Tuesday, September 20, 2011


త్రిపురలో మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వం యుక్తితో, సామాజిక స్పూర్తితో చేపట్టిన అనేక చర్యలు రాష్ట్రంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. గిరిజన ప్రజల్లో సానుకూల థృక్పథం ఏర్పడటానికి అవి ఉపయోగపడ్డాయి. తమకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో భద్రతా దళాలు సఫలమయ్యాయి. వారు ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరించడంతో భద్రతా దళాలకు సహకరిం చేందుకు ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు పెద్దఎత్తున ముందుకు వచ్చారు.
ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు ఉగ్రవాదంతో అట్టుడుకుతుంటే త్రిపుర రాష్ట్రం ఆ సమస్యను పరిష్కరించు కోగలిగింది. ఆ రాష్ట్రంలో నేడు సంపూర్ణ ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? మిగిలిన రాష్ట్రాల మాదిరిగా త్రిపురలో వేర్వేరు సమయాల్లో ఉగ్రవాదం రాష్ట్రాన్ని తీవ్రంగా బాధించింది. 1950ల్లో నాగాలాండ్‌ రాష్ట్రం నుండి త్రిపురకు ఉగ్రవాదం దిగుమతి అయింది. సామాజిక, ఆర్థిక అసమానతలు, పనిచేయని ప్రభుత్వం, అట్టడుగు స్థాయి వరకు వ్యాపించిన అవినీతి, జనాభాలో చోటుచేసుకున్న మార్పులు, గిరిజన ప్రాంతం విసిరివేసినట్లు విడిగా ఉండటం తీవ్రవాదం ప్రారంభం కావడానికి దోహదం చేశాయి. వాస్తవానికి 1971లో త్రిపుర జుబా జమితి (టియుజెఎస్‌) ఆవిర్భావంతో రాష్ట్రంలో తీవ్రవాదానికి అంకురార్పణ జరిగింది. 1981లో త్రిపుర నేషనల్‌ వలంటీర్స్‌ (టిఎన్‌వి) ఏర్పాటు దానిని పెంచి పోషించింది. 1989 మార్చి 2న నేషనల్‌ లిబరేషన్‌ ప్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఎన్‌ఎల్‌ఎఫ్‌టి) ఏర్పాటైంది. దాని సాయుధ దళమైన నేషనల్‌ హోలీ ఆర్మీ అండ్‌ ఆల్‌ త్రిపుర టైగర్‌ ఫోర్స్‌ (ఎటిటిఎఫ్‌)ను 1990 జులైలో ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థలు వేర్పాటువాద అజెండాతో బరిలోకి దిగాయి. త్రిపురను భారత్‌ యూనియన్‌లో చేర్చడాన్ని అవి ప్రశ్నించాయి. త్రిపురకు సార్వభౌమత్వం కల్పించాలని, రాష్ట్రంలో అక్రమంగా ప్రవేశించిన వారిని రాష్ట్రం నుండి బయటకు పంపించివేయాలని డిమాండ్‌ చేశాయి. త్రిపుర విలీన ఒప్పందాన్ని అమలు చేయాలని, 1960 త్రిపుర భూ సంస్కరణల చట్టానికి అనుగుణంగా గిరిజన ప్రజల భూములను పునరుద్ధరించాలని అవి డిమాండ్‌ చేశాయి.
1990 నుండి 1995 వరకు రాష్ట్రంలో ఉగ్రవాదం తక్కువ స్థాయిలో ఉంది. 1996-2004 మధ్య అది కొత్త ప్రాంతాలకు విస్తరించి ఉధృతమైంది. ఆ తరువాత తీవ్రవాదం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌ అధికార యంత్రాంగం నుండి మద్దతు, అక్కడ తీవ్రవాదులకు స్వేచ్ఛాయుత వాతావరణం, విదేశీ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీలు, బలమైన తీవ్రవాద నెట్‌వర్క్‌ సంస్థలు అందించే సహకారం కారణంగా త్రిపురలో ఉగ్రవాదం పేట్రేగిపోయింది. తీవ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను పెద్ద మొత్తంలో సేకరించుకోవడం, వైర్‌లెస్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థను సమకూర్చుకోవడం, హైవోల్టేజ్‌ ఉగ్రవాదం, హింసాకాండ పౌర జీవనాన్ని, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను విచ్చిన్నం చేశాయి. ఫలితంగా విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలన్నీ మూతపడ్డాయి. కుశాగ్రబుద్ధి, సూక్ష్మగ్రాహి, దార్శనిక భావాలుగల ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలో తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. పటిష్టమైన, బహుముఖ వ్యూహాన్ని రూపొందించింది. అదే సమయంలో విశ్వాస పునరుద్ధరణ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను భారీ స్థాయిలో ప్రారంభించింది. తీవ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యంగా, విస్తృత అర్థంలో నిర్మాణాత్మక కార్యకలాపాలు చేపట్టింది. తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో మిగిలిన ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా సైన్యానికి పాత్ర కల్పించకపోవడం ముఖ్య విశేషం. కేంద్ర పారామిలిటరీ దళాలు, రాష్ట్ర పోలీసు దళాలను ఏర్పాటుచేసి వారిని రంగంలోకి దించారు. ప్రత్యేక పోలీసు అధికారులను నియమించి వారిని ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో నియమించారు. అందులో గిరిజనులకు కూడా స్థానం కల్పించారు. కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు సమన్వయంతో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారి