Saturday, January 28, 2012

నవభారత పుత్రులారా! నిర్మోహితులు కండు


"ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యవరాన్నిబోధత!" 'లెండు, మేల్కొనుడు, పరమార్ధము చేరువరకు ఆగకుడు' అని ప్రతి జీవికిని చాటి చెప్పుదుము గాక!" "లెండు, మేల్కొనుడు! దుర్బలత నుండి, సమ్మోహనము నుండి తెప్పరిల్లుడు. నిజముగా ఎవడును దుర్బలుడు కాడు! ఆత్మ అఖండము; సర్వశక్తిమంతము, సర్వజ్ఞము. లేచి నిలబడుడు! మీ స్వరూపమును ప్రకటింపుడు! మీలో నున్న బ్రహ్మమును ప్రకాశింపచేయుడు! వానిని నిర్లక్ష్యము చేయకుడు. మితిమీరిన సోమరితనము, మితిమీరిన దౌర్బల్యము, మితెమీరిన మోహజాలము శనిదేవత వలె మన నెత్తిపైకెక్కి చిందులు ద్రొక్కుచున్నవి. 

----------------------------------------------------------------------
మన ప్రాచీన జనయిత్రి మరల మేల్కొనినది. ఆమె తన సింహాసనము నధిష్టించినది. అపూర్వమైన శోభతో ఉత్తేజితమైనది. శాంతి స్వరముతో, మంగళ వచనములతో ఆమెను గురించి జగత్తునకు చాటిచెప్పుడు
----------------------------------------------------------------------

ఓహో! నవభారత పుత్రులారా! మీ సమ్మోహనము విదిల్చివేసికొనుడు. దానికి వలయు మార్గము మీ శాస్త్రములందే  కలదు. మీ సత్య స్వరూపమును మీరు తెలిసికొనుడు. ప్రతివానికి వాని స్వస్వరూపము బోధింపుడు. నిద్రలో పడియున్న జీవుని ఎలుగెత్తి పిలువుడు. ఓహో! అతడెటుల మేల్కొనునో మీరే చూడగలరు. ఆ సుప్తజీవి మేల్కాంచి, స్వస్వరూప జ్ఞానముతో కార్యపరుడగునప్పుడు అతనికి శక్తి వచ్చును; తేజము వచ్చును; శుభము గలుగును; పవిత్రతయు వచ్చును. ఉత్క్రుష్టమగునదెల్ల  అతనిని వరించును.

భవిష్యత్తు విషయమై నేనాలోచించుట లేదు; ఆ విషయమై నాకు శ్రద్ధ లేదు. ఒక దివ్య దృశ్యమును మాత్రమే నేను చూచుచున్నాను. జీవితమంతా స్పష్టముగా కనుచున్నాను. అది ఇది - మన ప్రాచీన జనయిత్రి మరల మేల్కొనినది. ఆమె తన సింహాసనము నధిష్టించినది. అపూర్వమైన శోభతో ఉత్తేజితమైనది. శాంతి స్వరముతో, మంగళ వచనములతో ఆమెను గురించి జగత్తునకు చాటిచెప్పుడు".  
________________________________________________________________________

64 సంవత్సరాల మన స్వతంత్ర భారతం

ఆగస్టు 15 నాడు 'లైవ్ ఇండియా' టివి చానెల్ లో ప్రసారమైన అంశాల ఆధారంగా


భారతదేశం భవిష్యత్తుపై ఆశతో, సమాజ శరీరానికి అయ్యిన గాయాలతో.. నెత్తురోడుస్తూ.. మౌంట్ బాటెన్ కుయుక్తులతో.. మత పరంగా విభజింపబడి.., లక్షలాది శవాల మధ్యన.. 1947 ఆగస్టు 15 న బ్రిటిషు వారి నుండి స్వాతంత్ర్యాన్ని పొంది 1950 లో రాజ్యాంగాన్ని నిర్మించికొని సకల మర్యాదలతో మౌంట్ బాటెన్ కు వీడ్కోలు పలికింది. 

