Thursday, October 13, 2011


పోరాట ప్రతిరూపం చే గువేరా
ఎక్కడో పుట్టి...ఎక్కడో పెరిగి ఇక్కడికొచ్చి ప్రాణాలొదిలారా...అంటూ మనదేశంలో నక్సల్బరీ అమరుల గురించి పాడుకుంటాం. ఆ పాటకు జీవం పోస్తే అది చే గువేరా రూపం అవుతుంది. అర్జెంటీనాలో జన్మించిన చే గువేరా క్యూబాలో కమ్యూనిస్టు విప్లవానికి నేతృత్వం వహించి, విజయం సాధించి, దక్షిణ అమెరికాలోని బొలీవియాలో విప్లవం సాధించేందుకు ప్రయత్నిస్తూ అమరుడయ్యాడు. విప్లవకారులకు యావత్‌ ప్రపంచమూ మాతృదేశమేనన్నది ఆయన భావన. అకో్టబర్‌ 9న చే గువేరా వర్ధంతిని పురస్కరించుకొని ఆయన అమరత్వం పై సూర్య ‘ఆదివారం’ ప్రత్యేక కథనం.
(జననం: జూన్‌ 14,1928-మరణం: అక్టోబర్ 9,1967)

poster_cheguevarప్రజా ఉద్యమాలను పోలీసు, మిలిటరీ బలగాలు ఎల్లకాలం అణిచివేయలేవు. అలా అణచివేయడమే సాధ్యమైతే రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం నేటికీ అలానే ఉండేది. ఒక పోరాటం నిజమైన దైతే, ప్రజల్లో నుంచి వచ్చినదైతే వందల ఏళ్ళ అనంతరమైనా అది తప్పక విజయం సాధిస్తుంది. ఈ అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాడు చే గువేరా. ఆయన అనుసరించిన గెరిల్లా యుద్ధవ్యూహాలు పోరాటాల చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. తదనంతర కాలంలో ఎంతో మంది ఉద్యమకారులు ఆయన వ్యూహాలను అనుసరించారు. అనుసరిస్తున్నారు.

చే గువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా డి లా సెర్నా. ఇతడు దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదం లోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు.ఫీడెల్‌ కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వంలో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడుగా చలామణీ అయ్యాడు. ఇతడు 1961 నుండి 1965 వరకు పరిశ్రమల మంత్రిగా పనిచేసి క్యూబా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను చాలావరకు నిర్దేశించాడు.

SculptureCheGuevaraCubaఇతడు అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్‌ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953 లో బ్యూనస్‌ ఎయిర్స్‌ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. హింసాత్మక విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు.1954 లో గౌటెమాల దేశంలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం పతనం కావడంతో మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని హింసాత్మక విప్లవ దృక్పథం మరింత బలపడింది.

మెక్సికో లో ఫీడెల్‌ కాస్ట్రో నాయకత్వం లో అచటికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను ’చే’ గా వ్యవహ రితమయ్యాడు. గువేరాఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్‌ విప్లవకారు లందరూ అతన్ని ’చే’ అని పిలువనారంభించారు. అలా ఆ పేరు స్థిర పడిపోయింది.

chesఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు గువేరా పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్‌గా పని చేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే గువేరా క్యూబా సామ్యవాద దేశంగా మారటానికి దోహదపడ్డాడు.

గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనలలో వర్థమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు. పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టిన గువేరా 1965 లో క్యూబాలో తన అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమ య్యాడు.కొద్దిమంది అనుచరు లతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంత కాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగు బాటుకు ప్రయత్నించి విఫలు డయ్యాడు. 1966 చివరిలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారు లకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలోనే బొలీ వియన్‌ సైన్యం చేత చిక్కి వారిచే అక్టోబర్‌ 9,1967 న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో హతమయ్యాడు. ఆ నాటి నుండి చే గువేరా విప్లవానికి, తిరుగుబాటుకు చిహ్నమై ఎందరికో ఆరాధ్యుడయ్యాడు.

