Friday, November 11, 2011

 

సార్క్ సదస్సు
- సంపాదకీయం

దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సదస్సు వాణిజ్య సరళీకరణ, ప్రాంతీయ ఉగ్రవాదం వంటి అనేక విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మాల్దీవుల్లో గురు, శుక్రవారాలలో జరిగిన ఈ సదస్సులో సార్క్ దేశాల (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్) ప్రతినిధులు ప్రాంతీయ సుస్థిరతకు, సహకారానికి కృషిచేస్తామని ప్రకటించడం ఒక మంచి పరిణామం. సీమాంతర ఉగ్రవాదం, రవాణా, వాణిజ్యం, మదుపు, వాతావరణ మార్పు, ఆరోగ్యం, విద్య, జెండర్ లాంటి అనేక అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిగాయి. సార్క్ దేశాల అభివృద్ధిని ఆటంకపరచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఉమ్మడిగా కృషిచేయాలన్న అవగాహన ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులలో కన్పిపించింది.

సార్క్ ఏర్పడి 25ఏళ్ళు దాటినప్పటికీ అందులోని సభ్య దేశాల మధ్య ఒకరిపై ఒకరికి పరస్పర విశ్వాసం లేకపోవడం వల్ల వారి మధ్య చురుకైన సహకారం కొరవడింది. 'వారధులను నిర్మిద్దాం' అన్న నినాదంతో మాల్దీవుల్లో జరిగిన 17వ సార్క్ సదస్సులో కొన్ని అంశాల్లో మాత్రమే అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అయితే ఆహారం, ఇంధన భద్రత, రవాణా, పేదరిక నిర్మూలన, ఆర్థిక సమగ్రత, వాణిజ్యం లాంటి అత్యంత కీలకమైన విషయాలపై ప్రతిష్టంభన ఏర్పడింది. దక్షిణాసియా దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా భారత్ కీలక ప్రకటన చేసింది. అదే సమయంలో దశాబ్దాల పాటు పాక్‌తో కొనసాగుతున్న వైరాన్ని తొలగించుకునే వైపుగా రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయి. భారత్-పాక్ దేశాల మధ్య శాంతి సామరస్యతలు ఏర్పడితే దక్షిణాసియాలో శాంతి స్వప్నం సాకారమయ్యే అవకాశముంది. సార్క్ దేశాల ఐక్యత సాధించే దిశలో ఇది కీలకమైన ముందడుగుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

దక్షిణాసియా ఆర్థిక, సాంకేతిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి లక్ష్యంగా 1985లో సార్క్ ఏర్పడింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), చైనా, ఇరాన్ తదితర తొమ్మిది దేశాలు సార్క్ పరిశీలకులుగా ఉన్నాయి. ముఖ్యంగా పాక్-అఫ్ఘాన్ సరిహద్దు ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా అవతరించిన నేపథ్యంలో సార్క్‌లో కీలక దేశాలైన పాక్-భారత దేశాల మధ్య ఐక్యతకు అంతర్జాతీయ ప్రాముఖ్యం ఏర్పడింది. సార్క్ సదస్సుకు సమాంతరంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలానీల మ«ధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య సాధారణ వాణిజ్య పరిస్థితులు నెలకొనేందుకు ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం (పీటీఏ) ఏర్పాటుకు ఇద్దరు ప్రధానులు అవగాహనకు వచ్చారు. ఇప్పటికే భారత్‌ను 'అత్యంత అనుకూల దేశం'గా పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో పీటీఏ ఏర్పాటుకు రంగం సిద్ధమయింది.

దాని ప్రకారం నాలుగేళ్ళలో భారత్-పాక్‌ల మధ్య అన్ని రకాల వాణిజ్య ఉత్పత్తులకు కస్టమ్స్ సంకం నుంచి మినహాయింపు లభిస్తుంది. అదే సమయంలో వీసాల మంజూరులోను నిబంధనల సరళీకరణకు పరస్పర అంగీకారం కుదిరింది. విద్యుత్ వాణిజ్యం విషయంలోను పాక్ ప్రతిపాదనలకు భారత్ సానుకూలంగా స్పందించింది. 2005లో ఏర్పాటై కోల్డ్ స్టోరేజీలోకి పోయిన భారత్-పాక్ సంయుక్త కమిషన్‌ను పునరుద్ధరించాలని నిర్ణయం జరిగింది.

భారత్-పాక్‌ల మధ్య బలోపేతమవుతున్న వాణిజ్య బంధాల పునాదిగా వాటి మధ్య వైషమ్యాలు ఉపశమించే అవకాశం లేకపోలేదు. ఆ దిశలో సదస్సు సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు అనేక సానుకూల ప్రకటనలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని గిలాని శాంతికాముకుడు అని మన్మోహన్‌సింగ్ అభివర్ణించగా, ముంబయి ఉగ్రవాద దాడిలో పట్టుబడిన అజ్మల్ కసబ్ ఉగ్రవాదిని ఉరితీయాలని పాక్ హోం మంత్రి రహ్మాన్ మాలిక్ కోరారు. అయితే ఆయా ప్రకటనల వెనుక ఆంతర్యం, అంతరార్థం ఏమున్నప్పటికీ, రెండు దేశాలూ తమ మధ్య వైషమ్యాలను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రార ంభించినట్లు అనిపిస్తోంది.

