Friday, October 14, 2011





రోకో.. దేఖో!
ప్రతిష్ఠాత్మకంగా ఉద్యమకారులు.. పట్టుదలగా పోలీసులు
తెలంగాణలో అరెస్టుల పర్వం..వెయ్యి మంది అదుపులోకి

జేఏసీ, విద్యార్థి నేతలపై కన్ను.. నేడు ముఖ్యనేతల వంతు?
నిజాం హాస్టల్‌లో తనిఖీలు,.. మండిపడ్డ ఉద్యమ నేతలు
తీవ్రత చూపిస్తామని హెచ్చరిక.. అజ్ఞానంలోకి కీలక నేతలు
డీజీపీ మీద విమర్శలపై పోలీసు అధికారుల సంఘం సీరియస్
మీడియా క్లిప్పింగ్‌ల పరిశీలన..చర్యలకు రంగం సిద్ధం
మూడు రోజులు... అంటే 72 గంటలు! ఇక... ఉద్యమం పట్టాలపైకి! ఆడా, మగా తరలి రావాలని... గొర్రెలు, బర్రెలనూ పట్టాలపైకి తరలించాలని ఉద్యమ నేతల పిలుపు!
పట్టాలపై అడుగు పెడితే ఊరుకోబోమని, తెలంగాణలోని 1600 కిలోమీటర్ల రైలు మార్గంపై నిఘా వేశామని.. గీత దాటితే అరెస్టులు, రిమాండ్లు తప్పవని పోలీసుల హెచ్చరికలు!
'పట్టా ఫైట్'తో ముందస్తు ఉద్రిక్తత తలెత్తింది. ముందస్తు అరెస్టులకూ తెరలేచింది. రోకోను ఉద్యమకారులు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో.. దాన్ని విఫలం చేయాలని పోలీసులూ అంతే పట్టుదలగా వ్యవహరిస్తున్నారు.
(హైదరాబాద్ - ఆన్‌లైన్) తెలంగాణ ఉద్యమం మూడు రోజులపాటు రైలు పట్టాలపైకి ఎక్కనుంది. సకల జనుల సమ్మెలో భాగంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి మూడు రోజులపాటు రైల్‌రోకో జరగనుంది. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసినప్పటికీ... రాజధానిలో కొన్ని ఎంఎంటీఎస్‌తోపాటు సుమారు 20 రైళ్లు మాత్రం తిరిగే అవకాశముంది. వీటిని కూడా తిరగనివ్వకుండా పట్టాలపైకి తరలి రావాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. అయితే... ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే పోలీసులు ఈసారి కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు.

పట్టాలపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను తెప్పించారు. గత రైల్‌రోకోలో చురుకైన పాత్ర పోషించిన, ఈసారీ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశమున్న వారందరిపైనా నిఘా ఉంచారు. కీలక నేతల కదలికలను గమనించడానికి షాడో టీంలను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ముందస్తు అరెస్టులు ముమ్మరం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ హాస్టల్‌లో తనిఖీలు చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ ప్రసాద్‌తోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాఫర్‌తోపాటు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా మహిళా జేఏసీ అధ్యక్షురాలు శకుంతలను గృహ నిర్బంధంలో ఉంచారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఉద్యోగ సంఘం నేత జగపతి రెడ్డితోపాటు పది మందిని అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఒక జాబితాను తయారు చేసుకుని... దాని ప్రకారం ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. శనివారం రాత్రికి సుమారు వందమందిని అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో 200 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.

జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు రఘునందన్ రావు, రామలింగారెడ్డి తదితరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో వందమందిని, ఖమ్మంలో 275, నిజామాబాద్‌లో 37, నల్లగొండ జిల్లాలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. హైదరాబాద్‌లో 20 మందిని పట్టుకున్నారు. ప్రస్తుతం కింది స్థాయి జేఏసీ నేతలు, కార్యకర్తలను మాత్రమే అరెస్టు చేస్తున్న పోలీసులు... ముఖ్య నాయకులను మాత్రం వారు చేరవలసిన ప్రదేశాలకు చేరుకున్నాక తర్వాతే అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించారు.

మరోవైపు... తాము కూడా రైల్‌రోకోలో పాల్గొంటామని టి-కాంగ్రెస్ ఎంపీలు తేల్చి చెప్పారు. ముందస్తు అరెస్టులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తోపాటు ఇతర నేతలు మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని వెంటనే వదిలివేయకపోతే శనివారం ఉద్యమ తీవ్రతను రుచి చూడాల్సి వస్తుందని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. దమ్ముంటే రైల్‌రోకోను అడ్డుకుని చూడాలని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు పోలీసులకు సవాల్ విసిరారు.

