Wednesday, November 30, 2011

అధ్యాపకుడి ఆత్మకథ

"మహాపురుషులకు మాత్రమే ఆత్మకథలవసరమనేది నేనంగీకరించను. నా వంటి వారి జీవితం ఇతరుల కాదర్శప్రాయం కాకపోవచ్చు. కాని ఈ పుస్తకం వలన నిజాం పాలనలో మా పల్లెల పరిస్థితి, అప్పటి ఆచారాలు, అలవాట్లు, సామాజికస్థితి, నైతిక విలువలు వంటి ఎన్నో విషయాలు ఇప్పటివారికి తెలిసే అవకాశముంది. చరిత్రతో పనిలేదనుకునే వారికి తప్ప ఇతరులందరికీ ఇటువంటివి అవసరమే''- ఈ పుస్తకం తానెందుకు రాశానో చెప్పుకుంటూ డా.కండ్లకుంట అళహ సింగరాచార్యులు రాసిన వాక్యాలివి. ఎనిమిది పదులు పైబడ్డ జీవితాన్ని చూసిన ఈ 'అధ్యాపకుడి ఆత్మకథ'లోంచి కొన్ని ఆసక్తికర భాగాలు మీ కోసం.

నాకు అక్షరాభ్యాసం అయిదో ఏట జరిగి ఉంటుంది. అప్పటి సన్నివేశమేదీ నాకు జ్ఞాపకంలేదు. మాది చాలా కుగ్రామం. అందువల్ల మా ఊళ్లో ప్రభుత్వ పాఠశాల అప్పట్లో లేదు. హైదరాబాద్ సంస్థానంలోనే పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు చాలా తక్కువ కనుక నా చదువు వీథి బడులతోనే ప్రారంభమైంది. మొత్తం 4,5 స్థలాల్లో మా బడి మారుతూ వచ్చింది. దొరవారి ఇంటి ప్రక్క ఖాళీ ఇంటిలో కొన్నాళ్లు, దొరల ఇంటి ఆవరణలో కొన్నాళ్లు, పోకల గుర్వయ్య అనే మోతుబరి ఇంటి ముందు కొట్టంలో కొన్నాళ్లు, కోమటి వీథిలో ఒక ఇంట్లో మరికొన్నాళ్లు వీథిబడి సాగింది. ఒక్క రాజారాం అనే ఉపాధ్యాయుని పేరు మాత్రం నాకు గుర్తుంది. ఇంకా ఎవరెవరో చదువు చెప్పినారు. ఏకోపాధ్యాయ పాఠశాలగానే నడిచేది. ఉదయం చీకటితోనే లేచి బడికి వెళ్లాలి. మొదట బడికి వచ్చిన వారికి శ్రీ అని, రెండవ వ్యక్తికి చుక్క అని అరచేతిలో రాసేవారు.

ఆలస్యంగా వచ్చిన వారికి బెత్తపు దెబ్బలు తగిలేవి. నేలపై ఇసుకలో అక్షరాలు వ్రాసి చేతితో దిద్దించేవాళ్లు. సుమారు 9 గంటలకు ఇంటికి వచ్చి స్నానం, భోజనం చేసి మళ్లీ బడికి వెళ్లాలి. సాయంకాలం 4 గంటల ప్రాంతంలో అందరితో సంఖ్యలు, ఎక్కాలు, పద్యాలు చెప్పించి ఇంటికి పంపేవారు. ఏకాదశినాడు ఒక్క పూట బడి, అమావాస్య, పున్నమి బడికి సెలవులు. పండుగ రోజుల్లో బడి ఉండదు. అక్షరాల్లో మొదట శ్రీ అనేదాన్ని పెద్దగా వ్రాసి దిద్దించేవారు. తరువాత ఓం నమః శివాయ సిద్ధం నమః అని వ్రాయించి తరువాత అ ఆ మొదలు వర్ణమాలను దిద్దబెట్టేవారు. మొదట ఇసుకలో దిద్దించినా, తరువాత చెక్కపలకలు వాడుకలోకి వచ్చినవి.

సుమారు గజం పొడుగు ఉండే కొయ్యపలక బరువుగా ఉండే ది. దానిమీద బలపాలతో అక్షరాలు దిద్దటం, గుణింతాలు నేర్చుకోవటం జరిగేది. ఆ బలపాలు ఒక రకమైన సుద్ద రాతితో చేసినవి. ఇంకా అప్పటికి స్లేట్ పలకలు మా వాడుకలోకి రాలేదు. కాగితాలు, పెన్సిళ్లు బొత్తిగా వాడకంలో లేవు. పెద్ద బాలశిక్ష ఆధారంగా చదువు అంతా మౌఖికంగానే సాగేది. నెలల పేర్లు, వారాలు, నక్షత్రాలు, సంవత్సరాల పేర్లు, ఎక్కాలు మొదలైనవి అన్నీ కంఠస్థం చేయించేవారు. మొదట చిన్న బాలశిక్షలో అక్షరాలు, గుణింతాలు, చిన్న మాటలు నేర్పిన తరువాత పెద్ద బాలశిక్ష ఆరంభించేవారు.

దానిలో చిన్న వాక్యాలు, సామెతలు, పద్యాలు, నీతికథలు, సంఖ్యలు, ఎక్కాలు, భూగోళ విషయాలు కొన్ని, నెలల, నక్షత్రాల, సంవత్సరాల పేర్లు, ఇంకా ముఖ్యమైన ఇతర విషయాలు చాలా ఉండేవి. 'ఖర్జూర ఫలములు గణకుండు' అని పద్యరూపంలో గణిత సమస్యలు కూడా ఉండేవి. ఒక సంవత్సరం పైవిషయాలు కంఠస్థం మాత్రం చేయించి, రెండవ సంవత్సరం విద్యార్థులతో పలకమీద మాటలు, ఎక్కాల వంటివి వ్రాయించేవారు. మౌఖికంగా కథలు చెప్పించటం, పద్యాలు, శ్లోకాలు చదివించి కొద్ది కొద్దిగా వ్రాయించటం జరిగేది. మొదటి తరగతి తెలుగు వాచకం చదివించేవారు.

అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నిజాం పరిపాలనలో ఉన్నది కనుక ఉర్దూ రాజభాషగా ఉండేది. ఇప్పుడు ఇంగ్లీషువలె ఆ రోజుల్లో ఉర్దూ తప్పక బడులలో నేర్పేవారు. అందువల్ల మా బడిలో కూడా ఉర్దూ నేర్చుకున్నాం. నేను తీస్రీ (మూడవ వాచకం) వరకు ఉర్దూ నేర్చుకున్నాను. అప్పట్లో ఉత్తరాల మీద అడ్రస్‌లు వ్రాయటం, తహశీల్ ఆఫీసులో, పెద్ద కార్యాలయాల్లో దరఖాస్తులు ఉర్దూలోనే వ్రాయటం జరిగేది. అయినా ప్రజల్లో ఇప్పుడు ఆంగ్ల వ్యామోహం పెరిగినంత అప్పుడు ఉర్దూపై మోజు వ్యాపించలేదు. అవసరమైన చోటనే ఆ భాష ఉపయోగించేవారు. నేను కూడా ఆ రోజుల్లో ఉర్దూ కొంతవరకు వ్రాయటం, చదవటం నేర్చుకున్నాను. ఇప్పుడు వ్రాయటం, చదవటం దాదాపు మరిచిపోయినాను. విని అర్థం చేసుకోగలను, కొంత మేరకు మాట్లాడగలను కూడా.

అప్పుడు వీథిబడిలో నాతోపాటు 10, 12 మంది వరకు చదువుకునేవారు. వైశ్యులు రామకృష్ణ, సత్యం, రామనర్సమ్మ అనేవారు, పోకల భిక్షమయ్య, బుస్సా లచ్చయ్య, పుల్లయ్య, తొగరు తింగయ్య, గోపయ్య అనే పెరిక రైతు బిడ్డల పేర్లు మాత్రం ఇప్పుడు జ్ఞాపకమున్నాయి. చాకలి, మంగలి, గౌడ మొదలగు కులాలవారు తమ పిల్లలను బడికి పంపేవారు కాదు. ఆర్థిక పరిస్థితి ఒక కారణం కాగా, "మాకు చదువులెందుకు? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా?'' అనే మనస్తత్వం మరొక కారణం.

* * * మా ఇంటిపై దాడి
ఒక రాత్రి మా ఇంటిపైన కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యం దోచుకుపోయినారు. పట్వారీలు ప్రభుత్వోద్యోగులు, సాధారణంగా ప్రజలను పీడిస్తుంటారు కనుక వారిపై దాడి చేయాలనేది కమ్యూనిస్టుల అప్పటి విధానం. ఇంట్లో చొరబడి గాదెలలో ఉన్న ధాన్యాన్ని గంపలతో బయటికి తరలించుకొనిపోయినారు. అడ్డగించకపోవటం వలన ఎవరినీ కొట్టటం వంటివేమీ చేయలేదు. మా అన్నయ్య పట్వారీ గుమాస్తాగా ఉన్నప్పుడు ప్రభుత్వ శిస్తు వసూళ్లలో కఠినంగా ఉండటం తప్ప గ్రామస్థులపై క్రూరంగా ప్రవర్తించేవాడు కాదు. అయితే పొరుగు గ్రామాల పార్టీ కార్యకర్తల చొరవతో అన్ని చోట్లవలె ఇక్కడ కూడా చేసినారు. మా ఊరి వాండ్లు కూడా కొంతమంది దోపిడిలో చేరి ఉండవచ్చును. రాత్రిపూట, చిమ్మచీకటలో ఎవరినీ గుర్తు పట్టలేకపోయినారు.

మా రెండో అన్నయ్య కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ఉన్నా, వాళ్లు ఈ దోపిడీ జరిపినారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి వారిని ఎదిరించలేదు కాని తాను కూడా ఒక గంపతో ధాన్యం తీసుకొని మరొకవైపు తరలించి, ఆ విధంగా కొంత ధాన్యాన్ని మాకు దక్కించినానని తరువాత చెప్పినాడు. కొందరు జమీందార్లు, పట్వారీలు తమ ఇండ్లకు తగు రక్షణ ఏర్పాట్లు చేసుకొని దాడిని తప్పించుకున్నారు. మాది సామాన్య కుటుంబం కనుక, ఎవరినీ బాధించలేదు కనుక ఇటువంటి దాడిని ఊహించనందువలన ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేసుకోలేదు.

ఆ రాత్రి మా ఇంటి పక్కనే ఉన్న దొరగారి ఇంటి బయట గుమ్ములలోని ధాన్యాన్ని కూడా దోచుకున్నారు. వారి ఇంటివద్ద ఎవరో ఒక జీతగాడు ధాన్యానికి కాపలాగా పడుకునేవాడు. అంతమంది జనం గుంపుగా వచ్చినప్పుడు అతడేమి చేయగలడు? భయంతో తప్పించుకుని పారిపోయి ఉంటాడు. అక్కడ ఎక్కువ ధాన్యాన్ని దోచుకుని, తరువాత పక్కనే ఉన్న మా ఇంటిపై పడ్డారు. అంతకు ముందు ఎన్నో సంవత్సరాలుగా దొరల ఇంట్లో ఎవరూ ఉండకున్నా, బయట గుమ్ముల్లో ధాన్యం నిల్వచేసినా ఎప్పుడూ దొంగతనం కాని, దోపిడీ కాని జరుగలేదు.

నేను యాదగిరిగుట్ట నుండి వెళ్లేవరకు, అంతకు ముందు జరిగిన ఈ సంఘటనతో మా ఇంట్లో వాళ్లందరూ విషాద భరితులై ఉన్నారు. గ్రామంలోని ముఖ్యులు వచ్చి మా వారిని ఓదార్చి వెళ్లినారట.

గ్రామ ప్రజలతో కలివిడిగా మెసిలే మా అన్నయ్య దీనితో కలత చెంది ఇక ఆ పట్వారీ పని చేయనని నిశ్చయించుకుని ఆ విషయాన్ని కోదాటి వెంకటేశ్వరరావు గారికి తెలిపినాడు. తరువాత ఇక ఆయన ఆ పని జోలికి పోలేదు.

* * * రజాకార్లు
నాకు అప్పటికి రాజకీయ అవగాహన ఏమాత్రం లేదు. అయినా రజాకార్ల, పోలీసుల దౌర్జన్యాలను గూర్చి వింటుండేవాణ్ణి. గుట్టమీద ఎత్తులో ఉన్నాం కనుక అప్పుడప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో రజాకార్లు చేసిన గృహదహనాల మంటలు, పొగలు కన్పించేవి. ఉత్తరం వైపున్న గుట్టమీద కమ్యూనిస్టులు దాక్కోగా, వారిపై తుపాకీ కాల్పులు కూడా చూచినాము. పరిస్థితి భయానకంగా ఉండేది.

కాని ఒక్క విశేషమున్నది. అంత క్రూరుడైనా రజ్వీ హిందువులపైన మత ప్రధానంగా దాడిచేయలేదు. రాజ్యంలో నూటికి 90 మంది హిందువులుండటం కారణం కావచ్చు, మరేదైనా కావచ్చును. ఎందుకంటే యాదగిరిగుట్ట మీదికి రజాకార్లు ఎప్పుడూ దాడికి రాలేదు. హైదరాబాద్‌లో సీతారాంబాగ్, సికింద్రాబాదులో పెద్ద దేవాలయాల మీద కూడా దాడి చేయలేదు. జీడికల్లు, అర్వపల్లి, ధర్మపురి వంటి స్థలాల్లో కూడా వాళ్లు దౌర్జన్యం చేసినట్లు వినలేదు. ఆయుధ బలం, పోలీసుల అండా ఉన్న రజాకార్లు తలుచుకుంటే దాడిచేయటం కష్టమేమీ కాదు. పాపభీతియో, దైవభయమో కాని వారా సాహసం మాత్రం చేయలేదు. జనం మాత్రం లోపల భయపడ్డారు. రజాకార్ల అలజడులు తీవ్రంగా ఉన్న రోజుల్లో నేను, సీతారామానుజాచారుయలు, వేణుగోపాలాచార్యులు యాదగిరి పాఠశాలలోనే ఉన్నాము. మా విద్యాభ్యాసం అప్పుడు కూడా నిరాఘాటంగా కొనసాగింది. మేఘసందేశం రెండు సర్గలే కనుక అది పూర్తిగా బోధించేవారు. కిరాతార్జునీయాన్ని భారవి అని, శిశుపాల వధను మాఘం అని ఆయా కవుల పేర్లతో వ్యవహరించటం ప్రసిద్ధంగా ఉన్నది. ఆ రెంఉడ కావ్యాల్లో మూడేసి సర్గలు విద్యార్థులకు బోధన జరిగేది.

మా బంధువులు ఎక్కువగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనే ఉన్నారు. ఆ రెండు సరిహద్దు జిల్లాలు కనుక రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి కుటుంబాలతో సహా గౌరవరం, వల్లాల, చిత్తలూరు, ఇటుకుడుపాడు మొదలైన నల్లగొండ ప్రాంతపు గ్రామాల బంధువులు మునగాల పరగణాకు వలస వచ్చినారు. కొందరు జగ్గయ్యపేట వైపు వెళ్లినారు. నేలమర్రిలో, తాడువాయిలో గ్రామస్థుల సహాయంతో పాకలు వేసుకుని కాందిశీకులుగా ఉండసాగారు.

మాకు నేలమర్రి రెండు మైళ్ల దూరంలోనే ఉన్నందున, మాకు అక్కడ ఇల్లు కూడా ఉన్నది కనుక భక్తలాపురం నుంచి మా వాండ్లందరూ నేలమర్రికి మకాం మార్చినారు. అది అప్పుడు కృష్ణాజిల్లాలో ఉన్నది. కనుక నిజాం ప్రాంతం కాదు. బహుశా దసరా ప్రాంతంలో మా వాళ్లు నేలమర్రి చేరి ఉంటారు. అప్పటి నుండి వారు మాకు కార్డులు వ్రాస్తూనే ఉన్నారు. 'రజాకార్ల అలజడి ఎక్కువగా ఉన్నది. తొందరగా బయలుదేరి నేలమర్రికి రండి. పరిస్థితులు బాగుపడ్డ తరువాత మళ్లీ వెళ్లవచ్చు' అని కోరినారు. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తరువాత సంస్థాన విమోచన కొరకు పోరాటం తీవ్రం చేయటం వలన ప్రభుత్వ దమన పద్ధతులు కూడా తీవ్రమయినాయి. చివరకు మేము ముగ్గురం గురువు గారి అనుమతి పొంది నేలమర్రి వెళ్లటానికి నిర్ణయించుకున్నాము.

