Friday, November 18, 2011

రెండో ఎస్సార్సీ అవసరమా ?
- పొంతన లేని కాంగ్రెస్‌ ప్రతినిధుల ప్రకటనలు
- యూపీతో లంకె ఎందుకు?
- మాట మారుస్తున్న కాంగ్రెస్‌ నేతలు
- తడబడుతున్న భారతీయ జనతా పార్టీ
- అన్ని రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్సార్సీలు వేశారా?
- ‘తెలంగాణ’కు మాత్రం ఎస్సార్సీ ఎందుకు?


telangana-ouతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తనదైన శైలిలో కాంగ్రెస్‌ నాయకత్వం- యూపీఏ ప్రభుత్వం నాన్చివేత ధోరణి కొనసాగింపుగా, రెండో ఎస్సార్సీ ఏర్పాటును తెర పైకి తెచ్చింది. బోడి గుండుకు మోకాలు ముడిపెట్టే చందాన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలను, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చేయాలన్న డిమాండుతో- తెలంగాణ అంశానికి లంకె వేసింది. ‘సూర్య’ దినపత్రిక పేర్కొన్నట్లు ఉత్తర్రపదేశ్‌లో ఎన్నికలు ముగిసి, ఫలితాలలో పార్టీ అదృష్టం బయట పడిన తర్వాతే తెలంగాణ విషయంలో కసరత్తును పునరుద్ధరించాలని ఏఐసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలందిస్తోంది కేంద్రం.

ఒకవైపు పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ- రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేసి రాష్ట్రాల పునర్విభజన జరపాలా వద్దా అని నిర్ణయించడమే అఖిలభారత స్థాయిలో కాంగ్రెస్‌ విధానమని ప్రకటిస్తే, అందుకు భిన్నంగా, ఇప్పుడిప్పుడే రెండవ ఎస్సార్సీ వంటి ప్రతిపాదనలేవీ ఉండబోవని మరో సీనియర్‌ నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ తాజాగా ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి చేసిన డిమాండ్‌ను దిగ్విజయ్‌ సింగ్‌ సమర్థిస్తే, ప్రణబ్‌ ముఖర్జీ వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ విధానం చిన్న రాష్ట్రాల ఏర్పాటా, కాదా- కాకపోతే అసలు దాని విధానమేమిటి అనేది భగవంతుడికే తెలియాలి! అంతలోనే తెలంగాణ విషయంలో త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మళ్లీ మాట మారుస్తున్నారు- అదే ప్రణబ్‌ ముఖర్జీ. వారికి ఇదొక ఆటలాగా - రాజకీయ క్రీడలాగా ఐపోయిందనాలి.

రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వాస్తవానికి, ఒక అర్థరహిత, అసమంజస, కారణ రహిత, విడ్డూరమైన అసంబద్ధ రాజకీయ తెలివితక్కువ ఆలోచన అనాలి. తెలంగాణ సమస్యకు ఇది పరిష్కారమార్గం కానే కాదు, కాజాలదు కూడా. సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులకు ఈ ఆలోచన నచ్చి స్వాగతించారేమో కాని, ఒక్కరంటే ఒక్క తెలంగాణ వాది కూడా పిసరంత మాత్రమైనా దీనికి అంగీకరించిన దాఖలాలు లేనే లేవు. అంగీకరించే సమస్యే ఉత్పన్నం కాదు. మాయావతి ఆలోచనకు ముందస్తుగా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నదేమో కాని, పరోక్షంగా తన గోతి తానే తవ్వుకుంటున్నదన్న సంగతి మర్చిపోతోంది.

అదేం విచిత్రమో కాని, తెలంగాణ ఏర్పాటుకొరకు రెండో ఎస్సార్సీ అవసరం లేదని వాదిస్తూ వచ్చిన, తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకొచ్చిన, పార్లమెంటులో చర్చకు సైతం నోటీసిచ్చిన ఏకైక జాతీయ పార్టీ - భారతీయ జనతా పార్టీ కూడా, ఉత్తర ప్రదేశ్‌ సంగతి వచ్చేసరికల్లా, రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్రానికి సూచన ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ ఐక్య కార్యాచరణ నాయకులు, తెలంగాణ టిడిపి- కాంగ్రెస్‌ నాయకులు ఎస్సార్సీ ఏర్పాటు ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు.మొదటి పర్యాయం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ ఏర్పాటు చేయడానికి ఒక చారిత్రక నేపథ్యం, పాలనాపరమైన అత్యవసర ఆవశ్యకత ఉండేవి.