ఇక... డీజీపీ దినేశ్ రెడ్డిపై విమర్శలు చేసిన నేతలపైనా పోలీసులు కన్నేశారు. దీనికి సంబంధించి మీడియాకు సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లను పరిశీలిస్తున్నారు. వీరిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. డీజీపీపై విమర్శలను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తాను 'గన్ డౌన్' చేస్తే నేతలెవరూ బయటికి రాలేరని, 'ఆపరేషన్ దుర్యోధన' సీన్ సృష్టిస్తామని హెచ్చరించారు.

మరో వారం స్తబ్ధతే?
ఢిల్లీ: తెలంగాణకు సంబంధించి కేంద్రంలో మరోవారం వరకు స్తబ్ధత నెలకొనే అవకాశాలున్నాయి. 'పరిష్కర్త' పాత్ర పోషిస్తున్న ప్రణబ్ ముఖర్జీ జి-20 దేశాల మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇబ్సా (ఇండో బ్రెజిల్ సౌతాఫ్రికా) శిఖరాగ్ర సమావేశాల కోసం దక్షిణాఫ్రికా వెళ్తున్నారు.

నిజానికి గత సోమవారం కోర్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఢిల్లీలో తెలంగాణపై ఏం జరుగుతున్నదీ అంతుచిక్కడం లేదు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని, అందులో భాగంగా అంతర్గత సమాలోచనలు జరుపుతున్నారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ వారం రోజులుగా తెలంగాణలో ఏం జరుగుతోందో పరిశీలించాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో వచ్చే వారం అప్పటి పరిస్థితులను అనుసరించి కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వైఖరి అధికారికంగా ఖరారు చేసేందుకు వర్కింగ్ కమిటీ సమావేశం, ఆ తర్వాత జాతీయ, ప్రాంతీయ పార్టీలతో అఖిల పక్షం వంటివి కాంగ్రెస్ అజెండాలో ఉన్నాయి.



***********************************************************************************************************

భారీ అరెస్టులు
rail-roco(సూర్య ప్రధాన ప్రతినిధి):అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రైల్‌రోకో శనివారం నుంచి మూడురోజుల పాటు ప్రారంభం కానుంది. సకల జనుల సమ్మెను మరింత ఉధృతం చేసి, సమ్మె సెగ కేంద్రానికి తగిలేందుకు జాక్‌ చేపట్టనున్న రైల్‌రోకోను అటు ప్రభుత్వం, ఇటు జాక్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.


రైల్‌రోకోను విఫలం చేసి, ప్రయాణాలను సాఫీగా కొనసాగించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రభుత్వం-పోలీసుల నిర్బంధాలను అధిగమించి, మూడురోజులూ రైళ్లను నడవకుండా చూడాలన్న వ్యూహంతో తెలంగాణ రాజకీయ జేఏసీ అంతే పట్టుదలతో వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ -జాక్‌ నేతలు, కార్కకర్తలు పట్టాలపైకి రానున్నారు. తాము ఎవరినీ ఖాతరు చేసేదిలేదని వారు ఖరాఖండీగా చెబుతున్నారు. దీనితో అన్ని వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


రైల్‌రోకోను విఫలం చేసేందుకు ప్రభుత్వం-పోలీసుశాఖ ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లచేయకుండా, పట్టాలపై ఆటంకాలు ఏర్పరిస్తే దానిని గమనించి యుద్ధ ప్రాతిపది కన చర్యలకు సిద్ధమవుతోంది. అందుకోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చాపర్‌ (ప్రత్యేక విమానం)ను దిగుమతి చేసుకుంది. వారి సంయుక్త ఆధ్వర్యంలో దాని ద్వారా వీడియోలు తీసి, ఆందోళనకారులను గుర్తించే కార్యక్రమా న్ని శ్రీకారం చుట్టింది.


సాయుధబలగాల ఆధీనంలో రైల్వే స్టేషన్‌లు
కాగా నేటి నుంచి రైల్‌రోకో ప్రారంభం కాబోతూండటం తో తెలంగాణాలోని అన్ని జిల్లాలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్‌లను రైల్వే రక్షకదళాలతో పాటు కేంద్రపారామిలటరీ దళాలు కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముఖ్యం గా హైదరాబాద్‌-సైబరాబాద్‌ పోలీసు కమిషనరే ట్‌ల పరిధిలోని ప్రధాన స్టేషన్‌లతో పాటు నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్‌ల వద్ద కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.