సంక్రాంతి పండుగ వెళ్లగానే 16 జనవరి 1948 శుక్రవారం నాడు ముగ్గురం బయలుదేరినాము. ఉదయమే బయలుదేరి భువనగిరి వచ్చినాము. అప్పుడు రోజుకు ఒకటో, రెండో బస్సులు సూర్యాపేటకు నడిచేవి. రెండు జాముల వరకు సూర్యాపేట చేరి, తెలిసిన వారి ఇంట్లో భోజనం చేసినాము. నగరాలలో, పట్టణాలలో రజాకార్ల దౌర్జన్యాలుండేవి కావు. అందువలన సూర్యాపేట వరకు నిర్భయంగానే వచ్చినాము. అక్కడ నుంచి నేలమర్రి చేరటమే సంకటము. అప్పుడు బస్సులేదు.

గ్రామాల నుంచి ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చి, తిరిగి వెళ్లే బండ్ల కొరకు అన్వేషణ మొదలుపెట్టగా, చివరకు నేలమర్రి వెళ్లే బండి ఒకటి కనపడింది. వాళ్లను బ్రతిమిలాడి ఒప్పించి బండి మీద ఎక్కినాము. అప్పటికాలంలో బ్రాహ్మణులని, మన ఊరివాండ్లని, రజాకార్ల భయమున్నదని సానుభూతితో ఆలోచించేవారు. అందువలన తమతో రమ్మన్నారు. బండిలో కూర్చున్నా భయంగానే ఉన్నది. రజాకార్లు ఎక్కడ వస్తారో, ఏమి బాధలు పెడతారో అని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాము. అప్పుడు పగలంతా రజాకార్ల రాజ్యం, రాత్రిళ్లు కమ్యూనిస్టుల ఆధిపత్యమన్నట్లుండేది గ్రామాల్లో.

మా అదృష్టం వలన తిరుమలగిరికి బండ్లు చేరేవరకు మాకు ఎటువంటి చికాకు క లుగలేదు. అప్పటికి సాయంకాలం సుమారు 5 గంటలు అయి ఉంటుంది. అక్కడి నుండి జాతీయ రహదారి వదిలి బండ్లబాటపై గుంజలూరు వైపు ప్రయాణం. సాయంకాలం కావచ్చింది కనుక ఇక రజాకార్లు రారు అని కొంత ధైర్యం కలిగింది. రాత్రిళ్లు కమ్యూనిస్టులు దొంగచాటుగా దాడి చేస్తారని రజాకార్లు తిరిగేవాళ్లు కాదు. గుంజలూరు నుంచి నేలమర్రి దారిలో నైజాం సరిహద్దు దాటి కృష్ణా జిల్లాలో ప్రవేశించి ఊపిరి పీల్చుకున్నాము. అప్పటికే నల్లగొండ ప్రాంతం నుంచి మా బంధువులు కొంతమంది అక్కడికి వచ్చి పాకలు వేసుకుని ఉంటున్నారు. 
____________________________________________________________________

హృదయమున్న విమర్శకుడు!
కలంబొమ్మ
రా.రా.గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ - రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక వ్యక్తి చెయ్యగలిగిన కృషికన్నా అనేక రెట్లు ఎక్కువ చేసిన అక్షర కర్షకుడు రా.రా.

కళ -హృదయం- మేధ

కళ హృదయ సంబంధి అయిఉండాలా? లేక పాఠకుడి ‘మేధ’కు అపీల్ చెయ్యలా?-ఇది సాహిత్య విమర్శ రంగంలో రా.రా. లేవనెత్తిన చర్చల్లో అన్నింటికన్నా ముఖ్యమయినది. చర్చ నిర్వహించడమంటే గోడమీద పిల్లిలా ఉంటూ, ఇరుపక్షాల వాదాలనూ ‘సమన్వయం’ చెయ్యడమేననే భ్రాంతి రా.రా.కు ఎప్పుడూ లేదు. అందుకే, కళ మౌలికంగా హృదయ సంబంధమయిన వ్యాపారమే నని ఢంకా బజాయించి మరీ చెప్పాడాయన. ఆరెస్ సుదర్శనం లాంటి పండితుల ‘మేరమీరిన మేధ’ను ఆయన ఘాటుగా విమర్శించారు. అందుకే ఆయన్ను ‘హృదయమున్న రసైకజీవి’ అనేది. తనవాదాన్ని సమర్థించుకునే క్రమంలో రా.రా. ప్రాక్పశ్చిమ సాహిత్య సిద్ధాంతాలను వడపోసి, సారాంశాన్ని పాఠకుడికి అందించారు. రా.రా. సాహిత్య వ్యాసాల సంకలనం ‘సారస్వత వివేచన’లో ఈ సమాచారం మొత్తం దొరుకుతుంది. (త్వరలోనే ఈ పుస్తకం పునర్ముద్రణ వెలువడనుంది.)

ఏకైక దిక్సూచి!

రా.రా.పేరు ఇప్పటికీ తల్చుకునేలా చేసే విషయాలు చాలానే ఉన్నా అన్నిటికన్నా ముఖ్యమయింది ‘సంవేదన’ త్రైమాసిక. 1968-69 సంవత్సరాల్లో కడప నుంచి -కేవలం ఏడాదిన్నరకాలం మాత్రమే - వెలువడిన సాహిత్య పత్రిక ‘సంవేదన’. ఈ పత్రికను ‘యుగసాహితి’ నిర్వహించింది. యుగసాహితిలో రా.రా.తోపాటుగా గజ్జెల మల్లారెడ్డి, వైసీవీ రెడ్డి, ఆర్వియార్, సొదుం జయరాం, నల్లపాటి రామప్ప నాయుడు, టి.సాంబశివారెడ్డి, చెన్నారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, చవ్వా చంద్రశేఖర రెడ్డి, వి. రామకృష్ణ తదితరులు చురుకయిన పాత్ర పోషించారు. వీళ్లలో ఒకరిద్దరు తప్ప తక్కినవారందరి రచనలూ ‘సంవేదన’లో కనిపిస్తాయి. అయితే, ‘సంవేదన’ పత్రికకు దిక్సూచిగా నిలబడింది మాత్రం రా.రా.గారే.

నిజంగా మన భాగ్యం!

సొదుం జయరాం రాసిన ‘వాడిన మల్లెలు’ కథను ఏదో ‘పరువయిన’ పత్రిక తిప్పి పంపించిందట. ఆ కథ ఆధారంగా ఓ వర్క్‌షాప్‌లాంటిది నిర్వహించి రా.రా. దానికి అసాధారణ ప్రాచుర్యం కల్పించారు. జయరాం కాకుండా మరో ముగ్గురు ఆ కథను సొంత పద్ధతిలో రాసి, నాలుగింటినీ కొడవటిగంటి కుటుంబరావు పరిశీలనార్థం పంపారు. ఆయన జయరాం కథే అన్నింటిలోకీ ఎందుకు మెరుగ్గా ఉందో వివరంగా విశ్లేషించి చూపించారు. ఇలాంటి ప్రయోగం మరొకటి జరిగినట్లు ఎక్కడా వినలేదు! అదీ సంపాదకుడిగా రా.రా. విశిష్టత. చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, మహీధర రామమోహనరావు తదితర ఆధునిక-అభ్యుదయ రచయితల కృషికి ‘సంవేదన’లో రా.రా. నివాళులెత్తారు. అయితే అవన్నీ అక్షరాలా ‘క్రిటికల్’ అప్రీసి యేషన్సే కావడం గమనార్హం. ‘సంవేదన’లో రా.రా. వ్యాసాల్లో ముఖ్యమయినవన్నీ ‘సారస్వత వివేచన’లో చేర్చడం నిజంగా మన భాగ్యం.

అనువాద నాదం!

1969-76 సంవత్సరాల మధ్యకాలంలో రా.రా. మాస్కోలోని ప్రగతి ప్రచురణాల యంలో అనువాదకుడిగా పనిచేశారు. అంతకు చాలాకాలం ముందే-దాదాపు దశాబ్దం ముందే- రా.రా. చరిత్రాత్మకమయిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ను అనుపమానమయిన రీతిలో తెలుగు చేశారు. రా.రా.గారు మార్క్స్-ఎంగెల్స్‌ల ‘ఆత్మ’ను పట్టుకుని, తెలుగు పాఠకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫుట్‌నోట్స్ సమకూర్చి, అనువాదాన్ని తీర్చిదిద్దడమే, ఈ పుస్తకం అంతగొప్పగా ఉండడానికి మూలకారణం! ఇలా, అనువాద కళ తాలూకు సున్నితమయిన ఛాయలు కూడా క్షుణ్ణంగా తెలిసినవాడు కావడం వల్లనే రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకాన్ని అంత అద్భుతంగా రాయగలిగారు. సామాన్య పాఠకుడికి సైతం ఆసక్తికరంగా సాగే అకడమిక్ గ్రంథం ఇది. (‘విశాలాంధ్ర’ సంస్థ ఈ సంవత్సరమే ఈ పుస్తకాన్ని తృతీయ ముద్రణగా వెలువరించింది. వెల రూ.125- మాత్రమే!)

రెండంచుల వాడి కత్తి!

‘వేయిపడగల విశ్వనాథ’ను చెరిగిపోసినందుకూ, దిగంబర కవులను చావగొట్టి చెవులు మూసినందుకూ, కాళోజీ అనువాద సరళిని నరికిపోగులు పెట్టినందుకూ, అద్దేపల్లి రామమోహనరావు అన్వయ వైపరీత్యాన్ని కడిగి ఎండేసినందుకూ రా.రా.ను చాలామందే విమర్శించారు. కానీ, ఎవ్వరూ, ఎన్నడూ ఆయన్ను స్వపక్ష వలపక్ష వాదిగా మాత్రం నిందించలేదు. ‘సృజన’ చలం ప్రత్యేక సంచికను ‘సంవేదన’లో సమీక్షిస్తూ మంచి వ్యాసం (మహానుభావుడు చలం?) రాశారు రా.రా. దానిమీద బోలెడంత చర్చ జరిగింది. ఆ చర్చలో రా.రా.కు సన్నిహితులుకూడా పాల్గొన్నారు. తనతో విభేదించిన ఓ మిత్రుణ్ని కూడా నిర్దాక్షిణ్యంగా చెలిగేశారు రా.రా. ఇలాంటి సమదృష్టి ఏ కాలంలోనయినా చాలా అరుదు. అందుకే రా.రా. చనిపోయి ఇరవయ్ మూడేళ్లు అవుతూన్నా ఇప్పుడు కూడా ఆయన్ను తల్చుకునేది!

- మందలపర్తి కిషోర్

Tuesday, November 29, 2011

‘మాయ’ నాలుగుముక్కలాట ఇది!
అబద్ధాల అంకయ్యలకు అరవై నాలుగు అసత్య ప్రమాణాలని మన పెద్దలంటుంటారు. అలాగే ఉన్న పదవిని కోల్పోయే ప్రమాదం ఉందని భావించే వారు, లేని పదవిని సాధించుకోవడానికి తాపత్రయ పడేవారు, ఎన్నికలలో తిరిగి గెలుస్తామో లేదో అని శంకాపీడితులుగా మారే నేతలు ఏదో ‘మిష’, లేదా ‘సాకు’ వెదుక్కుంటారు, తమ భవిష్యత్తును పదిలం చేసుకునేందుకు. ఆ ‘మిష’ మూలాన ప్రజాబాహు ళ్యం విశాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లినా వాళ్లకి అనవసరం. తమ పబ్బం గడవాలి, తాపత్రయం తీరాలి. నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం నాడు జరిగిన దేశ విభజన తరువాత తొలిసారిగా ఇటీవల కాలంలో ప్రజలను చీలుబాటల వైపునకు నెట్టే ‘బృహత్’ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారు.
  ఒకే భాషా, సంస్కృతులున్న జాతినీ, అది అనేక త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాన్ని విడగొట్టాలనే పదవీకాంక్షాపరులు ఉత్తరాదిలో తాజాగా పుట్టుకొస్తున్నారు. భారత రాజకీయ రంగంలో అనేక మంది ప్రధాన మంత్రు లను దేశానికి అందించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విభజించాలని రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి మాయా వతి కొత్త పన్నుగడపన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆమె ప్రకటించారు. అందుకు ‘సాకు’గా చూపిన సమర్థన ‘‘చిన్నరాష్ట్రాలు, చిన్న ప్రాంతాలలో సమర్థపాలన అందించ వచ్చునన్న బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం’’. వాస్తవం ఏమిటంటే అం బేద్కర్ ఏనాడూ చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించలేదు. భారత రాజ్యాంగ రచనా దురంధరుడు, దేశ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలలో అగ్రవర్ణాలతోపాటు సమ ప్రతిపత్తి కల్పించడం కోసం ఉద్య మించిన దళితనేత అంబేద్కర్ చిన్న రాష్ట్రాల విషయమై ఏం చెప్పారో తెలుసు కునే ముందు మాయావతి ఉత్తరప్రదేశ్ విషయంలో అనుసరించిన అక్రమ విధానాల్ని తెలుసుకోవడం అవసరం. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా (అవధ్‌ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, పశ్చిమప్రదేశ్) తెగ్గొట్టడానికి ప్రభు త్వపరంగా తీసుకున్న నిర్ణయం గురించి ప్రతిపక్షాలతో చర్చించడానికి గానీ, లేదా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత దానిపైన సభలోని సకల పక్షాల అభిప్రాయాలకు సుదీర్ఘ చర్చ ద్వారా అవకాశం కల్పించడం గానీ జరగ లేదు. మూడే మూడు వాక్యాల ‘తీర్మానాన్ని’ మొక్కుబడిగా ప్రవేశపెట్టినట్టు ప్రవేశపెట్టి పదే పదినిమిషాల్లో చర్చతో నిమిత్తం లేకుండా కేవలం మూజువాణీ ఓటుతో ముగించి, రాష్ర్ట ప్రజల్ని మూగవాళ్లను చేశారు.

ఇంతకీ మాయావతి ‘రాజకీయ’ నిర్ణయాన్ని త్వరితం చేసిన పరిణామం ఏది? కాంగ్రెస్ కార్యదర్శి రాహుల్ గాంధీ యూపీ పర్యటనలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఎంతగా వెనుకబడి ఉందో గణాంకాలతో సహా నిరూపించ డంతో మాయావతి తట్టుకోలేకపోయారు. రాహుల్ ప్రకటన వెలువడిన మరు నాడే - మాయావతి ఉత్తరప్రదేశ్‌ను చీల్చే కార్యక్రమం ప్రకటించారు. రాష్ర్ట విభజనను ‘వివిధ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నార’ని ఆమె ఆపద్ధర్మంగా చెప్పిన మాట నిజమే అయితే అన్ని ప్రతిపక్షాలూ కూడా సమర్థించి ఉండా ల్సింది గదా? తన ప్రతిపాదన కొత్తగా పుట్టింది కాదు, 2007లోనే కేంద్రానికి రాష్ర్ట విభజన ప్రతిపాదన పంపానని కేంద్రమే నిర్ణయం తీసుకోలేదని ఇప్పుడు చెబుతున్న మాయావతి గడచిన అయిదేళ్లుగా ‘నిమ్మకు నీరెత్తి’నట్టు ఎందుకు వ్యవహరించారు? కేంద్రం ముందుకువచ్చి ఉంటే ఈ సరికే అసెంబ్లీని ప్రత్యే కంగా సమావేశ పరిచి తీర్మానం చేసి ఉండే వాళ్లమనీ, కేంద్రం స్పందించనం దుననే ఇప్పుడు తీర్మానం చేయాల్సి వచ్చిందనీ ఆమె సమర్థించుకున్నారు.