అలాంటిదేమీ ఇప్పుడు కించితె్తైనా లేదు. ఆంగ్లేయుల పాలనలోని భారతావని (1858-1947), స్వాతంత్య్రోద్యమం (1857-1947), దేశ విభజన (1947), స్వాతంత్య్రానంతరం రాజకీయ సమగ్రతల పరిరక్షణ (1947-49) నేపథ్యంలో మొదటి ఎస్సార్సీ ఆవశ్యకత కలిగింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ప్రాంతాలకు భౌగోళికంగా హద్దులు ఏర్పాటు చేసేందుకు, పాలనా సౌలభ్యానికి వీలుగా వాటిని మలిచేందుకు- మొదటి ఎస్సార్సీ చట్టాన్ని 1956 లో తీసుకు రావడం జరిగింది. అదో ప్రాముఖ్యతను సంతరించుకున్న రాజకీయ సంస్కరణ. ఆ చట్టం మూలాన, భౌగోళికంగా హద్దులు నిర్ణయించడానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రాతిపదికగా తీసుకున్నారు.

స్వాతంత్య్రం రావడానికి పూర్వం ఆచరణలో ఉన్న మూడు రకాల (ఎబి,సి) రాష్ట్రాల స్థానంలో ఒకే తరహా రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి మొదటి ఎస్సార్సీని ఉపయోగించుకుంది ప్రభుత్వం. తరువాత కొన్ని రాష్ట్రాలను మరో మారు విభజించినప్పటికీ, అందుకోసం ఇంతవరకూ ఎన్నడూ ఎస్సార్సీలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడలా చేయాల్సిన అవసరమూ లేదు. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒక్క సారి ఇంతవరకు ఎస్సార్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు చేయాలి?
భారత దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం, బ్రిటిష్‌ ఇండియాలో రెండు విధాలైన దేశ భష్‌ భాగాలుండేవి.

లండన్‌లోని ఇండియా కార్యాలయం పరిధిలో, భారత గవర్నర్‌ జనరల్‌ పరిధిలో- నేరుగా అధీనంలో ఉన్న బ్రిటిష్‌ ఇండియా ప్రదేశాలు కొన్నైతే, వారసత్వ పాలనలో ఉన్నటువంటి ప్రిన్సిలీ రాష్ట్రాలు మరి కొన్ని ఉండేవి. వాటిపై అంతర్జాతీయ సంబంధాల విషయంలో మాత్రమే బ్రిటిష్‌ ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. అదనంగా, ఫ్రెంచ్‌, పోర్చుగల్‌ అధీనంలో ఉన్న వలస ప్రాంతాలు కూడా ఉండేవి. వీటన్నిటినీ ఒకే గొడుగు కింద తెచ్చే రాజకీయ ఏకీకరణే అలనాటి భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో సర్దార్‌ వల్లభ భాయ్‌ పటేల్‌, బ్రిటిష్‌ ఇండియాలో అత్యున్నత స్థానానికి ఎదిగిన భారతీయ సివిల్‌ సర్వెంట్‌ వి.పి. మీనన్‌ చేసిన అవిరళ కృషి ఫలితంగా, దాదాపు చాలా ప్రిన్సిలీ రాష్ట్రాలతో సహా అన్నీ భారత దేశంలో విలీనం కావడానికి అంగీకరించాయి.

ఫ్రెంచ్‌, పోర్చుగల్‌ అధీనంలో ఉన్న వలస ప్రాంతాలు కూడా విలీనం దిశగా నడిచాయి. కాశ్మీర్‌, హైదరాబాద్‌, మణిపూర్‌, త్రిపపు వంటి కొన్ని రాష్ట్రాలు స్వతంత్రంగా వుండేందుకు ప్రయత్నాలు చేసినా చివరకు ఫలించలేదు. చిట్ట చివరి బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ మౌంటెన్‌ బేటన్‌ వంటి వారు కూడా భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రయత్నాలకు సహాయ పడ్డారు. 1947 ఆగస్ట్‌ 15న బ్రిటిష్‌ ఇండియా- భారత్‌, పాకిస్ఘాన్‌ దేశాలుగా విడిపోయిన అనంతరం భారత దేశానికి స్వాతంత్య్రం లభించింది.1950 జనవరి 26 న భారత దేశానికి కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారత దేశం అవతరించింది.

