మళ్ళీ కళ్ళు తెరిచిన 'పుణ్యభూమీ కళ్ళుతెరూ'
- ఓల్గా
చరిత్రకున్నట్లే సాహిత్యానికి, సాహిత్య చరిత్రకు ఒక నిరంతరమైన కొనసాగింపు, అదే సమయంలో మార్పు ఉంటాయి. సాహిత్య చరిత్రలోకి వెళ్ళి కొంచెం పరిశీలనగా చూస్తే ఆ కొనసాగింపుల క్రమం గొప్ప రచయితల రచనల్లో చాలా ఆసక్తికరంగా కనపడుతుంది. 'పుణ్యభూమీ కళ్ళు తెరూ' నవల 1970లో బీనాదేవి రాశారు. దానిని ఇప్పుడు చదువుతుంటే ఎక్కడో, గత సాహిత్య చారిత్రక నేపథ్యంలోంచి మధురవాణి మాటలు వినపడతాయి.
గురజాడ రాసిన మధురవాణి మాటలు. తన గురించి, తన వృత్తి గురించి ఎంతో ఆత్మగౌరవం ప్రకటించిన మధురవాణి, ఆ కాలపు సంస్కర్తల ప్రభావం వల్ల 'మరోజన్మంటూ వుంటే' అంటూ ఇలా అంటుంది 'కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగమొక్కలకూ మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్ళన్నవారు ఉందురేమో'. మధురవాణి ఈ మాటలు 1909వ సంవత్సరంలోనివైతే 1970వ సంవత్సరం నాటికి ఒక కాపు మనిషిగా పుట్టిన రాజమ్మ 'పుణ్యభూమీ కళ్ళు తెరూ' నవలకు కథానాయకురాలయింది.
ఈ రాజమ్మ వంగ మొక్కలకూ మిరప మొక్కలకూ దోహదం చేసేంత సున్నితమైన పని కాకుండా అరచేతులు తెగిపోయేలా చెరుకు తోటలో ఆకు చుట్టటం దగ్గరి నుంచీ అన్ని రకాల శ్రమలూ చేసింది. తన కోసం తన భర్త కోసం, కొడుకు కోసం ఒళ్ళు విరుచుకుని పనిచేసింది. ప్రతిగా మధురవాణి ఆశించిన, కలగన్న 'తనవాళ్ళిచ్చే భద్రత' రాజమ్మకు దొరకలేదు. దొరక్కపోగా ఏ పని నీతి బాహ్యమని సంస్కర్తలు భావించి ఆ వృత్తి నిర్మూలనకు ఉద్యమాలు చేసి మధురవాణిని సైతం ప్రభావితం చేశారో, ఆ వేశ్యావృత్తిలోకి రాజమ్మ ఏ భద్రతా లేకుండా, ఏ శిక్షణా లేకుండా, ఏ రక్షణా లేకుండా గుండె రాయి చేసుకుని దిగింది.
గడచిన 60 ఏళ్ళలో వేశ్యావృత్తి లోనివారు కాపు మనుషుల్లా వ్యవసాయంలోకి కొందరు వచ్చి ఉండొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ నిష్పత్తిలో వ్యవసాయ కుటుంబాలలోని మనుషులు, వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులపాలై, భూమినుండి నెట్టివేయబడి గౌరవంగా బ్రతకటానికున్న అన్ని మార్గాలూ ఒకటొకటే మూసుకుపోతే వేశ్యావృత్తిలోకి దిగాల్సి వచ్చిన క్రమాన్ని రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక నేపథ్యంతో సహా పట్టుకుని చూపిన నవల బీనాదేవి 'పుణ్యభూమీ కళ్ళు తెరూ'! మధురవాణి రాజమ్మను చూసి భయపడుతుందో బాధపడుతుందో తెలియదు గానీ వ్యవసాయం మీద ఆధారపడి బతకాలని మాత్రం అనుకోదు.
సమాజంలో ఆడదానికి తనను తాను రక్షించుకునే సామర్ధ్యం లేనిదైతే ఎవరూ రక్షించరని రాజమ్మ జీవితం మనకు చెబుతుంది. వ్యక్తుల మంచితనాలు వ్యవస్థ ముందు వెలవెలబోతాయి. రాజమ్మ భర్త సింహాచలం కూడా వ్యవసాయం చేసే రోజుల్లో రాజమ్మంటే ప్రేమగానే ఉండేవాడు. పొలం పోయిన తర్వాత కూడా చాలాకాలం రాజమ్మ మీద అతను జాలి, దయ, ప్రేమ చూపగలిగిన మానసికస్థితిని నిలుపుకోగలిగాడు. కానీ వ్యవస్థ ఎంత క్రూరంగా ఉందంటే మనుషులు అమానుషంగా మారిపోవటానికి ఎంతో సమయం పట్టదు.
