Friday, November 4, 2011



_________________________________________________________________

గులాబీ చక్ర బంధంలో తెలంగాణ
- కొత్త పలుకు

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 119 స్థానాలను టి.ఆర్.ఎస్.కు కట్టబెడితే తెలంగాణ వస్తుందని కె.సి.ఆర్. చెబుతున్నారు. అంటే, 2014 వరకు తెలంగాణ రాదని పరోక్షంగా చెప్పడమే! పోనీ, తెలంగాణలోని మొత్తం స్థానాలలో టి.ఆర్.ఎస్.ను గెలిపించినప్పటికీ తెలంగాణ వస్తుందా, అంటే ఆ గ్యారెంటీ కూడా లేదు. కాంగ్రెస్, బి.జె.పి. సహకారం లేకుండా తెలంగాణ ఎప్పటికీ ఏర్పడదు. అంటే, ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానిని టి.ఆర్.ఎస్. కౌగిలించుకోక తప్పదు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకోవడం తెలంగాణ సాధనకు ఎలా దోహదపడుతుందో కె.సి.ఆర్. మాత్రమే చెప్పాలి.

రాజకీయాలలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్క పరిణామం లేదా సంఘటన మొత్తం అంచనాలను తల్లకిందులు చేస్తుంది. చతికిలబడిన నాయకులు అందలాలు ఎక్కిన సందర్భాలు, అందలం ఎక్కిన వారు కనుమరుగైన సంఘటనలు ఎన్నో చూశాం! రాష్ట్ర రాజకీయాలనే తీసుకుంటే, 2009 ఎన్నికలలో చతికిలబడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇదే పరిస్థితి ఎల్లకాలం ఉంటుందని చెప్పడానికి లేదు.

ఒకప్పుడు లోక్‌సభలో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ క్రమంగా పుంజుకుని ఏడేళ్లపాటు దేశాన్ని పాలించి, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 33 స్థానాలను గెలుచుకోవడం ద్వారా లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ... ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు... బి.జె.పి. తరఫున లోక్‌సభలో ఎల్.కె. అద్వానీ, సి.జంగారెడ్డి మాత్రమే ప్రాతినిధ్యం వహించారు.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పరిటాల రవి హత్య కేసు దర్యాప్తులో భాగంగా జగన్మోహనరెడ్డిని విచారించడానికి సి.బి.ఐ. అధికారులే ఆయన ఇంటికెళ్లారు. అప్పుడు జగన్ ప్రజాప్రతినిధి కూడా కాదు. ఇప్పుడు జగన్ అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎం.పి. ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి. అయినా, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంలో విచారించడానికి తమ ఎదుట హాజరు కావలసిందిగా జగన్‌ను సి.బి.ఐ. అధికారులు ఆదేశించారు. ఒకప్పుడు దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంతోపాటు, ప్రధానమంత్రుల నియామకంలో చక్రం తిప్పిన చంద్రబాబు... ఇప్పుడు పూర్వ వైభవం తీసుకురావడం ఎలాగో తెలియని స్థితిలో ఉన్నారు.

2009 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జనానికి ముఖం చూపించలేక రోజుల తరబడి ఇంటికే పరిమితమై, చివరకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి... కన్నీటి పర్యంతమైన టి.ఆర్.ఎస్. అధినేత కె.చంద్రశేఖర రావు ఇప్పుడు రాష్ట్రంలో దిలాసాగా ఉన్న ఏకైక నాయకుడు. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలో ఇంత మార్పు రావడానికి కె.సి.ఆర్. కృషి కొంత కారణమైతే, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల తప్పిదాలు మరో కారణం. ఏదైతేనేం, ఇప్పుడు తెలంగాణ అంటేనే టి.ఆర్.ఎస్., టి.ఆర్.ఎస్. అంటేనే తెలంగాణ అన్న పరిస్థితి ఏర్పడింది.

దీనితో తమ రాజకీయ భవిష్యత్తుపై భరోసా కోల్పోతున్న కాంగ్రెస్, టి.డి.పి. ప్రజాప్రతినిధులు టి.ఆర్.ఎస్. వైపు చూడడం ప్రారంభించారు. ఈ పరిణామాలన్నీ టి.ఆర్.ఎస్. నాయకులను అమితంగా సంతోష పెడుతూ ఉండవచ్చు గానీ... అవి తెలంగాణ సాధనకు ఎంతవరకు దోహదపడతాయన్నదే ప్రశ్న! నిన్న మొన్నటి వరకూ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో టి.ఆర్.ఎస్. విలీనం అవుతుందని భావించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ విషయం ఆలోచిస్తామని టి.ఆర్.ఎస్. నాయకులు కూడా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించవలసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా, కె.సి.ఆర్. రాజకీయంగా బలపడి ఉండవచ్చుగానీ, తెలంగాణ ఏర్పాటు చేయడానికి అదే ప్రతిబంధకంగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాల్ని ఎలా పరిగణిస్తున్నదో వేచి చూడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందనుకుంటేనే నిర్ణయం తీసుకుంటుంది. తమకు కలిగే ప్రయోజనం విషయంలో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు స్పష్టత ఏర్పడకపోవడమే తెలంగాణ సమస్య ఇంతగా నానడానికి కారణం.

డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనే తమ ఆశయమని ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన కొందరు పదవులను త్యాగం చేసి సొంతంగా పోరాడినా, వారికి ప్రయోజనం చేకూరకపోగా అదంతా టి.ఆర్.ఎస్. ఖాతాలోకే మళ్లుతూ వచ్చింది. ఇందుకు తాజా ఉదాహరణ జూపల్లి కృష్ణారావు ఉదంతం. ఆయన మంత్రి పదవిని వదులుకుని నెలల తరబడి పాదయాత్ర వగైరా కార్యక్రమాలు చేపట్టినా, వ్యక్తిగతంగా బలపడలేక పోయారు. ఇవ్వాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసన సభ్యులు, ఎం.పి.లు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేస్తే వారిపై టి.ఆర్.ఎస్. పోటీ పెట్టదన్న గ్యారెంటీ లేదు.

