అధ్యాపకుడి ఆత్మకథ
"మహాపురుషులకు మాత్రమే ఆత్మకథలవసరమనేది నేనంగీకరించను. నా వంటి వారి జీవితం ఇతరుల కాదర్శప్రాయం కాకపోవచ్చు. కాని ఈ పుస్తకం వలన నిజాం పాలనలో మా పల్లెల పరిస్థితి, అప్పటి ఆచారాలు, అలవాట్లు, సామాజికస్థితి, నైతిక విలువలు వంటి ఎన్నో విషయాలు ఇప్పటివారికి తెలిసే అవకాశముంది. చరిత్రతో పనిలేదనుకునే వారికి తప్ప ఇతరులందరికీ ఇటువంటివి అవసరమే''- ఈ పుస్తకం తానెందుకు రాశానో చెప్పుకుంటూ డా.కండ్లకుంట అళహ సింగరాచార్యులు రాసిన వాక్యాలివి. ఎనిమిది పదులు పైబడ్డ జీవితాన్ని చూసిన ఈ 'అధ్యాపకుడి ఆత్మకథ'లోంచి కొన్ని ఆసక్తికర భాగాలు మీ కోసం.
నాకు అక్షరాభ్యాసం అయిదో ఏట జరిగి ఉంటుంది. అప్పటి సన్నివేశమేదీ నాకు జ్ఞాపకంలేదు. మాది చాలా కుగ్రామం. అందువల్ల మా ఊళ్లో ప్రభుత్వ పాఠశాల అప్పట్లో లేదు. హైదరాబాద్ సంస్థానంలోనే పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు చాలా తక్కువ కనుక నా చదువు వీథి బడులతోనే ప్రారంభమైంది. మొత్తం 4,5 స్థలాల్లో మా బడి మారుతూ వచ్చింది. దొరవారి ఇంటి ప్రక్క ఖాళీ ఇంటిలో కొన్నాళ్లు, దొరల ఇంటి ఆవరణలో కొన్నాళ్లు, పోకల గుర్వయ్య అనే మోతుబరి ఇంటి ముందు కొట్టంలో కొన్నాళ్లు, కోమటి వీథిలో ఒక ఇంట్లో మరికొన్నాళ్లు వీథిబడి సాగింది. ఒక్క రాజారాం అనే ఉపాధ్యాయుని పేరు మాత్రం నాకు గుర్తుంది. ఇంకా ఎవరెవరో చదువు చెప్పినారు. ఏకోపాధ్యాయ పాఠశాలగానే నడిచేది. ఉదయం చీకటితోనే లేచి బడికి వెళ్లాలి. మొదట బడికి వచ్చిన వారికి శ్రీ అని, రెండవ వ్యక్తికి చుక్క అని అరచేతిలో రాసేవారు.
ఆలస్యంగా వచ్చిన వారికి బెత్తపు దెబ్బలు తగిలేవి. నేలపై ఇసుకలో అక్షరాలు వ్రాసి చేతితో దిద్దించేవాళ్లు. సుమారు 9 గంటలకు ఇంటికి వచ్చి స్నానం, భోజనం చేసి మళ్లీ బడికి వెళ్లాలి. సాయంకాలం 4 గంటల ప్రాంతంలో అందరితో సంఖ్యలు, ఎక్కాలు, పద్యాలు చెప్పించి ఇంటికి పంపేవారు. ఏకాదశినాడు ఒక్క పూట బడి, అమావాస్య, పున్నమి బడికి సెలవులు. పండుగ రోజుల్లో బడి ఉండదు. అక్షరాల్లో మొదట శ్రీ అనేదాన్ని పెద్దగా వ్రాసి దిద్దించేవారు. తరువాత ఓం నమః శివాయ సిద్ధం నమః అని వ్రాయించి తరువాత అ ఆ మొదలు వర్ణమాలను దిద్దబెట్టేవారు. మొదట ఇసుకలో దిద్దించినా, తరువాత చెక్కపలకలు వాడుకలోకి వచ్చినవి.