ఈ దేశాల మధ్య వాణిజ్యం బలోపేతం కావడం శుభ పరిణామమే అయినప్పటికీ ఇప్పటి దాకా గతంలో జరిగిన ఒప్పందాలేవీ అమలులోకి రాలేదు. అవి మీడియా ప్రకటనలకే పరిమితమై పోయాయి. భారత్ వ్యతిరేక ఉగ్రవాద కేంద్రాలు, హిక్కానీ ఉగ్రవాద నెట్ లాంటి అంశాలపై చర్చ జరగలేదు. అంతర్జాతీయ సమాజం అనేకసార్లు హెచ్చరించినప్పటికీ సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టే వైపుగా పాక్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అనేక సందేహాలున్నాయి.

సార్క్ సదస్సుకు సమాంతరంగా భారత్ దేశం మిగిలిన దేశాధినేతలతో అనేక సరిహద్దు సమస్యలు, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపి సభ్య దేశాల మధ్య ఐక్యతకోసం చొరవ చూపడం ఆహ్వానించదగినది. ప్రపంచంలోనే గణనీయమైన వృద్ధిరేటు సాధిస్తున్న దేశాల్లో ఒకటైన భారత్ దక్షిణాసియా వికాసంలో ముఖ్యపాత్ర పోషించవలసిన అవసరం ఉంది. ప్రపంచ విపణిలో చైనాతో పోటీని ఎదుర్కొనేందుకు దక్షిణాసియా ప్రాంత ఏకీకరణ భారత్‌కు అనివార్యం. సార్క్ దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌లో చైనా ఇప్పటికే పాగా వేసింది. సార్క్ దేశాల ఆర్థిక వ్యవస్థల ఏకీకరణను వేగంవంతం చేయడంలో భాగంగా 'దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' (సాఫ్టా) ఏర్పడడంలో భారత్ కృషి గణనీయమైనది.

తక్కువ అభివృద్ధి చెందిన సార్క్ దేశాలకు తమ 'సెన్సిటివ్ వస్తువుల జాబితా'ను కుదిస్తున్నామని సదస్సు సందర్భంగా భారత్ ప్రకటించింది. ఈ జాబితాను 480 టారిఫ్‌లైన్ల నుంచి 25 టారిఫ్ లైన్లకు కుదించింది. రవాణా మార్గాలు, రాకపోకలపై తుది ఒప్పందాలు ఖరారు చేసుకోవలసిన అవసరాన్ని భారత్ నొక్కిచెప్పింది. దక్షిణాసియా ప్రజల మధ్య ఐక్యతను సాధించేందుకు పోస్టల్, టీవీ, చలనచిత్ర తదితర సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని సార్క్ సదస్సు గుర్తించింది. ముఖ్యంగా తుపానులు, భూకంపాలు, సునామీ తదితర ప్రకృతి వైపరీత్యాలను, సముద్రపు దొంగ తనాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన భద్రతా యంత్రాంగాన్ని ఒక కేంద్ర సెక్రటేరియట్ ద్వారా అనుసంధానించాలని సదస్సు నిర్ణయించింది.

ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలోని అపార సహజ వాయువు నిల్వలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రబిందువు అయింది. దాంతో ప్రపంచ రాజకీయ భూకంప కేంద్రం చమురు నిల్వల ప్రాంతాల వైపు మళ్లింది. ఇనుము, శిలాజ ఇంధనాల్లాంటి సంప్రదాయక సహజ వనరులే కాకుండా, ఆధునిక పరిశ్రమల్లో కీలకంగా వినియోగించే అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్ మెటల్స్) దక్షిణాసియా ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. ఆధునిక సహజ సంపదలకు ఆలవాలమైన మధ్య, దక్షిణాసియా ప్రాంతాలలోని అపారమైన ఖనిజ సంపదలను అఫ్ఘానిస్థాన్ కూడలిగా ప్రపంచ మార్కెట్‌లోకి తరలించేందుకు 'న్యూ సిల్క్ రోడ్' పేరుతో పాశ్చాత్య దేశాలు ఒక పథకం రూపొందించాయి.

ఈ పథకంలో భాగంగా దక్షిణాసియాలో శాంతి నెలకొని, రవాణా మార్గాలు విస్తారంగా ఏర్పడితేనే కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలకవచ్చు. తద్వారా ప్రపంచం మార్కెట్ మాంద్యం నుంచి బయటపడి, వికాసం వైపు అడుగు వేయగలదని పాశ్చాత్య దేశాలు కలలు కంటున్నాయి. ఆ దిశగా దక్షిణాసియాలో పావులు కదుపుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రాంతీయ ఆర్థిక మండళ్ళ ప్రాపకం క్రమంగా పెరుగుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా కేంద్రంగా ఏర్పడిన ఏక ధ్రవ ప్రపపంచం 2007లో గృహ రుణాల సంక్షోభం (సబ్‌ప్రైమ్ క్రైసిస్) కారణంగా బలహీన పడింది.

బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ కొరియా), ఇబ్సా (ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా) లాంటి ప్రాంతీయ ఆర్థిక శక్తులు ముందుకొస్తున్నాయి. దాంతో పాశ్చాత్యదేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయిన నేపథ్యంలో దూకుడుగా వస్తున్న చైనాను అడ్డకునేందుకు దక్షిణాసియా దేశాల ఐక్యత తప్పనిసరి. అందుకనుగుణంగా సార్క్ దేశాలు తమ మధ్య నెలకొన్న రాజకీయ వైషమ్యాలను తక్షణమే పరిష్కరించుకోవాలి.

