Wednesday, December 7, 2011

రాజ్యాంగ విరుద్ధం ‘క్రీమీలేయర్‌’

- రిజర్వేషన్లు ఆర్ధికాభివృద్ధి కోసమే కాదు!
- అధికారంలో వాటా కోసమే రాజ్యాంగ రక్షణలు
- సామాజిక గౌరవానికి తొలిమెట్టు రాజ్యాధికారమే
- సంక్షేమ పథకాలకే ఆర్ధిక పరిమితి సమంజసం
- సంపదలో, అధికారంలో పేద కులాలకు భాగస్వామ్యం
- ప్రజాస్వామ్యంలో అన్ని కులాల వారికీ వాటా అవసరం


bc-meetమరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఉద్యోగ నియామకాలలో క్రీమీలేయర్‌ పరిమితి విధించాలని నిర్ణయిచింది. ఇది నిప్పుతో చెలగాటం ఆడడమే! 1993 నుండి చంద్రబాబు హయాంలో, ఆ తర్వాత వై.ఎస్‌. హయాంలో, మళ్ళీ రోశయ్య హయాంలో క్రీమీలేయర్‌ విధించాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసింది. కాని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పటి ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2006లో జీఓ నెం. 3 జారీ చేశారు. బీసీ సంఘాలు వ్యతిరేకించగా పెండింగులో పెట్టారు. ఆ తర్వాత రోశయ్య హయాంలో 2009లో అధికారులు 496 జీఓ జారీచేశారు. అప్పుడు బీసీ సంఘాలు భగ్గుమనగా మళ్ళీ పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎవరూ అడగకుండానే ప్రభుత్వం ‘క్రీమీలేయర్‌’ కుంపటిని తలకెత్తుకోవాలని చూస్తున్నది.

క్రీమీలేయర్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో, అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో (మన రాష్ట్రం మినహా) అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉండడంతో ప్రభుత్వం గత 18 సంవత్సరాలుగా ఈ విధానం అమలును సుప్త చేతనావస్థలో పెట్టినా, మళ్ళీ అమలు చేయాలని చూస్తున్నది. క్రీమీలేయర్‌ అంటే- బీసీలు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పొందడానికి వారి సంవత్సరాదాయం రూ. 4 లక్షల గరిష్ఠ పరిమితికి లోబడి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఈ రిజర్వేషన్లు పొందడానికి అనర్హులు అవుతారు.క్రీమీలేయర్‌ పరిమితిని ఒక్క బీసీ వర్గాలకే ఎందుకు విధించాలి? 9 వర్గాలు రిజర్వేషన్లను పొందుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు తదితర వర్గాలకు లేని ‘క్రీమీలేయర్‌’ పరిమితి బీసీలకే ఎందుకు? ఓపెన్‌ కాంపిటేషన్‌ వర్గాలకు కూడా క్రీమీలేయర్‌ పరిమితి విధిస్తే, అగ్రకులాలలోని పేదవారికి కూడా ఉద్యోగాలు దక్కుతాయి కదా! ఇటీవలి పరిణామాలలో బ్రాహ్మణులు ఆర్థికంగా చాలా చితికి పోయారు. రెడ్లు, కాపులు, వెలమలు కూడా చాలా మంది కూలిపనికి పోవలసి వస్తున్నది. వీరికీ క్రీమీలేయర్‌ పరిమితి విధిస్తే, వారిలో పేదవారికి ఉద్యోగాలు వస్తాయి.