సర్దార్ పటేల్ మొక్కవోని దీక్షతో విడిపోయిన హృదయాలను అతికించి, జన సామాన్యాన్ని కలిపారు. 1951 అక్టోబర్ 25 న రాజ్యాంగం అనే నిబద్ధతను ఏర్పరచుకొని రాజకీయ విలువలను ఏర్పరిచే ప్రయత్నంతో మొట్టమొదటి ఎన్నికలను హిమాచల్ ప్రదేశ్ లో చీని, అంగీ అనే వోటర్లు వోటు వేయడంతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజం పడింది. 

1951 లో జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో ఒక వోటుకు కేవలం 98  పైసలు ఖర్చయ్యాయి. ఈ ఎన్నికలలో 2438 మంది ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు పోటీ పడ్డారు. పదిహేడు కోట్ల మంది వోటర్లు మొదటి పార్లమెంటు ఎన్నికలలో వోటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ, నెహ్రు, జయప్రకాశ్ నారాయణ వంటి హేమాహేమీలు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజాస్వామ్యానికి ఊపిరులూదేందుకు కృషి చేశారు. 

శాంతీ-శాంతీ అనే భ్రమ, ప్రపంచ నిజాలు 1962 చైనా యుద్ధంతో నెహ్రూకు తెలిసొచ్చాయి. ఆ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో జైజవాన్ - జైకిసాన్ నినాదంతో కర్షకుడికి, యుద్ధంలోని సైనికుడికి గౌరవమిచ్చే సమాజ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. హరిత విప్లవంతో దిగుబడి పెంచి వ్యవసాయం లాభ దాయకమయ్యేలా, అందరికీ ఆహారం అందేలా ప్రణాళికల స్వరూపాన్ని లాల్ బహదూర్ నాయకత్వం రెండేళ్లలో దేశానికి అందించింది.

అనుమానాస్పద పరిస్థితులలో శాస్త్రీజీ మరణించడంతో ఇందిర ప్రధానిగా ఎన్నికైంది. 1971 లో పాకిస్తాన్ పై యుద్ధం జరిగినప్పుడు ఇందిర తెగువ చూపి బంగ్లాదేశ్ కు ప్రాణం పోసినా, మరల శాంతి మాయలో చిక్కుకొని కాశ్మీర్ గాయాన్ని మాన్పించే చక్కటి అవకాశాన్ని వదులుకొని కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్ ను వదిలిపెట్టింది. అప్పటి వరకూ ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకున్న ప్రజాస్వామ్యం.. 1975 లో స్వార్ధ ప్రయోజనాల కోసం, నియంతృత్వ పోకడలతో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య జీవనాన్ని అపహాస్యం చేస్తూ స్వేచ్చాయుత జీవనాన్ని చీకట్లోకి నెడుతూ, ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు ఎమర్జెన్సీని విధించడంతో..

సహజంగా చలిత పరిణామం కలిగిన, వెలుతురుని ప్రేమించే సగటు భారతీయుడు సృష్టించిన అలల తుఫానుకు, యువరక్తపు చైతన్యములో ఎగిసిన అలలు సమాజ సముద్రం లో ప్రజాస్వామ్య తుఫానుగా మారి, ఎమర్జెన్సీ తొలగి 1977 లో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.

ఆ తరువాత రాజీవ్ గాంధీ, వి.పి.సింగ్, చంద్ర శేఖర్, పీవీ నరసింహారావు, దేవగౌడ, అటల్ బిహారీ వాజపాయ్ ల సారధ్యములో ప్రజాస్వామ్యంలో కొత్త కొత్త పాఠాలను నేర్చుకొంటూ ఇటలీ వనితను ప్రధాని కాకుండా ఈ ప్రజాస్వామ్యం అడ్డుకోగలిగి, ప్రస్తుతం మన్మోహన్తో కలిపి ఇప్పటి వరకూ 13 మంది ప్రధాన మంత్రులను, 370 కి పైగా ముఖ్యమంత్రులను, 7900 లకు పైగా పార్లమెంటు సభ్యులను, 50100 కి పైగా ఎం.ఎల్.ఏ. లను ఎన్నుకొని బహుముఖ ఆలోచనలతో, స్వేచ్ఛాయుత  సమాజంతో అందరినీ కలుపుకొంటూ, 80 % వోటర్ల హాజరుతో, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, కుగ్రామంలోని వోటరు అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తూ, వోటరు గుర్తింపు కార్డులతో, సరికొత్త వోటింగు యంత్రాలతో, ఒకవైపు ఆరోపణలతో, రిగ్గింగులతో, విభజన రాజకీయాలతో, మరొక వైపు స్వేచ్చతో, ఐక్యతతో, అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఎగ్జిట్ పోల్ ని అవహేళన చేస్తూ వోటరు దేవుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూనే ఉన్నాడు.