అలా అవతరించిన దేశంలోని వివిధ ప్రాంతాలను- కొన్నింటిని రాష్ట్రాలుగా, మరి కొన్నింటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా వ్యవహరించడం ప్రారంభమైంది. రాష్ట్రాలకు స్వతంత్ర పాలన చేసుకునే అధికారాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే విధంగా పాలనా పరమైన వీలును కలిగించింది రాజ్యాంగం. కాకపోతే వీటన్నిటినీ, మూడు రకాల రాష్ట్రాలుగా పాలనా సౌలభ్యంకొరకు విభజించడం జరిగింది. ‘ఎ’ విభాగం కింద బ్రిటిష్‌ ఇండియాలో సరాసరి గవర్నర్‌ జనరల్‌ అజమాయిషీలో ఉండే రాష్ట్రాలకు ఎన్నికైన గవర్నర్‌, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల శాసన సభలుండేవి. అలాంటి తొమ్మిది రాష్ట్రాలలో అస్సాం, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, బాంబే, మధ్య ప్రదేశ్‌ (గతంలోని కేంద్ర ప్రావిన్సులు, బీరార్‌ ప్రాంతం), మద్రాస్‌, ఒరిస్సా, తూర్పు పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌ (యునైటెడ్‌ ప్రావిన్సెస్‌) ఉన్నాయి.

‘బి’ విభాగంలో గతంలోని ప్రిన్సిలీ రాష్ట్రాలుండేవి. రాష్టప్రతి నియామకం చేసిన రాజపమ్రుఖ్‌, ఎన్నికైన శాసన సభల ఆధ్వర్యంలో అక్కడ పాలన సాగేది. అవి హైదరాబాద్‌, సౌరాష్ట్ర, మైసూర్‌, ట్రావన్‌కోర్‌- కొచ్చిన్‌, మధ్య భారత్‌, వింధ్యా ప్రదేశ్‌, పాటియాలా, పెప్సు, రాజస్థాన్‌ రాష్ట్రాలు. ఢిల్లీ, కచ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, బిలాస్‌ పూర్‌, కూర్గ్‌, భోపాల్‌, మణిపూర్‌, అజ్మీర్‌-మేర్వార్‌, త్రిపుర రాష్ట్రాలు ‘సి’ విభాగం కింద ఉండేవి. జమ్మూ - కాశ్మీర్‌ కు కొంతకాలం ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగింది. అండమాన్‌- నికోబార్‌ దీవులను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటైంది ఎస్సార్సీ.
భారత దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అక్కడక్కడ ఉద్యమాలు మొదలయ్యాయి.

మద్రాస్‌ రాష్ట్రం నుంచి తమను విడదీయాలని తెలుగు మాట్లాడే వారు ఉద్యమించడంతో 1953లో- తెలుగు మాట్లాడే పదహారు జిల్లాలను మద్రాస్‌ రాష్ట్రం నుండి విడదీసి, ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది.1950-1956 మధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న భౌగోళిక మార్పులు చేసి కొన్ని రాష్ట్రాల సరిహద్దులను మార్చడం జరిగింది. 1954 జులై నెలలో హిమాచల ప్రదేశ్‌లో బిలాస్‌ పూర్‌ను విలీనం చేశారు. 1955 లో ఒకనాటి ఫ్రెంచ్‌ కాలనీ చందర్‌ నగర్‌ ను పశ్చిమ బెంగాల్‌లో కలిపారు. ఫజల్‌ అలీ, కవలం మాధవ ఫణిక్కర్‌, హెచ్‌.ఎన్‌. కుంజ్రు సభ్యులుగా మొట్టమొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌‌‌ ఏర్పాటైంది. 1955లో ఈ ఎస్సార్సీ నివేదిక సమర్పించడం, అందులో మిగతా వాటితో పాటు తెలంగాణ ఏర్పాటు గురించి చర్చించడం కూడా జరిగింది. నివేదికలోని 369 నుండి 389 పేరాలలో హైదరాబాద్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, మద్రాస్‌ నుండి విడదీసిన ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి సంబంధించిన అంశాలున్నాయి.

