Sunday, November 13, 2011

సరిహద్దులలో పొంచి ఉన్న ప్రమాదం - నిరంతర జాగరూకతే ప్రజల కర్తవ్యం


ఆర్. ఎస్. ఎస్.అఖిల భారత కార్యకారీ మండలి తీర్మానం
గోరఖ్ పూర్ - 2011

వేదికపై పూజ్య సర్ సంఘచాలక్ మా. శ్రీ మోహన్జీ భాగవత్, సర్ కార్యవాహ మా.శ్రీ భయ్యాజీ జోషి.

జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్న పరిణామాల పట్ల రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నది. కలియుగాబ్ది 5113 ఆశ్వయుజ బహుళ విదియ నుండి మూడు రోజుల పాటు అనగా క్రీస్తు శకం 2011 అక్టోబర్ 14 నుండి 16 వరకు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగిన సంఘ 'అఖిల భారత కార్యకారీ మండల్' సమావేశాలలో దేశ భద్రతను పరిరక్షించి పెంపొందించడానికై సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని  కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానం క్రింది విధంగా ఉన్నది. 


దేశ సరిహద్దుల వెంబడి నెలకొని ఉన్న ఉద్రిక్తతలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని 'అఖిల భారత కార్యకారీ మండల్' నిరసిస్తోంది. విచ్ఛిన్న వాదులకు, బీభత్స కారులకు సరిహద్దులకు ఆవల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం గురించి కాని, మన గగన తలానికి, సముద్ర సీమలకు ఎదురౌతున్న ప్రమాదాల గురించి కాని, అంతరిక్షంలోను, అంతర్జాతీయ జలాలలోను మన దేశానికి విరుద్ధంగా విస్తరిస్తున్న వైపరీత్యాలను గురించి కాని మన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మన ప్రాదేశిక సమగ్రతకు విఘాతకరంగా పరిణమిస్తున్న ప్రమాదాల గురించి మన ధ్యాస పెరగాలి. 

కవ్విస్తున్న చైనా 
 
చైనా సైనిక దళాలు నిరంతరం మన సరిహద్దులను ఉల్లంఘించి చొరబాట్లు కొనసాగిస్తునారు. సరిహద్దు ప్రాంతాలలోని మన సైనిక స్థావరాలను జనావాసాలను ధ్వంసం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్నారు. మన ఇరుగు పొరుగు దేశాలలో చైనా ప్రభుత్వం సైనిక స్థావరాలను ఏర్పరచుకొంటోంది. ఆ దేశాలతో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకొంటోంది. ఈ చర్యల ద్వారా మన దేశాన్ని నలువైపుల నుంచి సైనిక దిగ్బంధం చేయాలన్నది చైనా ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం! ఈ పరిణామాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. చైనా ప్రభుత్వం పాకిస్తాన్ కు ఆయుధాలను, ఇతర యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తోంది. పాకిస్తాన్ లోని భారత వ్యతిరేక బీభత్సకారులను (టెర్రరిస్టులను) ప్రోత్సహిస్తోంది.  పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న కాశ్మీర్లో చైనా సైనికులు తిష్ఠ వేసి ఉన్నారు. మావోయిస్టులు మాధ్యమంగా నేపాల్ లోని ప్రభుత్వ యంత్రాంగాన్ని తన అదుపులో ఉంచుకొనడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్, బర్మా (మయన్మార్), శ్రీలంక వంటి మన పొరుగు దేశాలకు చైనా సైనిక నిపుణులు విరివిగా రాకపోకలు సాగిస్తున్నారు. మన దేశాన్ని వ్యూహాత్మకంగా దిగ్బంధించాలన్న చైనా ప్రభుత్వ విధానంలో ఇవన్నీ భాగం.  

సరిహద్దులకు ఆవల నుంచి బీభత్స కారులను, విచ్ఛిన్న వాదులను మన దేశానికి వ్యతిరేకంగా ఉసికొల్పడం మాత్రమే కాదు, మన ఈశాన్య ప్రాంతంలోని దేశ విద్రోహక ముఠాలకు చైనా ప్రభుత్వం బాహాటంగా సహాయం చేస్తున్నది. ఇది మన జాతి సమైక్యతకు, ప్రాదేశిక సమగ్రతకు ప్రమాద కరంగా పరిణమించింది. చైనాకు చెందిన 'సైబర్' సాంకేతిక పరిజ్ఞాన వేత్తలు రహస్యంగా మన 'సమాచార వినిమయ వ్యవస్థ' (ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ సిస్టం) లోనికి చొరబడిపోతున్నారు. అతి తక్కువ వ్యయంతో అమలు జరుపడానికి సిద్ధపడడం ద్వారా చైనా సంస్థలు రక్షణపరంగా కీలకమైన ప్రాంతాలలోని మన పథకాలను హస్తగతం చేసుకొంటున్నారు. తద్వారా చైనా ప్రభుత్వం తన గూఢచర్య  వ్యవస్థను మన దేశంలో విస్తరించు కొంటోంది. ఇలాంటి పరిణామాలు మన దేశ భద్రతా వ్యవస్థను భగ్నపరుస్తున్నాయని 'అఖిల భారత కార్యకారీ మండల్' భావిస్తున్నది.    