ఏ రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ లేదా కొత్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమని మాయావతి నమ్ముతున్నారో ఆ అధికరణ ప్రకా రం గానీ, లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వీలుగా సాధికార కమిటీ చేసే సిఫారుసుల ప్రకారం గానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ రాజ్యాంగబద్ధ ప్రక్రియకు మాయావతి స్వస్తి చెప్పి సొంత ఎజెండా ప్రకటించుకున్నారు. యూనియన్ కేబినెట్ బిల్లుకు సమ్మతించిన తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి, ఆ పిమ్మట రాష్ట్రపతి అదే బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి నివేదించిన దరిమిలా నిర్ణీత గడువులో తీర్మా నం రూపంలో తిరిగి సభ వారు పంపించాలి. అలాగే తీర్మానం ఉన్నా లేక పోయినా కూడా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు నివేదించవచ్చు. అప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం కాదు, పార్లమెంటు ఉభయ సభలు బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే - ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి అర్హమవుతుంది. ఈ క్రమానుగతమైన పద్ధతికి స్వస్తి చెప్పి, ‘లేడికి లేచిందే ప్రయాణ’మన్న చందంగా రాజ్యాంగ క్రమాన్ని అతిక్రమించి అసెంబ్లీకి విలువ లేకుండా చేసి పదినిమిషాల్లో రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చీల్చి ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటును ప్రకటించేశారావిడ.

ఐదేళ్లుగా మిగతా రాష్ట్రాల్లో మాదిరే ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి నాయ కత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణల మధ్య ఈదులాడుకుంటూ వస్తోంది. ‘తాజ్ కారిడార్’ నిర్మాణ కుంభకోణాల నుంచి నాయకురాలు ఇంకా బయటపడలేదు. చనిపోయిన తరువాత తమను మరచి పోతారనో లేదా తాము బతికి ఉండగానే వేడుక చూసుకోవాలన్న తపనతోనో కొందరు మన సమాజంలో చనిపోయిన తరువాత చేసే కర్మకాండను ముందు గానే ‘జీవకర్మ’ అని జరుపుకుంటారు. అలాగే ‘చైతన్యశీలి’గా పేరు పొందిన మాయావతి కూడా తాను సజీవంగా ఉన్న కాలంలోనే సుమారు వంద సొంత విగ్రహాలు నిర్మించడానికి అనుమతించిన కుంభకోణం కూడా బయటపడి సుప్రీంకోర్టు దాకా వ్యవహారం దేకింది. సొంత మంత్రులు, ఉన్నతాధికారులు కొందరు అవినీతి ఆరోపణల మధ్య జీవనం గడుపుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి కేంద్రం విడుదల చేసిన భారీ నిధుల్ని దుర్వినియోగం చేసి అవినీతిని తలకెత్తుకున్న అధికారులపై వచ్చిన ఆరోపణ లపైన విచారణ జరపాలని కేంద్రం పదే పదే కోరినా గత సంవత్సరన్నర కాలంగా మాయావతి కాలక్షేపం చేస్తూ వచ్చారే తప్ప ఇప్పటిదాకా విచారణకు ఆదేశించలేదు.

పైగా సీబీఐ విచారణకు ‘మాయ’ సమ్మతించలేదు. ఆమే స్వయంగా, అవి నీతికి బాధ్యులని ప్రకటించిన అధికారులపైన కూడా చర్యతీసుకోలేదు. వారిలో ఒకరు గోండా ప్రాంతం ప్రధాన ఉన్నతాధికారి రాజ్‌బహదూర్. ఈ రోజుకీ అతనిపైన కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదుకాలేదు. యూపీ సామాన్య ప్రజ లు, ముస్లిం మైనారిటీలు సహా రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తున్నారు. స్థానిక సం స్థల ఎన్నికలను వెంటనే జరపాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆదే శాన్నీ మాయావతి వాయిదావేస్తూ రావడం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బిఎస్‌పీ ఓటమిని చవిచూడబోతోందన్న సంకేతం కారణంగానే. కనుకనే మాయావతి రాష్ట్రాన్ని ముక్కలు చేయడంద్వారా ముంచుకొచ్చే ‘బ్యాలెట్’ ప్రమాదాన్ని నివారించేందుకు రాజకీయలబ్ధిని ఆశించి ఈ వ్యూహం పన్నారు.
‘చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం’ అని అంబేద్కర్ చెప్పారన్న ప్రచా రం అబద్ధం. ఆయన, అగ్రవర్ణాలకు ప్రాధాన్యం కల్పించే శాసన వేదికలలో దళిత, బడుగువర్గాలకు తగిన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం లభించదేమోనన్న అనుమానంతో గతంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటును అభిలషించారేగాని, చిన్న రాష్ట్రాల ఏర్పాటు పేరిట తిరిగి ధనిక, భూస్వామ్య వర్గాలకు చెందిన వారే అం దలమెక్కి పాత దోపిడీనే కొనసాగే పరిస్థితిని ఆయన కోరుకోలేదు.

అందుకే అంబేద్కర్ ఒక నికార్సయిన ప్రజాస్వామ్యవాదిగా, బహుజనుల సంక్షేమాన్ని అభిలషించినవాడుగా దోపిడీపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవ స్థనూ విమర్శిస్తూ వచ్చాడు. ‘ప్రజాస్వామ్యం అనేది సమాజంలోని అల్పసం ఖ్యాకుల అవసరాలకు, అభిప్రాయాలకు సానుకూలంగా స్పందించి తీరాల’ని స్పష్టం చేశాడు అంబేద్కర్. దేశ విభజనను వ్యతిరేకించిన అంబేద్కర్, దేశ నాయకుల మధ్య వచ్చిన విభేదాలు ఆసరాగా బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల కుట్ర ఫలితంగా విభజన తప్పనప్పుడు అంబేద్కర్ ‘ఒక ప్రత్యేక జాతిగా ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని’ భావించాడే గానీ ఒకేభాష, ఒకే సంస్కృతి ప్రాతిపదికపై రాష్ట్రంగా ఏర్పడిన జాతిని చీల్చాలని ఎన్నడూ ప్రతిపా దించలేదు. ఆయన సిద్ధాంతంలోని కేంద్రీకరణ అంతా ఎంతసేపూ దళిత, బహుజన, బడుగు అసంఖ్యాక వర్గాల మౌలిక ప్రయోజనాలను రక్షించడం పైననే గానీ ప్రజల మధ్య విభజనను సృష్టించడం కాదని గమనించాలి! ఈ విషయాన్ని ఆయన 1947 మార్చిలో ‘రాష్ట్రాలు, మైనారిటీలు’ అన్న మెమొ రాండంలో స్పష్టం చేశాడు.

అందుకే రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని చం కలు గుద్దుకుంటే లాభం లేదనీ, సామాజిక, ఆర్థిక జీవనంలో రాబోయే రోజుల్లో తీవ్రమైన అసమానతలు తలెత్తుతాయనీ, నిజజీవితంలోని ఈ వైరుధ్యాన్ని పెందలాడే తొలగిస్తే తప్ప భారతీయ సమాజం కష్టాలు ఎదుర్కోవలసి వస్తుం దనీ 62 ఏళ్లనాడే ముందస్తుగా హెచ్చరించాడు. ఈ దృష్టితోనే ఆయన సమాజం లోని అసంఖ్యాకులుగానూ, ప్రధాన ఉత్పత్తి శక్తులుగానూ ఉన్న దళిత, బడుగు వర్గాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే వారికి పాలనా పగ్గాలు అందా లంటే, దోపిడీ వ్యవస్థకు దూరంగా ఉండగల పాలనా వ్యవస్థను కోరుకున్నా డేగానీ, కేవలం చిన్న రాష్ట్రాల వల్లనే వారి అభ్యున్నతి స్థిరమవుతుందని ఎక్కడా చెప్పలేదు. నిజానికి పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో రాష్ట్రాలు చిన్నవైనా, పెద్దవైనా అభివృద్ధి ప్రజాబాహుళ్యానికి విధిగా అనుకూలంగా ఉంటుందన్న హామీగానీ, ఉండగలదన్న భరోసాగాని ఎవరూ ఇవ్వలేరు.

ఇందుకు ఉదాహరణ బీజేపీ హయాంలో చీలుబాటల మీద ఏర్పడిన ఉత్త రాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు. ‘అభివృద్ధి’ సాధించిందనుకున్న ఉత్తరా ఖండ్ సంపదంతా ఢిల్లీ, ముంబైల పాలవుతోందనీ, ఫలితంగా ఆ చిన్న రాష్ట్రం లోని భిన్న ప్రాంతాల మధ్య అసమానతలు తీవ్రమవుతున్నాయనీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్ జనాభాలో నూటికి 63 మంది కటిక దారిద్య్రం లో ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు ఛత్తీస్‌గఢ్‌లో కటిక దారిద్య్రం లో ఉన్న జనాభా సంఖ్య 20 లక్షలుండగా, అది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో 32 లక్షలకు పెరిగిపోయింది. ఇదే పరిస్థితి తరతమ భేదాలతో జార్ఖం డ్‌లోనూ ఉంది. ప్రజాహితమైన సంస్కరణల ద్వారా మాత్రమే ప్రగతి ఫలాలు ప్రజాబాహుళ్యం అనుభవంలోకి వస్తాయి. ఇందుకు ముందు అంబేద్కర్ చెప్పి నట్లుగా ‘‘ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. ఏకతాటిపైకి తేవాలి. ఆందోళన చేపట్టాలి’’. 
________________________________________________________________________

రేపే ధర్మరక్షణ శంఖారావం

హైదరాబాద్, నవంబర్ 29 : హిందూ ధ ర్మం పరిరక్షణ, ఆచరణ ఆవశ్యకతను చాటి చెప్పడానికి డిసెంబర్ ఒకటో తేదీన ధర్మరక్షణ శంఖారావం నిర్వహించనున్నట్లు సర్వార్ధ సంక్షేమ సమితి అధ్యక్షుడు పి.వి.మనోహర్‌రావు తెలిపారు. ఇక్కడి లలితకళాతోరణంలో జరిగే శంఖారావసభలో పరిపూర్ణానందస్వామి ఆధ్వర్యంలో పీఠాధిపతులు మదనానంద సర్వసతి స్వామి, దక్షిణామూర్తి, సచ్చిదానందస్వామి, కమలాకర స్వామి, సద్గురు శివానందమూర్తి, వాత్సల్యానంద స్వామి పాల్గొంటారని చెప్పారు.

దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి రమణాచారి, తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, దేవాదాయశాఖ కమిషనర్ బలరామయ్య, వేలాది మంది భక్తులు, భజనమండళ్ల కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. కాగా, నేటితరం యువతీ యువకుల్లో భారతీయ సంస్కృతి, భారతీయతత్వం ఆధ్యాత్మిక ధోరణులపై ఆసక్తి కలిగించేందుకు లక్ష మందితో త్వరలో ధార్మిక సభ నిర్వహిస్తామని పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ప్రకటించారు.
__________________________________________________________________

చర్చను అడ్డుకోవడమే ప్రజాస్వామ్యమా!
naresh , December 1 , 2011
 
కాలం గడుస్తున్నకొద్దీ అనుభవం రాటుదేలి పని విధానంలో పరిపక్వత పెరుగుతుందని ప్రజలు ఆశిస్తారు. కానీ, మన దేశంలో చట్టసభల తీరుతెన్నులు గమనిస్తుంటే, రోజులు గడుస్తున్నకొద్దీ వాటి పనితీరు మరింత అధ్వానంగా మారడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమై ఆరు దశాబ్దాలు దాటిందన్నది గమనార్హం. వారం రోజుల క్రితం ప్రారంభమై నడుస్తున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల తీరుతెన్నులను గమనిస్తుంటే, మనది ప్రజాస్వామ్య దేశమేనా? అన్న సందేహం కలుగక మానదు. అధిక ధరలు, గిట్టుబాటు ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, తీవ్రవాదం, ‘ప్రత్యేక’ రాష్ట్రాల ఏర్పాటు వంటి తీవ్ర సమస్యలు ప్రజల దైనందిన జీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే, ఇందులో ఏ ఒక్క అంశం మీద కూడా పట్టుమని గంట పాటు కూడా చర్చ జరగలేదంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు.

అధికారంలో ఉన్న పార్టీలను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చట్టసభలే వేదికలుగా ‘అల్లరి’ పెట్టడం అన్న ఏకైక ఎజెండా తప్ప, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించి, పరిష్కార మార్గాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు బాటలేయాలన్న కనీస అవగాహన, చిత్తశుద్ధి ఒక్క పార్టీలోనూ కనిపించకపోవడం విచారకరం. సభ నిర్వహణకు ఎంత ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారో తెలుసుకుంటే సామాన్యులు స్పృహతప్పి పడిపోక తప్పదు. గౌరవ సభ్యుల జీతభత్యాలు కాకుండా, సభ నిర్వహణకు రోజుకు రెండు కోట్ల రూపాయలు దాటుతుందంటే నమ్మశక్యం కాదు. అన్నిటినీ మించి, ప్రజాప్రతినిధులుగా దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ పార్లమెంటేరియన్‌లు కూడా సభలో ‘విజ్ఞత’ మరచి ప్రవర్తించడం దురదృష్టకరం. అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగి, ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని మనవి.

-జీవీ రత్నాకరరావు హన్మకొండ, వరంగల్ జిల్లా

డ్రైనేజీల ఆక్రమణ ప్రమాదకరం!

రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లోనూ, పట్టణాల్లోనూ గృహ యజమానులు పరిసరాల్లోని డ్రైనేజీలను ఆక్రమించి, తమ కట్టడాలను విస్తరించడంతో మురుగు నీటి సమస్యలు తెలెత్తి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంకొందరు, వారి ఇళ్ల ముందున్న మురుగు కాల్వలపై ఇష్టమొచ్చిన రీతిలో ఇంటి మెట్లను నిర్మించడం పరిపాటిగా మారింది. దీంతో కాల్వలు పూడిపోయి మురుగు నీరు రోడ్ల మీద ప్రవహిస్తోంది. పారిశుధ్యం పని వారు కాల్వలు శుభ్రం చేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది. రోడ్ల మీద మురుగు నీటి గుం టలు ఏర్పడటంతో దోమలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరీ నరకంగా మారుతోంది. చిన్నచిన్న వర్షాలకే వీధులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు ప్రవేశించి కోట్లాది రూపాయల ఆస్తి నష్టాన్ని కలిగిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత మునిసిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా డ్రైనేజీలను కాపాడటానికి కఠినమైన నిబంధనలను రూపొందించి అమలు చేయాలని విజ్ఞప్తి.

-గోపాలుని శ్రీరామమూర్తి వినుకొండ, గుంటూరు జిల్లా
Posted at 12:33:19 AM 0 comments
‘ఆకాశవాణి’ సేవలను గుర్తించాలి!
naresh , November 30 , 2011
 
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతీయస్థాయి ప్రసారమాధ్యమంగా ఆకాశవాణి ఎనలేని ప్రాముఖాన్ని, గుర్తింపును పొందిం ది. అత్యవసర సమయాల్లోనూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ‘రేడియో’ రూపంలో ఆకాశవాణి ప్రసారాలు సామాన్య ప్రజలకు సదా అందుబాటులో ఉండటం నేటికీ చెక్కుచెదరలేదన్నది అతిశయోక్తి కాదు. అభివృద్ధి ఆకాశాన్నంటుతోందని అట్టహాసంగా ప్రకటించుకుంటున్న రోజుల్లో కూడా కరెంటు సమస్య ప్రజలను పట్టి పీడిస్తుండటంతో టీవీ చానళ్లు ఎంత విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా, వాటి ద్వారా అత్యవసర వార్తలు గానీ, సమాచారం గానీ తెలుసుకునే అవకాశాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో లేవనే చెప్పాలి. మారుమూల గిరిజన ప్రాంతాలతో సహా దేశంలో ఎక్కడైనా కరెంటు, సెల్ టవర్లు లేకపోవడం వంటి సమస్యలతో నిమిత్తం లేకుండా అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే రేడియో ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ప్రసారమాధ్యమం ఆకాశవాణి అన్నది వాస్తవం. మార్కోనీ కనుగొన్న రేడియో ప్రసారాలు, భారతదేశంలో 1927లో ప్రారంభమై, 1930లో ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్‌గానూ, 1936లో ఆల్ ఇండియా రేడియోగానూ, 1957లో ఆకాశవాణిగానూ ప్రసిద్ధిచెంది, అంచలంచెలుగా దాని ప్రస్థానం కొనసాగుతోంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకాశవాణి న్యాయం చేసినంతగా మరే సంస్థా చేయడంలేదన్నది వాస్తవం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఆకాశవాణి అభివృద్ధి పట్ల అలక్ష్యం వహించడం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. కావున, రేడియో రూపకర్త మార్కోనీ పుట్టిన 1874 ఏప్రిల్ 25ను ‘రేడియో శ్రోతల దినం’గా ప్రకటించి, ప్రతి సంవత్సరం జరిగేలా ప్రభుత్వం ఆదేశించి తగు న్యాయం చేయాలని మనవి.

