Sunday, November 27, 2011

మేము భారత్‌లోనే ఉంటాం!

ఢిల్లీలో మాకు వసతి కల్పించండి శకేంద్రానికి 140 మంది పాక్ హిందువుల మొర 


న్యూఢిల్లీ, నవంబర్ 23: తమ దేశంలో వివక్షకు గురవుతూనే బతకాల్సి వస్తుందన్న భయంతో సుమారు 140 మంది పాకిస్తానీ హిందువులు ఢిల్లీని తమ నివాసంగా చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. సింధ్ రాష్ట్రానికి చెందిన వీరంతా టూరిస్టు వీసాపై భారత్ వచ్చారు. ఆ వీసా గడువు ఇప్పటికే ముగిసిపోయింది కూడా. అయితే వీళ్లంతా తమ జన్మస్థలంలో బతుకు దుర్భరంగా ఉంటుందన్న భయంతో మళ్లీ అక్కడికి తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. రెండు నెలల క్రితమే తమ వీసా గడువు ముగిసిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న సింధ్ రాష్ట్రంలోని మతియారీ జిల్లా గ్రామానికి చెందిన ఈ 27 కుటుంబాలు భారత్‌లో అయితే తామంతా సురక్షితంగా ఉంటామని భావిస్తున్నారు. ప్రస్తుతం వీళ్లంతా ఉత్తర ఢిల్లీలోని మజ్నూకా తిల్లా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన టెంట్లలో ఉంటున్నారు. తమ వీసాలను పొడిగించి నగరంలో తమకు తగిన వసతి సదుపాయం కల్పించాలని వీరంతా ముక్తకంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూసిన తర్వాత టూరిస్టు వీసా సంపాదించిన వీరంతా సెప్టెంబర్ 2న కాలి నడకన సరిహద్దులను దాటి రెండు రోజుల తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. తాము ఈ విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, కాణగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసామని, అయితే ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న గంగారామ్ చెప్పారు. పాకిస్తాన్‌నుంచి భారత్ చేరుకునే దాకా తన కథనంతా వివరించిన ఇరవై ఏళ్ల జమున కనీసం తన పిల్లలయినా ప్రశాంత వాతావరణంలో మెరుగయిన జీవితాన్ని, విద్యను పొందుతారన్న ఆశతో ఉన్నట్లు చెప్పింది. ‘పాకిస్తాన్‌లో మత స్వేచ్ఛ లేదు. హిందువులను చదువుకోవడానికి అనుమతించరు. మాపై ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి. భారత దేశానికి వచ్చి ఇక్కడే స్తిరపడిపోవాలనే ఉద్దేశంతో వీసా కోసం ఎదురు చూస్తున్నాం. ఏది ఏమయినా మేము తిరిగి వెళ్లం’ అని కుటుంబ సభ్యులు, స్నేహితులు చుట్టుముట్టి ఉండగా, ఆరుబయటే రొట్టెలు చేస్తున్న జమున చెప్పింది. డేరా బాబా ధున్నీదాస్ ఈ 27 కుటుంబాలకు వేర్వేరుగా టెంట్లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, ఇతర సరకులు సరఫరా చేస్తూ ఉంది. ఈ కుటుంబాల్లో యువకులే కాకుండా వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న దుకాణాల్లో పనులు చేయడం కూడా ప్రారంభించారు. ‘్భరతీయులు తమకు సాయం చేస్తారు’ అన్న ఏకైక ప్రార్థనతో తామంతా కొంపా గోడు, పశువులు అన్నీ వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చామని జమున చెప్పింది. తామెందుకు పాకిస్తాన్ వదిలి పారిపోయి వచ్చామో చందెర్మా అనే 40 ఏళ్ల మహిళ వివరించింది.‘ పిల్లలు బడికి వెళితే వేరుగా కూర్చోబెడుతున్నారు. వాళ్లకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. మేము అనునిత్యం భయంతో కూడిన వాతావరణంలో జీవించాలనుకోవడం లేదు. అందుకే మేము టూరిస్టు వీసాపై ఇక్కడికి వచ్చాం’ అని ఆమె చెప్పింది. స్థానికులు తమ ఖర్చులను భరిస్తున్నారని ఆమె చెప్తూ, తమ వీసాలను పొడిగించి తమ పిల్లలు చదువులు కొనసాగించడానికి వీలుగా తమకు తలదాచుకోవడానికి గూడును ఏర్పాటు చేయాలని మాత్రమే తాము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ఆమె చెప్పింది. 13 ఏళ్ల ఆర్తీ కథ ఎవరినైనా కదిలించకమానదు. ఆ అమ్మాయి ఎప్పుడూ బడికి వెళ్లి చదువుకోలేదు కానీ తన తాత, నాన్నమ్మ దగ్గరనుంచి హిందూ మంత్రాలను నేర్చుకుంది. ఓ పక్క కుటుంబానికంతటికీ వంట చేస్తూనే మరో పక్క తాను నేర్చుకున్న మంత్రాలను క్యాంప్‌లోని చిన్నారులకు నేర్పిస్తోంది. ‘నేను నేర్చుకున్న దాన్ని నా స్నేహితులకు నేర్పించడం ద్వారా నా ఒత్తిడిని మరిచిపోతున్నాను’ అని ముక్కుపచ్చలారని ఆ చిన్నారి చెప్తూ ఉంటే ఎవరికయినా కళ్లు చెమర్చకమానవు. కాగా, భారత దేశంలో వేలాది మంది బంగ్లాదేశీయులు, నేపాలీలు, టిబెటన్లు ఉన్నప్పుడు హిందువులైన తాము ఇక్కడ ఎందుకు ఉండకూడదని ఆమె సోదరుడు ప్రశ్నిస్తూ, తాము ఇక్కడే తమ జీవితాలను కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలని అన్నాడు.
_________________________________________________________________________


