Thursday, November 24, 2011

ఉద్యమం అంటే ప్రజల్ని హింసించడమా?


- నూటికి 99 బంద్‌లు స్వచ్ఛందం కావు
- బలవంతపు బంద్‌లతో జనజీవనం అతలాకుతలం
- ప్రజల్ని ఇబ్బంది పెట్టని పోరాట రూపాలు ఎన్నో!
- ప్రజాస్వామ్యపోరాటానికి ‘అన్నా’ ఆందోళనే ఉదాహరణ


telang-road-mealsఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందని ఒక సామెత ఉంది. భారత దేశంలో ఏ ఉద్యమాలు జరిగినా మొదిట బలైపోయేది- వాటితో ఏ ప్రత్యక్ష సంబంధంలేని సామాన్య మానవుడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మలిదశలో తీవ్ర స్థాయికి చేరింది. ఇక్కడి చర్చనీయాంశం మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసే పోరాటం గురించి కాదు. ఈ దేశంలోని సామాన్య మానవుడి గురించి! ఏ రాజకీయ పార్టీ ఎందుకు ఉద్యమం ప్రారంభించినా అందులో ముందుగా బలైపోయేది అటు విద్యార్ధులు, ఇటు జనసామాన్యం. ఏ పార్టీ అయినా తన అజెండాని అమలు చేసేటప్పుడు బందుకు పిలుపునిస్తున్నాం అంటుంది. అంటే పిలుపు ఇస్తే, ప్రజలు స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలన్నీ మానుకొని బందు పాటించాలన్నమాట.

వ్యాపారులు దుకాణాలు తెరవకూడదు. బస్సులు తిరగకూడదు. బడులు మూసివేయాలి. కాని, ఇలా పిలుపు ఇచ్చి ఊరుకుంటే బంద్‌ అనేది జరగనే జరగదు. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు చేసిన బందులలో ప్రజలు తమకై తాము బందును నిర్వహించిన ఘట్టాలు నూటికి 99 సార్లు లేవు. బందుకు పిలుపు ఇచ్చిన పార్టీలు గూండాగిరికి, బెదిరింపులకు పాల్పడకుండా బందును నిర్వహించిన ఘట్టాలు కలికానికి కూడా లేవు. బలవంతపు బందులు ప్రజాజీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తున్నాయో పార్టీలు ఏ మాత్రం పట్టించుకోవు.

గడచిన రెండు దశాబ్దాలలో ఈ సంస్కృతి పెరిగిపోయింది. దౌర్జన్యంతో షాపుల మీద దాడి చేయడం, బందు చేయని వారి షాపులు పగల కొట్టడం. సామాన్లు లూటీ చేయడం, అడ్డువస్తే దాడికి దిగడం- దేశవ్యాప్తంగా ఎన్నో సందర్భాలలో జరిగినట్లు వార్తలు తెలుపుతున్నాయి. దీనికి ఏ పార్టీకూడా మినహాయింపు కాదు. అసలు పార్టీలలో ఇలా చేయగలిగే గుంపులు ప్రత్యేకంగా ఉండడాన్ని గమనించాలి. చాలా పార్టీలలో ఇలాంటి క్యాడర్‌ ను పోషించడం తప్పని సరి అంశంగా ఉంటుంది. ఈ దౌర్జన్యాలకు భయపడే షాపుల యజమానులు- ఒక రోజు వ్యాపారం జరగకపోవడం ద్వారా వచ్చే నష్టం కన్నా- గూండాలు దాడి చేస్తే జరిగే నష్టం అందుకు ఎన్నో రెట్లు ఉంటుందని భావించి షాపులు మూసివేేస్తున్నారు. విద్యాసంస్థలు విశేషించి ప్రైవేటు విద్యాసంస్థలు ఈ నష్టాలకు దడిసే మూసివేస్తున్నాయి.