మొత్తం మీద వ్యవసాయం, షావుకార్లు, కోర్టులు, పోలీసులు రాజకీయ పార్టీలు అన్నీ కలిసి రాజమ్మను వేశ్యావృత్తిలోకి దింపిన క్రమమే ఈ నవలలోని కథ. దేశీయ పాములన్నీ కరిచినా కొన ఊపిరితో ఉన్న రాజమ్మను అంతర్జాతీయ పాము అమెరికా పౌరుడు జె.జె. రూపంలో వచ్చి కరిచింది. రాజమ్మను సెక్స్‌వర్కర్‌గా తన దగ్గరకు పిలిపించుకుని జె.జె. ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమ్మే చంపిందని పోలీసులామెను అరెస్టు చేసి జైలుకు పంపారు. న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష వేయటానికి సిద్ధంగా ఉంది. 1988లో హైదరాబాద్ మెహందీలో ఇదే సంఘటన జరిగింది. కాని స్త్రీల చైతన్యం అప్పటికి కాస్త పెరిగింది.
రాజమ్మ వంటి స్త్రీలు మనకు తారసపడితే మనం వాళ్ళను చూసి నీతీ, జాతీ లేని వాళ్ళని చీదరించుకుని తలలు తిప్పుకునే ముందు మనం రాజమ్మ అలా ఎందుకు మారిందో ఆలోచించాలని 'పుణ్యభూమీ కళ్ళు తెరూ' హెచ్చరిస్తుంది. రాజమ్మను అలా మార్చిన గవర్రాజు లాంటి ఛోటాలీడర్ల గురించి, సురేంద్ర లాంటి షావుకార్ల గురించి, ఆచారి లాంటి దౌర్భాగ్యుల గురించీ, జె.జె అతని స్నేహితుడు వంటి పాపిష్టి విదేశీయుల గురించీ, పోలీసుల గురించీ - అన్నిటికంటే ముఖ్యం ఆకలి, జబ్బులు, అవిటితనాల గురించీ తెలుసుకోవాలని 'పుణ్యభూమీ కళ్ళుతెరూ' నవల చెబుతుంది.
వీళ్ళంతా ఇలా ఉండటానికీ, ఆకలి మనుషుల మీద క్రూరంగా దాడి చేయటానికి కారణం డబ్బు అని ఆ నవల ఎలుగెత్తి చెబుతుంది. నవలలో అనేకచోట్ల డబ్బు మానవీయ విలువలను ధ్వంసం చేస్తున్న తీరు మనకి అర్థమవుతుంది. అలా అర్థం చేయించటమే ఈ నవల ప్రయోజనం. ఐతే 1970 నుంచి 2011 వరకూ ఈ నలభై సంవత్సరాలలోనూ దేశం ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ రాజమ్మలు తయారుచేయబడుతున్నారు. డబ్బు మనిషిని దారుణంగా హత్య చేసేసింది. ప్రభుత్వం వారే ఎంతో శ్రమకోర్చి ఖర్చుపెట్టి తయారుచేస్తున్న గణాంకాలలో ట్రాఫికింగ్ పెరుగుతున్న తీరు చూస్తే దేశం వెలిగిపోతున్న తీరు అర్థమవుతుంది.
కథకు చిన్న పాయింటే ఉంటే చాలు గానీ నవలకు ప్లాటే ఉండాలి. ఆ ప్లాట్‌ని రచయితలు ఎలా అల్లుకుంటూ ఎలా విప్పుకుంటూ వెళ్తారో అదే ఆ నవలా శిల్పం. రాజమ్మ వ్యవసాయం నుండి వ్యభిచారం వైపు వెళ్ళటమే ఈ నవల ప్లాట్. దానిని అల్లేటపుడు సామాజిక వ్యవస్థలోని వివిధ అంగాలనూ చూపి రాజమ్మ జీవితాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నడిపించిన శక్తులను బీనాదేవి చిత్రచిత్రాలుగా చూపించారు. రాజమ్మకు ఈ నవలలోని చాలా పాత్రలు తెలియవు.
వాళ్ళ గురించి రాజమ్మకు ఏమీ తెలియకుండానే రాజమ్మ జీవితాన్ని వాళ్ళు ప్రభావితం చేయగలిగారు. లాయర్లు వెంకట్రావు, పురుషోత్తం, అసిస్టెంటు విమల - వీళ్ళ పేర్లు కూడా రాజమ్మకు తెలిసే భూమి నుంచి నెట్టివేయటంలో వీళ్ళ దుర్మార్గపు పాత్ర గురించి అంతగా తెలియదు. రాజమ్మకసలేమీ తెలియదు. కథలో ముఖ్యపాత్ర జీవితంలో పెద్ద మార్పులకు కారణమైన అసలు పాత్రలతోటి ఎపుడూ తలపడలేదు. ఇది రచయితలు సామాన్యంగా అనుసరించే నవలా శిల్పం కాదు.