-కూనపరెడ్డి రమేష్ బాబు జొన్నలవారి మోడి, కృష్ణా జిల్లా

‘పచ్చ’పార్టీ నేతల ‘అవినీతి’ ఫీట్లు!

తమదాకా వస్తే కానీ నొప్పి తెలియదన్న చందంగా మారింది ‘పచ్చ’పార్టీ అధినేతల పరిస్థితి. రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీలో బాధ్యతాయుత స్థానంలో కొనసాగుతూ, అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులనూ విస్మరించి వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై శంకరరావు సీబీఐ విచారణ జరపాలంటూ హైకోర్టుకు ఉత్తరం రాసినప్పుడు, ఏ ప్రజాస్వామ్య నీతిని అనుసరించి తెలుగు తమ్ముళ్లు తెగ నోరు పారేసుకున్నారో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రభుత్వంలో భాగస్వామి కాని, ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా వైఎస్ విజయమ్మ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా పాలించి ఆర్థికంగా ఎలా అధోగతి పాలు చేశాడో పూసగుచ్చినట్టు వివరిస్తూ హైకోర్టును సీబీఐ విచారణ కోరడం ‘కుట్ర’, ‘కుమ్మక్కు’ అంటూ ప్రజలను తప్పు దోవ పట్టించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని బీరాలు పలికిన చంద్రబాబు, విచారణ జరిగితే బండారం బయట పడుతుందన్న గుబులుతో మొసలి కన్నీళ్లు కారుస్తూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో రోజుకొక తీరున ప్రకటనలు గుప్పిస్తూ బరితెగించి వ్యవహరించడాన్ని చైతన్యవంతులైన తెలుగు ్రపజలు క్షమించరన్నది గుర్తెరిగి ప్రవర్తించడం విజ్ఞత అనిపించుకుంటుంది.

-దామరాజు శంకరం విజయనగరం
Posted at 2:03:41 AM 0 comments
వయోపరిమితి పెంచాలి!
naresh , November 29 , 2011
 
ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాల అమలు అనంతరం ప్రైవేటైజేషన్ ఊపందుకోవడంతో ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు కరువై నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎప్పుడోగానీ ఖాళీలు ఏర్పడేవి కాదు. వాటి భర్తీకి నోటిఫికేషన్ వెలువడే సరికి వేలాది మంది వయోపరిమితి దాటిపోవడంతో దిక్కుతోచని స్థితికి గురయ్యేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని సడలించి 44 సంవత్సరాలుగా పెంచి వేలాది మంది నిరుద్యోగులను ఆదుకున్నారు. లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను సీఎం ప్రతిరోజూ ఊరిస్తున్నారు. అయితే, గతంలో లాగా వయోపరిమితిని సడలించి నిరుద్యోగులకు న్యాయం చేయడం సబబుగా ఉంటుంది. గత మూడేళ్లుగా ఏ శాఖలోనూ ఉద్యోగాలు భర్తీకాలేదు. ఇప్పటికే ఆర్టీసీ, ఏపీపీఎస్సీ, రెవెన్యూ, అటవీ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లను సవరించి, రిజర్వేషన్ కేటగిరీలతో సహా వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలని మనవి.
-కొండ్ర శ్రీనివాస్ జగిత్యాల, క రీంనగర్ జిల్లా

విద్యార్థులను ఒత్తిడి చేయకండి!

‘ప్రత్యేక రాష్ట్ర’ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఇటీవలి కాలం వరకూ ఉధృతంగా సాగిన ఉద్యమాలతో విద్యాసంస్థలు నిరవధికంగా మూతపడటం తెలి సిందే. విద్యా సంవత్సరం చివరి దశలో ఎదురైన ఈ అవాంతరంతో అనేక విద్యాలయాల్లో సిలబస్ పూర్తికాకపోవడం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. సిలబస్‌ను ఎలాగైనా పూర్తిచేయాలన్న తలంపుతో విద్యా సంస్థల యాజమాన్యాలు, అధికారులు ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఊహించని రీతిలో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కావున విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు కల్పించుకుని, ఈ విద్యా సంవత్సరానికి సిలబస్‌ను కుదించి పరీక్షలు నిర్వహించాలి. అప్పుడు పిల్లలపై ఒత్తిడి తగ్గి, మంచి వాతావరణంలో పరీక్షలు రాయడానికి తోడ్పడుతుందని గమనించాలి.
-సి.విజయవంశీ కోరుకొల్లు, కృష్ణా జిల్లా

ఉపకార వేతనాలు ఇవ్వాలి!

రచ్చబండ, రాజీవ్ యువకిరణాలు అంటూ ముఖ్యమంత్రి చేస్తున్న హడావుడి పైకి చూడడానికి బాగానే ఉన్నా, సమస్యలను పరిష్కరించడంలో అది లేశమాత్రం కూడా కనిపించకపోవడం విచారకరం. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తూ రచ్చబండ కార్యక్రమాలను ఆర్భాటంగా నిర్వహించడం కన్నా, స్కాలర్‌షిప్‌లురాక లక్షలాది మంది విద్యార్థులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. రచ్చబండలో ప్రజలు సమర్పిస్తున్న విజ్ఞాపనలు పరిష్కారానికి నోచుకోకపోగా, అదే వేదికమీద నుంచి చెత్తబుట్ట పాలు కావడం ప్రత్యక్షంగా చూస్తున్నదే. ఇది ఎవరి లోపమన్నది ముఖ్యమంత్రి బాధ్యతతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా, విద్యార్థులకు మంజూరు చేయాల్సిన స్కాలర్‌షిప్‌లు వెంటనే మంజూరయ్యేలా తగు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి.
-కురువ శ్రీనివాసులు అంబర్‌పేట, హైదరాబాద్
Posted at 2:48:32 AM 0 comments
‘సామాజిక న్యాయ’ దార్శనికుడు ఫూలే!
naresh , November 27 , 2011
 
ఆర్థిక అసమానతలు, సాంఘిక బానిసత్వంతో శతాబ్దాలుగా కొట్టుమిట్టాడుతున్న భారతీయ సమాజం, ఒక జాతిగా మనుగడ సాగించలేదని విశ్లేషించిన తాత్వికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. బడుగు, బలహీన వర్గాలను ‘బహుజనులు’గా సం ఘటితం చేసిన సామాజిక దార్శినికుడాయన. ఆధునికయుగంలోనూ కొనసాగుతున్న కులాధిక్య కుళ్లును నిర్మూలించే ఉద్యమాలకు బీజం నాటిన జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న సతారా గ్రామంలో ‘మాలి’ అనే శూద్రకులంలో పుట్టారు. 1840లో సావిత్రిబాయితో వివాహం. సమాజంలోని దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అణగారిన కులాలను చైతన్యవంతం గావించిన సామాజిక ప్రజాస్వామ్యవాది ఆయన. అగ్రవర్ణ, కుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ‘గులాంగిరి’ అన్న విశ్లేషణాత్మక గ్రంథాన్ని ప్రచురించారు. పేద ప్రజలకు విద్య, ఆంగ్లభాషల ఆవశ్యకతను, అక్షరజ్ఞానం ప్రాముఖ్యతను వివరించి, ఆసక్తిని రేకెత్తించారు. ‘ఇల్లాలి చదువు-ఇంటికి వెలుగు’ అన్న సామాజిక భావనతో 1848లో సావిత్రిబాయితో కలిసి బాలికలకు ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. 1873లో ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించారు. 1888లో సమాజంలోని పౌరుల నుంచి ‘మహాత్మా’ అన్న బిరుదును అందుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఫూలే 1890 నవంబర్ 28న తుదిశ్వాస విడిచారు. నేటికీ అసంపూర్తిగా మిగిలిపోయిన కుల నిర్మూలనా పోరాటానికి ఫూలే స్ఫూర్తి కావాలి.
-బట్టు వెంకయ్య తెనాలి, గుంటూరు జిల్లా
(నవంబర్ 28 ఫూలే 121వ వర్ధంతి)

రేపటి రక్షకులు ‘ఎన్‌సీసీ క్యాడెట్స్’!

ఒక గొలుసు బలము దాని మడతల శక్తిపై ఆధారపడి ఉంటుంది. అలాగే సమాజ ఉజ్వల భవిష్యత్తు, ఆ సమాజంలోని యువత దేహ దారుఢ్యంపైనా, మేధోపరమైన శక్తియుక్తులపైనా ఆధారపడి ఉంటుంది. రేపటి పౌరులైన విద్యార్థులు, యువకులను విజ్ఞానంతో కూడిన తేజోమూర్తులుగా తీర్చిదిద్దడంతోపాటు, దృఢమైన పౌరులుగా శిక్షణ నివ్వ డం సామాజిక బాధ్యత. అందుకే డాక ్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ‘‘దేశ ప్రయోజనాలను కాపాడగలిగిన క్రమశిక్షణ, దృఢచిత్తం కలిగిన యువతను తయారు చేయ డం మన బాధ్యత’’ అన్నారు. ఏకత్వం, క్రమశిక్షణ ప్రధాన లక్ష్యాలుగా భావితరాలను తీర్చిదిద్ద డానికి ‘నేషనల్ క్యాడెట్ కోర్ (లేదా) జాతీయ సైనిక శిక్షణా దళం-1948’ రూపొందింది. భారతదేశంపై 1962లో చైనా దాడి అనంతరం దేశంలోని యువకుల్లో సైనిక శిక్షణ పట్ల ఆసక్తిని పెంచడానికి ‘ఎన్‌సీసీ’ని ప్రతి కళాశాలలోనూ ప్రారంభించారు. ప్రతి ఏడాది నవంబర్ నెల చివరి ఆదివారాన్ని ‘ఎన్‌సీసీ’ శిక్షణకు సంబంధించిన ప్రాముఖ్యాన్ని వివరించే దినంగా పాటిస్తున్నారు. యువతలో పట్టుదలను, ధైర్యాన్ని, ఐక్యతను పెంచడానికి ఎన్‌సీసీ క్యాంపులు నిర్వహిస్తుంది. ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థులకు మరింత స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం.

-సయ్యద్ కలీమ్ అహ్మద్ రోజ్‌దార్ న్యాయవాది, కావలి, నెల్లూరు జిల్లా
(నేడు ఎన్‌సీసీ శిక్షణా దినం)
Posted at 2:01:45 AM 0 comments
‘చట్టం-న్యాయం’తోనే సమధర్మం!
siva , November 26 , 2011
 
‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్న మాటను మనం తరచూ వింటుంటాం. ‘చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదు’ అన్న హెచ్చరిక వంటి ఆదేశాన్ని ‘రాజ్యాంగం’ ప్రజ లకు సదా గుర్తుచేస్తూ ఉంటుంది. ఆ ఆదేశాన్ని ప్రతి ఒక్కరూ తూచ తప్పక పాటించేలా ‘న్యాయస్థానం’ అప్రమత్తతో పర్యవేక్షించడమే కాక, నిఘా నేత్రాలతో నిత్యం కాపలా కాస్తుంది. ‘చట్టం-న్యాయం’ ఎలాంటి అరమరికలు లేకుండా అవిభాజ్యంగా కొనసాగినప్పుడే ‘రాజ్యం’ సుభిక్షంగా విలసిల్లుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు పరిపూర్ణంగా వికసించడానికి అదొక అనుల్లంఘనీయమైన సూత్రంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగం విధిం చిన పరిధుల్లో ‘చట్టసభలు’ ప్రజల ఆకాంక్షలూ, అవసరాలకు అనుగుణంగా చట్టాలను రూ పొందించి అమలు చేస్తాయి.

న్యాయస్థానాలు వాటి మంచి చెడ్డలను బేరీజు వేసి ‘న్యాయం’ ప్రజలందరికీ సమంగా అందేలా సమధర్మం పాటిస్తాయి. ఆ మహత్తర బాధ్యతను బలంగా గుర్తు చేసుకోవాలన్న తలంపుతో, ప్రతి సంవత్సరం నవంబర్ 26ను ‘జాతీయ న్యాయ దినోత్సవం’ జరుపుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం రెండు దశాబ్దాల క్రితం నిర ్ణయిం చి ప్రకటించడం ముదావహం. స్వతంత్ర భారతదేశచరిత్రో ‘నవంబర్ 26’కు ఎనలేని ప్రాముఖ్యం ఉంది. భారతదేశం స్వాతంత్య్రం పొందిన అనంతరం రాజ్యాంగ రచనకు ఒక పూర్తిస్థాయి కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా తొలి ప్రతిమీద 1949 నవంబర్ 26న రాజ్యాంగ కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. 440కి పైగా ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లు, 22 భాగాలతో కూడిన ‘భారత రాజ్యాంగం’ 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.

రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయడమే కాక, రాజ్యాంగ రక్షకురాలిగా న్యాయవ్యవస్థ వ్యవహరిస్తుంది గనుక, రాజ్యాంగ తొలి ప్రతులపై రాజ్యాంగ కమిటీ సభ్యులు సంతకం చేసి, రాజ్యాంగ ముసాయిదాను అధికారికంగా ఆమోదించిన నవంబర్ 26న న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం పరిపాటిగా మారింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా న్యాయవాదులు సమావేశమై ‘ప్రతిజ్ఞ’ చేయడం ఆనవాయితీ. చట్టం ముందు అందరూ సమానమని తెలియజేయడం, ప్రజలందరికీ సత్వర న్యాయం అందజేయడానికి కృషి చేయ డం న్యాయ దినోత్సవ ధ్యేయంకావడం దాని విశిష్టత. ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజా వ్యతి రేకంగా ఉన్నా, రాజ్యాంగాన్ని అతిక్రమించేవిగా ఉన్నా, ఆ చట్టాలు చెల్లవని చెప్పే అధికారం రాజ్యాంగ బద్ధంగా రూపొందిన ధర్మాసనాలకు ఉంది.

విచారణా క్రమంలో సుప్రీంకోర్టు వెలువరించే తీర్పులను కూడా ఆచరణలో చట్టాలుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యవ్యవస్థలు అనుసరించడం ఆనవాయితీ. అలాంటి తీర్పును ప్రభుత్వం అమలు చేయడం సాధ్యం కాదని భావిస్తే, దానికి అనుగుణంగా పార్లమెంటు ద్వారా ఆమేరకు చట్టాన్ని రూపొందిం చాల్సి ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశం పేరుప్రఖ్యాతులు గడించడంలో ‘న్యాయవ్యవస్థ’ సాగిస్తున్న కృషి అనన్యసామాన్యమైనదన్నది అతిశయో క్తి కాదు. చట్టం-న్యాయం సమధర్మం పాటించినప్పుడే, ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించడం సాధ ్యమవుతుంది. ‘న్యాయ దినోత్సవం’ అందుకు స్ఫూర్తి కావాలని ఆశిద్దాం!