క్రీమీలేయర్‌ పరిమితిని కేవలం బీసీ రిజర్వేషన్లకు మాత్రమే విధించడం సమంజసమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, వర్గాలకు, ముఖ్యంగా పీడిత వర్గాలకు, కొన్ని శతాబ్దాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు అనివార్యం. రాజ్యాంగబద్ధంగా వీరి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌- విద్య, ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం లేని కులాలను గుర్తించి, వారి సాంఘిక, విద్య వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నది. అలాగే రాజ్యాంగంలోని 15 (4), 16 (4) ఆర్టికల్స్‌లో కూడా ఇదే అంశం స్పష్టంగా ఉంది. ఆర్థికాంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మాత్రం ఎక్కడా లేదు! రిజర్వేషన్ల సిద్ధాంతానికి పునాది- సామాజిక వివక్ష, సాంఘిక, విద్యా రంగాలలో వెనుకబాటుతనమే కాని- ఆర్థిక వెనుకబాటుతనం మాత్రం కాదు. ఈ విషయాన్ని మండల్‌ కమిషన్‌, కాకా కలేల్కర్‌ కమిషన్‌‌‌ నివేదికలు స్పష్టంగా పేర్కొన్నాయి. ఇవే కాకుండా- వివిధ రాష్ట్రాలలో 64 బీసీ కమిషన్లు నియమించారు.

ఏ ఒక్క కమిషన్‌ కూడా ‘క్రీమీలేయర్‌’ విధించాలని సిఫారసు చేయలేదు. రాష్ట్రంలో మురళీధర్‌ కమిషన్‌ (1982), అనంతరామన్‌ కమిషన్‌ (1969), కర్ణాటకలో హావనూర్‌ కమిషన్‌, వెంకటస్వామి కమిషన్‌, చిన్నపరెడ్డి కమిషన్‌- ఇంకా ఇతర రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన కమిషన్లు కూడా ఆర్థిక పరిమితి నిబంధనను విధించలేదు. కేవలం కులం- కుల సాంఘిక వెనుకబాటుతనాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలని సిఫారసు చేశాయి. సమాజాన్ని, సమాజ నిర్మాణాన్ని లోతుగా అధ్యయనం చేసిన సామాజిక శాస్తవ్రేత్తలు కూడా ‘కులపరమైన’ విధానాన్ని ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి రెండు సిద్ధాంత ప్రతిపాదనలున్నాయి.1. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ప్రభుత్వ పాలనలో, అధికారంలో భాగస్వామ్యం కల్పించడం. 2. పేద కులాలకు సాంఘిక వివక్ష, వ్యత్యాసాలు తొలగించాలంటే అధికారంలో వాటా ఇచ్చి ఆ కులాల సామాజిక గౌరవాన్ని పెంచడం, ఆత్మవిశ్వాసం కలిగించడం.

ఈ రెండు లక్ష్యాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించారు తప్ప కేవలం ఆర్ధికాభివృద్ధికే కాదు. పేద కులాల ఆకలి పోరాటాలకు అభివృద్ధి పథకాలు సరిపోతాయి కాని, ఆత్మగౌరవ పోరాటానికి అధికారం కావాలి. అధికారం- ఉద్యోగాలు, రాజకీయ పదవుల రిజర్వేషన్ల ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. స్కాలర్‌షిప్‌లు, ఫీజుల రియింబర్స్‌మెంటు, రుణాలు, బలహీన వర్గాల గృహనిర్మాణ పథకాలు, స్వయంఉపాధి పథకాలు- తదితర స్కీములకు ఆదాయ పరిమితి ఉంది. దానిని ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఇది కులాల వాటా పోరాటమే తప్ప అభివృద్ధి పోరాటం కాదు. జాతి పోరాటం- కుల పోరాటమే తప్ప, అభివృద్ధి పోరాటం కాదు. అమెరికా అధ్యక్షుడుగా నల్లజాతికి చెందిన ఒబామా ఎంపికయితే ఆ జాతిలో గౌరవం, ఆత్మ విశ్వాసం పెరిగింది. అలాగే బీసీ కులాలలో, దళిత కులాలలో ఈ వర్గాలకు చెందిన వారు ఉన్నత పదవులలో ఉంటే ఆ కులాలలో ఆత్మ గౌరవం పెరుగుతుంది. అందుకే రిజర్వేషన్లు.