అరుదైన కథన పద్ధతి. ఇలా చెయ్యటం వల్ల ఈ డబ్బు నడిపించే సామాజిక మహాయంత్రంలోని ఏ ఒక్క భాగం గురించీ ఏ మాత్రం తెలియకుండా, ఆ యంత్ర రాక్షసి కోరలకు అమాయకులు ఎలా చిక్కుతున్నారో నవల చదివేవారికి అర్థమవుతుంది. మన జీవితాన్ని ఎవరు ఎక్కడి నుండి శాసిస్తున్నారో తెలిస్తే ఆ శాసనానికి ఎదురు తిరగాలనే కోరిక పుడుతుంది.
కానీ ఈ సామాజిక గజిబిజి అల్లిక రోజురోజుకీ ఎంతో సంక్లిష్టంగా తయారవుతోంది. మనల్ని శాసించి నియంత్రించే రాజకీయ శక్తులేమిటో, అవి ఎక్కడనుంచి పనిచేస్తున్నాయో, వాటి ప్రాణాలు ఏ సముద్రాల అవతల మర్రిచెట్టు గూటిలోని చిలకలో ఉన్నాయో తెలుసుకోవడం మేధావులకే అసాధ్యంగా ఉంది. అంత అసాధ్యపు పని రాజమ్మ చేయలేకపోవచ్చు. అందువల్లనే రాజమ్మకు ఎదురు తిరగాలనే తలపే కలగలేదు.
నిజానికి ఆ కోరిక రాజమ్మలో కంటే పాఠకులలో పుడితే మరింతగా సాహిత్య ప్రయోజనమూ, సామాజిక ప్రయోజనమూ కూడా నెరవేరుతుంది. అందువల్లనే కథానాయిక రాజమ్మ కత్తిపట్టుకు ఎదురుతిరగకుండా తనను సాధ్యమైనంత త్వరగా ఉరితియ్యమని వేడుకుంటుంది. అది చదివిన పాఠకులకు ఏదో ఒక ఆయుధంతో రాజమ్మలను రక్షించాలనే కోరిక పుడుతుంది. ఆ ప్రయోజనం కోసమే బీనాదేవి కథను, కథన పద్ధతిని ప్రత్యేకంగా ఎంచుకుని నడిపించారు.
రాజమ్మకు తెలియకుండా రాజమ్మ జీవితాన్ని నడిపిన అదృశ్య అమానుష శక్తులను రాజమ్మ చుట్టూ అల్లటంలోనే, ఆ అల్లికనొక క్రమంలో పాఠకులకు పరిచయం చెయ్యటంలోనే రచయితగా బీనాదేవి ప్రతిభ ఉంది. ఈ మిగిలిన పాత్రలలో ఏ ఒక్కటీ కనీసపు మానవత్వంతో ఉన్నా రాజమ్మ జీవితం ఇంత దారుణంగా ఉండేది కాదు. కానీ అలా ఉండటం వాళ్ళ చేతుల్లో కూడా లేదు. మహా భీకరమైన రాక్షస వ్యవస్థ ఒకటి నడుస్తోంది. దాని విశ్వరూపాన్ని రేఖా మాత్రంగా పరిచయం చేసి మన ఊహకు వదిలేశారు బీనాదేవి.
ఇవాళ రేపూ పేపర్లలో దగా కంపెనీల గురించిన వార్తలు వస్తుంటే కొ.కు నవల 'వారసత్వం'లో రామదాసు పాత్ర గుర్తొచ్చినట్టు 'పుణ్యభూమీ కళ్ళు తెరూ' నవల చదువుతుంటే గిట్టుబాటు ధరలేక, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరూ గుర్తొస్తారు. సింహాచలం, రాజమ్మలు ఆత్మహత్య చేసుకుని ఒక్కసారిగా చనిపోయే అదృష్టానికి కూడా దూరమయ్యారు. క్షణం క్షణం చస్తూ బతికారు.
వ్యవసాయాన్ని అలాంటి స్థితిలోకి నెట్టిన వ్యవస్థ దుర్మార్గం పాఠకులకు తేటతెల్లమవుతుంది. షావుకార్లకు తోడు ఇపుడు బ్యాంకులు, మైక్రో క్రెడిట్‌లు కూడా తోడయ్యాయి. ఈ నవలలో జె.జె. అనే అమెరికన్ పాత్ర అవసరమా అనే సందేహం వస్తుంది. బహుశా అది నిజంగా జరిగిన సంఘటన కావొచ్చు. కానీ తరచుగా జరిగేది కాదు. అలాంటి పాత్రను సింబాలిక్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇందులో జె.జె తన తమ్ముడికి అన్యాయం చేసి, పాపం చేశాననే భావంతో మనశ్శాంతి కోసం ఇండియా వస్తాడు.
