Tuesday, September 27, 2011


పైన పటారం - లోన లొటారం


"మొనగాళ్ళకు మొనగాడిని నేనే, అన్నింట్లో నేనే ఉత్తముడిని" అని ఇంతకాలం ఊదరగొడుతున్న  బ్రిటన్ బండారం బయటపడింది. గత కొన్ని వారాలుగా బ్రిటన్ అల్లర్లతో అట్టుడికింది.  ఉత్తర లండన్ శివారు ప్రాంతం "టోటన్ హాం" లో మొదలైన అల్లర్లు చిలికి చిలికి గాలివానగా మారి బర్మింగ్ హాం, మాన్చేస్టర్ , లివర్పూల్, నటింగ్ హాం, బ్రిస్టల్ వంటి పెద్ద పట్టణాలకు వ్యాపించాయి. మార్క్ డగ్గన్ (29) అనే నల్ల జాతీయుడిని పోలీసులు అతి దగ్గర నుండి కాల్చి చంపడం ఈ అల్లర్లకు అసలు కారణం. ఎంతో కాలంగా (మార్గరెట్ థాచర్ కాలం నుండి) అణగద్రోక్కబడి, చిన్న చూపుకు గురైన వర్గాల వారు పై సంఘటనతో రెచ్చిపోయి వీధులకెక్కారు. లండన్ ఎప్పుడూ ఎరుగనంత దారుణంగా దౌర్జన్యాలకు లోనైంది.  భవనాలకు నిప్పు పెట్టడం, షాపుల లూటీలు, దారిన పొయ్యే వారిపై దాడులు జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత స్కాట్లాండ్ పోలీసులు సైతం అదుపు చేయలేనంతటి స్థాయిలో గొడవలు జరిగాయి. ఐదు రోజుల పాటు లండన్లో అరాచకత్వం రాజ్యమేలింది. ఈ మాట మనమనడం లేదు. లండన్లోని బారిస్టర్లే  అంటున్నారు. చివరికి అమెరికా పోలీసు అధికారి ఐన బిల్ బ్రాటన్ సేవలు వినియోగించుకోవాలని బ్రిటన్  ప్రధాని ప్రతిపాదించ వలసి వచ్చింది.  అల్లర్లలో అయిదుగురు మరణించినట్లు, 2,200 మందికి పైగా అరెస్టయినట్లు  వార్త. పోలండు నుంచి వచ్చి లండన్ లో నివాసం ఉంటున్న మోనికా కోన్ జైక్ అనే మహిళ తనను తాను రక్షించుకోవడానికి ఎత్తైన భవనం పై నుండి రోడ్డు మీదికి దూకింది. తరువాత పత్రికల వారితో మాట్లాడుతూ -"లండన్ అంటే ఏమో అనుకున్నాను, అంతా అపోహేనని తేలిపోయింది. ఇక్కడి సమాజం కుళ్ళి పోయింది" అని అన్నది. 

కొసమెరుపు : బ్రిటన్లో సిక్కువారు నిర్వహిస్తున్న టివి చానెల్ 'సంగత్' వారి వీడియోల సహాయంతో పోలీసులు దుండగులను పట్టుకున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సిక్కులను, వారి టీవిని మెచ్చుకున్నారు.  
- ధర్మపాలుడు  






మార్చిన పాపం మారన్‌దే
స్పెక్ట్రమ్ ధరల నిర్ణయమే తమకు ఆధారమన్నారు
అది తమ శాఖలో అంతర్భాగమన్నారు

మంత్రుల సంఘం పరిధి నుంచి తప్పించాలని పట్టుబట్టారు
నష్టం ఉండదనే ఒప్పుకొన్నా.. 2జీపై నోరువిప్పిన ప్రధాని
ప్రత్యేక విమానంలో, సెప్టెంబర్ 27: టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ కోరిక మేరకే స్పెక్ట్రమ్ ధరల నిర్ణయాన్ని మంత్రుల సంఘం పరిధి నుంచి తప్పించినట్లు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ అంగీకరించారు. స్పెక్ట్రమ్ ధరల నిర్ణయాన్ని మంత్రుల సంఘం పరిధిలోకి చేరుస్తూ తొలుత ఒక ముసాయిదాను రూపొందించినమాట వాస్తవమేనని వెల్లడించారు. న్యూయార్క్ నుంచి తిరిగి భారత్‌కు తిరిగి వస్తున్న ఆయన.. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"ఆ ముసాయిదాకు మారన్ అభ్యంతరం తెలిపారు. స్పెక్ట్రమ్ ధరల నిర్ణయమే ఆర్థికంగా తమ శాఖకు ఆధారమని చెప్పారు. తమ శాఖ నిబంధనల్లో అది అంతర్భాగమన్నారు. దానికి సంబంధించిన సాంకేతిక, సంక్లిష్టమైన అంశాలను పెద్దసంఖ్యలో ఉన్న మంత్రులు ఉన్న బృందం ఇక్కడ కూర్చుని సమర్థంగా పరిష్కరించలేదని చెప్పారు'' అని ప్రధాని వివరించారు. స్పెక్ట్రమ్ ధరలకు సంబంధించిన అంశాలను ఆర్థిక, టెలికం శాఖలు చర్చించుకోవాలని 2003లోనే కేబినెట్ తీర్మానం చేసిన విషయాన్ని మారన్ గుర్తు చేశారని తెలిపారు.

