Monday, December 26, 2011

జాతీయ గీతానికి శతవసంతాలు


సందర్భం
‘జనగణమన’.. భారతీయ స్ఫూర్తిని, భారతీయుల భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అపురూప గేయం. భరతమాత ముద్దుబిడ్డ విశ్వకవి రవీంద్రుని కలం నుంచి జాలువారిన ఈ గీతం ఖండాంతరాల్లో భారతీయతను చాటిచెప్పింది. జాతీ యోద్యమకాలంలో ప్రజల్లో చైతన్య దీప్తులను వెలిగించిన గీతం ఇది. దీన్ని పఠి స్తున్నా, ఆలపిస్తున్నా, ఆలకిస్తున్నా.. భారతీయుడి మనసు పరవశిస్తుంది. భారతీయతకు నిలువెత్తు రూపమైన మన జాతీయగీతం ‘జనగణమన’కు నేటితో శత వసంతాలు. 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జాతీయగీతాన్ని మొట్టమొదటిసారిగా ఆలపించారు. జాతీయగీతం వినిపించగానే ప్రతి భారతీయుడు అప్రమత్తమై ఎక్కడ ఎలా ఉన్నా తగు గౌరవాన్ని ఇస్తాడు. జాతి ఔన్నత్యాన్ని మననం చేసుకుంటూ నిటారుగా నిలబడి పదంతో పదం కలిపి దేశభక్తిని చాటుతాడు. ఉత్తేజాన్ని ప్రసరించే జాతీయగీతం వినిపించగానే శిరస్సు వంచి వందనం చేస్తారు. గౌరవాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కలం నుంచి జాలువారిన అక్షర సుమాలు ప్రేరేపిస్తాయి. భరతమాత కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటుతూ.. భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని దాని అంతస్సారంతో సహా కళ్లకు కట్టే అక్షర చిత్రమిది.

‘ప్రజలందరి మనసుకు అధినేతవు, భారత భాగ్యవిధాతవు అయిన నీకు జయమగుగాక, పంజాబ్, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోనూ, వింద్య, హిమాలయ పర్వతాలతోనూ, యమున, గంగ ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భాగ్యవిధాతా, వాటికి నీ శుభనామం ఉద్బోధనిస్తుంది. అవి నీ ఆశీస్సులు ఆకాంక్షిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సకల జనులకు మంగళ కారకుడవు, భారత భాగ్యవిధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక!’ అన్న మధురమైన చరణాలను జాతికి కానుకగా అందించాడు రవీం ద్రుడు. మొత్తం 31 చరణాలతో రవీంద్రుడు జనగణమన పూరించగా, అం దులో ఏడు చరణాలను మనం జాతీయ గీతంగా ఆలపిస్తున్నాం. రచన సాగిన భాష సంస్కృత మిళిత బెంగాలీ అయినా, భారతీయులంతా దీన్ని తమ మాతృగీతంగా అనుభూతి చెంది పాడుకొనేలా మన జాతీయ గీతం రూపుదిద్దుకుంది.

‘జనగణమన’ను 1950 జనవరి 24న జాతీయ గీతంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ పరిషత్తు సమావేళంలో భారతీయ రిపబ్లిక్‌కు తొలి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఎన్నికైన రోజే జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించారు. ‘జాతీయ గీతం విషయాన్ని తీర్మానం రూపేణా పరిషత్తు నిర్ణయిస్తే బాగుంటుందని ఒకప్పుడు అనుకున్నాం. కానీ తీర్మానం ద్వారా ఒక నిర్ణయం చేసే బదులు, నేనే ఆ ప్రకటన చేస్తే మంచిదన్న అభిప్రాయం ఏర్పడింది... ప్రభుత్వ వ్యవహారాలన్నిటిలోనూ ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఆలపిస్తారు. ప్రభుత్వం అవసరమైనప్పుడు మార్పులు చేస్తుంది. భారత స్వాతంత్య్ర సమరంలో చరిత్రాత్మక పాత్ర పోషించిన ‘వందేమాతరం’ గీతానికి కూడా జనగణమనతో సరిసమానమైన గౌరవం, సమాన ప్రతిపత్తి ఉంటాయి’ అని డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్వయంగా అధికారిక ప్రకటన చేయడంతో రాజ్యాంగ పరిషత్తు సభ్యులు హర్షధ్వానాలు చేశారు. ఆనాటి నుంచి దేశవ్యాప్తంగా జాతీయ గీతంగా ‘జనగణమన’ చలామణిలో ఉంది.

