Friday, December 9, 2011

__

పెరిగిన ఆర్ధిక అసమానతలు
గట్టిగా ఆధారపడదగని పనిపాట్లతో బతుకులీడుస్తున్న వారి సంఖ్య అన్ని దేశాలలో కంటె మన దేశంలోనే అధికంగా ఉన్నదని ఆర్ధిక సహకారం, అభివృద్ధి సంస్థ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. స్త్రీలైతే అధికంగా పాచిపని వంటి చాలీ చాలని ఆదాయపు వ్యాపకాలతో రోజులు గడుపుతున్నారని వీధుల్లో తిరిగి సరకులమ్ముకునేవారి సంఖ్య అపారంగా ఉన్నదని ఈ నివేదిక స్పష్టం చేసింది. బాలకార్మిక సమస్య ఇంకా అపారంగా ఉన్న దేశాలలో భారత్‌ ముందున్న సంగతీ కొత్తది కాదు. ఇరవై ఏళ్ళ ఆర్ధిక సంస్కరణలు పేదలను మరింత పేదలుగా సంపన్నులను మరింత కుబేరులుగా మార్చుతున్న చేదు వాస్తవాన్ని మరోసారి అంతర్జాతీయ నివేదికల అద్దంలో చూడవలసి రావడమే అత్యంత బాధాకరం. జనాభాలో మూడింట ఒక వంతు మంది అత్యంత అల్పాదాయ రాష్ట్రాలైన బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్‌లలోనే ఉన్నారంటే దేశంలో పేదరికం ఎంత ఆందోళనకరమైన స్థాయిలో కొనసాగుతున్నదో స్పష్టపడక మానదు. ఈ దుస్థితిని రూపు మాపనంత వరకూ మన పాలకులు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలకు యోగ్యతాపత్రం లభించదు.

దేశం ఏ స్థాయిలో వెలిగిపోతోందో, వృద్ధి రేటు ఊర్ధ్వ గమనం సగటు భారతీయుడిని ఎంతగా సంతోష తరంగాలపై తేలియాడిస్తున్నదో తెలియజేసే చేదు నిజాల నిలువుటద్దం ఈ నివేదిక. ఆర్ధిక సహకారం, అభివృద్ధి సంస్థ, అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో ఆర్ధిక అసమానతల తీరు తెన్నులపై తాజాగా విడుదల చేసిన నివేదిక ఇది. సంక్షేమ శకానికి స్వస్తి చెప్పి ఉదారవాద ఆర్ధిక సంస్కరణల బాట పట్టిన గత ఇరవై ఏళ్ళలో ఇండియాలో ధనిక, నిర్ధనిక వ్యత్యాసాలు దారుణంగా పెరిగిపోయాయని ఈ నివేదిక బల్ల గుద్ది చెబుతున్నది.

వర్ధమాన ఆర్ధిక వ్యవస్థలన్నింటిలో అధికంగా ఇండియాలోనే వేతనాదాయ వ్యత్యాసాలు పెరిగిపోయి గత రెండు దశాబ్దాలలో రెట్టింపు అయ్యాయని ఈ నివేదిక నిగ్గు తేల్చింది. భారత్‌లో ఇరవై ఏళ్ళ కాలంలో అట్టడుగు పది శాతం వేతనాదాయ పరుల రాబడితో పోలిస్తే పై 10 శాతం ఆదాయ పరుల రాబడి 12 రెట్లు ఎక్కువ అని ఈ నివేదిక స్పష్టం చేసింది. 1990వ దశకంలో ఈ ఆధిక్యం ఆరు రెట్లుగానే ఉన్నదని అది ఇప్పుడు రెట్టింపు అయ్యిందని వెల్లడించింది. దీనిని బట్టి ఉదారవాద ఆర్ధిక సంస్కరణలు సగటు భారతీయుడి బతుకును మరింత నరకప్రాయం చేసి సంపన్నుల సంపదను ఇతోధికంగా పెంచివేశాయని అవగతమవుతున్నది.