కులాల శాతానికి, మతాల బుజ్జగింపులకు తాను లొంగనని, స్వచ్ఛమైన నాయకత్వం ఉంటే మార్పు తెస్తానని వోటర్లు ఎన్నోసార్లు రుజువు చేసారు...,

1951 లో వోటుకు 98 పైసలు ఖర్చు అయితే ఇప్పుడు వోటుకు 250 రూపాయలు ఖర్చు కావడం విశేషం. అరవై ఏళ్ళయినా గరీభీ హఠావో నినాదం ఇంకా ఒక అజెండాగా ఉండడం మనం తీవ్రంగా ప్రశ్నించుకోవలసిన  విషయం.

ఆశావహ భారతదేశంలో దాగని నిరాశ  
అరవై నాలుగు సంవత్సరాల భారతావనిలో గాంధీజీ కలలు కన్న రామరాజ్యం అనే ఆశ ఒక స్వప్నంలా కనబడటానికి కారణాలు అనేకం. 

స్వతంత్ర భారతావని ఎలా ఉండాలో గాంధీజీ యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలలో స్పష్టంగా పేర్కొన్నారు. దేశంలో ప్రజలందరూ సమగ్రంగా అభివృద్ధి ఫలాలను అనుభవించాలని కోరుకొన్నారు. వివేకానంద దేశంలో కుక్కపిల్ల కూడా ఆహారం లేకుండా మరణించరాదనీ కోరుకున్నారు.

దేశంలో దారిద్ర్యం ఒకవైపు, సంపన్నుల వృద్ధి మరోవైపు నాణేనికి రెండు పార్శ్వాలుగా వృద్ధి చెందాయి. ఒక వైపు అంబానీలు నిమిషానికి 25 రూపాయలు సంపాదిస్తూ ఉంటే మరో వైపు లక్షది మంది గంటకు ఐదు పైసలు కూడా సంపాదించలేని పరిస్థితి. 

భారతదేశంలో ఉండటానికి ఇల్లు, కడుపు నిండా తిండి, వైద్యం చేయించుకోగల స్థోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్ట లేనివారంతా పేదవారే. కాని మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం దృష్టిలో భారతదేశంలోని పేదల లక్షణాలు అంతకంటే ఘోరంగా ఉండాలి. భారత దేశంలో ఇప్పటికీ అనేకమంది ఆకలి బారినపడి చనిపోతున్నారు. మలేరియా వంటి నయం చేయగల జబ్బులతో కూడా చనిపోతున్న వారు అనేకమంది ఉన్నారు.  ఉండటానికి చోటు లేక, ప్లాట్ ఫాంల మీద, రైల్వే స్టేషన్లలో, రోడ్ల పక్కన తాత్కాలికంగా నీడ ఏర్పాటు చేసుకున్న వారు ప్రతి పట్నంలోనూ కనిపిస్తారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, పని దొరకనివారు కోట్లాదిమంది ఉన్నారు. ప్రణాళికా సంఘం లెక్క ప్రకారం భారతదేశంలోని 122  కోట్ల మంది జనాభాలో కేవలం 37 శాతం మందే పేదలు!

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని పరిగణించడానికి ప్రాతిపదిక ఏమిటని కోర్టు ప్రశ్నించగా, ప్రణాళికా సంఘం తన ప్రాతిపదికను వెల్లడించింది. దాని ప్రకారం (ద్రవ్యోల్బణంతో  సర్దుబాటు చేస్తే) పట్టణంలో నివసిస్తున్న వ్యక్తి నెలకు 578 రూపాయలు (13 డాలర్లు) కంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగినట్లయితే అతను దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లే. అంటే రోజుకు రూ. 20 కంటే తక్కువ. గ్రామంలో ఐతే రోజుకు రూ.15 కంటే ఎక్కువ ఖర్చు చేయగలిగితే అతను పేదవాడు కాదు. అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ప్రభుత్వ సహాయానికి అనర్హుడు. 