టి.ఆర్.ఎస్. పోటీపెడితే రాజీనామాలు చేసినవాళ్లు గెలుస్తారన్న నమ్మకం లేదు. ఈ కారణంగానే, తమ రాజీనామాల కోసం తెలంగాణ వాదుల రూపంలో ఉన్న టి.ఆర్.ఎస్. నాయకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేని కొంతమంది, తమ పార్టీలకు రాజీనామా చేసి టి.ఆర్.ఎస్.లో చేరుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవులకు తాము చేసిన రాజీనామాలు ఆమోదం పొంది ఉప ఎన్నికలు వచ్చినా, తామే గెలుస్తామన్న భరోసా వారికి పుష్కలంగా ఉంది. ఆ నమ్మకమే లేకపోయి ఉంటే వారు తమ పార్టీలను వదిలిపెట్టి ఉండేవారు కాదు. తెలంగాణలో స్వేచ్ఛగా తిరగాలన్నా, శాసన సభ్యులు, ఎం.పి.లుగా కొనసాగాలన్నా లేదా తిరిగి ఎన్నిక కావాలన్నా టి.ఆర్.ఎస్.లో చేరక తప్పదన్న పరిస్థితి ఏర్పడింది.

ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇది వాస్తవం. తెలంగాణలో రాజకీయ వాతావరణం టి.ఆర్.ఎస్. వైపు ఏకపక్షంగా మారడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకుల వ్యూహ రచనా వైఫల్యమే కారణం. తమ చర్యలు, వ్యాఖ్యలు టి.ఆర్.ఎస్.కు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న వాస్తవాన్ని ఈ రెండు పార్టీల నాయకులు ఆలస్యంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కె.సి.ఆర్.పై ఎదురుదాడికి తెలుగుదేశం నాయకులు శ్రీకారం చుట్టారు. ఆయాచితంగా అందివచ్చిన పోలవరం టెండర్ల వివాదం ఉపయోగించుకుని కె.సి.ఆర్.ను ఇరకాటంలో పెట్టడంలో తెలుగుదేశం సఫలీకృతం అయింది.

పర్యవసానంగానే కె.సి.ఆర్ తొలిసారిగా సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. అయితే, రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన కె.సి.ఆర్. తనపై ప్రజల్లో అపోహలు ఏర్పడుతున్న విషయాన్ని గుర్తించి, పోలవరం టెండర్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులను టి.ఆర్.ఎస్.లో చేర్చుకోవడానికి ముహూర్తం పెట్టారు. ఇక్కడ కె.సి.ఆర్. లక్ష్యం నెరవేరింది. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ఇవ్వగలిగేది కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ మాత్రమే! 2014లోపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రతిపాదిస్తే బి.జె.పి. మద్దతు ఇవ్వవలసి ఉంది. 2014 తర్వాత బి.జె.పి. అధికారంలోకి వస్తుందనుకున్నా, అప్పుడైనా తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో సహకరించవలసి ఉంటుంది.

అంటే, ఈ రెండు పార్టీల ద్వారానే తెలంగాణ ఏర్పడటం, ఏర్పడకపోవటం జరుగుతుంది. వాస్తవ పరిస్థితి ఇదికాగా, తెలంగాణలో ఈ రెండు పార్టీలకు కలుగుతున్న రాజకీయ ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును ప్రకటించినా, అందుకు టి.ఆర్.ఎస్. పార్టీయే కారణమనే భావన ప్రజల్లో కలుగుతుంది. అంటే టి.ఆర్.ఎస్.పై ఆధారపడకుండా ఎన్నికలలో లబ్ధి పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీది దీర్ఘకాలిక వ్యూహం కనుక, ఇప్పుడు ఆ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు.

అయితే, తెలంగాణ ఏర్పాటుకు సహకరించినప్పటికీ... టి.ఆర్.ఎస్., కాంగ్రెస్ చేతులు కలిపితే తమకు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదన్న విషయాన్ని బి.జె.పి. నాయకులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ఈ కారణంగానే తెలంగాణ కోసం స్వతంత్రంగా పోరాడాలని నిర్ణయించుకోవడంతోపాటు, 2014 తర్వాత తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారు. ఓట్లు, సీట్లకోసం టి.ఆర్.ఎస్. పోతున్న పోకడలు పరోక్షంగా తెలంగాణ ఏర్పాటుకు అవరోధంగా మారే ప్రమాదం ఉంది.