అయితే, జాతీయ భాషను గురించి జరిగినంతగా కాకపోయినా, జాతీయ గీతాన్ని గురించి కూడా తీవ్రస్థాయిలోనే అభిప్రాయ భేదాలు పొడచూపాయి. ఆసియా ఖండానికి తొలి నోబెల్ తీసుకొచ్చిన విశ్వకవి రవీంద్రుడి గీతం జాతీయ గీతంగా నిలిచిన నాటి నుంచి అనేక వివాదాలకు కేంద్రమవుతూనే ఉంది. జాతీయ గీతం ఎంపిక క్రమంలో బంకించంద్రుడి వందేమాతరం, కృష్ణశాస్త్రి ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’తో సహా పలు గీతాలు పోటీపడ్డాయి. స్వాతంత్య్ర పోరాటంలో దేశజనులందరినీ ఏకతాటిపై నిలిపిన బంకిం ‘వందేమాతరం’ను కాదని ‘జనగణమన’ను జాతీయగీతంగా ఎంపిక చేయడం చాలా మందికి నచ్చలేదు.

వివాదాల ముసురు..

‘భారత భాగ్య విధాత’ అనే పేరుతో బ్రహ్మ సమాజ పత్రికలో ప్రచురితమైన ఈ గేయం బ్రిటిష్ చక్రవర్తిని కీర్తించేందుకు ఉద్దేశించినదని కొందరు వాదించారు. రవీంద్రుడు తన గీతాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తూ.. విధాత అని వచ్చిన చోట ఆంగ్ల పదానికి మొదట కేపిటల్ లెటర్‌ను వాడలేదని, అందువల్ల రవీంద్రుడు భగవంతుడిని ఉద్దేశించలేదని కొందరు వాదించారు. అయితే, గురుదేవుడి భావన భగవంతుడితో కూడినదేనని ఆయన సన్నిహితులు భావించారు. రాజుల, తరాజుల పొగడ్తలకు కవిచంద్రుడు పోయే వాడు కాదని, కాబట్టి ఆ శంక అవసరం లేదని వారు స్పష్టం చేశారు.

1911లో కింగ్ జార్జి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతున్న తరుణంలో తెరపైకి వచ్చిన ఈ గేయం ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకేనని నాటి ఆంగ్ల పత్రికలు రాశాయి. బ్రిటిష్ పరిపాలనను ప్రశంసించే బ్రహ్మసమాజ వ్యవస్థాపకుని కుటుంబానికి చెందిన రవీంద్రనాథ్ టాగోర్ ఈ గేయాన్ని జార్జి చక్రవర్తిని కీర్తిస్తూ రచించాడనే అపవాదు మోయాల్సివచ్చింది. అయితే టాగోర్ ఈ మాట లను నిర్ద్వంద్వంగా ఖండించారు. భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని భగవంతుడిని మాత్రమే ‘జనగణమన’లో కీర్తించానని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్‌లో భాగమైన సింధు ప్రాంతాన్ని జాతీయ గీతంలో తొలగించి అదే స్థానంలో ‘ఆంధ్ర’ అనే శబ్దంతో తెలుగునాట కొంత కాలం జాతీయ గీతాలాపన జరగడం విశేషం.