45  శాతం కటిక పేదలుగానూ 80 శాతం మంది సాధారణ పేదలుగానూ అంతర్జాతీయ ప్రమాణాల ప్రాతిపదికన లెక్క తేలినట్లు ప్లానింగ్ కమిషన్ తెలిపింది. అంటే భారతదేశంలో నూటికి 80 మంది 2 డాలర్ల సంపాదనతో బతుకులు వెళ్ళ దీస్తున్నారు. భారతదేశంలో జరిగిన వివిధ అధ్యయనాలు కనీస జీవనానికి రూ.40000 (నలభై వేలు) నుండి రూ.60000 (అరవై వేలు) వరకూ అవసరమని నిర్దారించాయని ప్రణాళికా సంఘం పత్రం ద్వారా తెలుస్తోంది. నిజానికి పెరుగుతున్న ధరలు, వాతావరణ కాలుష్యం వలన ఎదురౌతున్న జబ్బుల నుండి రక్షణ, చదువుల ఖరీదు ఇవన్నీ కలిపితే వారి అంచనాలు కూడా సరిపోవు. ఈ పరిస్థితుల్లో భారత దేశంలో దరిద్రుల నిర్మూలన జరుగుతుంది తప్ప దారిద్ర్య నిర్మూలన మాత్రం జరగదు. 

మనం సమరస భారతాన్ని ఒకరికి మరొకరు సహకారమిచ్చుకొంటూ నిర్మించుకోవాలి, రామరాజ్య నిర్మాణంలో విద్వేష పూరిత అసమానతలు ఆధారంగా కాదని ప్రతి వ్యక్తి తన కళను సాకారం చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలనే నిజాన్ని తెలియపరచాలి. అసలైన అవకాశ కల్పనను నిర్లక్ష్యం చేసి, వోట్ల కోసం పేదలను ఉపయోగించుకోవడం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. దారిద్ర్యం తొలగిస్తామనే పేరుతో అనేక రకాల పథకాలతో వర్గాల మధ్య చిచ్చు పెట్టే శక్తులు తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకొంటున్నాయి. కాని ఈ పథకాల వల్ల పేదలకు, నిరుపేదలకు ఏమాత్రం ఉపయోగం లేదని ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లు నిరూపించాయి. 

చదువుల వ్యాపారం - యువత 
మనదేశం 4.06 ట్రిలియన్ డాలర్ల జిడిపితో అమెరికా, చైనా వంటి అగ్ర రాజ్యాల జిడిపితో పోటీపడే విధంగా ఉంది. అలాగే సంవత్సరానికి 7, 8 శాతం అభివృద్ధితో అగ్రదేశాల  జిడిపిని కూడా అధిగమించడం కష్టమైన విషయమేమీ కాదు. చాలామంది ఆర్ధిక వేత్తలు  జిడిపి కొలతలు చూసి మనలను మార్కెట్ లా చూస్తున్నారు. కాని నిత్య అవసరాల అభివృద్ధి తక్షణ అవసరమున్న సమాజంగా చూడకపోవడం శోచనీయం.

ఒక వైపున కే.పి.సింగ్, డి.ఎల్.ఎఫ్.చైర్మన్ లాంటి వారు తమ పుట్టినరోజును వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి జరుపుకుంటున్న వారిని, మరోవైపు ఇల్లు, తిండి లేక బాధలు పడుతూ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని చూస్తున్నాం. స్వాతంత్ర్యం తరువాత మన దేశాన్ని దోచుకుతినే మేధావులను తయారు చేశామే కాని, మాతృదేశ ఉన్నతి గురించి తపించి పని చేయగల యువకులను తయారు చేయడంలో వెనుకపడే ఉన్నాం.

ఒకప్రక్క సత్యం రామలింగరాజు, హర్షద్ మెహతా, రాజా, గాలి వంటి బాగా చదువుకొన్నవారు కోట్లకు పైగా కుంభకోణాలు చేస్తూ, తప్పుడు పద్ధతులతో సాటి ప్రజలను మోసం చేసేందుకు తమ తెలివి తేటలను వాడుకొన్న ఉదాహరణలు, మరోప్రక్క దారిలో దొరికిన లక్షల రూపాయలను చదువురాని సామాన్యులు నిజాయితీతో అప్పగించిన సందర్భాలు చూస్తే, మన చదువులు సామాజిక సంస్కారాలనివ్వడంలో విఫలమయ్యాయని అర్ధమౌతోంది. 