 

____________________________________________

పండగ దాటినా పాత మాటే
నోటికో పాట.. పూటకో బాట
చేతి నిండా అయోమయం

తెలంగాణపై తేల్చని కాంగ్రెస్
సత్వర పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
అయితే.. జాతీయస్థాయి చర్చల తర్వాతే: ఆజాద్
ఎస్సార్సీపై నిర్ణయం తీసుకోలేదు: తివారీ నిర్దిష్ట గడువు చెప్పలేను పార్లమెంట్ భేటీకి ముందో, తర్వాతో: బొత్స
న్యూఢిల్లీ, హైదరాబాద్: దసరా అయిపోయింది. దీపావళి ముగిసింది. బక్రీద్ కూడా పోయింది. 'శీతాకాల సమావేశాల ప్రారంభంలోపు తేల్చేస్తారు' అని ఒకరంటే... అబ్బే, అన్ని రోజులెందుకు వారంలోపు 'నిర్ణయం' అని మరొకరు అన్నారు. వారం కూడా కాదు, మూడురోజుల్లోపు ఏ క్షణంలోనైనా అని కొందరు అనుకున్నారు. వారూ వీరు అనుకోవడం ఎందుకు... తెలంగాణపై కాంగ్రెస్ నేతలే తలో మాట అన్నారు, అంటున్నారు.

'బక్రీద్ ముగిసిన వెంటనే తెలంగాణపై నిర్ణయం దిశగా అడుగులు పడతాయి'... అని సాక్షాత్తూ హోంమంత్రి చిదంబరం చెప్పారు. 'ఎస్సార్సీయే మా వైఖరి' అని ప్రకటించిన రషీద్ అల్వీ... ఆ తర్వాత 'అది తెలంగాణకు వర్తించదు' అని గొంతు సవరించుకున్నారు. దిగ్విజయ్ ఒకటంటారు! మనీష్ తివారీ మరొకటంటారు! మొత్తానికి... తెలంగాణపై నానా గందరగోళానికి ఢిల్లీ పెద్దలే తెరలేపుతున్నారు.

'ఈ సమస్యను కనుచూపు మేరలో తేల్చుతారా?' అనే సందేహాలకు వీరే తావిస్తున్నారు. తాజాగా... రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ పాత పాట పాడారు. 'రాష్ట్రస్థాయి నేతలతో చర్చలు ముగిశాయి. జాతీయ స్థాయి నేతలతో కూడా చర్చించిన తర్వాతే మా నిర్ణయం ప్రకటిస్తాం' అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. శుక్రవారం చెన్నైలో ఈ కబురు చల్లగా చెప్పారు. వెరసి... "ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల సీనియర్ నేతలతో చర్చించాం. జాతీయ స్థాయి నేతలతో చర్చలు జరపాల్సి ఉంది. ఆ సంప్రదింపులు కూడా పూర్తయిన తర్వాత... మా నిర్ణయం వెల్లడిస్తాం.

తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం'' అని ఆజాద్ చెప్పారు. రెండో ఎస్సార్సీపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో... దీనిపై ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ వివరణ ఇచ్చారు. తెలంగాణ గురించి మాత్రం ఆజాద్‌నే అడగాలని మీడియాకు సూచించారు. "ఎస్సారీపై మేం నిర్దిష్టమైన నిర్ణయంతీసుకోలేదు. తెలంగాణ సున్నితమైన అంశం. అది ఆజాద్ పరిధిలో ఉంది. దీనిపై ఆయన స్పందిస్తేనే సమంజసంగా ఉంటుంది'' అని మనీష్ తివారీ చెప్పారు. ఆజాద్ చెన్నైలో ఏం చెప్పారో తనకు తెలియదని, తెలిసిన తర్వాతే స్పందిస్తానని తెలిపారు.

అసలే తెలంగాణపై తేల్చుకోలేక తర్జన భర్జనలు పడుతున్న కాంగ్రెస్‌కు... ఉత్తరప్రదేశ్‌లో మాయావతి పెట్టిన విభజన మంట మరింత చిక్కుల్లో పడేసింది. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడం, చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై యమా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరుకున పెట్టడం, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడటం, ప్రధాని పదవికి చేరువ కావడం... ఇలా బహుముఖ వ్యూహంతో మాయావతి విసిరిన వలలో బీజేపీ, కాంగ్రెస్ ఇరుకున్నాయి.

రాష్ట్రాల విభజనకు సంబంధించి కాంగ్రెస్ పూర్తిస్థాయి ఆత్మ రక్షణలో పడిపోయింది. యూపీ విభజనకు ఒప్పుకుంటే ఒక తంటా... ఎస్సార్సీ అంటే తెలంగాణలో తంట! బీజేపీది అంతకంటే క్లిష్ట పరిస్థితి. 'చిన్న రాష్ట్రాలకు మేం అనుకూలం. ఇప్పటికే మూడు రాష్ట్రాలు ఇచ్చాం. ఈసారి అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తాం' అని పదే పదే ప్రకటిస్తున్న కాషాయ దళ నేతలు... యూపీ విభజన వరకు రాగానే గొంతు సవరించుకుంటున్నారు. 'రాష్ట్రాలను ఆషామాషీగా ఏర్పాటు చేయవద్దు.

ఆచితూచి వ్యవహరించాలి' అని సాక్షాత్తూ అగ్రనేత అద్వానీయే పేర్కొన్నారు. అయితే... తన వ్యాఖ్యలు యూపీకే పరిమితమని, తెలంగాణ ఆకాంక్ష 30 ఏళ్లుగా ఉన్నదేనని చెప్పారు. అయితే... ఉత్తర ప్రదేశ్‌ను మూడుగా విభజించాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎప్పుడో చెప్పిన సంగతిని అద్వానీ 'విస్మరించారు'. ఏదైతేనేం... ప్రధాన పార్టీలది యూపీలో 'ఒక' మాట, తెలంగాణలో 'వేరు' బాట! ఏ రోటికాడ ఆ పాట!