సుమారు గజం పొడుగు ఉండే కొయ్యపలక బరువుగా ఉండే ది. దానిమీద బలపాలతో అక్షరాలు దిద్దటం, గుణింతాలు నేర్చుకోవటం జరిగేది. ఆ బలపాలు ఒక రకమైన సుద్ద రాతితో చేసినవి. ఇంకా అప్పటికి స్లేట్ పలకలు మా వాడుకలోకి రాలేదు. కాగితాలు, పెన్సిళ్లు బొత్తిగా వాడకంలో లేవు. పెద్ద బాలశిక్ష ఆధారంగా చదువు అంతా మౌఖికంగానే సాగేది. నెలల పేర్లు, వారాలు, నక్షత్రాలు, సంవత్సరాల పేర్లు, ఎక్కాలు మొదలైనవి అన్నీ కంఠస్థం చేయించేవారు. మొదట చిన్న బాలశిక్షలో అక్షరాలు, గుణింతాలు, చిన్న మాటలు నేర్పిన తరువాత పెద్ద బాలశిక్ష ఆరంభించేవారు.
దానిలో చిన్న వాక్యాలు, సామెతలు, పద్యాలు, నీతికథలు, సంఖ్యలు, ఎక్కాలు, భూగోళ విషయాలు కొన్ని, నెలల, నక్షత్రాల, సంవత్సరాల పేర్లు, ఇంకా ముఖ్యమైన ఇతర విషయాలు చాలా ఉండేవి. 'ఖర్జూర ఫలములు గణకుండు' అని పద్యరూపంలో గణిత సమస్యలు కూడా ఉండేవి. ఒక సంవత్సరం పైవిషయాలు కంఠస్థం మాత్రం చేయించి, రెండవ సంవత్సరం విద్యార్థులతో పలకమీద మాటలు, ఎక్కాల వంటివి వ్రాయించేవారు. మౌఖికంగా కథలు చెప్పించటం, పద్యాలు, శ్లోకాలు చదివించి కొద్ది కొద్దిగా వ్రాయించటం జరిగేది. మొదటి తరగతి తెలుగు వాచకం చదివించేవారు.
అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నిజాం పరిపాలనలో ఉన్నది కనుక ఉర్దూ రాజభాషగా ఉండేది. ఇప్పుడు ఇంగ్లీషువలె ఆ రోజుల్లో ఉర్దూ తప్పక బడులలో నేర్పేవారు. అందువల్ల మా బడిలో కూడా ఉర్దూ నేర్చుకున్నాం. నేను తీస్రీ (మూడవ వాచకం) వరకు ఉర్దూ నేర్చుకున్నాను. అప్పట్లో ఉత్తరాల మీద అడ్రస్‌లు వ్రాయటం, తహశీల్ ఆఫీసులో, పెద్ద కార్యాలయాల్లో దరఖాస్తులు ఉర్దూలోనే వ్రాయటం జరిగేది. అయినా ప్రజల్లో ఇప్పుడు ఆంగ్ల వ్యామోహం పెరిగినంత అప్పుడు ఉర్దూపై మోజు వ్యాపించలేదు. అవసరమైన చోటనే ఆ భాష ఉపయోగించేవారు. నేను కూడా ఆ రోజుల్లో ఉర్దూ కొంతవరకు వ్రాయటం, చదవటం నేర్చుకున్నాను. ఇప్పుడు వ్రాయటం, చదవటం దాదాపు మరిచిపోయినాను. విని అర్థం చేసుకోగలను, కొంత మేరకు మాట్లాడగలను కూడా.
అప్పుడు వీథిబడిలో నాతోపాటు 10, 12 మంది వరకు చదువుకునేవారు. వైశ్యులు రామకృష్ణ, సత్యం, రామనర్సమ్మ అనేవారు, పోకల భిక్షమయ్య, బుస్సా లచ్చయ్య, పుల్లయ్య, తొగరు తింగయ్య, గోపయ్య అనే పెరిక రైతు బిడ్డల పేర్లు మాత్రం ఇప్పుడు జ్ఞాపకమున్నాయి. చాకలి, మంగలి, గౌడ మొదలగు కులాలవారు తమ పిల్లలను బడికి పంపేవారు కాదు. ఆర్థిక పరిస్థితి ఒక కారణం కాగా, "మాకు చదువులెందుకు? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా?'' అనే మనస్తత్వం మరొక కారణం.