1950లో తయారైన భారతదేశం యొక్క ఉన్నత విద్య విధానం వలన ముఖ్యంగా టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో, ఐఐటి సృష్టి,  ఐఐఎమ్ లు, సైన్సు పా
ఠశాలలు, ఆధునిక శిక్షణ మరియు పరిశోధనా సంస్థలు మన దేశంలో మంచి ఫలితాల నిచ్చాయి. స్వాతంత్ర్యం తరువాత ఇప్పటివరకు 1,40,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చదువుకొని బయటికి రాగా, వారిలో ఇప్పటివరకు 55,000 కు పైగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళారు. వీరి వలన అమెరికా మార్కెట్ మూలధనీకరణలో $80 బిలియన్ సృష్టించే క్రెడిట్ ని పొందినట్లు అంచనా. ఇలా మన దేశంలో తయారయిన మేధావులు ప్రపంచ మానవాళికి ఉపయోగపడటం సంతోషమైనా, వందల కోట్ల ప్రజల కడగండ్లు తీర్చడానికి ఈ మేధస్సు వినియోగించి ఉంటే భారతం బాగుపడేదని మేధోవలసలను గమనించిన వారి అంచనా. కంప్యూటర్ వల్ల ప్రపంచానికి మన శక్తియుక్తులు తెలిశాయి. భారతీయులంటే లేచి గౌరవమిచ్చే స్థాయికి ఈ అరవై నాలుగు ఏళ్ళలో మనం చేరుకున్నాం. మనం సాఫ్ట్ వేర్ లో అభివృద్ధి చెందామంటున్నా, టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అవుట్ సోర్సింగ్ కంపెనీలు డాలర్ల రేట్లలో తేడాల ఆధారంగా నడిపే వ్యాపారమే మనకు గొప్పగా కనిపించడం శోచనీయం. మైక్రోసాఫ్ట్, హ్యూలెట్ ప్యాకార్డ్, యాహూ, గూగుల్, ఫేస్ బుక్ వంటి అనేక కంపెనీలు యూనివర్శిటీ విద్యార్ధులచే స్థాపించబడి నేడు గొప్పగా నడుపబడుతున్నాయి. కాని మనదేశ యువకులలో ఇటువంటి కంపెనీలను స్థాపించగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో మన విద్యావ్యవస్థ విఫలమైంది. ఇప్పటికీ డిగ్రీ చేతికొచ్చాక నేను ఉద్యోగం సంపాదించగలను అని ధైర్యంగా చెప్పే యువత ఇరవై శాతం మాత్రమే ఉండడం బాధాకరం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా చెప్పుకొంటున్న మనదేశంలోని యువకులు ప్రతిరోజూ ఆత్మహత్యలకు పాల్పడడం ఇందుకు నిదర్శనం.

సాఫ్ట్ వేర్ తో పాటుగా, ఆయుర్వేదాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసి, సనాతన విలువలను ప్రపంచానికి కొత్తకోణంలో ఆవిష్కరించేందుకు వేలమంది యువకులు ప్రయత్నాలు చేయడం ఈ అరవై నాలుగు ఏళ్ళలో కలిగిన పెద్ద మార్పు.

సెక్యులరిజం పేరుతో విద్యలో జీవిత విలువలను పెంపొందించే భగవద్గీతను, అనేక ధార్మిక గ్రంథాలను మన యువకులకు పరిచయం చేయకపోవడం ఒక లోపంగా నేటి మానసిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. క్రికెట్ లో బెట్టింగ్ లు, టీట్వంటీని వ్యాపారంగా మార్చడం, అలాగే కబడ్డీ, ఫుట్ బాల్ వంటి జట్టుగా ఆడే ఆటలను మనం మరచిపోవడం అనే స్థితికి ఈ 64 ఏళ్ళ స్వతంత్ర పాలన ఉపయోగపడింది.
 

జగద్గురువుగా మన్ననలందుకున్న మన దేశం చదువులకోసం విదేశాలపై ఆధారపడడం మరో క్రొత్త ప్రామాణికత. మన యువత పాలకులు తమకు దూరం చేసిన స్వప్నాలను, నిజాలను నెమ్మదిగా తెలుసుకొంటున్నారు. వారు త్వరలోనే తమ లక్ష్యం చేరుకొంటారని ఆశిద్దాం. 