పేదల చదువుకు ఏలికల ఎసరు!
ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర వృత్తి విద్యా కోర్సు ల ఫీజులకు కన్వీనర్ కోటా, యాజమాన్యం కోటా సీట్లకు ‘కామన్ ఫీజు’ ఉండాలని ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. కామన్ ఫీజు ఉండా లనే తీర్పు వరకు బాగానే ఉంది. కాని కోర్టు ఇంకో అడుగు ముందుకేసి, ఫీజుల రేట్లను కాలేజీలే నిర్ణయించుకోవాలని తీర్మానించింది. ఫీజుల రేట్లను కాలేజీలు నిర్ణయించుకోవడమంటే దొంగకు తాళం చేయి ఇవ్వడమే.

ఈ తీర్పు వలన 706 ఇంజనీరింగ్ కాలేజీలు, 709 ఎంసీఏ కాలేజీలు, 906 ఎంబీఏ కాలే జీలు, 275 ఫార్మసీ కాలేజీలలో చదివే 5 లక్షల 60 వేల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఇంతటి ‘ప్రజావ్యతిరేక తీర్పు’ వెలువడటం వెనుక ప్రభుత్వ ద్రోహ చింతన ఉందని చెప్పకతప్పదు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలు బలంగా వినిపించి ఉంటే తీర్పు ఇలా వచ్చేది కాదు. ఇంత ముఖ్యమైన కేసు హైకోర్టులో నడుస్తుంటే ప్రభుత్వం ఏనాడూ శ్రద్ధ తీసుకోలేదు. అంతేకాదు, కోర్టుతీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. మంత్రులు కూడా స్పందించలేదు.

ప్రస్తుతం వృత్తి విద్యాకోర్సులు చదివే విద్యార్థులలో బీసీలు 2.48 వేలు, ఎస్సీలు 77 వేలు, ఎస్టీలు 21 వేలు, ఈబీసీలు 155 వేలు, మైనార్టీలు 52 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం కన్వీనర్ కోటా కింద ఇంజనీరింగ్ విద్యకు సగటున ఫీజులు 35 వేలు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు రూ.32 వేలు మంజూరు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు అమలుచేస్తే ఈ ఫీజు మొత్తాన్ని సగటున రూ.50 వేల నుంచి రూ.55 వేల దాకా పెంచవలసి వస్తుంది. ఫలితంగా ప్రస్తుత ఫీజుల రీయింబర్స్‌మెంట్ బడ్జెట్ రూ.3,400 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు పెరుగుతుంది. అప్పుడు ఇంత భారం మోయలేమని ప్రభుత్వం చేతులెత్తేసే ప్రమాదం ఉంది.

హైకోర్టు తీర్పు అమలులోకి వస్తే కాలేజీలలో మౌలిక సదుపాయాలు, బోధన ప్రమాణాలు, కాలేజీ చరిత్ర, ఉత్తీర్ణత శాతం, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది వేతనాలు ఆధారంగా ఫీజుల రేట్లను నిర్ణయించవలసి వస్తుంది. ఇలా ఒక్కో కాలేజీకి వెళ్లి ఫీజులను నిర్ణయించడం కష్టసాధ్యం. అప్పుడు రాష్ట్రంలోని 2,300 వృత్తి విద్యా కాలేజీలలో రకరకాల ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. యాజమాన్యాలు పెట్టే ఖర్చు ఆధారంగా ఒక్కొక్క కోర్సు - ఒక్కొక్క కాలేజీలో వివిధ రకాల ఫీజుల రేట్లు నిర్ణయిస్తే అనివార్యంగా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