వేతనాదాయాల పెరుగుదలలో వికేంద్రీకరణ లేమిని కూడా ఈ నివేదిక ఎత్తి చూపుతున్నది. పై పది శాతం వేతనాదాయ పరుల రాబడి10 శాతం మంది మధ్యస్థ ఆదాయపరుల రాబడి కంటె 5 రెట్లు ఎక్కువగా నమోదయ్యిందని, పది శాతం అల్పాదాయ వేతన జీవుల రాబడి కంటె 10 శాతం మధ్యస్థ ఆదాయపరుల రాబడి 0.4 రెట్లు గానే నమోదయిందని నివేదిక విశ్లేషించింది. గ్లోబలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌ పుణ్యమా అని పై వర్గాల ఆదాయాలే బాగా పెరిగి కింది, మధ్యస్థ ఆదాయ వర్గాల రాబడి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఉండిపోయిందని రూఢి అవుతున్నది.

కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలలో వ్యత్యాసాలు బాగా ఉన్నాయనీ, దినసరి కూలీల వేతనాదాయాలలో మాత్రం చెప్పుకోదగిన వ్యత్యాసాలు కానరాలేదని కూడా నివేదిక వివరించింది. కిందివారి రాబడి ఎప్పటిమాదిరిగా పాతాళంలోనే ఉండగా పైవారి సంపద ఆకాశాన్ని తాకిన పరిస్థితి ఒక్క ఇండియాలోనే దారుణంగా కనిపిస్తూ ఉండడం గమనార్హం. 2000 దశకంలో పై 20శాతం ఉన్నత కు టుంబాల వినియోగిత 3 శాతం పెరగగా కింది స్థా యి 20 శాతం కుటుంబాల వినియోగిత పెరుగుదల రేటు 1 శాతం వద్దనే కొనసాగడం గమనార్హం.

కిందివర్గాల ప్రజల పరిస్థితి భారత్‌లో కంటె చైనా, బ్రెజిల్‌లలో మెరుగ్గా ఉన్నదని గణాంక వివరాలతో ఈ నివేదిక వెల్లడించింది. భారత్‌ తన స్థూల దేశీయోత్పత్తిలో 5 శాతం మాత్రమే సామాజిక భద్రతా పథకాల కింద ఖర్చు చేస్తున్నది. బ్రెజిల్‌ లో ఇది 15 శాతం. దీనిని బట్టే పేదరిక నిర్మూలన పట్ల మన పాలకుల శ్రద్ధను అర్ధం చేసుకోవచ్చు. సగటు లెక్కల్లో తేలే తలసరి రాబడిలో మాత్రం విశేషమైన పెరుగుదల కానవస్తుంది. ఎందుకంటే ముఖేశ్‌ అంబానీ ఆదాయాన్ని, ఆకలికీ చలికీ తట్టుకోలేక గుడిసెలో కాళ్ళు ముడుచుకొని నిద్రపోయే నిరుపేద ఆదాయాన్ని కలిపి జనసంఖ్యతో విభజించి చూస్తే తలసరి ఆదాయం తేలుతుంది. 2002-03 సంవత్సరంలో 423 డాలర్లున్న భారతీయుల తలసరి ఆదాయం 2010-11లో 1219 డాలర్లకు చేరుకున్నది. అంటే ఎనిమిదేళ్ళలో మూడు రెట్లు పెరిగింది. పేదరికం మాత్రం అసాధారణ స్థాయిలో కొనసాగుతున్నది. తలసరి ఆదాయం పెరుగుదల బండారాన్ని ఈ చేదు వాస్తవం బయటపెడుతున్నది.