స్వేచ్చానువాదం - జి.ఎల్.యెన్.
__________________________________________________________________________

గతానుగతం

విశ్వాసులూ, అవిశ్వాసులూ
- రామచంద్ర గుహ

కమ్యూనిస్టు పార్టీ నుంచి వైదొలిగిన విఖ్యాత మేధావుల ఆత్మకథనాల సంపుటి 'విఫలమైన వేలుపు' (ది గాడ్ దట్ ఫెయిల్డ్). మేధా శిఖరాల నుంచి కమ్యూనిజంలోకి దూకి, ఈ ప్రపంచాన్ని మార్చాలని ఆరాటపడి, లక్ష్యసాధనకు అంకితమై, వాస్తవాలను తట్టుకోలేక అంతిమంగా ఆ భావజాలాన్ని త్యజించిన ఆర్థర్ కోస్లర్, ఇగ్నాజియో సైలోన్, లూయీ ఫిషర్ మొదలైన ధీమంతుల గ్రంథమది.

1980ల్లో, మార్క్సిజం ప్రభావం నుంచి బయటపడుతున్న దశలో నేను ఆ గ్రంథాన్ని చదివాను. తదేక దీక్షతో చదివించిన ఆత్మ (వైఫల్యాల) కథనాలవి. ఒక వాదాన్ని ప్రగాఢంగా విశ్వసించిన వారే ఆ వాదంలోని లొసుగులను లోతుగా చూడగల విమర్శకులుగా పరిణమించడం కద్దు. ఒకప్పుడు క్రైస్తవ మతాచార్యత్వాన్ని ఆకాంక్షించిన వారు కావడం వల్లే టెర్రీ ఇయగ్లెటన్, జే మ్స్ కరోల్ లాంటివారు ఆ తరువాత కేథలిక్ చర్చ్ గురించి నిశిత గ్రంథాలు వెలువరించారు. ఇప్పుడు మాజీ జిహాదీలు పలువురు తమ స్వీయానుభవాలను ప్రపంచానికి వెల్లడిస్తున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సభ్యుని జ్ఞాపకాల గ్రంథం నొకదాన్ని ఇటీవల నేను చదవడం జరిగింది. ఆర్థికవేత్త ఎస్.హెచ్. దేశ్‌పాండే (1928-2010) ఆ పుస్తకాన్ని 1970 వ దశకంలో మరాఠీలో రాశారు. దరిమిలా అది 'క్వెస్ట్' అనే జర్నల్‌లో 'మై డేస్ ఇన్ ది ఆరెస్సెస్' అనే శీర్షికతో ప్రచురితమయింది.

దేశ్‌పాండే 1925లో, పూనాకు ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామంలో జన్మించారు. 1938లో విద్యాభ్యాసానికి పూనాకు వెళ్ళారు; ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన ఆరెస్సె స్‌లో చేరారు. తన శిక్షణ తొలి రోజుల్లో ప్రముఖ మరాఠీ సాహితీవేత్త పి.జి.సహస్రబుద్ధె ప్రసంగాలకు దేశ్‌పాండే అమితాసక్తితో హాజరయ్యేవారు. సంఘ్ కార్యకర్తల నిబద్ధతకు ముగ్ధుడైన ఆ సాహితీవేత్త, 'పెట్టుబడిదారీ విధానం', 'సామ్యవాదం', 'ఫాసిజం' మొదలైన అంశాలపై ఉపన్యాసాలు ఇస్తుండేవారు.

అయితే ఈ ప్రయోగం అనతికాలంలోనే నిలిచిపోయింది. ప్రసంగ అంశంపై స్వేచ్ఛాయుత చర్చకు అవకాశం లేకపోవడంతో ఆ నిస్సార మేధా వాతావరణంలో ఆ సాహితీవేత్త ఇమడలేకపోయారు. సంస్థ అధినేతకు సంపూర్ణ విధేయత చూపాలనేది ఆరెస్సెస్ సిద్ధాంతం. సంఘ్‌లోని మేధా వ్యతిరేక వాతావరణం అంతకంతకూ అనుభవంలోకి రావడంతో ఆ సాహితీవేత్త ఆరెస్సెస్ పట్ల భ్రమలన్నిటినీ కోల్పోయారు.