jwalaఎస్సార్సీ నివేదిక ఆధారంగా 1956 నవంబర్‌ 1న అమలులోకి వచ్చిన కొత్త రాష్ట్రాల ఏర్పాటులో ఎ,బి,సి విభాగాలు లేకుండా అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన పాలనా పరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనే రెండు రకాల విభజనలు మాత్రం కొనసాగాయి.ఆ తర్వావాత పంజాబ్‌ నుంచి హర్యానాను విడదీసినప్పుడైనా, మధ్య ప్రదేశ్‌ నుంచి చత్తీస్‌ గఢ్‌ ను ఏర్పాటు చేసినప్పుడైనా, లేదా జార్ఖండ్‌, ఉత్తరాంచల్‌ విషయంలోనైనా ప్రస్తావనకు రాని ఎస్సార్సీ ఇప్పుడెందుకు రావాలి? ఏ ప్రయోజనం కొరకు ఆ అంశాన్ని ఎవరు లేవనెత్తుతున్నారు? ఉత్తర ప్రదేశ్‌ను విడదీసినా, విదర్భ ఏర్పాటు చేసినా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎస్సార్సీ వేయనక్కర లేనే లేదు!

************************************

అణు భయం
- సంపాదకీయం

భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం మరోసారి చర్చనీయాంశమైంది. ఇండోనేషియా ద్వీపకల్పంలోని బాలి వద్ద జరుగుతున్న ఆసియన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు అణు ఒప్పందం అమలుకు ఉన్న అడ్డంకులపై చర్చించారు. గత ఏడాది పార్లమెంటు ఆమోదించిన 'అణు (ప్రమాద పరిహార) బాధ్యతల బిల్లు'పై అమెరికా అణు వాణిజ్య కంపెనీలు అనేక అభ్యంతరాలు తెలిపాయి. భారత అణు వాణిజ్య నిబంధనలను వివరించడం ద్వారా ఆ కంపెనీలు వ్యక్తం చేసిన ఆందోళనలను ఉపశమింప చేశామని, వాటికి మరేదైన ప్రత్యేకమైన ఇబ్బంది కలిగితే భారతీయ చట్టాల పరిధిలోనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మన్మోహన్ సింగ్ తేల్చి చెప్పారు. అమెరికా కంపెనీల అభ్యంతరాల కారణంగా మూడేళ్ళ క్రితం కుదిరిన భారత-అమెరికా అణు ఒప్పందం అమలు బాగా అలస్యమైంది.

దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు, ప్రజలు అణు విద్యుత్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నప్పటికీ యూపీఏ ప్రభుత్వం అణు విద్యుత్ ఉత్పత్తిపై పట్టుదలతో ఉంది. ఇటు ప్రజలను, అటు విదేశీ అణు వాణిజ్య కంపెనీలను బుజ్జగించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ కొత్తగా ఏర్పరచే కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే అందుకు పరికరాలను, ఇంధనాన్ని సరఫరా చేసేవారు వహించవలసిన బాధ్యత గురించి వివాదం మొత్తం అపరిష్కృతంగానే మిగిలింది. భోపాల్ గ్యాస్ మారణహోమంలో యూనియన్ కార్బైడ్ కంపెనీ బా«ధ్యులను శిక్షించడంలోను, బాధితులకు తగిన నష్టపరిహారాన్ని ఇప్పించడంలోను కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దశాబ్దాలుగా పర్యావరణవేత్తలు, బాధిత ప్రజలు ఇప్పటికీ ఆ కంపెనీ బాధ్యులను శిక్షించాలని పోరాడుతూనే ఉన్నారు.