* * * మా ఇంటిపై దాడి
ఒక రాత్రి మా ఇంటిపైన కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యం దోచుకుపోయినారు. పట్వారీలు ప్రభుత్వోద్యోగులు, సాధారణంగా ప్రజలను పీడిస్తుంటారు కనుక వారిపై దాడి చేయాలనేది కమ్యూనిస్టుల అప్పటి విధానం. ఇంట్లో చొరబడి గాదెలలో ఉన్న ధాన్యాన్ని గంపలతో బయటికి తరలించుకొనిపోయినారు. అడ్డగించకపోవటం వలన ఎవరినీ కొట్టటం వంటివేమీ చేయలేదు. మా అన్నయ్య పట్వారీ గుమాస్తాగా ఉన్నప్పుడు ప్రభుత్వ శిస్తు వసూళ్లలో కఠినంగా ఉండటం తప్ప గ్రామస్థులపై క్రూరంగా ప్రవర్తించేవాడు కాదు. అయితే పొరుగు గ్రామాల పార్టీ కార్యకర్తల చొరవతో అన్ని చోట్లవలె ఇక్కడ కూడా చేసినారు. మా ఊరి వాండ్లు కూడా కొంతమంది దోపిడిలో చేరి ఉండవచ్చును. రాత్రిపూట, చిమ్మచీకటలో ఎవరినీ గుర్తు పట్టలేకపోయినారు.
మా రెండో అన్నయ్య కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ఉన్నా, వాళ్లు ఈ దోపిడీ జరిపినారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి వారిని ఎదిరించలేదు కాని తాను కూడా ఒక గంపతో ధాన్యం తీసుకొని మరొకవైపు తరలించి, ఆ విధంగా కొంత ధాన్యాన్ని మాకు దక్కించినానని తరువాత చెప్పినాడు. కొందరు జమీందార్లు, పట్వారీలు తమ ఇండ్లకు తగు రక్షణ ఏర్పాట్లు చేసుకొని దాడిని తప్పించుకున్నారు. మాది సామాన్య కుటుంబం కనుక, ఎవరినీ బాధించలేదు కనుక ఇటువంటి దాడిని ఊహించనందువలన ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేసుకోలేదు.
ఆ రాత్రి మా ఇంటి పక్కనే ఉన్న దొరగారి ఇంటి బయట గుమ్ములలోని ధాన్యాన్ని కూడా దోచుకున్నారు. వారి ఇంటివద్ద ఎవరో ఒక జీతగాడు ధాన్యానికి కాపలాగా పడుకునేవాడు. అంతమంది జనం గుంపుగా వచ్చినప్పుడు అతడేమి చేయగలడు? భయంతో తప్పించుకుని పారిపోయి ఉంటాడు. అక్కడ ఎక్కువ ధాన్యాన్ని దోచుకుని, తరువాత పక్కనే ఉన్న మా ఇంటిపై పడ్డారు. అంతకు ముందు ఎన్నో సంవత్సరాలుగా దొరల ఇంట్లో ఎవరూ ఉండకున్నా, బయట గుమ్ముల్లో ధాన్యం నిల్వచేసినా ఎప్పుడూ దొంగతనం కాని, దోపిడీ కాని జరుగలేదు.
నేను యాదగిరిగుట్ట నుండి వెళ్లేవరకు, అంతకు ముందు జరిగిన ఈ సంఘటనతో మా ఇంట్లో వాళ్లందరూ విషాద భరితులై ఉన్నారు. గ్రామంలోని ముఖ్యులు వచ్చి మా వారిని ఓదార్చి వెళ్లినారట.
