Thursday, September 22, 2011


సంస్కరణల బాటలో న్యాయ ప్రస్థానం



                          -వేదాంతం సీతారామావధాని

పౌరుల ప్రాథమికమైన హక్కులకు కాపుకాచే మహత్తర బాధ్యతను అప్పగిస్తూ న్యాయ వ్యవస్థను పదునైన స్వతంత్ర ప్రతిపత్తిగల యంత్రాంగంగా రాజ్యాంగ నిర్మాతలు తీర్చిదిద్దటం జరిగింది. జుడిషియరీ కూడా ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూనే ఉంది. బీహార్ లీగల్ సొసైటీ కేసు (1986)లో పేదలూ, నిమ్న వర్గాల హక్కులను వారికి దక్కేట్లు చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, ఇటీవలి కాలంలో ప్రజల సమస్యలపట్ల స్పందించడమే కాక, ప్రభుత్వ యంత్రాంగాలను తమ బాధ్యతలపట్ల జాగరూకత వహించే రీతిలో తీర్పులను వెలువరించడం సమాజం గమనిస్తూనే ఉంది. అయితే కేసుల విచారణలో జరిగే జాప్యానికి కోర్టులే కారణమని జరుగుతున్న నిందాప్రచారానికి సూటిగా జవాబు జుడిషియరీ నుండి రాకపోవటంతో ప్రజలు కూడా న్యాయవ్యవస్థే జాప్యానికి కారణమని భావిస్తున్నారు. కొత్త చట్టాలు అమలులోకి రావడంతో కేసులు గుట్టలుగా పేరుకుపోవడం, అందుకు తగ్గట్టుగా కోర్టులూ, జడ్జీల సంఖ్య పెరగకపోవటం, విచారణలో తీవ్ర జాప్యం అనివార్యమయింది. ఈ పరిస్థితులలోనే జుడిషియరీలో సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత గురించి మేధావి వర్గాల నుంచి ప్రభుత్వానికి సూచనలు అందాయి.
న్యాయ వ్యవస్థకు జవజీవాలనూ, పుష్టినీ సమకూర్చే సంస్కరణల అవసరాన్ని నిజానికి 1950 నాటి 14వ లాకమిషన్ నివేదికలోనే ప్రస్తావించటం జరిగినా, ప్రభుత్వం స్పందించలేదు సరికదా, స్థూల జాతీయ ఆదాయంలో 0.2 శాతం కంటె తక్కువగానే జుడిషియరీకి ప్రభుత్వం వెచ్చించటం జరిగింది. బ్రిటన్‌లో ఇది 4.3 శాతం కావటం గమనించాలి. కోర్టులపై పెట్టే ఖర్చు అనుత్పాదక వ్యయంగా ప్రభుత్వాలు భావించటం మరో కారణం. అయితే సత్వర న్యాయం పౌరులకందించడం ప్రభుత్వపు రాజ్యాంగ బాధ్యత అనీ, నిధుల లేమి సాకుతో ప్రభుత్వాలు ఈ బాధ్యత నుండి తప్పుకోజాలవనీ సుప్రీంకోర్టు హుస్సేనీ రాకాటూన్ కేసులో ప్రకటించింది.
గత ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలోని హైకోర్టులలో 33,36,256 సివిలు కేసులూ, 8,81,647 క్రిమినల్ కేసులూ, క్రింది కోర్టులలో 78,56,456 సివిలు, 2,00,96,614 క్రిమినల్ కేసులూ విచారణ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక కొత్త కేసులేవీ దాఖలు కాకుంటే ఈ పెండింగు కేసులకు మోక్షమిచ్చేందుకు కనీసం పదేళ్ళు పడుతుంది. మరి కొత్తకేసుల పరిష్కారమెప్పుడు జరుగుతుందో ఊహించలేము. ఈ పరిస్థితికి కారణాలు శోధించడం కంటె పరిష్కార మార్గాలు యోచించటం అత్యవసరం కదా? ఈ కోణం నుంచే ప్రస్తుతం అమలు అవుతున్న సంస్కరణల గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. గతంలోని లాకమిషను రిపోర్టులూ, పార్లమెంటరీ కమిటీల సిఫార్సులూ సగానికి పైగా అమలుకు నోచుకోలేదని 2001లో పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. జుడిషియరీకి జరిగిన నిధుల కేటాయింపు అతిస్వల్పం. 