ఆయా శాఖలపై ఆధారపడి మారన్ వాదనతో ఏకీభవిస్తే వచ్చే నష్టమేమీ ఉండదని తాను భావించినట్లు చెప్పారు. ఇదంతా 2006లో జరిగిందని, అప్పట్లో అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ కంటే లైసెన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వ దృష్టి అంతా స్పెక్ట్రమ్ నిర్వహణకు రక్షణ శాఖను ఎలా ఒప్పించాలి? పౌర ఆర్థిక వ్యవస్థకు స్పెక్ట్రమ్‌ను ఎలా వినియోగించాలి? అన్నదేనని వివరించారు. అలాగే, ప్రభుత్వాన్ని అస్థిరపరచి, 'బలవంతం'గా ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చేందుకు ప్రతిపక్షం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని మన్మోహన్ ఆరోపించారు.

అయితే, తన ప్రభుత్వం నిలబడుతుందని, ఐదేళ్లూ అధికారంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. తొమ్మిది శాతం జీడీపీ రేటు సాధించేందుకు వీలుగా ముఖ్యమైన ఆర్థిక బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకూ ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత రీటెయిల్ రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తామని చెప్పారు. అధికారం కోసం ప్రతిపక్షం తీవ్ర అసహనంతో ఉందని ఆరోపిస్తూనే.. సహనంతో ఉండాలని హితవు పలికారు. ప్రణబ్ నోట్ విడుదల తర్వాత తన కేబినెట్‌లో ఎటువంటి విభేదాలూ లేవని చెప్పారు.

తన ప్రభుత్వం విషయంలో కొన్ని అపోహలు ఉండి ఉండవచ్చని, వాటిని సరి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని అంగీకరించారు. మన రాజకీయాన్ని అస్థిర పరిచేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. "ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు (2జీ తదితర కుంభకోణాలన్నీ) గత ఎన్నికలకు ముందే వచ్చి ఉండాల్సిందని ప్రతిపక్షం కోరుకుంటోంది. కానీ, అలా జరగలేదు. ఎన్నికల్లో వాళ్లు ఓడిపోయారు. మేం గెలిచాం.

అందుకే, మన దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని నేను అనుమానిస్తున్నాను'' అని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్నే కాకుండా ద్రవ్యోల్బణం వంటి ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగలదని, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఎటువంటి చర్యలు తీసుకోబోమని వివరించారు. "ప్రజలు మాకు ఐదేళ్లకు అధికారం ఇచ్చారు. మీరు ఇంకో రెండున్నరేళ్లు ఆగాల్సిందేనని పార్లమెంటులోనే చెప్పాను. కానీ, మా ప్రభుత్వంలో కొన్ని లొసుగులు వాళ్లకు తెలిశాయి.

వాటితో ముందస్తు ఎన్నికల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇది సరికాదు. మేం ఐదేళ్లూ ఉంటాం. ఆ తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. మీరే ఆశ్చర్యపోతారు'' అని వ్యాఖ్యానించారు. మంత్రుల్లో ఎటువంటి విభేదాలు లేవని పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రభుత్వ డిమాండ్‌పై మన్మోహన్ స్పందిస్తూ.. న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.