గడచిన రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు అత్యంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో పార్టీలు కొత్త పద్ధతులను కనిపెట్టాయి. వాటిలో ఒకటి, రహదారుల దిగ్బంధనం. రోడ్లమీదికి వందల మంది చేరి క్రికెట్‌, కబాడి ఆటలు ఆడడం, లేదా వంటలు చేయడం, అక్కడే పంక్తి భోజనాలు చేయడం జరుగుతోంది. ఒక చోట రోడ్డును ఇలా ఆక్రమిస్తే, ఆ వెనుక, ముందు కొన్ని కిలోమీటర్ల దూరం వాహనాలు నిలబడి పోతాయి. ప్రయాణికులు విపరీతమైన వ్యథలకు గురవుతారు. ట్రాఫిక్‌ క్రమబద్ధం కావడానికి ఒకటి రెండు రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇలా రోడ్లు నిర్బంధించడం వల్ల హాస్పటళ్ళకు వెళ్ళలేక వైద్యచికిత్స సకాలంలో అందక పలువురు మృతిచెందిన వార్తలు వచ్చాయి. రోడ్డు మీదే వాహనంలో, అంబులెన్సులో ప్రసవం జరిగిన ఘట్టాలున్నాయి. అలాగే విద్యార్థులు పలువురు పరీక్షలకు హాజరు కాలేక విద్యాసంవత్సరాన్ని పోగొట్టుకున్నవారున్నారు. ఆందోళనల పేరుతో రోడ్ల మీద కార్యకర్తలు క్రికెట్‌, బతకమ్మలు ఆడడం, లేదా వంటలు చేసుకొని పంక్తి భోజనాలుచేయడం చూస్తే- అక్కడ ట్రాఫిక్‌లో వాహనాల్లో చిక్కిన వారి మనఃస్థితి ఎలా ఉంటుందో ఒక్క సారైనా ఈ కార్యకర్తలు, నేతలు ఆలోచించరు. చోటు గాని చోట ఒక రైలు మూడు నాలుగు గంటలు ఆగిపోతే అందులోని పిల్లా పాపలు, స్ర్తీలు, వృద్ధులు ఎంత హింసకు గురవుతారో చెప్పవలసిన పని లేదు. పైగా బందు పిలుపునకు సహకరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం- పుండుమీద కారం చల్లినట్లు ఉంటుంది.

ఉద్యోగులు తమ ఉద్యోగ నిర్వహణలో తీవ్రమైన నష్టం జరిగినప్పుడు యాజమాన్యాలతో లేదా ప్రభుత్వోద్యోగులైతే ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినా పరిష్కారం కాకుంటే ఇక చివరి ఆయుధంగా సమ్మె కట్టడం పరిపాటి. కాని ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఉద్యోగులందరూ సమ్మెలోనికి దిగాలని పిలుపునివ్వడం తద్వారా జన జీవనాన్నిస్తంభింప చేయడం ప్రస్తుతం ఒక రాజకీయ వ్యూహంగా ముందుకు వచ్చింది. దీని వల్ల ప్రజాజీవితం ఎంతగా అతలా కుతలం అయిందో వారు పరిగణనలోనికి తీసుకున్నట్లు కనిపించదు.

రోజు కూలి మీద జీవనం సాగించే వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, తోపుడు బండ్లమీద, ఇతరత్రా వ్యాపారాలు చేసుకునేవారు, వలస కూలీలు పొట్టపోసుకోవడమే గగనమవుతుంది. గడచిన విద్యా సంవత్సరంలో జరిగిన ఇలాంటి ఉద్యమ కార్యక్రమాలవల్ల విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పాఠశాలలో విద్యాక్రమం దెబ్బతిన్నది. ఒక సెమిస్టర్‌ లో 90 నుండి 160 రోజుల వరకు జరగాల్సిన బోధన కుదేలై- 30 నుండి 40 రోజులకే పరిమితమైంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా విద్యార్థుల జోలికి పోకుండా ఉద్యమాలు నడిపే స్థితిలో ఉందా?

సకల జనుల సమ్మె నలభైరోజులకు పైగా జరిగితే, తద్వారా ప్రజాజీవితం ఎంత దెబ్బతిన్నదీ తెలుసుకునే స్థితిలో మన నాయకులున్నారా? ప్రజలు నిజంగా, స్వచ్ఛందంగా ఈ సమ్మెలను, ప్రజాజీవితాన్ని స్తంభింప జేయడాన్ని సమ్మతిస్తున్నారా అనేది పార్టీలు పట్టించుకోకపోవడం దురదృష్టం.నాలుగైదు సంవత్సరాల క్రితం కేరళ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు నిచ్చింది- బంద్‌లు నిర్వహిస్తే అందువల్ల జరిగే నష్టాన్ని- అందుకు బాధ్యులైన రాజకీయ పార్టీలే చెల్లించాలి అని. ప్రజలు ఈ తీర్పును పూర్తిగా స్వాగతించారు. సికిందరాబాదులో గంటకుపైగా రైల్‌ రోకో నిర్వహించినందుకు చట్టంప్రకారం కొందరు కార్యకర్తలకు ఆరు నెలలు శిక్ష విధించింది న్యాయస్థానం. కాని ఆ విషయంపై కోర్టులోనే నలుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇలా శిక్షించడం స్వాగతించదగిన పరిణామం. ప్రజలు వీటిని స్వాగతిస్తున్నా రాజకీయ పార్టీలు మాత్రం పట్టించుకునే స్థితిలో లేవు.