క్రీస్తుశకం 1962 వ సంవత్సరంలో చైనా ప్రభుత్వం దురాక్రమించిన 38 వేల చదరపు కిలోమీటర్ల మన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ అదే సంవత్సరం నవంబరు 14 వ తేదీన మన పార్లమెంటు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మరచిపోయింది. మన దేశానికి చెందిన మరో 90 వేల చదరపు కిలోమీటర్ల భూమి తమదని చైనా ప్రభుత్వం చేస్తున్న వాదానికి మన ప్రభుత్వం ధీటైన సమాధానం చెప్పడం లేదు. మనపై మళ్ళీ దాడి చేయడానికి చైనా ప్రభుత్వం సర్వ సమగ్ర సైనిక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతిఘటించడానికి వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకొనడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్న జాడ లేదు.    

మన సరిహద్దుల పొడవునా చైనా ప్రభుత్వం 'సుదూర ఖండాంతర లక్ష్యచ్చేదక  అణ్వస్త్ర వాహక క్షిపణుల' (ఇంటర్ కాంటినెంల్ బాలిస్టిక్ మిస్సైల్స్ - ఐసిబిఎమ్) ను మోహరించింది. ఈ అణు క్షిపణులు మన భద్రతకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి. ఉపగ్రహాలను, యుద్ధనౌకలను విధ్వంసం చేయగల క్షిపణులను కూడా చైనా రూపొందించింది. 8500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేదించగల అణ్వస్త్రాలను మోసుకొని పోగల 'జలాంతర్గాములు' అనేకం చైనా వద్ద ఉన్నాయి. 

ఈ ప్రమాదాలను ప్రతిఘటించడానికి  వలసిన రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మనకు అనివార్యం. 

మన వాణిజ్య ప్రాంగణాలలో చైనా వారి వస్తువులు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా స్వదేశీయ పరిశ్రమలు చతికిల పడి ఉన్నాయి. మన దేశం నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న వస్తువుల విలువకంటే చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న సరుకుల విలువ చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా మనం వాణిజ్య పరమైన లోటు (ట్రేడ్ డెఫిసిట్) నకు గురి అవుతున్నాము. ఈ లోటు పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. సమాచార సంచార - టెలి కమ్యూనికేషన్ల రంగంలో మొదటితరం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే మనం పెంపొందించుకో గలిగాము. రెండో తరం 'తరంగాల' స్పెక్ట్రం పరిజ్ఞానం సమగ్రంగా రూపొందనే లేదు. ఫలితంగా మూడవ తరం, నాలుగవ తరం టెలికం తరంగాల పరిజ్ఞానాన్ని చైనా నుండి దిగుమతి చేసుకొంటున్నాము. ఇలా అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని చైనా మనకు సరఫరా చేయడం వల్ల మన సమాచార దూర సంచార వ్యవస్థ గుట్టు మొత్తం ఆ దేశానికి తెలిసిపోతోంది. ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన పాటవం విషయంలో ఇలా చైనా దయాదాక్షిణ్యాలపై అతిగా ఆధారపడవలసిన దిస్థితి మన భద్రతకు ప్రమాదకరం. 

టిబెట్ నుంచి భ్రహ్మపుత్ర నదీ జలాలు మనదేశంలోనికి రాకుండా చైనా ప్రభుత్వం నిరోధించడానికి యత్నిస్తోంది. తమ దేశం నుంచి పొరుగు దేశాలలోకి ప్రవహిస్తున్న ఇతర నదులపై కూడా చైనా ప్రభుత్వం అక్రమంగా ఆనకట్టలను నిర్మించి నీటిని కాజేస్తోంది. ఇలా నదుల నీటిని మళ్ళించడం వల్ల నష్టపోతున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, లావోస్, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, బర్మా వంటి దేశాలతో కలిసి మన ప్రభుత్వం చైనా ప్రభుత్వాన్ని నిలదీయ గలగాలి. నదుల నీటిని న్యాయమైన రీతిలో పంచుకొనేందుకు చైనాను ఒప్పించగలగాలి. 

పాకిస్తాన్ కుట్ర 
 
పాకిస్తాన్ ప్రభుత్వ చర్యల వల్ల మన పడమటి సరిహద్దులకు ప్రమాదం పెరుగుతోంది. పాకిస్తాన్ వైపు నుంచి మన దేశంలోకి చొరబడుతున్న అక్రమ ప్రవేశకుల సంఖ్య గత కొన్ని నెలలుగా పెరుగుతోందని, ఉన్నత సైనిక అధికారుల సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా, ఇటీవల మన ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించారు. కాశ్మీర్ లోనే వాస్తవాధీన రేఖ వెంబడి, గత నాలుగున్నర నెలల కాలంలో డెబ్భై చొరబాటు సంఘటనలు జరిగినట్లు తెలిసింది. కొన్ని సందర్భాలలో పాకిస్తానీ ప్రభుత్వ దళాలు మన సైనికులపై కాల్పులు కూడా జరిపాయి. పాకిస్తాన్ సైనిక దళాలలో మత మౌడ్య వాద ప్రభావం పెరుగుతోంది. పాకిస్తాన్లోని అణ్వస్త్ర భాండాగారాలను  స్వాధీనం చేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది.
*******************************************************************************************
‘‘లక్ష్యం’’
cartoonప్రతి జీవితానికి ఒక ధ్యేయం, ఒక లక్ష్యం ఉండాలి. లేకపోతే ఆ జీవికి, ఆ జీవితా నికి అర్థం ఉండదు. ధ్యేయం లేకుండా ఎన్నా ళ్లు బ్రతికిన ఆ బ్రతుకు బ్రతుకు కాదు. ధ్యే యం, లక్ష్యంతో ముందుకు అడుగువేసినపుడే ఆ బ్రతుక్కు ఒక అర్థం ఒక పరమార్థం. ఇది నా జీవి లేనికి సంబంధించిన ఒక చిన్న కథ ఇది నాలాంటి వాళ్ల జీవితాలకు ఆదర్శం కూడా కావచ్చు. మార్గదర్శకత్వం కూడ కావచ్చు. అసలు చిన్నప్పట్నుంచి ఎలా చదవాలి చదివి ఏమ్‌ సాధించాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ, అనుకోవాల్సిన ఒక రోజు వచ్చింది అదెలాగంటే....