వ్యవహారశైలిని అత్యున్నత స్థాయిలో (గవర్నర్‌, ముఖ్యమంత్రి స్థాయిలో) పర్యవేక్షించారు. అధికారులు తమ విధులను దుర్వినియోగం చేయకుండా, అణచివేత చర్యలకు పాల్పడకుండా, మానవ హక్కులను ఉల్లంఘించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వారిపై నిరంతర నిఘా ఏర్పాటుచేశారు. కొన్ని సందర్భాల్లో తీవ్రవాద వ్యతిరేక పోరాటం ఆశించిన ఫలితాలను ఇవ్వని సందర్భాల్లో విశ్వాస పునరుద్ధరణ చర్యలు, మానసికంగా తీవ్రవాదుల్లో పరివర్తన తీసుకువచ్చే ప్రచారాలు చేపట్టారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాట చర్యలతోపాటు అవసరమైన చర్యలను చేపట్టారు. ప్రభుత్వ ఉద్దేశాలపై వారిలో విశ్వాసం కల్పించడానికి ప్రాధాన్యత కల్పించారు. తీవ్రవాదంవైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విసృత పథకాలు చేపట్టి, వాటిని గురించి ప్రజల్లో ప్రచారం చేసింది. మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని నిర్వహించింది. హింసను విడనాడి, ప్రజా జీవనస్రవంతిలో చేరగోరేవారికి ఆచరణ సాధ్యమైన, చిత్తశుద్ధితో కూడిన పునరావాస చర్యలను చేపట్టింది. గిరిజనులకు, తీవ్రవాద బాధిత కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రాధాన్యతనిచ్చింది. ఆకర్షణీయమైన పునరావాస, నగదు ప్రోత్సాహక చర్యలను చేపట్టింది. రాష్ట్ర, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ కార్యక్రమాలకు, పథకాలకు ప్రజల నుండి మంచి ప్రతిస్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. తీవ్రవాదుల్లో కూడా మానసిక పరివర్తన చోటుచేసుకుంది. వారు కూడా భారీ ఎత్తున ఆయుధాలను విసర్జించి గవర్నర్‌, ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం యుక్తితో, సామాజిక స్పూర్తితో చేపట్టిన అనేక చర్యలు రాష్ట్రంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. గిరిజన ప్రజల్లో సానుకూల థృక్పథం ఏర్పడటానికి అవి ఉపయోగపడ్డాయి. తమకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో భద్రతా దళాలు సఫలమయ్యాయి. వారు ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరించడంతో భద్రతా దళాలకు సహకరిం చేందుకు ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. గిరిజన ప్రజలతో ప్రభుత్వం సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. సదా వారికి అందుబాటులో నిలిచింది. ఆరోగ్య సంరక్షణ, విద్యాసదుపాయాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చేసిన కృషి కూడా సత్ఫలితాల నిచ్చింది. ఉపాధి కల్పన, మౌలిక వనరుల ఏర్పాటు ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకం పెంచుకున్నారు. భద్రతా దళాలను తీవ్రవాద బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పాఠశాల భవనాల ఏర్పాటు, కమ్యూనిటీ కేంద్రాలను నెలకొల్పడం, కంప్యూలర్‌లో శిక్షణ, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీలో శిక్షణ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. భద్రతా దళాలు ప్రజానుకూల విధానాలతో వారి హృదయాలను చూరగొన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వ వ్యవహారశైలిపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగాయి. దాంతో వారంతా ప్రభుత్వానికి, భద్రతాదళాలకు పూర్తిగా సహకరించారు.
ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ప్రారంభించిన రాజకీయ ప్రక్రియ తీవ్రవాదాన్ని రూపుమాపడంలో ఎంతగానో దోహదం చేసింది. తీవ్రవాదం ఎక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం శాంతి ప్రదర్శనలు నిర్వహించింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపట్ల తన మొక్కవోని దీక్షను చాటుకుంది. స్వతంత్ర ప్రతిపత్తిగల స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పంచాయతీలు, విలేజ్‌ కౌన్సిల్స్‌ అత్యంత చురుకుగా వ్యవహరించాయి. తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు బహు ముఖ వ్యూహం, సానుకూల మైండ్‌సెట్‌, చిత్తశుద్ధి, స్థిర సంకల్పం, సృజనాత్మక ప్రతిస్పందన, ఖచ్చితమైన పథ నిర్దేశం, సామాజిక- ఆర్థిక దృక్పథంతో కూడిన వ్యూహాలను రూపొందించడం అవసరం. ఈ విషయంలో మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలోని త్రిపుర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది.
(డిఎన్‌ సహాయ 2003 జూన్‌ నుండి 2009 అక్టోబర్‌ వరకు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆ తరువాత చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా వెళ్లారు).

No comments:

Post a Comment