Monday, September 26, 2011


దళిత శకానికి నాంది పలికిన జాషువా
- ఎండ్లూరి సుధాకర్

చంద్రమండలం మీద నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాదమూనడం ఎంత అద్భుతమో తెలుగు సాహిత్యంలోకి జాషువా కాలు మోపడం కూడా అంతే అద్భుతం. జాషువా ప్రవేశంతో తెలుగు కవిత్వం ఒక వెలుగు మలుపు తిరిగింది.

20వ శతాబ్దాపు పూర్వార్థ భాగంలో ఒకవైపు భావకవులుంటే మరో వైపున సామాజిక భావ విప్లవాన్ని కోరుతూ నిలబడ్డ కవి జాషువా ఒక్కడే. భావకవుల ఉధృతిని తట్టుకుని నిలబడింది కూడా జాషువాయే. ఆ మాటకొస్తే చాలామంది భావకవుల్ని ౌఠ్ఛిట టజ్చిఛీౌఠీ చేయగలిగిన కవి జాషువా. బహుశా అందుకేనేమో 'వైతాళికులు'లో జాషువా కనిపించడు.

అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన కవి జాషువా. సమాజంలో కులీన వర్గాలు అట్టడుగు వర్గం పట్ల చూపే నిరాదరణకు బాల్యం నుంచి కూడా ఎదురు నిలిచి ప్రశ్నిస్తూ ముందుకు వచ్చిన కవి. తెలుగు సాహిత్యానికి సంబంధించి మొట్టమొదటి కవి. రాజాస్థానాల్లో సుఖంగా బ్రతికినంత కాలం బ్రతికి ఆ స్థానాల మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డ శతక కవుల కన్నా, మనుషుల్ని, సమాజాన్ని అసహించుకుని భక్తి మార్గంలోకి మళ్లీ సమాజంపై తిరుగుబాటు జెండా ఎత్తిన భక్త కవుల కన్నా జాషువా చేసిన తిరుగుబాటు, ప్రకటించిన నిరసన, ప్రతిఘటన ఉదాత్తమైనటువంటింది. న్యాయ సమ్మతమైనటువంటిది.

కులాహంకారం వల్ల ఎదుర్కొన్న తిరస్కారాలు, ఎదుర్కొన్న అవమానాలు ఆయన ప్రత్యేకంగా, విలక్షణంగా ప్రతిస్పందించడానికి కారణమైనా, సమాజానికి ఎదురు తిరిగి నిలవడంలో జాషువాది వ్యక్తిగత ద్వేషం కాదు. సమాజాన్ని విమర్శించడంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు. సామాజిక అసమానతల మీద నిరంతర పోరాటం జాషువాది. సంప్రదాయాల మీదా, మూఢాచారాల మీద హేతు రహితమైన భావాల మీద జాషువా నిర్భయంగా తిరగబడ్డాడు. రచనకుండే ప్రాథమిక ప్రయోజనాన్ని సాధించడంలో కూడా సఫలతను పొందింది జాషువాయే.

జాషువా పుట్టినప్పటి కాలం పాత కొత్తల మేలు కలయిక. పాత కులం మాత్రం పోలేదు. ఒక సాహిత్య సభలో ఆయనను చూసి... 'సభలోని కెట్టు జొరబడె
నభాగ్యు డీ నిమ్నజుం డటంచు దమలో
గుభ గుభలాడి తటాలున
సభికులు పదిమంది లేచి చనిరుద్ధురులై'
అకస్మాత్తుగా ఏర్పడిన ఈ వాతావరణంలోంచి జాషువా అవమాన భారంతో బయటపడ్డాడు.

గుండె తుకతుకా ఉడికిపోతున్నది. ఆ రాత్రి కంటి మీద కునుకు రాలేదు. 'కుకూలాగ్నింబలెన్ మానస గ్లానింగూర్చు పరాభవంబు సకలాంగ వ్యాప్తమై రోమ రోమానన్ వెచ్చని క్రొంబొగల్ గురియ.' జాషువా ఈ బాధలోంచి తేరుకోవడానికి కవిత్రయం రాసిన మహాభారత గ్రంథం చదవటం మొదలుపెట్టాడు. కుమారాస్త్ర ఘట్టం తీసి, కర్ణుడితో తనని అన్వయం చేసుకున్నాడు. కర్ణుడిలో తనను, తనలో కర్ణుడిని చూసుకున్నాడు. ఈ పరిణామ ఫలితమే తరువాత 'భారత వీరుడు' పేరుతో కర్ణుడిపై అద్భుతమైన పద్యాలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.