దేశ జనాభాలో 75.6 శాతం మంది రోజుకి రెండు డాలర్ల లోపు ఆదాయంతో బతుకుతున్నారని, 41.6 శాతం మంది 1.25 డాలర్ల లోపు రాబడితో సరిపెట్టుకుంటున్నారని 2005లో ప్రపంచబ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. జనాభాలో 37 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని కేంద్ర ప్రభుత్వం 2009లో చేసిన నిర్ధారణ తీవ్ర విమర్శలకు పాత్రమైంది. అవ్యవస్థీకృత రంగం కార్మికుల స్థితి గతులపై అధ్యయనం చేసిన అర్జున్‌ సేన్‌ గుప్తా కమిటీ దాదాపు 80 శాతం దేశ జనాభా రోజుకి తలసరి 20 రూపాయల రాబడితో సరిపుచ్చుకుంటున్నదని నిగ్గు తేల్చింది. రోజుకి 26 రూపాయల పైన ఆదాయం సంపాదిస్తున్న వారు పేదలు కారని ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌పై విమర్శల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఇటువంటి అవాస్తవిక, అమానవీయ గణాంకాలతో దేశంలో పేదరికం తగ్గిందని చెప్పడానికి, తద్వారా ఇప్పటికే కనీస స్థాయిలో గల సంక్షేమ బాధ్యతలనుంచి తప్పుకోవడానికి కేంద్ర పాలకులు, ప్రణాళికా సంఘం వేస్తున్న ఎత్తుగడలు అవహేళనకు గురి అవుతున్నాయి.

దేశంలోని ఉద్యోగులు, కార్మికులలో కేవలం 7 శాతం మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉన్నారంటే మిగతావారు ఎంతటి శ్రమదోపిడీకి గురి అవుతున్నారో చెప్పుకోనక్కర లేదు. గట్టిగా ఆధారపడదగని పనిపాట్లతో బతుకులీడుస్తున్న వారి సంఖ్య అన్ని దేశాలలో కంటె మన దేశంలోనే అధికంగా ఉన్నదని ఆర్ధిక సహకారం, అభివృద్ధి సంస్థ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. స్త్రీలైతే అధికంగా పాచిపని వంటి చాలీ చాలని ఆదాయపు వ్యాపకాలతో రోజులు గడుపుతున్నారని వీధుల్లో తిరిగి సరకులమ్ముకునేవారి సంఖ్య అపారంగా ఉన్నదని ఈ నివేదిక స్పష్టం చేసింది. బాలకార్మిక సమస్య ఇంకా అపారంగా ఉన్న దేశాలలో భారత్‌ ముందున్న సంగతీ కొత్తది కాదు.

ఇరవై ఏళ్ళ ఆర్ధిక సంస్కరణలు పేదలను మరింత పేదలుగా సంపన్నులను మరింత కుబేరులుగా మార్చుతున్న చేదు వాస్తవాన్ని మరోసారి అంతర్జాతీయ నివేదికల అద్దంలో చూడవలసి రావడమే అత్యంత బాధాకరం. జనాభాలో మూడింట ఒక వంతు మంది అత్యంత అల్పాదాయ రాష్ట్రాలైన బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్‌లలోనే ఉన్నారంటే దేశంలో పేదరికం ఎంత ఆందోళనకరమైన స్థాయిలో కొనసాగుతున్నదో స్పష్టపడక మానదు. ఈ దుస్థితిని రూపు మాపనంత వరకూ మన పాలకులు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలకు యోగ్యతాపత్రం లభించదు.

________________________________________

ఏది సత్యం? ఏది అసత్యం?