కొదవలేని ఎగవేత కుట్రలు, కోతలు

బడుగు, బలహీన, బీద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆయన హయాంలో దిగ్విజయంగా సాగింది. కానీ, ఆయన మరణానంతరం ఈ పథకం ఎత్తివేతకు అదే పనిగా కుట్రలు జరుగుతూవచ్చాయి. మాజీ ముఖ్యమ్రంతి రోశయ్య కాలం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దాకా పథకం అమలుకు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవు. బడ్జెట్ సకాలంలో విడుదల చేయకుండా జాప్యం చేయడం, వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయేటట్లు చేసి ఖజానాకు భారమవుతున్నదని పథకం ప్రకారం ప్రచారం చేయడం రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్‌కు నిత్యకృత్యంగా మారిపోయింది. ఏ స్కీముకు లేని విధంగా దీనికి తొమ్మిది మంది మంత్రులతో ఉపసంఘం నియమించి అనేక కోతలు విధించారు. ఇంకా వెతికి, వెతికి కోతలు, వాతలు పెడుతూనే ఉన్నారు. అర్థం, పర్థంలేని నిబంధనలతో విద్యార్థులను తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు.

పథకం ఎత్తివేయాలన్నది ఈ ప్రభుత్వం రహస్య ఎజెండా. అందుకే లెక్కకు మిక్కిలిగా నిబంధనలు విధించి, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు లక్షలాది మంది విద్యార్థులను అనర్హులను చేసే ఎత్తుగడ పన్నారు. ‘స్పాట్ అడ్మిషన్లకు’ ఫీజుల రీయింబర్స్‌మెంట్ ఎత్తి వేశారు.

అంతేకాదు, దరఖాస్తులో చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ 2 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజులు మంజూరు చేయలేదు. వీరిలో లక్షన్నర మందిని కేవలం తండ్రి సంతకాలు, విద్యార్థుల సంతకాలలో చిన్నచిన్న తేడాలు ఉన్నాయనే కారణంతో తిరస్కరించారు. వాస్తవానికి అనర్హతకు ఆదాయ సర్టిఫికెట్ ప్రమాణం, కానీ వెరిఫికేషన్ అధికారులు, సంక్షేమశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తండ్రి సంతకం లేకుంటే దరఖాస్తులు బుట్టదాఖలా చేశారు. సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలలోనే సంతకాలను పట్టించుకోరు. ఇక్కడ పట్టించుకుంటున్నారంటే ఉద్దేశ పూర్వకంగా లబ్ధిదారులను తగ్గించాలనే కుట్ర అతి స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఎస్‌ఎస్‌సీ చదివి ఇంటర్‌లో ప్రవేశించే విద్యార్థులకు చాలా విషయాలు తెలియవు. కొన్ని అంశాలు అర్థంగాక ఫారాలు పూర్తి స్థాయిలో నింపలేరు. అధికారులు ఇది తెలిసి కూడా పనిగట్టుకుని వారి దరఖాస్తులను పరిశీలించ నిరాకరించారు.

ఈ స్కీముకు గండి కొట్టడానికి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. పన్నని పన్నాగాలు లేవు. ఏటేటా ఎంసెట్ నోటిఫికేషన్‌లో ఒక లక్ష లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు అడ్మిషన్ల సమయంలో ఫీజులు కట్టనవసరం లేదని స్పష్టంగా పేర్కొనేవారు. కానీ ఈ ఏడాది నోటిఫికేషన్‌లో ఈ అంశాన్ని పేర్కొనకపోవడంతో, కాలేజీ యాజమాన్యాలు ఇదే అదనుగా ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాయి. ఇంతేకాదు, ఫీజుల పథకానికి ఇంకా ఎన్నెన్నో చిల్లులు పొడిచారు. 34 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి విధించారు. ఒక పీజీ కోర్సు కంటే ఎక్కువ చదవరాదని, 75 శాతం హాజరు తగ్గితే స్కాలర్‌షిప్ లేదనే షరతు విధించారు. ఆదాయం సర్టిఫికెట్ జారీకి అనేక కట్టుదిట్టాలు చేశారు. వీటన్నిటికీ తోడు ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ స్కీము ఉంటుందా? ఊడుతుందా అనే అనుమానం విద్యార్థులను వేధిస్తున్నది.

‘ప్రభుత్వ’ షరతు సరికాదు!