ఇరాక్, అప్ఘానిస్తాన్‌లలో తాము చేసిన పాపాలను ఇంకో బడుగుదేశానికి 'సాయం' చేసి కడుక్కుందామనుకునే అమెరికా లాగానే - అలాగే మన వ్యవసాయ సంక్షోభపు తీవ్రత, అమెరికన్ మార్కెట్ ఎకానమీ తీరు తెన్నులపై ఆధారపడి కొనసాగిన తీరు కూడా ఈ పాత్ర అనే మిషతో బీనాదేవి చెప్పినట్లు అనిపిస్తుంది. అగ్రరాజ్యాల పాపిష్టి విధానాల ప్రభావం అంతిమంగా పడేది మన దేశం వంటి దేశాలలోని నిరుపేద స్త్రీల మీదనే..
రాజమ్మకు జె.జె. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో, చేసుకోబోయే ముందు తననెందుకు పిల్చాడో, సాయం చేస్తున్నాననుకుని డాలర్లు, పౌడర్లు ఇతర విదేశీ సామగ్రి ఎందుకిచ్చాడో ఏమీ తెలియదు. కానీ జె.జె.ని హత్య చేసిందనే అభియోగంతో జైల్లో ఉరిశిక్ష అమలుకోసం ఎదురుచూస్తూ ఉంది. మరో అమెరికన్ 'ఎంటర్ ప్రెన్సూర్ రైటర్' ఆమె జీవిత కథ రాసి బెస్ట్ సెల్లర్‌గా చేసి డబ్బు సంపాదించాలని వచ్చాడు. ముందే చెప్పినట్టు ప్లాట్ చాలా పకడ్బందీగా పురోగమించి నవల ముగింపు సమయానికి అన్ని పాయలూ కలిసిన నది సాగరసంగమం చేసినట్లుగా అనిపిస్తుంది.
ఇక 70లలో రాసిన 'బీనాదేవి' జండర్ పరంగా ఎలాంటి సెన్సిటివ్‌నెస్‌తో ఉన్నారనేది ఇవాళ్టి విమర్శకులు అంచనా వేయక తప్పదు. రాజమ్మలాంటి పేద స్త్రీని కథానాయికగా తీసుకోవటంలోనే బీనాదేవి వర్గస్పృహను, జండర్ స్పృహను గమనించవచ్చు. ఈ కథకు సింహాచలాన్ని కథానాయకుడిగా చేసేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. నిజానికి రాజమ్మకున్న మనోధైర్యం కూడా లేక సింహాచలం చిత్రహింసలనుభవించాడు. ఒక నిరుపేద రైతుగా, రిక్షా కార్మికుడిగా ఈ నవలకు కథానాయకుడు సింహాచలం అని చెప్పుకునేలా చేసేందుకు రచయితకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. కానీ రచయిత అలా చెయ్యలేదు.
దోపిడీకి పీడనకు గురయ్యే పురుషుడికి కూడా తాను దోపిడీ చేయటానికి స్త్రీల శ్రమ ఉంటుంది, పీడించటానికి స్త్రీలుంటారు- భార్యలుగా, తల్లులుగా, సెక్స్‌వర్కర్లుగా - ఒక నిరుపేద రైతు భార్య, ఒక బిడ్డకు తల్లీ అయిన రాజమ్మ సెక్స్ వర్కర్ అయితేగాని, తన భార్యత్వాన్ని, మాతృత్వాన్ని నిర్వహించలేకపోయింది. కాబట్టి ఈ పుణ్యభూమిలో ఈ కర్మ భూమిలో రాజమ్మే కథానాయిక. రాజమ్మల వెన్నెముకల మీదనే అంతిమంగా ఈ వ్యవస్థ నిలబడింది.
బీనాదేవిలో ఈ చూపు ఉండడం వల్లనే సింహాచలం పాత్ర నాయకుడిగా కాక ప్రతి నాయకుడిగా మారి (అలా మారటం అతని అపరాధమని రచయిత చెప్పలేదు. వ్యవస్థనే విప్పి చూపారు) రాజమ్మ పుణ్యభూమికి ప్రతినిధి అయింది. రాజమ్మ అందం, వయసు కారణంగా ఎన్నో పరీక్షలెదురయ్యాయి. అన్నిసార్లూ రాజమ్మ ఆత్మగౌరవం కాపాడుకుంది. రాజమ్మ చివరకు తను పనిమనిషిగా ఉన్న ఇంటి యజమాని ప్రిన్సిపాల్ రంగరాజుకి లొంగిపోతుంది. అతనంటే రాజమ్మకు జాలి. అతని పిల్లలను తన పిల్లాడి కంటే ఎక్కువ సాకింది. అతను ఒక విషాదంలో ఉన్నపుడు రాజమ్మ అతన్ని కాదనలేకపోయింది.