శాఖ (ఆరెస్సెస్ ప్రాథమిక విభాగం) జీవితంలో కవాతు, వ్యాయామం మొదలైన భౌతిక కార్యకలాపాలకే ప్రాధాన్యం. ఉదయం పూట వ్యాయామాన్ని గ్రామీణ మహారాష్ట్ర సంప్రదాయక నృత్యాలతో దేశ్‌పాండే పోల్చారు. 'సంఘ్ వ్యాయామ విన్యాసాలు కేవలం ఒక కవాతు లాంటిదికాక, గ్రామీణ సంప్రదాయక నృత్యాలు మైమరిపించే అనుభవాలని' ఆయన అంటారు. దేశ్ పాండే ఇంకా ఇలా అన్నారు: 'ఆరెస్సెస్ లెజిమ్ (మహారాష్ట్ర జానపద నృత్యంపేరు) చాలా యాంత్రికంగా ఉంటుంది; అందులో చురుకుదనం ఉన్నప్పటికీ పారవశ్యం పొందే గుణం లేదు'.

'ఆరెస్సెస్ శిబిర జీవితంలో ఒక ప్రముఖ అంశం -శత్రువు దాడిని సూచిస్తూ అర్ధరాత్రి పూట మోగే హెచ్చరిక గంట. ఆ గంట మోగిన వెన్వెంటనే నిద్ర నుంచి లేచి రెండు నిమిషాల్లో యూనిఫామ్ ధరించి కవాతు మైదానానికి వెళ్ళాలి. ఆ హెచ్చరిక గంట చాలా భయం గొల్పేదిగా ఉండేది. లేవండి, వెంటనే లేవండి, శిబిరమంతటా మంటలు అలుముకొంటున్నాయని మీ చెవుల్లో అరుస్తున్నట్టుగా ఉంటుందా హెచ్చరిక' అని దేశ్ పాండే రాశారు. విదేశీ పాలకులను పారద్రోలడానికి పోరాడుతున్న విప్లవ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని శిక్షణా తరగతులలో చెప్పేవారని దేశ్‌పాండే పేర్కొన్నారు.

అయితే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు ఆరెస్సెస్ శ్రేణులు నిష్క్రియాత్మక ప్రేక్షక జనంగా మిగిలిపోవడం దేశ్‌పాండేని అమితంగా ఆశ్చర్యపరిచింది. విదేశీ పాలనను కూలదోయగల శక్తి సామర్థ్యాలు ఇంకా ఆరెస్సెస్‌కుగాని, దేశ ప్రజలకు గాని లేవని ఆ ఏకాకి తనాన్ని సైద్ధాంతిక తరగతులు ఒక దానిలో సమర్థించారని ఆయన చెప్పారు. వీధులలో పోలీసు కాల్పుల్లో పారుతున్న రక్తమంతా వృధాయేనని ఆ వక్త చెప్పారని దేశ్‌పాండే రాశారు.

చాలా సంవత్సరాల అనంతరం సంఘ్‌లో తన అనుభవాల గురించి రాస్తూ దేశ్ పాండే ఇలా అన్నారు: 'తన అనుయాయులలో సమైక్యత, సోదర భావాన్ని సృష్టించడమే ఆరెస్సెస్ సాధించిన ప్రధాన విజయం. ఆ సోదర భావన హిందువులకే పరిమితమైనదన్న మాట నిజమే. ఆ సంస్థ మూలాలు మహారాష్ట్రలో ఉన్నాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. అయినప్పటికీ ఆరెస్సెస్‌లో మచ్చుకైనా సంకుచిత మహారాష్ట్రియన్ అభిమానాలు కన్పించవు. సంఘ్ కార్యకర్తల్లో, వారు తమిళులైనా, బెంగాలీలైనా, మహారాష్ట్రియన్‌లైనా, పంజాబీలైనా అందరిమధ్య గొప్ప సౌభ్రాతృత్వం వెల్లివిరియడం చాలా గొప్ప విష యం'.