FreddyAlbertoCheక్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తరువాత 1959లో చే నిర్వహించిన బాధ్యతల్లో అతి ముఖ్యమైనది క్యూబా తరఫు రాయబారిగా అనేక దేశాల్లో పర్యటించడం. జులై 1న చే, అతని సహచరులు భారతదేశం చేరారు. ముందుగా ప్రధాని నెహ్రూను కలుసుకున్నారు. జామా మసీదును, గాంధీ సమాధినీ సందర్శించారు. గాంధీ తన చిన్ననాటి ఆరాధ్యనాయకుడని సహచరులతో చెబుతూ ‘లాటిన్‌ అమెరికాలో మాత్రం ఈ అహింసా సిద్ధాంతాలతో లాభం లేదు. మనం మరింత రాటుదేలాలా’ అని వ్యాఖ్యానించాడు చే గువేరా.

నెహ్రూ, ఇందిరాగాంధీలతో బాటు విందుకు హాజరైనప్పుడు చైనాలోని కమ్యూనిస్టు వ్యవస్థ గురించి, మావో సిద్ధాంతాల గురించి వారి అభిప్రాయా లేమిటని చే మరీమరీ అడిగాడు. వాళ్ళ నుంచి సరైన సమాధానం దొరక లేదు. సోషలిస్టునని చెప్పుకునే నెహ్రూ చైనా గురించి మాట్లాడకుండా లౌక్యంగా దాటవేస్తూ వచ్చాడని చే తన డైరీలో రాసుకున్నాడు. భారతదేశం నుంచి బయల్దేరే రోజున ప్రభుత్వం తరఫున తాజ్‌మహల్‌ వెండి ప్రతిమను అతడికి బహుకరించారు. నెహ్రూ వ్యక్తిగతంగా చే భార్య అలైదా కోసం చేనేత చీరను కానుకగా ఇచ్చాడు.

కఠినమైన విప్లవ జీవితంలో మహిళా కామ్రేడ్లు పురుషులతో బాటు భుజం కలిపి పోరాడుతారు. స్రీలుగా వాళ్ళకున్న ప్రత్యేకమైన శక్తులను కూడా ఉద్యమానికి అందిస్తున్నారు. స్ర్తీలు శారీరకంగా బలహీనులే కావచ్చు కానీ, వాళ్ళ పోరాట చైతన్యం మగవాళ్ళకేమీ తీసిపోదు. మా ప్రయత్నం సఫలం కాకపోవచ్చు గానీ, మా సాహసానికి అవధులు లేవు. ఈ ప్రయత్నంలో ప్రాణాలొడ్డేందుకు కూడా నేను సిద్ధమే.

CheyFidelఒక వీరుడి మరణం వేలకొలది వీరులను ప్రభవింపజేస్తుంది అనే మాట అక్షర సత్యం. మరీ ముఖ్యంగా ప్రజల కోసం పోరాడే యోధుల విషయంలో ఇది నిజం. అందుకు నిదర్శనమే చే గువేరా. క్యూబాలో కమ్యూనిస్టు విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పరచి, అలాంటి ప్రభుత్వాలనే ఇతర దేశాల్లోనూ ఏర్పరిచే క్రమంలో వీరమరణం పొందాడు. ఆయన మరణం మరెందరో పోరాటయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. పలుదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆయన వ్యూహాలు అనుసరణీయంగా మారాయి.

1959 సెప్టెంబర్‌ 30న కొత్తగా రిక్రూట్‌ అయిన పోలీసులను ఉద్దేశించి పోలీస్‌
అకాడమీలో చే గువేరా చేసిన ప్రసంగం: ‘‘ప్రభుత్వ ఉద్యోగులెవరైనా ప్రజాభీష్టానికి అనుకూలంగా నడుచుకోవాలే తప్ప, ప్రజల మీద పెత్తందార్లుగా వ్యవహరించడానికి వీల్లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేక భావాలను వెల్లడించే వారందరినీ ఒకే గాట కట్టడం పొరపాటు. ప్రభుత్వం మీద తీర్పు చెప్పగల అధికారం, స్వేచ్ఛ ప్రజలకు ఉంటాయని పోలీసులు అర్థం చేసుకోవాలి. ’’ 