కులాన్ని- కుల వివక్షను, సాంఘిక అసమానతలను ఆర్థిక కోణంలో చూడరాదు. సామాజిక వివక్ష వేరు, ఆర్థికంగా వెనుకబడి ఉండడం వేరు. ఒక బీసీ కులం వారు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నా, వారికి సామాజిక గౌరవం దక్కదు. రిజర్వేషన్లను కుల వివక్షను తొలగించి సాంఘిక సమానత్వం సాధించడానికి పెట్టారే తప్ప, కేవలం ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కాదు.కనుక, ఆర్థిక పరిమితి విధించడం ఏ కోణంలో చూసినా సరికాదు. కొన్ని కులాలకు ముఖ్యంగా వడ్డెర, వాల్మీకి, చాకలి, మంగలి, వీరముష్టి, పాముల, బుడుబుక్కల, గంగిరెద్దుల, మేదర, కుమ్మర, కురుమ తదితర 40 కులాల వారికి ఇప్పటికీ సామాజిక గౌరవం లేదు.

ఈ 64 సంవత్సరాల తర్వాత కూడా ఈ కులాల నుంచి ఒక ఐఏఎస్‌, లేదా ఐపీఎస్‌ అధికారి రాలేదు. కనీసం గ్రూప్‌-1 ఆఫీసర్‌ కూడా లేరు. వృత్తి విద్యా కోర్సులు చదువలేదు. అయితే, ఈ కులాల వారు ఈ మధ్య కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఎదుగుతున్నారు, చదువుకుంటున్నారు. ఇప్పుడు క్రీమీలేయర్‌ పరిమితి విధిస్తే, ఈ కులాలవారు అధికారంలో వాటా ఎలా పొందుతారు? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కులాలకు క్రీమీలేయర్‌ అడ్డంకి కాదా!కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల ప్రాతినిధ్యం సగటున 5 శాతం దాటడం లేదు. 1980లో మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలలో బీసీలకు 2 శాతం ప్రాతినిధ్యంకూడా లేదు. గ్రేడ్‌-1 స్థాయి ఉద్యోగాలలో 3 శాతం లేదు. 1993 నుంచి కేంద్రంలో బీసీలకు ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. 2010 జనవరి 1 వరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సేకరించిన గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్‌-ఎ అధికారులు 5.7 శాతం, గ్రూప్‌-బి 4.9 శాతం, గ్రూప్‌-సి 6.2 శాతం, గ్రూప్‌-డి సిబ్బంది 6.9 శాతానికి పరిమితమయ్యారు.

ఐఏఎస్‌లు 4.2, ఐపీఎస్‌లు 6.06, ఐఎఫ్‌ఎస్‌లు 6.7 శాతం మంది మాత్రమే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో మొత్తం 32 లక్షల 50 వేల మంది ఉద్యోగులు ఉండగా వీరిలో బీసీలు ఒక లక్షా 87 వేల మంది మాత్రమే ఉన్నారు. 18 సంవత్సరాలు కేంద్రస్థాయిలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే కూడా 54 శాతం జనాభా గల బీసీలకు సగటున 6.7 శాతం దాటడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇంకా ఆదాయ పరిమితి విధిస్తే ఇంకా వందల సంవత్సరాల వరకు కూడా బీసీల ప్రాతినిద్యం జనాభా ప్రకారం నిష్పత్తిలో పెరుగదు.

క్రీమీలేయర్‌ను విధించడం వెనుక పాలకవర్గాల కుట్ర ఉంది. ఈ కులాల్లో పెరుగుతున్న చైతన్యానికి అడ్డుకట్టవేయాలని, ఈ కులాలలోని పేదవారికి నాయకత్వం లేకుండ చేయాలనే కుట్ర ఇందులో దాగి ఉందనే అనుమానం బీసీ లలో ఉంది. ‘రిజర్వేషన్లు’ ఇస్తే మెరిట్‌ దెబ్బతింటుందనే మేధావులలో- క్రీమీలేయర్‌’ను విడదీస్తే ఈ కులాల నుంచి సమర్థులు, ప్రతిభావంతులు అధికార యంత్రాంగంలోకి రాకపోవడంతో సమర్ధత దెబ్బతిని దేశాభివృద్ధి కుంటు పడుతుంది- అనే ఆలోచన ఎందుకు రావడం లేదు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా ఎంపికవుతున్నారని, డాక్టర్ల పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లుగా అవుతున్నారని, కొత్త తరాలకు ఆ అవకాశం రావడంలేదనే విమర్శ ఉంది.