ఈ సూక్ష్మాన్ని గ్రహించలేని వివిధ వర్గాల నాయకులు, ప్రజలు టి.ఆర్.ఎస్.కు ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తున్నారు. తమ పార్టీని చీల్చడం వల్ల తెలంగాణ రాదని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కొందరు ప్రకటిస్తున్నారు కూడా! ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో కూడా ఇప్పుడిప్పుడే స్పష్టత ఏర్పడుతున్నది. తమ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వడానికి అంగీకరించినా, నిరాకరించినా కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆ పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు నిర్ణయించుకోగా, మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే, పార్టీని వీడి వేరు కుంపటి పెట్టుకుంటామనీ, దానికి తానే నాయకత్వం వహిస్తానని కె.కేశవరావు ప్రకటించడం గమనార్హం. అయితే, ఇలాంటి స్వతంత్ర వేదికలు ఇదివరకే కొన్ని ఏర్పడి తెరమరుగయ్యాయి. టి.ఆర్.ఎస్. బరిలో ఉండగా తెలంగాణ కోసం ఎన్ని పార్టీలు ఏర్పడినా, వేదికలు పురుడు పోసుకున్నా ఫలితం ఉండదనేది వాస్తవం. దీన్నిబట్టి కాంగ్రెస్‌లో ఇమడలేని వారు టి.ఆర్.ఎస్.లో ఏదో ఒక రోజు చేరిపోతారు. మంత్రి పదవికి రాజీనామా చేసి, ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో స్వతంత్ర నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ ప్రయత్నంలో విఫలమైతే, ఆయన కూడా టి.ఆర్.ఎస్.లో చేరిపోవచ్చు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తె లంగాణ గురించి ఒక్క మాట కూడా అనుకూలంగా మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణ జెండా పట్టకోకపోతే, రాజకీయ భవిష్యత్తు ఉండదని భయపడుతున్న వారే సొంత పార్టీలను వీడివెళ్లిపోతున్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజం కనుక, 2014లో ఓడినా ఫరవాలేదు అనుకునే వారు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. సకల జనుల సమ్మె అర్ధంతరంగా ముగించుకోవలసి రావడం తెలంగాణ ఉద్యమానికి కొంతమేర నష్టం చేసినా, టి.ఆర్.ఎస్.కు మాత్రం రాజకీయంగా జరిగిన నష్టం ఏమీ లేదు.

ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ తగ్గకపోవడమే ఇందుకు కారణం. అయితే, జరుగుతున్న పరిణామాలన్నీ తెలంగాణ ఏర్పాటుకు దోహదపడతాయా? లేదా? అంటే, ఔనని కచ్చితంగా చెప్పలేని స్థితి. కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో తెలంగాణ ఇచ్చే పరిస్థితిలో లేదన్న అభిప్రాయానికి టి.ఆర్.ఎస్. నాయకులతోపాటు, ఇతర తె లంగాణ వాదులు కూడా వస్తున్నారు. వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెద్దలు ఇప్పుడు అయోమయ స్థితిలో ఉన్నారు. తెలంగాణ ఇవ్వాలా? లేదా? అనేది తేల్చుకోలేకపోతున్నారు.

ఈ అంశంపై ఎవరెన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, అంచనాలు వేస్తున్నా వాస్తవం ఇదే! ఈ నేపథ్యంలో తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే, ఏం జరగాలన్నది ప్రశ్న! ఇతర పార్టీలకు చెందిన వారిని టి.ఆర్.ఎస్.లో కలుపుకొని పోవడం వల్ల తెలంగాణ రాదు. అయితే, దీనికి టి.ఆర్.ఎస్. పార్టీయే అడ్డంకి అన్న భావనను ప్రజల్లో వ్యాపింప జేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే పరిస్థితులు మారిపోవచ్చు.

ఏనాటికైనా తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది తామేనని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడిప్పుడే ప్రకటనలు చేయడం ప్రారంభించారు. దీనర్థం భవిష్యత్తులో టి.ఆర్.ఎస్.ను ఢీ కొనడానికి ఆ పార్టీ సమాయత్తం అవుతున్నదని చెప్పవచ్చు. పోలవరం టెండర్ల విషయంలో కె.సి.ఆర్.ను ఇరుకున పెట్టడంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు, తాము కూడా టి.ఆర్.ఎస్.ను టార్గెట్‌గా పెట్టుకుని కార్యక్రమాలు చేపట్టడానికి వ్యూహ రచన చేస్తున్నారు. కానీ, ఇవన్నీ తెలంగాణ సమస్యను మరింత జటిలం చేసే అవకాశం ఉంది.

తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే రాజకీయ ప్రయోజనాలను వదులుకోవడానికి టి.ఆర్.ఎస్. సిద్ధపడాలి. ఆ పార్టీ అందుకు ముందుకు వచ్చే పక్షంలో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆయా వ్యక్తుల రాజకీయ భవిష్యత్తుకుభద్రత కలిగించిన వారే అవుతారు కానీ, తెలంగాణ సాధనకు దోహదపడిన వారు కారు.

తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఒక అంకం మాత్రమేననీ, ఇకముందు గేరు మార్చి ఉద్యమ స్వరూపం నిర్ణయిస్తామని రాజకీయ జె.ఎ.సి. చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వంటివారు ప్రకటిస్తున్నారు. అదే సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలో సత్యాగ్రహం చేపట్టారు. మరోవైపు కోమటిరెడ్డి ఆమరణ దీక్ష సాగుతోంది. ఇంకోవైపు దొరల తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలనేవారి స్వరం పెరుగుతోంది. బడుగులకు ప్రాధాన్యం లభించని దొరల తెలంగాణ రాకపోయినా ఫర్వాలేదని గద్దర్ వంటి వారు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు.

ఇన్ని వైరుధ్యాలు, అవరోధాలు అధిగమించి తెలంగాణ ఏర్పడుతుందా? అనే సందేహం ప్రస్తుతం సగటు తెలంగాణవాది మెదడును తొలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 119 స్థానాలను టి.ఆర్.ఎస్.కు కట్టబెడితే తెలంగాణ వస్తుందని కె.సి.ఆర్. చెబుతున్నారు. అంటే, 2014 వరకు తెలంగాణ రాదని పరోక్షంగా చెప్పడమే! పోనీ, తెలంగాణలోని మొత్తం స్థానాలలో టి.ఆర్.ఎస్.ను గెలిపించినప్పటికీ తెలంగాణ వస్తుందా, అంటే ఆ గ్యారెంటీ కూడా లేదు. కాంగ్రెస్, బి.జె.పి. సహకారం లేకుండా తెలంగాణ ఎప్పటికీ ఏర్పడదు. అంటే, ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానిని టి.ఆర్.ఎస్. కౌగిలించుకోక తప్పదు.