మన దేశంలో ఒక పార్టీకి చెందిన పెద్దనాయకుడు ఏకారణం వల్లనైనా మరణించినప్పుడు, లేదా దుశ్చర్యకు బలైనప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతూ ప్రజలకు విపరీతమైన నష్టాన్ని కలిగించడం మరో ధోరణి. ఆ సందర్భం తమకు హింసచేయడానికి లభించిన లైసెన్స్‌ గా భావిస్తున్నారు. ఈ సంస్కృతికి ఆరంభం 1984లోనే జరిగింది. ఇందిరా గాంధి హత్యకు గురైనప్పుడు ఢిల్లీలో సిక్కులపై జరిగిన ఉచకోత దుష్ఫలితాలను ప్రజలు ఇంకా అనుభవిస్తున్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.

ఈ క్రమంలో రాజీవ్‌ గాంధి హత్యానంతరం జరిగన మారణకాండను కూడా ప్రజలు మర్చిపోలేదు. హైదరాబాదులో ఆ పార్టీ యువనేత ఒకరు గూండాల గుంపుతో ప్రత్యర్థి పార్టీ ఆస్తుల మీద దాడి చేసి కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించాడు. రాష్ట్ర హై కోర్టు ఆ యజమానికి ఐదు కోట్ల రూపాయలు నష్ట పరిహారాన్ని ఇవ్వవలసిందిగా తీర్పు ఇచ్చింది. ఆ యువనాకుడిని కూడా శిక్షించింది. అదే యువనాయకుడు అసెంబ్లీమీద దాడి చేయడానికి జీపులో కొందరు యువకులను తీసుకొని వస్తే. అప్పటి స్పీకర్‌ శ్రీపాదరావు ఆ యువ నాయకుడికి నెల రోజులు జైలు శిక్ష విధించారు.

ఇక రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వాడు, దక్షిణ భారత దేశంలో మహానటుడు కన్నడ రాజకుమార్‌ చని పోయినప్పుడు బెంగళూరులో పెద్దఎత్తున హింసాకాండ చెలరేగింది. ఇది పరమ వికృత చేష్టగా ప్రజలు నిరసించారు. సకల జనుల సమ్మె వల్ల ఒక్క సింగరేణి గనుల్లోనే రోజుకు రూ. 23 కోట్ల నష్టం వాటిల్లుతూ ఉందని ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీని ప్రకారం ఎన్ని వందల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు, ఇతర వ్యవస్థలకు జరుగూతూ ఉందో గ్రహించాలి.
ఇలా చెప్పిన వారందరినీ తెలంగాణ వ్యతిరేకులని ముద్ర వేయడం సరికాదు. తెలంగాణ కోరుకునేవారిలో కూడా అత్యధిక శాతంమంది ప్రజాజీవితాన్ని అతలా కుతలంచేయడాన్ని అంగీక రించడం లేదు.

subbachariనాయకులు చేసే పని సరైనదైతే ప్రజా స్పందన ఎలా ఉంటుందో తెలిపేందుకు మొన్నీమధ్యనే జరిగిన అన్నా హజారే నిరహారదీక్షే సాక్ష్యం. ఈ సందర్భంగా బలవంతపు బందులు జరగలేదు. ర్యాలీలు తీయమని ఏ పార్టీ కోరలేదు. కాని ప్రజలు, ప్రజా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. అందువల్ల ఆందోళనల్లో అనాగరిక పద్ధతులకు స్వస్తి చెప్పి, నిజమైన ప్రజాస్వామ్య బద్ధ పద్ధతులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమస్యల సాధనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో రాజీనామాలు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి కల్పించడం పార్టీలు అనుసరించిదగిన ప్రజాస్వామిక ఆందోళనా మార్గాలలో ఒకటి. ఇలా మరికొన్ని మార్గాలను అనుసరించవచ్చు. కానీ ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తంచేసే పద్ధతులు అనుసరించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదు.
_________________________________________________________________________

దారితప్పిన రూపాయి
- సంపాదకీయం

రూపాయి విలువ వేగంగా క్షీణిస్తోంది. మన కరెన్సీ ఇలా వేగంగా కరిగిపోవడం సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందర్నీ కలవరపరుస్తోంది. డాలరుతో రూపాయి మారకపు విలువ మంగళవారంనాడు రికార్డు స్థాయిలో 52.72 రూపాయలకు పతనమైంది. యూరో జోన్ సార్వభౌమ రుణ సంక్షోభం తారాస్థాయికి చేరడం, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు మరింత బలహీనం కావడంతో డాలర్లకు బాగా డిమాండ్ పెరిగింది. దాంతో ప్రపంచ మార్కెట్‌లో డాలర్ల కొనుగోళ్ళకు పోటీ పెరిగి డాలరుతో రూపాయి మారకపు విలువ పడిపోయిందని ప్రభుత్వం చేతులెత్తేసింది.