9వ ఆర్థిక సంఘం నిధులలో జుడిషియరీకి 0.071 శాతం మాత్రమే కేటాయింపు కాగా, 10వ ఆర్థిక ప్రణాళిక కాలంలో ఇది 0.078 శాతం. రాష్ట్రాలు తమ పరిధిలోని కోర్టులకు ఇచ్చిన నిధులు మొత్తం వార్షిక ప్రణాళికా ఖర్చులో ఒక శాతం కంటే దిగువన ఉన్నాయని, మొదటి నేషనల్ జుడిషియల్ పే కమిషను పేర్కొనడం, జుడిషియరీపై గత ప్రభుత్వాలు చూపిన సవతి ప్రేమకు నిదర్శనం కాదా? అయితే సుప్రీంకోర్టు చొరవతోనే, న్యాయ వ్యవస్థలో కూడా పురోగమన దిశగా సంస్కరణలు గత పదేళ్ళుగా చోటు చేసుకుంటున్నాయి. ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ కేసులో ఉన్నత న్యాయపాలిక ఆదేశాల ప్రకారం నియమించబడిన జస్టిస్ జగన్నాధషెట్టి కమిషను నివేదిక రీత్యా, దేశంలోని న్యాయాధికారుల జీతభత్యాలు గుణాత్మక సవరింపుకు నోచుకోవడం, కోర్టులలో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం ఈ సంస్కరణల దిశగా వేసిన తొలి అడుగు. 1987నాటి లాకమిషను రిపోర్టు మేరకు మిలియన్ జనాభాకు 10 మంది జడ్జీలు ఉన్న నిష్పత్తిని అయిదు రెట్లకు పెంచడం, లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం వంటి ప్రత్యామ్నాయ విధానాల ద్వారా కేసుల భారం తగ్గించటం, పేదలకు న్యాయ సహాయం అందించడం, తద్వారా పౌరులహక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడం, జడ్జీల జవాబుదారీ తనం, నైపుణ్యత, పారదర్శకతలను పెంపొందించడం వంటి ప్రక్రియల ద్వారా న్యాయ వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నడుం బిగింటం శుభ సూచకం. సంపూర్ణ న్యాయసంస్కరణలంటే కేవలం జుడిషియరీకే పరిమితం కారాదనీ, శాసన, న్యాయశాస్త్ర అధ్యయన రంగాల్లోనూ మార్పులు రావాలనీ, రష్యన్ ఫెడరేషన్ రాజ్యాంగ న్యాయస్థానం అధ్యక్షుడు వెలరీజోర్కిన్ చేసిన ప్రవచనాన్ని ప్రస్తావించక తప్పదు. అందుకోసమై ప్రభుత్వం జుడిషియరీకి అనుబంధంగా ఉన్న అన్ని రంగాలలోనూ వృద్ధి కారక మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. సంస్కరణలపట్ల తన చిత్తశుద్ధిని నిరూపించేందుకు ప్రభుత్వం చేసిన మొదటిపని - కోర్టుల కంప్యూటరీకరణ. మార్చి 2012 నాటికి దేశంలోని 12,000 కోర్టులనూ, రెండోదశలో 2,014 మార్చి నాటికి మిగిలిన 2,249 కోర్టులనూ కంప్యూటరీకరించి, అన్ని జిల్లాస్థాయి కోర్టులనూ, హైకోర్టు, సుప్రీంకోర్టులతో అనుసంధానించాలని ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల సమాచార మార్పిడి వేగవంతం కావటం, తీర్పు పాఠం కక్షిదారునికి సత్వరం లభించడం జరిగి, జాప్యం, ఖర్చు తగ్గుతాయి. కేంద్రీకృత పౌర సేవా విభాగం, జాతీయ ఎరియర్స్ గ్రిడ్‌లను కూడా ఈ ప్రాజెక్టుకు అనుసంధానిస్తారు. ఇప్పటికే దేశంలోని న్యాయమూర్తులకు 13,365 లాప్‌టాప్, లేజర్ ప్రింటర్లనూ అందజేసి, వాటి వినియోగానికై 12,600 జడ్జీలకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందట. 13వ ఆర్థిక సంఘం 5000 కోట్లను కోర్టుల అభివృద్ధికి కేటాయించి మొదటి విడత వెయ్యి కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో వచ్చే అయిదేళ్ళలో ఉదయం, సాయంత్రం పనిచేసే ప్రత్యేక కోర్టులూ, మధ్యవర్తిత్వ కేంద్రాలు, లోక్ అదాలత్‌లూ ఏర్పర్చటమే కాక, వాటి సామర్థ్యం పెంచడం, అదనపు వసతులు, వనరులు కల్పించడం జరుగుతుంది. 