మాది ఒక పేద కుటుంబం... చిన్న కుటుంబం. నాన్నగారు ఆటో నడిపేవారు ఒక రోజు ఆదాయం బాగానే ఉండేది ఒక రోజు అసలు ఉండేది కాదు. నా పేరు ‘లక్ష్య’. ఆ పేరు నాన్నగారు నాకెందుకు పెట్టారో నాకు తెలీదు. అన్నయ్య పేరు ఆదర్శ్‌ కాని, అన్నయ్య లోకమే వేరు... ఎపుడు హడావుడిగా తిరిగే వాడు. చదువు అంతంత మాత్రమే. నాన్నగారు ఎపుడు ఒకేమాట చెప్పేవారు ‘‘బాగా చదువుకోండి. మీరు బాగుపడండి. వేరొకరికి చేయూతనివ్వండి’’. ఈ మాటలు నాకు చిన్నపుడు అర్థం కాలేదు. అర్థం అయ్యేరోజు ఒక రోజు వచ్చింది. అమ్మ చుట్టుపక్కల అందరికి పన్లో సహాయపడేది. వాళ్లిచ్చే తృణమో పణమో మా కోసమే ఖర్చుచేసేది. అమ్మా నాన్న ఏ పండుగకు కొత్త బట్టలు కట్టుకోగా నేను చూళ్లేదు. మాకు మాత్రం ఉన్నంతలో అన్ని విధాలా బాగా చేసేవారు. అందుకే నాకు, అన్నయ్యకు జీవిత విలువ తెలియలేదు.

పిల్లల అవసరాలు తీర్చడం, చదివించడం వాళ్ళ బాధ్యతే తప్ప అందులో వాళ్ళ కష్ట సుఖాలేమిటో మేము తెలుసుకోలేకపోయాం. అన్నయ్య సెవెన్త్‌ తప్పాడు. నేను అత్తెసరు మార్కులతో పాస్‌ అయ్యాను. ఆ రోజు మా యింట్లో పండుగ వాతావరణం నెలకోంది. నేను స్కూల్‌ ఫస్ట్‌ వచ్చినట్టు నాన్న సంతోష పడిపోయి నాకొక పెన్‌ ప్రెజెంట్‌ చేసినారు అమ్మ గారెలు, పాయసం వండింది. ఆ వంట చేయడానికి డబ్బుకోసం మా అమ్మ రాత్రి పగలు పని చేసిన కష్టం ఉంది. నాన్న ప్రెజెం ట్‌ చేసిన పెన్‌ విలువ తక్కువేకావచ్చు కానీ, నాన్న హృదయం ఎంత గొప్పదో నాకు అప్పుడు తెలీదు.

టెన్త్‌ క్లాస్‌లో అన్నయ్య అత్తెసరు మార్కుల తో పాస్‌ అయ్యాడు. అందుకు అన్నయ్యకు ఇంట్లో మంచి గ్రూప్‌లో సీట్‌ రాలేదు. మంచి గ్రూప్‌ తక్కువ గ్రూప్‌ అంటే ఏది ఉండదు. ఏ గ్రూప్‌కైన దాని విలువ ఉంటుంది. బాగ చదవగలిగితే. నాకు టెన్త్‌లో సెకండ్‌ క్లాస్‌ వచ్చింది. అమ్మా నాన్న సంతోషం ఏమని చెప్పను. అప్పటికీ నాకు ఏ లక్ష్యం లేదు. కేవలం కొద్దిగా బాగ చదివితే ఇంట్లో అందరు సంతోషిస్తారు ఫెయిలైతే ఇంట్లో అందరూ బాధపడుతారు. మన గురించి బెంగపడు తారు. మనకు నీతులు చెప్పాలని చూస్తారు. వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వకూడదు. అంటే అంతో ఇంతో చదువు మీద దృష్టిపెట్టాలి. అంత తప్పిస్తే దాని గురించి ఏం ప్రయోజనం ఉంటుందో అప్పటికీ నాకు తెలీదు.ఫ్యూచర్లో నేనేమవుతానో ఎవరికీ తెలీదు.

