Monday, October 24, 2011
నల్లగొండ జిల్లాలో ఎండుతున్న పంటలు

  • ఎస్‌ఎల్‌బిసి నుండి నీటి విడుదలకు చర్యలు - ముఖ్యమంత్రికి సిపిఎం వినతి
నల్లగొండ జిల్లాలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాలమేర పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పంటలను రక్షించేందుకువీలుగా ఎస్‌ఎల్‌బిసి, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆధ్వర్యంలో రైతు సంఘానికి చెందిన పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని వివిధ పంటల దుస్థితిని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు. నాగార్జునసాగర్‌లో చాలినంత నీరున్నప్పటికీ విడుదల చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని సిఎంకు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణం నీటిని విడుదల చేసే విధంగా అధికారులను ఆదేశించాలని సిపిఎం ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. 


********************************************************************************************


సకలం సమాప్తం
తెలంగాణ ఉద్యోగుల సమ్మె విరమణ
నేటి నుంచి విధులకు హాజరు

ఉద్యోగులతో చర్చలు సఫలం
42 రోజుల ఆందోళనకు తెర
సీఎం, డిప్యూటీ, సీఎస్‌లతో భేటీ
9 అంశాలపై ఒప్పందం
నో వర్క్ నో పే యథాతథం
నెల జీవానికి సరిపడా అడ్వాన్సు
తర్వాత విడదల వారీగా రికవరీ
హైకోర్టు తీర్పులకు లోబడే జీవో 177 రద్దుపై నిర్ణయం
ప్రత్యక్ష ప్రమేయం లేని కేసుల రద్దు
రాష్ట్రపతి ఉత్తర్వులపై కమిషన్
ఒప్పందంపై ఇరువర్గాల సంతకాలు
ఇది తాత్కాలిక విరమణే
ఉద్యమం ఆరలేదు: కోదండరాం
తెలంగాణ తెచ్చే సత్తా మాకు లేదు
మేల్కొలపడమే లక్ష్యం: స్వామిగౌడ్
ముగిసింది! సకల జనుల సమ్మె సంపూర్ణంగా ముగిసింది. ఈనెల 15న ఆర్టీసీ సమ్మె విరమణతో మొదలైన 'వికలం'... ప్రభుత్వ ఉద్యోగుల విరమణతో పరిసమాప్తమైంది. గతనెల 13న మొదలైన సమ్మె 42 రోజులపాటు సాగింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా చర్చలే చర్చలు! ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఒకసారి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహతో రెండుసార్లు చర్చించి... చివరగా ముఖ్యమంత్రితో సమావేశమై అక్కడి నుంచి రాజకీయ జేఏసీతో సంప్రదింపులు జరిపి... అర్ధరాత్రి సమయంలో సమ్మె విరమణపై అధికారిక ప్రకటన చేశారు. తొమ్మిది అంశాలపై సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 'సమ్మె తాత్కాలికంగా మాత్రమే ఆగింది. ఉద్యమం ఆగలేదు' అని రాత్రి 11 గంటల సమయంలో జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అలాగే ఉంటుందని, ఎప్పుడు అవసరమతే అప్పుడు తిరిగి సమ్మె చేసేందుకు ఉద్యోగ సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తమకు తెలంగాణ తెచ్చే సత్తాలేదని తొలి నుంచీ చెబుతూనే ఉన్నామని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తట్టి లేపడమే లక్ష్యంగా సమ్మె చేశామని స్వామిగౌడ్ ప్రకటించారు.

హైదరాబాద్, అక్టోబర్ 24: నలభై రెండు రోజుల సకల జనుల సమ్మె ముగిసింది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతూ... కొనసాగుతూ వచ్చిన సమ్మెకు తెర పడింది. తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమించి, సోమవారం నుంచి విధులకు హాజరు కావొచ్చని 'ఆంధ్రజ్యోతి' ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే! ఉద్యోగులతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం సోమవారం సచివాలయం వేదికగా ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది.

తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి(టీఈజేఏసీ) అధ్యక్షుడు స్వామిగౌడ్, ఇతర నేతలు శ్రీనివాస్ గౌడ్, విఠల్ తదితరులతో తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ చర్చలు జరిపారు. ఆ తర్వాత... మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు రంగంలోకి దిగారు. చివరగా... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ వద్ద రెండు విడతలు కీలక చర్చలు జరిగాయి. ఎస్మా, జీవో 177 రద్దు, సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించడం వంటి తొమ్మిది అంశాలపై ఒప్పందానికి వచ్చారు.

రాత్రి 9 గంటల సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయం నుంచి ముఖ్యమంత్రితో చర్చల నిమిత్తం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అప్పటిదాకా జరిగిన సంప్రదింపుల వివరాలను ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మంత్రులు బయటికి వచ్చి... చర్చలు ఫలించాయని, సమ్మె విరమణకు ఉద్యోగులు అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాత స్వామిగౌడ్ తదితరులు మీడియా ముందుకు వచ్చారు. "తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు 42 రోజులు సమ్మెలో పాల్గొన్నాం.

మా ఆకాంక్షలను గుర్తించిన ప్రభుత్వం చర్చలకు పిలిచింది. అన్ని విషయాలపై చర్చించాం'' అని తెలిపారు. తెలంగాణ జేఏసీని సంప్రదించిన తర్వాతే తమ నిర్ణయం చెబుతామని శ్రీనివాస గౌడ్ చెప్పారు. వీరంతా అప్పటికప్పుడు జేఏసీ చైర్మన్ కోదండరాం వద్దకు వెళ్లారు. ఈ భేటీ ముగిసిన తర్వాత... రాత్రి 11 గంటల సమయంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇది తాత్కాలికమేనని, ఎప్పుడు అవసరమైనా సమ్మెలోకి దిగేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తమకు తెలంగాణ తెచ్చే సత్తాలేదని తొలి నుంచీ చెబుతూనే ఉన్నామని... ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తట్టి లేపడమే లక్ష్యంగా సమ్మె చేశామని స్వామిగౌడ్ ప్రకటించారు. సమ్మె కాలానికి సంబంధించి... తమ సెలవులను సరెండర్ చేసి మాత్రమే జీతం చెల్లించాలని కోరామని తెలిపారు. తమకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

చర్చలు ఫలించాయి: మంత్రులు
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు ఫలించాయని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటించారు. సమ్మె విరమించాలన్న ముఖ్యమంత్రి వినతిపై ఉద్యోగులు సానుకూలంగా స్పందించారన్నారు. "మంగళవారం నుంచి విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగులు అంగీకరించారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు'' అని తెలిపారు. ఉద్యోగులు నేరుగా పాల్గొనని కేసులను ఎత్తివేసేందుకు సీఎం అంగీకరించారని ఆనం చెప్పారు. రైల్‌రోకోలు, బస్సుల ధ్వంసం, ధర్నాల కేసులను ఘటనల వారీగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

జీవో 177పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని... కోర్టు పరిధిలోని ఈ అంశంపై అడ్వొకేట్ జనరల్‌తో చర్చిస్తున్నామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న ఆజాద్ ప్రకటన వెనుక సీఎం పాత్ర ఉందని మంత్రి దానం తెలిపారు. తెలంగాణ కేంద్రం పరిధిలోని అంశమని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని, అది మినహా మిగిలిన డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

కొసమెరుపు: సకల జనుల సమ్మె సంపూర్ణ విరమణతో సర్కారుకు ఒకరోజు ముందే 'దీపావళి' వచ్చినట్లయింది. మంగళవారం నుంచి పాలన సాఫీగా జరుగుతుందని అంతా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
*************************************************************************************************************
 

సర్కారులో నంబర్ 2 ఎవరు?
బీజేపీ అగ్ర నేత అద్వానీ
ఇప్పటివరకు యూపీఏ ప్రభుత్వంలో నంబర్ 1 ఎవరన్నదే ప్రశ్న
తాను లేనప్పుడు ప్రభుత్వాన్ని చూసుకోవాలని చిదంబరం, ప్రణబ్‌లను ప్రధాని ఆదేశించారు
దాంతో రెండో ప్రశ్న తలెత్తింది
2జీ స్కామ్ నుంచి చిదంబరాన్ని తప్పించాలనుకుంటున్నారా?