మరి అలాంటప్పుడు కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకోవడం తెలంగాణ సాధనకు ఎలా దోహదపడుతుందో కె.సి.ఆర్. మాత్రమే చెప్పాలి. ఈ విషయం అలా ఉంచితే గాలి జనార్దన రెడ్డి కేసులో సి.బి.ఐ. అధికారుల ఎదుట విచారణకు జగన్మోహన రెడ్డి హాజరైన సందర్భంగా, ఆయన పార్టీ కార్యకర్తలు సి.బి.ఐ. కార్యాలయం వద్ద చేసిన గొడవ ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ వంటిది. చట్టం తన పని చేసుకుపోతుందని వై.ఎస్. ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.

అలాంటిది, ఆయన కొడుకు తన మందీ మార్బలాన్ని ప్రయోగించి దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయాలనుకోవడం ఎంతవరకు సబబు? ఈ కేసులో సాక్షిగా మాత్రమే తనను పిలిచారని జగన్ స్వయంగా చెప్పుకొన్నారు. అలాంటప్పుడు, ఈ కేసులో జగన్‌ను అరెస్ట్ చేసే అవకాశమే లేదు. అయినా, జగన్ పార్టీ కార్యకర్తలు సి.బి.ఐ. కార్యాలయం వద్ద ఎందుకంత అరాచకంగా వ్యవహరించినట్టు! అక్రమాస్తుల కేసులో జగన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నందున, జగన్‌ను అరెస్ట్ చేస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని హెచ్చరించడమే ఈ హడావిడికి కారణం కావచ్చు.

తమిళ ప్రజలు మనకంటే ఆవేశపరులు. తమ నాయకులపై ఈగ వాలినా సహించరు. గతంలో జయలలిత, కరుణానిధిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా, చట్టం తనపని తాను చేసుకుపోయింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారాలపట్టి కనిమెళిని సి.బి.ఐ. అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. అయిదు నెలలకు పైగా ఆమె జైలులోనే ఉన్నారు. అయినా, తమిళనాడులో ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు.

కరుణానిధి కుటుంబం మాత్రమే మౌనంగా రోదిస్తున్నది. కనిమొళి అయినా, జగన్మోహనరెడ్డి అయినా ఎవరూ చట్టానికి అతీతులు కారు. జగన్ పార్టీ కార్యకర్తల ప్రవర్తన భవిష్యత్తులో జగన్‌కే నష్టం చేస్తుంది. తనకు ప్రజాబలం ఉందని చెప్పుకోవడానికి జగన్ తహతహలాడుతూ ఉండి ఉండవచ్చు. దర్యాప్తు సంస్థలు కానీ, న్యాయస్థానాలు కానీ ప్రజల్లో ఎవరికెంత బలం ఉందో బేరీజు వేసుకుని వ్యహరించవు. నేరం చేసి అరెస్ట్ అయ్యేవారు తమ వందిమాగధులతో హడావిడి చేసి గొడవలు సృష్టిస్తే చట్టాలు పని చేయకుండా ఉండవు.
అలా అయితే జేబుదొంగలు కూడా ఎంతో కొంత మందిని తమకు మద్దతుగా పోగేసుకు వస్తారు. తాను చట్టాలకు అతీతుడునని జగన్ నమ్ముతూ ఉండి ఉండవచ్చు. కానీ, చట్టాలు అలా భావించవు కదా! జగన్మోహన రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడు కావచ్చు. ఆయన వెనుక మందీ మార్బలం ఉండవచ్చు. అయితే, చట్టం ముందు అందరూ సమానులే! భవిష్యత్తులో అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి జగన్ ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చు. అయితే, జగన్ తప్పు చేసినట్టు నిరూపణ అయితే ఇటువంటి కుప్పిగంతులు ఏవీ ఆయనకు ఉపయోగపడవు.
- ఆర్కే

*-----------------------------------------------------------------------------------------------------

అడ్డగోల జగన్
అడ్డదిడ్డం వాదనతో అడ్డంగా దొరికెన్
గాలికి మేలు చేసింది చంద్రబాబేనట!
ఆంధ్రజ్యోతి మీడియాపై నిందలు

పాత జీవోతో ఎదురుదాడి యత్నం
అసలు 'మేళ్లు' ఆయన తండ్రి హయాంలోనే
బాబు సర్కారులో లీజుల పొడిగింపు
గాలికి ప్రాణం పోసింది రాజశేఖరుడే
2 నెలల్లో ముగిసే లీజు 13 ఏళ్లు పొడిగింపు
బ్రహ్మిణి పేరిట 270 ఎకరాలు ధారాదత్తం
హైదరాబాద్, నవంబర్ 4: భలే చెప్పావ్ బాసూ! రెండున్నర గంటలపాటు సీబీఐ అధికారుల సూటి ప్రశ్నలు ఎదుర్కొని... బయటికొచ్చాక సీబీఐనే ఇరుకున పెట్టినట్లుగా 'బోల్డ్ ఫేసు'! వినేవాళ్లుండాలే కానీ... మీ నోటికి అడ్డేముంది! వైఎస్ జగన్ చెప్పే 'విలువ'లకు అర్థమేముంది? 'పాత చింతకాయ పచ్చడి' జీవో పట్టుకొచ్చి ఓబుళాపురం కంపెనీకి చంద్రబాబే గనుల లీజు ఇచ్చారని... గాలి జనార్దన రెడ్డికి ఆయనే సహకరించారని జగన్ చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగితే సరిపోయేది! కానీ... 'ఎల్లో మీడియా'కు ఏమాత్రం జర్నలిజం విలువలున్నా చంద్రబాబును 'ఎక్స్‌పోజ్' చేయాలని పాత్రికేయ పాఠాలు చెప్పారు. 'ఆంధ్రజ్యోతి'నీ వేలెత్తి చూపారు. తద్వారా మహా తెలివితేటలు ప్రదర్శించాననుకుంటూ మురిసిపోతున్నారు. నిజానికి... తన పసలేని వాదనతో జగన్ అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఓబుళాపురం గనులకు సంబంధించి చంద్రబాబు వరకు మాత్రమే వచ్చి ఆగిపోయారు. ఆ తర్వాత తన తండ్రి హయాంలో జరిగిన అడ్డగోలు సంగతులను 'విస్మరించారు'.