నాయకత్వపుస్థాయి వైపే మొగ్గు

ఒకప్పుడు విద్యార్హతలకే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే సంస్థలు ప్రస్తుతం తమ విధానాన్ని మార్చుకుంటున్నాయి. అర్హతలతోపాటు నాయకత్వ లక్షణాలూ ఉండాలని కోరుకుంటున్నాయి. అవి ఉన్నవారికే అవకాశాలు ఇస్తున్నాయి. విద్యార్హతల పరంగా అవకాశాలు కల్పించినా నాయకత్వ స్థాయి ఏర్పడే విధంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్హతలతోపాటు నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న వారికి అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఒక అవకాశాన్ని సొంతం చేసుకోగానే ఇక తమ కర్తవ్యం నెరవేరిందని భావించే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ప్రమోషన్లు కొట్టాలి. విజయవంతమైన నాయకుడిగా ఎదగాలి. ఇవేగాక ఇంకా ఉన్నతమైన లక్ష్యాలవైపు నేటి యువత మొగ్గు చూపుతోంది. నాయకుడంటే వెంటనే తయారైపోతారనుకోవద్దు. ఎంతో అవగాహన, అనుభవం, నైపుణ్యం అవసరం. వాటితోపాటు అందుకు తగిన వాక్చాతుర్యం, నేర్పు, ఓర్పు అన్నీ ఉండాలి. విజయాలకే కాదు. అపజయాలకూ ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం నిండుగా వుండాలి. ప్రస్తుతం పలు సంస్థలు అలాంటి వారికే బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ తీవ్రమైన ఒత్తిడికి గురికాకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలిగే సత్తావుండాలి. సానుకూల దృక్పథంతో ఆలోచించగలగాలి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారే నాయకుడిగా ఎదుగుతారు. సంస్థ పురోభివృద్ధికి తోడ్పడుతారు.
రెండు చేతులూ కలిస్తేగానీ చప్పట్లు రావన్నట్లు సంస్థలో విజయం ఏ ఒక్కరివల్లా సాధ్యం కాదు. సమిష్టి కృషివల్లే అది సాధ్యమవుతుంది. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎంత సామర్థ్యంగల టీమ్‌ లీడరైనా సభ్యులతో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా వ్యవహరించగలగాలి. అంతేకాదు, క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ముఖ్యమైనవి. సమయపాలన లేని వారు విజయాలు సాధించలేరు. నాయకుడు ప్రణాళికను పక్కాగా అనుసరించి పదిమందికి ప్రేరణ కలిగించేవాడై ఉండాలి. వీటిని ప్రదర్శించే సమయంలో సిబ్బందికి ఏ విధమైన ఇబ్బందీ కలిగించనప్పుడే మీరు మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. ఈ లక్షణాలలో సానుకూల దృక్పథం అలవడుతుంది.
నాయకుడు అనేవాడు గొప్ప వ్యూహకర్తగా ఉండాలి. దూరదృష్టి కూడా ఉండాలి. సమస్యలు గుర్తిచడంతోపాటు వాటిని పరిష్కరించే సమయంలో వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. అదే సమయంలో టీమ్‌ సభ్యుల, సహచరుల వ్యూహాలనూ కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించి అవసరమైతే స్వీకరించాలి. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.
నాయకుడైనంత మాత్రాన అదేదో గొప్ప పదవిగా ఊహించుకొని ఇతర సభ్యులను నిర్లక్ష్యం చేయకూడదు. అసలు తాము ఆ స్థితికి రావడానికి గల కారణాలు ఎప్పుడూ మరచి పోకూడదు. ఇంకా ఎదుగుతూ, ఇతరుల ఎదుగుదలకు తోడ్పడాలి. అదే సందర్భంలో ఎప్పటికప్పుడు మీ బలం, బలహీనతలను బేరీజు వేసుకోవాలి. తమ బలహీనతలను టీమ్‌ సభ్యులపై రుద్దకూడదు. వాటికి కారణాలు పరిశీలించి లోపాల్ని సరిదిద్దుకోవాలి. ఇది కూడా నాయకత్వ లక్షణాల్లో ప్రధానమైంది.
మీలోనూ నాయకత్వ స్థాయికి ఎదగాలనే ఆలోచన వుందా? అయితే ముందు అధ్యయనం అవసరం. పరిస్థితులను అవగతం చేసుకోవడం అంతకన్నా అవసరం. తోటివారితో కలిసి పనిచేయడం, పనిలో భాగస్వాములు కావడం అత్యవసరం.... అదికూడా డామినేటింగ్‌గా కాకుండా, సహచరునిగా కలిసిపోవడంతోనే అది సాధ్యం! 

Monday, September 26, 2011








ఉద్రిక్త ఉద్యమం
అట్టుడికిన హైదరాబాద్
రోజంతా దండయాత్రలు
9 నుంచి మళ్లీ రైల్‌రోకో

భౌతిక దాడులు.. రవాణా అదనపు కమిషనర్‌ను కొట్టిన టీఆర్ఎస్‌వీ నేత, ఇతరులు
పిల్ వేసిన న్యాయవాదిపై హైకోర్టులో దాడి.. ఎమ్మార్ కార్యాలయంలో విధ్వంసం
కరెంటు కోతకు నిరసనగా విద్యుత్ సౌధ ముందు నడిరోడ్డుపై నేతల ధర్నా
సచివాలయంలో సీఎం బ్లాక్ ముందు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల బైఠాయింపు

అధికారులపై ఒత్తిళ్లను సహించం
బలవంతపు 'ఆదేశాలు' చెల్లవు
దాడి చేసిన వారిపై కేసులు.. సీఎం ఆదేశం
రక్షణ కల్పించాలని ఏపీఎన్జీవో వినతి
సర్కారుపై సొంత పార్టీ నేతలు గరంగరం
ధర్నాల్లో మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
ముఖ్యమంత్రి లక్ష్యంగా మాటల తూటాలు
ఆయనకు అంత అహంకారమా: కోమటిరెడ్డి
ఉద్యోగులపై చెయ్యేస్తే సీటు గల్లంతే: యాష్కీ
సానుకూలత రాకుంటే వేరుకుంపటి: దామోదర్
ఆజాద్‌కు సీఎం ఫోన్.. పరిష్కారానికి వినతి
అంతా మేడమ్ చేతిలోనే అన్న ఇన్‌చార్జి
నేడు తెలంగాణ ఆలయాల్లో ఆర్జిత సేవలు బంద్
కాంగ్రెసోళ్లను బతకనీయొద్దు అధికారులపై కాదు.. సిగ్గూ శరం లేని నాయకులపై దాడి చేయండి: కేసీఆర్
మరింత ఉధృతం
సెప్టెంబర్ 27: తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు.
సెప్టెంబర్ 28: హైదరాబాద్‌లో వందకుపైగా కేంద్రాల్లో రాస్తారోకోలు.
సెప్టెంబర్ 29: విద్యుత్ కోతలపై ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి.
సెప్టెంబర్ 30: హైదరాబాద్ బంద్.
అక్టోబర్ 1: కాగడాల ప్రదర్శన.
అక్టోబర్ 2: టోల్ గేట్ల వద్ద ఫీజు చెల్లించకుండా ప్రయాణం.
అక్టోబర్ 3: చెరువుల వద్ద తెలంగాణ నినాదాలతో బతుకమ్మ పండుగ. అక్టోబర్ 6: 'దశకంఠ కాంగ్రెస్' దిష్టిబొమ్మల దహనాలు.