ప్రస్తుతం మన రాష్ట్రానికి సంబంధించి బాగా నానుతున్న అంశాలు రెండే! ఒకటి... తెలంగాణ! రెండు... ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం. 'తెలంగాణ సంగతేమైంది' అని రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తే... 'నిర్ణయం త్వరలోనే!' అనే రొటీన్ సమాధానం ఇస్తున్నారు. ఇంతకీ ఏమిటా నిర్ణయమని అడిగితే... అది సోనియా, ప్రణబ్, చిదంబరం, ఆంటోనీ, ఆజాద్, అహ్మద్ పటేల్‌కు మాత్రమే తెలుసునని అంటున్నారు. "ఈ ఆరుగురికి మాత్రమే అసలు విషయం తెలుసు.

కానీ... వారు మనసులో మాట బయటపెట్టడం లేదు. త్వరలో ఏదో ఒక నిర్ణయం వెలువడటం ఖాయం' అని ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు. 'తెలంగాణపై అధిష్ఠానం వైఖరి ఎలా ఉంది?' అని ఈ ప్రాంతానికి చెందిన నేతను ఒక మంత్రి ప్రశ్నించగా... ఆయన 'నాకేమీ తెలియదు' అని తెల్లమొహం వేశారు. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన మరో ముఖ్య నేతదీ అదే మాట. 'మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం గౌరవిస్తుంది' అని రాయలసీమకు చెందిన ఒక కీలక నాయకుడు గట్టిగా చెబుతున్నారు.

అలాగని, 'విభజన జరగదంటారా?' అనే ప్రశ్నకూ బదులివ్వడంలేదు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దీనిపై స్పందిస్తూ... 'తెలంగాణపై గడువు చెప్పలేను. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు గానీ, తర్వాత గానీ నిర్ణయం వస్తుంది' అంటూ తెలివైన సమాధానం చెప్పారు. మొత్తానికి తెలంగాణపై ఢిల్లీ నుంచి ఎలాంటి సంకేతాలూ రాకపోవడంతో... జరుగుతున్న పరిణామాలను ఎవరికి నచ్చినట్లు వారు అన్వయించుకుంటున్నారు.

ఇక... రాజీనామాల విషయానికొస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్‌తోపాటు, కొందరు తెలంగాణ నేతలు ఎమ్మెల్యే పదవులకు చేసిన రాజీనామాల సంగతి అటో ఇటో తేల్చాలని స్పీకర్ నాదెండ్ల మనోషర్ భావిస్తున్నారు. గవర్నర్ నరసింహన్‌తో సమావేశమై దీని గురించి చర్చించినట్లు సమాచారం! సకల జనుల సమ్మెతో సత్తా చాటిన తెలంగాణ ఉద్యోగులు తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ ఇవ్వబోమన్నా... రెండో ఎస్సార్సీని ప్రకటించినా మెరుపు సమ్మె తథ్యమని, ఈసారి అత్యవసర సేవలూ నిలిపివేస్తామని ప్రకటించారు.
_________________________________________________________________________________


‘ముగింపు’ ఒక దీపస్తంభం
ముగింపు ఎంత ధ్వన్యాత్మకంగా ఉంటే కవిత అంత బిగువుగా, శక్తిమంతంగా ఉంటుంది. కావ్యానుభూతి సమగ్రమయ్యేది సార్ధకమైన ముగింపు తోనే. ప్రతి ఉత్తమ కవితలో తనదైన నిర్మాణ శిల్పముంటుంది. వస్తు, వ్యక్తీకరణధోరణి, కవి శైలిననుసరించి ‘సార్ధకమైన ముగింపు’ అనేది ఎప్పటికీ సాపేక్షమే.

pramusకమ్యూనిస్టు మేనిఫెస్టో చదివినవారికి అందులోని మొదటి వాక్యమేదో గుర్తుండక పోవచ్చు కాని చివరి వాక్యాలు ఖచ్చితంగా గుర్తుంటాయి. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు- బానిస సంకెళ్ళు తప్ప’- ఇవీ ఆ చివరి వాక్యాలు. చెప్పదలచిన విషయమేదో మిగిలిపోయినప్పుడు, దానిని చెప్పిన వాక్యం చివర చేర్చడం ఈ వాక్యంలోని ప్రత్యేకత.చివరి వాక్యాంశాన్ని మొదటి వాక్యంలోనే ఇమిడ్చి ‘పోరాడితే బానిసత్వం తొలగిపోతుంది తప్ప మనం కోల్పోయేదేమీ ఉండదు’ అనే విధంగా చెప్పవచ్చు. కాని అలా చెప్పి ఉంటే ఈ పదును, ఫోర్సు ఉండదు. చివరి వాక్యానికున్న ప్రాధాన్యం వ్యక్తం కాదు. మొదట ‘పోయేదేమీ లే’ దని చెప్పి, దానిని విరుద్ధంగా జోడించిన వాక్యాంశంలో తొలగిపోవలసిందే పోతుందనడం చమత్కారం. బానిస సంకెళ్ళతో బంధించి ఉన్నామన్న ఎరుక కలిగించడం, పీడన నుంచి విముక్తి లభిస్తుందనడం వ్యంగ్యం. మేనిఫెస్టో లోని సారాన్ని, లక్ష్యాన్ని ఇమిడ్చి కవితాత్మకంగా వ్యక్తీకరించినందు వల్లనే ఈ వాక్యం అంతర్జాతీయ నినాదమైంది. శక్తిమంతమైన ‘ముగింపు’కు బహుశా ఎప్పటికీ తాజాగా ఉండే దృష్టాంతమిది (‘పోయేదేమీ లేనివాళ్ళం’ అనే పేరుతో ఒక దళిత కవితా సంకలనం వచ్చింది).