నిత్యావసరాల ధరలు పెరగడమే కాకుండా కార్పొరేట్ల రుణ భార ం కూడా తడిసి మోపెడంత అవుతుంది. దాంతో కార్పొరేట్ కంపెనీలకు వందల కోట్లలో ఫారెక్స్ నష్టాలు వచ్చాయి. దీనికితోడు అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణాల కారణంగా ఆహారోత్పత్తుల నుంచి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఆభరణాల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పర్యవసానంగా సామాన్యుల జీవనప్రమాణాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ మూల్గులను పీల్చివేసే రూపాయి పతనం మరికొంత కాలం కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాలుగేళ్ళ క్రితం అమెరికాలో తలెత్తిన గృహ రుణాల సంక్షోభం తొలి ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా పరిణమించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయి, డాలరు విలువ బాగా క్షీణించింది. మాంద్యం ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నప్పటికీ చైనా, భారత దేశాలు అనూహ్యంగా ఎనిమిది శాతం పైగా వృద్ధి రేటును సాధించాయి. దాంతో పాశ్చాత్య కార్పొరేట్ సంస్థలు ఆసియా దేశాల వైపు మొగ్గాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్‌లోకి డాలర్లు ప్రవహి ంచాయి. గత ఏడాదిలోనే నికర ఎఫ్ఐఐ(విదేశీ సంస్థాగత మదుపులు)ల పరిమాణం 2,900 కోట్ల రూపాయలకు చేరింది. ఆ కాలమంతా డాలరుతో మారకంలో రూపాయి విలువ క్రమంగా వృద్ధి చెందింది.

డాలరు స్థానాన్ని ఆక్రమించేందుకు యూరో, యువాన్ కరెన్సీలు పోటీపడ్డాయి. భారత జీడీపీ రెండంకెల స్థాయికి చేరుకుంటుంటుదని కలలు కంటున్న సమయంలో మలి విడత ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. గ్రీసు, ఇటలీ తదితర యూరోపియన్ దేశాలు సార్వభౌమ రుణ సంక్షోభంలో చిక్కుకోవడంతో యూరో కరెన్సీ బలహీనపడింది. ఇప్పటిదాకా డాలరుకు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించిన యూరో ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో అంతర్జాతీయ మదుపుదారులు తిరిగి డాలరు వెంట పరుగులు తీశారు. వారు తమ పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకుంటున్నారు. మన దేశంలోని ఎఫ్ఐఐలు కూడా అదే బాట పట్టాయి.

గత వారం రోజుల్లోనే 45 కోట్ల డాలర్ల ఎఫ్ఐఐలు దేశం నుంచి తరలిపోయాయి. ఎఫ్ఐఐ పెట్టుబడులు పెద్దఎత్తున ఉపసంహరించడంతో డాలరుకు గిరాకీ పెరిగి మన రూపాయి పతనమవుతోందని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెబుతున్నారు. పర్యవసానంగా వివిధ రకాల క రెన్సీలతో పోల్చితే డాలర్ సూచి 0.5 శాతం పెరిగింది. డాలర్‌తో పోల్చితే ఒక్క రూపాయి మాత్రమే కాదు, ప్రపంచ దేశాల కరెన్సీలన్నీ పతనమవుతున్నాయి. ఈ ధోరణి అభివృద్ది చెందుతున్న ఆసియా దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అమితంగా మారకమయ్యే పది ఆసియా దేశాల కరెన్సీలలో కెల్లా రూపాయి విలువ అధికంగా క్షీణించింది. పౌండ్, యూరో, జపాన్ యెన్‌లతో కూడా రూపాయి విలువ క్షీణించింది.

పప్పులు, వంటనూనెలు వంటి అనేక రకాల ఆహారోత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే చుక్కల్లోకి చేరిన నిత్యావసరాల ధరలు రూపాయి పతనంతో మరింత పెరగనున్నాయి. ఔట్‌సోర్సింగ్ లభించే ఐటి వంటి కొన్ని రంగాలకు మేలు జరిగినా, దిగుమతులపై అధికంగా ఆధారపడిన మన దేశ ఆర్థిక వ్యవస్థకు రూపాయి క్షీణించడం వల్ల నష్టం అధికంగా ఉంటుంది. భారత్ ప్రధానంగా ముడి చమురు, బంగారం, రసాయనాలు, ప్లాస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఎరువులు మొదలైన వాటిన దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల్లో ఎక్కువగా 70 శాతం వాటా ముడిచమురుదే కావడం వల్ల దిగుమతుల ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. దీని ప్రతికూల ప్రభావం వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై అధికంగా ఉంటుంది. ఈ క్షీణత ప్రభావంతో ఆహారోత్పత్తుల నుంచి అనేక పారిశ్రామిక వస్తువుల రేట్లు పెరగడం వల్ల సామాన్యుల జేబుకి చిల్లు పడనుంది.