ఇలాంటి పారిశ్రామిక మారణహోమాలు జరిగినపుడు బాధ్యత ఎవరిదన్న అంశంపై దేశంలో చర్చ జరిగింది. నష్టానికి కారణమైన దేశ, విదేశీ కంపెనీలు నష్టపరిహారాలను పూర్తిగా చెల్లించేందుకు అనువైన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ ఒకటి. నష్టదాయక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న పరిశ్రమలను స్థాపించడాన్నే మౌలికంగా వ్యతిరేకించాలన్న మరో డిమాండ్ ముందుకొచ్చాయి. ఈ నే పథ్యంలో ప్రమాదాల నష్టపరిహారం పట్ల ప్రజల సంశయాలను, ఆందోళనలను ఉపశమింపచే సేందుకు అణు పరిహారాల చట్టం రూపొందింది. అణు ఒప్పందం అమలులోకి రాకపోవడం, ఇరాన్‌తో స్నేహ సంబంధాలు, యునెస్కో సభ్యత్వం విషయంలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటువేయడంలాంటి అనేక విషయాలపై భారత్ పట్ల అమెరికా గుర్రుగా ఉన్న విషయం మాల్దీవుల్లో జరిగిన సార్క్ సమావేశం సందర్భంగా బయటపడినపట్లు మీడియా కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలను బుజ్జగించేందుకు అణు పరిహార చట్టంలోని నిబంధనలను ప్రభుత్వం సడలించింది. అణు సరఫరాదారులపై అలివిగాని, అపరిమితమైన బాధ్యతను మోపబోమని ఆయన స్పష్టం చేశారు. దాంతోపాటు అణు ఒప్పందంలో భాగంగా అనుబంధ నష్టపరిహారంపై ఒడంబడిక (సిఎస్‌సి)కు అంగీకరించాలన్న అమెరికా షరతు పట్ల ప్రధాని తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. నోటిఫై చేసిన నిబంధనల్లో అధిక శాతం అణు వాణిజ్య సంస్థలకు అనుకూలంగానే ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అణు సరఫరాదారులకు పూర్తి వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం చట్టంలోని కొన్ని నిబంధనలను సడలించి కొత్తవాటిని నోటిఫై చే సింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక అణు కేంద్రాల్లో ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో నాసిరకమైన అణు పరికరాలను సరఫరా చే సినపుడు ఘోర ప్రమాదాలు జరిగే ప్రమాదముంది. అణు పరిహారం చట్టంలోని సెక్షన్ 46ప్రకారం ప్రమాదాలు సంభవించినపుడు పరికరాలు సరఫరా చేసిన సంబంధిత కంపెనీపై సాధారణ పౌరుడు సైతం కేసు వేసేందుకు హక్కు ఉంటుంది. అదే సమయంలో అణు సరఫరాదారే ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ సెక్షన్‌ను అమెరికా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అణు సరఫరాదారులపై పూర్తి బా«ధ్యత లేకపోతే నాసిరకం పరికరాలను సరఫరా చేసి, సదరు కంపెనీలు చేతులు దులుపుకునే అవకాశం ఉంది. భోపాల్ దురంతంలో లాగా సంబంధిత కంపెనీలను శిక్షించేందుకు బాధితులకు ఎలాంటి హక్కు లేకుండా పోతుంది. ఈ సెక్షన్ వల్ల భయంతోనైనా అనివార్యంగా నాణ్యమైన పరికరాలను సరఫరా చేస్తాయి.

ప్రమాదాలు తలెత్తితే సరఫరాదారులపై భారత్ నిర్వాహకులకు న్యాయపోరాటానికి వెసులుబాటు కల్పించే 17 (బి) సెక్షన్‌కు కూడా అమెరికా అభ్యంతరం చెబుతోంది. ఆ హక్కులను కాలరాస్తే ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో ప్రభుత్వం ఈ సెక్షన్లను జోలికి పోలేదు. లిఖితపూర్వక కాంట్రాక్ట్ ద్వారా బాధ్యతలను అంగీకరించిన సరఫరాదారును శిక్షించే సెక్షన్ 17 (ఎ)కు 'ఉత్పత్తుల బాధ్యతా వ్యవధి' అనే అంశాన్ని జోడించడం ద్వారా ఆ నిబంధనకు సర్కారు తూట్లు పొడిచింది. ఉత్పత్తుల బాధ్యతా వ్యవధి అన్న సవరణ ప్రకారం అణు పరికరాల సరఫరా సంస్థలు తమ పరికరాల ద్వారా తొలి ఐదేళ్ళలో ప్రమాదాలు తలెత్తినపుడు మాత్రమే నష్టపరిహారం 1,500 కోట్ల రూపాయల చెల్లించవలసి ఉంటుంది.

అయితే గత ఏడాది మార్చిలో జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో సంభవించిన ప్రమాదం రియాక్టర్లను నిర్మించిన 30 ఏళ్ళ తర్వాత జరిగింది. అదే విధంగా రష్యాలో చెర్నోబిల్, అమెరికాలో త్రీమైల్ ఐలాండ్, ఫ్రాన్స్‌లలో కూడా ఆయా రియాక్టర్లు నిర్మించిన చాలా కాలానికి గాని అణు ప్రమాదాలు జరగలేదు. ప్రమాదరహితమైన వస్తువులు, యంత్రాలు లేదా వస్తువులు చెడిపోతే పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే డబ్బు రూపంలో నష్టం ఉంటుంది. అదే ప్రాణాంతక పరికరాల విషయంలో అలాంటి బాధ్యరాహిత్యం తగదు. అణు విద్యుత్తు ఉత్పత్తి కంటే వాటి వ్యర్థాల నియంత్రణ మరింత క్లిష్టమైనది.