ఆ సంగతి బీనాదేవి చాలా గొప్పగా రాశారు. 'లైటు ఆర్పుతూ 'వద్దనకు రాజమ్మా' రంగరాజు గారు అన్నారు. మొదటిసారి పిల్లాడికిచ్చిన పాలు - అమ్మ చచ్చిపోవటం, వీపు మీద ఇనపకొరడా చెళ్ళుమంది. కలలో కనిపించిన దేముడు - తన కాళ్ళకిందే ఊబి అయిన భూమి... వద్దనలేదు రాజమ్మ. వద్దనలేకపోయింది ఆమె. ఆమెకు - తనలో తల్లి అప్పుడే నిద్రలేచినట్టు అనిపించింది'. తనపట్ల దయగా ప్రవర్తించిన రంగరాజు కోరికను ఒక తల్లిలా తీర్చిందని చెప్పి రాజమ్మ పాత్రను పాజిటివ్‌గా గ్లోరిఫై చేసిన బీనాదేవి గారికి నమస్కారాలు చెప్పకుండా ఉండలేం.
ఇందులో వీరాచారి అనే స్త్రీ ద్వేషి పాత్ర కూడా ఉంది. సమాజంలో స్త్రీల గురించి ఎలాంటి నీచమైన ఆలోచనలున్నాయో చెప్పటానికే సృష్టించారా పాత్రను. "బాబోయ్ ఇలా అనుకుంటారా ఆడవాళ్ళ గురించి'' అనిపిస్తుంది. పూర్తి నెగిటివ్ పాత్ర చేత మాట్లాడించిన ఈ మాటలు రచయిత టోన్‌లో, దృక్పథంలో భాగం కావు. సమాజం స్త్రీల విషయంలో ఎంత దుర్మార్గపు, పాపిష్టి ఆలోచనలు చేస్తుందో చెప్తాయంతే - ఈ నవలలో రచయితకు రెండు పరీక్షా సమయాలొచ్చాయి. ఒకటి లాయర్ విమల. రెండు ప్రిన్సిపాల్ భార్య విజయ. విమల మగవాళ్ళ బలహీనతలతో ఆడుకోవటాన్ని తన సరదాగా చేసుకుంది.
ఐతే రచయిత ఆ పాత్ర మీద జడ్జిమెంట్ ఇచ్చే పనిచెయ్యకుండా పరీక్ష పాసయ్యారు. విజయ 'సొసైటీ లేడీ' అని సమాజం పిల్చే పనులు చేస్తుంది. ఆమె వ్యాపకాలు, సరదాలు, షికార్ల గురించి రచయిత నిష్కర్షగానే తన అయిష్టాన్ని ప్రకటిస్తారు. ఆమె జీవనశైలి వల్ల భర్త వల్ల కాదు మరొకరి ద్వారా గర్భవతి అవుతుంది. అది బైటపడితే తట్టుకోలేని బలహీనురాలు కావటం వల్ల చచ్చిపోతుంది. ప్రిన్సిపాల్‌కి విజయ మీద సహజంగానే కోపం వస్తుంది.
తన బాధంతా ఓ స్నేహితుడితో పంచుకుంటాడు. 'ఈ జన్మలో మరి ఆడదాన్ని నమ్మలేను' అంటాడు. ఆ స్నేహితుడు 'దేముడు లేడన్నవాడికే ఒక్కో క్షణం ఎక్కడ లేని నమ్మకం పుట్టుకొస్తుంది. నువ్వు మాత్రం తొందరపడి విజయ గురించి తీర్పు చెప్పకు' అంటాడు. బీనాదేవి జండర్ స్పృహ ఉన్న రచయితగా ఫస్టు క్లాసులో పాసయ్యారు. ఆఖరికి బ్రోతల్ హవుస్ నడిపే నరసు పాత్ర మీద కూడా అనవసరమైన వ్యాఖ్యానాలు లేకపోగా ఆమె నేపధ్యం వివరించి వదిలేశారు.
కులపరంగా చూస్తే సింహాచలం, రాజమ్మలు బిసిలకు చెందినవారిగా అనిపిస్తారు. కాకపోతే రచయితది ప్రధానంగా వర్గస్పృహ. వర్గ చైతన్యంతో రాసిన నవల ఇది. దోపిడీ వర్గపోరాటం వల్లనే పోతుందనే దృష్టి కూడా రచయిత కుందనీ, వర్గ పోరాటంలో సాయుధ పోరాటం తప్పదనే సిద్ధాంతంపై కూడా రచయితకు నమ్మకముందని చివరి మాట వల్ల తెలుస్తోంది.
బీనాదేవి గారంటే ఉపమానాలు, ఉపమ కాళిదాసస్య అంటారు. కాళిదాసే స్వయంగా ఒప్పుకుంటాడు ఉపమాలంకారం వాడటంలో బీనాదేవిని మించిన వాళ్ళు లేరని. అలంకారాలని మామూలుగా పాత్రల పరిచయానికి వాడతారు. ముఖ్యంగా తెలిసిన ప్రకృతితో మనకు తెలియని పాత్రలు పరిచయం చేస్తారు. ఆ పాత్ర స్వరూపాన్ని, కొంచెంగా స్వభావాన్ని మనకు అర్థం చేయించేందుకు రచయితలు అలంకారాలను ముఖ్యంగా ఉపమాలంకారాన్ని వాడతారు. బీనాదేవి ఆ పరిమితిని దాటి నేపథ్యాన్నీ, ఒక మూడ్‌నీ సృష్టించేందుకు ఎక్కువగా ఉపమాలంకారం వాడతారు.