మంత్రివర్గ ఉపసంఘం ఫీజుల రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే ఫీజుల రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదవాలని, అందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశం మంచిదే! కానీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. అదీగాక సర్కారు బడిలో చదివిన వారికే ఫీజులు మంజూరు చేస్తామనే వాదన రాజ్యాంగ విరుద్ధం. ఇలా ప్రతిపాదించే ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది. రాష్ట్రంలోని 78 వేల ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 40 వేల పాఠశాలల్లో ఆడపిల్లలకు కనీస అవసరాలు తీర్చే బాత్‌రూమ్‌లు, లెట్రిన్లు, తాగేందుకు మంచినీటి సౌకర్యాలు లేవని ప్రభుత్వ నివేదికలే తెలుపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంవల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతిని, పేదలు సైతం తమ పిల్లల భవిష్యత్తు కోసం అప్పు చేసైనా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిబంధన సరికాదు.

తీర్పుతో విద్యార్థులకు తీరని నష్టం!

హైకోర్టు తీర్పు అమలు చేస్తే పేదకులాల వారు ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు చదవడం గగన కుసుమమే అవుతుంది. ఫీజుల రీయింబర్స్‌మెంట్ స్కీముపై ఇప్పటికే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక ఫీజుల రేట్లు నిర్ణయించే అధికారం కాలేజీ యాజమాన్యాలకు ధారాదత్తం చేస్తే కాలేజీ యాజమాన్యాల అక్రమాలకు అడ్డూ అదుపూ ఉండదు. ప్రభుత్వ జీఓ నం.18 ప్రకారం విద్యార్థులకు మొత్తం ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజు, పరీక్ష ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరించాలి. కేవలం లైబ్రరీ డిపాజిట్ రూ.1,000, ల్యాబ్ డిపాజిట్ రూ.1,500లు మాత్రమే విద్యార్థులు చెల్లించాలి. కానీ ఆచరణలో కాలేజీ యాజమాన్యాలు డెవలప్‌మెంట్ ఫీజు, స్పెషల్ ఫీజులు, యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు పేరు మీద ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు బలవంతంగా వసూలు చేస్తున్నాయి. మంజూరైన తర్వాత ఇస్తామని స్పెషల్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. తర్వాత స్వాహా చేస్తున్నాయి.

తీర్పు ప్రభుత్వానికి అనుకోని వరం!

ఫీజు చెల్లింపు పథకానికి ఎప్పుడు ఎగనామం పెడదామా అని రెండు సంవత్సరాలుగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు అనుకోని వరంగా మారింది. రాష్ట్ర సర్కార్ మొక్కుబడిగా సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లినా చిత్తశుద్ధితో పోరాడుతుందనే హామీ లేదు. ఈ తీర్పును అడ్డం పెట్టుకుని రెన్యువల్, ‘ఫ్రెష్’ విద్యార్థులకు ప్రభుత్వం బడ్జెట్ కల్పించడం లేదు. ఫీజుల జీఓను ప్రభుత్వం ఇప్పటికే కొట్టివేసింది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రంలోని 706 ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్నత ప్రమాణాలు గల మొదటి 20 కాలేజీలకు మాత్రమే ఫీజు పెంచుకునే అవకాశం ఉంది. మిగతా కాలేజీలకు ఈ తీర్పుతో మరింత నష్టం జరుగుతుంది. ఇప్పటికే 50 సీట్లు కూడా భర్తీ కాని 150 ఇంజనీరింగ్ కాలేజీలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. కోర్టు తీర్పుతో విద్యార్థుల సంఖ్య తగ్గి కాలేజీలు శాశ్వతంగా మూతపడటం ఖాయం. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం వచ్చిన తరువాత కాలేజీలకు జవజీవాలు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య పెరిగింది. పథకం అమలులో ఏ మాత్రం తేడా వచ్చినా 706 ఇంజనీరింగ్ కాలేజీలలో కనీసం 500 కాలేజీలు మూతపడవలసి వస్తుంది. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలు కూడా వందల సంఖ్యలో మూత పడతాయి.

ఏం చేయాలంటే...

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలి.
ఫీజుల నియంత్రణాధికారం, ఫీజులను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి ఉండే విధంగా అసెంబ్లీలో చట్టం చేయాలి.
వృత్తి విద్యా కాలేజీలకు దేశమంతటా ఒకేవిధంగా ఫీజులు ఉండేటట్లు పార్లమెంటులో చట్టం చేయాలి.
కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
యూనివర్సిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలు ప్రారంభించాలి. దీనిమూలంగా ఫీజుల భారం తగ్గుతుంది. ఎందుకంటే అప్పుడు అధ్యాపక సిబ్బంది వేతనాలు యూజీసీయే చెల్లిస్తుంది.

No comments:

Post a Comment