అవి నాసిరకమైనవి అయినా, కాకపోయినా వాటి నిర్మాణ, నిర్వహణలు బాధ్యతలు తగు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సదరు అణు సరఫరాదారులు మాత్రమే జీవితకాలం బాధ్యత పడక తప్పదు. ఆ పరిజ్ఞానం కొరవడిన మనలాంటి దేశాలలో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. భోపాల్ గ్యాస్ ప్రమాదం ఆ ప్రాంత ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తోంది. ఇప్పటికీ అక్కడ జీవజాలం ప్రత్యుత్పత్తి లోపభూయిష్ఠంగానే ఉంది. అలాంటిది అణు ప్రమాదాల ప్రభావ ం తీవ్రత, విస్తృతి, వ్యవధుల్లో చాలా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని అమెరికా అణు కార్పొరేట్ సంస్థల స్వార్ధానికి బలి ఇచ్చినట్లవుతుంది.

జైతాపూర్‌లో ప్రయోగాత్మక దశలో ఉన్న ఫ్రాన్స్ అణు రియాక్టర్లను ను, తమిళనాడు కూడంకుళంలో వెనకబడ్డ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రష్యా రియాక్టర్లను ఉపయోగిస్తున్నారు. జైతాపూర్ ఉద్యమంపై కేంద్రం ఉక్కు పాదం మోపితే, కూడంకూళంలో ప్రజలను బుజ్జగిస్తోంది. దేశ, విదేశాల్లో జరిగిన ఇలాంటి అనేక ప్రాణాంతక, పర్యావరణహరణ సంఘటనలు, నష్టపరిహారాలు, నివారణల్లో తలెత్తిన లోపాల నేపథ్యంలో జైతాపూర్, కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాల స్థాపనకు వ్యతిరేకంగా ప్రజలు పర్యావరణవేత్తలు ఉద్యమిస్తున్నారు.

జపాన్ ప్రమాదం జరిగిన వెంటనే జర్మనీ, స్విట్జర్లండ్ దేశాలు తమ అణువిద్యుత్ విస్తరణ కార్యక్రమాలకు స్వస్తి చెబితే, మన ప్రభుత్వం మాత్రం అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం ఉవ్విళ్ళూరుతోంది. అణు శక్తి మంచి చెడ్డల వివాదం, చర్చలు ఏమైనప్పటికీ అణు ఒప్పందం చేసుకోవడం నుంచి, అణు పరిహారాల బాధ్యత ల చట్టానికి తూట్లు పొడవడం దాకా కేంద్రం లోపాయికారిగా వ్యవహరిస్తుండడంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి. దేశ, విదేశీ కార్పొరేట్ శక్తుల భవిష్యత్ పారిశ్రామిక ప్రయోజనాలకు భిన్నంగా ప్రజలు, పర్యావరణం భద్రత పునాదిగా అంతర్జాతీయ అనుభవాల నేపథ్యంలో ఒక జాతీయ అణుశక్తి విధానాన్ని రూపొందించాలి. 
************************************************************************
బతుకంతా దేశానిది!



తన‘గొడవ’ను సమస్త మానవాళి వేదనగా వినిపించిన కారుణ్యమూర్తి ఆయన. ఉద్యమం, కవిత్వం
రెండింటినీ రాజ్యంపై ధర్మయుద్ధానికి ఆయుధాలుగా వినియోగించిన సమరశీలి. వీర తెలంగాణ
నాదే, వేరు తెలంగాణ నాదే అంటూ ఆఖరి శ్వాస వరకూ ప్రజల ఉద్యమానికి ప్రతినిధిగా నిలిచారు.
ఆయనే కాళన్నగా ప్రసిద్ధుడయిన కాళోజి నారాయణరావు. ఆయన కన్నుమూసి తొమ్మిదేళ్లు
కావొస్తోంది. మార్కెట్‌లో కాళన్న పుస్తకాలు దొరకడం లేదు. ఆయన్ను యాదుంచుకునే తరీకా ఇదేనా?