సంబల్‌పూర్(ఒడిశా): తన పరోక్షంలో ప్రభుత్వ వ్యవహారాలను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేదా హోం మంత్రి చిదంబరం పర్యవేక్షించాలంటూ ప్రధాని మన్మోహన్ జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ అగ్రనేత అద్వానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారులో ఇప్పటివరకూ నంబర్ 1 ఎవరన్న ప్రశ్నే ఉండేది. ప్రధాని ఆదేశాలతో నంబర్ 2 ఎవరన్న మరో ప్రశ్న తెరపైకి వచ్చింది’ అని అద్వానీ అన్నారు. జన చేతన యాత్రలో భాగంగా సోమవారమిక్కడ అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభ నాయకుడన్న వాస్తవాన్ని విస్మరించి.. ప్రధాని తన ఆదేశం ద్వారా హోం మంత్రిని, ఆర్థిక మంత్రిని ఒకే గాటన కట్టారని విమర్శించారు. లోక్‌సభకు ఇద్దరు నాయకులు ఉండరన్నారు.

‘యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి ఓ సందేహం ఉంది. సర్కారుకు సంబంధించి ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీల్లో ఎవరు నంబర్ 1 అన్నదే ఆ ప్రశ్న. ఇప్పుడు నంబర్ 2పైనా సందేహం తలెత్తింది. మొదటి ప్రశ్న సమాధానంపై ఎవరికీ పెద్దగా సందేహాలక్కర్లేదు. కానీ ఈ రెండో ప్రశ్న మాత్రం అందరి మెదళ్లనూ తొలుస్తోంది’ అని అద్వానీ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రధాని ఇద్దరు మంత్రుల్ని ఉప ప్రధానులుగా నియమిస్తే నియమించుకోవచ్చు గానీ, ఇలా ఇద్దరు మంత్రుల్ని మాత్రం నంబర్ 2గా ప్రకటించలేరని అన్నారు. 2జీ స్కామ్‌లో చిదంబరం పాత్రపై దర్యాప్తును తప్పించడమే ప్రధాని ఆదేశం వెనక ఉన్న ఉద్దేశమా అని ప్రశ్నించారు. కేబినెట్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రధానే తీసుకుంటారని పేర్కొంటూ మంత్రులకు ఆదేశం పంపారని, అయితే దానర్థం ఆ నిర్ణయాలకు 10 జన్‌పథ్(సోనియా నివాసం) అనుమతి అక్కర్లేదని కాదని అద్వానీ అన్నారు. వచ్చే నెలలో తాను మూడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నానని, ఆ సమయంలో రాజకీయ వ్యవహారల కేబినెట్ కమిటీ భేటీలకు ప్రణబ్, చిదంబరంలలో ఎవరో ఒకరు హాజరవ్వాలని ప్రధాని ఆదివారం ఆదేశించడం విదితమే.

కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష

కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, తద్వారా రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తోందని అద్వానీ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోందని, ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ విషయమై ఇటీవలి జాతీయ అభివృద్ధి మండలి భేటీలో కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కేంద్రాన్ని కడిగిపారేశారని అన్నారు. ఈ పోరాటంలో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలన్నీ ఒక్కటవుతాయన్న ఆశాభావాన్ని అద్వానీ వ్యక్తం చేశారు.

బెంగళూరు యాత్రకు సకల ఏర్పాట్లు

బెంగళూరు: అద్వానీ ఈ నెల 30న బెంగళూరులో చేపట్టనున్న జన చేతన యాత్ర కోసం స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర వివరాలను ప్రజలకు అందించేందుకు సోమవారం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అలాగే, పార్టీ కార్యక్రమాల గురించే తెలిపే ఈ-న్యూస్ లెటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఒక రాజకీయ పార్టీ ఇంటర్నెట్‌లో ఇలాంటి వాటిని ప్రారంభించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

No comments:

Post a Comment