ఆయన గురజాడ అడుగుజాడల్లో నడిచిన అభ్యుదయ రచయిత. అబ్బూరి మేస్టారి మార్గదర్శకత్వంలో ముందడుగు వేసిన నాటక రచయిత. గంభీరమయిన సామాజిక సమస్యలనునవ్వు పుట్టించేలా రంగస్థలంపైన ఆవిష్కరించిన గొప్ప శిల్పి. ఆయనే సోమంచి యజ్ఞన్న శాస్త్రి. జాన్ గాల్స్‌వర్దీ, మారిస్ మేటర్‌లింక్, నికలాయ్ గగోల్, జార్జ్ బెర్నాడ్ షా తదితర మహామహుల నాటకాలను అర్ధ శతాబ్దం కిందటే అనువదించి, మనకందించిన ఇంత గొప్ప రచయితకు రావలసినంత పేరు వచ్చిందో లేదో ప్రతి తెలుగువాడూ వేసుకోవలసిన ప్రశ్న!
ఆధునిక తెలుగు సాహిత్య ‘చరిత్ర’కారులు కన్వీనియెంట్‌గా మర్చిపోయిన ఒక రచయిత సోమంచి యజ్ఞన్న శాస్త్రి. కథలూ, నాటికలూ, నాటకాలూ రాసిన ఈ తొలితరం అభ్యుదయ రచయిత, దశాబ్దాల తరబడి బొంబాయి (నేటి ముంబై)లో -ఉద్యోగరీత్యా- ఉండిపోవడం ఈ ఉపేక్షకు ఒక కారణం కావచ్చు. అంతకు మించి, యజ్ఞన్న శాస్త్రికి ప్రమోటర్లు ఎవరూ లేకపోవడం పెద్దకారణమనిపిస్తుంది.
సరదాగా...
1936లో లక్నోలో అభ్యుదయ రచయితల సంఘం మహాసభలు జరిగాయి. ఆ సభలకు తెలుగువాళ్లు ఇద్దరే ప్రతినిధులుగా వెళ్లారు. వారిలో అబ్బూరి రామకృష్ణరావు గారు ఒకరయితే, యజ్ఞన్న శాస్త్రి రెండవవారు. సుప్రసిద్ధ రచయిత ప్రేమ్‌చంద్ అధ్యక్షత వహించిన ఈ సభలకు -అప్పట్లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ చరిత్ర శాఖలో అధ్యాపకునిగా పనిచేస్తూన్న- హిరేన్ ముఖర్జీకూడా ఒక ప్రతినిధిగా హాజరయ్యారు. లక్నో అనుభవాల ఆధారంగా యజ్ఞన్న శాస్త్రి హాస్యస్పోరకమయిన ‘స్కెచ్’ కూడా రాశారు. ఉత్తర దక్షిణ భారతదేశాల ప్రజల ఆహారపు అలవాట్లలోని భిన్నత్వాన్ని ఆధారంగా చేసుకుని సరదాగా రాసిన రచనిది.
సీరియస్ హాస్యం
యజ్ఞన్న శాస్త్రి రచనలన్నింట్లోనూ హాస్యరసం చిప్పిల్లుతూనే ఉంటుంది. అయితే, అవన్నీ చాలా సీరియస్ రచనలే కావడం విశేషం. యజ్ఞన్న శాస్త్రి రచనల్లో ఎక్కువ ప్రాచుర్యానికి నోచుకున్నవి అనుసృజనలే. అయితే, అవన్నీ ప్రపంచ సాహిత్యంలో మేలుబంతులనిపించుకున్న నాటకాలే. అదీ ఆయన అభిరుచి! దానికి తగిన రచనా శైలిని అలవర్చుకోవడంలో శాస్త్రిగారు సఫలీకృతులయ్యారు. అవన్నీ ప్రదర్శనయోగ్యంగా ఉండడం ఓ విశేషమయితే, ప్రేక్షకజనసామాన్యం ఆదరణకు నోచుకోవడం మరింత విశేషం. ఈ రెండో ఫలితం సాధించడానికి ప్రధానంగా ఉపయోగపడింది యజ్ఞన్న శాస్త్రి రచనా శైలిలోని హాస్యరసమే! సీరియస్ సాహిత్యం కళాత్మకతతో కళకళ్లాడుతూ ఉండితీరాలని గురజాడ ‘కన్యాశుల్కం’ అందించిన సందేశాన్ని గ్రహించిన అభ్యుదయ రచయితల్లో యజ్ఞన్న శాస్త్రి ముఖ్యులు.
మూలకథకు ‘న్యాయం’
ప్రపంచ ప్రసిద్ధ ఇంగ్లిష్ నవలాకారుడూ, నాటకకర్తా జాన్ గాల్స్‌వర్దీ 1910లో ‘జస్టిస్’ అనే నాలుగంకాల నాటకాన్ని రాశారు. దాని తొలి ప్రదర్శనకు విన్‌స్టన్ చర్చిల్ హాజరయ్యారంటారు. ఈ నాటకాన్ని మారిస్ ఎల్వీ 1917లో సినిమాగా తీశాడు కూడా. ఖైదీల జీవన స్థితిగతులు ఇతివృత్తంగా రాసిన నాటకమిది. కారాగార సంస్కరణల చరిత్రలో ఈ నాటకానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. జస్టిస్ నాటకాన్ని యజ్ఞన్న శాస్త్రి ‘న్యాయం’ పేరిట 1955లో అనుసృజించారు. ఛాయానుసరణలకు చక్కని గ్రామర్‌ను నిర్దేశించింది ఈ రచన. (అయితే, ఈ గ్రామర్‌ను ఎందరు పాటించారన్నది వేరే చర్చ!)