krushnayaఅయితే అది ఆర్థిక పరిమితిని విధించడం ద్వారా సరికాదు. కనుక, ఒక తరం లేదా రెండు తరాలు రిజర్వేషన్లు పొందిన కుటుంబాలకు మళ్ళీ రిజర్వే షన్లు ఇవ్వకుండ అరికట్టే ఒక కొత్త ఫార్ములాను రూపొందించా లి.రాజ్యాంగంలో నిర్బంధ విద్యను పొందు పరచినట్లు, ఇంతవరకు చట్ట సభలలో అడుగుపెట్టని నిరుపేద కులాలకు నిర్బంధంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా రాజ్యాం గాన్ని సవరించాలి. ఏనాటికైనా సమాజ సంపదలో, అధికారంలో పేద కులాలకు వాటా ఇవ్వక తప్పదు.

రచయిత ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
____________________________________________________________________________

మూడ్ చెడితే అంతే!

ఒక్కోసారి మనం చేసే చిన్న పొరపాట్లకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది. ఏదో చిన్న పొరపాటేలే ఏం కాదు అని మనం అనుకుంటాం కాని మన తలరాతను కూడా మార్చే శక్తి దానికి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో చేసే పొరపాట్లకు నష్టం మనమే అనుభవిస్తాం కాని ఆఫీసులో చేసే పొరపాట్లకు మనం పని చేసే సంస్థ నష్టపోవడంతోపాటు ఉద్యోగపరంగా మనకూ చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఏ ఉద్యోగైనా ఎందుకు పొరపాటు చేస్తాడని ఇటీవల ఒక అధ్యయనం చేయగా ఇంట్లో సమస్యలే దీనికి కారణంగా తేలింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కీచులాటలు వంటివి ఆఫీసులో బాధ్యతల నిర్వహణలో పొరపాట్లకు దారితీస్తున్నాయట. ఇంట్లో భార్యతో గొడవపడిన భర్త ఆఫీసులో అన్యమనస్కంగా పనిచేయడం, దీంతో తప్పులు జరగడం సర్వసాధారణంగా జరుగుతోందట. ఉద్యోగం చేసే ఆడవాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఇలా జరిగే తప్పుల వల్ల కెరీర్ పరంగా కూడా నష్టపోవలసి వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. ఠిఇంట్లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఆఫీసుకు తీసుకెళ్లి ఇబ్బంది పడవద్దు.

ఠిఉదయం ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అవసరమైతే భార్యాభర్తలు వంట విషయంలో పరస్పరం సహకరించుకోండి.

ఠిపొద్దున్నే పిల్లలపై చిరాకుపడి మీ మూడ్ పాడు చేసుకోకండి. వీలైతే వాళ్లకు హెల్ప్ చేయండి.

ఠివీలైనంత వరకు మీ శ్రీమతికి కోపం తెప్పించే విషయాలను ఆఫీసుకు వెళ్లేముందు ప్రస్తావించకండి. ఏ విషయమైనా వాగ్యుద్ధానికి దారి తీస్తోందని అనుమానం వస్తే వెంటనే ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి టాపిక్ డైవర్ట్ చేయండి. ఠిఆఫీసు టైమయ్యేంతవరకు ఖాళీగా కూర్చుని ఆఖరు నిమిషంలో మీరు కంగారుపడి, ఎదుటివారిని కంగారు పెట్టేయకండి. ఉదయమే మీరు రెడీ కావడమే కాదు ఎదుటివారికి ఏం కావాలో తెలుసుకోండి.

ఠిఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు వంటివి ఆఫీసులో కొలీగ్స్‌తో షేర్ చేసుకోకండి. మీ పట్ల ఎదుటివారికి తేలికభావం ఏర్పడే అవకాశం ఉంది.