'నలత్రాచుంబలె వర్ణ భేదములు నాల్కల్ కాచు కాలంబునన్ వలచెన్ నన్ను కవిత్వ వాణి' అని చెప్పుకున్నాడు. వర్ణ భేదాలు ముమ్మరంగా ఉన్న రోజులలో కవిగా ఎదుగుతున్నప్పుడు సవర్ణ హిందువుల నిరాదరణకు గురికావల్సి వచ్చింది. 'పృథివీ సురులు దక్క నితర జాతులు, కైత లల్లరాదు నేర మంద్రు బుధులు' అని హెచ్చరించారు. అంతేకాదు- 'ధరణీ సురునిల్లాలిన్
చెఱ బట్టిన వారి కైతలల్లిన వానిన్
నరికిన పాపము లేదని
పురాణ యుగధర్మ సూత్రముల్ ఘోషించున్!'

అని మనుధర్మ శాస్త్రాల సూత్రాలు వల్లిస్తూ బెదిరించారు. జాషువా ఈ అననుకూల వాతావరణాన్ని ఛేదించుకున్నాడే తప్ప బెదిరిపోయి క్రుంగిపోలేదు.

'చక్కని కవితకు కులమే యెక్కువ తక్కువలు నిర్ణయించినచో, నింకెక్కడి ధర్మము తల్లీ?' అని ఈ భారత మాతను బాల్యంలోనే ప్రశ్నించాడు. మొదటి నుంచి కులం విషయంలో జాషువా తిరుగుబాటు తత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. బాల్యం నుంచి ఏ కుల భేదం వలన తన ఆత్మాభిమానం దెబ్బతింటూ వచ్చిందో, ఏ కుల భేదం తన వ్యక్తిత్వాన్ని బాకున క్రుమ్మినదో ఆ కుల భేదాన్ని తన వ్యక్తిగత ప్రవర్తనతో, కవితా కుఠారంతో ఎదుర్కొన నిశ్చయించాడు. 'గబ్బిలం' కావ్యం వెయ్యేళ్ల తెలుగు కవిత్వంలో విప్లవాత్మకమైన వస్తువు. ఒక గగుర్పాటు, ఒక ధిక్కారం. ఒక దళితుడిని కావ్య నాయకుడిగా, గబ్బిలాన్ని కావ్యాత్మ ప్రతీకగా ప్రవేశ పెట్టినాడు. తెలుగు సాహిత్యంలోనే కాదు, మొత్తం భారతీయ సాహిత్యంలోనే దళిత శకానికి నాంది పలికాడు.

ఆనాడు జాషువా విసిరిన నిప్పుకణిక ఇవాళ దళిత వాదపు కొలిమిగా మారింది. 'నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై' దేశాన్ని దహించేస్తాయని హెచ్చరించాడు. దేశ భక్తితో ఒళ్ళు మరచి దేశమాతను ఎంత ఘనంగా కీర్తిస్తాడో ఆవేదనలోంచి పుట్టిన ఆవేశంలో భరతమాతకు సైతం వాతలు పెట్టడానికి కూడా వెనుకాడడు.

గబ్బిలం అత్యంత శక్తివంతమైన కావ్యం. కసిలో వ్యంగ్యం, అణచివేతలో ఆగ్రహం, కన్నీటిలో వక్రోక్తి కవిత్వంగా గబ్బిలమై రూపుదాల్చింది. 'నాల్గు పడగల హైందవ నాగరాజు' బుసలకు దూరంగా ఎగిరిపడి, తరతరాల నుంచి తనను అణచివేసిన దురహంకారపు వ్యవస్థపై ఎదురు తిరిగి మూలాల్ని తవ్వి పోసిన ఆక్రోశమే గబ్బిలం. 'గబ్బిలం' కావ్యంతోనే తెలుగు కవిత్వంలోకి దళిత భావజాలం బలంగా పాదమూనింది. గబ్బిలం ఇవాళ దిక్సూచి. ఈనాటి దళిత చైతన్యాన్ని ఆనాడే దర్శించిన ద్రష్ట జాషువా- ఏ జాతికెంత వచ్చునొ
రాజత్వంబంత నాకు రావచ్చు గదా
నా జాతి యెత్తు కేతన
రాజంబున నీదుమూర్తి వ్రాయింతుఁజెలీ?
ఒకవేళ నిజంగా దళితులకు రాజ్యాధికారమే సంక్రమిస్తే గబ్బిలాన్ని దళిత కేతన చిహ్నంగా ఎగురవేస్తే జాషువా గబ్బిలానికి నిజమైన నిండు గౌరవం దక్కుతుంది. గబ్బిలం కావ్యాశయం నెరవేరుతుంది.

- ఎండ్లూరి సుధాకర్

No comments:

Post a Comment