గ్రామ ప్రజలతో కలివిడిగా మెసిలే మా అన్నయ్య దీనితో కలత చెంది ఇక ఆ పట్వారీ పని చేయనని నిశ్చయించుకుని ఆ విషయాన్ని కోదాటి వెంకటేశ్వరరావు గారికి తెలిపినాడు. తరువాత ఇక ఆయన ఆ పని జోలికి పోలేదు.
* * * రజాకార్లు
నాకు అప్పటికి రాజకీయ అవగాహన ఏమాత్రం లేదు. అయినా రజాకార్ల, పోలీసుల దౌర్జన్యాలను గూర్చి వింటుండేవాణ్ణి. గుట్టమీద ఎత్తులో ఉన్నాం కనుక అప్పుడప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో రజాకార్లు చేసిన గృహదహనాల మంటలు, పొగలు కన్పించేవి. ఉత్తరం వైపున్న గుట్టమీద కమ్యూనిస్టులు దాక్కోగా, వారిపై తుపాకీ కాల్పులు కూడా చూచినాము. పరిస్థితి భయానకంగా ఉండేది.
కాని ఒక్క విశేషమున్నది. అంత క్రూరుడైనా రజ్వీ హిందువులపైన మత ప్రధానంగా దాడిచేయలేదు. రాజ్యంలో నూటికి 90 మంది హిందువులుండటం కారణం కావచ్చు, మరేదైనా కావచ్చును. ఎందుకంటే యాదగిరిగుట్ట మీదికి రజాకార్లు ఎప్పుడూ దాడికి రాలేదు. హైదరాబాద్‌లో సీతారాంబాగ్, సికింద్రాబాదులో పెద్ద దేవాలయాల మీద కూడా దాడి చేయలేదు. జీడికల్లు, అర్వపల్లి, ధర్మపురి వంటి స్థలాల్లో కూడా వాళ్లు దౌర్జన్యం చేసినట్లు వినలేదు. ఆయుధ బలం, పోలీసుల అండా ఉన్న రజాకార్లు తలుచుకుంటే దాడిచేయటం కష్టమేమీ కాదు. పాపభీతియో, దైవభయమో కాని వారా సాహసం మాత్రం చేయలేదు. జనం మాత్రం లోపల భయపడ్డారు. రజాకార్ల అలజడులు తీవ్రంగా ఉన్న రోజుల్లో నేను, సీతారామానుజాచారుయలు, వేణుగోపాలాచార్యులు యాదగిరి పాఠశాలలోనే ఉన్నాము. మా విద్యాభ్యాసం అప్పుడు కూడా నిరాఘాటంగా కొనసాగింది. మేఘసందేశం రెండు సర్గలే కనుక అది పూర్తిగా బోధించేవారు. కిరాతార్జునీయాన్ని భారవి అని, శిశుపాల వధను మాఘం అని ఆయా కవుల పేర్లతో వ్యవహరించటం ప్రసిద్ధంగా ఉన్నది. ఆ రెంఉడ కావ్యాల్లో మూడేసి సర్గలు విద్యార్థులకు బోధన జరిగేది.
మా బంధువులు ఎక్కువగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనే ఉన్నారు. ఆ రెండు సరిహద్దు జిల్లాలు కనుక రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి కుటుంబాలతో సహా గౌరవరం, వల్లాల, చిత్తలూరు, ఇటుకుడుపాడు మొదలైన నల్లగొండ ప్రాంతపు గ్రామాల బంధువులు మునగాల పరగణాకు వలస వచ్చినారు. కొందరు జగ్గయ్యపేట వైపు వెళ్లినారు. నేలమర్రిలో, తాడువాయిలో గ్రామస్థుల సహాయంతో పాకలు వేసుకుని కాందిశీకులుగా ఉండసాగారు.
