ్రెస్‌ను గమనించాలని కోరారు.

బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను తెలంగాణకు అంకితం చేయాలని ప్రజలను కోరారు. కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో భాగస్వామ్య పార్టీల నేతలు కె.చంద్రశేఖర్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి (టీఆర్ఎస్), సీహెచ్ విద్యాసాగర్‌రావు, టి.రాజేశ్వర్‌రావు (బీజేపీ), పోటు సూర్యం, కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ), జేఏసీ కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కో-కన్వీనర్ రసమయి బాలకిషన్, సమన్వయకర్త పిట్టల రవీందర్, ఉద్యోగ, ఆర్టీసీ, ఉపాధ్యాయ, విద్యుత్, న్యాయవాదులు, వైద్యుల జేఏసీల నేతలు కె.స్వామిగౌడ్, డి.ఆనందం, పి.రవీందర్, రఘు, రాజేందర్‌రెడ్డి, డాక్టర్ నర్సయ్య, ఇతర ఉద్యోగ-ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

కార్యాచరణ ఇదీ..
27.09.2011: ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు. జేఏసీ భాగస్వామ్య పక్షాలన్నీ ఈ ర్యాలీలో పాల్గొంటాయి
28.09.2011: హైదరాబాద్‌లో 100కుపైగా కేంద్రాల్లో పెద్దఎత్తున రాస్తారోకోలు
29.09.2011: విద్యుత్ కోతలకు నిరసనగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
30.09.2011: హైదరాబాద్ నగరం బంద్
(తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రానికి విధించిన డెడ్‌లైన్ ముగిస్తున్న సందర్భంగా)
01.10.2011: కాగడాల ప్రదర్శన
02.10.2011: టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు చెల్లించకపోవడం
03.10.2011: బతుకమ్మ పండుగ రోజు చెరువుకాడ జై తెలంగాణ
06.10.2011: జమ్మిచెట్టు కాడ జై తెలంగాణ, రావణాసురుడి బదులు దశకంఠ కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనాలు
అక్టోబర్ 9, 10, 11: రైల్ రోకో

No comments:

Post a Comment