చే గువేరాను - అతడిని క్యూబా విప్లవానికో, బొలీవియా పోరాటానికో పరిమితం చేసి చూడలేం. అతని కృషి గత విప్లవాల చరిత్రలోని ఓ ఘట్టం కాదు. అది వర్తమానానికీ, భవి ష్యత్తులోకీ ప్రవహించే ఉత్తేజం. ఆ ఉత్తేజమే నేడు ప్రపంచం నలుచెరుగులా జరుగు తున్న ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వ్యక్తిగత - రాజకీయ జీవితాల మధ్యన వైరుధ్యం ఉండరాదని, చావంటే భయం లేకపోవటమూ, జీవితం మీద ప్రేమ లేకపోవటమూ ఒకటి కాదని - విప్లవం ఒక నిరంతర ప్రవాహమే తప్ప ఒక సాయుధ చర్యా, ఒక విజయోత్సవం కావనీ చెప్పినందుకూ అతన్ని మనం అభినందించాలి. ప్రేమించాలి.ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్ని నడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచివేసిన అరుదైన నాయకుడు. జీవితానికి, మరణానికీ సార్థకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి. విప్లవ స్వప్నాలను ప్రపంచీకరించిన భావుకుడు, విప్లవం జీవితమంత విశాలమైందని చాటి చెప్పిన విప్లవకారుడు.

వెంటాడి వేటాడిన సీఐఏ
Che_Guevara_statueబొలీవియాలో చే గువేరా విప్లవోద్యమ యత్నాలు చేయడం అమెరికా నిఘా సంస్థ సీఐఏ కు ఆందోళన కలిగించింది. పురిట్లోనే విప్లవోద్యమాన్ని ఖతం చేసేందు కు అన్ని రకాల ప్రయత్నాలూ చేసింది. చే గువేరాను వెంటాడి వేటాడేందుకు ప్రత్యక్షం గా రంగం లోకి దిగింది. బొలీవియా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిం చింది. అక్టోబర్‌ 8న గువేరా ప్రభుత్వ దళాలకు దొరికిపోయాడు. 9వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు చే గువేరాను అత్యంత దారుణంగా హతమార్చారు. సాక్ష్యం కోసం అన్నట్లుగా ఆ మరుసటి రోజున చే భౌతిక కాయం నుంచి చేతు లను మణికట్టు దాకా తొలగించి భద్రపరి చారు. భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఇవన్నీ సీఐఏ కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. 1995 వరకూ ఖననం ఎక్కడ జరిగిందీ బయటి ప్రపంచానికి వెల్లడి కాలేదు. హత్య జరిగిన 28 ఏళ్ళ తరువాత బొలీవియా సైనికాధికారి ఒకరు తను రిటైర్‌ అయ్యాక వాస్తవాలు వెల్లడించాడు. దీంతో క్యూబా ప్రభుత్వం చే గువేరా, ఆయన సహచరుల అస్తిపంజరాలను క్యూబాకు తరలించి అక్కడ ఖననం చేసిం ది. జ్ఞాపికలు నిర్మించారు.

హతమార్చిన వారంతా హతం
చే గువేరా హత్యకు కారణమైన వారంతా ఆ తరువాతి 15 ఏళ్ళలో ఏదోరకమైన దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది అసహజ మరణాలకు గురయ్యారు. మరికొందరు రోడ్డుప్రమాదాల్లో మరణించారు. కొంతమందిని గెరిల్లాలు హతమార్చారు. ఈ హత్యల వెనుక క్యూబా హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ అందుకు సాక్ష్యాధారాలేవీ లభించలేదు. చే గువేరా తాను చనిపోయి కూడా సీఐఏ ను వణికించాడు. చే ను దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు సీఐఏ పలు విధాలుగా ప్రయత్నించింది.నకిలీ డైరీలను చలామణిలోకి తెచ్చేందుకూ విఫలయత్నం చేసింది.

నిజమైన విప్లవకారుడు ఎప్పుడూ ఓ అద్భుతమైన ప్రేమికుడైన ఉంటాడని నేను చెప్తే మీకు కాస్త ఆశ్చర్యకరంగానే ఉండొచ్చు. కానీ ప్రేమించే గుణాన్ని కోల్పోయిన వాడు ఎన్నటికీ గొప్ప విప్లవకారుడు కాలేడు.