ఒక మంచి కాలేజీలో నాకు ఇంటర్‌ బై.పీ.సీ సీటు దొరికింది. డిసెక్షన్‌ బాక్స్‌ చేతికి వచ్చింది. కాక్రోచ్‌లను, చిన్న చిన్న కప్పలను కోస్తుంటే అపుడే డాక్టర్‌ అయినట్లు నాకు ఫీలింగ్‌. ఆ కబుర్లు ఇంట్లో చెబితే అమ్మ ఎం తో సంతోషంగా వినేది. నాన్నగారు నేను తప్పకుండ డాక్టర్‌ కావాలని బోధించే వారు. ఓ రోజు క్లాస్‌లో అందరి చేతిలో ఓ వింత వస్తువు మెరిసిపోయేది దాని పేరే మొబైల్‌ ఫోన్‌. దాని మీద నాకు ఆశ కలిగింది. ‘‘నాన్నాగారు... నాన్నగారు నాకు... నాకు సెల్‌ఫోన్‌ తీసివ్వరూ’’ నాన్న ఒక నిమిషం ఆలోచించి ‘‘అలాగే తెచ్చిస్తానమ్మా’’ నవ్వారు. ఒక గంట తరువాత ఎర్రటి సెల్‌ఫోన్‌ నా చేతిలో ఉంది. దాని ఫంక్షన్స్‌ అన్ని చక.. చ... నేర్చుకున్నాను. ఒక రోజు డెసెక్షన్‌ చేస్తున్నాను. ఒక మంచి మ్యూజిక్‌ వచ్చింది. ఫోన్‌ ఆన్‌ చేస్తే ఒక ఎస్‌.ఎమ్‌.ఎస్‌. ‘‘ఈ రోజు నీవు చాలా బావున్నావు... నీతో మాట్లాడలని ఉంది నాతో స్నేహం నీ కిష్టమేనా? ఆమోదం తెలుపుతూ ఒక ఎస్‌.ఎమ్‌.ఎస్‌ చేశాను ఆ ఎస్‌.ఎమ్‌.ఎస్‌ ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో నాకపుడు తెలీదు.

ఈ ఎస్‌.ఎమ్‌.ఎస్‌లు చేస్తున్నది ఒక అబ్బా యి. ఆ అబ్బాయి పేరు ‘‘చైతూ’’... చైతన్య. ఈ చైతన్య నా జీవితంలో సైలెంట్‌గా ప్రవేశించి ఎంత గాలి... దుమారం రేపుతాడో నేనూహించి ఉంటే అతడి ఎస్‌.ఎమ్‌.ఎస్‌కు స్పందించే దాన్నేకాదు. కొత్తఫోన్‌... మొదటి ఎస్‌.ఎమ్‌.ఎస్‌ అది ఓ అబ్బాయి అతను సీని యర్‌ ఇంటర్‌ చుదువుతున్నాడు డబ్బున్న అబ్బాయి. తండ్రి కంట్రాక్టర్‌...తల్లి మహిళా మండలికి లీడర్‌. ఆదర్శాలు వల్లించడానికే తప్ప నిజ జీవితానికి అన్వయించవు అని వాళ్ల సిద్ధాంతం.చైతూలో నవ్వడం మాట్లాడడం.. స్నేహం అని నేననుకున్నాను... సరదా అని చైతూ అ నుకున్నాడు. ‘‘ప్రేమ’’ అని నేననుకుంటే ‘‘పో...పో’’ అన్నాడు చైతూ అంతటితో అగలే దు. నా గురించి దుష్ర్పచారం మొదలుపెట్టా డు. దాన్ని నేను సీరియస్‌గా తీసుకుని అతణ్ణి దులిపేసరికి ఇంటికి వచ్చి వార్నింగ్‌ ఇచ్చివెళ్ళాడు.

ఆ వార్నింగ్‌ ఎలా ఉందంటే మా ఇంటి పరిసరాలన్ని దద్దరిల్లిపోయాయి. మా నాన్న తో ఇలా అన్నాడు. ‘‘డబ్బున్న వాళ్ల అబ్బాయికి గాలమెయ్యడానికేనా మీ పేదోళ్లు ఆడ పిల్లల్ని కాలేజీకి పంపేది ఇంకొకసారి మీ అమ్మాయి నా జోలికి ప్రేమ అంటూ వచ్చిందా ఇంకొక యాసిడ్‌ దాడి అనే న్యూస్‌ పేపర్లో.. టీవీలో వస్తుంది జాగ్రత్త’’ అంటూ ఆ అబ్బాయి ఎస్‌. ఎమ్‌.ఎస్‌ చేసి ఫ్రెండ్‌ షిప్‌ చేసి ప్రేమ... దోమ అన్నాడే తప్పిది నాకు పుట్టిన ఆలోచన కాదని నేనెవరితో చెప్పేది.. ఎవ్వర్ని నమ్మించేది?
ఆ రోజు చుట్టు ప్రక్కల వాళ్లు ఇష్టం వచ్చి నట్లు మాట్లాడారు. ఆ మాటల సారాంశం తాహతు మరచినేను ఆడపిల్ల అన్న విషయం మరచి మా అమ్మా నాన్న కళ్లు నెత్తిన పెట్టుకు ని నడుస్తున్నామని. అందుకే ఇలా అయ్యిందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మేము నడుచు కోవాలని’’ దాని సారాంశం.

నాన్నగారు నాకు ఒక్కమాట పరుషమైన మాట వినిపించలేదు. ఒక్క చూపుచూశారు. ఆ చూపు నాకు మనస్సులో తీవ్రంగా గుచ్చు కుంది. అమ్మ కూడ ఏమన లేక ఓ అని ఏడ్చింది. ఆ ఏడుపు నా చెవుల్లో సముద్ర ఘోషలాగ ప్రతి ధ్వనించ సాగింది అన్నయ్య ‘ఛి... ఛీ.... అన్నాడు. ఆ ఛీత్కారం లో ఎన్నో మొహాలు ఛీత్కరించినట్లు కనబడ్డాయి. అంతే ఈ సంఘటనలో నాలో కసి.... అవేశం బైల్దేరింది దాని పేరే ‘‘లక్ష్యం’’ నేను ఇంత వర కు చదువుని మా అమ్మా నాన్న కోసం చదివా ను కానీ, ఇపుడు నా చదువుని నా లక్ష్యం కోసం... చదవాలి... చదవాలి...తీవ్రంగా చదవాలి చదువు తప్ప ఇపుడు నా జీవితంలో ఏం లేదు పండుగ లేదు...