చుట్టూ ఉన్న వాతావరణ వర్ణనతో పాఠకులలో ఒక మూడ్ ఏర్పరిచి జరగబోయే సంఘటనకు వారిని సంసిద్ధులను చేయటానికి ఈ వర్ణనలు ఉపయోగపడతాయి. చాలాసార్లు పాఠకుల ఊహాశక్తిని పెంచేలా అలంకారాలు వాడటం బీనాదేవి ప్రత్యేకత. 'పండినదంతా కోసుకోగలిగిన మనిషి మొహంలా ఆమె మొహం సంతుష్టిగా ఉంది-' ఈ ఉపమాలంకారంలో పోల్చిన పోలిక, ఆమె ముఖమూ రెండూ పాఠకుడు ఊహించుకోవాల్సిందే. పండినదంతా కోసుకోగలిగిన మనిషి మొహాన్ని కూడా పాఠకులు ఊహించుకోవలసిందే - ఇలాంటి వర్ణనల వల్ల పాఠకులకు విసుగురాదు. ఒక ఉత్సాహం వస్తుంది.
భౌతికమైన వాటిని కాకుండా మానసికమైన ఫీలింగ్స్‌ని వర్ణించటం కూడా చాలా అద్భుతంగా చేస్తారు. చిన్న రాజమ్మకు పేదరికంలో మగ్గుతున్న పదిహేనేళ్ళ రాజమ్మకు పనిచేయించుకున్న బుగత అనుకోకుండా ఆరణాలు ఇస్తాడు. ఆ ఆరణాలు ఏం చెయ్యాలని చాలా ఆలోచనలు చేస్తుందా పిల్ల. అందులో ఒక అందమైన ఆలోచన "ఈ ఆరణాలు అమ్మకి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. పాల సముద్రంలోంచి దేవుడు లేచి చిరునవ్వు నవ్వినట్టుంటుంది.''
'చేతకానివాడి నిర్లక్ష్యంలా నవ్వినట్టుంటుంది' 'జబ్బుకు సగం లొంగిపోతున్న ఆరోగ్యవంతుడిలా ఉంటాడు గానీ ఆరోగ్యం కోలుకుంటున్న రోగిలా ఉండడు'. మనిషిని వర్ణించాల్సినపుడు కూడా వాస్తవంగా ఉంటూనే ఆ వాస్తవంలో ఒక మెరుపు మెరిపిస్తారు.
'ఆ రాత్రి దువ్వని జుట్టుతో, గుండీలు లేని చొక్కాతో, వెలిగించని బీడీతో'' ఇంతవరకూ విశేషం ఏమీలేదు - కానీ 'కళ్ళల్లో ఖూనీ పెట్టుకుని బయల్దేరడం గవర్రాజు' అనేసరికి ఒక మెరుపు మెరిసినట్లవుతుంది. వర్ణనలు, అలంకారాలు సామాన్యంగా సౌందర్యాన్ని, ప్రకృతిని ఉద్దేశించి భావుకతతో చేస్తారు. కానీ బీనాదేవి ఏ విషయాన్నయినా వర్ణనాత్మకంగా అలంకారాలు ప్రయోగిస్తూ చెప్పేస్తారు. 'గుమస్తాలు స్వాతంత్య్రం వద్దనే మంచి బానిసల్లా పట్టుదలతో పనిచేస్తున్నారు'.
'పాముకి పొరవచ్చినట్టు గవర్రాజుకి అతి సహజంగా మున్సిపల్ సభ్యత్వం ఇంకేవో పదవులు, ఇతర పేర్లమీద కాంట్రాక్టులు వచ్చాయి.' కొన్ని స్టేట్‌మెంట్స్ తిరుగులేని విధంగా చేయటం కూడా బీనాదేవి ప్రత్యేకత. "రాజకీయాల్లోకి దిగినవాడికి ప్రజలంతా ఒకటి కాదు'' ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో ఉంటాయి నవలనిండా. ఈ అలంకారాలు, వ్యాఖ్యలు నవలకు రాకెట్ లాంఛింగ్ ప్యాడ్‌లా ఉపయోగపడుతూ ఎప్పటికప్పుడు నవల స్థాయిని పెంచుతూ పోతాయి. చాలాకాలం నుంచీ పాఠకులకు అందుబాటులో లేని ఈ నవల మనసు ఫౌండేషన్ వారి పుణ్యమా అని బీనాదేవి సమగ్ర సాహిత్యంలో మరొకసారి కళ్ళు తెరిచింది.