లోక ‘కల్యాణి’
మరుసటి సంవత్సరమే ఆయన సుప్రసిద్ధ బెల్జియన్-ఫ్రెంచ్ రచయిత మారిస్ మేటర్‌లింక్ 1902లో రాసిన ‘మోనా వానా’ అనే మూడంకాల నాటకాన్ని ‘కల్యాణి’ పేరుతో అనుసృజించారు. ప్రస్తుతం ఇటలీలో భాగంగా ఉన్న పీసా, ఫ్లారెన్స్ ఒకప్పుడు వేరువేరు స్వతంత్ర నగరరాజ్యాలు. వాటిమధ్య యుద్ధం చెలరేగిన తరుణంలో మోనా వానా అనే కులీన స్త్రీ -తన నగరవాసుల ప్రాణాలను కాపాడే నిమిత్తం- శత్రుశిబిరంలోకి ఒంటరిగా వెళ్తుంది. ఆమె భర్తా, మామగారూ దగ్గిరుండి వానాను ఫ్లారెన్స్ సైనిక డేరాల్లోకి పంపిస్తారు. అక్కడ ఆమెకు చిన్ననాటి సఖుడు ప్రింజివలే ఎదురవుతాడు. అతగాడే, ఫ్లారెన్స్ దళపతి! అతని సౌశీల్యానికి ఆశ్చర్యపోతుంది వానా.
తనతోపాటుగా అతన్ని పీసా నగరానికి తీసుకువస్తుంది. అయితే, భర్తా-మామా స్పందించిన తీరుకు మండిపడి సొంతగొంతు విప్పుతుంది. అక్షరాలా స్వతంత్ర స్త్రీ వానా. అలాంటి బలమయిన వ్యక్తిత్వం గల పాత్ర చుట్టూ అల్లిన కథను ఎంపికచేసుకోవడం యజ్ఞన్న శాస్త్రి సంస్కారంలోని విశిష్టత.
మహానుభావుడు గగోల్!
ఆధునిక రష్యన్ కథా సాహిత్యానికి ఆదిపురుషుడయిన నికలాయ్ గగోల్ -1836లో-రాసిన ‘రెవిజోర్’ అనే నాటకం ‘ద ఇన్‌స్పెక్టర్ జెనరల్’ పేరిట మన దేశంలో ప్రసిద్ధం. అలెక్సాంద్ పూష్కిన్ గగోల్‌కు వివరించిన ఒక (అప)హాస్యభరితమయిన సన్నివేశం ఈ రచనకు మూలం. జారుల కాలంలో రష్యన్ కులీనుల్లో పెచ్చరిల్లిన స్వార్థబుద్ధీ, మౌఢ్యం, రాజకీయపరమయిన అవినీతీ, అక్రమాలను అవహేళన చెయ్యడంకోసమే గగోల్ ఈ నాటకం రాశాడు. రష్యన్ సాహిత్య చరిత్రను ఓ మలుపు తిప్పిన రచన ఇది.
మూల రచన వెలువడి 120 సంవత్సరాలయిన తర్వాత -1957లో-దీన్ని ఛాయామాత్రంగా అనుసరిస్తూ యజ్ఞన్న శాస్త్రి ‘మహానుభావులు’ అనే నాటకం రాశారు. ఈ నాటకం తొలిప్రదర్శనలో డి.వి.నరసరాజు కథానాయకుడి పాత్ర పోషించారట. డాన్ యువాన్ కథ ఆధారంగా బెర్నాడ్ షా రాసిన నాటకం ‘మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్’ నాటకాన్ని కూడా యజ్ఞన్న శాస్త్రి ‘విశ్వం పెళ్లి’ పేరిట అదే సంవత్సరం అనుసృజించారు. కల్పనా చమత్కృతిలో షా కన్నా శాస్త్రిగారే పెద్ద చెయ్యని ఈ నాటకం చూస్తే అనిపిస్తుంది.
జాన్ గాల్స్‌వర్దీ, మారిస్ మేటర్‌లింక్, నికలాయ్ గగోల్, జార్జ్ బెర్నాడ్ షా తదితరుల నాటకాలను అర్ధ శతాబ్దం కిందటే అనువదించి, మనకందించిన ఇంత గొప్ప రచయితకు రావలసినంత పేరు వచ్చిందో లేదో ప్రతి తెలుగువాడూ వేసుకోవలసిన ప్రశ్న! సోమంచి యజ్ఞన్న శాస్త్రి రచనలు పెద్ద లైబ్రరీల్లోనూ, అరుదయిన పుస్తకాల కలెక్టర్ల దగ్గిర దొరకవచ్చు.
- పాఠక్
No comments:
Post a Comment