‘అధినాయక’ జయహే.. భారత జనులంతా మంత్రంలా పాడుకొనే జనగణమనను ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా ఐక్యరాజ్య సమితి విద్యా, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించింది. మూడే ళ్ల క్రితం విశ్వకవి గేయానికి ఈ ఘనత దక్కింది. పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా రవీంద్రుడు బెంగాలీలో రచించిన ‘అమర్ సొనర్ బంగ్లా..’ అనే గేయాన్ని జాతీయ గీతంగా స్వీకరించింది. ఇలా రెండు దేశాలకు జాతీయ గీతాలను అందించిన ఘనత రవీంద్రుడికి ఒక్కడికే దక్కింది. ప్రభాత ప్రార్థనా సమయంలోనో... సంధ్య వేళ స్కూల్ వదిలే వేళో... విద్యార్థుల నాలుకల మీద స్వరమై చేరి, భారతీయుడి జీవితంపై చెరగని ముద్రవేసిన ఈ శుభ గానం వందేళ్లైనా, ఇంకెన్నేళ్లైనా ప్రతిక్షణం దేశ సమున్నతిని, ప్రఖ్యాతిని ఉద్బోధిస్తూనే ఉంటుంది.
-‘సాక్షి’ స్పెషల్ డెస్క్
(నేటితో జాతీయగీతానికి నిండు నూరేళ్లు)


‘ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ఎట్ మదనపల్లె!

అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ‘జనగణమన’ గీతానికి చిత్తూరు జిల్లా మదనపల్లెకి చరిత్రాత్మక అనుబంధం ఉంది. బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ టాగోర్ రాసిన జనగణమన గీతాన్ని మదనపల్లెలోనే ఆయన స్వయంగా ఆం గ్లంలోకి 1919 ఫిబ్రవరి 28న తర్జుమా చేశారు. ‘ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇం డియా’ అని దీనికి ‘గురుదేవ్’ పేరు పెట్టారు. మదనపల్లెలో హోంరూల్ ఉద్యమ నేత అనీబిసెంట్ స్థాపించిన బిసెంట్ థియోసాఫికల్ (బీటీ) కళాశాలలో ‘జనగణమన’ ఆంగ్ల గీతాన్ని గురుదేవుడే తొలిసారి ఆలపించారు.

ఈ కళాశాల విద్యార్థులతో పాటు స్థానికులు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం కళాశాలకు మద్రాసు యూని వర్సిటీ గుర్తింపును రద్దుచేసింది. అదే సమయంలో నేషనల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్న రవీంద్రనాథ్ టాగోర్ అప్పటి బీటీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కజిన్స్ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 25న మదనపల్లెకు వచ్చారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధుడై ఐదు రోజులు ఉండిపోయారు. సంగీత పోటీల్లో విద్యార్థుల దేశభక్తి గీతాలకు స్పందించిన టాగోర్ వారిని ఉత్తేజపరచడానికి బెంగాలీ భాషలోని ‘జనగణమన’ను ఆలపిం చారు. ఆ తర్వాత ఈ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. 

_________________________________________________________________________________

భారతీయ 'బహుళజాతి' జయపతాక - భరత్ ఝన్ ఝన్‌వాలా

ఎంత మార్పు! ఇరవై సంవత్సరాల క్రితం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విషయమై మన దేశ ఆర్థికవేత్తలలో తీవ్ర వాదోపవాదాలు నడిచాయి. ఆనాడు ఆర్థిక వ్యవస్థలోకి ఎఫ్‌డిఐని అనుమతించారు. దీనివల్ల మన దేశం మరోసారి వలసపాలనలోకి వెళ్ళిపోయే ప్రమాదముందని స్వదేశీ వాదులు విమర్శించారు. బహుళజాతి కంపెనీలు దేశంలోకి ప్రవేశించి దేశీయ కంపెనీలను అణచివేస్తాయని వారు వాదించారు. వచ్చిన లాభాలను విదేశీ కంపెనీలు తమ స్వదేశానికి తరలిస్తాయని దీని వల్ల మన ఆర్థిక వ్యవస్థ అమితంగా నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇవి నిరాధార భయాందోళనలని రుజువయింది. మన దేశం ప్రశంసనీయమైన మధ్యేమార్గం అనుసరించడం వల్ల ఎఫ్‌డిఐ, దేశీయ పెట్టుబడులకు మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. బహుళ జాతి సంస్థలు మన కంపెనీలను అణచివేయడం కాదు కదా మన కంపెనీలే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున పెట్టే స్థితికి ఎదిగాయి.


