Thursday, October 13, 2011


ఆత్మ సంతృప్తి

ఆత్మ సంతృప్తి అన్నిటికన్నా గొప్ప సంపద. ఏమీ లేకపోయినా ఆత్మ సంతృప్తి గనక ఉన్నట్లయితే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. మరి ఇది ఎలా లభిస్తుంది ?దీన్ని పొందే మార్గం ఏమిటి? ఇదొక కీలకమైన ప్రశ్న. కాని చాలామంది భౌతిక సంపద సమకూరితే ఆత్మ సంతృప్తి దానంతట అదే లభిస్తుందని భావిస్తారు. దాని కోసం పడరాని పాట్లు పడుతూ సంపద పోగేస్తారు. ఆత్మసంతృప్తి కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆత్మవంచనకు కూడా పాల్పడతారు.

అన్ని విధాలుగా భౌతిక వనరులు సమకూరితే, సుఖమయ జీవితానికి ఎలాంటి అవరోధాలూ ఎదురుకాకపోతే, అంతకు మించిన సంతృప్తి ఇంకేముంటుందన్న భ్రమలో, ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోతారు. చివరికి ఈ భౌతిక సంపద ఏ విధమైనటువంటి ఆత్మసంతృప్తినీ, ప్రశాంతతనూ ప్రసాదించకపోగా, తీవ్రమైన అసంతృప్తినీ, అశాంతినీ, మానసిక సంక్షోభాన్ని మిగుల్చుతుంది.

ఏదో వెలితి? ఎందుకు?
మనం ఒక్కసారి మానవ సమాజంపై దృష్టిసారిస్తే, ఆత్మ సంతృప్తితో, మానసిక ప్రశాంతతతో, హాయిగా జీవితం గడుపుతున్న వారెందరో గమనించవచ్చు. ఏ విషయంలోనూ మానవులకు ఆత్మ సంతృప్తి లేదు. విలాసవంతమైన భవనాల్లో నివసిస్తున్నా, కార్లు, విమానాల్లో విహరిస్తున్నా, లక్షలు, కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మూలుగుతున్నా సంతృప్తి లేదు. ఏదో వెలితి, ఏదో అస్థిరత, ఏదో చంచలత, ఏదో అస్థిమితం.

ఇంకా ఇంకా ఏదో కావాలన్న తపన...ఆశ. దీనివల్ల మనసులో అలజడి మొదలవుతోంది. ఆందోళన జనిస్తోంది. కాబట్టి ఎన్ని భవంతులున్నా, ఎన్ని వాహనాలున్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని వనరులున్నా- ఇవి మాత్రమే ఆత్మసంతృప్తితో కూడిన ఫలవంతమైన జీవితానికి సోపానాలు కావని అర్థమవుతోంది. మరి మానసిక ప్రశాంతతకు, ఆత్మసంతృప్తికి మార్గమేది? లక్షలు, కోట్లు కుమ్మరించినా లభించని మనశ్శాంతి, ఆత్మసంతృప్తి కేవలం దేవుని స్మరణ ద్వారా మాత్రమే లభిస్తుందని పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి.

'దైవస్మరణ' అంటే ఏదో ఒక మూలన వజ్రాసనమో, పద్మాసనమో వేసుకొని దైవనామాన్ని జపిస్తూ కోర్చొవడం మాత్రమే కాదు. మనిషి తనను తాను పూర్తిగా దైవానికి సమర్పించుకొని, జీవితంలోని అన్ని రంగాల్లో దైవాదేశాలకనుగుణంగా నడుచుకోవడం. ఆయన తన గ్రంథం ద్వారా,తన ప్రవక్త ద్వారా చేసిన ఆజ్ఞలు, ఆదేశాలు, హితోపదేశాల వెలుగులో దైనందిన జీవితాన్ని సంస్కరించుకుంటూ, సమాజహితం కోసం పాటుపడటం. ఈ విధంగా దైవాదేశ పాలనలో, ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవితంలో మాత్రమే ఆత్మసంతృప్తి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దైవాదేశాలను కాదని, ప్రవక్త హితోపదేశాలను పట్టించుకోకుండా, సామాజిక బాధ్యతలను విస్మరించి, మనోకాంక్షల దాస్యంలో, భోగవిలాసాల్లో ఎంతగా తేలియాడినా మనశ్శాంతి, ఆత్మసంతృప్తి ఎంతమాత్రం ప్రాప్తం కావు. కనుక పవిత్ర ఖురాన్ ప్రవచించిన "అలాబిజి క్రిల్లాహితత్మయిన్నల్ ఖులూబ్'' (దేవుని స్మరణ ద్వారా మాత్రమేమీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది.) అన్న వాక్యాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే ఆత్మసంతృప్తితో కూడిన ఆనందమయ జీవిత ం మన సొంతమవుతుంది.

No comments:

Post a Comment