Thursday, December 22, 2011

కాల్ సెంటర్లపై కత్తి

బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవడమంటే ఇదేనేమో! స్వేచ్ఛావాణిజ్యమే పునాదిగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతీకగా అలరారే అమెరికా ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం అంటేనే జడుసుకుంటోంది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టుగా ‘రక్షణాత్మక’ విధానాలలోకి జారిపోతోంది. ‘పొరుగు సేవల’ (బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్-బీపీఓ) పేరుతో అమెరికా ఉద్యోగాలను బయటి దేశాలకు తరలిస్తున్న కంపెనీలపై అధ్యక్షుడు బరాక్ ఒబామా కొంతకాలం క్రితం కస్సు బుస్సులాడడం చూశాం. ‘బెంగళూరు వద్దు, బుఫాలో(కెనడా సరిహద్దులను ఆనుకుని ఉన్న ఒక నగరం)ముద్దు’ అన్నది అప్పుడాయన ఇచ్చిన నినాదం. తాజాగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండూ కలసి ‘యూఎస్ కాల్ సెంటర్ ఉద్యోగులు, వినియోగదారుల రక్షణ చట్టం’ పేరుతో ఒక బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడం బీపీఓ ఉద్యోగాల గురించిన చర్చను మళ్లీ తెరమీదికి తెచ్చింది. ‘రక్షణాత్మక’చర్యగా పేర్కొంటూ మనదేశం సహా అనేక దేశాలు ఈ చర్యను గర్హించాయి.

కాల్ సెంటర్లను విదేశాలకు తరలించే కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్లు కానీ, రుణాలు కానీ ఇవ్వరాదని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. అమెరికా వెలుపల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయదలచుకున్న ఏ కంపెనీ అయినా ఆ విషయాన్ని అమెరికా కార్మికశాఖకు ముందుగా తెలియజేయాలనీ, తెలియజేయని పక్షంలో రోజుకు పదివేల డాలర్లు జరిమానాగా చెల్లించవలసి ఉంటుందనీ బిల్లు స్పష్టంచేస్తోంది. అలాగే, ఈ కంపెనీలు ప్రభుత్వం నుంచి గ్రాంట్లను, రుణాలను పొందే అర్హతను అయిదేళ్లపాటు కోల్పోతాయి. అమెరికన్ కంపెనీలు ‘పొరుగు సేవలు’ అందుకుంటున్న దేశాలలో మనదేశంతోపాటు లాటిన్ అమెరికా దేశాలు, ఐర్లాండ్, ఫిలిప్పీన్స్, కెనడా వగైరాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు చట్టమై అమలులోకి రావడమే జరిగితే ఈ దేశాల ప్రయోజనాలు దెబ్బతినే మాట నిజమే కానీ ఆ నష్టం ఏ ప్రమాణంలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు.

మనదేశంపై దీని ప్రభావం ఏమంత ఉండదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఫిలిప్పీన్స్ తదితర దేశాలు వాయిస్ ఆధారిత కాల్ సెంటర్ సేవల్లో ఉండగా మనదేశం అంతకంటె ఎక్కువ స్థాయి కలిగిన లావాదేవీల సేవలకు మళ్లిందనీ, అదీగాక భారతీయ కంపెనీలు అమెరికా ప్రభుత్వ గ్రాంట్లను, రుణాలను తీసుకోవడంలేదు కనుక ఆందోళన చెందనవసరం లేదనీ అంటున్నారు. మనదేశ బీపీఓ మార్కెట్ విలువ 1400 కోట్ల డాలర్లు కాగా, కాల్ సెంటర్ల వ్యాపారం విలువ 6-7 వందల కోట్ల డాలర్లేనంటున్నారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న స్తబ్ధత వల్ల ఇప్పటికే ఒత్తిడికి లోనవుతున్న మన బీపీఓ మార్కెట్, ఈ చట్టం అమలులోకి వస్తే మరింత కుంగిపోవడం ఖాయమన్న భయాన్ని మరికొందరు వ్యక్తంచేస్తున్నారు. అదలా ఉండగా, ఈ బిల్లు అసలు చట్టం అవుతుందా అన్నది మరికొందరి సందేహం. చట్టసభల ముందుకు వచ్చే అనేక బిల్లులలో చట్టమయ్యేవి కొన్నే. ఈ బిల్లు చట్టరూపం ధరిస్తుందనుకున్నా అందుకు చాలా సమయం పడుతుంది.