మన దేశంలో విదేశీ కంపెనీల ఎఫ్‌డిఐ 2009-10లో 18.8 బిలియన్ డాలర్ల నుంచి 2010-11లో 7.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. అంటే 62 శాతం తగ్గిపోయాయన్న మాట. ఇదే సమయంలో విదేశాల్లో భారతీయ కంపెనీల ఎఫ్‌డిఐ 144 శాతం పెరిగాయి. అంటే విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు 18 నుంచి 43.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఏడాది మన కంపెనీలు స్వీకరించిన ఎఫ్‌డిఐ కంటే ఆరు రెట్లు ఎక్కువగా విదేశాలకు తమ పెట్టుబడులను పంపాయి. విదేశాల్లో మన కంపెనీల ఎఫ్‌డిఐ పెరగడం అవి ప్రపంచ అగ్రగాములుగా ఆవిర్భవిస్తున్నాయనడానికి సూచన. ఇరవై ఏళ్ళక్రితం మన ప్రభుత్వం ప్రారంభించిన సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా అవి విదేశీ బహుళజాతి సంస్థల నుంచి ఎదురైన పోటీకి కునారిల్లిపోలేదు. పైగా ఆ విదేశీ సంస్థలను వాటి స్వదేశాల్లోనే సవాల్ చేయగలుగుతున్నాయి. 1990ల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయమై జరిగిన చర్చలో ఏ పక్షమూ 'విజయం' పొందక పోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.

భారతీయ పారిశ్రామికులు, వ్యాపారవేత్తల్లో ఇప్పుడొక నూతన ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసలాడుతోంది. స్వదేశీ ఆర్థికవేత్తలు వర్తమాన వాస్తవాలకు అనుగుణంగా ఆలోచించడం లేదన్న విషయాన్ని ఇది స్పష్టం చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సమకూరే స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయనేది వారి వాదన. ఎఫ్‌డిఐ లాభాలను విదేశీ కంపెనీలు తమ స్వదేశానికి తరలించడం అనివార్యం కనుక మనం సమస్యల పాలవుతామని స్వదేశీ ఆర్థికవాదులు అన్నారు.

అసలు ప్రభుత్వం ఎఫ్‌డిఐని ఎందుకు అనుమతించింది? దేశీయ కంపెనీలు అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనేలా దేశీయ కంపెనీలను తీర్చిదిద్దేందుకు కాదు (లక్ష్యం ఇదే అయితే ఎఫ్‌డిఐని ఆహ్వానించవచ్చు); అవి తమకవసరమైన రుణాలను దేశీయ ద్రవ్య మార్కెట్‌లో సులువుగా పొందేందుకే ఎఫ్‌డిఐని అనుమతిస్తున్నారు కాబట్టే తాము అభ్యంతరం చెబుతున్నామని స్వదేశీ వాదులు అన్నారు. ఇక విచక్షణారహితంగా ఎఫ్‌డిఐని అనుమతించడం వల్ల మనకు అత్యాధునిక సాంకేతికతలు సమకూరవని వారు వాదించారు. ఏమైనా మన ఆర్థిక వ్యవస్థకు 'అనుకూలంగా' ఉండేలా బహుళజాతి సంస్థల పెట్టుబడులను అనుమతించాలనేది స్వదేశీ ఆర్థికవేత్తల డిమాండ్. ప్రభుత్వ మద్దతుతో గాక సొంత శక్తిపై ఆధారపడి అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనే స్తోమతను దేశీయ కంపెనీలు సాధించుకోవడమే లక్ష్యంగా ఉండాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కాక మన పారిశ్రామిక, వ్యాపార సామర్థ్యాలను పెంపొందిచుకోవడమే లక్ష్యంగా ఉండాలని స్వదేశీ ఆర్థిక వేత్తలు వాదించారు.

