Sunday, September 18, 2011


నైపుణ్య ఆధార విద్య రావాలి

  • మాష్టారి కాలమ్‌
విద్యా సంబంధ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కనీసం అర్హత మార్కులను కూడా తెచ్చుకోలేకపోతున్నారు. అందుకే ఈ తరహా పోటీ పరీక్షలకు వెళ్ళాలంటే ప్రత్యేక తర్ఫీదు తప్పక ఉండాలని భావిస్తున్నారు. అందుకే కోచింగ్‌ సెంటర్ల అవసరం ఏర్పడింది. అంటే మన స్కూల్‌ విద్యా విధానం పటిష్టంగా వుంటే మన విద్యార్థులు ఐఐటి వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సునాయాసంగా సీట్లు సాధించగలరు. గౌరవనీయ ముఖ్యమంత్రిగారు దీనిపై దృష్టి నిలిపితే బాగుంటుంది.
ఉదయాన్నే వాకింగ్‌కి వెళితే అది ఊపిరితిత్తులకు ఎంతటి శక్తినిస్తుందో అదే విధంగా నాలోని మెదడుకు కూడా ఎంతో మేతనిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆలోచ నలు కూడా అంతగా పురికొల్పు తుంటాయి. వాకింగ్‌ సమయంలో నా దగ్గర పాఠాలు చదువుకున్న విద్యార్థులో, నాతోటి ఉపాధ్యాయులో, నాలాంటి ప్రయత్నంలో ఉన్న సహచరులో తారస పడుతుంటారు. వారిని కలవడం, వారితో సంభాషించడం ప్రతిరోజూ నాకు కొత్త పాఠాలే. అయితే ఆ రోజు పదేళ్ళ కిందట నాదగ్గర చదువుకొని ముంబాయిలో స్థిరపడ్డ నా స్టూడెంట్‌ కన్పించాడు. అంతకు ముందురోజే ఉపాధ్యాయ దినోత్సవం జరగడం, దినపత్రికల్లో వాటి వివరాలు రావడంతో నా స్టూడెంట్‌ వాటిని చూసినట్టున్నాడు. ''సార్‌! మేము మీ దగ్గర చదువుకున్నాం. మీ సాహచర్యంలో ఉన్నాం. అలాంటి మిమ్మల్ని విమర్శించడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం'' అన్నారు. అప్పుడే అంతకుముందు రోజు ఉపాధ్యాయ దినోత్సవం నాడు జరిగిన సంఘటన నాకు గుర్తుకు వచ్చింది. టీచర్స్‌డే వేడుక సందర్భంగా జరిగిన అవార్డుల ప్రదానం నాడు ముఖ్య మంత్రి మాట్లాడు తూ, ఐ.ఐ.టి. కోచింగ్‌ కోసం రామయ్యగారి ఇనిస్టి ట్యూట్‌లో టెన్త్‌ తర్వాత విద్యార్థులను తీసుకుం టారు. బాగానే వుంది. కానీ, రామయ్య ఎంట్రన్స్‌ కోసం ఐఐటి ఫౌండేషన్‌ పేరిట సిక్స్త్‌ నుంచే పిల్లల్ని తెల్లవారుఝామున 4 గంటలకే వారిని లేపి పంపుతూ, హింసిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.'' అని వ్యాఖ్యానించారు. దీనిపై నేను వెంటనే స్పందించలేదేమని నా స్టూడెంట్‌ అడుగుతున్నారు. అయితే సద్విమర్శలు, వ్యాఖ్యానాలను స్వీకరించడం ఉపాధ్యాయ వృత్తిలో నాకు అలవాటేనని చెప్పాను.
ఒక విద్యార్థి రకరకాల భావోద్వేగాల మధ్య క్లాస్‌కు వస్తాడు. ఇంటిదగ్గర వాతావరణం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, సహచరుల ప్రభావం, బాహ్య వాతావరణం అతడి భావోద్వేగాలపై పనిచేస్తుంటాయి. ఆ నేపధ్యంలో విద్యార్థి పాఠం చెబుతున్న టీచర్లైన మమ్మల్ని ఏదైనా అనవచ్చు. మాపై విమర్శలు చేయవచ్చును. అయితే నేను అలాంటి వాటికి వెంటనే ప్రతిస్పందించను. వాటిని దిగమింగుకోవడం మాకు అలవాటే. అలాగే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నాను. కానీ మౌనంగా ఉన్నాను. అయితే దీనికి అసలు కారణం అన్వేషించడంలోకి నా ఆలోచనలు వెళ్ళాయి. ఇంటి దగ్గర టీచర్‌ కూడా భావోద్వేగాలకు లోనైతే ఆ ప్రభావం తరగతి గదిపై పడుతుంది. పిల్లలపై ప్రభావం చూపుతుంది. అలాగే నిత్యం పాలనా రంగంలో వుండే ముఖ్యమంత్రి ఆయన పడుతున్న సంఘర్షణ, ఆయన కోపతాపాలు కూడా ఒక్కొక్కసారి ఏదో ఒక రూపంలో బయటకు రావచ్చు. ఆయన అన్న మాటల్ని ఆ కోణంలోనే అర్థం చేసుకోవాలి.