కాకపోతే, భారత ఐటీ పారిశ్రామికుల సంఘం నాస్కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ వ్యాఖ్యానించినట్టు ఈ బిల్లు అమెరికా విధాన నిర్ణేతల ఆలోచనా సరళిని వెల్లడిస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో తీసుకున్న ‘రాజకీయ’ చర్యగా కూడా ఈ బిల్లు ప్రతిపాదనను ఆయన అభివర్ణించారు. నిజానికి బీపీఓ కంపెనీలు ఆయా సేవలను ఎన్నింటినో సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయనీ, ఇటువంటి చట్టాలు వాటి ఖర్చును పెంచి ప్రజల తిరస్కృతిని మూటగట్టుకుంటాయనీ ఆయన విమర్శించారు. ఈ బిల్లు అమెరికా పౌరులకు ఏవిధంగా మేలు చేస్తుందన్నది మరో ప్రశ్న. బీపీఓ ద్వారా అమెరికానుంచి బయటికి వెళ్లే ఒక్కొక్క డాలర్‌కు ప్రతిగా మూడేసి డాలర్లు దేశంలోకి వస్తున్నాయని ఒక వివరణ. గత పదేళ్లలో బీపీఓ ద్వారా అమెరికా వినియోగదారుడే ఎంతో లబ్ధి పొందాడు. అవతలివైపునుంచి ఫోన్ కాల్ కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే దుస్థితి తప్పిపోయింది. ఇప్పుడు బీపీఓ సేవలకు కత్తెర వేస్తే అందువల్ల పెరిగే వ్యయభారాన్ని అమెరికా వినియోగదారుడే భరించవలసివస్తుంది. కనుక ఈ బిల్లు చట్టం కావడం అంత తేలికకాదన్న ధీమాను కొన్ని కంపెనీలు వ్యక్తంచేస్తున్నాయి.

మరి స్వదేశంలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చని ఇలాంటి బిల్లును ఎందుకు ప్రతిపాదించినట్టు? అమెరికా విధాన నిర్ణేతల ప్రస్తుత ఆలోచనా సరళిలోనే అందుకు సమాధానం లభిస్తుంది. అమెరికా రక్షణాత్మక విధానాలవైపు మళ్లుతున్నదనడానికి ఇదొక్కటే కాదు, మరెన్నో ఉదాహరణలు. ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకోడానికి చైనా తన కరెన్సీ విలువను కృత్రిమంగా తగ్గించు కోడాన్ని అమెరికా చాలాకాలంగా వ్యతిరేకిస్తోంది. దానిని కట్టడి చేయడం లక్ష్యంగా అమెరికన్ సెనేట్ ఒక బిల్లును కూడా ఆమోదించింది. 1930ల నాటి మహా మాంద్యంలో అనుసరించిన రక్షణాత్మక విధానాలను అమెరికా అనుసరిస్తున్న దంటూ చైనాతోపాటు అనేక దేశాలు ఈ చర్యను ఖండించాయి. రక్షణాత్మక మనస్తత్వం అమెరికన్ పౌరుల్లోనే క్రమంగా బలపడుతోంది. ఉద్యోగాలు తరలి పోతాయన్న ఆరోపణతో చివరికి ఆయా దేశాలతో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఇటువంటి జనమనోభావాలను సొమ్ముచేసుకునే ఆలోచనలో కాల్ సెంటర్ బిల్లు భాగమైనా ఆశ్చర్యంలేదు. అమెరికా ఈనాడు స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలంగా గొంతెత్తలేని స్థితిలో ఉంది. దోహా రౌండ్ స్వేచ్ఛా వాణిజ్య చర్చలలో స్తబ్ధత నెలకొనడానికి అది కూడా ఒక కారణం. కాల్ సెంటర్ బిల్లుకు ఆగ్రహించాలో, దాని వెనుకనున్న రక్షణాత్మక వైఖరికి జాలిపడాలో ముందు ముందు మరింత స్పష్టపడుతుంది.