కవితకు సంబంధించిన అన్ని అంశాలలాగే ‘ముగింపు’ కూడా కవి దృక్పథం మీదనే ఆధారపడి ఉంటుందన్నది నిజమే. కాని ‘ముగింపు’ను ప్రధానంగా ‘వస్తువు’ నిర్దేశించే అవకాశమూ ఉంటుంది. కవితలను 1. సమస్య, సంఘర్షణ ప్రధానమైనవి, 2. వర్ణన లేదా అనుభూతి ప్రధానమైనవి అని ప్రస్తుతానికి రెండు రకాలుగా విభజిద్దాం. ఈ రెండూ- ఒకటి మరొక దానిలో ఏమాత్రం ఉండదని అర్ధం కాదు.ఉద్యమం, పోరాటం, సామాజిక, సాంస్కృతికాది సమస్యలు, వ్యక్తిగతమైన భౌతిక, ఆంతరిక సంఘర్షణలు మొదలైనవి మొదటి విభాగానికి చెందినవి. బాల్యం, వృద్ధాప్యం, సంయోగ శృంగారం, స్థల, కాల, రుతు వర్ణనలు, తాత్త్విక ఆలోచనలు, సానుకూల ఉద్వేగాలకు చెందిన అనుభవాలన్నీ వర్ణనాత్మకమైనవి.

సమస్య, సంఘర్షణ ప్రధాన వస్తువులైన కవితలు సాధారణంగా శత్రు వినాశన వాంఛతోనో, శత్రువుకు హెచ్చరికతోనో, స్వపక్ష విజయ కాంక్షతోనో, పరిష్కారంతోనో, ఆశాభావంతోనో, ఆదర్శంతోనో, ఆత్మవిశ్వాస ప్రకటనతోనో ముగుస్తుంటాయి. వర్ణన ప్రధాన కవితలలో ‘కవితాత్మక న్యాయం’తో కూడిన, తార్కికమైన (లాజికల్‌) లేదా కొస మెరుపుతో కూడిన ముగింపును ఆశ్రయించవలసి వస్తుంటుంది.
కాదేదీ కవితకనర్హమని, కవితావేశంతోనే శిల్పాన్ని ఉపేక్షించకుండా రచన చేస్తే అది శోభాయమానంగా ఉంటుందని చెప్పే శ్రీశ్రీ ‘ఋక్కులు’ కవిత ‘ప్రపంచం ఒక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అనే వాక్యాలతో ముగుస్తుంది. కవిత్వమే ఈ కవితా వస్తువు కనుక ‘ప్రపంచం’ ఇక్కడ ఉపమానమే. అయినా ఏది దేనికి పోలికో వెంటనే తెలియని లేదా ఏది బింబమో, ఏది ప్రతిబింబమో అర్ధం కాని వాక్యాలివి. మొదట ప్రపంచానికి పద్మవ్యూహంతో పోలిక, కవిత్వానికి పిపాసతో సామ్యం చెప్పాడు. తిరిగి కవిత్వానికి ప్రపంచంతో సామ్యం, బింబ ప్రతి బింబ భావం ద్వారా సూచించాడు. సమర్ధమైన పోలికల విస్తరణ ఈ వాక్యాలకు గొప్ప శక్తినిచ్చింది.

‘జీవితం’, ‘ప్రేమ’ లాంటి వాటిని అతి వ్యాప్తి, అవ్యాప్తి లేకుండా నిర్దిష్ఠంగా నిర్వచించడం ఎంత కష్టమో, ప్రపంచాన్ని, కవిత్వాన్ని నిర్వచించడం అంత దుస్సాధ్యం. ప్రపంచానికి, కవిత్వానికి మధ్యనున్న అగాథత, అనంతత, అనిర్వచనీయత వంటి సామ్యాలు ఈ రెండింటికి అవినాభావాన్ని కల్పించాయి. అంత్యప్రాస, చతుర్మాత్రాగణాల వల్ల చేకూరిన ద్రుతగతి ఈ వాక్యాలు కంఠస్తం కావడానికి మూలమైన అంశాలు. ప్రపంచ, కవిత్వ పదాలలో శ్రీశ్రీ ‘జ’ గణ ప్రీతీ కనిపిస్తుంది. ఈ వాక్యాలు ఇంతటి ప్రాచుర్యం పొందడానికి కారణం- భావానికి, అభివ్యక్తి విధానానికి మధ్యనున్న సమ్యక్‌ సమ్మేళనమే. ‘ఋక్కులు- కవితలోని సంబోధనలన్నీ కవిని ఉద్దేశించినవే. కాని ‘కవిత్వ పిపాస’ అనే భావాన్ని స్ఫురింపజేస్తూ కవిత్వ పాఠకునికీ చివరి వాక్యం వర్తిస్తుంది.

‘స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ...’ అనే జయప్రభ కవిత ‘స్పర్శ ప్రవహించిన ప్రాంతమంతా/ అణువులన్నీ అరవిచ్చుకుంటాయి’ అనే సానుకూల ప్రతిస్పందనను తెలిపే వాక్యంతో ఆరంభమవుతుంది. ‘నిశ్శబ్దంలో మోగిన నాదం’, ‘అడవుల వాసనతో తేలివచ్చే గుర్తు తెలియని పక్షి పాట’, ‘అలల రాగాలు ఆలపించే సముద్రం’ అనే పోలికలతో స్పర్శా సౌఖ్యాన్ని అందంగా వర్ణించారు. ‘నీ కొనగోరు తగిలిన శరీరం తీగలా కంపిస్తుంది’ అన్నారు. అనురాగం, ప్రేమ, శృంగార వర్ణనల్లో అనిర్వచనీయ ఆనంద వ్యక్తీకరణ కోసం సంగీతం, సుగంధాల ప్రస్తావనలు సహజం. ఈ కవితా శీర్షికలోనే అనురాగంలో అంతర్లీనంగా రాగాలాపన ఉంది.