ఉద్యమం ఉద్వేగంగా సాగుతోంది. మెల్లమెల్లగా ఉద్రిక్తంగానూ మారుతోంది. ఒకే రోజు ఐదు సంఘటనలు రాజధాని నగరాన్ని 'గరంగరం'గా మార్చాయి. మరోవైపు రాజకీయమూ వేడెక్కింది. తెలంగాణ ఉద్యమకారులకు ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి టార్గెట్‌గా మారారు. సకల సమ్మె త్వరలో సడలిపోయే అవకాశం ఉందని అధిష్ఠానానికి నివేదించిన కిరణ్‌పై సొంత పార్టీ నేతలే విమర్శల బాణాలు గుప్పిస్తున్నారు. దీంతో తాను ఏ నివేదికా పంపలేదని వివరణ ఇచ్చుకున్న కిరణ్.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌తో ఫోన్‌లో మాట్లాడి తెలంగాణ సమస్యను సత్వరం పరిష్కరించాలని విన్నవించుకున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 26 : పదమూడు రోజులుగా ఉధృతంగా, ఉద్వేగంగా సాగిన సమ్మె... సోమవారం తొలిసారిగా 'ఉద్రిక్తం'గానూ జరిగింది. రవాణా శాఖలో అదనపు కమిషనర్ శ్రీనివాస్‌పై నేతల సమక్షంలోనే ఉద్యమకారులు చేయి చేసుకున్నారు. సకల సమ్మెపై వ్యాజ్యం వేసిన న్యాయవాది క్రిష్ణయ్యపై హైకోర్టు ఆవరణలో తెలంగాణ లాయర్లు దాడి చేశారు. ఎమ్మార్ కార్యాలయంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. తెలంగాణలో విద్యుత్ కోతలపై విద్యుత్ సౌధ ముందు నడి రోడ్డుపై నేతలు ధర్నా చేశారు.

సచివాలయంలోనూ సీఎం కార్యాలయం ముందు బైఠాయించారు. ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఈ ఘటనలతో నగరం దద్దరిల్లింది. మరోవైపు... సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ ఉద్యోగులపై సర్కారు తీసుకుంటున్న చర్యలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. నోటీసులు జారీ చేసిన ఉన్నతాధికారులకు సోమవారం ఉద్యమ సెగ తగిలింది. అటు రవాణా శాఖలో, ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని కాంట్రాక్ట్ సిబ్బందికి జారీ చేసిన నోటీసులను నేతలు దగ్గరుండి ఉపసంహరింపజేశారు.

ఎమ్మార్, హైకోర్టుల్లో మినహా... విద్యుత్ సౌధ, రవాణా శాఖ కార్యాలయం, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసు, సచివాలయంలో బైఠాయింపు ఘటనల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కేటీఆర్ తదితరులతోపాటు... అధికార పక్షానికి చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా పాల్గొన్నారు. అధికారపక్ష నేతలు సీఎంని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు ప్రయోగించారు.

"ఒక మంత్రిగా సచివాలయంలోని సీఎం బ్లాక్ ముందు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరించడం తగదు. ఆయనకు అంత అహంకారం పనికిరాదు'' అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు ఏం జరిగినా సీఎం ఒక్క క్షణం కూడా సీటులో కూర్చోలేరని మధు యాష్కీ హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఏ ఒక్క ఉద్యోగిపై వేటు పడినా సర్కారును నడవనివ్వబోమని ఎంపీ రాజయ్య అన్నా రు. సమ్మె సడలుతోందంటూ తాను ఎలాంటి నివేదికనూ పంపలేదని సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. 'కళ్లముందు సమ్మె ప్రభావం కనిపిస్తుండగా లేదని ఎలా చెబుతాను?' అని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు ఫోన్ చేసి సకల జనుల సమ్మె పరిస్థితి గురించి వివరించారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మరోవైపు... తెలంగాణ నేతలు బృందాల వారీగా ఢిల్లీకి వెళ్తున్నారు. సీనియర్ నేతలు కేకే, మంత్రి జానారెడ్డి సోమవారం ఆజాద్‌తో చర్చించారు. మంగళవారం 22 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. మహిళా మంత్రులు బుధవారం వెళ్తున్నారు. కేంద్రం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోకుంటే కొత్త పార్టీ పెట్టుకుంటామని మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి హెచ్చరించారు.

ఉద్యమ కార్యాచరణ...
తెలంగాణ జేఏసీ మంగళవారం నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. 9, 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు రైల్‌రోకో జరుపుతామని తెలిపింది. అవసరమైతే నిరవధిక రైల్ రోకో నిర్వహిస్తామని టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రకటించారు. "దాడులు చేయాల్సింది ఉద్యోగులపైకాదు. సిగ్గూ శరం, చీమూ నెత్తురు లేని తెలంగాణ రాజకీయ నాయకత్వం మీద దాడి చేయాలి. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను బతకనీయొద్దు. వారిని ఎక్కడా తిరగనివ్వొద్దు'' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఉద్యమంలో భాగస్వాములైన తెలంగాణ అర్చకులు మంగళవారం యాదగిరి గుట్ట, భద్రాచలం, వేములవాడ తదితర దేవస్థానాల్లో ఆర్జిత సేవలను నిలిపివేయనున్నారు. టికెట్లు, గదుల జారీ నిలిపివేస్తామని... భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తామని ఆలయ ఉద్యోగులు ప్రకటించారు. ఇక... తెలంగాణ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లకు భద్రత కల్పించలేమని 'లొకేషన్' మార్చుకోవాలని నిర్మాతలకు పోలీసులు సూచిస్తున్నారు.