ఠికొలీగ్స్‌తో ఫ్రెండ్లీగా ఉండండి కాని ఎవరికీ అతి చనువు ఇవ్వకండి. ఇది కూడా అఫీసులో మీరు ప్రశాంతంగా పనిచేసుకోవడానికి దోహదపడుతుంది.

ప్రశాంతంగా ఆఫీసుకు వెళ్లేవారే బాగా పనిచేయగలుగుతున్నారని, చికాకులతో ఆఫీసుకు వెళ్లే వారు అన్యమనస్కంగా పనిచేస్తూ పొరపాట్లకు బాధ్యులవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. 
__________________________________________________________________________
తోక ముడిచిన ప్రధాని!
చిల్లర ఎఫ్‌డిఐలను వెనుకకు తీసుకుంటున్న నిర్ణయాన్ని మమతా బెనర్జీ చేత లీక్‌ చేయించి ప్రణబ్‌ ముఖర్జీ చేత పార్లమెంట్‌లో ప్రకటన చేయించడం గమనార్హం. ప్రధాని ఈ కీలకాంశంపై దేశ ప్రజలకు నేరుగా ముఖం చూపించలేక పోయారని అవగతమవుతున్నది. ఆ మేరకది మన్మోహన్‌ సింగ్‌ సారథ్యపటిమను నీరుగార్పించింది. పార్లమెంట్‌లో బలాధిక్యత గణితంపై ఆధారపడి దేశాధికార పీఠం మీద కొనసాగడానికి, దేశ ప్రజలను వెంట నడిపించుకొని జనరంజక పాలన అందించడానికి ఎంతో తేడా ఉన్నదనే సంగతిని ప్రధాని మన్మోహన్‌ ఇప్పటికైనా గుర్తిస్తే ఆయనకు, దేశానికి ఎంతైనా మేలు జరుగుతుంది.

సింగ్‌ ఈజ్‌ కింగ్‌ అనిపించుకోవడంలోని ఆనందాన్ని జుర్రుకునే ఆరాటంలో ముందు వెనుక చూడకుండా రిటైల్‌ ఎఫ్‌డిఐలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేయించిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పెల్లుబికిన నిరసన వెల్లువకు తల ఒగ్గి నిర్ణయాన్ని నిలిపి వేయక తప్పలేదు. ప్రజలతో సంబంధాలు కొరవడి, ప్రపంచ బ్యాంకు ఆడించినట్టల్లా ఆడడమే తెలిసిన బడా పెట్టుబడి దారీ అనుకూల ఆర్ధికవేత్త చేతిలో దేశాధికార దండాన్ని ఉంచితే ఏమి జరుగుతుందో మల్టి బ్రాండ్‌ చిల్లర వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ) లకు పెద్ద పీట వేయడానికి మన్మోహన్‌ సింగ్‌ పడిన ఆరాటమే నిదర్శనం.

సంప్రదాయ జీవన విధానంలో భాగంగా ఎవరి సహాయమూ అక్కరలేకుండా స్థానికుల నిత్యావసరాలు తీరుస్తూ కోట్లాదిమందికి ఉపాధిగా వర్ధిల్లుతున్న చిల్లర వర్తక రంగం శిరచ్ఛేదం చేసి టెస్కో, వాల్‌మార్ట్‌ వంటి బహుళ జాతి భారీ కిరాణా దుకాణాలకు ఎర్రతివాచీ పరవాలని ఉవ్విళ్ళూరిన ప్రధాని మన్మోహన్‌ తన నిఘంటువులో దేశంలోని సామాన్య జన హితానికి బొత్తిగా చోటు లేదని చాటుకొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అగ్ని పరీక్ష వంటి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముందున్నాయనే జ్ఞానమైనా లేకుండా ప్రధాని ప్రదర్శించిన తొందరపాటులో రెండవ తరం ఆర్ధిక సంస్కరణల అమలు పట్ల ఆయనకు గల అపారమైన అనురక్తే రుజువైంది. అయితే అటు విపక్షాలే కాకుండా పాలక కూటమిలోని కీలక భాగస్వాములైన తృణమూల్‌ కాంగ్రెస్‌, డిఎంకెలు ఇతర మరికొన్ని మిత్రపక్షాలూ ససేమిరా అనడం, దేశవ్యాప్తంగా చిల్లర వర్తకరంగంనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సోనియా, మన్మోహన్‌, ప్రణబ్‌ ముఖర్జీలు సహా కేంద్రంలోని కాంగ్రెస్‌ పెద్దలలో పునరాలోచన ప్రారంభమైంది.

నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడమే అనివార్యమైతే ప్రధాని పదవినుంచి తప్పుకుంటానని మన్మోహన్‌ సింగ్‌ హెచ్చరించినట్టు కూడా వార్తలు వచ్చాయి. గతంలో వామపక్షాల ప్రతిఘటనను కూడా ఖాతరు చేయకుండా అమెరికాతో శాంతియుత అణు ఒప్పందాన్ని ఖరారు చేయించిన మన్మోహన్‌ రిటైల్‌లో ఎఫ్‌డిఐల నిర్ణయాన్ని అప్రతిహతంగా అమలు చేయించగలరనే అంచనాలు బయలుదేరాయి. కాని మారిన పరిస్థితులలో అంతటి దుస్సాహసం తగదనే జ్ఞానం కాంగ్రెస్‌ నేతలలో ఆలస్యంగా ఉదయించినట్టు బోధపడుతున్నది. ఆదిలో అధిక ధరలపై వాయిదా తీర్మానాన్ని కోరుతూ వరుస మూడు రోజులపాటు పార్లమెంట్‌ను స్తంభింప చేసిన ప్రతిపక్షం చిల్లర వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయంపై ఆ తర్వాత ప్రతిరోజూ పార్లమెంట్‌ను వాయిదా బాట పట్టించింది. పర్యవసానంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు తొలి రోజు నుంచి ఇప్పటివరకు 9 రోజుల పాటు స్తంభించిపోయి వాయిదా పడ్డాయి.

వరుస నాలుగు రోజుల సెలవుల తర్వాత బుధవారం పార్లమెంటు కొలువుదీరడంతోనే రిటైల్‌లో ఎఫ్‌డిఐల నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రకటన పరిస్థితిలో మార్పు తీసుకువచ్చింది. సమావేశాలు సజావుగా సాగడానికి మార్గం సుగమం చేసింది. బహుళగుర్తుల చిల్లర వర్తక రంగంలో 51 శాతం, ఏక చిహ్న రిటైల్‌ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నామని ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం నాడు లోక్‌సభలో ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించిన అన్ని వర్గాలతో మాట్లాడి ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కృషి చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. వివిధ రాజకీయ పక్షాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చిల్లర వర్తక రంగం, రైతాంగంతో మాట్లాడి అందరి సమ్మతి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రకటనలో ఎంతో పరిణతి ప్రస్ఫుటమైంది.

ఈ మాత్రం తెలివిని ఆదిలోనే ప్రదర్శించి ఉంటే పార్లమెంట్‌ సమావేశాలు ఇన్ని రోజుల పాటు స్తంభించిపోవడం, దేశవ్యాప్తంగా ఇంతటి భయాందోళనలు వ్యక్తం కావడం జరిగి ఉండేవి కావు.
కాంగ్రెస్‌ కాక, మరి తొమ్మిది పక్షాల మద్దతుతో తమ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నదన్న ఇంగిత జ్ఞానం ఏ మాత్రం పని చేసి ఉండినా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ నిర్ణయాన్ని ఇంత అనాలోచితంగా ముందుకు తోసి ఉండేవారు కాదు. ఐక్య కూటమి ప్రభుత్వం సారథిగా భాగస్వామ్య పక్షాలన్నింటి బేషరతు అంగీకారం తీసుకున్న తర్వాతనే ఈ కీకాంశాన్ని కేబినెట్‌ ముందు పెట్టి ఉంటే మన్మోహన్‌ సింగ్‌ పరిణతి ప్రశంసలందుకొని ఉండేది. ఆయన అంతర్జాతీయ బడా పెట్టుబడిదారుల ఊడిగంలో తరించాలనుకుంటున్నారనే విమర్శకు దొరికిపోయి ఉండేవారు కాదు.

