Tuesday, September 27, 2011


పైన పటారం - లోన లొటారం


"మొనగాళ్ళకు మొనగాడిని నేనే, అన్నింట్లో నేనే ఉత్తముడిని" అని ఇంతకాలం ఊదరగొడుతున్న  బ్రిటన్ బండారం బయటపడింది. గత కొన్ని వారాలుగా బ్రిటన్ అల్లర్లతో అట్టుడికింది.  ఉత్తర లండన్ శివారు ప్రాంతం "టోటన్ హాం" లో మొదలైన అల్లర్లు చిలికి చిలికి గాలివానగా మారి బర్మింగ్ హాం, మాన్చేస్టర్ , లివర్పూల్, నటింగ్ హాం, బ్రిస్టల్ వంటి పెద్ద పట్టణాలకు వ్యాపించాయి. మార్క్ గ్గన్ (29) అనే నల్ల జాతీయుడిని పోలీసులు అతి దగ్గర నుండి కాల్చి చంపడం ఈ అల్లర్లకు అసలు కారణం. ఎంతో కాలంగా (మార్గరెట్ థాచర్ కాలం నుండి) అణగద్రోక్కబడి, చిన్న చూపుకు గురైన వర్గాల వారు పై సంఘటనతో రెచ్చిపోయి వీధులకెక్కారు. లండన్ ఎప్పుడూ ఎరుగనంత దారుణంగా దౌర్జన్యాలకు లోనైంది.  భవనాలకు నిప్పు పెట్టడం, షాపుల లూటీలు, దారిన పొయ్యే వారిపై దాడులు జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత స్కాట్లాండ్ పోలీసులు సైతం అదుపు చేయలేనంతటి స్థాయిలో గొడవలు జరిగాయి. ఐదు రోజుల పాటు లండన్లో అరాచకత్వం రాజ్యమేలింది. ఈ మాట మనమనడం లేదు. లండన్లోని బారిస్టర్లే  అంటున్నారు. చివరికి అమెరికా పోలీసు అధికారి ఐన బిల్ బ్రాటన్ సేవలు వినియోగించుకోవాలని బ్రిటన్  ప్రధాని ప్రతిపాదించ వలసి వచ్చింది.  అల్లర్లలో అయిదుగురు మరణించినట్లు, 2,200 మందికి పైగా అరెస్టయినట్లు  వార్త. పోలండు నుంచి వచ్చి లండన్ లో నివాసం ఉంటున్న మోనికా కోన్ జైక్ అనే మహిళ తనను తాను రక్షించుకోవడానికి ఎత్తైన భవనం పై నుండి రోడ్డు మీదికి దూకింది. తరువాత పత్రికల వారితో మాట్లాడుతూ -"లండన్ అంటే ఏమో అనుకున్నాను, అంతా అపోహేనని తేలిపోయింది. ఇక్కడి సమాజం కుళ్ళి పోయింది" అని అన్నది. 

కొసమెరుపు : బ్రిటన్లో సిక్కువారు నిర్వహిస్తున్న టివి చానెల్ 'సంగత్' వారి వీడియోల సహాయంతో పోలీసులు దుండగులను పట్టుకున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సిక్కులను, వారి టీవిని మెచ్చుకున్నారు.  
- ధర్మపాలుడు  






మార్చిన పాపం మారన్‌దే
స్పెక్ట్రమ్ ధరల నిర్ణయమే తమకు ఆధారమన్నారు
అది తమ శాఖలో అంతర్భాగమన్నారు