‘అయినా/ ఎందుకో మరి/ నీ స్పర్శతో దీపించే నేను/ నా స్పర్శతో జ్వలించే నీవు/ ఎప్పుడూ దూరంగానే ఉంటాము/ పృధ్వీ ఆకాశాలమై’ ఇదీ ఈ కవిత ముగింపు. పరస్పర అనురాగం, ఆప్యాయతలు, అవసరాలు ఉన్నప్పటికి, పరస్పరం ఆనంద ప్రదాతలు, స్వీకర్తలు అనినప్పటికీ భార్యా భర్తల మధ్య (లేదా ప్రేయసీ ప్రియుల మధ్య) మానసికంగా దూరం పెరుగుతుండడాన్ని ఆర్తితో సూచిస్తుంది. ‘ఎందుకో మరి’ అనే స్వగత ప్రశ్నతో కారుణాన్ని వాచ్యం చేయక పోవడం విశేషం. ‘దీపించడం’ లోని లలిత రశ్మి, ‘జ్వలించడం’లోని ఎగసిపడే తాపం, స్ర్తీ పురుష లక్షణాలకు సార్ధక క్రియలు. అతి విస్తీర్ణమైన కాంతిని ‘దీప్తి’ అంటారు (కాంతి రేవాతి విస్తీర్ణా దీప్సిత రిత్యభిదీయతే’- సాహిత్య దర్పణం). స్ర్తీ పురుషులకు ప్రకృతి- పురుషుడు, క్షేత్రం- బీజం, నేల- నింగి మొదలైన పోలికలు సంప్రదాయకమైనవి. మానసిక దూరాన్ని అతిశయించి చెప్పడానికి సాంప్రదాయక కవి సమయానికి వ్యతిరేకార్ధంలో పృధ్వీ ఆకాశాలు ఇక్కడ ఉపమానాలైనాయి. దిగంతంలో నింగి నేల కలసినట్టు కనిపించినా మనం ముందుకు కదులుతున్న కొద్దీ అది భ్రమేనని తెలుస్తుంది.

‘పృధ్వీ ఆకాశాలమై’ అనే పోలికను సమాపక వాక్యం చివర అనుసంధించడంలో అప్పటివరకు చేసిన వర్ణనా ప్రయోజనమే మారిపోయింది. ఎత్తుగడలోని సానుకూల ప్రతిస్పందనకు పూర్తిగా వ్యతిరేక వ్యాఖ్యలతో కూడిన ముగింపు గొప్ప కుదుపు. ఈ కవితలోని శక్తి అంతా ముగింపు లోనే నిక్షిప్తమై ఉంది.
ఏ పరిష్కారమూ లేని (కనీసం లేనట్లు కనిపించే) అనుభూతులు, వేదనలు వస్తువులైనప్పుడు ముగింపు కవికి అగ్ని పరీక్షే. పాటిబండ్ల రజని ‘అబార్షన్‌ స్టేట్‌మెంట్‌’ అనే కవిత ‘అయో!

పాలింకిపోవడానికున్నట్లు/ మనసింకిపోవడానికీ/ మాత్రలుంటే ఎంత బాగుండు’ అంటూ ముగుస్తుంది. కె. గీత ‘పరపరాగ విరాగం’ అనే కవిత ‘ఈ ఒక్క అవయవాన్నీ విసిరవతల పారేస్తే చాలు/ మరో సృష్టి ఇంకాగిపోతే చాలు’ అంటూ ముగుస్తుంది. అధిక సంపాదన కోసం భర్త పరాయి దేశానికి వెళ్ళడం వల్ల ముస్లిం గృహిణి అనుభవించే భర్తృ వియోగ వేదన, ఏకాకితనం ‘దూస్తా ఆస్మాఁ’ (షాజహానా) కవితా వస్తువు. ‘ప్రతిసారీ ఆకాశాన్ని చీల్చుతూ పైకెగిరే నువ్వు/ ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు/ కిటికీకివతల శూన్యం నింపుకున్న రెండో ఆకాశం’- ఇది ఈ కవిత ముగింపు.

ఆకాశమంటేనే శూన్యం. ‘శూన్యం నింపుకున్న ఆకాశం’ వేదన యొక్క అనంతత్త్వాన్ని తెలుపుతుంది. అంతటి శూన్యమూ భర్త ఒక్కరి చేతనే పూరింపబడగలదన్నది వ్యంగ్యం. దుఃఖ తీవ్రతను, దయనీయతలోని పరాకాష్ఠను వ్యక్తం చేయడమే పై మూడు ముగింపుల పరమార్ధం. శీర్షిక, ఎత్తుగడల కంటె శక్తిమంతమైన ముగింపు వల్లనే ఈ మూడు కవితలు ఉత్తమ స్థాయి నందుకున్నాయని గమనించాలి.
వస్తువులోని ప్రధానాంశం ఒక వాక్యంలోనే కేంద్రీకృతమైనప్పుడు, ఆ వాక్యాన్నే ఎత్తుగడగా, ము గింపుగా కవు లు ఉపయోగించు కుం టారు. ఇలాంటి కవితలు- పాట చివర కూడా పల్లవి పాడినట్లు ఉంటాయి. ‘నాక్కొంచెం నమ్మకమివ్వు’ (బైరాగి), ‘కవిత్వం కావాలి కవిత్వం’ (త్రిపురనేని శ్రీనివాస్‌) మొదలైనవి ఈ రకమైన కవితలే.