సినిమా లేద... ఫ్రేండ్స్‌తో మాటా మంతీ లేదు ఏమీ లేదు కేవలం ‘‘చదువు’’ అంతే భయకరంగా చదవడం మొదలు పెట్టాను. దానికి ఫలితం నేను ఇంటర్లో కాలేజ్‌ ఫస్ట్‌ వచ్చాను. నాకు మందుకు పోవడానికి దారి సుగమం అయ్యింది. ఎమ్‌.సెట్‌కు అతి భయంకరంగా చదవడం మొదలు పెట్టాను మంచి ర్యాంక్‌ తో మెడిసిన్‌లో ఫ్రీ సీట్‌ వచ్చింది. ఆ రోజు నేను జీవితంలో మరువలేనిది. నాన్న,అమ్మ ఆనందానికి హద్దు లేకుండ పోయింది. అమ్మా నాన్న కూడ బలుక్కుని ‘‘డాక్టర్‌గారు’’ అంటుంటే అపుడే నేను డాక్టర్‌ అయిపోయినట్లు ఒక సంభ్రమం నన్ను ఆవహించింది. నాన్నగారు మొట్టమొదటిసారిగా అన్నయ్యతో ఓ మాట అన్నారు. ‘‘బాబు ఆదర్శ్‌ నేను కుటుంబ కారణాల వలన చదువుకోలేక పోయాను. నన్ను మీలో చూసుకుంటున్నాను మీరు చదువుకుని ప్రయోజకులైతే నాకు అంతకంటే కావాల్సింది ఏమి లేదురా చెల్లెలు నా లక్ష్యం నెరవేరుస్తుందని నాకు నమ్మకం ఏర్పడింది ఇక నీవే నాయనా ఇంకా తెలుసుకోలేకపోతున్నావు’’.

నాన్నగారి మాటలు పూర్తికాకముందే అన్నయ్య ‘‘నాన్నగారు నేను చెల్లెలు లాగ మెడిసిన్‌ చదవలేను నేను చదివేది బి.ఎ., కదా దాన్ని పూర్తి చేసి ఏమి చెయ్యాలో ఏమి చేయగలనో ఆలోచిస్తాను... సాధిస్తాను’’ అన్నయ్యకు ఒక లక్ష్యం ఏర్పడుతుందని మేమెవ్వరం అనుకోలేదు. రాత్రి పగలు అన్నయ్య కూడ చదవడం మొదలుపెట్టాడు. అంటే కాదు అన్నయ్య అర్లీ మార్నింగ్‌ లేచి న్యూస్‌ పేపర్‌, పాల పాకెట్లు పంచడం దానిద్వార వస్తున్న ఆదాయం నాన్న చేతుల్లో పెట్టడం చేస్తున్నాడు.మాలో వచ్చిన మార్పు అమ్మ నాన్నలకు ఎంతో సంతోషాన్ని కలుగ చేసింది. ఈ ప్రపంచంలో మననుండి ఏమి ఆశించని వాళ్లు అమ్మా నాన్న మాత్రమే వాళ్ల శ్రమ.. కనీళ్లు... చెమట అంతా మా భవిష్యత్‌ సౌధం గురించే దానికి పునాది వాళ్లు వేస్తారు.

ఆ సౌధం మనమే కట్టుకోవాలి ఆ సౌధం నిలవాలన్న గట్టిపడాలన్న మా చేతుల్లోనేఉంది.
అన్నయ్యలో వచ్చిన మార్పు నా ద్వారానే అని నాన్నగారు నమ్మారు. నేను ఒక లక్ష్యం ఏర్పడచుకుని చదవడం మెడిసిన్లో చేరడం అన్నయ్యను కూడా ప్రభావితం చేసిందని నాన్న గారు ఎంతో సంతోషించారు ‘‘మా లక్ష్య ఎంతో లక్ష్య సాధనం కావాలి’’ అన్నారు నాన్నగారు. ఒకప్పుడు చైతన్య వలన మా ఫ్యామీలీకి వచ్చిన చెడ్డపేరు ఇపుడు తొలిగిపో యింది. నేను కనబడగానే తిరస్కారంగా చూసిన వాళ్లంతా ఇపుడు నన్ను సంస్కారంతో చూస్తున్నారు. ‘‘ఎలా పెంచుతున్నారు పిల్లల్ని’’ అని హేళన చే సిన వాళ్లంతా ‘‘పిల్లల్ని ఇలా పెంచాలి’’ అని అ మ్మా నాన్నను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

దీనికంతటికీ కారణం చదువు. చదువును నేను ఆదర్శంగా తీసుకోవడం లక్ష్య సాధనం గా తీసుకోవడమే దానికి కారణం. ఇలాగే నేను అన్ని సంవత్సరాలు దాటుకుంటూ ముందుకు వచ్చేశాను ఇపుడు నా చేతికి డాక్టర్‌ పట్టావచ్చేసింది. అంతటితో నేను ఆగలేదు ఇంకా ముందుకు వెళ్లాలని పీ.జీ.కి ప్రిపేరై పీ.జీ.లో ఫ్రీ సీట్‌ తెచ్చుకున్నాను. ఏదో ఒక పని చేస్తూ ఆదాయం సంపాదిస్తూ అమ్మా నాన్న చేతిలో పెడుతూ సివిల్స్‌లో సెలక్టయ్యాడు. నేను పీ.జీ.లో అడుగుపెట్టడం అన్నయ్య సివిల్స్‌లో సెలక్ట్‌ కావడం చక... చక... జరిగి పోయాయి. ఇప్పటికీ నేను ఆటో నడుపుకునే శంకరయ్య కూతుర్నే...