'ఆంధ్రజ్యోతి'కి ఎవరినీ రక్షించాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓఎంసీకి సంబంధించి 2002లో చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో 'ఆంధ్రజ్యోతి' ఎన్నోసార్లు వివరించింది. వైఎస్ వచ్చాక గనుల మాటున జరిగిన ఘోరాలు అక్షరాలా విడమరిచి చెప్పింది. ఓబుళాపురం పుట్టు పూర్వోత్తరాలను చూస్తే... గాలి జనార్దన రెడ్డికి చంద్రబాబు ఏం చేశారో, వైఎస్ ఎన్ని 'మేళ్లు' చేసి పెట్టారో ఇట్టే అర్థమవుతుంది. 'కథ'ను జగన్ ఇంటర్వెల్ దాకా మాత్రమే చెప్పారు. విషయం ఎన్నో మలుపులు తిరిగింది 'సెకండ్ ఆఫ్'లోనే! అంటే... వైఎస్ హయాంలోనే! చూడండి మరి...

వైఎస్‌కు ముందు...
1984 డిసెంబర్ 14: అనంతపురం జిల్లా ఓబుళాపురంలో 64 ఎకరాల విస్తీర్ణంలోని ఇనుప ఖనిజం గనులను 20 ఏళ్ల కాలానికి జి.రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి లీజుగా ఇచ్చింది. అంటే... 2004 డిసెంబర్ 13తో ఈ గడువు ముగుస్తుంది. (నిజానికి... ఈ లీజు వ్యవహారం 1964 నుంచి నడుస్తోంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డికి 547.62 ఎకరాలను లీజుగా ఇచ్చింది. రామచంద్రారెడ్డి మరణం తర్వాత ఆయన చట్టబద్ధ వారసుడిగా రామ్మోహన్ రెడ్డి తెరమీదికి వచ్చారు. కోర్టు వివాదాల నేపథ్యంలో... హైకోర్టు ఆదేశాల మేరకు 64 ఎకరాలను మాత్రమే రామ్మోహన్ రెడ్డికి లీజుగా ఇచ్చారు. ఇది జరిగింది 1991లో. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది.)

1996 డిసెంబర్ 10: రామ్మోహన్ రెడ్డి పేరిట ఉన్న లీజును చంద్రబాబు ప్రభుత్వం రెన్యువల్ చేసింది. అదికూడా... 1984 నుంచి 20 ఏళ్లు ప్రాతిపదికగా తీసుకుంది. ఈ లీజు 1997 ఏప్రిల్ 26న 'ఎగ్జిక్యూట్' అయినప్పటికీ, గడువు మాత్రం 2004 డిసెంబర్ 13తో ముగుస్తుందని స్పష్టం చేసింది.

2001 జూన్ 23: తన పేరిట ఉన్న లీజును మెసర్స్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అనే భాగస్వామ్య సంస్థ పేరిట బదిలీ చేయాలని రామ్మోహన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత దీనిని ఆయనే ఉపసంహరించుకున్నారు. ఇది చంద్రబాబు హయాం.

2001 నవంబర్ 2: లీజును ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేయాలని రామ్మోహన్ రెడ్డి మరో దరఖాస్తు పెట్టుకున్నారు.

2002 ఫిబ్రవరి 2: రామ్మోహన్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీజు గడువులో మిగిలిన కాలానికి... అంటే 2004 డిసెంబర్ 13 వరకు మాత్రమే ఇది వర్తిస్తుందని జీవో నెంబర్ 80లో స్పష్టం చేసింది. ఈ జీవో వెలువడిన నాటికి ఓఎంసీకి, గాలి జనార్దన రెడ్డికి సంబంధం లేదు.

2002 మే 2: ఓఎంసీలో గాలి జనార్దన రెడ్డి భాగస్వామి అయ్యారు. చంద్రబాబు హయాంలో లీజు బదిలీ ద్వారా ఏదైనా మేలు జరిగిందనుకుంటే అది ఓఎంసీకే జరిగింది. కానీ... గాలి జనార్దన రెడ్డికి కాదు.

వైఎస్ హయాంలో...
2004 సెప్టెంబర్ 10: మరో రెండు నెలల్లో ముగియాల్సిన ఓఎంసీ లీజు గడువును వైఎస్ ప్రభుత్వం 2017 వరకు పొడిగించింది. 1984లో కుదుర్చుకున్న ఒప్పందం 1997 వరకు అమలు కాలేదని, అందువల్ల 1997ను ప్రాతిపదికగా చేసుకుని 20 ఏళ్లు లీజు ఇవ్వాలని ఓఎంసీ పెట్టుకున్న దరఖాస్తుపై సానుకూలంగా స్పందించింది. జీవో నెంబర్ 202 జారీ చేసింది. వెరసి... రెండునెలల్లో ముగియాల్సిన 'గాలి' కథను 13 ఏళ్లపాటు పొడిగించింది.