స్వదేశీ ఆర్థిక వేత్తల ఆక్షేపణ మూలంగా మన ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడులకు తెరిచే ప్రక్రియ మందగించింది. బీమారంగంలో విదేశీ పెట్టుబడులను 25 శాతానికే పరిమితం చేయడమే ఇందుకొక ఉదాహరణ. ఇలా జరిగడం మన ఆర్థిక వ్యవస్థకు మేలుచేసిందా, హాని చేసిందా అనేది చెప్పడం కష్టం. శీఘ్రగతిన పూర్తిస్థాయిలో విదేశీ పెట్టుబడులను అనుమతించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? మన వ్యాపార సంస్థలు కుప్పకూలిపోయివుండేవన్న అభిప్రాయం ఒకటి గట్టిగా ఉంది. ఏమైనా ఇటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం లభించడం కష్టం.

వాటిని తర్కించడం వల్ల పెద్దగా ఉపయుక్తత కూడా ఏమీ ఉండదు. అదలా ఉంచితే మన కంపెనీలు విదేశీ బహుళజాతి సంస్థల పోటీని సమర్థంగా ఎదుర్కోవడమే కాదు వాటిని సవాల్ చేస్తున్నాయి. ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏమిటంటే ఇతర వర్ధమాన దేశాలకు నాయకత్వాన్ని అందించడం. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో మనం పాశ్చాత్య బహుళజాతి సంస్థల మార్గంలో నడవకూడదు. పాశ్చాత్య కంపెనీలు 1960ల్లో ఆఫ్రికాలో, 1970, 80ల్లో లాటిన్ అమెరికాలో, 1990ల్లో తూర్పు ఆసియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నాయో మరి చెప్పనవసరం లేదు. విదేశీ పెట్టుబడులను అడ్డు అదుపూ లేకుండా అనుమతించడం వల్ల ఆఫ్రికా, లాటిన్ అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో ని దేశీయ కంపెనీలు బహుళజాతి సంస్థల పోటీని ఎదుర్కొలేకపోయాయి. అంతేకాదు గట్టి పోటీనివ్వాలనే సంకల్పాన్నే కోల్పోయాయి.

మరి మన దేశం కొత్త బహుజాతి కంపెనీల సంస్కృతిని సృష్టించగలదా? వర్ధమానదేశాల్లో పెట్టుబడులు పెట్టి, ఆర్జించిన లాభాలను స్వదేశాలకు తరలించడమే పాశ్చాత్య బహుళజాతి కంపెనీల లక్ష్యంగా ఉంది. దీనివల్ల తమకు ఆతిథ్యమిచ్చిన దేశాలు ఎన్ని విధాలా నష్టపోయినా అవేమీ పట్టించుకోవడం లేదు. వర్థమానదేశాల అభివృద్ధికి పాశ్చాత్య కంపెనీలు చేస్తున్న దోహదం చాలా చాలా స్వల్పం. నిజానికి చేస్తున్న మేలు కంటే హానే ఎక్కువ. విదేశాల్లో పెట్టుబడులు పెడుతోన్న భారతీయ కంపెనీలకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి-పాశ్చాత్య కంపెనీల విధానాలనే అనుసరించడం. తద్వారా తాము ఆర్జించిన లాభాలను స్వదేశానికి తరలించి, ఆతిథేయ దేశ సమస్యలను నిర్లక్ష్యం చేయడం. రెండోది- తాము పెట్టుబడులుపెడుతున్న దేశం కూడా ఆర్థికంగా పురోగమించేందుకు దోహదం చేయడం. అంటే అక్కడ ఆర్జించిన లాభాలను పూర్తిగా కానప్పటికీ గణనీయంగా సంబంధిత దేశంలోనే మళ్ళీ మదుపు చేయడం.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

No comments:

Post a Comment