ఇక... సకల జనుల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘంతో, సీనియర్ అధికారులతో సీఎం సమీక్షించారు. అధికారులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని ఆదేశించారు. అధికారులను భయపెట్టి జారీ చేయించే ఉత్తర్వులు చెల్లబోవని స్పష్టం చేశారు. ఇక... సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత కల్పించాలంటూ ఏపీఎన్జీవో నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని కలిసి కోరారు.






సమ్మె సాగించుడే
ఉద్యమం.. మరింత ఉధృతం
భవిష్యత్తు కార్యాచరణ వెల్లడించిన జేఏసీ
30న హైదరాబాద్ నగర బంద్

అక్టోబర్ 9,10,11 తేదీల్లో రైల్‌రోకో
సీమాంధ్ర బస్సుల్లో ఎవరైనా వెళ్తే పరిణామాలకు
బాధ్యత మాది కాదు: కోదండరాం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 : సకల జనుల సమ్మెను కొనసాగించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం కోసం 14 రోజులుగా సకలజనులు సమ్మె చేస్తున్నా.. కేంద్రం నుంచి కనీస స్పందన రాకపోవటంతో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించింది. భవిష్యత్తు కార్యాచరణను జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్‌లో తెలంగాణ జేఏసీ ముఖ్యుల సమావేశం జరిగింది.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో మరో 15-20 రోజుల ఉద్యమ కార్యాచరణను ఖరారుచేశారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం వైఖరి 'నవ్విపోదురు గాక నాకేంటి..' అన్నట్లుగా ఉందని కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను కించపర్చేలా నడుపుతున్న సీమాంధ్ర బస్సులను వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ బస్సులను ఎక్కడికక్కడే ఆపుతామని.. ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పారు.

తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా సీమాంధ్ర బస్సులను నడిపినా.. వాటిలో ఎవరైనా ప్రయాణించినా జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమ్మెపై ఘాటుగా చేసిన విమర్శలపై కోదండరాం సూటిగా స్పందించకుండా.. "హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు. వారి యాత్ర సుగమంగా సాగాలి. వారికి మేం కూడా వీడ్కోలు పలుకుతాం. హజ్‌కి వెళ్లాక వారు తెలంగాణ కోసం మొక్కాలి'' అన్నారు. సమ్మెకు ప్రజలు సహకరించాలని, తెలంగాణకు పండుగలు కూడా లేకుండా చేస్తున్న కాంగ్రెస్‌ను గమనించాలని కోరారు.

బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను తెలంగాణకు అంకితం చేయాలని ప్రజలను కోరారు. కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో భాగస్వామ్య పార్టీల నేతలు కె.చంద్రశేఖర్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి (టీఆర్ఎస్), సీహెచ్ విద్యాసాగర్‌రావు, టి.రాజేశ్వర్‌రావు (బీజేపీ), పోటు సూర్యం, కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ), జేఏసీ కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కో-కన్వీనర్ రసమయి బాలకిషన్, సమన్వయకర్త పిట్టల రవీందర్, ఉద్యోగ, ఆర్టీసీ, ఉపాధ్యాయ, విద్యుత్, న్యాయవాదులు, వైద్యుల జేఏసీల నేతలు కె.స్వామిగౌడ్, డి.ఆనందం, పి.రవీందర్, రఘు, రాజేందర్‌రెడ్డి, డాక్టర్ నర్సయ్య, ఇతర ఉద్యోగ-ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

కార్యాచరణ ఇదీ..
27.09.2011: ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు. జేఏసీ భాగస్వామ్య పక్షాలన్నీ ఈ ర్యాలీలో పాల్గొంటాయి
28.09.2011: హైదరాబాద్‌లో 100కుపైగా కేంద్రాల్లో పెద్దఎత్తున రాస్తారోకోలు
29.09.2011: విద్యుత్ కోతలకు నిరసనగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
30.09.2011: హైదరాబాద్ నగరం బంద్
(తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రానికి విధించిన డెడ్‌లైన్ ముగిస్తున్న సందర్భంగా)
01.10.2011: కాగడాల ప్రదర్శన
02.10.2011: టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు చెల్లించకపోవడం
03.10.2011: బతుకమ్మ పండుగ రోజు చెరువుకాడ జై తెలంగాణ
06.10.2011: జమ్మిచెట్టు కాడ జై తెలంగాణ, రావణాసురుడి బదులు దశకంఠ కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనాలు
అక్టోబర్ 9, 10, 11: రైల్ రోకో

దళిత శకానికి నాంది పలికిన జాషువా
- ఎండ్లూరి సుధాకర్

చంద్రమండలం మీద నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాదమూనడం ఎంత అద్భుతమో తెలుగు సాహిత్యంలోకి జాషువా కాలు మోపడం కూడా అంతే అద్భుతం. జాషువా ప్రవేశంతో తెలుగు కవిత్వం ఒక వెలుగు మలుపు తిరిగింది.

20వ శతాబ్దాపు పూర్వార్థ భాగంలో ఒకవైపు భావకవులుంటే మరో వైపున సామాజిక భావ విప్లవాన్ని కోరుతూ నిలబడ్డ కవి జాషువా ఒక్కడే. భావకవుల ఉధృతిని తట్టుకుని నిలబడింది కూడా జాషువాయే. ఆ మాటకొస్తే చాలామంది భావకవుల్ని ౌఠ్ఛిట టజ్చిఛీౌఠీ చేయగలిగిన కవి జాషువా. బహుశా అందుకేనేమో 'వైతాళికులు'లో జాషువా కనిపించడు.

అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన కవి జాషువా. సమాజంలో కులీన వర్గాలు అట్టడుగు వర్గం పట్ల చూపే నిరాదరణకు బాల్యం నుంచి కూడా ఎదురు నిలిచి ప్రశ్నిస్తూ ముందుకు వచ్చిన కవి. తెలుగు సాహిత్యానికి సంబంధించి మొట్టమొదటి కవి. రాజాస్థానాల్లో సుఖంగా బ్రతికినంత కాలం బ్రతికి ఆ స్థానాల మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డ శతక కవుల కన్నా, మనుషుల్ని, సమాజాన్ని అసహించుకుని భక్తి మార్గంలోకి మళ్లీ సమాజంపై తిరుగుబాటు జెండా ఎత్తిన భక్త కవుల కన్నా జాషువా చేసిన తిరుగుబాటు, ప్రకటించిన నిరసన, ప్రతిఘటన ఉదాత్తమైనటువంటింది. న్యాయ సమ్మతమైనటువంటిది.

కులాహంకారం వల్ల ఎదుర్కొన్న తిరస్కారాలు, ఎదుర్కొన్న అవమానాలు ఆయన ప్రత్యేకంగా, విలక్షణంగా ప్రతిస్పందించడానికి కారణమైనా, సమాజానికి ఎదురు తిరిగి నిలవడంలో జాషువాది వ్యక్తిగత ద్వేషం కాదు. సమాజాన్ని విమర్శించడంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు. సామాజిక అసమానతల మీద నిరంతర పోరాటం జాషువాది. సంప్రదాయాల మీదా, మూఢాచారాల మీద హేతు రహితమైన భావాల మీద జాషువా నిర్భయంగా తిరగబడ్డాడు. రచనకుండే ప్రాథమిక ప్రయోజనాన్ని సాధించడంలో కూడా సఫలతను పొందింది జాషువాయే.

జాషువా పుట్టినప్పటి కాలం పాత కొత్తల మేలు కలయిక. పాత కులం మాత్రం పోలేదు. ఒక సాహిత్య సభలో ఆయనను చూసి... 'సభలోని కెట్టు జొరబడె
నభాగ్యు డీ నిమ్నజుం డటంచు దమలో
గుభ గుభలాడి తటాలున
సభికులు పదిమంది లేచి చనిరుద్ధురులై'
అకస్మాత్తుగా ఏర్పడిన ఈ వాతావరణంలోంచి జాషువా అవమాన భారంతో బయటపడ్డాడు.

గుండె తుకతుకా ఉడికిపోతున్నది. ఆ రాత్రి కంటి మీద కునుకు రాలేదు. 'కుకూలాగ్నింబలెన్ మానస గ్లానింగూర్చు పరాభవంబు సకలాంగ వ్యాప్తమై రోమ రోమానన్ వెచ్చని క్రొంబొగల్ గురియ.' జాషువా ఈ బాధలోంచి తేరుకోవడానికి కవిత్రయం రాసిన మహాభారత గ్రంథం చదవటం మొదలుపెట్టాడు. కుమారాస్త్ర ఘట్టం తీసి, కర్ణుడితో తనని అన్వయం చేసుకున్నాడు. కర్ణుడిలో తనను, తనలో కర్ణుడిని చూసుకున్నాడు. ఈ పరిణామ ఫలితమే తరువాత 'భారత వీరుడు' పేరుతో కర్ణుడిపై అద్భుతమైన పద్యాలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.

'నలత్రాచుంబలె వర్ణ భేదములు నాల్కల్ కాచు కాలంబునన్ వలచెన్ నన్ను కవిత్వ వాణి' అని చెప్పుకున్నాడు. వర్ణ భేదాలు ముమ్మరంగా ఉన్న రోజులలో కవిగా ఎదుగుతున్నప్పుడు సవర్ణ హిందువుల నిరాదరణకు గురికావల్సి వచ్చింది. 'పృథివీ సురులు దక్క నితర జాతులు, కైత లల్లరాదు నేర మంద్రు బుధులు' అని హెచ్చరించారు. అంతేకాదు- 'ధరణీ సురునిల్లాలిన్
చెఱ బట్టిన వారి కైతలల్లిన వానిన్
నరికిన పాపము లేదని
పురాణ యుగధర్మ సూత్రముల్ ఘోషించున్!'

అని మనుధర్మ శాస్త్రాల సూత్రాలు వల్లిస్తూ బెదిరించారు. జాషువా ఈ అననుకూల వాతావరణాన్ని ఛేదించుకున్నాడే తప్ప బెదిరిపోయి క్రుంగిపోలేదు.