కథలూ, కవిత్వం, అనువాదాలూ చేసిన రచయితగానే కాకుండా ప్రజా ఉద్యమకారుడిగా స్వాతంత్య్రానికి పూర్వం అటు నిజాం పాలన కూ, ఆ తరువాత ఏర్పడ్డ ప్రభుత్వాలకూ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన వ్యక్తి, ఉద్యమశక్తి కాళోజి నారాయణరావు. ఆర్యసమాజ్, ఆంధ్ర మహాసభ, క్విట్టిండియా, కమ్యూనిస్టు ఉద్యమాలతో మమేకమై స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన సాహసి. ఇరవయ్యేళ్ల వయసులోనే హైదరాబాద్‌లో వెల్దుర్తి మాణిక్యరావు, వెంకటరాజన్న అవధానులతో కలిసి ‘వైతాళిక సమితి’ని ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా సాహిత్య సృజన చేయడమే గాకుండా, సమాజ సేవకు కృషి చేశారు. ‘వైతాళిక సమితి’ పేరిటనే ‘గోలకొండ’ పత్రికలో వీరి రచనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.

ఒంటూపిరి మనిషైన కాళోజి అన్యాయం చేసే వారు ఎంతటి వారైనా, ఏ పదవిలో ఉన్నా నిలదీయడం మానలేదు. పౌరహక్కులకు ఎక్కడ భంగం కలిగినా బాధ్యతగా బాధితుల పక్షం నిలిచాడు. ఎక్కడ ప్రగతిశీల సమావేశం జరిగినా హాజరై ప్రజల పక్షాన నిలిచిన మానవతావాది. తెలంగాణ భాషలోనే ప్రజల గోసను వినిపించిన కాళోజి తన కవిత్వంలో ద్రోహులెవ్వరినీ విడిచి పెట్టలేదు. అన్నీ తానే అయి అన్న రామేశ్వరరావు కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు జీవితాంతం ఉద్యమాలకు బాసటగా నిలిచాడు.

ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెబుతూ తన అక్షరాయుధాలను సంధించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ను ఆహ్వానించినా కొన్ని పరిణామాల తరువాత 1969 నాటికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమబాటను ఎంచుకున్నారాయన. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కవులంతా కలిసి ఎంత కవిత్వాన్ని సృష్టించారో తానొక్కడూ అంత కవిత్వాన్ని సృష్టించారు. ఆనాటి ప్రభుత్వం మీద, కాసు బ్రహ్మానందరెడ్డి మీద, ఇందిరాగాంధీలపైనా రాసిన కవిత ఒక్కొక్కటి ఒక్కొక్క కరవాలపు వేటు. చిన్న చిన్న పదాల్లో అనల్పమైన అర్థాల్ని పలికిస్తూ పదాల తూటాల్ని కంటకుల గుండెపైకి ఎక్కుపెట్టేవాడు.

కాళోజి కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ బిరుదుతో గౌరవించింది. శాసనమండలి సభ్యునిగా కూడా ఆయన పని చేశారు. ప్రతిఘటనే దారిగా ఎంచుకున్న కాళన్న కవిత్వం, ఆచరణ తెలంగాణపై చెరగని ముద్ర వేసింది. ఓరుగల్లు కేంద్రంగా తెలుగునేల అంతటా పరుచుకున్న నిలదీత, ఎదురీత రణన్నినాదం కాళోజి. ట్యాంకుబండ్‌పై ఇప్పటికైనా ఆయన విగ్రహం నెలకొల్పాలి. అందుబాటులో లేకుండా పోయిన ఆయన ఆత్మకథ ‘ఇదీ నా గొడవ’ను పునర్ ముద్రించాలి. శతజయంతి(2013)నాటికి ఆయన రచనలన్నింటినీ అచ్చురూపంలోకి తేవాలి.

- సంగిశెట్టి శ్రీనివాస్
(నవంబర్ 13 కాళోజి వర్ధంతి)


మనిషి ఎంత మంచివాడు!

మనిషి ఎంత మంచివాడు
చనిపోయిన వాడి చెడును
వెనువెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు
మనిషి ఎంత చెడ్డవాడు
బ్రతికివున్న మనిషిలోని
మంచినెపుడు గుర్తించడు
చెడును వెతికి కెలుకుతాడు
- కాళోజి

No comments:

Post a Comment