ఇక ఆరెస్సెస్ కార్యకలాపాల్లో 'రెండో రకం మేధా చర్చలకు సైతం చోటు లే దు'. సంఘ్ మేధా వ్యతిరేక వైఖరుల కారణంగానే సైద్ధాంతిక తరగతులు అని పిలవబడే సమావేశాల్లో వెలువరించే ప్రసంగాలు నిస్సారంగా ఉండేవని దేశ్‌పాండే రాశారు. సదరు వక్తల ను విద్వత్తును బట్టిగాక సంఘ్ నాయకత్వ శ్రేణిలో వారి స్థానా న్ని బట్టి ఎంపిక చేసేవారు. సంస్థ పట్ల అభిమానపూర్వకంగా చెప్పే విషయాలను కనీసం భరించగలిగేవాళ్ళం. అయితే తమ వాదనలకు సైద్ధాంతిక ప్రాతిపదికలను కల్పించడానికి ప్రయత్ని ంచినప్పుడు వక్తల అసలు వైఖరి బయటపడేది. 'హిందువులదే హిందుస్థాన్', 'కాషాయ పతాకమే మన జాతీయ పతాకం',. 'ఒక జాతి, ఒక నాయకుడు అనే గతానుగతిక మాటలను విసుగు కలిగించే విధంగా పదే పదే వారు వాడుతుండేవారు'.

ఇటీవలి సంవత్సరాలలో సంఘ్ పరివార్ గురించి భారతీయ, పాశ్చాత్య విద్యావేత్తలు పలువురు నిశిత పరిశోధనా గ్రంథాలెన్నిటినో వెలువరించారు. వాటిలో అత్యుత్తమమైనది-నా అభిప్రాయంలో - రచయిత, చరిత్రకారుడు డి.ఆర్. గోయల్ రాసిన 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్'. దేశ్‌పాండే వలే ఈయన కూడా ఒకప్పుడు స్వయం సేవకుడే. సంఘ్ భావజాలాన్ని ఆయన ఇలా సంక్షేపించారు: 'చరిత్రకు అందని కాలం నుంచీ హిందువులు భారతదేశంలో నివశిస్తున్నారు. హిందువులు ఒక జాతి.

తమ సంస్కృతీ నాగరికతలను పూర్తిగా వారే స్వయంగా నిర్మించుకున్నారు. హిందువేతరులు దురాక్రమణదారులు లేదా అతిథులు. వారిని హిందువులతో సమానంగా పరిగణించడం సమంజసం కాదు... విదేశీయుల దాడుల నుంచి తమ మతం, సంస్కృతిని కాపాడుకోవడానికి హిందువులు చేసిన పోరాటాల చరిత్రే భారతదేశ చరిత్ర. ఈ జాతి హిందూ జాతి అని విశ్వసించని వారి చేతుల్లో అధికారం ఉన్నందున విదేశీ దాడుల ముప్పు ఇంకా కొనసాగుతోంది.

ఈ దేశంలో నివశిస్తున్న వారి మధ్య సమైక్యతే జాతి ఐక్యత అని మాట్లాడుతున్న వారు స్వార్థపరులు; మైనారిటీల ఓట్లను దృష్టిలో ఉంచుకొనే అలా మాట్లాడుతున్నారు. కనుక దేశద్రోహులు. నలువైపులా శత్రువు లు ఉన్నందున హిందువులందరూ ఏకమవ్వాల్సిన అవసరమెంతైనా ఉంది. శత్రువుపై పెద్ద ఎత్తున దాడిచేయగల శక్తిసామర్థ్యాలను పెంపొందించుకోవాలి. ముందుగా శత్రువుపై దాడిచేయడమే సరైన ఆత్మరక్షణ విధానమని భావించాలి. హిందువులందరినీ ఏకం చేసే మహోన్నత లక్ష్యానికే సంఘ్ ఆవిర్భవించింది'.

ఈ సారాంశాన్ని ఇచ్చిన అనంతరం డి.ఆర్.గోయల్ ఇలా వ్యాఖ్యానించారు: 'తన 74 సంవత్సరాల చరిత్రలో ఆరెస్సెస్ శాఖల సమావేశాల్లో ఇంతకుమించి మరేమీ బోధించలేదనే సత్యాన్ని ఉల్లంఘిస్తున్నామనే భయం లేకుండా చెప్పవచ్చు'. గోయల్, ఇది రాసింది 1999లో. అయితే గత పదమూడు సంవత్సరాలలోనూ ఇంతకు మించి మరేమీ చెప్పలేదు.

(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

No comments:

Post a Comment