2007 జూలై 18: గాలి గనుల కంపెనీకి వైఎస్ సర్కారు ఒకే రోజు 270 ఎకరాల గనులు అప్పగించింది. జీవో నెంబర్ 151, 152 ద్వారా ఈ కేటాయింపు జరిపింది. సంబంధిత ఫైళ్లు అసాధారణ వేగంతో కదిలాయి. గుమాస్తా నుంచి మంత్రి దాకా అందరూ చకచకా సంతకాలు చేసేశారు. ఇది కూడా అడ్డగోలు కేటాయింపే. ఈ గనుల లీజు కోసం జి.సురేశ్ బాబు, సునీల్ ఎర్లా అనే వ్యక్తులు తొలుత దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వీరికే కేటాయించాలి. కానీ... సామ దాన దండోపాయాలను ఉపయోగించి వారిని పక్కకు తప్పించారు.

అసలు మోసం: కడప జిల్లాలో ఏర్పాటు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన బ్రహ్మణి స్టీల్స్ కోసమే ఖనిజాన్ని ఉపయోగించాలనే (క్యాప్టివ్ మైనింగ్) నిబంధన మేరకే ఓఎంసీకి 270 ఎకరాల గనులు కట్టబెట్టారు. నోట్‌ఫైల్‌లో ఉన్న ఈ నిబంధన... జీవోల దాకా వచ్చేసరికి మాయమైపోయింది. అదే సమయంలో ఇనుప ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో... ఓఎంసీ నుంచి, ఓఎంసీ ముసుగులో కర్ణాటక నుంచి తవ్వుకున్న ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకున్న 'గాలి' వేలకోట్లకు పడగలెత్తారు.

అది కాదు మ్యాటరు...
'దాచాలంటే దాగవులే అన్నట్లు' జగన్ ప్రస్తావించకుండా వదిలేసినంత మాత్రాన అసలు విషయాలు తెరమరుగు కావు.
- సీబీఐ దర్యాప్తు జరుపుతున్నది ఓబుళాపురం గనులకు ఎవరు లీజులు ఇచ్చారనే అంశంపై కాదు! ఓఎంసీ చేసిన అక్రమ తవ్వకాలు, దానికి ఎవరు సహకరించారు? అనేదే ఇక్కడ ముఖ్యం.
- ఒకవేళ జగన్ చెబుతున్నట్లుగా ఓఎంసీకి గనులు ఎవరు కేటాయించారన్నదే ముఖ్యమని భావించినా... కొత్తగా లీజులు ఇచ్చింది ఆయన తండ్రి వైఎస్ హయాంలోనే.
- వైఎస్ జమానాలో పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి, గనులశాఖ డైరెక్టర్ రాజగోపాల్, అటవీ శాఖ అధికారి శివశంకర్ రెడ్డి, అనంతపురం డీఎఫ్‌వో కల్లోల్ బిశ్వాస్ గాలి అక్రమాలకు పూర్తిస్థాయిలో సహకరించారనే ఆరోపణలున్నాయి.
- కర్ణాటక, ఆంధ్ర మధ్య సరిహద్దులను చెరిపేసి మరీ మైనింగ్ జరిపింది వైఎస్ హయాంలోనే.
- 'గాలి జనార్దన్ రెడ్డితో నాకేం సంబంధం' అని జగన్ ప్రశ్నించడం వింతలోకెల్లా వింత. ఎందుకంటే.. గాలి డైరెక్టర్‌గా ఉన్న ఓఎంసీలో సగం వాటా పొందిన రెడ్ గోల్డ్ ద్వారానే జగన్ మీడియాలోకి రూ.70 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇది జగన్ కూడా కాదనలేని వాస్తవం!
- గాలి జనార్దన రెడ్డి ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన బ్రహ్మణికి 10,700 ఎకరాలు, విమానావ్రయం కోసం 4 వేల ఎకరాలు కేటాయించింది ఎవరో కాదు! స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డే!
************************************************************************************************************

నీలేకని నివేదిక
- సంపాదకీయం

ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పునర్వ్యస్థీకరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పౌర సరఫరా వ్యవస్థ ప్రక్షాళనపై ఏర్పాటైన యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) చైర్మన్ నందన్ నీలేకని సార«థ్యంలోని టాస్క్‌ఫోర్స్ 'పీడీఎస్ సమస్యలకు ఐటీ పరిష్కారాలు' అన్న పేరుతో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. చౌక డిపోల వినియోగదారులు అవసరమైతే సబ్సిడీ ధరలపై సరుకులు తమకు నచ్చిన చోట, తమకు కావలసిన పరిమాణాల్లో కొనుగోలు చేయడం లేదా సబ్సిడీ మొత్తాన్ని నగదు రూపంలోనే తీసుకునే అవకాశం ఉండాలని ఆ నివేదిక సూచించింది.

బియ్యం లేదా నగదు రూపంలో ఏదైనా ఎంచుకోవచ్చన్న ప్రతిపాదన ప్రజా పంపిణీ వ్యవస్థను, అంతిమంగా చౌక బియ్యం పథకాన్ని రద్దు చేసేందుకు దారితీసే ప్రమాదముందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ అమలు చేయడం వల్ల దేశ ఆహార భద్రతకు విఘాతం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. మూడువేల ఐదువందల కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టు పీడీఎస్‌ను ఏ మేరకు సంస్కరిస్తుందో సందేహమే?

పేదలకు చౌక ధరలలో ఆహార పదార్ధాలను, ఆహారేతర నిత్యావసర వస్తువులను అందించే లక్ష్యంతో పీడీఎస్ వ్యవస్థను కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను ఉమ్మడిగా నియంత్రిస్తాయి. చౌక ధరల దుకాణాల(ఫెయిర్ ప్రైజ్ షాప్స్-ఎఫ్‌పీఎస్)ద్వారా ప్రజలకు నిత్యావసరాలు పంపీణీ చేసే అతి కీలకమైన వ్యవస్థ ఇది. ఈ దుకాణాలకు ఆహార ధాన్యాలను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి సరఫరా అవుతాయి. దేశంలో ప్రస్తుతం 4.99లక్షల ఎఫ్‌పీఎస్ షాపులున్నాయి. వీటి ద్వారా 18 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.