'చక్కని కవితకు కులమే యెక్కువ తక్కువలు నిర్ణయించినచో, నింకెక్కడి ధర్మము తల్లీ?' అని ఈ భారత మాతను బాల్యంలోనే ప్రశ్నించాడు. మొదటి నుంచి కులం విషయంలో జాషువా తిరుగుబాటు తత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. బాల్యం నుంచి ఏ కుల భేదం వలన తన ఆత్మాభిమానం దెబ్బతింటూ వచ్చిందో, ఏ కుల భేదం తన వ్యక్తిత్వాన్ని బాకున క్రుమ్మినదో ఆ కుల భేదాన్ని తన వ్యక్తిగత ప్రవర్తనతో, కవితా కుఠారంతో ఎదుర్కొన నిశ్చయించాడు. 'గబ్బిలం' కావ్యం వెయ్యేళ్ల తెలుగు కవిత్వంలో విప్లవాత్మకమైన వస్తువు. ఒక గగుర్పాటు, ఒక ధిక్కారం. ఒక దళితుడిని కావ్య నాయకుడిగా, గబ్బిలాన్ని కావ్యాత్మ ప్రతీకగా ప్రవేశ పెట్టినాడు. తెలుగు సాహిత్యంలోనే కాదు, మొత్తం భారతీయ సాహిత్యంలోనే దళిత శకానికి నాంది పలికాడు.

ఆనాడు జాషువా విసిరిన నిప్పుకణిక ఇవాళ దళిత వాదపు కొలిమిగా మారింది. 'నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై' దేశాన్ని దహించేస్తాయని హెచ్చరించాడు. దేశ భక్తితో ఒళ్ళు మరచి దేశమాతను ఎంత ఘనంగా కీర్తిస్తాడో ఆవేదనలోంచి పుట్టిన ఆవేశంలో భరతమాతకు సైతం వాతలు పెట్టడానికి కూడా వెనుకాడడు.

గబ్బిలం అత్యంత శక్తివంతమైన కావ్యం. కసిలో వ్యంగ్యం, అణచివేతలో ఆగ్రహం, కన్నీటిలో వక్రోక్తి కవిత్వంగా గబ్బిలమై రూపుదాల్చింది. 'నాల్గు పడగల హైందవ నాగరాజు' బుసలకు దూరంగా ఎగిరిపడి, తరతరాల నుంచి తనను అణచివేసిన దురహంకారపు వ్యవస్థపై ఎదురు తిరిగి మూలాల్ని తవ్వి పోసిన ఆక్రోశమే గబ్బిలం. 'గబ్బిలం' కావ్యంతోనే తెలుగు కవిత్వంలోకి దళిత భావజాలం బలంగా పాదమూనింది. గబ్బిలం ఇవాళ దిక్సూచి. ఈనాటి దళిత చైతన్యాన్ని ఆనాడే దర్శించిన ద్రష్ట జాషువా- ఏ జాతికెంత వచ్చునొ
రాజత్వంబంత నాకు రావచ్చు గదా
నా జాతి యెత్తు కేతన
రాజంబున నీదుమూర్తి వ్రాయింతుఁజెలీ?
ఒకవేళ నిజంగా దళితులకు రాజ్యాధికారమే సంక్రమిస్తే గబ్బిలాన్ని దళిత కేతన చిహ్నంగా ఎగురవేస్తే జాషువా గబ్బిలానికి నిజమైన నిండు గౌరవం దక్కుతుంది. గబ్బిలం కావ్యాశయం నెరవేరుతుంది.