*************************************************************************************************************
జి-20 నిర్ణయాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధికంగా కనుపించే ఈ గుప్త ధనం సమస్యను నివారించడం ద్వారా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి పథంలో దూసుకు పోవడానికి ఆస్కారం కలుగుతుంది. భారత్ కూడా ఈ ఒప్పందం పై సంతకం చేసిన దేశాలలో ఒకటి. ప్రతిపక్ష పార్టీలు నల్ల ధనాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుని దానిని వెనక్కిరప్పించాలని గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో యుపిఎ ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తన నిబద్ధతను చాటుకునే ప్రయత్నం చేయడం ఒక శుభ పరిణామం. అయితే ఇది సంతకాలకే పరిమితం కాకుండా చర్యలకు మార్గం సుగమం చేస్తే దేశానికి కలిగే మేలు అంతా ఇంతా కాదనేది చెప్పనవసరం లేదు.
యూరోజోన్ సంక్షోభం నడుమ ప్రారంభమైన జి-20 దేశాల సదస్సు ఆశించిన స్థాయిలో ఎటువంటి నిర్ణయాలనూ తీసుకోకుండానే ముగిసిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను పునఃసంతులనం చేసేందుకు, వృద్ధిని ప్రోత్సహించేందుకు సంకల్పం చెప్పుకున్నదే తప్ప అందుకు నిర్దిష్టంగా ఏమి చేయనున్నదో మాత్రం స్పష్టంగా ప్రకటించలేకపోవడం గమనార్హం. యూరోజోన్ రుణ సంక్షోభమే సదస్సు లో ప్రధాన అంశంగా ఉన్నప్పటికీ, ఐరోపాను, యూరోను కాపాడేందుకు పోరాటం చేస్తామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ ప్రకటన మినహా అందుకు ఎటువంటి విధి విధానాలను సూచించకపోవడం మూల సమస్యను స్పృశించడానికి అభివృద్ధి చెందిన దేశాలు ఇష్టపడడం లేదనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
రుణ సంక్షోభంలో చిక్కుకున్న గ్రీసులో పొదుపు పేరిట ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, యూరో దేశాలు సూచించిన సంక్షోభ పరిష్కార పథకంపై ఆ దేశ ప్రధాని పపెండ్రూ దానిపై రిఫరెండం నిర్వహిస్తానని చేసిన ప్రకటనతో రాజకీయ పార్టీల ఆగ్రహానికి గురయ్యి పార్లమెంటులో విశ్వాసపరీక్షకు నిలబడడం వరుసగా జరిగిపోయాయి. రాజకీయపార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకతకు వెరచి రెఫరెండం ప్రతిపాదనను విరమించుకున్నా ఆయన పార్టీ నుంచి కొందరు ఎంపీలు గోడ దూకడంతో పార్లమెంటులో ఆయన తన బలాన్ని నిరూపించుకోవలసి వచ్చింది.
పపెండ్రూఈ పరీక్షను నెగ్గకపోతే ప్రభుత్వం కూలిపోయి గ్రీసు సంక్షోభం పొరుగు దేశాలకు వ్యాపించే అవకాశం ఉండడంతో జి-20 సదస్సులో పాల్గొన్న యూరోజోన్ దేశాధినేతలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అంతిమంగా పపెండ్రూ విశ్వాస పరీక్షను నెగ్గడంతో ప్రభుత్వానికి, బెయిల్ అవుట్ ప్రణాళికకు ముప్పు తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు.అంతర్జాతీయ విత్త నిధికి (ఐఎంఎఫ్) అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చి దానికి మద్దతునివ్వాలనే తీర్మానంతోనే యూరో జోన్ నాయకులు సరిపెట్టుకోవలసి వచ్చింది.
గ్రీసుకు బెయిల్ అవుట్ ఇచ్చిన కారణంగా తమ ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతిన్న నేపథ్యంలోనూ, ఐర్లాండ్, పోర్చుగల్, అమెరికా, ఇతర మిత్ర దేశాలు తమ తమ సమస్యలతో కునారిల్లుతున్న నేపథ్యం లో రుణ సంక్షోభం ఇటలీ, స్పెయిన్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలకు వ్యాపిం చకుండా ఉండేందుకు యూరోజోన్ దేశాలు ఐఎంఎఫ్ సహాయం కోసం చూ స్తున్నాయి. మొత్తం 17 దేశాలు కలిగిన యూరోజోన్‌లో సంభవించిన ఈ రుణ సంక్షోభం ప్రపం చ ఆర్థిక వ్యవస్థను మరో మాం ద్యంలోకి నెట్టే ముప్పును సూచించడంతో అవి వణికిపోతున్నాయి.
