దశాబ్దకాలం నాటి గుజరాత్ రక్తచరిత్ర కొత్త అధ్యాయాలు చేర్చుకుంటూ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వెంటాడుతూనే ఉంది. గోడలమీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నెత్తుటి మరకలపై సున్నం పూయడానికి చిత్రవిచిత్ర రీతుల్లో ఆయన ప్రయత్నిస్తున్నా, అవి ఉండుండి బయటపడుతూ ముఖంలో నెత్తుటి చుక్కల్ని హరిస్తూనే ఉన్నాయి. ఇషత్ ్రజెహాన్, మరో ముగ్గురి ‘ఎన్‌కౌంటర్’పై దర్యాప్తు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), వాటిని పోలీసుల పాశవిక హత్యలుగా నిర్ధారిస్తూ హైకోర్టుకు నివేదిక ఇవ్వడం అటువంటిదే. ఇందుకు బాధ్యులైన పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో సహా 21 మందిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్)ను దాఖలు చేయమని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌కు సారథ్యం వహించిన అప్పటి డీఐజీ డీజీ వంజర, మరో ఉన్నతాధికారి కే. అమీన్ సొహ్రాబుద్దీన్-కౌసర్‌బీల ఎన్‌కౌంటర్ కేసును పురస్కరిం చుకుని ఇప్పటికే జైలులో ఉన్నారు. గుజరాత్‌లో రాష్ట్రప్రభుత్వం కనుసన్నలలో పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్లను ఒక ప్రత్యేక ‘విద్య’గా సాధన చేస్తూవచ్చారన డానికి ఇదొక సాక్ష్యం.
ఉగ్రవాదాన్నీ, తీవ్రవాదాన్నీ అడ్డుపెట్టుకుని పోలీసులు ఎన్‌కౌంటర్ పేరిట సాగించే చట్టవిరుద్ధ, రాజ్యాంగాతీత హత్యా కాండ గురించిన ఆరోపణలు కాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాలలోనే కాక మనరాష్ట్రంలోనూ అసంఖ్యాకం. మానవహక్కుల సంఘాలు ఎంత ఆందోళన చేసినా ఇటువంటి కేసులపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించిన ఉదాహరణలు అరుదు. గుజరాత్ ఘటనలు మరోరకం. 2002లో గోధ్రాలో 59మంది కరసేవకుల సజీవదహనం, ఆ వెనువెంటనే రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన మారణకాండలో 1200 మంది నిహతులు కావడం మతకల్లోల చరిత్రనే తిరగరాశాయి. ఈ ఊచకోతకు ప్రభుత్వం పరోక్ష ప్రోత్సాహం అందించిందనీ, పోలీస్, పౌరయంత్రాంగాలు నిశ్శబ్ద ప్రేక్షక పాత్ర పోషించాయనీ, కొన్నిచోట్ల హంతకదళాలతో కుమ్మక్కు ఆయ్యాయనీ వచ్చిన విమర్శలు యావద్దేశాన్నీ నిర్ఘాంతపరిచాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే, ఒక ‘పద్ధతి’ ప్రకారం పోలీస్ ‘ఎన్‌కౌంటర్’లు వరసగా సంభవించాయి.
వీటిలో మూడు, ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంతో జరిగాయి. ఇషత్ ్రజెహాన్, మరో ముగ్గురి ‘ఎన్‌కౌంటర్’ వాటిలో ఒకటి.
వీరిది నకిలీ ఎన్‌కౌంటరే అన్న సంగతిని నిర్ధారిస్తూ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 2009లోనే తీర్పు చెప్పారు. హైకోర్టు ఆదేశంతో దర్యాప్తు జరిపిన సిట్ ఇప్పుడు దానినే ధ్రువీకరించింది. ముంబైలో డిగ్రీ చదువుతున్న ఇషత్ ్రజెహాన్‌ను; ప్రాణేశ్ పిళ్లై అలియాస్ జావేద్ గులాం షేక్, అమ్జాద్ అలీ రాణా, జీషన్ జోహార్‌లను ముంబైలో కిడ్నాప్‌చేసి, అహ్మదాబాద్‌కు తీసుకొచ్చి, 2004, జూన్ 14 రాత్రి పోలీస్ కస్టడీలోనే కాల్చి చంపారనీ; ఆ మరునాడు ఉదయం అహ్మదాబాద్ శివార్లలో జరిగిన ‘ఎన్‌కౌంటర్’లో చని పోయినట్టు చిత్రించారనీ మేజిస్ట్రేట్ స్పష్టంచేశారు.