____________________________________________

ఆచార వ్యవహారాలు ఎందుకు?

ఆచార వ్యవహారాలు శాంతి/ ప్రశాంతత కోసమా? లేక జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడడానికా? శాస్త్రపరంగా, సంపూర్ణ అవగాహనతో ఆచారాలను నిర్వహిస్తే అవి మనకి తప్పక మేలు చేస్తాయి. కానీ ఈ ఆచారాలన్నీ కూడా మన బాగు కోసం ఏంచేయాలో మనకి తెలియనప్పుడు చేసేవే. (పూర్వం) సాధారణంగా మనుషులు ఒక అజ్ఞానావస్తలో ఉన్నప్పుడు చేసినవే ఈ ఆచారాలు.

సమాజంలో నివసించే మనుషుల బుద్ధి పరిపూర్ణంగా పరిపక్వం చెందితే ఇక ఈ ఆచారాలెందుకు? ఇది ఒక ప్రాచీన సాంకేతిక విజ్ఞానం. ఇది ఇప్పుడు కాలావశేషం అయిపోయింది. అంటే ఇక పనికిరాదన్నమాట. ఆధునిక యుగంలో ఈ ఆచారాలన్నీ ఎలా వెర్రి తలలెత్తాయంటే కేవలం మనశ్శాంతి కోసం మనుషులు పదివేల మందిని పోగుచేసి ఒక యాగమో, హోమమో చేస్తారు. మనశ్శాంతి కావాలంటే ఇంత ప్రయాసపడే అవసరం లేదు. మనతో మనం కాసేపు గడిపి చిన్న చిన్న పనులు చేస్తే చాలు. ఇరవై నాలుగు గంటల్లో కొద్ది క్షణాలు మీతో మీరు గడపండి. కొంత సాధన చేయండి. ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటారు. అంతేకానీ దీనికోసం మనిషి పదివేల రూపాయలు ఖర్చుపెట్టే అవసరం లేదు.

ఆ మధ్య గుజరాత్‌లో భూకంపం వచ్చినపుడు లక్షమందికి పైగా మరణించారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను అడిగేవారు. సద్గురు దేవుడికి మనుషులపై కోపం వచ్చిందా? ఆగ్రహాన్ని ఇలా వ్యక్తపరిచాడా? అని, ఇది అర్థంలేని సిద్ధాంతం. భూకంపం అంటే భూదేవి కాస్త ఒళ్లు విరుచుకుంది, అంతే. దానికి ఇన్ని అర్థాలను ఎందుకు ఆపాదించాలి? భారతదేశంలో జనాభా సంఖ్య విపరీతంగా ఉంది కాబట్టి ఏ కొద్దిపాటి ప్రమాదమైనా లక్షమంది మరణిస్తారు. ప్రపంచమంతటా భూకంపాలు రోజూ వస్తూనే ఉంటాయి.

ఎక్కడో ఏదో నిర్మానుష్యమైన ఎడారిలో వస్తే ఎవరూ మరణించరు కదా? అదొక సమస్య కాదు. కొద్దిపాటి ప్రకంపనలు కాలిఫోర్నియా రోజు అనుభవిస్తుంది. అయినా ఏమీ కాదే? (అక్కడే కాదు అభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన జపాన్ లాంటి దేశంలో రోజూ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. ఇటీవల కాలంలో సునామీ వలన సంభవించిన 8.9 రిక్టర్ స్కేల్ భారీ భూంకంపం గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. దానికి ముందే రాసిని వ్యాసం ఇది) అయినా ఎవ్వరూ మరణించరు ఎందుకంటే భవన నిర్మాణంలో వారికి సరైన సాంకేతిక అవగాహన, అటువంటి ప్రదేశాలలో నివసిస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివేకం వారిలో మెండుగా ఉన్నాయి. కానీ భారతీయులం అటువంటి ఏమీ చేయము. పైకి చూస్తూ బతికేస్తాము, అన్నిటికీ ఆ భగవంతుడున్నాడని అంటాము. ఈ దేశం ఇంకా భగవంతుడి చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోకి తీసుకుంటేనే ఈ గందరగోళం తగ్గుతుంది.

