Tuesday, September 6, 2011


సైనిక వేషంలో సంచరిస్తున్న బీభత్సం - కాశ్మీర్‌లో కల్లోలమే లక్ష్యం




జమ్మూ కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు, ప్రగతికి విఘాతం కలిగించే వారికి కొదువలేదు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, దాని పనుపున భారత్‌లో పనిచేసే లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ సృష్టించిన ఇతర టెర్రరిస్టు ముఠాలు, విచ్ఛిన్న వాదులు, వారికి విధేయులైన వారు దివారాత్రాలు ఆ పనిలోనే ఉన్నారు. కాశ్మీర్‌లో విఛ్ఛిన్న వాద నాయకుల హత్యలకు భారత భద్రతా దళాల కన్నా మిలిటెంట్లనే ఎక్కువగా నిందించాలని హురియత్ నాయకుడు అబ్దుల్ ఘనీ భట్ అంగీకరించిన తరువాత ఈ ఏడాది మొదటి నుంచి విచ్ఛిన్న వాదులు కొంచెం నెమ్మదిగా ఉంటున్నారు. భట్ వ్యాఖ్యలు జమ్మూ-కాశ్మీర్ పోలీసుల వాదనకు బలం చేకూర్చాయి. ‘మేము చాలారోజులుగా చెప్తున్న విషయానే్న భట్ ఇప్పుడు వెల్లడించాడు’ అని జమ్మూ-కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ కుల్దీప్ ఖోడే అన్నారు. 2002లో తన తండ్రి అబ్దుల్ ఘనీ లోనే హత్యకు ఐఎస్‌ఐ, కరడుగట్టిన విచ్ఛిన్నవాదులే కారణమని పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ లోనే గతంలోనే నిందించారు. నిజానిజాలు బయటికి రావాలని తాను గతంలోనే అనుకున్నానని, కానీ కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నం మానుకున్నానని లోనే అన్నారు. ఈ ఏడాది వేసవి కాశ్మీర్‌లో బాగా గడిచింది. చాలా మంది యాత్రికులు కాశ్మీర్ సందర్శించారు. అమర్‌నాథ్ యాత్ర సజావుగా సాగడంతో వేర్పాటువాదులు అగ్గి రాజేయడానికి అదనుకోసం చూస్తున్నారు. రెండు అవకాశాలు ఒకేసారి వచ్చాయి.
మొదటిది , తనపై ఇద్దరు సైనికులు అత్యాచారం జరిపారని దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఓ యువతి ఆరోపించింది. బేక్ చిరాన్‌బల్ ప్రాంతంలో ఉన్న తన గుడిసె బయటికి రాగా తనను ఎత్తుకెళ్ళి అత్యాచారం జరిపారని ఆమె ఆరోపించింది. రెండవది గులాం నబీ ఫాయ్ అనే అరవై రెండేళ్ళ అమెరికా పౌరుణ్ణి కాశ్మీర్ సమస్యను గురించి అమెరికా రాజకీయవర్గాలలో లాబీయింగ్ జరపడానికి వీలుగా లక్షలాది డాలర్ల నిధులు చేరవేస్తున్నాడనే అభియోగంపై అరెస్టు చేశారు. రెండు ఘటనలు జూలై 19వ తేదీన జరిగాయి. కాశ్మీరీ యువతిపై విచ్ఛిన్న వాదులు పాకిస్తాన్ టెర్రరిస్టులు అత్యాచారం జరిపే అవకాశాన్ని తోసిపుచ్చలేం. అదే విధంగా ఫాయ్ అరెస్టు అమెరికాలో జరిగింది. ఎఫ్‌బిఐ వారు అరెస్టు చేశారు. ఈ రెండు ఘటనల దరిమిలా ఆ ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు కేసు నమోదు చేయడమే కాక పోలీసులతో దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
ఈ విషయం తమ దృష్టికి రాగానే సైనికాధికారులు కూడా తక్షణ దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో స్థానిక పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ యువతిపై మానభంగం జరిపిన వారు సైనిక జవాన్లయినా, టెర్రరిస్టులైనా అయి ఉండవచ్చని, దేన్నీ తోసిపుచ్చలేమని వారు అభిప్రాయపడ్డారు. అత్యాచారం ఘటనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితులు సైనిక సిబ్బంది అని పేర్కొనలేదని సైన్యం ఉత్తర దళం (నార్త్ కమాండ్) ప్రధాన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆ ఘటనకు సైనిక సిబ్బంది బాధ్యులని వేలెత్తి చూపలేదు. తనపై అత్యాచారం జరిపిన వారు సైనిక దుస్తులు ధరించారని, గడ్డాలు పెంచుకుని ఉన్నారని, గుజ్జారి యాసలో మాట్లాడారని ఆ యువతి తెలిపినట్లు కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఆమె నివసించే ప్రాంతంలో సైనిక బటాలియన్ లేదు. చాలామంది టెర్రరిస్టులు కూడా సైనిక దుస్తుల్లో సంచరిస్తుంటారు. అయితే కీలకమైన అంశం ఏమిటంటే ఆమె కుటుంబ సభ్యుల కథనం ఆమె వెల్లడించిన అభిప్రాయాలకు భిన్నంగా ఉంది. తనను జూలై 19వ తేదీన ఎత్తుకెళ్లి రెండు రోజుల పాటు అత్యాచారం జరిపి జూలై 21వ తేదీన వదిలేశారని ఆమె అభియోగం. అయితే ఆ యువతి మానసిక వ్యాధికి మందులు తింటోందని, ఎత్తుకెళ్ళి సామూహిక మానభంగం జరిపినట్లు చెప్తున్న రోజున ఇంట్లోనే ఉందని, ఆమె అత్త పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది. అయితే