అందరికి పనిలో సహాయం చేసి అన్నపూర్ణమ్మ కూతుర్నే తనతల్లిదండ్రులకు సహాయపడేందుకు పేపర్‌బోయ్‌గా తిరిగే ఆదర్శ్‌కు చెల్లల్నే. ఆటో శంకరయ్య కూతురు అన్న పదం వింటే అమృతం పోసినట్లు ఉంటుంది. మా చదువుల ద్వార మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కానీ, నాన్నగారు తను మా పొట్టనింపడానికి నడిపిన ఆటోని మాత్రం వదలలేదు. దాన్ని కొన్నారు. మా అమ్మ చట్టుపక్కల ఇళ్లకు సహాయంగా వెళ్తోంది డబ్బు కోసం కాదు ఆదర్శమైన తల్లిగా.

dakshamaniనేను హాస్పిటల్‌కు నాన్నగారి ఆటోలోనే వెళ్తాను. ఆ ఆటో అంటే మాకు చాల గౌరవం. అన్నయ్య కూడా ఆటోలోనే వెళ్తాడు. తన ఆఫీసుకు. మాకు మా అమ్మా నాన్న ఎంతో ఆ ఆటో కూడ అంతే.ఒక లక్ష్యంతో చదువుని ఆయుధంగా చేసుకుని మేము ముందడుగు వేశాం. మా కల ఒక్కటే నాన్న గారు ఆశించినట్లు లక్ష్యసాధన కోసం ఆహర్ని షలు కృషి చేయడం. ఎందరికో కాక పోయి న కొందరికైన చేయూత ఇవ్వడం అన్నయ్య నేను ప్రస్తు తానికి ఇంతే అనుకుంటున్నా ము. మా లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు.. ఆపయాలు ఎదురైతే మా ‘‘లక్ష్యం’’ అంత బలపడుతుంది. మా లాంటి వాళ్లకి అది దారిచూపుతుంది.

-ఎం.దాక్షాయణి


__________________________________________________________________________

మేధో మథనం
అగోచర సత్యాలు
- జాహ్నవి

వాల్ స్ట్రీట్ వేడెక్కింది. గ్రీసు ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. పెట్రోల్ రేట్లు మళ్ళీ పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరమే లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలిస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు చేసింది. ఇవన్నీ భిన్న రంగాల్లో, వేర్వేరు దేశాల్లో జరుగుతున్న పరిణామాలు. ఎక్కడన్నా ఒక భూకంపమో, వరదో వస్తే అయ్యో పాపం అనుకుంటాం. కష్టాల్లో ఉన్నవారికి తోచిన సాయం చేస్తాం. ఒక్కసారితో పోతుంది.

కానీ మానవ జనిత పరిణామాలు, సమూహాల ఆలోచనా సరళులు మనకు తెలియకుండానే ప్రతిఒక్కరి జీవితాలనూ కాస్త ముందో, వెనుకో ప్రభావితం చేస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి ఇటువంటి పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా గమనిస్తూ, వాటిని లోతుగా విశ్లేషించి, దేన్ని సమర్థించాలో, దేన్ని వ్యతిరేకించాలో ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి. ఒడ్డున నించుని చూద్దాంలే అనుకుంటే కుదరదు.

ఇంత లోతుగా ప్రతిమనిషీ విశ్లేషించలేదు ఆనక మేధావులు ఈ పనిలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. మేధావుల్లోనూ కొందరు ఒక భావజాల దృష్టి కోణంతోను, మరికొందరు దానికి విరుద్ధమైన భావజాలపు కళ్ళద్దాల్లోంచీ చూస్తారు. కనుక ఏ రకం మేధావుల వాదనలకు, విశ్లేషణలకు విలువివ్వాలనే నిర్ణయం వ్యక్తులే తీసుకోవాలి. ఈ విషయంలో డిగ్రీలు, ఆచార్యత్వం, పదవులు, వయసు, నేపథ్యం, నోబుల్ బహుమతులు చూసి అనుసరించి అనుకరించి బోల్తా పడితే అది వ్యక్తుల వైఫల్యమే అవుతుంది.

అమెరికా వాణిజ్య సామ్రాజ్యానికి మారుపేరైన వాల్ స్ట్రీట్‌ని ఆక్రమించడమనే ఉద్యమం అక్కడి పలు నగరాల్లోనేకాక, అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలన్నిటికీ పాకింది. కార్పొరేట్ సంస్థల దురాశకు, ఆశ్రిత పెట్టుబడీదారీ విధానానికి, గుత్తసంస్థలపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొనుక్కున్న ఇళ్ళ విలువ పడిపోయి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాలతో సతమతమవుతున్న ప్రజల సొమ్ముతో కార్పొరేట్లు జల్సా జీవితం గడపడంపై పెల్లుబికిన ప్రజాగ్రహం సహేతుకమైనదే.

కాకపోతే గురి తప్పింది. ఎలాగంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడానికి కారణం ప్రభుత్వాలు. ప్రజలను ఆకర్షించి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావడానికి, అందరికీ ఇల్లు, అడిగినంత అప్పు, నిరుద్యోగ భృతి, ఉచిత వైద్యం లాంటి పనికమాలిన పథకాలు పెట్టి, బ్యాంకు రుణాలు, డాలర్ల ముద్రణల ద్వారా డబ్బును గాల్లోంచి సృష్టించి, అయ్యవారిని చేస్తామన్న ఆర్థిక వ్యవస్థను కోతిలా తయారు చేసింది ఆయా ప్రభుత్వాలే.

