Friday, September 23, 2011

 - 



నిగ్గుతేల్చాలి



యుపిఏ-2 ప్రభుత్వం అవినీతి కుంభకోణాల గనిలా తయారైంది. తవ్విన కొద్దీ కుప్పతెప్పలుగా అవినీతి బయటపడుతూనే ఉంది. స్వాతంత్య్రానంతర భారత చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా రికార్డుకెక్కిన స్పెక్ట్రమ్‌ 2జిలోని నిజాలకు గోరీ కట్టాలని యుపిఏ సర్కార్‌ ఎంతగా ప్రయత్నిస్తుంటే అంతగా అవి బయటకు తన్నుకొస్తున్నాయి. ఈ భాగోతంలో ఇప్పటివరకు డిఎంకె మంత్రులు, ఎంపీలు రాజా, మారన్‌, కనిమోళిలే దర్శనమిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ మంత్రి చిదంబరం వీరి సరసన వచ్చి చేరడంతో ఈ బాగోతం ఆసక్తికరమైన మలుపు తిరిగింది. చిదంబరం గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు స్పెక్ట్రమ్‌-2జి లైసెన్సుల కేటాయింపుల్లో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన 14 పేజీల పత్రంలో స్పష్టంగా పేర్కొనడంతో ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. చిక్కుల్లో పడ్డ చిదంబరంను ఆదుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సల్మాన్‌ఖుర్షీద్‌, అంబికా సోనీ వంటి అమాత్యులు ఒక రక్షణ వలయంగా ఏర్పడి ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం తెంపరితనమే అనిపించుకుంటుంది. చిదంబరం వ్యక్తిత్వాన్ని శంకించనక్కర్లేదని, ఆయన పట్ల అప్పుడు ఇప్పుడు తనకు పూర్తి విశ్వాసముందని ప్రధాని అమెరికా నుంచి వత్తాసు పలికి తానూ ఆ తానులోని గుడ్డనేనని చాటుకున్నారు. చిదంబరం తప్పు చేశారని ఆర్థిక శాఖ ప్రధాని కార్యాలయానికి అయిదు మాసాల క్రితమే ఆ నోట్‌ను పంపితే అలాంటిది ఏదీ చూడలేదని ప్రధాని చెప్పడం మరీ విడ్డూరం. 2011 మార్చిలో ప్రధానికి పంపిన ఆ పత్రం ఆర్థిక శాఖ రూపొందించినదేనని ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్‌ నిర్ధారించాక కూడా చిదంబరంను ప్రభుత్వం వెనకేసుకొస్తోంది. ఆయనపై చర్య తీసుకుంటే మిగతా వారి గుట్టుమట్టులన్నీ ఎక్కడ బయటపెడతాడోనన్న భయమా? లేక దీనిని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నమా? ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టమూ లేదని, ఈ విషయంలో కాగ్‌ వేసిన అంచనాలు పూర్తిగా ఊహాజనితమైనవని చెప్పి బోఫోర్స్‌ మాదిరే దీనిని కూడా భూస్థాపితం చేయాలని చూసింది. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ విధానానికి అభ్యంతరం తెలిపి ఉంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా నివారించగలిగి ఉండేవారని పేర్కొంది. దీంతో ఇంతకాలం కపిల్‌ సిబల్‌ మహాశయుడు వాదిస్తూ వచ్చిన జీరో లాస్‌ థియరీ, టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయి) వాదనలు ఎంత అసంబద్ధమైనవో తేలిపోయింది. వరుస కుంభకోణాలతో ఇప్పటికే భ్రష్టుపట్టిపోయిన యుపిఏ-2 ప్రభుత్వ ప్రతిష్ట తాజా ఉదంతంతో మరింతగా దిగజారింది. ఇంత జరిగిన తరువాత కూడా కాంగ్రెస్‌ దీనిని ఎలా కప్పిపుచ్చాలనే విషయం గురించే ఆలోచిస్తోంది తప్ప ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం సిద్ధపడడం లేదు. ప్రధాని విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చేదాకా దీనిపై మాట్లాడేదేమీ లేదని చిదంబరం చెప్పడం, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ఈ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది కనుక దీనిపై ఇప్పుడేమీ వ్యాఖ్యానించబోనని చెప్పడంలోని ఆంతర్యమిదే. 2జి కేటాయింపుల్లో ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌, రెవిన్యూ షేరింగ్‌, 2001 నాటి ధరలనే ప్రాతిపదికగా స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరపాలన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని, ప్రధాని, ఆర్థికమంత్రి అందరి అంగీకారం దీనికి ఉందని టెలికామ్‌ శాఖ మాజీ మంత్రి రాజా చెప్పినప్పుడే దీని వెనుక పెద్ద తతంగమే ఉందని అర్థమైంది. రాజాతో సమావేశమైన తరువాతే చిదంబరం ఆ ప్రతిపాదనలకు ఉత్సాహంగా ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను అంగీకరిస్తే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని ఫైనాన్స్‌ శాఖ కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల కమిటీ లేవనెత్తిన అభ్యంతరాలను పెడచెవిన పెట్టి చిదంబరం దీనికి ఆమోదం తెలపడాన్ని బట్టే ఆయనకూ ఇందులో పాత్ర ఉందని స్పష్టమవుతోంది. రాజా నిర్ణయానికి అభ్యంతరం చెప్పానని ప్రధాని ఇంతవరకు చెబుతున్న మాటల విశ్వసనీయత కూడా ఆర్థిక శాఖ నోట్‌తో ప్రశ్నార్థకమైంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని కూడా తగు వివరణ ఇవ్వాల్సిన అవసరముంది. ఈ కుంభకోణంలో ఇంకా వెలుగు చూడని నిజాలను వెలికితీసేందుకు దీనిపై మరింత లోతైన, విస్తృతమైన దర్యాప్తు జరగాల్సిన అవసరముంది. ఈ కుంభకోణంతో ప్రమేయమున్న కార్పొరేట్‌ శక్తులను కూడా బయటకు లాగాలి. ఆ పని చేయడానికి ఈ ప్రభుత్వం సాహసిస్తుందని అనుకోలేము. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని చీవాట్లు పెడితే తప్ప ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు సాగని పరిస్థితి. ప్రతిదీ కోర్టు కలుగజేసుకుంటే కానీ ప్రభుత్వం కదలడం లేదు. 2జి కుంభకోణంలో చిదరబరం ప్రమేయాన్ని గురించి తగినన్ని ఆధారాలు ఉన్నందున దీనిపై సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరమెంతైనా ఉంది. దీనిపై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశిస్తే అప్పుడు చూస్తామన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడడం బాధ్యతారాహిత్యం. కళ్లెదుట ఆధారాలు కనబడుతున్నా ప్రభుత్వం దీనిని ఇంకా నాన్చుతుండడం గమనార్హం. స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో చిదంబరం పాత్రను నిగ్గు తేల్చేందుకు దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి. అలాగే ఈ కుంభకోణంతో ప్రమేయమున్న కార్పొరేట్‌ సంస్థల లైసెన్సులను రద్దు చేసి తిరిగి వాటిని తాజాగా వేలం వేయాలి.

No comments:

Post a Comment