బారు ధనుంజయ న్యాయవాది, హైదరాబాద్
(నేడు జాతీయ న్యాయ దినోత్సవం)

Monday, November 28, 2011

జీవం కోల్పోతున్న గోదావరి

భద్రాచలం టౌన్, నవంబర్ 28 : గోదావరికి ఎగువ ప్రాంతం నుంచి ఆశించినంత స్థాయిలో వరద నీరు రాకపోవడంతో గోదావరి గొంతెండుతోందని నీటి పారుదల రంగ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు గోదావరి పరిధిలో నీటి వినియోగం కూడా గతేడాది కంటే పెరిగిందంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే వేసవిలో కష్టాలు తప్పవన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోదావారి పరివాహక ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు దాహార్తిని తీర్చుకునేందుకు శ్రమించక తప్పదనే హెచ్చరికలు వెలువడుతున్నాయి.

వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందుగానే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీవనది అయిన గోదావరి ప్రస్తుతం వాగును తలపిస్తోంది. పిల్ల కాలువల్లా పారుతూ మధ్యలో ఇసుక తిన్నెలు దర్శనమిస్తుండటంతో గోదావరి తన సహజ స్వరూపాన్ని కోల్పోయి నిర్జీవంగా కన్పిస్తుండటం పట్ల యాత్రికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

1976 నుంచి ఇదీ.. పరిస్థితి
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం విషయంలో 1976వ సంవత్సరం నుంచి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా 1976 నుంచి ఇప్పటి వరకు కేవలం 11 సార్లు మాత్రమే గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహించింది. అలాగే 1986 ఆగస్టు 16న ఇప్పటి వరకు అత్యధికంగా 75.6 అడుగుల నీటిమట్టాన్ని నమోదు చేసింది. అయితే కొన్నేళ్లుగా గోదావరి నీటి వినియో గం గణనీయంగా పెరగడం నీటి మట్టం పడిపోవడానికి ప్రధాన కారణం. అయితే ఇప్పటి దాకా నీటిని వినియోగిస్తున్న ఐటీసీ పీఎస్‌పీడీ, హెవీవాటర్‌ప్లాంట్, సింగరేణి సంస్థలు గతేడాది నుంచి విద్యుత్ ఉత్పాదన కోసం బూర్గంపాడు నుంచి గోదావరి జలాలను పాల్వంచలోని కేటీపీఎస్‌కు తరలిస్తున్నారు.

కనిష్ట స్థాయికి పడిపోయిన నీటిమట్టం
గోదావరి నీటిమట్టం ఇప్పటికే కనిష్టస్థాయికి పడిపోయింది. ఆగస్టులో 43.3 అడుగులున్న గోదావరి నీటిమట్టంలో మూడు రోజుల క్రితం 7.5 అడుగులు తగ్గి 35.8 అడుగులకు చేరింది. గతేడాది ఇదే రోజున 10.7 అడుగులు గోదావరి నీటి మట్టం ఉండగా 2009లో ఇదే రోజున 10.5 అడుగుల నీటిమట్టం ఉంది. దీనికి ప్రధాన కారణం గతంలో కంటే ఈ ఏడాది వర్షాలు భారీగా లేకపోవడం, వరదల తీ వ్రత కూడా లేకపోవడమే కారణమని అధికారులు అంటున్నారు.

గతేడాది మూడుసార్లు గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటి.. ఆప్రవాహం సుమారు 45 రోజుల పాటు మొదటి ప్రమాద హెచ్చరిక సమీపంలో ఉంది. దీంతో భూగర్భ జలాలు భారీస్థాయిలో పెరిగాయి. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల భూగర్భజలాలు భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే వేసవి నాటికి సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

కనీస అవగాహన కరువు..
నీటిని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై ప్రజల్లో కనీస అవగాహన లేకపోవడం కూడా గోదావరి నీటిమట్టాలు గణనీయం గా పడిపోవడానికి కారణమని నీటిపారుదల ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. ఇసుక తవ్వకాలు నిర్ణీత పరిధిని దాటి జరుగుతుండటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయంటున్నారు.

మరో వైపు గతంలో దట్టమైన అటవీ ప్రాంతాల వల్ల వర్షాలు పడటం, కొండల నుంచి, వాగుల నుంచి నిరంతరం నీటి ప్రవాహం గోదావరిలో కలిసేదని ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదని వాపోయారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, అధికారులు ప్రజలకు నీటి వినియోగం పై అవగాహన కల్పించకపోతే మంచినీటి కొరత తీవ్రమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
_______________________________________________________________________
అమెరికా- పాక్‌ లడాయి!
శనివారం నాటి నాటో దాడులలో 24 మంది అమెరికన్‌ సైనికుల దుర్మరణం ఘటన అమెరికాకు దూరమై ఇటు అఫ్ఘాన్‌లోని ఉగ్రవాదులకు అటు చైనాకు చేరువ కావడానికి పాకిస్థాన్‌కు ఒక చక్కని రాజమార్గంగా ఉపయోగపడగల అవకాశాలున్నాయి. అఫ్ఘాన్‌లో శాంతి ప్రక్రియకు అమెరికాతో తామింక ఎంత మాత్రమూ సహకరించేది లేదని పాక్‌ ప్రధాని గిలానీ తాజాగా చేసిన ప్రకటనను గమనిస్తే వాషింగ్‌టన్‌, ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగానైనా తీవ్రంగా బెడిసికొట్టే వైపు పరుగులు తీస్తున్నాయని బోధ పడుతున్నది. అమెరికా ప్రపంచమంతటినీ తన క్రీడా స్థలంగా భావించి అన్య దేశాల సరిహద్దులు, సార్వభౌవూధికారాల పట్ల బొత్తిగా గౌరవం ప్రదర్శించకుండా వ్యవహరిస్తున్న తీరు పాక్‌ వంటి అత్యంత విధేయ దేశాన్ని కూడా దానికి దూరం చేస్తున్న దృశ్యాన్ని కళ్ళకు కడుతున్నది.

అఫ్ఘానిస్థాన్‌ సరిహద్దులలోని పాక్‌ సైనిక స్థావరాలపై నాటో దాడుల్లో 24 మంది పాకిస్థానీ సైనికుల దుర్మరణం గురు శిష్యులను తలపించే వాషింగ్‌టన్‌- ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలను మరింత క్షీణ దశకు చేర్చింది. ఇటీవలి కాలంలో అమెరికా- పాక్‌ల మధ్య పరస్పర అనుమానాలను పెంచిన పలు సంఘటనలు సంభవించాయి. గత జనవరిలో రేమండ్‌ డేవిస్‌ అనే ఒక సిఐఎ అధికారిని పాక్‌లో అరెస్టు చేసిన ఘటన రెండు దేశాల మధ్య సంబంధాలలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించింది. గత మే నెలలో పాకిస్థాన్‌కు చెప్పకుండానే దాని భూభాగమైన యాబొటాబాద్‌లోని బిన్‌ లాడెన్‌ స్థావరంపై అమెరికన్లు దండెత్తి అతడిని హతమార్చడం రెండు దేశాల మధ్య అఖాతం మరింత పెరగడానికి దోహదం చేసింది.

ఇప్పుడీ దాడిలో 24 మంది పాక్‌ సైనికులు నేలకు ఒరగడం సహజంగానే అమెరికాతో స్నేహంపై పాక్‌లో తీవ్రపునరాలోచనకు పురికొల్పుతుంది. ఈ దాడి జరిగిన వెంటనే తమ భూభాగంలోని వైమానికదళ స్థావరాన్ని ఖాళీచేయవలసిందిగా పాకిస్థాన్‌ ప్రభుత్వ, సై నిక పెద్దలు అమెరికానుకోరారు.అలాగే అఫ్ఘానిస్థాన్‌లోని నాటో దళాలకు కరా చీ నుంచి వెడుతున్న సరఫరాల నిలిపివేతకు పాకిస్థాన్‌ నిర్ణయం తీసుకున్నది. కలలో కూడా ఊహించని ఈ దాడి పాకిస్థాన్‌ను తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. అటు నాటో సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, టర్కీలు కూడా నష్ట నివారణ చర్యలను ముమ్మరం చేశాయి. పాకిస్థాన్‌ నేతలతో ఫోన్‌ సంభాషణలు ప్రారంభమయ్యాయి. సైనిక స్థాయిలో జరిగిన ఈ దుర్ఘటన రాజకీయ సంబంధాలపై ఎటువంటి దుష్ర్పభావం చూపకుండా జాగ్రత్త పడవలసిన అవసరం గురించి ఇస్లామాబాద్‌కు నచ్చజెప్పే ప్రయత్నం సాగుతున్నది.

శనివారం నాడు పాక్‌ సరిహద్దు సైనిక స్థావరాలపై నాటో దళాల హెలికాప్టర్‌, జెట్‌ దాడులకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరిపించడానికి నిర్ణయించారు. ఎటువంటి కవ్వింపు లేకుండా ఈ దాడులు జరిగాయని పాక్‌ సైన్యం చెబుతున్నది. పాక్‌ సైనిక స్థావరాలనుంచి కాల్పులు జరిగిన మీదటనే ఈ దాడులకు సమకట్టినట్టు నాటో, అఫ్ఘాన్‌ సైనిక వర్గాలు పేర్కొంటున్నాయి.ఉగ్రవాదులు స్థావరాలేర్పరచుకొని రాకపోకలు సాగించే పాక్‌- అఫ్ఘాన్‌ సరిహద్దులలో వారి ఏరివేతకు ఉద్దేశించిన నాటో సేనల ఉనికి, గాలింపు చీకట్లో దేవులాటగానే నిరూపించుకుం టున్నది. ఉగ్రవాదుల గుట్టుమట్టులు తెలిసిన పాక్‌ సైన్యం హృదయపూర్వకమైన పరిపూర్ణ సహకారం అందించకపోవడం వల్ల నాటో దళాల పని క్లిష్టతరమవుతున్నట్టు స్పష్టపడుతున్నది. ఈ నేపథ్యం లోనే చీమ చిటుక్కు మన్నా, పాము కాటు వేయబోతున్నంతగా భయోత్పాతం చెంది అవి అతిగా స్పందిస్తున్నట్టు బోధపడుతున్నది.

ఉగ్రవాదుల ఏరివేత కోసం అఫ్ఘానిస్థాన్‌పై అమెరికా ఏకపక్ష యుద్ధం దాని సారథ్యంలో నాటో దండయాత్ర లక్ష్య సాధనలో విఫలమవుతున్నాయి. ఉగ్రవాదులను ఏరివేసి కర్జాయ్‌ ప్రభుత్వానికి దేశాన్ని పూర్తిగా అప్పగించి అక్కడినుంచి సేనలను ఉపసంహరించుకోవాలని అమెరికా పెట్టుకున్న గడువు చేరువ అవుతున్న కొద్దీ ఆశించిన ఫలితాన్ని సాధించలేక అడుగులు తడబాటుకు గురి కావడమే జరుగుతున్నది. ఆ క్రమంలో ఇటుంటి ఘోరమైనపొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. దేశాల సరిహద్దులు, సార్వభౌమాధికారాలను గౌరవించడం అంతర్జాతీయ సంబంధాలలో అతి ముఖ్యమైన ప్రజాస్వామిక బాధ్యత. దీనిని గాలికి వదిలేసి అమెరికా రహస్య ఆపరేషన్‌ ద్వారా పాక్‌ భూభాగంలోని బిన్‌ లాడెన్‌ను హతమార్చింది.

ఈ ఏడాది జనవరిలో లాహోర్‌లో ఇద్దరు పాకిస్థానీయులను హతమార్చిన సిఐఎ అధికారి రేమండ్‌ అలెన్‌ డేవిస్‌ను పాక్‌ అధికారులు అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టగా అతడికి దౌత్య సంబంధమైన రక్షణలున్నాయంటూ అమెరికా పాక్‌పై కల్పించిన ఒత్తిడి చివరికి ఏ శిక్షా పడకుండా మృతులకు పరిహార విత్తం చెల్లింపుతో సరిపుచ్చి అతడిని విడుదల చేయించుకొని స్వదేశానికి రప్పించుకున్న వైనం అమెరికాకు ఇతర దేశాలలో ఆయా దేశాల చట్టాలకుండవలసిన స్వేచ్ఛ మీద కూడా గౌరవం లేదని నిరూపించింది. రేమండ్‌ డేవిస్‌ ఉదంతంతో ఆ విధంగా అమెరికా- పాక్‌ల సంబంధాలలో మొదలైన క్షీణత ఆ తదుపరి సంభవించిన పరిణామాలతో మరింత చిక్కబడింది.

అమెరికా, నాటో సేనలు 2014 నాటికి అఫ్ఘానిస్థాన్‌ నుంచి పూర్తిగా వైదొలగిన తర్వాత అక్కడ తన ప్రాబల్య, ప్రాధాన్యాలను పెంచుకోవాలని పాకిస్థాన్‌ భావిస్తున్నది. కర్జాయ్‌ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలు మరింత మెరుగు పరచుకోవడమూ పాక్‌కు కంటగింపుగా ఉన్నది. అఫ్ఘాన్‌ లోని ఉగ్రవాద సంస్థలతో పాక్‌ సైన్యం సత్సంబంధాలు కాపాడుకుంటూ వాటికి తోడ్పాటు కూడా ఇస్తున్నది. ఉగ్రవాదుల గుట్టు మట్టులు తెలిసిన పాకిస్థాన్‌ సహకారంతోనే వారిని తుదముట్టించాలని తలంచి అందుకోసం దానికి అపారమైన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న అమెరికాకు ఇది ఆందోళన కలిగిస్తున్నది.

శనివారంనాటి నాటో దాడులలో 24మంది అమెరికన్‌ సైనికుల దుర్మరణం ఘటన అమెరికాకు దూరమై ఇటు అఫ్ఘాన్‌లోని ఉగ్రవాదులకు అటు చైనాకు చేరువ కావడానికి పాకిస్థాన్‌కు ఒక చక్కని రాజమార్గంగా ఉపయోగపడగల అవకాశాలున్నాయి. అఫ్ఘాన్‌లో శాంతిప్రక్రియకు అమెరికాతో తామింక ఎంత మాత్రమూ సహకరించేదిలేదని పాక్‌ ప్రధాని గిలానీ తాజాగా చేసిన ప్రకటన ను గమనిస్తే వాషింగ్‌టన్‌, ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగానైనా తీవ్రంగా బెడిసికొట్టే వైపు పరుగులు తీస్తున్నాయని బోధ పడుతున్నది. అమెరికా ప్రపంచమంతటినీ తన క్రీడా స్థలంగా భావించి అన్య దేశాల సరిహద్దులు, సార్వభౌవూధికారాల పట్ల బొత్తిగా గౌరవం ప్రదర్శించకుండా వ్యవహరిస్తున్న తీరు పాక్‌ వంటి అత్యంత విధేయ దేశాన్ని కూడా దానికి దూరం చేస్తున్న దృశ్యాన్ని కళ్ళకు కడుతున్నది. పాకిస్థాన్‌ సహాయంతో అఫ్ఘానిస్థాన్‌లోని ఉగ్రవాదులను మట్టు బెట్టాలని, అదే సమయంలో మితవాదులను చర్చలకు రప్పించడం ద్వారా అక్కడ శాంతిని నెలకొల్పి పునర్మిర్మాణ కృషిని నిరవరోధం చేయాలని అమెరికా రచించుకున్న వ్యూహానికి విఘాతం ఏర్పడే సూచనలు కనుపిస్తున్నాయి. 
_______________________________________________________________________
మనసుకు ఓ ‘తోడు’
ఎంపు-55
యవ్వనంలో జరిగే పెళ్లికి ఎలాంటి ప్రశ్నలూ ఉండవు. అది సహజం. సంప్రదాయం. కానీ ఒక వయసు దాటిన తరువాత జరిగే పెళ్లిళ్ల వెనుక దాంపత్య సుఖానికి అతీతమైన అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి పెళ్లిళ్లలో శారీరక వాంఛల ఆలోచనలు ఇద్దరికీ దాదాపు ఉండవు. అయినా, కాలం ఎంతో మారిపోయింది అనుకుంటున్నా అలాంటి పెళ్లిళ్లు ఇప్పటికీ చెవులు కొరుక్కునే విషయాలు గానే ఉండిపోతున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం జరగడం లేదు.