వీరికి పాకిస్థాన్ నుంచి పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్టు ఆధారాలు లేవన్నారు. నరేంద్ర మోడీ హత్యకు వీరు ‘కుట్ర’పన్నినట్టు ముంబై పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందన్న గుజరాత్ పోలీసుల ప్రకటనతో ముంబై పోలీసులు విభేదించారు. అయితే, ఈ నలుగురూ లష్కరే తరపున పనిచేసే సుప్త విభాగాల (స్లీపింగ్ సెల్స్)లో సభ్యులు అయుండగల అవకాశాన్ని తోసిపుచ్చలేమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై అనడం గమనార్హం. ఒకవేళ అదే నిజమను కున్నా; ఎఫ్‌ఐఆర్ దాఖలు, దర్యాప్తు, చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలం, విచారణ వగైరాలు లేకుండా పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నిందితులను కాల్చి చంపి ‘ఎన్‌కౌంటర్’గా చిత్రించడం అంతకుమించిన ఘోరం, నేరం.
సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్‌బీలను గుజరాత్ పోలీసులు అటకాయించి తీసుకెళ్లి హతమార్చడం మరో ప్రసిద్ధ ఉదంతం. ఇషత్ రజెహాన్ తదితరుల హత్యకు సారథ్యం వహించిన అధికారే ఇందులోనూ ప్రధాన ముద్దాయి.
పాలకులను మెప్పించి పదోన్నతులు, పురస్కృతులను అందుకునే ప్రయత్నంలో భాగమే ఈ నకిలీ ఎన్‌కౌంటర్లన్న మేజిస్ట్రేట్ వ్యాఖ్య పాలక-పోలీస్ వ్యవస్థలు రెండింటినీ మరింత హీనంగా హేయంగా రూపుకడుతోంది. యావద్దేశాన్నీ నివ్వెరపరచిన అసాధారణ మత మారణకాండ పట్ల గుజరాత్ ప్రభుత్వ నాయకత్వం, పోలీస్ యంత్రాంగం ఉదాసీనతను పాటించాయన్న ఆరోపణ హోరెత్తుతున్న ఘట్టంలో ఇలాంటి నకిలీ ఎన్‌కౌంటర్‌లు జరగడం నిస్సందేహంగా భిన్న సంకేతాలనిస్తుంది. వీటికి కేవలం పోలీసులనే బాధ్యులను చేసి శిక్షించడం ఏవిధంగా న్యాయం, నీతిబద్ధం అన్న ప్రశ్నను ముందుకు తెస్తుంది.
చట్టాన్నీ, న్యాయాన్నీ పోలీసులు తమ చేతుల్లోకి తీసుకొని విశృంఖలంగా వ్యవహరించ డానికి అవకాశమిచ్చినవారినీ; అందుకు దోహదపడే ఒక అసాధారణ, కృత్రిమ వాతావరణం ఏర్పడడానికి బాధ్యులైనవారినీ సమాన దోషులుగా ముగ్గులో నిలబెడుతుంది. ఇటువంటి ఆరోపణల సందర్భంలో మొత్తం బాధ్యత పోలీసులకే ఆపాదించి రాజకీయబాధ్యతను పక్కకు తప్పించడం సర్వసాధారణం. గుజరాత్ ఉదంతంలోనే కాదు; పోలీసులు రాజ్యాంగాతీత హత్యలు సాగించే ప్రతి రాష్ట్రంలోనూ ఇదే జరుగుతోంది.
మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాలలో గత రెండు దశాబ్దాల కాలంలో పదులు, వందల సంఖ్యలో ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు’ అవతరించారంటే, ప్రజాస్వామికం, చట్టబద్ధం అని చెప్పుకునే ప్రభుత్వాల కనుసన్నలలోనే రాజ్యాంగ నిబంధనల ఉరితీత ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతుంది. ‘సద్భావన’దీక్షలు, యాత్రలతో ఇలాంటి దురాగతాలనుంచి దృష్టి మళ్లించగలమనుకోవడం భ్రమేనని కూడా సిట్ నిర్ధారణలు గంటకొట్టి చెబుతున్నాయి. |
No comments:
Post a Comment