అత్యంత ప్రతిష్ఠాత్మమైన ఈ యంత్రాంగం కాలక్రమంలో అవినీతికి ఆలవాలంగా తయారైంది. పేదలకు, అన్నార్తులకు సర్కారు సరఫరా చేసే బియ్యం అత్యంత నాసిరకంగా ఉండటమే కాకుండా, వారి అవసరాలకు తగిన పరిమాణాన్ని అందచేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. మన దేశంలో ఒక మనిషి నెలకి కిలో ధాన్యాన్ని మాత్రమే వినియోగిస్తున్నాడని, పీడీఎస్ వ్యవస్థ ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై, పేదల్లోని అధిక సంఖ్యాకులకు దీని వల్ల లబ్ధి చేకూరడంలేదని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ధాన్యం సేకరణలో మిల్లర్లు, ప్రైవేటు దళారుల వ్యవస్థ నెలకొనడంతో మొత్తం పౌర సరఫరాల వ్యవస్థ అవినీతిమయంగా మారింది. పేదలకోసం సబ్సిడీ రేట్లకు అందిస్తున్న నిత్యావసరాలు బహిరంగ మార్కెట్‌కు తరలించి దొంగ వ్యాపారస్తులు రాజకీయనాయకుల అండతో కోట్లాది రూపాయలను స్వాహా చేశారు. పీడీఎస్ యంత్రాంగం నిర్వహణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా కాకుండా భారంగా చూడటం ప్రారంభించాయి. క్రమంగా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. స్వాతంత్య్రానంతరం దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సాగిన లైసెన్స్ రాజ్ వ్యవస్థ కారణంగా కుంటుపడిన ఆర్ధికాభివృద్ధిని పట్టాలెక్కించేందుకు మన పాలకులు ప్రపంచీకరణ చికిత్సకు పూనుకున్నారు.

భారత వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేయడంలో భాగంగా 1990ల నుంచి దశలవారీగా సరళీకరణ, ప్రైవేటీకరణల విధానాలను చేపట్టారు. అందులో భాగంగా పీడీ ఎస్ వ్యవస్థను, దానికి పునాది అయిన భారత ఆహార వ్యవస్థను నిర్వీర్య పరచే ప్రపంచ బ్యాంకు విధానాలను ప్రభుత్వాలు క్రమంగా అమలులోకి తీసుకొచ్చాయి. ప్రభుత్వ వ్యయం తగ్గించుకోవాలన్న ప్రపంచ బ్యాంకు ఆదేశాల్లో భాగంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే పీడీఎస్ వ్యవస్థ స్థానంలో లక్షిత పీడీఎస్ (టార్గెటెడ్ పీడీఎస్) వ్యవస్థను 1997లో కేంద్రం ప్రవేశపెట్టింది.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు (బీపీఎల్) మాత్రమే పీడీఎస్ ద్వారా చౌక ధరలకు నిత్యావసరాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక్కడి నుంచి దేశ ఆహార భద్రతకు ఇరుసుగా ఉండే పీడీఎస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే స్థాయికి చేరుకుంది. లక్షిత పీడిఎస్ పథకానికి బిపీఎల్ కుటుంబాల ఎంపికతో సహా ఇతర్రతా అనేక లోపాలను 2001లో స్వామినాథన్, మిశ్రాల నివేదిక నుంచి 2003లో హిర్వే, 2008లో ఖేరా 2011లో మహామాలిక్, సాహు తదితర నివేదికలు వెల్లడించాయి. రిటైల్ బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం చౌక డిపోల ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల ధరలను బహిరంగ మార్కెట్ ధరలకు సమానంగా పెంచుతూ పోయింది. లక్షిత పీడీఎస్ వ్యవస్థను కూడా ప్రభుత్వాలు సమర్ధవంతంగా నడపలేకపోవడంతో అదొక విఫల ప్రయోగంగా మారింది.

దేశ ఆహార భద్రతకు పీడీఎస్‌తో పాటు ఎఫ్‌సీఐ వ్యవస్థ కూడా ఒక మూలస్తంభం. ఎఫ్‌సీఐ వ్యవస్థ ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, పీడీఎస్ ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలను సర ఫరా చేసేందుకు అవసరమైన ఆహార ధాన్యాలను నిల్వ చేసే యంత్రాంగం మాత్రమే కాదు. అది బహిరంగ మార్కెట్‌లో ధరలను అదుపు చేసి అటు వినియోగదారులను, ఇటు రైతాంగానికి ఉపకరించే ఒక శక్తిమంతమైన యంత్రాగం కూడా.

రైతులకు గిట్టుబాటు (లాభసాటి) ధరలను అందించి, ప్రజలకు సరసమైన ధరలకు ధాన్యాన్ని అందించే నియంత్రణ వ్యవస్థ అది. దేశంలోని వ్యవసాయోత్పత్తుల మార్కెట్ సొంతం చేసుకునే లక్ష్యంతో బహుళ జాతి సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా ఎఫ్‌సిఐ యంత్రాంగాన్ని ప్రభుత్వం నిర్వీర్య పరచింది. వ్యవసాయోత్పత్తుల వాణిజ్యానికి ఉపకరించే విధంగా స్టాక్ మార్కెట్‌కు చెందిన ఫార్వార్డ్, ఫ్యూచర్ ట్రేడింగ్‌లను కూడా ప్రభుత్వం అనుమతించింది.