దేశం నుంచి విదేశీ మదుపులు ఎగిరిపోవడంతో రూపాయి విలువ పతనమయిందన్న ప్రభుత్వ వాదనలో పస లేదని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే విదేశీ మదుపులు వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదని వారి వాదన. రెండంకెల వృద్ధిరేటు మాట ఏమో కానీ ప్రభుత్వం ఈ ఏడాది అంచనా వేసిన 7.5 శాతం వృద్ధి రేటును సాధించడం కూడా అసాధ్యమయ్యేట్లు ఉంది. ఎందుకంటే, తాజా వివరాల ప్రకారం దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరుగుదల 1.9 శాతానికి పడిపోయింది. వ్యవసాయరంగం అభివృద్ధి ఆత్మహత్యలతో వర్ధిల్లుతోంది. ఈ రెండింటి మీద ఆధారపడిన సేవా రంగం అంతంత మాత్రంగానే ఉంది.

సేవల ఎగుమతుల ద్వారా వృద్ధి రేటును సాధించదలచుకుంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా విదేశీ మార్కెట్లు దివాలా స్థితిలో ఉన్నాయి. మరో వైపు సాధారణ ద్రవ్యోల్బణం (9.73 శాతం), ఆహార ద్ర వ్యోల్బణం (10.3 శాతం) అదుపులేకుండా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ద్రవ్యోల్బణం లెక్కలపై ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ అహ్లువాలియానే ఈ మధ్య అనుమానం వ్యక్తం చేశారు. ద్రవ్య చలామణిని నిరోధించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం విఫల ప్రయత్నం చేస్తోంది.

భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) అనేక దఫాలుగా వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం అదుపు కాలేదు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండకపోవడం వల్ల ఎఫ్ఐఐలు తిరుగు ముఖం పట్టాయి. ఫలితంగా రూపాయి విలువ ఇంత గా దిగజారుతున్నది. దేశీయ రుణాలు మరింత ప్రియం అవడంతో కార్పొరేట్ సంస్థలు సాపేక్షంగా తక్కువ వడ్డీ రేటుతో ఉన్న విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం ప్రారంభించాయి. రూపాయి విలువ భారీగా పతనమవడంతో ఆ రుణాలు మోయలేని భారంగా పరిణమించాయి.

దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని పునరుద్ధరించడం ద్వారా రూపాయి విలువను, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దగలమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం పెన్షన్లను, రిటైల్ వంటి రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా అనుమతించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. విదేశీ మదుపులు ఆ రంగాలలోకి ప్రవహించడం నిజమే. అయితే అవి అంతే వేగంగా ఏళ్ళ తరబడి పోగైన ఉద్యోగులు, కార్మికుల పొదుపు సొమ్మును తరలించుకుపోవడం తప్ప పరిస్థితి చక్కబడదు.

నేడు మనం చూస్తున్న ద్రవ్యోల్బణం డిమాండ్ వైపునుంచి కాక సరఫరా వైపునుంచి ఏర్పడుతున్నది. ద్రవ్య నియంత్రణ చర్యల ద్వారా కాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరచి నిత్యావసరాలను సరసమైన ధరలకు ప్రభుత్వమే ప్రజలకు అందించాలి. పనికి ఆహార పథకం, ఆహార సబ్సిడీలు ప్రజల జీవన ప్రమాణాలను, ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో కాక, శుద్ధ ఎన్నికల తాయిలాలుగా అమలు అయితే ఆర్థిక వ్యవస్థకు అవి పెనుభారంగా మారనున్నాయి. అలాంటి పథకాలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేస్తాయి.

దేశీయ మార్కెట్ పునాదిగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌లను సమన్వయం చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం సాధ్యమవుతుంది. దాంతో ప్రజల కొనుగోలు శక్తి విస్తారంగా పెరిగి దేశీయ మార్కెట్ బలోపేతమవుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ మార్కెట్ ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి వస్తుంది. మన రూపాయి విలువ దిగజారకుండా ఉంటుంది. 
_________________________________________________________________________

No comments:

Post a Comment