ఆరోగ్యకరమయిన రచనలు చేసేవాడిగా రా.వి.శాస్త్రి అభినందనలందుకున్న కేవీఎస్ వర్మ రాసిన కథ ‘తోడు’ కూడా ఒక పెళ్లి గురించినదే. ఈ కథలో భద్రయ్య పెళ్లి చేసు కోవడం జీవితంలో ఒక తోడు కోసమే. మరో కాంక్ష ఏదీ లేదు. భద్రయ్య చేసుకున్న సత్యవతికీ నలభయ్ సంవత్స రాలు దాటాయి. జుట్టు కొంచెం నెరిసింది. పేదరికం ఆమె కు పెళ్లి రాత లేకుండా చేస్తుందేమోననుకుంటున్న సమ యంలో భద్రయ్య తాళికట్టి నీడ కల్పించాడు. భద్రయ్యకు తోడు, సత్యవతికి నీడ- ఇవీ ఈ పెళ్లికి కారణాలు.

ఒంటరితనం, అదీ అరవై దాటాక, ఎంత దుర్భరమో అనుభవించిన వారికే తెలుస్తుంది అంటాడు భద్రయ్య. తోడు కథలో ఇదే కీలకాంశం. మనిషి ఆయుష్షు అంచనాకు అందనిది. కానీ జీవన ప్రమాణాల దృష్ట్యా ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటి బతికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అరవై పైబడి, ఎనభయ్ సంవత్సరాలు వచ్చే దాకా బతికే అవకాశం కనిపిస్తూ ఉంటే, ఆ మిగిలిన ఇరవై సంవత్సరాలు ఒక మనిషిని ఒంటరిగా ఉండిపొమ్మనడం ఘోరమైన శిక్షే.

జీవిత సంధ్యా సమయం వైపు నడుస్తున్న తండ్రుల తరానికి భద్రయ్య ప్రతినిధి. కొడుకూ కోడలూ లేదా కూతురూ అల్లుడు స్థితిమం తులుగానే ఉండొచ్చు-ఎక్కడో అమెరికా లోనో, లేదంటే ఇంగ్లండ్‌లోనో! ఇక్కడే ఉన్న తల్లిదండ్రులకు కూడా ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు. కానీ ఒంటరి తనం మాటో! అప్పుడప్పుడూ విదేశాల్లో ఉన్న కొడుకూ కోడలు దగ్గరకు వెళ్లినా ‘చెప్పుకోలేని’ కొన్ని బాధలతో మళ్లీ తిరిగి రావడమే అవుతోంది. అన్నీ ఉన్నా ఆత్మీయంగా పలకరించేవాళ్లు లేకుంటే జీవితంలో అదో శూన్యమే. ఈ సమస్య నుంచి విముక్తం కావడానికి ఏ కొందరో చేస్తున్న యత్నం - మళ్లీ పెళ్లి- మానవ సంబంధాలలో కొత్తకోణమే. వర్మగారి కథ పురుషుల జీవితానికే పరిమితం.

భద్రయ్య మళ్లీ పెళ్లి చేసుకుంటే అతని కొడుకు సుందర్రావు చూసిన కోణం-ఇక ‘ఆస్తిలో చిల్లిగవ్వ దక్కదు’ అనేదే. అంతేకానీ, తండ్రి అలాంటి నిర్ణయం తీసుకోవ డానికి కారణం ఏమిటి అన్న ఆలోచన మాత్రం అతడికి రాదు. అప్పుడు తన భార్య సుశీల మీద కూడా అతడికి ఆగ్రహం కలుగుతుంది. తండ్రి మళ్లీ పెళ్లి, ఆస్తిలో చిల్లిగవ్వ దక్కకుండా పోయే ఆ పరిణా మాలకి కారణం ఆమేనని అతడు భావి స్తాడు. సుందర్రావే కాదు, దారిలో కనిపిం చిన ఒక బంధువు కూడా భద్రయ్య నిర్ణ యాన్ని హర్షించలేకపోతాడు, ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే వెళ్లి, నలు గురు పెద్దల్ని కూడగట్టి వాళ్ల చేత చీవాట్లు పెట్టించు. ఆస్తంతా దానికి రాసెయ్యక ముందే జాగ్రత్తపడు’ అని ఉచిత సలహా పడేస్తాడు.

మానవ సంబంధాలకు ఆర్థికభాష్యం అన్ని కాలాల లోనూ కనిపించినా దాని విశ్వరూపం, అది వేస్తున్న వెర్రి తలలు ‘తోడు’ కథలో క్లుప్తంగానే అయినా మనసుకు హత్తు కునేటట్టు చిత్రించాడు రచయిత. అందరికీ ఆమోదయోగ్య మైన రీతిలో భద్రయ్య తన అయిదెకరాల ఆస్తిని పంచి చూపించాడు. ఇక్కడ భద్రయ్య చెప్పిన వాదన ఒక్కటే.

బాధ్యతలు ఎరిగిన వారికే అధికారాలూ ఉంటాయి. తండ్రిగా తన బాధ్యత తాను నిర్వర్తిం చాడు. కానీ కొడుకు! తన బాధ్యతలని విస్మరించడమే కాదు, తప్పుదారిలో ఉన్న కోడలిని తన దారికి తీసుకురాక పోవడమే కాదు, ఆమె దారిలోకి తనే అడుగులు వేశాడు. అయితే ఇక్కడ భద్రయ్య కోడలిని తప్పుపట్టడు. ఆమె పరాయి పిల్ల. నిజానికి భద్రయ్యది బలమైన వ్యక్తిత్వం. లోకం కోసం బతకాలని అనుకోడు. అలాఅని తను తప్పు చేయడు. ఎవరి కోసమో తన అభిప్రాయాలను మార్చు కోడు. ఆ క్రమంలోనే అతడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. తన అయిదెకరాలలో మూడు ఎకరాలు సుందర్రావు పేరన, రెం డెకరాలు సత్యవతి పేరున రాశాడు. తన తదనంతరం సత్య వతిని చూసుకోవడానికి సుందర్రావు, సుశీల ఇష్టపడకపోతే ఆమె ఎవరినైనా పెంచుకోవచ్చుననీ, తోడు కూడా తెచ్చు కోవచ్చునని విల్లు రాసి తన ఔన్నత్యాన్ని కూడా చాటుకున్నాడు భద్రయ్య.

ముసలి అత్తమామలు వద్దు, వారి ఆస్తులు మాత్రం కావాలి అనుకునే తత్వం కొందరిలో కనిపిస్తున్న నైజమే. దీనికి పరిష్కారంగా ఒకరిని తోడు తెచ్చుకుంటే మధ్య తరగతి పరిధిలో వినిపించే దుర్మార్గపు వ్యాఖ్యానాలు అందరికీ తెలిసినవే. అమెరికా వంటి స్వేచ్ఛాయుత సమాజంలోనో, పెద్ద పెద్ద నగరాలలోనో ఉన్నా ఇలాంటి పెళ్లికి కారణాలను ఊహించలేనంతగా మనుషులు జడులు గా మిగిలి ఉండడమే ఈ కథలో గొప్ప లక్షణం. (వర్మ రాసిన ‘మరొకడు’/‘నేను నేనే’ కథా సంకలనాలు మార్కెట్‌లో దొరుకుతాయి).
- ఆర్. జగదీశ్వరరావు

మనసుపొరల మధ్యనుంచి చూపును సారించి, ‘సారాంశం’ గ్రహించగల ‘జర్నలిస్టు’ ఆర్.జగదీశ్వరరావు నటుడూ, నాటక కర్తా, కథా రచయితా కూడా. రా.వి.శాస్త్రి - కె.ఎన్.వై పతంజలిలాంటి దిగ్దంతుల రచనలకు అభిమానిగా ఉంటూ, ఉత్తమ సాహిత్యాన్ని మనసారా అభినందించే సంస్కారం పెంచుకున్నారు. కె.వి.ఎస్.వర్మ కథానిక ‘తోడు’ను ఇక్కడ పరిచయం చేసినందుకు జగదీష్‌కు కృతజ్ఞతలు.

Sunday, November 27, 2011

మేము భారత్‌లోనే ఉంటాం!

ఢిల్లీలో మాకు వసతి కల్పించండి శకేంద్రానికి 140 మంది పాక్ హిందువుల మొర 


న్యూఢిల్లీ, నవంబర్ 23: తమ దేశంలో వివక్షకు గురవుతూనే బతకాల్సి వస్తుందన్న భయంతో సుమారు 140 మంది పాకిస్తానీ హిందువులు ఢిల్లీని తమ నివాసంగా చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. సింధ్ రాష్ట్రానికి చెందిన వీరంతా టూరిస్టు వీసాపై భారత్ వచ్చారు. ఆ వీసా గడువు ఇప్పటికే ముగిసిపోయింది కూడా. అయితే వీళ్లంతా తమ జన్మస్థలంలో బతుకు దుర్భరంగా ఉంటుందన్న భయంతో మళ్లీ అక్కడికి తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. రెండు నెలల క్రితమే తమ వీసా గడువు ముగిసిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న సింధ్ రాష్ట్రంలోని మతియారీ జిల్లా గ్రామానికి చెందిన ఈ 27 కుటుంబాలు భారత్‌లో అయితే తామంతా సురక్షితంగా ఉంటామని భావిస్తున్నారు. ప్రస్తుతం వీళ్లంతా ఉత్తర ఢిల్లీలోని మజ్నూకా తిల్లా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన టెంట్లలో ఉంటున్నారు. తమ వీసాలను పొడిగించి నగరంలో తమకు తగిన వసతి సదుపాయం కల్పించాలని వీరంతా ముక్తకంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూసిన తర్వాత టూరిస్టు వీసా సంపాదించిన వీరంతా సెప్టెంబర్ 2న కాలి నడకన సరిహద్దులను దాటి రెండు రోజుల తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. తాము ఈ విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, కాణగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసామని, అయితే ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న గంగారామ్ చెప్పారు. పాకిస్తాన్‌నుంచి భారత్ చేరుకునే దాకా తన కథనంతా వివరించిన ఇరవై ఏళ్ల జమున కనీసం తన పిల్లలయినా ప్రశాంత వాతావరణంలో మెరుగయిన జీవితాన్ని, విద్యను పొందుతారన్న ఆశతో ఉన్నట్లు చెప్పింది. ‘పాకిస్తాన్‌లో మత స్వేచ్ఛ లేదు. హిందువులను చదువుకోవడానికి అనుమతించరు. మాపై ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి. భారత దేశానికి వచ్చి ఇక్కడే స్తిరపడిపోవాలనే ఉద్దేశంతో వీసా కోసం ఎదురు చూస్తున్నాం. ఏది ఏమయినా మేము తిరిగి వెళ్లం’ అని కుటుంబ సభ్యులు, స్నేహితులు చుట్టుముట్టి ఉండగా, ఆరుబయటే రొట్టెలు చేస్తున్న జమున చెప్పింది. డేరా బాబా ధున్నీదాస్ ఈ 27 కుటుంబాలకు వేర్వేరుగా టెంట్లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, ఇతర సరకులు సరఫరా చేస్తూ ఉంది. ఈ కుటుంబాల్లో యువకులే కాకుండా వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న దుకాణాల్లో పనులు చేయడం కూడా ప్రారంభించారు. ‘్భరతీయులు తమకు సాయం చేస్తారు’ అన్న ఏకైక ప్రార్థనతో తామంతా కొంపా గోడు, పశువులు అన్నీ వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చామని జమున చెప్పింది. తామెందుకు పాకిస్తాన్ వదిలి పారిపోయి వచ్చామో చందెర్మా అనే 40 ఏళ్ల మహిళ వివరించింది.‘ పిల్లలు బడికి వెళితే వేరుగా కూర్చోబెడుతున్నారు. వాళ్లకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. మేము అనునిత్యం భయంతో కూడిన వాతావరణంలో జీవించాలనుకోవడం లేదు. అందుకే మేము టూరిస్టు వీసాపై ఇక్కడికి వచ్చాం’ అని ఆమె చెప్పింది. స్థానికులు తమ ఖర్చులను భరిస్తున్నారని ఆమె చెప్తూ, తమ వీసాలను పొడిగించి తమ పిల్లలు చదువులు కొనసాగించడానికి వీలుగా తమకు తలదాచుకోవడానికి గూడును ఏర్పాటు చేయాలని మాత్రమే తాము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ఆమె చెప్పింది. 13 ఏళ్ల ఆర్తీ కథ ఎవరినైనా కదిలించకమానదు. ఆ అమ్మాయి ఎప్పుడూ బడికి వెళ్లి చదువుకోలేదు కానీ తన తాత, నాన్నమ్మ దగ్గరనుంచి హిందూ మంత్రాలను నేర్చుకుంది. ఓ పక్క కుటుంబానికంతటికీ వంట చేస్తూనే మరో పక్క తాను నేర్చుకున్న మంత్రాలను క్యాంప్‌లోని చిన్నారులకు నేర్పిస్తోంది. ‘నేను నేర్చుకున్న దాన్ని నా స్నేహితులకు నేర్పించడం ద్వారా నా ఒత్తిడిని మరిచిపోతున్నాను’ అని ముక్కుపచ్చలారని ఆ చిన్నారి చెప్తూ ఉంటే ఎవరికయినా కళ్లు చెమర్చకమానవు. కాగా, భారత దేశంలో వేలాది మంది బంగ్లాదేశీయులు, నేపాలీలు, టిబెటన్లు ఉన్నప్పుడు హిందువులైన తాము ఇక్కడ ఎందుకు ఉండకూడదని ఆమె సోదరుడు ప్రశ్నిస్తూ, తాము ఇక్కడే తమ జీవితాలను కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలని అన్నాడు.
_________________________________________________________________________


పేదల చదువుకు ఏలికల ఎసరు!
ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర వృత్తి విద్యా కోర్సు ల ఫీజులకు కన్వీనర్ కోటా, యాజమాన్యం కోటా సీట్లకు ‘కామన్ ఫీజు’ ఉండాలని ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. కామన్ ఫీజు ఉండా లనే తీర్పు వరకు బాగానే ఉంది. కాని కోర్టు ఇంకో అడుగు ముందుకేసి, ఫీజుల రేట్లను కాలేజీలే నిర్ణయించుకోవాలని తీర్మానించింది. ఫీజుల రేట్లను కాలేజీలు నిర్ణయించుకోవడమంటే దొంగకు తాళం చేయి ఇవ్వడమే.

ఈ తీర్పు వలన 706 ఇంజనీరింగ్ కాలేజీలు, 709 ఎంసీఏ కాలేజీలు, 906 ఎంబీఏ కాలే జీలు, 275 ఫార్మసీ కాలేజీలలో చదివే 5 లక్షల 60 వేల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఇంతటి ‘ప్రజావ్యతిరేక తీర్పు’ వెలువడటం వెనుక ప్రభుత్వ ద్రోహ చింతన ఉందని చెప్పకతప్పదు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలు బలంగా వినిపించి ఉంటే తీర్పు ఇలా వచ్చేది కాదు. ఇంత ముఖ్యమైన కేసు హైకోర్టులో నడుస్తుంటే ప్రభుత్వం ఏనాడూ శ్రద్ధ తీసుకోలేదు. అంతేకాదు, కోర్టుతీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. మంత్రులు కూడా స్పందించలేదు.

ప్రస్తుతం వృత్తి విద్యాకోర్సులు చదివే విద్యార్థులలో బీసీలు 2.48 వేలు, ఎస్సీలు 77 వేలు, ఎస్టీలు 21 వేలు, ఈబీసీలు 155 వేలు, మైనార్టీలు 52 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం కన్వీనర్ కోటా కింద ఇంజనీరింగ్ విద్యకు సగటున ఫీజులు 35 వేలు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు రూ.32 వేలు మంజూరు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు అమలుచేస్తే ఈ ఫీజు మొత్తాన్ని సగటున రూ.50 వేల నుంచి రూ.55 వేల దాకా పెంచవలసి వస్తుంది. ఫలితంగా ప్రస్తుత ఫీజుల రీయింబర్స్‌మెంట్ బడ్జెట్ రూ.3,400 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు పెరుగుతుంది. అప్పుడు ఇంత భారం మోయలేమని ప్రభుత్వం చేతులెత్తేసే ప్రమాదం ఉంది.