ఒకవైపు స్థానిక ధరలను నియంత్రించే ఎఫ్‌సీఐని నిర్వీర్యం చేసి ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని మిల్లర్లు, దళారులపరం చేయడం, మరోవైపు లోపభూయిష్టమైన లక్షిత పీడిఎస్‌ను ప్రవేశపెట్టి, ఎగుమతులకు అనుమతులివ్వడంతో ఆహార పదార్థాల ధరలు సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయాయి. మన గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున ఆరుశాతం రేటుతో వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రజల్లో అన్నార్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఆహార ధాన్యాలు ధరలు బాగా పెరిగిపోయాయి. దాంతో మన అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్న పప్పులు, నూనెల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఆహార భద్రత దేశానికి ప్రధాన సవాలుగా మారింది.

దేశంలో ఆహార భద్రత అంశం ఐదో పంచవర్ష ప్రణాళితోనే ముందుకొచ్చింది. వచ్చే మార్చితో 11వ పంచవర్ష ప్రణాళిక కాలం ముసుస్తున్నప్పటికీ ఈ పదేళ్ళలో ఆహారభద్రతపై కేంద్రం తీసుకున్న చర్యల్లేవు. దేశంలో వ్యవసాయరంగం విపరీతమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ దేశ ప్రజల అవసరాలకు మించి తిండి గింజల దిగుబడి ఉంది. ఎఫ్‌సీఐ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో తగినంత నిల్వ సామర్ధ్యం పెంచుకోక పోవడం వల్ల లక్షల టన్నుల కొద్దీ తిండి గింజలు ముక్కిపోతున్నాయి.

వాటిని పేదలకు, అన్నార్తులకు ఉచితంగా పంపిణీ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రం పట్టించుకోలేదు. కేంద్రం రూపొందించిన ఆహార భద్రత పథకం అమలుకోసం పీడీఎస్ వ్యవస్థ అవసరం. నీలేకని నివేదిక ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ పద్ధతిని అమలు చేయాలని సూచిస్తోంది.

రేషన్ కార్డులను కంప్యూటరీకరించడం, ఎక్కడైనా, ఎప్పుడైనా వినియోగదారుని అవసరం మేరకు చౌక డిపోలలో నిత్యావసరాలను కొనుగోలు చేయడం, వివిధ పథకాలను అనుసంధానం చేయడం ఆహ్వానించదగినదే. మెక్సికోలో విఫలమైన నగదు బదిలీ పథకాన్ని అమలుచేసి వివిధ సంక్షేమ రంగాలనుంచి ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తోంది. ఎఫ్‌సిఐ అనుసంధానంతో ఉన్న పటిష్టమైన ప్రజాపంపిణీ వ్యవస్థను ఐటీ పరిష్కారాలతో సమర్థంగా నడపడం ఆహార భద్రతకు గ్యారెంటీ.
***********************************************************************************************************
ఒక తెల్ల పావురం, ఒక ఎర్ర గులాబీ
నాగరికత కొత్త దారి వెతుక్కొంటోంది
బంకర్లలో చరిత్ర నిర్మితమౌతోంది
లోహ విహంగాలు నీడలు పడ్తున్నాయి
నీ తల పైన వేలాడే కత్తికి
నువ్విప్పుడు మోకరిల్లి
ప్రమాణాలు ఘటించాలి!

ఎడారి తుఫానులో ఒంటరి పావురం
ఒయాసిస్సు నిండా రక్తపు కలువలు
చూస్తున్న ప్రపంచం ఒక యుద్ధ కాండ.
రూపాలకు ముసుగులతో
స్వరూపాలు మార్చుకొని
నామ రూపాలు లేకుండా
ఒక్కోసారి కీకారణ్యాల్లో, ఇసుక దిబ్బల్లో, కొండ చరియల్లో
నడి సంద్రాల్లో, భూ గర్భాల్లో ...
పరుగు ఆగితే ప్రాణం వైతరణిలో చిక్కుకుంటుంది!
యమ పాశం పట్టుకొని నిల్చున్నవాడు
సామ్రాజ్య కాంక్ష అతడి తలపై కిరీటం

ఉక్కు పాదాలు, ఇనుప గొలుసులు, ముళ్ళ పంజరాలు,
మనిషికి స్వేచ్ఛ ఒక మందు పాతర.
వాడు పోతే వీడు
వీడు పోతే ఇంకొక్కడు
మనం పల్లకి మోసే బోరుూలం మాత్రమేనా?
చరిత్రలో మనకంటూ రెండు వాక్యాలు
మనదంటూ ఒక జెండా
తీరని కల... కల్పితం... కల్లోలం!

నెత్తురు అంటని నేలను ముద్దాడాలని ఉంది...
మన రాజ్యం మనకు ఎప్పుడు వస్తుంది?
యుద్ధం ఇంకా ముగియలేదు
ఆయుధం అంతరించి పోనూ లేదు
ఎక్కడో ఓ చోట నిమిషం క్రితం కూడా
బుల్లెట్‌ హృదయంతో మాట్లాడి ఉంటుంది
ఒక ఎర్రగులాబీ పుష్ప గుచ్ఛం నివాళిగా మారి
రాతి సమాధిపై నవ్వుతుంటుంది!

ఆర్తనాదం కూడా వినపడనట్టుగా
ఈ లోకం జీవిస్తూ, నటిస్తూ ఉంటుంది.
ఒక శకం ముగిసి...

gangadharనాలుగు దిక్కులు ఎరుపెక్కిన తర్వాత
మరణం అంచున మహోదయం
ఒక తెల్ల పావురం వాలడానికి
ఒక తెల్ల గులాబీ పూయడానికి
ఇప్పుడు కాసింత చోటు కావాలి!
నువ్వు నడిచే నేల
ఏదైనా కావచ్చు...

చివరాఖరికి
నువ్వో గుప్పెడు మట్టివై
కరిగిపోయిన కర్పూర దీపపై
మిగిలిపోతావు!

No comments:

Post a Comment