ముఖ్యంగా యూరోజోన్‌లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇటలీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు యూరో జోన్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నది వాస్తవం. అందుకే తమ దేశంలో ఆర్థిక సంస్కరణలను పర్యవేక్షించేందుకు ఐఎంఎఫ్‌ను ఇటలీ ఆ హ్వానించడాన్ని వారు హార్దికంగా స్వాగతించారు. ఐఎంఎఫ్ అడుగు పెట్టిన చోట ప్రజాసంక్షేమం మటుమాయమై మార్కెట్‌కు బాటలు ఏర్పడతాయనే విషయం పదే పదే రుజువైనదే అయినప్పటికీ వారు దానినే ఎంచుకోవడం సంక్షేమంకన్నా మార్కెట్లపై వారికున్న మోజునే బయటపెడుతున్నది.
అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి మూలకారణమైన పెట్టుబడిదారీ విధానాలను వదులుకునేందుకు అవి ఇష్టపడడం లేదనే విషయాన్ని స్పష్టం చేయడం మినహా జి-20 కాన్స్ సదస్సు సాధించింది ఏమీ లేదన్నది వాస్త వం. విచ్చలవిడి పెట్టుబడి దారీ విధానాలే ఆర్థిక మాంద్యానికి కారణమై, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని బ్యాంకింగ్ వ్యవస్థలను బెయిల్ ఔట్ చేస్తే తప్ప బయటపడని పరిస్థితులను అభివృద్ధి చెందిన దేశాలు చూసినప్పటికీ ఆ మార్గం నుంచి ఇసుమంతైనా పక్కకు మళ్ళేందుకు ఆసక్తి చూపకపోవ డం విచిత్రం. మార్కెట్ నిర్ణయిం చే మారక రేట్ల వ్యవస్థ వైపుగా శరవేగంగా దూసుకు వెళ్ళేందు కు విదేశీ మారక విధానంపై ఒక ఒప్పందానికి జి- 20 దేశాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే చైనా తన మారక రేటును సరళీకరించేందుకు అంగీకరించడాన్ని అమెరికా హర్షించింది. ఇందులో అమెరికా స్వార్థమే కనుపిస్తుంది తప్ప ఇతర ఆర్థిక వ్యవస్థల మేలు, సంక్షేమం కానరావడం లేదు. తనకు - చైనా మధ్య ఉన్న వాణిజ్యంలోని అసమతుల్యత దీనితో తగ్గించుకోవచ్చన్నది అమెరికా ఆకాంక్ష. దేశీయ కరెన్సీ బాండ్ మార్కెట్లను వృద్ధి చేసేందుకు, అంతర్జాతీయ వ్యవస్థ నుంచి సాంకేతిక సహాయాన్ని పెంచేందుకు, డాటా బేస్‌ను మెరుగు పరచి ప్రో గ్రెస్ రిపోర్ట్‌లను తయారు చేయాలన్న నిర్ణయాన్ని కూడా జి-20 సదస్సు తీసుకున్నది. ఆర్థిక స్థిరత్వం, నికర వృద్ధిని సాధించడంలో వ చ్చే సమస్యలను నివారించే, నియంత్రించే లక్ష్యంతో పెట్టుబడుల రాకను నిర్వహించేందుకు మార్గదర్శకాలు రూపొందించేందుకు కూడా జి- 20 దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.
కాన్స్ సదస్సులో ప్రముఖంగా తీసుకున్న నిర్ణయాలలో విత్త నిర్వహణకు సంబంధించిన ఒప్పందం కీలకమైనది. నియంత్రణలను బలోపే తం చేయడమే కాకుండా గుప్త ధనానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి నిబంధనలను అనుసరించాలన్న జి-20 సదస్సు నిర్ణయం భారత్‌కు ఎంతో మేలు చేసేది. పన్నుల ఎగవేత దారులకు సంబంధించిన మోసాలతో సహకరిస్తే చర్యలు తీసుకుంటామంటూ సదస్సు హెచ్చరించడం ఒక మేలిమలుపు. తద్వారా మనీలాండరింగ్‌ను, తీవ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని నివారించవచ్చన్న అధినేతల మాటలలో ఎంతైనా వాస్తవముంది. ప్రపంచ ఉత్పత్తిలో 85 శాతం వాటా కలిగిన జి-20 దేశాల నుంచి ఈ దిశగా అడుగు పడడం ఆహ్వానించవలసిన పరిణామం.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధికంగా కనుపించే ఈ గుప్త ధనం సమస్యను నివారించడం ద్వారా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి పథంలో దూసుకుపోవడానికి ఆస్కారం కలుగుతుంది. భారత్ కూడా ఈ ఒప్పందం పై సంతకం చేసిన దేశాలలో ఒకటి. ప్రతిపక్ష పార్టీలు నల్ల ధనాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుని దానిని వెనక్కిరప్పించాలని గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో యుపిఎ ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తన నిబద్ధతను చాటుకునే ప్రయత్నం చేయడం ఒక శుభ పరిణామం. అయితే ఇది సంతకాలకే పరిమితం కాకుండా చర్యలకు మార్గం సుగమం చేస్తే దేశానికి కలిగే మేలు అంతా ఇంతా కాదనేది చెప్పనవసరం లేదు.
No comments:
Post a Comment