ప్రధానంగా ఆందోళన కారులు పెద్దపెద్దస్టేషన్‌ల వద్దకు కాకుండా మార్గమధ్యంలో ఉన్న చిన్నచిన్న స్టేషన్‌లు, అన్‌మ్యాన్‌డ్‌ రైల్వే క్రాసింగ్‌ల వద్ద హఠాత్తుగా ట్రాక్‌లపైకి వచ్చి రైళ్ళను అడ్డుకునే అవకాశాలు చాలా ఉన్నాయంటూ నిఘావర్గాలనుంచి నివేదిక అందడంతో పోలీసు, రైల్వే అధికారులు కూడా ఆ తరహా ప్రాంతాలపైనే ప్రధాన దృష్టికేంద్రీకరించారు.


ఎస్కార్ట్‌ రైళ్ళు, స్పెషల్‌ స్క్వాడ్‌లు
అదే విధంగా రైళ్ళరాకపోకలకు ముందు ట్రాక్‌లు తనిఖీకోసం, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు ఎస్కార్ట్‌గా ఏర్పాటు చేసిన పైలట్‌ ట్రైన్‌లను శనివారం ఉదయం నుంచీ రంగంలోకి దింపుతున్నారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌,నడికుడి, నల్లగొండ-చిలకలూరిపేట, కాచిగూడా మహబూబ్‌నగర్‌, వంటి ప్రధాన మార్గాలలో ఈ ఎస్కార్ట్‌ రైళ్ళను నడుపుతున్నారు.


ఇంజన్‌తో పాటు మూడు భోగీలు మాత్రమే ఉండే ఈ రైళ్ళలో రైల్వే అధికారులు, టెక్నికల్‌ సిబ్బంది, ట్రాక్‌ సిబ్బందితో పాటు పారామిలటరీ బలగాలు ఉంటాయి. ఎక్కడైనా రైల్వే ట్రాక్‌లపై అడ్డంకులు కనిపిం చినా, లేక షిప్‌పేట్లు తొలగించడం, పట్టాలు తొలగించడం వంటి సంఘటనలు దృష్టికి వచ్చిన వెంటనే ఈ ఎస్కార్ట్‌ ట్రైన్‌లోని సిబ్బంది హుటాహుటిన వాటి కి మరమ్మత్తులు చేస్తారు. ప్రతీ 25 కిలోమీటర్‌లకు ఒక స్పెషల్‌ స్వ్కాడ్‌ ఏర్పాటు చేసి రైల్వే ట్రాక్‌ల తనిఖీల బాధ్యత వారికి అప్పగించారు.


ెస్పెషల్‌ స్క్వాడ్‌ క్లియరెన్స్‌ ఇచ్చాకా..ఎస్కార్ట్‌ ట్రైన్‌ బయలుదేరుతుంది...అందులోని అధికారులు క్లియ రెన్స్‌ ఇచ్చాకా ఆ మార్గంలో ఇతర రైళ్ళను అనుమతిస్తారు. ముందు జాగ్రత్త చర్యగా శనివారం నుంచి మంగళవారం వరకూ తెలంగాణా ప్రాంతాలనుంచి సరకు రవాణా రైళ్ళను నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలనుంచి బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు రవాణా చేస్తున్న రైళ్ళకు మాత్రం పూర్తిస్థాయి బందోబస్తుతో గమ్యం చేర్చాలని నిర్ణ యించారు. వీటితో పాటుగా ప్రతీ మూడు కిలోమీ టర్‌ల కు ఒక బృందం చొప్పున రైల్వే ట్రాక్‌ల వెంబడి సా యుధ పోలీసుల కూంబింగ్‌ టీమ్‌లను కూడా రంగంలోకి దింపారు.


తొలిసారిగా వినియోగంలోకి చాపర్‌ విమానం
ఇదిలా ఉండగా దండకారణ్యప్రాంతంలో ఎఓబిలో యాంటీనక్సల్‌ ఆపరేషన్‌ల కోసం ప్రత్యేకంగా సమకూర్చుకున్న చాపర్‌ విమానాన్ని తొలిసారిగా రైల్‌రోకో ఆందోళనకోసం వినియోగించబోతున్నారు. భూమికి అతిసమీపంగా ఎగురుతూ నేలపై వ్యక్తుల కదలికలతో పాటు, వాహనాల కదలికలను కూడా అతి స్పష్టంగా వీడియోతీసే అత్యంతఅధునాతన సాంకేతిక పరికరాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీంతో రైల్‌రోకో సందర్భంగా పట్టాల వెంబడి మాటువేసి ఉన్న ఆందోళన కారులను గుర్తించేందుకు, ఎక్కడైనా పట్టాలు తొలగించడం, వాటిపై పెద్దపెద్ద అడ్డంకులు సృష్టించడం వంటివాటిని కూడా దీని సహాయంతోనే గుర్తించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ రాజమండ్రి విమానాశ్రయం బేస్‌ పాయింట్‌లో ఉన్న ఈ విమానాన్ని తాజా నిర్ణయంతో బేగంపేట విమానాశ్రయానికి రప్పించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌-హన్మకొండ రైల్‌ మార్గంలో దీనితో ట్రైల్‌ నిర్వహించారు.