తన ఆనంద విషాదానుభూతులతో కూడిన ఒకానొక సంక్లిష్ట మానసిక స్థితిని, మధ్యాహ్నపు దృశ్యాలతో కలబోసుకోవడం కె. శివారెడ్డి ‘ఒకానొక మధ్యాహ్నం పూట’ (అజేయం- కవితా సంపుటి) కవితా వస్తువు. ‘ఇంకా చెట్టు కింద/ ఎండా నీడ పాముల్లా పెనుగులాడుతున్నాయి/ ఎక్కడ్నుంచో ఒక సీతాకోక చిలుక వచ్చి నా ముఖం మీద వాలింది’- ఇవి ఈ కవితలోని చివరి వాక్యాలు. ‘ఇంకా’ అనే మాట దృశ్యాల కొనసాగింపును తెలుపుతుంది. సీతాకోక చిలుక ముఖంమీద వాలడం వల్ల భావధారకు ఆటంకం కలిగిందనే సూచననే కవి ముగింపుగా మార్చాడు. ఈ కవితను ఎక్కడ ముగించాలో అర్ధం కాక (లేదా తేల్చుకోలేక) కవి చేసిన చమత్కారంగా దీనిని ఊహించవచ్చు. ఇలాంటివి ‘ముగింపు కాని ముగింపులు’ అన్నమాట.

నిర్దిష్ట భావ ప్రాధాన్యాన్ని, ఉద్వేగ తీవ్రతను తెలపడానికి కవులు కొన్ని వాక్యాలను పునరుక్తం చేస్తుంటారు. పాఠకుని మనస్సులో భావం బలంగా ముద్రితమవడానికి ఆమ్రేడిత వాక్యంతో ముగించడం ఒక పద్ధతి. ‘నాకోసం ఎదురు చూడు’ (శివసాగర్‌), ‘చేదు పాట’ (శ్రీశ్రీ) మొదలైన కవితలు ఆమ్రేడిత వాక్యాలతో ముగుస్తాయి.వస్తువులోని అంతరె్వైరుద్ధ్యాలను, సంఘర్షణను చెప్పిన తర్వాత పతాక స్థాయిని గమనించి ముగించాలి. లేదా ముగింపునే పరాకాష్ఠగా మార్చాలి. పతాక స్థాయిని గమనించడం లేదా పతాక స్థాయికి చేర్చడం, ముగించవలసిన చోటును గుర్తించడం కవి విజ్ఞతమీద ఆధారపడి ఉంటుంది.

సంఘర్షణ పరాకాష్ఠకు చేరుకోకుండానే ముగిస్తే, పాఠకుని హృదయంలో పూర్తిగా ముద్రితమవకుండానే ఆ కవితా చిత్రం చెరిగిపోతుంది. నిడివి కోసం కాని, వర్ణనా వ్యామోహంలోకాని అనవసరంగా పొడిగిస్తే అంతవరకు పాఠకుడు పొందిన కవిత్వానుభం చెరిగిపోతుంది, విసుగు కలుగుతుంది. శీర్షిక, ఆరంభం, నిర్వహణలలో కవి చూపిన కొత్తదనం, నైపుణ్యం లాంటి వాటన్నిటినీ స్థిరపరిచే పునాది ముగింపు. కవి భావజాలం, దృష్టి కోణం, పరిష్కార మార్గాల పట్ల కవి అవగాహన, భాషా జ్ఞానం, కవిత్వ శిల్ప స్పృహ- అన్నీ ముగింపులో ప్రతిఫలిస్తాయి. కవితలోని ‘కంఠస్వరం’ (టోన్‌) ముగింపులోను వినిపించాలి. ముగింపు ఎంత ధ్వన్యాత్మకంగా ఉంటే కవిత అంత బిగువుగా, శక్తిమంతంగా ఉంటుంది. కావ్యానుభూతి సమగ్రమయ్యేది సార్ధకమైన ముగింపు తోనే.

shivaramaప్రతి ఉత్తమ కవితలో తనదైన నిర్మాణ శిల్పముంటుంది. వస్తు, వ్యక్తీకరణ ధోరణి, కవి శైలిననుసరించి ‘సార్ధకమైన ముగింపు’ అనేది ఎప్పటికీ సాపేక్షమే.‘ఆగాజ్‌ కో కౌన్‌ దేఖ్‌తాహై, అంజామ్‌ అచ్ఛా హోనా’ (ఆరంభం ఎవరు చూడొచ్చారు? ముగింపు బాగుండాలి) అంటాడు ‘దాగ్‌’ దహెల్వీ అనే ఉర్దూ కవి. జననం, బాల్యం, తొలినాటి సాంస్కృతిక, ఆర్ధికాది స్థితిగతులు ఎలా ఉన్నా, ఆ తర్వాత సచైతన్యంగా జీవించి తన జీవితానికి అర్ధవంతమైన ముగింపు నివ్వవచ్చనేది ‘దాగ్‌’ ఉద్దేశం కావచ్చు. ఈ భావం వచన కవితకూ వర్తిస్తుంది. ఆరంభం ఉచితంగా లేకపోయినా సార్థకమైన ముగింపుతో బాగా పేరు పొందిన, పాఠకులకు గుర్తుండిపోయిన కవితలెన్నో ఉన్నాయి. ఏమైనా, వచన కవితకు ముగింపు ఒక దీపస్తంభం.
- పెన్నా శివరామ కృష్ణ 
___________________________________________________________________________________
హజారో( మే ఏక్!
ఒకే వ్యక్తి మంచి కవీ, గొప్ప గాయకుడూ, అద్భుతమయిన సంగీత కర్తా, ఉత్తమ విద్యావేత్తా, ప్రసిద్ధ నటుడూ, ప్రతిభావంతుడయిన ఫిల్మ్ మేకర్, ప్రముఖ జర్నలిస్టూ కావడం సాధ్యమేనా? కచ్చితంగా సాధ్యమే! మొన్న శనివారంనాడు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కన్నుమూసిన డాక్టర్ భూపేన్ హజారికా అలాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడే.

