Wednesday, September 28, 2011





చెరో రాజధాని!
హైదరాబాద్ అందరిదీ
రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విభజన

కొత్త రాజధానులు ఏర్పాటు చేసుకునే దాకా
రెండింటి పరిపాలనకు భాగ్యనగరమే కేంద్రం
ఆదాయం ఇరు రాష్ట్రాలకూ పంపిణీ
ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు
ఇది కాంగ్రెస్ పెద్దల మధ్యేమార్గ ప్రతిపాదన
అంగీకరించకపోతే రాష్ట్రపతి పాలనే?
రెండు రాష్ట్రాలు! రెండు రాజధానులు! ప్రస్తుతానికి హైదరాబాద్ ఇరువురిదీ! ఆ తర్వాత... కేంద్రానిది! తెలంగాణ సమస్యకు కాంగ్రెస్ ప్రతిపాదించబోయే పరిష్కారం ఇదేనా? అవునంటున్నాయి ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు...


హైదరాబాద్, సెప్టెంబర్ 28 : ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ ఒకరు! విభజిస్తే ఒప్పుకోం అని మరొకరు! తలతెగినా హైదరాబాద్‌ను వదులుకోం అని ఒకరు! హైదరాబాదే కీలకం అని మరొకరు! విడవమంటే పాముకు కోపం! కరవమంటే కప్పకు కోపం! ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం 'మధ్యేమార్గ'మైన నిర్ణయం తీసుకుంటోందా? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలకు 'ఔను' అనే సమాధానమే లభిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ కేంద్రకంగా మారి, దానిపై పీటముడి పడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సమస్యను తేల్చనిదే సంక్షోభానికి ఒక పరిష్కారం కనుగొనడం సాధ్యంకాదని కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న హైకమాండ్... కీలకమంతా హైదరాబాద్‌లోనే ఉందనే సంగతిని గుర్తించింది. అదే సమయంలో, 16 రోజులుగా జరుగుతున్న సకల జనుల సమ్మె, ఇందులో భాగంగా రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, కేంద్రానికి అందుతున్న ఫిర్యాదులు, నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం నేపథ్యంలో ఇక ఏదో ఒక అడుగు ముందుకు వేయక తప్పదని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

కొద్దిరోజుల్లోనే నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు మంగళవారం తెలంగాణ నేతలతో సమావేశమైన రక్షణ మంత్రి ఆంటోనీ కూడా పేర్కొనడం గమనార్హం. ఈ పరిణామాల నడుమ... అసలు కాంగ్రెస్ పెద్దల ఆలోచన ఏమిటో తెలుసుకోవడానికి 'ఆంధ్రజ్యోతి' ప్రయత్నించినప్పుడు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... రాష్ట్రాన్ని రెండుగా విభజించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే... అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతీయులు హక్కును 'క్లెయిమ్' చేస్తున్న హైదరాబాద్‌ను మాత్రం ఎవరికీ కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

రెండు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి, ఆ రెండింటికి రెండు వేర్వేరు రాజధానులను కాంగ్రెస్ ప్రతిపాదించనుంది. ఆ రాష్ట్రాలు కొత్త రాజధానులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకునేదాకా హైదరాబాద్ నుంచే పరిపాలన కొనసాగిస్తాయి. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయ వనరులను రెండుకొత్త రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు. ఇందుకోసం ఇరు ప్రాంతాల నేతలు ఒక ఒక అవగాహన ఒప్పందానికి వచ్చేలా చూస్తారు.

రెండు రాష్ట్రాలకు రాజధాని నగరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాత, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారు. అప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయ వనరుల్లో కేంద్ర పాలిత ప్రాంత అవసరాలకు పోగా మిగిలిన దాన్ని ఇరు రాష్ట్రాలకు వాటాలు వేసే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ సంక్షోభానికి ఇంతకు మించిన ఉత్తమ పరిష్కారం లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బుధవారం తెలంగాణ ప్రాంత నేతలతో జరిపిన చర్చల్లోనూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ 'మధ్యేమార్గం' ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం.

తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనంటూ నేతలు చెబుతుండగా ఆజాద్ కల్పించుకుని... 'మీ వాదనలు మీరు చెబుతున్నారు. వారి వాదనలు వారు చెబుతున్నారు. ఏదీ కాదనలేని పరిస్థితి నెలకొంది. మధ్యేమార్గంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందేమో!'' అని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పక్షాలను ఒప్పించడానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. తెలంగాణ వాదులు అంగీకరిస్తారా? విభజనకు సీమాం«ద్రులు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలకు కూడా కేంద్రంలో అధికార పక్షమైన కాంగ్రెస్ సమాధానం సిద్ధంగా ఉంచుకుంది.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా... ఈ సమస్యకు ఇంతకుమించి పరిష్కారం లేదని అది భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తమైతే సరేసరి! ఆ దిశగా చర్చలు ప్రారంభించి ముందుకు వెళ్తుంది. అలా ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడితే... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, ప్రస్తుత సమస్యను ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ సంక్షోభా న్ని ఇంకా సాగదీయకూడదని, దీని వల్ల పరిస్థితులు విషమించేఅవకాశం ఉందని నిఘా వర్గాలుచేస్తున్న హెచ్చరికలూ కాంగ్రెస్ అధిష్ఠానం అడుగు ముందుకువేయడాని కి కారణంగా కనిపిస్తున్నాయి. సకల సమ్మె నేపథ్యంలో... నెలాఖరు తర్వాత రాష్ట్రంలో ప్రజాందోళనను మరింత తీవ్రం చేసి, పరిస్థితులను అస్తవ్యస్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు వివిధ శక్తులు ఏకమవుతున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు సమాచారం.






అవినీతిని అదుపులో ఉంచడం రాజు ప్రథమ కర్తవ్యం

''ఉద్యోగులు నలుబది విధముల అవినీతికి పాల్పడేదరు. ముందు జరిగిన దానిని వెనుక జరిగినట్లుగా, వెనుక జరిగిన దానిని ముందు జరిగినట్లుగా వ్రాయుట,

సాధ్యమయ్యే పనిని సాధ్యము కాదని, సాధ్యము కాని పనిని సాధ్యముగా చూపుట, స్వల్పంగా జరిగిన పనిని అధికంగా, అధికంగా జరిగిన పనిని స్వల్పంగా జరిగినట్లు నమోదు చేయుట, ఒకటి జరిగిన వేరొకటి జరిగినట్లుగా వ్రాయుట, ఒకరి ద్వారా జరిగిన దానిని వేరొకరి ద్వారా జరిగినట్లుగా చూపుట, ఇవ్వవలసిన పైకమును ఇవ్వకపోవుట, సమయమునకు కాక సమయం మించిపోయిన తరువాత ఇచ్చుట, ఒక రూపాయి ఇచ్చి రెండు రూపాయలు ఇచ్చినట్లు వ్రాయుట, రెండు రూపాయలిచ్చిన చోట ఒక రూపాయి ఇచ్చినట్లు వ్రాయుట, ఒకటి ఇచ్చి వేరొకటి ఇచ్చినట్లు నమోదు చేయుట, లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్నవాటిని లేనట్లుగా ఖాతాలు వ్రాయుట, చిల్లర ఖాతాలను మొత్తపు ఖాతాలుగా, మొత్తపు ఖాతాలను చిల్లర ఖాతాలుగా చూపుట, తక్కువ విలువ గల వాటిని ఎక్కువ విలువ గలవిగా, ఎక్కువ విలువ గల వాటిని తక్కువ విలువ గలవిగా మార్చుట, ధరలు పెంచుట, తగ్గించుట, పని దినములను తగ్గించి గాని, లేదా పెంచి గాని వ్రాయుట, సంవత్సరములను మాసములుగా, మాసములను రోజులుగా లెక్క కట్టుట మొదలగు నానావిధములుగా అవినీతికి పాల్పడి ప్రజల, ప్రభుత్వ ధనమును దోచుకొందురని, దీనిని నిరోధించేందుకు కటినమైన శిక్షలు అమలు పరచి పరిస్థితిని అదుపులో ఉంచాలి" అని చాణక్యుడు పాలకులకు సూచించాడు.

No comments:

Post a Comment