ముఖ్య ఘట్టాలు
che_guevara_fidel_castro1928 జూన్‌ 14: ఎర్నెస్తో గువెరా లించ్‌, సెలియా డి లా సెరెనాలకు మొదటి సంతా నంగా రుసారియోలో చే గువేరా జననం
1946-1953: బ్యూనస్‌ ఎయిరెస్‌లోని నేషనల్‌ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యాసం
1950: ఆయిల్‌ ట్యాంకర్‌లో సిబ్బందిగా పని చేయడం, ట్రినిడాడ్‌, బ్రిటిష్‌ గుయానా పర్యటన
1951-1952: లాటిన్‌ అమెరికా దేశాల్లో పర్యటన. చీలీ, పెరూ, కొలంబియా, వెనిజులాలలో పర్యటన
1953: వైద్యవిద్య సంపూర్తి
1953-54: లాటిన్‌ అమెరికా దేశాల్లో మరో విడత పర్యటన. బొలీవియా, పెరూ, ఈక్వెడార్‌, కొలంబియా, పనామా, కోస్టారికా, సాల్వడార్‌ దేశాల్లో పర్యటన. గ్వాటెమాలాలో అధ్యక్షుడు అర్బెంజ్‌కు మద్దతు. ఆ ప్రభుత్వం పడిపోయాక మెక్సికోలో నివాసం.
1954-56: మెక్సికోలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీలో చేరిక. ఫిజిషియన్‌గా ప్రాక్టీస్‌.
1955: ఫిదెల్‌ కాస్త్రోతో తొలిసారిగా సమావేశం. రివల్యూషనరీ యూనిట్‌లో చేరిక.
1956 జూన్‌-ఆగస్టు: మెక్సికో సిటీలో చే గువేరా అరెస్టు. డిసెంబర్‌ 2: క్యూబా చేరిక
1956-1959: క్యూబా విముక్తి పోరాటంలో కీలకపాత్ర. రెండు సార్లు గాయాల పాలు.
1957 మే 27-28: యువెరో యుద్ధం.
1958: శాంటా క్లారాపై దాడి ప్రారంభం
1959 జనవరి1: శాంటా క్లారా విముక్తి.
1959 ఫిబ్రవరి 9: క్యూబా పౌరసత్వం
1959: క్యూబా ప్రభుత్వం తరఫున వివిధ దేశాల పర్యటన
అక్టోబర్‌ 7: పారిశ్రామిక విభాగం అధిపతిగా బాధ్యతలు
నవంబర్‌ 26: నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్యూబా డైరెక్టర్‌గా నియామకం
1960: గెరిల్లా వార్‌ ఫేర్‌ పుస్తక ప్రచురణ, వివిధ దేశాల పర్యటన
1961: ఫిబ్రవరి 23న పారిశ్రామిక శాఖ మంత్రిగా నియామకం, రష్యాతో ఒప్పందాలు
1965: విప్లవోద్యమం కోసం క్యూబా నుంచి ఇతర దేశాలకు పయనం
1966: నవంబర్‌ 7న బొలీవియా చేరిక
1967: అక్టోబర్‌ 9న బొలీవియా దళాల చేతిలో హతం

Che2చే గువేరా నిరాడంబరత్వాన్ని అతని సహచరులు ప్రత్యేకంగా గుర్తు చేసుకునే వారు. ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్నా లంచ్‌టైమ్‌లో సాధారణ కార్మికులతో పాటుగా చే కూడా ఓ అల్యూమినియం పళ్ళెం పుచ్చుకొని క్యాంటీన్‌ ముందు క్యూలో నిలబడి తన కోటా భోజనం తెచ్చుకునే వాడు. ఆదివారాల్లో స్వచ్ఛంద శ్రమదానం కార్యక్రమాల్లో పోటీ పడి పని చేసేవాడు. ఇన్‌హేలర్‌ వాడుకునేందుకు కూడా సమయం తీసుకోకుండా బస్తాలు మోసేవాడు. క్యూబా ప్రభుత్వంలో, సమాజంలో తనకెంత ప్రముఖ స్థానం ఏర్పడిందో చే గువెరాకు తెలుసు. తన ఇంత కాలమూ ఏర్పరచుకున్న విలువలను, నిరాడంబరత్వాన్ని ఈ హోదాలు ఆక్రమించ కుండా అడుగడుగునా జాగ్రత్త వహించేవాడ తడు. కనీసావసరాలకు సరిపడే వేతనం తప్ప అదనంగా ఏ సౌకర్యాలకూ అతని జీవితంలో చోటు లేదు. వ్యక్తిగత వ్యవహారాల మీద బ యటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అతని జేబు లో కాఫీ తాగడానికైనా డబ్బులుండేవి కావు.