జీవనగానం

ఈశాన్య భారతీయ సంస్కృతీ సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా చలామణీ అయిన భూపేన్‌దా ప్రత్యేకించి అషోమ్ (అస్సాం) ఆత్మను అంతర్జాతీయ ఆకాశంలో ఆవిష్కరించారు. కొద్దిగా వణికే ఆయన గొంతులో, ఈశాన్య భారత జానపద సంగీతం నిబ్బరంగా పలికేది. ఆయన పలికించిన పహాడీ ధున్‌లలో మట్టివాసన గుప్పుమనేది. ఊహాతీతమయిన సంగతులతో నిండిఉండే భూపేన్‌దా బాణీలలో బతుకుపాట వంపులు తిరిగేది. మాటల మధ్యన మౌనంలో సైతం జీవనగానం నింపగలిగిన మాంత్రికుడాయన.

చదువులమ్మ ముద్దుబిడ్డ

విద్యాధికుల కుటుంబంలో పుట్టిపెరిగిన భూపేన్‌దా పెద్ద చదువులు చదవడంలో విడ్డూరమేముంది? 1946లో -ఇరవయ్యేళ్ల ప్రాయంలోనే- ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి రాజకీయ శాస్త్రంలో ఎమ్మే పట్టా పుచ్చుకున్నారు. అయిదేళ్ల తర్వాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం భూపేన్ హజారికాకు -మాస్ కమ్యూనికేషన్స్‌లో- పీహెచ్‌డీ ప్రసాదించింది. షికాగో విశ్వవిద్యాలయం భూపేన్‌దాకు లిస్లే ఫెలోషిప్ ఇచ్చి, విద్యారంగాన్ని వృద్ధిపరచడంలో సినిమా కళ వినియోగం గురించి పరిశోధించే అవకాశం కల్పించింది. ఇంత చదువుకున్నవాడు కుప్పిగంతుల, కప్పగంతుల బాలీవుడ్‌లో -అందునా సంగీత విభాగంలో- రాణించగలడని ఎవరనుకుంటారు? కానీ, చిత్రంగా అదే జరిగింది!

చిగురు కొమ్మే చేవ!

వాస్తవానికి భూపేన్‌దా సినీరంగప్రవేశం చిన్ననాటనే -పదమూడేళ్ల పసితనంలోనే- జరిగిపోయింది. అషోమీస్ భాషలో నిర్మితమయిన రెండో చిత్రం(ఇంద్రమాలతి)లో భూపేన్‌దా తన తొలిగీతం ఆలపించారు. సుప్రసిద్ధ చలన చిత్ర దర్శకుడు ఆగ్రావాలా ఈ సినిమాను రూపొందించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, బంగాలీ సినిమారంగంలో కూడా భూపేన్‌దా అడుగుపెట్టారు. 1956లో భూపేన్‌దా ‘ఎరా బతొర్ సుర్’ అనే అషోమీస్ చిత్రానికి దర్శకత్వం, సంగీత నిర్దేశకత్వం కూడా నెరపారు. ఆ వరసన ఆయన -వివిధ భాషల్లో- మరో 13 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1975లో, ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో, అబ్దుల్ మాజీద్ దర్శకత్వంలో వెలువడిన అషోమీస్ చిత్రం ‘చమేలీ మేమ్‌సాబ్’ ఈశాన్య భారత సాంస్కృతిక చరిత్రపై కొత్తవెలుగు ప్రసరింపచేసింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు భూపేన్ హజారికాయే!

అవార్డులు అసంఖ్యాకం!

1977లో భారత ప్రభుత్వం భూపేన్‌దాకు పద్మశ్రీ పురస్కారం, 2001లో పద్మభూషణ పురస్కారం ప్రకటించింది. 1992లో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా చెప్పే ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్’ భూపేన్‌దాను వరించింది. ఆ మరుసటి ఏడాదే, జపాన్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భూపేన్‌దా ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం అందుకున్నారు. ‘రుదాలీ’ చిత్రం కోసం ఆయన కట్టిన బాణీలే తొలిసారిగా ఈ గౌరవం ఒక భారతీయుడికి దక్కేలా చేశాయి. రెండేళ్ల కిందట, గువాహటి నడిబొడ్డున డాక్టర్ భూపేన్ హజారికా నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పారు. తను అందుకున్న పురస్కారాలన్నింటిలోకీ ఇదే ఉత్తమోత్తమమయిందని భూపేన్‌దా నిండుమనసుతో ప్రకటించారు.
అవును- కళాకారుడు బతకాల్సింది భౌతిక జగత్తులో కాదు- జాతిజనుల గుండెల్లో! అక్కడ భూపేన్‌దా స్థానం సుస్థిరం!

- ఇషిత దూసనపూడి

No comments:

Post a Comment