ఈ సంఘటన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో భూకంపం రాకుండా కోస్తా ఆంధ్రలో ఎవరో ఒక యాగం చేశారని విన్నాను. లక్షమందికి పైగా ఈ యాగానికి హాజరయ్యారని తెలిసింది. ఈ యాగం ఇక్కడెందుకు చేస్తున్నాడని అడిగాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సమస్య భూకంపం కాదు, తుపాన్లు, ఏటా ఈ తుపాన్లు పంటల్ని బలి తీసుకుంటున్నాయి. అటువంటి తుపానులను ఎవరైనా యాగాలతో ఆపగలిగితే వారికి మోకరిల్లుతాను. భూకంపాల బెడద పెద్దగా లేని ఆంధ్రప్రదేశ్‌లో ఈ యాగాలు చేసే అవసరం ఉందా?

ఆ మధ్య తమిళనాడులో పోస్టర్లు చూశాను. 'మీరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా తక్షణం నా దగ్గరకి రండి' అని. పాతికవేలతో ఆచారవ్యవహారాలూ నిర్వహిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయట. అందరి సమస్యలు పరిష్కారమవుతాయట. మీవి తప్పించి, ఆర్థిక సమస్యలను తీర్చే సామర్ధ్యం ఉంటే భారత ఖండాన్ని గట్టెకించమనండి చాలు. అనవసరమైన కార్యకలపాలతో ఇప్పటికి చాలా సమయం, శక్తీ వృథా చేశాము. మన దేశానికున్న అతి పెద్ద సమస్య ఇది. అవసరమైనది తప్ప మరేదైనా చేయడానికి మనం సిద్ధం. ఇదే మన సమస్య. ఇది చాలా ప్రమాదం సుమా. ప్రమాదమంటే ఎక్కడో ఏదో బాంబు విస్పోటమో కాదు. సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తూ ఉంటే అది ప్రమాదమే కదా?

50 శాతానికి పైగా ప్రజానీకం "అన్నమో రామచంద్రా!'' అంటోంది. ఒక సగటు భారతీయుడి శుష్కించిన శరీరం చూస్తే తగిన పోషణ లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రమాదమే కదా? 30 కోట్ల పైగా జనాభా రోజు కూలీ రూ.100 లోపే. ఇంతకంటే భారీ విపత్తు మరొకటి ఉందా? ఒక బాంబు విస్ఫోటంలోనో భూకంపంలోనో కొన్ని వేల మంది మరణిస్తారు. నిజమే ఇది అత్యంత శోచనీయం. ఇంతమంది జనాలను పేదరికం పట్టి పీడిస్తుంటే నిస్సహాయంగా చూస్తూ కూర్చుంటామా? తప్పకుండాఏదో ఒకటి చేసి తీరాలి. కానీ ఏదైనా పెద్ద బాధ్యత మన భుజాలపై వేసుకునే ముందు మనని మనం బలపరచుకోవాలి. ఎంత బలంగా ఉండాలంటే బయట పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీరు కుప్ప కూలిపోకూడదు.

చెక్కు చెదరకూడదు. అందుకే ఇలాంటి బలశాలులు కావాలంటే మిమ్మల్ని మీరు కొంత శ్రమింప చేసుకోవాలి. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవాలి. స్థైర్యపరచుకోవాలి. లేకపోతే ఈ లోకం మిమ్మల్ని కబళించి వేస్తుంది.

No comments:

Post a Comment