మంత్రుల సంఘం పరిధి నుంచి తప్పించాలని పట్టుబట్టారు
నష్టం ఉండదనే ఒప్పుకొన్నా.. 2జీపై నోరువిప్పిన ప్రధాని
ప్రత్యేక విమానంలో, సెప్టెంబర్ 27: టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ కోరిక మేరకే స్పెక్ట్రమ్ ధరల నిర్ణయాన్ని మంత్రుల సంఘం పరిధి నుంచి తప్పించినట్లు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ అంగీకరించారు. స్పెక్ట్రమ్ ధరల నిర్ణయాన్ని మంత్రుల సంఘం పరిధిలోకి చేరుస్తూ తొలుత ఒక ముసాయిదాను రూపొందించినమాట వాస్తవమేనని వెల్లడించారు. న్యూయార్క్ నుంచి తిరిగి భారత్‌కు తిరిగి వస్తున్న ఆయన.. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"ఆ ముసాయిదాకు మారన్ అభ్యంతరం తెలిపారు. స్పెక్ట్రమ్ ధరల నిర్ణయమే ఆర్థికంగా తమ శాఖకు ఆధారమని చెప్పారు. తమ శాఖ నిబంధనల్లో అది అంతర్భాగమన్నారు. దానికి సంబంధించిన సాంకేతిక, సంక్లిష్టమైన అంశాలను పెద్దసంఖ్యలో ఉన్న మంత్రులు ఉన్న బృందం ఇక్కడ కూర్చుని సమర్థంగా పరిష్కరించలేదని చెప్పారు'' అని ప్రధాని వివరించారు. స్పెక్ట్రమ్ ధరలకు సంబంధించిన అంశాలను ఆర్థిక, టెలికం శాఖలు చర్చించుకోవాలని 2003లోనే కేబినెట్ తీర్మానం చేసిన విషయాన్ని మారన్ గుర్తు చేశారని తెలిపారు.

ఆయా శాఖలపై ఆధారపడి మారన్ వాదనతో ఏకీభవిస్తే వచ్చే నష్టమేమీ ఉండదని తాను భావించినట్లు చెప్పారు. ఇదంతా 2006లో జరిగిందని, అప్పట్లో అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ కంటే లైసెన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వ దృష్టి అంతా స్పెక్ట్రమ్ నిర్వహణకు రక్షణ శాఖను ఎలా ఒప్పించాలి? పౌర ఆర్థిక వ్యవస్థకు స్పెక్ట్రమ్‌ను ఎలా వినియోగించాలి? అన్నదేనని వివరించారు. అలాగే, ప్రభుత్వాన్ని అస్థిరపరచి, 'బలవంతం'గా ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చేందుకు ప్రతిపక్షం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని మన్మోహన్ ఆరోపించారు.

అయితే, తన ప్రభుత్వం నిలబడుతుందని, ఐదేళ్లూ అధికారంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. తొమ్మిది శాతం జీడీపీ రేటు సాధించేందుకు వీలుగా ముఖ్యమైన ఆర్థిక బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకూ ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత రీటెయిల్ రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తామని చెప్పారు. అధికారం కోసం ప్రతిపక్షం తీవ్ర అసహనంతో ఉందని ఆరోపిస్తూనే.. సహనంతో ఉండాలని హితవు పలికారు. ప్రణబ్ నోట్ విడుదల తర్వాత తన కేబినెట్‌లో ఎటువంటి విభేదాలూ లేవని చెప్పారు.

తన ప్రభుత్వం విషయంలో కొన్ని అపోహలు ఉండి ఉండవచ్చని, వాటిని సరి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని అంగీకరించారు. మన రాజకీయాన్ని అస్థిర పరిచేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. "ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు (2జీ తదితర కుంభకోణాలన్నీ) గత ఎన్నికలకు ముందే వచ్చి ఉండాల్సిందని ప్రతిపక్షం కోరుకుంటోంది. కానీ, అలా జరగలేదు. ఎన్నికల్లో వాళ్లు ఓడిపోయారు. మేం గెలిచాం.

అందుకే, మన దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని నేను అనుమానిస్తున్నాను'' అని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్నే కాకుండా ద్రవ్యోల్బణం వంటి ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగలదని, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఎటువంటి చర్యలు తీసుకోబోమని వివరించారు. "ప్రజలు మాకు ఐదేళ్లకు అధికారం ఇచ్చారు. మీరు ఇంకో రెండున్నరేళ్లు ఆగాల్సిందేనని పార్లమెంటులోనే చెప్పాను. కానీ, మా ప్రభుత్వంలో కొన్ని లొసుగులు వాళ్లకు తెలిశాయి.

వాటితో ముందస్తు ఎన్నికల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇది సరికాదు. మేం ఐదేళ్లూ ఉంటాం. ఆ తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. మీరే ఆశ్చర్యపోతారు'' అని వ్యాఖ్యానించారు. మంత్రుల్లో ఎటువంటి విభేదాలు లేవని పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రభుత్వ డిమాండ్‌పై మన్మోహన్ స్పందిస్తూ.. న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.