మెహెర్‌బాబాకు అత్యంత సన్నిహిత మండలి సభ్యుడు ఏరుచ్ జెస్సావాలా చెప్పిన విషయాలివి. ఒకసారి ఒక వకీలు బాబా దగ్గరకు వచ్చాడు. ప్లీడరు వృత్తి గురించి మీకు తెలుసు. తన వృత్తిలో తరచు ఎదురవుతున్న సమస్యలపై ఎదురవుతున్న మానసిక క్షోభను బాబా ఎదుట ఆ వకీలు ఏకరవు పెట్టినప్పుడు, బాబా అతనికి ఉపశమనం కలిగించే కొన్ని మాటలు చెప్పారు. అదేమంటే, నీ దగ్గరకు వచ్చిన వానికి వీలుగా, వాని తరపున కోర్టులో కేసు వాదించి కక్షిదారుడిని గెలిపించాలి. ఇది నీ వృత్తి ధర్మం.నీ వాక్పటిమతో, న్యాయశాస్త్రాన్ని ఉటంకిస్తూ కక్షిదారుడిని కాపాడటంలో, అతని కేసు గెలిపించడంలో తప్పు లేదు.

నీ సహాయం కోరి వచ్చిన కక్షిదారుడిని కాపాడటానికి అతడు చెప్పిన కేసు వివరాలను తెలుసుకొని నీ శక్తివంచన లేకుండా కోర్టులో గట్టిగా వాదించి అతడిని నీవు కాపాడటానికి ప్రయత్నించక పోయినట్లయితే నీవు అతడికి ద్రోహం చేసిన వాడివి అవుతావు. ఇలాంటి సందర్భాల్లో సాధారణ నీతి సూత్రాలను నీవు పాటించనవసరం లేదు. నీ వృత్తికి అనుకూలమైన న్యాయ శాస్త్రంలోని ఎలాంటి పద్ధతినైనా ఉపయోగించి, నీవు అతడిని చివరి వరకూ సమర్థించాలి, అని బాబా పేర్కొన్నారు.

వృత్తిధర్మం, బాధ్యత
అలాగే, మరొక విషయంలో బాబా ప్రసంగిస్తూ, ఒకవేళ మీ వృత్తి చార్టెడ్ అకౌంటెన్సీ అయితే, నీ వృత్తి ధర్మం ఏం చెబుతుంది. నీ ఖాతాదారులు ఎలా పన్నులు తగ్గించుకోవాలో సలహా ఇవ్వటమే కదా. పన్నులు ఎట్లా ఎగగొట్టాలో కాదు సుమీ అన్నారు. చట్టంలో ఉన్న లొసుగుల ద్వారా ఎట్లా తప్పించుకోవాలో చెప్పటమే నీ వృత్తిధర్మం. ప్రభుత్వం సరిగ్గా నడవటానికి ప్రతి ఒక్కరూ పన్నులు సక్రమంగా చెల్లించాలి. కానీ, నీ ఖాతాదారుకు నీవు తక్కువ పన్నులు కట్టేలాగా సలహా ఇవ్వాలి. అది నీ బాధ్యత. అలా నీవు చేయలేకపోతే నీవు నిజాయితీగా వ్యవహరించినట్లు కాదు అని బాబా స్పష్టం చేశారు.

ఇతరులకు సహాయపడేది సత్యం
అవతార్ మెహెర్‌బాబా ఏమన్నారంటే...మనమందరం జీవితమనే ఓ గొప్ప నాటకరంగం మీద నటిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఎవరి శక్తి మేరకు వారు సమర్ధవంతంగా వారి పాత్రను పోషించాలి. నిజాయితీగా ఉండటం అంటే అదే అని బాబా ఉద్బోధించారు.ఈ సందర్భంలో తన స్మృతిపథంలోని ఓ చక్కని సంగతి చెపుతానని ఏరుచ్ ఇలా వివరించారు. ఏరుచ్ మెహెర్‌బాబా దగ్గరకు చేరిన తొలినాళ్ల విషయమిది. 1830వ దశకంలోనే ఏరుచ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ దరిమిలా మెహెర్‌బాబాలో తన ఇష్టదైవాన్ని దర్శించుకొని ఆయన సేవకే అంకితమయ్యాడు.