తరగతి గది చదువు జీవిత చదువుకు ఉపయోగపడాలి. క్లాసు రూం టీచింగ్‌ ఇంకా బాగా పెంచితే తెల్లవారు జామున పిల్లలు లేచి పరిగెత్తవలసిన అవసరం వుండదు. విషయానికి సంబంధించిన విశ్లేషణలు తరగతి గదిలో ఎక్కువగా జరగడం లేదు. ఒక సమస్యను ఇచ్చి అందుకు సంబంధించిన రీజనింగ్‌ చేయమని విద్యార్థికి చెప్పాలి. నేడు విద్యార్థి లోపం ఉద్యోగాల కోసం పడుతున్న పోటీలో ఎనాలసిస్‌, రీజనింగ్‌ గురించి అడుగుతున్నారు. అందువల్ల ఎనాలసిస్‌, రీజనింగ్‌ కెపాసిటీ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. తరగతి గదిని అందుకోసం సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలి. క్లాస్‌ రూమ్‌ టీచింగ్‌కు కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు మధ్య ఎంతో అగాధం పెరుగుతోంది. పోటీ పరీక్షల్లో రీజనింగు గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఈ కోణం నుంచి ముఖ్యమంత్రి ఆలోచించి ఆ సంఘర్షణలోంచి ఆయన మాట్లాడి వుండవచ్చును.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటిల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ ఎంట్రన్‌ టెస్టుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది విద్యార్థులు పోటీపడతారు. వీరి నుంచి ఐఐటి సీట్లకు తగిన ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఎంట్రన్స్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అత్యంత ప్రతిభావంతుల ఎంపిక కోసం కొన్ని నైపుణ్యాలపై ఆధారపడి ప్రశ్నాపత్రం రూపొందిస్తారు. ప్రశ్నాపత్ర స్వరూపం కూడా తరచూ మారుతూ వుంటుంది. అయితే మరో పక్క మన విద్యా పరీక్షలు (అకడమిక్‌ ఎగ్జామ్స్‌) వేరు. మన అకడమిక్‌ కోర్సులు అంటే స్కూల్‌ తరగతుల్లో మన విద్యార్థులకు చెప్పే చదువులు వట్టి సమాచారాన్ని ఇస్తున్నాయే తప్ప ఏవిధమైన నైపుణ్యాలను ఇవ్వలేకపోతున్నాయి. అందుకే విద్యా సంబంధ పరీక్షల్లో అత్యధిక మార్పులు సాధించిన వారు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కనీసం అర్హత మార్కులను కూడా తెచ్చుకోలేకపోతున్నారు. అందుకే ఈ తరహా పోటీ పరీక్షలకు వెళ్ళాలంటే తప్పక ప్రత్యేక తర్ఫీదు ఉండాలని భావిస్తున్నారు. అందుకే కోచింగ్‌ సెంటర్ల అవసరం ఏర్పడింది. అంటే మన స్కూల్‌ విద్యా విధానం పటిష్టంగా వుంటే మన విద్యార్థులు ఐఐటి వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సునాయాసంగా సీట్లు సాధించగలరు. గౌరవనీయ ముఖ్యమంత్రిగారు దీనిపై దృష్టి నిలిపితే బాగుంటుంది. మన పాఠశాల విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసి, కేవలం మార్కుల వేటగా మారిన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను, నైపుణ్యాల సాధన మార్గంగా మార్చగలిగితే రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రికి రుణపడి వుంటారు. వ్యవస్థలోని లోపాన్ని గుర్తించి తగిన చికిత్స చేస్తే అంతకు మించి కావలసిందేముంటుంది.
(రచయిత ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు)
-చుక్కా రామయ్య
  

No comments:

Post a Comment