2008 నాటి గ్రామ న్యాయాలాయాల చట్టం క్రింద గ్రామస్థాయి న్యాయాలయాల ఏర్పాటుకు 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా ఇప్పటికే మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్, మహారాష్ట్రాలలో ఈ కోర్టులు పని ప్రారంభించాయి. దాఖలైన ఆరు మాసాల్లో వ్యాజాన్ని పరిష్కరించగలగడం ఈ కోర్టుల ప్రత్యేకత. 11వ ఆర్థిక సంఘ నిధులతో ఏర్పటయిన 1,562 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మార్చి 2011 నాటికి తమకు బదిలీ అయిన 28.49 లక్షల కేసులకు గాను 21.83 లక్షల కేసులను పరిష్కరించగలగటం, సంస్కరణ ఫలితాలు సమాజానికి అందుతున్నాయనేందుకు ఋజువు. కేంద్ర ప్రభుత్వం జాతీయ వివాదపరిష్కార విధానాన్ని ప్రకటించి, తాను వివాద భాగస్వామిగా ఉన్న కేసుల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోటానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. రాష్ట్రాలు కూడా ఇదే విధానం ప్రకటిస్తే పెండింగు కేసుల సంఖ్య గణనీయంగా పడిపోగలదు.‘అందరికీ అందుబాటులో న్యాయం’ నినాదాలతో పేద, అణగారిన వర్గాల ప్రజలకు న్యాయ సహాయం అందించేందుకు 13వ ఆర్థిక సంఘం విడుదల చేసిన 200 కోట్ల నిధులను న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఖర్చు చేస్తారు. విచారణ నెదుర్కొంటున్న ఖైదీలను సరళతర విధానంపై విడుదల చేసే కార్యక్రమం గత ఏడాది విజయవంతమైంది. జనవరి 2010, మే 2011 మధ్య కాలంలో అండర్ ట్రయల్ ఖైదీలు 5,62,379 మంది దేశవ్యాప్తంగా విడుదలవగా, 77,940 మందిఅభియోగ విముక్తి పొందినారు. 68,744 మందికి రిమాండు కాలాన్ని శిక్షగా సరిపుచ్చడం జరిగింది. ఇదే కాలంలో 7,09,081 క్రిమినల్ కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి. 23 రాష్ట్రాలలో 211 కుటుంబ న్యాయస్థానాలను ఏర్పర్చడంవల్ల వైవాహిక కుటుంబ వివాదాల్ని సత్వరం పరిష్కరించే వీలు కలిగింది.
దేశంలోని 933 న్యాయ కళాశాలల్లో జాతీయ ఇ-లైబ్రరీని ఈ ఆగస్టు 15 నుండీ వినియోగంలోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. రాజీవ్ గాంధీ న్యాయవాద శిక్షణా పథకం క్రింద ప్రతి రాష్ట్రం నుండీ 10 మంది న్యాయవాదులను ఎంపిక చేసి వారికి నల్సార్ వంటి జాతీయ స్థాయి న్యాయ విద్యాలయాల్లో రెండు మాసాల వృత్తి నైపుణ్య శిక్షణ నివ్వడం ద్వారా క్రింది స్థాయి నుండి న్యాయ సంస్కరణలు తేవాలని ప్రభుత్వ సంకల్పం. రాష్ట్ర, జాతీయ స్థాయి జుడిషియల్ ఎకాడమీల ద్వారా కొత్తగా ఎంపికైన న్యాయమూర్తులకు సమగ్ర శిక్షణ నివ్వడం, సర్వీసులో ఉన్న న్యాయ మూర్తులకు తరచూ పునశ్చరణ కార్యక్రమాలను నిర్వహించడం ఇప్పటికే జరుగుతోంది. ఈ దిశలో ఆంధ్ర ప్రదేశ్ జుడిషియల్ అకాడమీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం, శిక్షణా కార్యక్రమాల ఏర్పాటులో ముందంజలో ఉండటం గమనించాల్సిన విషయం. 2012 చివరకు కేసుల పెండింగ్ కాలాన్ని 15 ఏళ్ళ నుండి 3 ఏళ్ళ వరకు తగ్గించాలనే బృహత్తర కార్యక్రమం ఇప్పడు అమలు జరుగుతోంది. లాకమిషను 230వ నివేదిక ఇందుకు స్ఫూర్తి. రాజ్యాంగం నిర్దేశించిన విలువల సాధనకు నిరంతర సంస్కరణలు అవసరం. న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న ఈ సంస్కరణలు ప్రజలకూ, కోర్టులకూ మధ్య దూరాన్ని తగ్గిస్తాయ.

No comments:

Post a Comment