- ఎండ్లూరి సుధాకర్

Saturday, September 24, 2011


ప్రధానమంత్రిపై భ్రమలు కోల్పోయిన మధ్యతరగతి

Sun, 25 Sep 2011, IST    vvShare
-ఎస్‌.కె.మిట్టల్‌
మూణ్ణాళ్ళ ముచ్చట ముగిసింది. మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం తన సాలెగూటిలో తానే చిక్కుకుంది. అదిప్పుడు అసలైన పరీక్ష నెదుర్కొంటోంది. తనను బలపరచే ఒక కీలకమైన వర్గం మధ్యతరగతి. ఢిల్లీలో రాంలీలా మైదానంలో అన్నాహజారే నిరశన నేపథ్యం లో, తనకు దూరమైంది. యువసాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వీరే ఒకప్పుడు మన్మోహన్‌ను గొప్ప సంస్కరణవాదిగా ఒక పెద్ద హీరోగా ప్రశంసలు కురిపించారు. కొద్ది కాలం లోనే వారి కలలు కల్లలైపోయాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి ఆయనకున్న ప్రకాశాన్ని లాక్కుపోయాయి. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను ఆచరణ లోకి తెచ్చేవ్యక్తి ప్రతిష్ట మసకబారడం ప్రారంభ మైంది. యుపిఏకి చెందిన మంత్రివర్గ సభ్యులకు తమసొంత ఎజెండాలున్నాయి. ప్రభుత్వ, పార్టీ ప్రయోజనాలను గాలికొదిలేసి తమ స్వప్రయోజ నాలను చూసుకుంటు న్నారు. ఎల్లెడలాగందరగోళం నెలకొంటోంది. నిరసన కారులను అదుపుచేయడంలో పాలకుల ప్రయత్నాలు విఫలమౌతున్నాయి.
యువగాంధీ, ఆయన బృందం పరిస్థితిని అర్థం చేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. ఈ గందరగోళం నుండి బయటపడేందుకు అవసరమైన నాయకత్వాన్ని అందించలేకపోయారు. అత్యుత్సాహం గల ఈ నాయకత్వానికి సంక్షోభం నుండి బయటపడే మార్గం కనిపించలేదు. ఉద్యమనాయకత్వంలో చీలికలు తెచ్చే లేదా వారిలో కొందరిని దగ్గరకు చేర్చుకునే పాతపద్ధతులనే అనుసరించారు. యువరాజు చుట్టూ ఆయనకు ఆపాదించే గొప్పగొప్ప అంశాలు ఏమాత్రం తోడ్పడకపోగా ఒక మార్గాంతరాన్ని కనుగొనగలిగే రాజకీయ నాయకుడికుండాల్సిన ప్రాథమిక లక్షణాలు కూడా ఆయనకు లేవని స్పష్టమై పోవడంతో వారి కష్టాలు మరింతగా ఎక్కువైపోయాయి నాయకులు భారీ కటౌట్లు, ఎప్పుడూ కెమెరాలు ఉండడం, భారీ ప్రచారం తో తయారు కాలేరు. సాధారణంగా కనబడుతూ ప్రజలతో మమేకం కావడం విజ్ఞతతో వ్యవహరించడం నాయకత్వలక్షణం. కాంగ్రెస్‌లోని యువబృందం రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన వారు. వారికి పునాది మద్దతు లేదు. ప్రజానాయకులుగా ఎదిగే లక్షణాలు లేవు. రాజకీయరంగంలో వారు నిలదొక్కు కోవాలంటే, వారు ప్రజలవద్దకు వెళ్ళాలి, కష్టించి పనిచేయాలి. వారి ఆదరాభిమానాలు పొందాలి.
ఢిల్లీలో బాంబుపేలుళ్ళ సందర్భంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు వారికి సానుభూతి తెలి పేందుకు ఎప్పటిలాగే ముసలికన్నీరు కారుస్తూ వెళ్ళి నప్పుడు న్యూఢిల్లీ హాస్పిటల్‌ వద్ద రాహుల్‌గాంధీ ఛీత్కారాలను ఎదుర్కోవలసివచ్చింది. ఆయన సహాయక చర్యలకు మార్గదర్శకత్వం వహించి
ఉండాల్సింది. అలాగే దర్యాప్తు సంస్థలను మరింత నిఘాతో వ్యవహరిస్తూ ఫలితాలు సాధించేదిగా ఉం డేందుకు హోంమంత్రిని వాటిని ఒక సక్రమమైన మార్గంలో పెట్టమని కోరి ఉండాల్సింది. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఫలితాలు కనబడలేదు. వివిధ డిపార్ట్‌మెంట్లు చీకటిలో తడుములాడుకుంటున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను ప్రస్తుతమున్న సంస్థల నుండే రూపొందించారు. అది ఉన్నతస్థాయి పోస్టుల ను సృష్టించేందుకే ఉపయోగపడింది. వాటిని ఇప్పు డున్న అధికారులతోనే భర్తీ చేయడం జరిగింది. సిబిఐ, పోలీసు, ఎన్‌ఐఏలు అన్నీ ఒకే పనిమీద వుంటూ గందరగోళం సృష్టిస్తున్నాయి. వాటి విధులను స్పష్టంగా నిర్వచించలేదు. బాధ్యతలను నిర్ధారించలేదు. పౌరు లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యుపిఏ-2 సమస్యల్లో కొట్టుమిట్టాడు తుంటే, ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన బిజెపి తన సొంత ఎజెండాను ఆచరణలో పెడుతోంది. దాని సీనియర్‌నాయకుడు ఎల్‌కె.అద్వానీ అక్టోబరు నుండి రథయాత్ర ప్రారంభించేందుకు రంగం సిద్ధంచేసు కొంటున్నారు. అది త్వరలో జరుగనున్న రాష్ట్ర శాసనసభా ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేందుకు, 2014లో జరిగే లోక్‌సభకుజరిగే ఎన్నికలలో తనను తాను ప్రధాన మంత్రి పదవి అభ్యర్థిగా ప్రదర్శించేందుకు ఉద్దేశించబడింది. అయితే తాను ప్రధానమంత్రి అభ్యర్థికానని ఆయన ప్రకటనలు చేసినప్పటికీ అంతిమలక్ష్యం అదేనని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలకూ తెలుసు. పరివార్‌కు సంబంధించి తనే సుప్రీం నాయకుడినని ప్రదర్శించుకునేందుకు ఆయన ఎత్తుగడలు అనేకమంది ఆశావహులను నిరుత్సాహపరుస్తోంది. పార్టీలో ఒక రకమైన అంతర్యుద్ధం మొదలైంది. ఆర్‌ఎస్‌ఎస్‌, ఆయన పట్ల సుముఖంగా లేదు. అది ఒక యువనాయకుడి పట్ల మొగ్గు చూపించవచ్చు. నరేంద్రమోడీి కూడా కేంద్రం లో అధికారం కోసం జరిగే పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ఆయన కూడా ఇటీవలనే నిరశన దీక్ష చేశారు. ఇప్పటికే ఉభయసభల్లోని ప్రతిపక్ష నాయకులు ప్రధాని పదవికోసం రంగంలో వున్నారు. అదృష్టం తమను వరించవచ్చునని ఆశిస్తున్నారు. అయితే అలాంటి అవకాశం కనిపించటం లేదు. ఎందుకంటే, ఈ రోజున కాషాయపరివార్‌కు ఇలా అదృష్టం తెచ్చిపెట్టే శక్తులు అతం అనుకూలంగా లేవు.
ఏం జరగబోతుందన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. ఇతర రాజకీయ శక్తులు కూడా తమ అదృష్టాన్ని కూడగట్టుకుంటూ పై యిద్దరు ప్రధాన పాత్రదారులకు అది దక్కకుండా చేయాలని చూస్తున్నాయి. ఏది ఏమైనా రానున్న రోజులు పాలకవర్గాలకు మరింత గందరగోళంగానే ఉండవచ్చు.