అంతేకాదు ఇంతటి కీలక అంశాన్ని దేశంలో వివిధ వర్గాల ప్రజల అభిప్రాయ సేకరణకు, విస్తృత స్థాయి చర్చకు ఉంచి ఉంటే యుపిఎ పాలకులకు ఎంతో వన్నె, వాసి కలిగి ఉండేవి. ఒకవైపు చిల్లర వర్తకరంగంపై ఆధారపడి బతుకుతున్న సన్న, మధ్యతరగతి కుటుంబాలు, మరోవైపు సగటున 5 ఎకరాలకు మించని కమతాలు గల రైతాంగం మనుగడతో నేరు సంబంధాలున్న ఈ వ్యవహారంపై జన హిత దృష్టిని కోల్పోకుండా వ్యవహరిస్తున్నారనే మంచి పేరు వారికి వచ్చి ఉండేది. చిల్లర వర్తకరంగంలో ఎఫ్‌డిఐల నడగొండను సన్న జనం కుత్తుకల మీదుగా దొర్లకుండా అడ్డుకున్నారన్న ఖ్యాతిచివరికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖాతాలో చేరింది. రిటైల్‌లో ఎఫ్‌డిఐల నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని తీవ్ర స్వరంతో తృణమూల్‌ కాంగ్రెస్‌, తగ్గుస్వరంతోనైనా డిఎంకె బెదిరించేసరికి ఓటింగ్‌తో కూడిన వాయిదా తీర్మాన చర్చకూ ప్రభుత్వం వెనుకాడక తప్పలేదు.

గతంలో ఇటువంటి సందర్భంలోనే అమెరికాతో అణు ఒప్పందం విషయంలో కీలక మద్దతుదారులైన వామపక్షాల అలుకను బేఖాతరు చేసి విశ్వాస పరీక్షకు సిద్ధమైన చందంగా మరో దుస్సాహసానికి ఒడిగట్టకుండా నిర్ణయాన్ని చల్లగా వెనుకు తీసుకోవడం గమనార్హం. వరుస అవినీతి కుంభకోణాల వల్ల ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఈసారి నైతికంగా దెబ్బతిని ఉన్నది. ఆయనకు స్వయంగా గతంలో ఉన్న మధ్యతరగతి మద్దతు ఈసారి కరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఏమైనా కానీ అంటూ దుడుకు దూకుడుకు ఆయన సాహసించలేకపోయారు.

అయితే చిల్లర ఎఫ్‌డిఐలను వెనుకకు తీసుకుంటున్న నిర్ణయాన్ని మమతా బెనర్జీ చేత లీక్‌ చేయించి ప్రణబ్‌ ముఖర్జీ చేత పార్లమెంట్‌లో ప్రకటన చేయించడం గమనార్హం. ప్రధాని ఈ కీలకాంశంపై దేశ ప్రజలకు నేరుగా ముఖం చూపించలేక పోయారని అవగతమవుతున్నది. ఆ మేరకది మన్మోహన్‌ సింగ్‌ సారథ్యపటిమను నీరుగార్పించింది. పార్లమెంట్‌లో బలాధిక్యత గణితంపై ఆధారపడి దేశాధికార పీఠం మీద కొనసాగడానికి, దేశ ప్రజలను వెంట నడిపించుకొని జనరంజక పాలన అందించడానికి ఎంతో తేడా ఉన్నదనే సంగతిని ప్రధాని మన్మోహన్‌ ఇప్పటికైనా గుర్తిస్తే ఆయనకు, దేశానికి ఎంతైనా మేలు జరుగుతుంది.

No comments:

Post a Comment