మాకు నేలమర్రి రెండు మైళ్ల దూరంలోనే ఉన్నందున, మాకు అక్కడ ఇల్లు కూడా ఉన్నది కనుక భక్తలాపురం నుంచి మా వాండ్లందరూ నేలమర్రికి మకాం మార్చినారు. అది అప్పుడు కృష్ణాజిల్లాలో ఉన్నది. కనుక నిజాం ప్రాంతం కాదు. బహుశా దసరా ప్రాంతంలో మా వాళ్లు నేలమర్రి చేరి ఉంటారు. అప్పటి నుండి వారు మాకు కార్డులు వ్రాస్తూనే ఉన్నారు. 'రజాకార్ల అలజడి ఎక్కువగా ఉన్నది. తొందరగా బయలుదేరి నేలమర్రికి రండి. పరిస్థితులు బాగుపడ్డ తరువాత మళ్లీ వెళ్లవచ్చు' అని కోరినారు. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తరువాత సంస్థాన విమోచన కొరకు పోరాటం తీవ్రం చేయటం వలన ప్రభుత్వ దమన పద్ధతులు కూడా తీవ్రమయినాయి. చివరకు మేము ముగ్గురం గురువు గారి అనుమతి పొంది నేలమర్రి వెళ్లటానికి నిర్ణయించుకున్నాము.
సంక్రాంతి పండుగ వెళ్లగానే 16 జనవరి 1948 శుక్రవారం నాడు ముగ్గురం బయలుదేరినాము. ఉదయమే బయలుదేరి భువనగిరి వచ్చినాము. అప్పుడు రోజుకు ఒకటో, రెండో బస్సులు సూర్యాపేటకు నడిచేవి. రెండు జాముల వరకు సూర్యాపేట చేరి, తెలిసిన వారి ఇంట్లో భోజనం చేసినాము. నగరాలలో, పట్టణాలలో రజాకార్ల దౌర్జన్యాలుండేవి కావు. అందువలన సూర్యాపేట వరకు నిర్భయంగానే వచ్చినాము. అక్కడ నుంచి నేలమర్రి చేరటమే సంకటము. అప్పుడు బస్సులేదు.
గ్రామాల నుంచి ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చి, తిరిగి వెళ్లే బండ్ల కొరకు అన్వేషణ మొదలుపెట్టగా, చివరకు నేలమర్రి వెళ్లే బండి ఒకటి కనపడింది. వాళ్లను బ్రతిమిలాడి ఒప్పించి బండి మీద ఎక్కినాము. అప్పటికాలంలో బ్రాహ్మణులని, మన ఊరివాండ్లని, రజాకార్ల భయమున్నదని సానుభూతితో ఆలోచించేవారు. అందువలన తమతో రమ్మన్నారు. బండిలో కూర్చున్నా భయంగానే ఉన్నది. రజాకార్లు ఎక్కడ వస్తారో, ఏమి బాధలు పెడతారో అని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాము. అప్పుడు పగలంతా రజాకార్ల రాజ్యం, రాత్రిళ్లు కమ్యూనిస్టుల ఆధిపత్యమన్నట్లుండేది గ్రామాల్లో.
మా అదృష్టం వలన తిరుమలగిరికి బండ్లు చేరేవరకు మాకు ఎటువంటి చికాకు క లుగలేదు. అప్పటికి సాయంకాలం సుమారు 5 గంటలు అయి ఉంటుంది. అక్కడి నుండి జాతీయ రహదారి వదిలి బండ్లబాటపై గుంజలూరు వైపు ప్రయాణం. సాయంకాలం కావచ్చింది కనుక ఇక రజాకార్లు రారు అని కొంత ధైర్యం కలిగింది. రాత్రిళ్లు కమ్యూనిస్టులు దొంగచాటుగా దాడి చేస్తారని రజాకార్లు తిరిగేవాళ్లు కాదు. గుంజలూరు నుంచి నేలమర్రి దారిలో నైజాం సరిహద్దు దాటి కృష్ణా జిల్లాలో ప్రవేశించి ఊపిరి పీల్చుకున్నాము. అప్పటికే నల్లగొండ ప్రాంతం నుంచి మా బంధువులు కొంతమంది అక్కడికి వచ్చి పాకలు వేసుకుని ఉంటున్నారు.

____________________________________________________________________