ఒక దశ దాటాక ఈ కృత్రిమ అభివృద్ధివాపు కుప్పకూలింది. ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసిన బ్యాకులు, ఆర్థిక సంస్థలు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. దివాలా తీయనీయకుండా, ప్రజల సొమ్ముతో వాటిని కాపాడింది ఈ ప్రభుత్వాలే. ఈ నిరంతర ప్రభుత్వ జోక్యాల వల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుట పడడం దేవుడెరుగు, పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ముంచుకొస్తోంది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలకు, ఉద్దీపన పథకలాలకు ఉదార ఆర్థిక స్వేచ్ఛావాదం బద్ధవ్యతిరేకం. ఆందోళన కారులు ఉద్యమించాల్సింది వాల్‌స్ట్రీట్ మీద కాదు. మధ్యతరగతి, పేద ప్రజల కష్టార్జితాన్ని లాక్కుని ఆశ్రితుల ఉద్దీపన కోసం వెచ్చిస్తున్న ప్రభుత్వాల మీద.

గ్రీసు ప్రభుత్వం ఆర్థిక దివాలా అంచున నిలబడింది. దానికి దారితీసిన పరిస్థితులు సుస్పష్టం. 17 దేశాల యూరో జోన్‌లో భాగమైన గ్రీసు అప్పుల బారిన పడింది. మొదటి నుంచి కొంత బలహీన దేశమైన గ్రీసు యూరో జోన్‌లో చేరాక మరింత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించింది. 17 దేశాలు ఒకే కరెన్సీని వాడుతూ ఒకే ప్రమాణాలు పాటించాలి.

అదొక ప్రాథమిక ఆర్థిక సూత్రం. కాగితాల మీద నిబంధనలున్నా, వాటి నెవరూ పాటించలేదు, పాటించాల్సిందేనన్న ఒత్తిడీ లేదు. రాజు గారింట్లో పెళ్ళికి పాలెందరు పోస్తారు? దీన్నే 'ఉమ్మడిలో ఉన్న విషాదం' (ట్రాజెడీ ఆఫ్‌ది కామన్స్) అంటారు. యూరోపియన్ రిజర్వు బ్యాంకు కల్పించిన అతి తక్కువ వడ్డీ సదుపాయాన్ని అడ్డం పెట్టుకుని స్వదేశమే కాక ఇతర దేశాల ప్రజలు, బ్యాంకుల నుంచి గ్రీకు ప్రభుత్వం అడ్డగోలుగా రుణాలు తీసుకొని ప్రజాకర్షక పథకాలకు వెదజల్లారు.

తీర్చాల్సి వచ్చేసరికి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పటిదాకా అందుతున్న ఉచితాల పథకాలు వదులుకోడానికి ప్రజలు సిద్ధంగా లే రు. ఇంకా అప్పు చేద్దామంటే పుట్టే పరిస్థితి లేదు. పౌరుషానికి పోయి యూరో ద్రవ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే, యూరో జోన్‌లోని ఇతర (సంపన్న) దేశాలు గ్రీసు చేసిన అప్పుల్లో సింహభాగాన్ని నెత్తినేసుకోక తప్పదు. అంటే గ్రీకు ప్రభుత్వాల ప్రజాకర్షక పథకాలకు ఇతర యూరో దేశాల్లోని కష్ట జీవులు డబ్బు కట్టాల్సి వస్తోంది.

పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. తామేమీ చెయ్యలేమని ఆర్థిక మంత్రి సెలవిచ్చారు. డబ్బు లేమాన్నా చెట్లకు కాస్తున్నాయా అని ప్రధాన మంత్రి నిలదీశారు. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోందని వాపోయారు. ఎంత అమాయకత్వం! వాస్తవమేమిటంటే ద్రవ్యోల్బణమనేది పూర్తిగా ప్రభుత్వాల పాపం. ద్రవ్యలోటు, నోట్ల ముద్రణ, డిపాజిట్ల కంటే కొన్ని రెట్ల స్థాయిలో బ్యాంకుల ద్వారా రుణ వితరణలు-ఇవన్నీ ప్రభుత్వాలు చేసే పనులే.

రైతులో, వ్యాపారులో, పారిశ్రామికవేత్తలో చెయ్యరు. చేసిందంతా చేసి, ఇంకా పాపం చేస్తూ, మళ్ళీ ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంలేదని మొసలి కన్నీరు కార్చడం దుర్మార్గం, దగా. చమురు కంపెనీలన్నీ ప్రభుత్వరంగ సంస్థలే. ఒకదానితో ఒకటి సమర్థతలో పోటీపడాల్సిన అవసరం వాటికి లేదు. అటువంటి పరిస్థితిలో పెట్రోలు ధర పెంపు అనివార్యమనడం అర్థరహితం. పెట్రోరంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరిస్తే, సెల్‌ఫోన్ కంపెనీల్లా ధరలు తగ్గిస్తాయో, లేక అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా కొన్నిసార్లు పెంచడం, కొన్నిసార్లు తగ్గించడం జరుగుతుందో లేదో తెలుస్తుంది.

రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరాంతం లోగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలు, రాబోయే రెండేళ్ళలో మరిన్నిలక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. దీనికి సంతోషించాలా, లేక కంగారు పడాలా? వాళ్లందరి జీతభత్యాల ఖర్చుతో పన్నుల ద్వారా మనమేకదా భరించాలి? ఈ ప్రభుత్వోద్యోగాల్లో ఎక్కువ భాగం ప్రజలకు పనికిరానివే. ప్రభుత్వ ఉద్యోగులు సోమరిపోతులు కారు. ప్రైవేటు రంగంతో దాదాపు సమానంగా పనిచేస్తారు. కానీ అది ఎందుకూ ఉపయోగపడని పని. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి లిఫ్టుకీ ఒక అటెండరుంటాడు.

ఆటోమాటిక్ లిఫ్టులొచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఆ ఉద్యోగాలు తొలగించరు. కనీసం వాళ్ళతో వేరే ఏదైనా పనికొచ్చే పని చేయించరు. అలాగే గణాంకాల సేకరణకు వేలాది మంది. అన్నీ కాకి లెక్కలు. మళ్ళీ ఆ లెక్కల ఆధారంగా పిచ్చి ప్రణాళికలు. స్వభావ రీత్యా బ్యూరోక్రసీ తనను తాను విస్తరించుకోవడానికి, రకరకాల నియంత్రణలు, చట్టాల ద్వారా తన ప్రాముఖ్యతను, జీతభత్యాలను పెంచుకోవడానికి, ఏ పనినైనా అత్యంత అసమర్థ పద్ధతిలో చెయ్యడానికి, చేయించడానికే ప్రయత్నిస్తుంది. రిటైరయ్యే సమయానికి ప్రభుత్వరంగ సంస్థలో కారు డ్రైవరు జీతం డె భ్బైవేలు. కట్టేది మనమే.

మరి లక్షల ఉద్యోగాల ప్రకటనలకు సంబరపడాలా, లేక కలవరపడాలా? తెలుగు సినిమా రంగం తీవ్ర సంక్షో భంలో ఉందంటున్నారు. నిర్మాణ వ్యయం పెరిగి, ప్రేక్షకుల ఆదరణ తగ్గి, పైరసీ వంటి కారణాల వల్ల చిత్రాల సంఖ్య. ప్రమాణాలు, సృజనానత్మకతలపై ప్రభావం పడుతోంది. సినిమా వర్గాలు పైకి చెప్పని కారణాలు ఇంకా ముఖ్యమైనవి. సినిమా టికెట్ల రేట్ల నియంత్రణ వీటిలో మొదటిది. టిక్కెట్లు రేటు అనేది ఎగ్జిబిటరుకు, ప్రేక్షకుడికి సంబంధించిన విషయం.

బ్లాకులో అమ్మేరేట్లు, విడుదలైన కొన్ని రోజులపాటు ఉండే రద్దీలను గమనిస్తే కొన్ని సినిమాలను, కొన్ని రోజుల్లో ఎక్కువ డబ్బిచ్చైనా చూడ్డానికి కొందరు ప్రేక్షకులు ఇష్టపడతారు. కొన్ని సినిమాలు ఉచితంగా చూపించినా చూడరు. టిక్కెట్టు రేట్ల నియంత్రణ వల్ల నిర్మాతలు నష్టపోయి, మంచి చిత్రాలు తీయడానికి ముందుకు రారు. ఇంకో ముఖ్య కారణం చిత్ర నిర్మాణ కార్మిక రంగంలో విపరీతమైన యూనియనిజం.

వీటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా హాలీవుడ్, డబ్బింగ్ చి త్రాలను నిషేధించాలని, నియంత్రించాలని, వాటిపై పన్నులు పెం చాలని ఫిలిం ఛాంబరువారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం లో ఉన్నారు. ఏ ప్రభుత్వ నియంత్రణల వల్ల నష్టపోతున్నారో గమనించకుండా అదే ప్రభుత్వ బలంతో ఇతరులను అడ్డుకోజూస్తున్నా రు. ప్రేక్షకులు హాలీవుడ్, డబ్బింగ్ చిత్రాలను ఇష్టపడుతుంటే కాదనడానికి వీరెవరు? ప్రభుత్వాల కర్రపెత్తనంతో ప్రేక్షకుల స్వేచ్ఛకు భంగం కలిగించడం, పరభాషా చిత్ర నిర్మాతలను నష్టపెట్టడం త ప్పుకానప్పుడు, పార్టీల, ఉద్యమకారుల కర్రపెత్తనంతో తెలంగాణా లో షూటింగులను అడ్డుకుంటున్న వారిని ఎలా తప్పు పట్టగలరు?

స్వేచ్ఛ అనేది ఇష్టమన్నప్పుడే వాడుకునే లిప్‌స్టిక్ కాదు. ప్రభుత్వాన్ని ఆశ్రయించి పొందే సబ్సిడీ కాదు. మనకు మాత్రమే ఉండాలనుకునే సెంటిమెంటు కాదు. అదొక మానసిక నిబద్ధత. ఒక భావజాలం. మనతోపాటు అందరికీ నిలకడగా, అవిరుద్ధంగా వర్తించాలని అంగీకరించాల్సిన నైతిక నియమం. మనిషిని చీకటి శకాలు, మధ్య యుగాలు, మతోన్మాదాల చెర నుంచి విడిపించే ఆధునిక సహనశీల ఆలోచనా విధానం. దాన్ని పొందగానే సరిపోదు. నిలబెట్టుకోవాలంటే ఆలోచించాలి. ఆలోచిస్తూనే ఉండాలి. లేకపోతే చిటికెలో చేజారిపోతుంది.

- జాహ్నవి

No comments:

Post a Comment