చైనాకు అనుకూలం...రష్యాకు వ్యతిరేకం
రష్యా ప్రభుత్వం మార్క్సిజం ముసుగులో పెట్టుబడిదారీ విధానాలను అనుసరిస్తోందని చే విమర్శించే వాడు. చే గువేరా రష్యాకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. అదే సమయంలో చే చైనాను అభిమానించాడు. మార్క్సిస్టులుగా ఉండడమంటే రష్యాకు కార్బన్‌ కాపీల్లా తయారవడం కాదని, ఆయా ప్రాంతాల ప్రత్యేక సమస్యలకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించుకోవాలని చే వాదించాడు.

ఫిదెల్‌ కాస్ట్రోతో వివాదాలు...క్యూబా నుంచి బయటకు
cehgroచే, ఫిదెల్‌లు వ్యక్తిగతంగా ఎంత సన్నిహితమైనప్పటికీ, రాజకీయంగా వివాదాలు, అసహనాలు తప్పలేదు. క్యూబా అనుసరించాల్సిన అంతర్జాతీయ విధానం దేశభద్రతకు, అవసరాలకు లోబడి ఉండాలన్నది ఫిదెల్‌ వాదన. చే గువేరా మాత్రం ఇందుకు సమ్మతించలేదు. ప్రస్తుతం క్యూబాలో తన విధుల్ని మరెవరైనా నిర్వహించగలరని, తాను ఇతర దేశాల్లో జరుగుతున్న సాయుధ పోరాటాల్లో పాల్గొనబోతున్నానని చెప్పాడు. చే నిర్ణయానికి అభ్యంతరం చెప్పాడు ఫిదెల్‌. ప్రస్తుతం లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఉద్యమాలేవీ ఆశాజనకంగా లేవని, విప్లవ పరిస్థితులు పరిపక్వమయ్యేదాకా వేచి చూడడం మంచిదని సలహా ఇచ్చాడు.

అది చే నిర్ణయాన్ని కదిలించలేకపోయింది. విప్లవ పరిస్థితులు వాటికవే పరిపక్వం కావని, ప్రజల సమస్యల ప్రాతిపదికగా ఉద్యమకారులు అందించే చైతన్యమే శక్తివంతమైన ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని గువేరా వాదించాడు. ఆ ప్రకారమే క్యూబా విడనాడి కాంగో తదితర దేశాల్లో విప్లవం తెచ్చేందుకు ప్రయత్నించాడు. కాంగోలో వైఫల్యం ఎదురైంది. అక్కడి పెరూలో విప్లవం సాధిద్దామని బయల్దేరాడు. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. దాంతో బొలీవియా చేరుకొని అక్కడ విప్లవోద్యమానికి కృషి చేస్తూ చే గువేరా ప్రభుత్వ దళాల చేతిలో హతమయ్యాడు.భౌగోళికంగా అమెరికా కేవలం 160 కి.మీ. దూరంలో ఉండే చిన్న దేశమైన క్యూబాలో క్యాపిటలిజానికి బద్దశత్రువైన కమ్యూనిజం రాజ్యాధికారం సాధించడంలో చే గువేరా తెగువ అనితరసాధ్యం. నేటికీ క్యూబన్లపై చే గువేరా ముద్ర బలంగా ఉంది. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో చే పోరాట స్ఫూర్తితో చిన్న చిన్న గ్రూపులుగా యువత సంఘటితమవుతోంది. సోషలిజానికి అచ్చమైన ఆచరణ చే గువేరా జీవితం.
ఆయనకిదే లాల్‌సలామ్‌. 

No comments:

Post a Comment