ఆ ముచ్చట అలా ఉంచితే, ఆ రోజుల్లో ఏరుచ్‌కు తనపై తనకు వల్లమాలిన అభిమానం, నమ్మకం, గర్వం ఉండేది. ఎందుకంటే తానెప్పుడూ అబద్ధమాడనని, ఎల్లవేళలా సత్యం చెబుతానని గర్వంగా ఫీలయ్యేవాడు. ఒకవేళ ఎవరైనా అబద్ధాలు చెబుతున్నట్లు అతను గ్రహిస్తే వారి పట్ల కించిత్ అసహనంగా ఉండేవాడినని ఏరుచ్ చెపుతాడు. వాళ్లను చాలా ఘాటుగా విమర్శించేవాడినని, అసహ్యించుకునే వాడినని ఏరుచ్ పేర్కొన్నాడు. ఈ విషయంలో తాను చాలా మంది హృదయాలను గాయపర్చానని ఒప్పుకున్నాడు. ఈ విషయాలన్నీ బాబాకు తెలిసి ఓ రోజున తనను దగ్గరగా పిలిచి కూర్చోమన్నారు.

నీవు ఎప్పుడూ సత్యం పలుకుతానని గర్వం కదా అని బాబా నన్ను ప్రశ్నించారు. నేను అవునని ఒప్పుకున్నాను. ఆ దరిమిలా నన్ను సముదాయిస్తున్న వాడిలా బాబా నన్ను అడిగారు కదా... నీకు సత్యం అంటే ఏమిటో తెలుసా? అంటూ నీవు ఏది మాట్లాడితే ఇతరులకు సహాయపడుతుందో అది సత్యం అనిపించుకుంటుంది. ఆ మాటల వెనుక ఉన్న ఉద్ధేశం ఏదైతే ఉన్నదో అదే సత్యం అని సూక్ష్మంగా వివరించారు. ఆ సమయంలో మెహెర్‌బాబా నాకు ఈ కథ ద్వారా ఈ విషయాన్ని మరింత వివరంగా చెప్పారన్నారు ఏరుచ్.

ప్రాణభిక్ష
ముహమ్మద్ ప్రవక్త శరీరం విడిచిన తర్వాత అతని దగ్గరి శిష్యుడు ఆలీ ఓ రోజు మసీదు బయట కూర్చున్నాడు. ప్రవేశద్వారానికి ఒక పక్కగా అతడు కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి, ఆలీ సహాయం కోసం అర్థించాడు. నాకు సాయం చేయండి. అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆలీ అతడిని మసీదు లోపలకు వెళ్లమని సలహా చెప్పాడు. అతగాడు ఆ విధంగా లోపలకు వెళ్లాక అలీ ద్వారానికి ఒక వైపున కూర్చుని ఉన్న వాడల్లా లేచి ఇంకొక వైపు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లోనే ఆ వ్యక్తిని వెంబడిస్తున్న గుంపు ఆలీ దగ్గరకు వచ్చి, ఎవరైనా అటుగా వెళ్లడం చూశావా? అని అడిగారు.

" లేదు. నేను ఈ స్థానంలో కూర్చున్నప్పటి నుంచి, చూడలేదు'' అని వాళ్లకు సమాధానం చెప్పాడు. దాంతో ఆ వ్యక్తిని చంపడానికి వచ్చిన గుంపు మరో దిశలో వెళ్లిపోయింది. ఆ ఆగంతకుడు ఆలీ వల్ల ప్రాణభిక్ష పొందాడు. ఇక్కడ ఆలీ అబద్ధం ఆడాడా? అంటే లేదనే చెప్పాలి. ఇతరులకు సహాయం చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నీవు మాట్లాడితే అది సత్యమే అవుతుందని బాబా అన్నారు. బాబా చెప్పిన ఈ చిన్న కథ నేను ఎన్నటికి మరువ లేదు అంటూ ఇప్పుడు చెప్పండి ఏది సత్యం. ఏది అసత్యం అని ఏరుచ్ అన్నాడు.

No comments:

Post a Comment