డిజిపి ప్రత్యేక సమీక్ష:పట్టాలపైకి వస్తే అరెస్ట్‌ చేయండి
ఇదిలా ఉండగా రైల్‌రోకోను నిరోధించేందుకుతీసుకున్న భద్రతా చర్యలను డిజిపి దినేష్‌ రెడ్డి శుక్రవారం నాడు మరోమారు ప్రత్యేకంగా సమీక్షించారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల ఎస్‌పిలు, రేంజ్‌ ఐజిలు, డిఐజిలతో పాటు ప్రధాన రైల్వేస్టేషన్‌ల భద్రతా అధికారులతో కూడా డిజిపి సమీక్ష నిర్వహించారు.


శనివారం ఉదయం నుంచీ ఆందోళనలు జరిగే ప్రాంతాలలో రైల్వే పోలీసులతో పాటు భద్రత కోసం ఏర్పాటు చేసిన కేంద్రబలగాలు కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆందోళనకారులెవ్వరైనా పట్టాలపైకి, లేదా స్టేషన్‌లలోకి రావడానికి ప్రయత్నించిన పక్షంలో అక్కడికక్కడే అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతీరైల్వే స్టేషన్‌కూ స్థానిక లాఅండ్‌ ఆర్డర్‌ విభాగానికి చెందిన ఎస్‌ఐని ఇన ్‌ఛార్జిగా నియమించాలని ఆదేశించారు. స్థానిక పోలీసులైతే ఆందోళనకారులు, వాటికి నాయకత్వం వహించే నాయ కులను సులభంగా గుర్తుపడతారన్న భావనతో ఈ ఏర్పా టు చేశారు.


అదే విధంగా రైల్‌రోకో సందర్భంగా అవాంఛ నీయఘటనలకు పాల్పడతారన్న అనుమానం కలిగిన నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్‌ చేయడం శనివారం రాత్రి నుంచే ప్రారంభమైంది. ఎట్టిపరిస్థితు ల్లోనూ రైల్‌రోకో జరుగనీయంఅని పోలీసులు స్పష్టం చేస్తుంటే...ఎన్ని బలగాలను రంగంలోకి దింపినా, ఎన్నిరకాలుగా అణచివేయాలని చూసినా రైల్‌ రోకో నిర్వహించి తీరుతామని రాజకీయజెఎసి నేతలు తెగేసి చెపుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ మూడురోజులూ ఏమిజరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.






వర్ణ చిత్రాలు
కన్నీటి తడిలో
ఘూర్ణిల్లుతున్న దేహం
ఇప్పుడిప్పుడే
విత్తనమవుతోంది
మట్టివాసనల ధైర్యాన్ని పులుముకుని
బలంగా మొలకెత్తుతోంది
జీవన్మరణ సమస్యలు
శాఖలు శాఖలుగా విస్తరిస్తున్న క్షణాన
మానవీయ రేఖల్ని అడ్డంగా చీలుస్తూ
ఓ విత్తనం పెత్తనం చేస్తుంది
రెండు ధ్రువాల్ని కలిపే
అంతస్సూత్రం కోసం
అన్వేషణ కొనసాగుతోంది
నిరంతరం కదలాడే దేహాల కోసం
మనసు గడియారం చేసుకొని
క్షణ క్షణం తిరగాల్సిందే నేమో!
జీవితం ముక్కలు ముక్కలుగా రాలుతున్నప్పుడు
గుండె చెమ్మగిల్లుతున్నప్పుడు
నిప్పులా కణ కణ మండే ఆక్రోశం
కొత్త బతుకును పచ్చగా తొడుక్కుంటుంది
కొత్త ఆయుధాన్ని వెచ్చగా ధరిస్తుంది
దళాలు దళాలుగా మొలకెత్తుతున్న ఆవేశం
అజ్ఞానంగా ఒరిగి పోయినప్పుడు
జ్ఞానం తులసీ దళాలై చిగురిస్తాయి
సంస్కృతి ఆనవాళ్ళు నిండుగా పూజిస్తాయి
చైతన్యాన్ని గర్భీకరించుకున్న మెదళ్ళన్నీ
ముసలితనాన్ని తొడుక్కున్నా
నిత్య యవ్వన శిఖరమై వర్ధిల్లుతాయి
నిశ్చలంగా నిర్భయంగా
నగ్నత్వాన్ని పూస్తున్న మనసులపై
శత కోటి చూపులు
బాకులౌతాయి
నైరూప్య చిత్రంలా
దోబూచులాడుతున్న
నిజాలన్నీ మనో ఫలకంపై
వర్ణచిత్రాలవుతాయి! 

No comments:

Post a Comment