నాయకత్వపుస్థాయి వైపే మొగ్గు

ఒకప్పుడు విద్యార్హతలకే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే సంస్థలు ప్రస్తుతం తమ విధానాన్ని మార్చుకుంటున్నాయి. అర్హతలతోపాటు నాయకత్వ లక్షణాలూ ఉండాలని కోరుకుంటున్నాయి. అవి ఉన్నవారికే అవకాశాలు ఇస్తున్నాయి. విద్యార్హతల పరంగా అవకాశాలు కల్పించినా నాయకత్వ స్థాయి ఏర్పడే విధంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్హతలతోపాటు నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న వారికి అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఒక అవకాశాన్ని సొంతం చేసుకోగానే ఇక తమ కర్తవ్యం నెరవేరిందని భావించే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ప్రమోషన్లు కొట్టాలి. విజయవంతమైన నాయకుడిగా ఎదగాలి. ఇవేగాక ఇంకా ఉన్నతమైన లక్ష్యాలవైపు నేటి యువత మొగ్గు చూపుతోంది. నాయకుడంటే వెంటనే తయారైపోతారనుకోవద్దు. ఎంతో అవగాహన, అనుభవం, నైపుణ్యం అవసరం. వాటితోపాటు అందుకు తగిన వాక్చాతుర్యం, నేర్పు, ఓర్పు అన్నీ ఉండాలి. విజయాలకే కాదు. అపజయాలకూ ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం నిండుగా వుండాలి. ప్రస్తుతం పలు సంస్థలు అలాంటి వారికే బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ తీవ్రమైన ఒత్తిడికి గురికాకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలిగే సత్తావుండాలి. సానుకూల దృక్పథంతో ఆలోచించగలగాలి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారే నాయకుడిగా ఎదుగుతారు. సంస్థ పురోభివృద్ధికి తోడ్పడుతారు.
రెండు చేతులూ కలిస్తేగానీ చప్పట్లు రావన్నట్లు సంస్థలో విజయం ఏ ఒక్కరివల్లా సాధ్యం కాదు. సమిష్టి కృషివల్లే అది సాధ్యమవుతుంది. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎంత సామర్థ్యంగల టీమ్‌ లీడరైనా సభ్యులతో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా వ్యవహరించగలగాలి. అంతేకాదు, క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ముఖ్యమైనవి. సమయపాలన లేని వారు విజయాలు సాధించలేరు. నాయకుడు ప్రణాళికను పక్కాగా అనుసరించి పదిమందికి ప్రేరణ కలిగించేవాడై ఉండాలి. వీటిని ప్రదర్శించే సమయంలో సిబ్బందికి ఏ విధమైన ఇబ్బందీ కలిగించనప్పుడే మీరు మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. ఈ లక్షణాలలో సానుకూల దృక్పథం అలవడుతుంది.
నాయకుడు అనేవాడు గొప్ప వ్యూహకర్తగా ఉండాలి. దూరదృష్టి కూడా ఉండాలి. సమస్యలు గుర్తిచడంతోపాటు వాటిని పరిష్కరించే సమయంలో వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. అదే సమయంలో టీమ్‌ సభ్యుల, సహచరుల వ్యూహాలనూ కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించి అవసరమైతే స్వీకరించాలి. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.
నాయకుడైనంత మాత్రాన అదేదో గొప్ప పదవిగా ఊహించుకొని ఇతర సభ్యులను నిర్లక్ష్యం చేయకూడదు. అసలు తాము ఆ స్థితికి రావడానికి గల కారణాలు ఎప్పుడూ మరచి పోకూడదు. ఇంకా ఎదుగుతూ, ఇతరుల ఎదుగుదలకు తోడ్పడాలి. అదే సందర్భంలో ఎప్పటికప్పుడు మీ బలం, బలహీనతలను బేరీజు వేసుకోవాలి. తమ బలహీనతలను టీమ్‌ సభ్యులపై రుద్దకూడదు. వాటికి కారణాలు పరిశీలించి లోపాల్ని సరిదిద్దుకోవాలి. ఇది కూడా నాయకత్వ లక్షణాల్లో ప్రధానమైంది.
మీలోనూ నాయకత్వ స్థాయికి ఎదగాలనే ఆలోచన వుందా? అయితే ముందు అధ్యయనం అవసరం. పరిస్థితులను అవగతం చేసుకోవడం అంతకన్నా అవసరం. తోటివారితో కలిసి పనిచేయడం, పనిలో భాగస్వాములు కావడం అత్యవసరం.... అదికూడా డామినేటింగ్‌గా కాకుండా, సహచరునిగా కలిసిపోవడంతోనే అది సాధ్యం! 

No comments:

Post a Comment