హైకోర్టు తీర్పు అమలులోకి వస్తే కాలేజీలలో మౌలిక సదుపాయాలు, బోధన ప్రమాణాలు, కాలేజీ చరిత్ర, ఉత్తీర్ణత శాతం, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది వేతనాలు ఆధారంగా ఫీజుల రేట్లను నిర్ణయించవలసి వస్తుంది. ఇలా ఒక్కో కాలేజీకి వెళ్లి ఫీజులను నిర్ణయించడం కష్టసాధ్యం. అప్పుడు రాష్ట్రంలోని 2,300 వృత్తి విద్యా కాలేజీలలో రకరకాల ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. యాజమాన్యాలు పెట్టే ఖర్చు ఆధారంగా ఒక్కొక్క కోర్సు - ఒక్కొక్క కాలేజీలో వివిధ రకాల ఫీజుల రేట్లు నిర్ణయిస్తే అనివార్యంగా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

కొదవలేని ఎగవేత కుట్రలు, కోతలు

బడుగు, బలహీన, బీద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆయన హయాంలో దిగ్విజయంగా సాగింది. కానీ, ఆయన మరణానంతరం ఈ పథకం ఎత్తివేతకు అదే పనిగా కుట్రలు జరుగుతూవచ్చాయి. మాజీ ముఖ్యమ్రంతి రోశయ్య కాలం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దాకా పథకం అమలుకు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవు. బడ్జెట్ సకాలంలో విడుదల చేయకుండా జాప్యం చేయడం, వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయేటట్లు చేసి ఖజానాకు భారమవుతున్నదని పథకం ప్రకారం ప్రచారం చేయడం రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్‌కు నిత్యకృత్యంగా మారిపోయింది. ఏ స్కీముకు లేని విధంగా దీనికి తొమ్మిది మంది మంత్రులతో ఉపసంఘం నియమించి అనేక కోతలు విధించారు. ఇంకా వెతికి, వెతికి కోతలు, వాతలు పెడుతూనే ఉన్నారు. అర్థం, పర్థంలేని నిబంధనలతో విద్యార్థులను తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు.

పథకం ఎత్తివేయాలన్నది ఈ ప్రభుత్వం రహస్య ఎజెండా. అందుకే లెక్కకు మిక్కిలిగా నిబంధనలు విధించి, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు లక్షలాది మంది విద్యార్థులను అనర్హులను చేసే ఎత్తుగడ పన్నారు. ‘స్పాట్ అడ్మిషన్లకు’ ఫీజుల రీయింబర్స్‌మెంట్ ఎత్తి వేశారు.

అంతేకాదు, దరఖాస్తులో చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ 2 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజులు మంజూరు చేయలేదు. వీరిలో లక్షన్నర మందిని కేవలం తండ్రి సంతకాలు, విద్యార్థుల సంతకాలలో చిన్నచిన్న తేడాలు ఉన్నాయనే కారణంతో తిరస్కరించారు. వాస్తవానికి అనర్హతకు ఆదాయ సర్టిఫికెట్ ప్రమాణం, కానీ వెరిఫికేషన్ అధికారులు, సంక్షేమశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తండ్రి సంతకం లేకుంటే దరఖాస్తులు బుట్టదాఖలా చేశారు. సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలలోనే సంతకాలను పట్టించుకోరు. ఇక్కడ పట్టించుకుంటున్నారంటే ఉద్దేశ పూర్వకంగా లబ్ధిదారులను తగ్గించాలనే కుట్ర అతి స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఎస్‌ఎస్‌సీ చదివి ఇంటర్‌లో ప్రవేశించే విద్యార్థులకు చాలా విషయాలు తెలియవు. కొన్ని అంశాలు అర్థంగాక ఫారాలు పూర్తి స్థాయిలో నింపలేరు. అధికారులు ఇది తెలిసి కూడా పనిగట్టుకుని వారి దరఖాస్తులను పరిశీలించ నిరాకరించారు.

ఈ స్కీముకు గండి కొట్టడానికి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. పన్నని పన్నాగాలు లేవు. ఏటేటా ఎంసెట్ నోటిఫికేషన్‌లో ఒక లక్ష లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు అడ్మిషన్ల సమయంలో ఫీజులు కట్టనవసరం లేదని స్పష్టంగా పేర్కొనేవారు. కానీ ఈ ఏడాది నోటిఫికేషన్‌లో ఈ అంశాన్ని పేర్కొనకపోవడంతో, కాలేజీ యాజమాన్యాలు ఇదే అదనుగా ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాయి. ఇంతేకాదు, ఫీజుల పథకానికి ఇంకా ఎన్నెన్నో చిల్లులు పొడిచారు. 34 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి విధించారు. ఒక పీజీ కోర్సు కంటే ఎక్కువ చదవరాదని, 75 శాతం హాజరు తగ్గితే స్కాలర్‌షిప్ లేదనే షరతు విధించారు. ఆదాయం సర్టిఫికెట్ జారీకి అనేక కట్టుదిట్టాలు చేశారు. వీటన్నిటికీ తోడు ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ స్కీము ఉంటుందా? ఊడుతుందా అనే అనుమానం విద్యార్థులను వేధిస్తున్నది.

‘ప్రభుత్వ’ షరతు సరికాదు!

మంత్రివర్గ ఉపసంఘం ఫీజుల రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే ఫీజుల రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదవాలని, అందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశం మంచిదే! కానీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. అదీగాక సర్కారు బడిలో చదివిన వారికే ఫీజులు మంజూరు చేస్తామనే వాదన రాజ్యాంగ విరుద్ధం. ఇలా ప్రతిపాదించే ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది. రాష్ట్రంలోని 78 వేల ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 40 వేల పాఠశాలల్లో ఆడపిల్లలకు కనీస అవసరాలు తీర్చే బాత్‌రూమ్‌లు, లెట్రిన్లు, తాగేందుకు మంచినీటి సౌకర్యాలు లేవని ప్రభుత్వ నివేదికలే తెలుపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంవల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతిని, పేదలు సైతం తమ పిల్లల భవిష్యత్తు కోసం అప్పు చేసైనా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిబంధన సరికాదు.

తీర్పుతో విద్యార్థులకు తీరని నష్టం!

హైకోర్టు తీర్పు అమలు చేస్తే పేదకులాల వారు ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు చదవడం గగన కుసుమమే అవుతుంది. ఫీజుల రీయింబర్స్‌మెంట్ స్కీముపై ఇప్పటికే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక ఫీజుల రేట్లు నిర్ణయించే అధికారం కాలేజీ యాజమాన్యాలకు ధారాదత్తం చేస్తే కాలేజీ యాజమాన్యాల అక్రమాలకు అడ్డూ అదుపూ ఉండదు. ప్రభుత్వ జీఓ నం.18 ప్రకారం విద్యార్థులకు మొత్తం ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజు, పరీక్ష ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరించాలి. కేవలం లైబ్రరీ డిపాజిట్ రూ.1,000, ల్యాబ్ డిపాజిట్ రూ.1,500లు మాత్రమే విద్యార్థులు చెల్లించాలి. కానీ ఆచరణలో కాలేజీ యాజమాన్యాలు డెవలప్‌మెంట్ ఫీజు, స్పెషల్ ఫీజులు, యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు పేరు మీద ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు బలవంతంగా వసూలు చేస్తున్నాయి. మంజూరైన తర్వాత ఇస్తామని స్పెషల్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. తర్వాత స్వాహా చేస్తున్నాయి.

తీర్పు ప్రభుత్వానికి అనుకోని వరం!

ఫీజు చెల్లింపు పథకానికి ఎప్పుడు ఎగనామం పెడదామా అని రెండు సంవత్సరాలుగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు అనుకోని వరంగా మారింది. రాష్ట్ర సర్కార్ మొక్కుబడిగా సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లినా చిత్తశుద్ధితో పోరాడుతుందనే హామీ లేదు. ఈ తీర్పును అడ్డం పెట్టుకుని రెన్యువల్, ‘ఫ్రెష్’ విద్యార్థులకు ప్రభుత్వం బడ్జెట్ కల్పించడం లేదు. ఫీజుల జీఓను ప్రభుత్వం ఇప్పటికే కొట్టివేసింది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రంలోని 706 ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్నత ప్రమాణాలు గల మొదటి 20 కాలేజీలకు మాత్రమే ఫీజు పెంచుకునే అవకాశం ఉంది. మిగతా కాలేజీలకు ఈ తీర్పుతో మరింత నష్టం జరుగుతుంది. ఇప్పటికే 50 సీట్లు కూడా భర్తీ కాని 150 ఇంజనీరింగ్ కాలేజీలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. కోర్టు తీర్పుతో విద్యార్థుల సంఖ్య తగ్గి కాలేజీలు శాశ్వతంగా మూతపడటం ఖాయం. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం వచ్చిన తరువాత కాలేజీలకు జవజీవాలు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య పెరిగింది. పథకం అమలులో ఏ మాత్రం తేడా వచ్చినా 706 ఇంజనీరింగ్ కాలేజీలలో కనీసం 500 కాలేజీలు మూతపడవలసి వస్తుంది. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలు కూడా వందల సంఖ్యలో మూత పడతాయి.

ఏం చేయాలంటే...

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలి.
ఫీజుల నియంత్రణాధికారం, ఫీజులను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి ఉండే విధంగా అసెంబ్లీలో చట్టం చేయాలి.
వృత్తి విద్యా కాలేజీలకు దేశమంతటా ఒకేవిధంగా ఫీజులు ఉండేటట్లు పార్లమెంటులో చట్టం చేయాలి.
కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
యూనివర్సిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలు ప్రారంభించాలి. దీనిమూలంగా ఫీజుల భారం తగ్గుతుంది. ఎందుకంటే అప్పుడు అధ్యాపక సిబ్బంది వేతనాలు యూజీసీయే చెల్లిస్తుంది.

Thursday, November 24, 2011

ఉద్యమం అంటే ప్రజల్ని హింసించడమా?


- నూటికి 99 బంద్‌లు స్వచ్ఛందం కావు
- బలవంతపు బంద్‌లతో జనజీవనం అతలాకుతలం
- ప్రజల్ని ఇబ్బంది పెట్టని పోరాట రూపాలు ఎన్నో!
- ప్రజాస్వామ్యపోరాటానికి ‘అన్నా’ ఆందోళనే ఉదాహరణ


telang-road-mealsఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందని ఒక సామెత ఉంది. భారత దేశంలో ఏ ఉద్యమాలు జరిగినా మొదిట బలైపోయేది- వాటితో ఏ ప్రత్యక్ష సంబంధంలేని సామాన్య మానవుడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మలిదశలో తీవ్ర స్థాయికి చేరింది. ఇక్కడి చర్చనీయాంశం మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసే పోరాటం గురించి కాదు. ఈ దేశంలోని సామాన్య మానవుడి గురించి! ఏ రాజకీయ పార్టీ ఎందుకు ఉద్యమం ప్రారంభించినా అందులో ముందుగా బలైపోయేది అటు విద్యార్ధులు, ఇటు జనసామాన్యం. ఏ పార్టీ అయినా తన అజెండాని అమలు చేసేటప్పుడు బందుకు పిలుపునిస్తున్నాం అంటుంది. అంటే పిలుపు ఇస్తే, ప్రజలు స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలన్నీ మానుకొని బందు పాటించాలన్నమాట.

వ్యాపారులు దుకాణాలు తెరవకూడదు. బస్సులు తిరగకూడదు. బడులు మూసివేయాలి. కాని, ఇలా పిలుపు ఇచ్చి ఊరుకుంటే బంద్‌ అనేది జరగనే జరగదు. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు చేసిన బందులలో ప్రజలు తమకై తాము బందును నిర్వహించిన ఘట్టాలు నూటికి 99 సార్లు లేవు. బందుకు పిలుపు ఇచ్చిన పార్టీలు గూండాగిరికి, బెదిరింపులకు పాల్పడకుండా బందును నిర్వహించిన ఘట్టాలు కలికానికి కూడా లేవు. బలవంతపు బందులు ప్రజాజీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తున్నాయో పార్టీలు ఏ మాత్రం పట్టించుకోవు.

గడచిన రెండు దశాబ్దాలలో ఈ సంస్కృతి పెరిగిపోయింది. దౌర్జన్యంతో షాపుల మీద దాడి చేయడం, బందు చేయని వారి షాపులు పగల కొట్టడం. సామాన్లు లూటీ చేయడం, అడ్డువస్తే దాడికి దిగడం- దేశవ్యాప్తంగా ఎన్నో సందర్భాలలో జరిగినట్లు వార్తలు తెలుపుతున్నాయి. దీనికి ఏ పార్టీకూడా మినహాయింపు కాదు. అసలు పార్టీలలో ఇలా చేయగలిగే గుంపులు ప్రత్యేకంగా ఉండడాన్ని గమనించాలి. చాలా పార్టీలలో ఇలాంటి క్యాడర్‌ ను పోషించడం తప్పని సరి అంశంగా ఉంటుంది. ఈ దౌర్జన్యాలకు భయపడే షాపుల యజమానులు- ఒక రోజు వ్యాపారం జరగకపోవడం ద్వారా వచ్చే నష్టం కన్నా- గూండాలు దాడి చేస్తే జరిగే నష్టం అందుకు ఎన్నో రెట్లు ఉంటుందని భావించి షాపులు మూసివేేస్తున్నారు. విద్యాసంస్థలు విశేషించి ప్రైవేటు విద్యాసంస్థలు ఈ నష్టాలకు దడిసే మూసివేస్తున్నాయి.

గడచిన రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు అత్యంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో పార్టీలు కొత్త పద్ధతులను కనిపెట్టాయి. వాటిలో ఒకటి, రహదారుల దిగ్బంధనం. రోడ్లమీదికి వందల మంది చేరి క్రికెట్‌, కబాడి ఆటలు ఆడడం, లేదా వంటలు చేయడం, అక్కడే పంక్తి భోజనాలు చేయడం జరుగుతోంది. ఒక చోట రోడ్డును ఇలా ఆక్రమిస్తే, ఆ వెనుక, ముందు కొన్ని కిలోమీటర్ల దూరం వాహనాలు నిలబడి పోతాయి. ప్రయాణికులు విపరీతమైన వ్యథలకు గురవుతారు. ట్రాఫిక్‌ క్రమబద్ధం కావడానికి ఒకటి రెండు రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇలా రోడ్లు నిర్బంధించడం వల్ల హాస్పటళ్ళకు వెళ్ళలేక వైద్యచికిత్స సకాలంలో అందక పలువురు మృతిచెందిన వార్తలు వచ్చాయి. రోడ్డు మీదే వాహనంలో, అంబులెన్సులో ప్రసవం జరిగిన ఘట్టాలున్నాయి. అలాగే విద్యార్థులు పలువురు పరీక్షలకు హాజరు కాలేక విద్యాసంవత్సరాన్ని పోగొట్టుకున్నవారున్నారు. ఆందోళనల పేరుతో రోడ్ల మీద కార్యకర్తలు క్రికెట్‌, బతకమ్మలు ఆడడం, లేదా వంటలు చేసుకొని పంక్తి భోజనాలుచేయడం చూస్తే- అక్కడ ట్రాఫిక్‌లో వాహనాల్లో చిక్కిన వారి మనఃస్థితి ఎలా ఉంటుందో ఒక్క సారైనా ఈ కార్యకర్తలు, నేతలు ఆలోచించరు. చోటు గాని చోట ఒక రైలు మూడు నాలుగు గంటలు ఆగిపోతే అందులోని పిల్లా పాపలు, స్ర్తీలు, వృద్ధులు ఎంత హింసకు గురవుతారో చెప్పవలసిన పని లేదు. పైగా బందు పిలుపునకు సహకరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం- పుండుమీద కారం చల్లినట్లు ఉంటుంది.

ఉద్యోగులు తమ ఉద్యోగ నిర్వహణలో తీవ్రమైన నష్టం జరిగినప్పుడు యాజమాన్యాలతో లేదా ప్రభుత్వోద్యోగులైతే ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినా పరిష్కారం కాకుంటే ఇక చివరి ఆయుధంగా సమ్మె కట్టడం పరిపాటి. కాని ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఉద్యోగులందరూ సమ్మెలోనికి దిగాలని పిలుపునివ్వడం తద్వారా జన జీవనాన్నిస్తంభింప చేయడం ప్రస్తుతం ఒక రాజకీయ వ్యూహంగా ముందుకు వచ్చింది. దీని వల్ల ప్రజాజీవితం ఎంతగా అతలా కుతలం అయిందో వారు పరిగణనలోనికి తీసుకున్నట్లు కనిపించదు.