తన కోడలు జూలై 19న కాక జూలై 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయిందని అత్త చెప్పింది. రాత్రిపూట ఎక్కడున్నావని అడిగితే ఆమె సమాధానం చెప్పకుండా చాతీపై గుద్దుకోవడం మొదలెట్టిందని, ఆమె బాధపడుతోందని భావించి మంజగామ్ ఆసుపత్రికి తీసుకెళ్లామని, తనపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్‌కు చెప్పిందని అత్త పోలీసులకు చెప్పింది. ఆ యువతి భర్త, అత్త ఇద్దరు కూడా ఆమె ఒక రోజు మాత్రమే కనిపించకుండా పోయిందని దర్యాప్తు బృందానికి తెలిపారు. అయితే తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న మట్టి ఇంటికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినప్పుడు ఎందుకు కేకలు వేయలేదనే దానికి ఆ యువతి సరైన వివరణ ఇవ్వలేక పోయింది. అత్యాచారం జరిగినట్లు చెప్తున్న రోజున ఆ ప్రాంతంలో సైన్యం గాని, పోలీసులు గాని తిరిగారా అని ప్రశ్నించగా, యూనిఫామ్ ధరించిన వారెవరూ ఆ ప్రాంతానికి రాలేదని ఆమె తెలిపింది. ఆ యువతి ఒంటిపైన, మర్మావయాలపైన ఎలాంటి గాయాలు లేవని వైద్య నివేదిక వల్ల తెలిసింది. ఆస్పత్రిలో ఆమె శరీరాన్ని తుడిచిన దూదిని వైద్య రసాయనిక పరీక్షలకు పంపారు. కాగా, ఆమెపై మానభంగం జరిగిందా అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని అత్త తెలిపింది. ‘ఆమె మాత్రమే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలదు’ అని ఆమె అన్నారు.
ఈ ఘటనపై జూలై 22వ తేదీన శ్రీనగర్‌లో పత్రికాగోష్ఠిని నిర్వహించిన చినార్ కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్.ఎ.హస్నేన్ మాట్లాడుతూ ‘‘ఇదో ఆరోపణ. దానిలో నిజానిజాలు ఏమైనా ఉంటే అది నేరపూరిత చర్య. దోషులపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు, ప్రభుత్వానికి పూర్తి సహకారం అందజేస్తున్నాం. మేము సొంతంగా దర్యాప్తుకు ఆదేశించాం. ఈ ఘటనకు సంబంధించి భిన్న కథనాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను గందరగోళపరిచేందుకు దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. సైనికులు ధరించే యూనిఫామ్‌నే టెర్రరిస్టులు కూడా ధరిస్తుంటారు. అదే ప్రాంతంలో మేము పక్షం రోజుల కిందట గస్తీ, దాడులు జరిపాం. టెర్రరిస్టులు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. టెర్రరిస్టులు ఏదో ఒక పన్నాగం పన్నుతారని నేను ఊహించిందే. అనుకోనిదేమీ కాదు. ఇకపోతే ఇద్దరు సైనికులు ఆయుధాలతో రెండు రోజుల పాటు తమ యూనిట్‌కు దూరంగా ఉండటం అసాధ్యం. కాశ్మీర్ అంతటా సైన్యం కదలికలు ఉన్నాయి. అందువల్ల మేము ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాలని అనుకుంటున్నాం. పోలీసులు సమకూర్చిన వీడియోలో బాధితురాలు సాయుధ దళాలకు చెందినవారే తనను ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపారని చెప్పినట్లు లేదు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా సైన్యం ప్రస్తావన లేదు. ఇరవై నాలుగు గంటల్లో ఆ ఘటనకు సంబంధించి రెండు భిన్న కథనాలు వెల్లడయ్యాయి. వచ్చే వారానికి మరో ఐదు కథనాలు బయటికి వస్తాయి’ అని అన్నారు.
కాగా పాకిస్తాన్ ఏజెంట్ అనే అనుమానంపై గులాం నబీ ఫాయ్‌ని అరెస్టు చేయడం ‘దౌత్యాధికారుల కుట్ర’ అని ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్‌కు చెందిన సయ్యద్ అలీ షా జిలానీ విమర్శించారు. ఫాయ్‌ని విడుదల చేయాలనే డిమాండ్‌తో లోయలో పౌరజీవనానికి అంతరాయం పాయ్‌ని అమెరికాలోని ఓ న్యాయాలయం ఆ తరువాత జైలునుండి విడుదల చేసేసింది. వారివల్ల రాష్ట్ర ప్రజల ఆదాయం పడిపోయింది. బడిపిల్లలు చదువులు కోల్పోతున్నారు. ఫాయ్ అరెస్టు గురించి వ్యాఖ్యానిస్తూ ‘అవును. ఫాయ్‌ని చాలా రోజుల కిందటే అరెస్టు చేసిఉండాలి. పాకిస్తాన్ ఏజెన్సీల నుంచి అతనికి డబ్బు అందిందని గట్టి అనుమానాలున్నాయి. ఫాయ్‌తో పాటు జహీర్ అహ్మద్ అనే అరవై మూడేళ్ళ అమెరికా పౌరుని కూడా అమెరికా న్యాయ శాఖ అరెస్టు చేసింది. వారిద్దరూ పాకిస్తాన్ ఏజెంట్లుగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారిపై మోపిన అభియోగాలు రుజువైతే ఐదేళ్లు జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుంది
.

No comments:

Post a Comment