రోజు కూలి మీద జీవనం సాగించే వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, తోపుడు బండ్లమీద, ఇతరత్రా వ్యాపారాలు చేసుకునేవారు, వలస కూలీలు పొట్టపోసుకోవడమే గగనమవుతుంది. గడచిన విద్యా సంవత్సరంలో జరిగిన ఇలాంటి ఉద్యమ కార్యక్రమాలవల్ల విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పాఠశాలలో విద్యాక్రమం దెబ్బతిన్నది. ఒక సెమిస్టర్‌ లో 90 నుండి 160 రోజుల వరకు జరగాల్సిన బోధన కుదేలై- 30 నుండి 40 రోజులకే పరిమితమైంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా విద్యార్థుల జోలికి పోకుండా ఉద్యమాలు నడిపే స్థితిలో ఉందా?

సకల జనుల సమ్మె నలభైరోజులకు పైగా జరిగితే, తద్వారా ప్రజాజీవితం ఎంత దెబ్బతిన్నదీ తెలుసుకునే స్థితిలో మన నాయకులున్నారా? ప్రజలు నిజంగా, స్వచ్ఛందంగా ఈ సమ్మెలను, ప్రజాజీవితాన్ని స్తంభింప జేయడాన్ని సమ్మతిస్తున్నారా అనేది పార్టీలు పట్టించుకోకపోవడం దురదృష్టం.నాలుగైదు సంవత్సరాల క్రితం కేరళ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు నిచ్చింది- బంద్‌లు నిర్వహిస్తే అందువల్ల జరిగే నష్టాన్ని- అందుకు బాధ్యులైన రాజకీయ పార్టీలే చెల్లించాలి అని. ప్రజలు ఈ తీర్పును పూర్తిగా స్వాగతించారు. సికిందరాబాదులో గంటకుపైగా రైల్‌ రోకో నిర్వహించినందుకు చట్టంప్రకారం కొందరు కార్యకర్తలకు ఆరు నెలలు శిక్ష విధించింది న్యాయస్థానం. కాని ఆ విషయంపై కోర్టులోనే నలుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇలా శిక్షించడం స్వాగతించదగిన పరిణామం. ప్రజలు వీటిని స్వాగతిస్తున్నా రాజకీయ పార్టీలు మాత్రం పట్టించుకునే స్థితిలో లేవు.

మన దేశంలో ఒక పార్టీకి చెందిన పెద్దనాయకుడు ఏకారణం వల్లనైనా మరణించినప్పుడు, లేదా దుశ్చర్యకు బలైనప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతూ ప్రజలకు విపరీతమైన నష్టాన్ని కలిగించడం మరో ధోరణి. ఆ సందర్భం తమకు హింసచేయడానికి లభించిన లైసెన్స్‌ గా భావిస్తున్నారు. ఈ సంస్కృతికి ఆరంభం 1984లోనే జరిగింది. ఇందిరా గాంధి హత్యకు గురైనప్పుడు ఢిల్లీలో సిక్కులపై జరిగిన ఉచకోత దుష్ఫలితాలను ప్రజలు ఇంకా అనుభవిస్తున్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.

ఈ క్రమంలో రాజీవ్‌ గాంధి హత్యానంతరం జరిగన మారణకాండను కూడా ప్రజలు మర్చిపోలేదు. హైదరాబాదులో ఆ పార్టీ యువనేత ఒకరు గూండాల గుంపుతో ప్రత్యర్థి పార్టీ ఆస్తుల మీద దాడి చేసి కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించాడు. రాష్ట్ర హై కోర్టు ఆ యజమానికి ఐదు కోట్ల రూపాయలు నష్ట పరిహారాన్ని ఇవ్వవలసిందిగా తీర్పు ఇచ్చింది. ఆ యువనాకుడిని కూడా శిక్షించింది. అదే యువనాయకుడు అసెంబ్లీమీద దాడి చేయడానికి జీపులో కొందరు యువకులను తీసుకొని వస్తే. అప్పటి స్పీకర్‌ శ్రీపాదరావు ఆ యువ నాయకుడికి నెల రోజులు జైలు శిక్ష విధించారు.

ఇక రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వాడు, దక్షిణ భారత దేశంలో మహానటుడు కన్నడ రాజకుమార్‌ చని పోయినప్పుడు బెంగళూరులో పెద్దఎత్తున హింసాకాండ చెలరేగింది. ఇది పరమ వికృత చేష్టగా ప్రజలు నిరసించారు. సకల జనుల సమ్మె వల్ల ఒక్క సింగరేణి గనుల్లోనే రోజుకు రూ. 23 కోట్ల నష్టం వాటిల్లుతూ ఉందని ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీని ప్రకారం ఎన్ని వందల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు, ఇతర వ్యవస్థలకు జరుగూతూ ఉందో గ్రహించాలి.
ఇలా చెప్పిన వారందరినీ తెలంగాణ వ్యతిరేకులని ముద్ర వేయడం సరికాదు. తెలంగాణ కోరుకునేవారిలో కూడా అత్యధిక శాతంమంది ప్రజాజీవితాన్ని అతలా కుతలంచేయడాన్ని అంగీక రించడం లేదు.

subbachariనాయకులు చేసే పని సరైనదైతే ప్రజా స్పందన ఎలా ఉంటుందో తెలిపేందుకు మొన్నీమధ్యనే జరిగిన అన్నా హజారే నిరహారదీక్షే సాక్ష్యం. ఈ సందర్భంగా బలవంతపు బందులు జరగలేదు. ర్యాలీలు తీయమని ఏ పార్టీ కోరలేదు. కాని ప్రజలు, ప్రజా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. అందువల్ల ఆందోళనల్లో అనాగరిక పద్ధతులకు స్వస్తి చెప్పి, నిజమైన ప్రజాస్వామ్య బద్ధ పద్ధతులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమస్యల సాధనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో రాజీనామాలు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి కల్పించడం పార్టీలు అనుసరించిదగిన ప్రజాస్వామిక ఆందోళనా మార్గాలలో ఒకటి. ఇలా మరికొన్ని మార్గాలను అనుసరించవచ్చు. కానీ ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తంచేసే పద్ధతులు అనుసరించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదు.
_________________________________________________________________________

దారితప్పిన రూపాయి
- సంపాదకీయం

రూపాయి విలువ వేగంగా క్షీణిస్తోంది. మన కరెన్సీ ఇలా వేగంగా కరిగిపోవడం సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందర్నీ కలవరపరుస్తోంది. డాలరుతో రూపాయి మారకపు విలువ మంగళవారంనాడు రికార్డు స్థాయిలో 52.72 రూపాయలకు పతనమైంది. యూరో జోన్ సార్వభౌమ రుణ సంక్షోభం తారాస్థాయికి చేరడం, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు మరింత బలహీనం కావడంతో డాలర్లకు బాగా డిమాండ్ పెరిగింది. దాంతో ప్రపంచ మార్కెట్‌లో డాలర్ల కొనుగోళ్ళకు పోటీ పెరిగి డాలరుతో రూపాయి మారకపు విలువ పడిపోయిందని ప్రభుత్వం చేతులెత్తేసింది.

నిత్యావసరాల ధరలు పెరగడమే కాకుండా కార్పొరేట్ల రుణ భార ం కూడా తడిసి మోపెడంత అవుతుంది. దాంతో కార్పొరేట్ కంపెనీలకు వందల కోట్లలో ఫారెక్స్ నష్టాలు వచ్చాయి. దీనికితోడు అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణాల కారణంగా ఆహారోత్పత్తుల నుంచి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఆభరణాల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పర్యవసానంగా సామాన్యుల జీవనప్రమాణాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ మూల్గులను పీల్చివేసే రూపాయి పతనం మరికొంత కాలం కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాలుగేళ్ళ క్రితం అమెరికాలో తలెత్తిన గృహ రుణాల సంక్షోభం తొలి ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా పరిణమించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయి, డాలరు విలువ బాగా క్షీణించింది. మాంద్యం ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నప్పటికీ చైనా, భారత దేశాలు అనూహ్యంగా ఎనిమిది శాతం పైగా వృద్ధి రేటును సాధించాయి. దాంతో పాశ్చాత్య కార్పొరేట్ సంస్థలు ఆసియా దేశాల వైపు మొగ్గాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్‌లోకి డాలర్లు ప్రవహి ంచాయి. గత ఏడాదిలోనే నికర ఎఫ్ఐఐ(విదేశీ సంస్థాగత మదుపులు)ల పరిమాణం 2,900 కోట్ల రూపాయలకు చేరింది. ఆ కాలమంతా డాలరుతో మారకంలో రూపాయి విలువ క్రమంగా వృద్ధి చెందింది.

డాలరు స్థానాన్ని ఆక్రమించేందుకు యూరో, యువాన్ కరెన్సీలు పోటీపడ్డాయి. భారత జీడీపీ రెండంకెల స్థాయికి చేరుకుంటుంటుదని కలలు కంటున్న సమయంలో మలి విడత ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. గ్రీసు, ఇటలీ తదితర యూరోపియన్ దేశాలు సార్వభౌమ రుణ సంక్షోభంలో చిక్కుకోవడంతో యూరో కరెన్సీ బలహీనపడింది. ఇప్పటిదాకా డాలరుకు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించిన యూరో ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో అంతర్జాతీయ మదుపుదారులు తిరిగి డాలరు వెంట పరుగులు తీశారు. వారు తమ పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకుంటున్నారు. మన దేశంలోని ఎఫ్ఐఐలు కూడా అదే బాట పట్టాయి.

గత వారం రోజుల్లోనే 45 కోట్ల డాలర్ల ఎఫ్ఐఐలు దేశం నుంచి తరలిపోయాయి. ఎఫ్ఐఐ పెట్టుబడులు పెద్దఎత్తున ఉపసంహరించడంతో డాలరుకు గిరాకీ పెరిగి మన రూపాయి పతనమవుతోందని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెబుతున్నారు. పర్యవసానంగా వివిధ రకాల క రెన్సీలతో పోల్చితే డాలర్ సూచి 0.5 శాతం పెరిగింది. డాలర్‌తో పోల్చితే ఒక్క రూపాయి మాత్రమే కాదు, ప్రపంచ దేశాల కరెన్సీలన్నీ పతనమవుతున్నాయి. ఈ ధోరణి అభివృద్ది చెందుతున్న ఆసియా దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అమితంగా మారకమయ్యే పది ఆసియా దేశాల కరెన్సీలలో కెల్లా రూపాయి విలువ అధికంగా క్షీణించింది. పౌండ్, యూరో, జపాన్ యెన్‌లతో కూడా రూపాయి విలువ క్షీణించింది.

పప్పులు, వంటనూనెలు వంటి అనేక రకాల ఆహారోత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే చుక్కల్లోకి చేరిన నిత్యావసరాల ధరలు రూపాయి పతనంతో మరింత పెరగనున్నాయి. ఔట్‌సోర్సింగ్ లభించే ఐటి వంటి కొన్ని రంగాలకు మేలు జరిగినా, దిగుమతులపై అధికంగా ఆధారపడిన మన దేశ ఆర్థిక వ్యవస్థకు రూపాయి క్షీణించడం వల్ల నష్టం అధికంగా ఉంటుంది. భారత్ ప్రధానంగా ముడి చమురు, బంగారం, రసాయనాలు, ప్లాస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఎరువులు మొదలైన వాటిన దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల్లో ఎక్కువగా 70 శాతం వాటా ముడిచమురుదే కావడం వల్ల దిగుమతుల ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. దీని ప్రతికూల ప్రభావం వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై అధికంగా ఉంటుంది. ఈ క్షీణత ప్రభావంతో ఆహారోత్పత్తుల నుంచి అనేక పారిశ్రామిక వస్తువుల రేట్లు పెరగడం వల్ల సామాన్యుల జేబుకి చిల్లు పడనుంది.

దేశం నుంచి విదేశీ మదుపులు ఎగిరిపోవడంతో రూపాయి విలువ పతనమయిందన్న ప్రభుత్వ వాదనలో పస లేదని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే విదేశీ మదుపులు వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదని వారి వాదన. రెండంకెల వృద్ధిరేటు మాట ఏమో కానీ ప్రభుత్వం ఈ ఏడాది అంచనా వేసిన 7.5 శాతం వృద్ధి రేటును సాధించడం కూడా అసాధ్యమయ్యేట్లు ఉంది. ఎందుకంటే, తాజా వివరాల ప్రకారం దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరుగుదల 1.9 శాతానికి పడిపోయింది. వ్యవసాయరంగం అభివృద్ధి ఆత్మహత్యలతో వర్ధిల్లుతోంది. ఈ రెండింటి మీద ఆధారపడిన సేవా రంగం అంతంత మాత్రంగానే ఉంది.

సేవల ఎగుమతుల ద్వారా వృద్ధి రేటును సాధించదలచుకుంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా విదేశీ మార్కెట్లు దివాలా స్థితిలో ఉన్నాయి. మరో వైపు సాధారణ ద్రవ్యోల్బణం (9.73 శాతం), ఆహార ద్ర వ్యోల్బణం (10.3 శాతం) అదుపులేకుండా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ద్రవ్యోల్బణం లెక్కలపై ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ అహ్లువాలియానే ఈ మధ్య అనుమానం వ్యక్తం చేశారు. ద్రవ్య చలామణిని నిరోధించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం విఫల ప్రయత్నం చేస్తోంది.

భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) అనేక దఫాలుగా వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం అదుపు కాలేదు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండకపోవడం వల్ల ఎఫ్ఐఐలు తిరుగు ముఖం పట్టాయి. ఫలితంగా రూపాయి విలువ ఇంత గా దిగజారుతున్నది. దేశీయ రుణాలు మరింత ప్రియం అవడంతో కార్పొరేట్ సంస్థలు సాపేక్షంగా తక్కువ వడ్డీ రేటుతో ఉన్న విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం ప్రారంభించాయి. రూపాయి విలువ భారీగా పతనమవడంతో ఆ రుణాలు మోయలేని భారంగా పరిణమించాయి.

దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని పునరుద్ధరించడం ద్వారా రూపాయి విలువను, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దగలమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం పెన్షన్లను, రిటైల్ వంటి రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా అనుమతించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. విదేశీ మదుపులు ఆ రంగాలలోకి ప్రవహించడం నిజమే. అయితే అవి అంతే వేగంగా ఏళ్ళ తరబడి పోగైన ఉద్యోగులు, కార్మికుల పొదుపు సొమ్మును తరలించుకుపోవడం తప్ప పరిస్థితి చక్కబడదు.

నేడు మనం చూస్తున్న ద్రవ్యోల్బణం డిమాండ్ వైపునుంచి కాక సరఫరా వైపునుంచి ఏర్పడుతున్నది. ద్రవ్య నియంత్రణ చర్యల ద్వారా కాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరచి నిత్యావసరాలను సరసమైన ధరలకు ప్రభుత్వమే ప్రజలకు అందించాలి. పనికి ఆహార పథకం, ఆహార సబ్సిడీలు ప్రజల జీవన ప్రమాణాలను, ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో కాక, శుద్ధ ఎన్నికల తాయిలాలుగా అమలు అయితే ఆర్థిక వ్యవస్థకు అవి పెనుభారంగా మారనున్నాయి. అలాంటి పథకాలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేస్తాయి.

దేశీయ మార్కెట్ పునాదిగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌లను సమన్వయం చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం సాధ్యమవుతుంది. దాంతో ప్రజల కొనుగోలు శక్తి విస్తారంగా పెరిగి దేశీయ మార్కెట్ బలోపేతమవుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ మార్కెట్ ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి వస్తుంది. మన రూపాయి విలువ దిగజారకుండా ఉంటుంది. 
_________________________________________________________________________